ఆ భా 1 3 001 to 1 3 030

వికీసోర్స్ నుండి

ఆదిపర్వము - తృతీయాశ్వాసము

1_3_1 కందము

శ్రీమచ్చళుక్యవంశశి

ఖామణి మనుమార్గరాజకంఠీరవ ధై

ర్యామరధరణీధర ధర

ణీమండన ధర్మనిరత నిత్యాభ్యుదయా.

(రాజా!)


1_3_2 వచనము

అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు జనమేజయుం డుప సంహృతసర్పసత్త్రుం డయి యథావిధి సంపూర్ణదక్షిణల ఋత్విజులను సదస్యులనుం బూజించి దీనానాథజనంబులకుఁ గోరినధనంబు లిచ్చి యనేక పురాణపుణ్యకథాశ్రవణకృతసమాధానుండై విద్వజ్జనగోష్ఠి నుండి యొక్కనాఁడు.

(ఉగ్రశ్రవసుడు మునులకు ఇలా చెప్పాడు: జనమేజయుడు సర్పయాగాన్ని ముగించి ఒకరోజు సభలో.)


1_3_3 మత్తేభము

పరమబ్రహ్మనిధిం బరాశరసుతున్ బ్రహ్మర్షిముఖ్యున్ దయా

పరుఁ గౌరవ్యపితామహున్ జనహితప్రారంభుఁ గృష్ణాజినాం

బరు నీలాంబుదవర్ణ దేహు ననురూపప్రాంశు నుద్యద్దివా

కరరుక్పింగజటాకలాపు గతరాగద్వేషు నిర్మత్సరున్.

(గొప్పవాడైన.)


1_3_4 వచనము

వైశంపాయన ప్రభృతి శిష్యవర్గంబులతో ననేకమునిగణపరివృతుం డయి కనకమణిమయోచ్చాసనంబుననున్న వ్యాసభట్టారకు నతిభక్తి నర్ఘ్యపాద్యాదివిధులం బూజించి వినయవినమితశిరస్కుండై నమస్కరించి జనమేజయుం డిట్లనియె.

(వ్యాసుడితో ఇలా అన్నాడు.)


1_3_5 సీసము

ప్రీతితో మీరును భీష్మాదికురువృద్ధ

రాజులు నుండి భూరాజ్యవిభవ

మెల్ల విభాగించి యిచ్చినం దమతమ

వృత్తుల నుండక వీఁగి పాండు

ధృతరాష్ట్రనందనుల్ ధృతి చెడి తా రేమి

కారణంబునఁ బ్రజాక్షయము గాఁగ

భారతయుద్ధ మపారపరాక్రముల్

చేసిరి మీపంపు సేయ రైరి


ఆటవెలది

యెఱిఁగి యెఱిఁగి వారి నేల వారింపర

యిట్టి గోత్రకలహ మేల పుట్టె

దీని కలతెఱంగు దెలియంగ నానతి

యిండు నాకు సన్మునీంద్రవంద్య.

(పెద్దవారైన మీ అందరి మాటలూ కాదని కౌరవపాండవులు భారతయుద్ధాన్ని ఎందుకు చేశారు? మీరంతా ఆ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారు?)


1_3_6 వచనము

అని యిట్లు పాండవధార్తరాష్ట్రవిభేదనకథాశ్రవణకుతూహలపరుండయి యడిగిన జనమేజయునకుం గరుణించి కృష్ణద్వైపాయనుండు వైశంపాయనమునిం జూచి శ్రీమహాభారతకథాఖ్యానం బాద్యంతం బితనికి సవిస్తరంబుగాఁ జెప్పుమని పంచి చనిన.

(వ్యాసుడు వైశంపాయనుడిని చూసి, "జనమేజయుడికి మహాభారతకథ చెప్పు", అని ఆజ్ఞాపించి వెళ్లాడు.)


-:భారత మహిమము:-


1_3_7 కందము

జనమేజయుండు విద్వ

జ్జన పరివృతుఁడై సమస్తజనపాలసభా

జనయోగ్యుని వైశంపా

యనమునిఁ బూజించె వినతుఁడై వినువేడ్కన్.

(జనమేజయుడు వైశంపాయనుడిని పూజించాడు.)


1_3_8 వచనము

ఆ వైశంపాయనుండును నఖిలభువనవంద్యుం డయిన కృష్ణద్వైపాయనమునీంద్రునకు నమస్కారంబు సేసి విద్వజ్జనంబుల యనుగ్రహంబు వడసి.

(వైశంపాయనుడు వ్యాసుడికి నమస్కరించి.)


1_3_9 సీసము

కమనీయధర్మార్థకామమోక్షములకు

నత్యంతసాధనం బయినదాని

వేడ్కతోఁ దవిలి తన్ వినుచున్నవారల

కభిమతశుభకరం బయినదాని

రాజుల కఖిలభూరాజ్యాభివృద్ధిని

త్యాభ్యుదయప్రదం బయినదాని

వాఙ్మనఃకాయప్రవర్తితానేకజ

న్మాఘనిబర్హణం బయినదాని


ఆటవెలది

సత్యవాక్ప్రబంధశతసహస్రశ్లోక

సంఖ్య మయినదాని సర్వలోక

పూజ్య మయినదాని బుధనుతవ్యాసమ

హామునిప్రణీత మయినదాని.

(గొప్పదీ, లక్షపద్యాలు గలదీ, వ్యాసుడు రచించినదీ.)


1_3_10 చంపకమాల

వినుతపరాక్రముల్ ధృతివివేకులు సత్యసమన్వితుల్ యశో

ధనులు కృతజ్ఞు లుత్తములు ధర్మపరుల్ శరణాగతానుకం

పను లనఁగాఁ బ్రసిద్ధు లగు భారతవీరుల సద్గుణానుకీ

ర్తనముల నొప్పుదాని విదితం బగుదాని సభాంతరంబులన్.

(గొప్ప భారతవీరులను స్తుతించేదీ.)


1_3_11 శార్దూలము

ఆయుష్యం బితిహాసవస్తుసముదాయం బైహికాముష్మిక

శ్రేయఃప్రాప్తినిమిత్త ముత్తమసభాసేవ్యంబు లోకాగమ

న్యాయైకాంతగృహంబునాఁ బరఁగి నానావేదవేదాంతవి

ద్యాయుక్తం బగుదానిఁ జెప్పఁ దొడఁగెం దద్భారతాఖ్యానమున్.

(అయిన భారతకథను చెప్పటం ప్రారంభించాడు.)


-:పాండవధార్తరాష్ట్రుల భేదకారణసంగ్రహము:-


1_3_12 సీసము

పాండుకుమారులు పాండుభూపతిపరో

క్షంబున హస్తిపురంబునందు

ధృతరాష్ట్రునొద్దఁ దత్సుతులతో నొక్కటఁ

బెరుఁగుచు భూసురవరులవలన

వేదంబులును ధనుర్వేదాదివిద్యలుఁ

గఱచుచుఁ గడలేనియెఱుకఁ దనరు

చున్నఁ దద్విపులగుణోన్నతి సైఁపక

దుర్యోధనుండు దుష్కార్య మెత్తి.


ఆటవెలది

దుర్ణయమున శకునికర్ణదుశ్శాసనుల్

గఱపఁ బాండవులకు నఱయ చేయఁ

గడఁగెఁ బాండవులును గడుధార్మికులు గానఁ

బొరయ రైరి వారిదురితవిధుల.

(పాండురాజు చనిపోయిన తర్వాత పాండవులు హస్తినాపురంలో కౌరవులతోపాటు పెరుగుతూ, విద్యలు నేర్చుకుంటూండేవారు. వారిని చూసి దుర్యోధనుడు సహించలేక శకుని, కర్ణుడు, దుశ్శాసనులతో కలిసి పాండవులకు కీడు చేయాలని ప్రయత్నించినా పాండవులు ధార్మికులవటం వల్ల వారికి హాని కలిగేది కాదు.)


1_3_13 వచనము

అది యెట్లనిన నొక్కనాఁడు జలక్రీడాపరిశ్రమవిచేష్టితుండయి ప్రమాణకోటిస్థలంబున నిద్రితుండైన భీమసేనునతిఘనలతాపాశబద్ధుం జేసి గంగమడువునం ద్రోచిన నాతం డనంతసత్త్వుండు గావునఁ దద్బంధంబు లెల్లఁ దెగ నీల్గి మీఁదికి నెగసె మఱియొక్కనాఁ డతివ్యాయామఖేదంబున సుప్తుండైన వానిసర్వాంగంబులయందుఁ గృష్ణసర్పంబులం బట్టి కఱపించిన నాతండు వజ్రమయదేహుండు గావునఁ దద్విషదంష్ట్రలు నాఁటవయ్యె మఱియు నొక్కనాఁడు భోజన సమయంబున వానికి విషంబు వెట్టిన నతండు దివ్యపురుషుండు గావునఁ దద్విషం బన్నంబుతోడన జీర్ణం బయ్యె మఱియు వారల కెల్ల నపాయంబు సేయసమకట్టి.

(అదెలాగంటే, జలక్రీడలాడి, అలసి, ప్రమాణకోటి అనే చోట నిద్రపోతున్న భీముడిని తీగలతో బంధించి గంగానది మడుగులో తోసినా అతడు అనంతబలవంతుడు కాబట్టి నిద్రలేచి, ఒళ్లు విరుచుకొని బయటికి వచ్చాడు. మరొక రోజు, వ్యాయమం చేసి నిద్రపోతున్న భీముడిని నల్లత్రాచులతో కాటువేయించగా అతడు వజ్రదేహుడు కాబట్టి ఆ పాముల కోరలు అతడి శరీరంలో దిగబడలేదు. భీముడికి భోజనంలో విషం కలిపిపెట్టినా అది అతనికి అన్నంతోపాటే జీర్ణమైపోయింది.అయినా, కౌరవులు వారికి హాని చేయాలని.)


1_3_14 సీసము

వదలక కురుపతి వారణావతమున

లక్కయిల్ గావించి యక్కజముగ

నందఱఁ జొన్పి యం దనలంబు దరికొల్పఁ

బనిచినఁ బాండునందను లెఱింగి

విదురోపదిష్టభూవివరంబునం దప

క్రాంతు లై బ్రదికి నిశ్చింతు లయిరి

ధర్మువు నుచితంబుఁ దప్పనివారల

సదమలాచారుల నుదిత సత్య


ఆటవెలది

రతుల నఖిలలోకహితమహారంభుల

భూరిగుణుల నిర్జితారివర్గు

లై వెలుంగువారి దైవంబ రక్షించు

దురితవిధుల నెపుడుఁ బొరయకుండ.

(దుర్యోధనుడు వారణావతంలో ఒక లక్క ఇల్లు కట్టించి, అందులో పాండవులు ప్రవేశించిన తరువాత, దానికి నిప్పంటించమని ఆజ్ఞాపించాడు. అది పాండవులు తెలుసుకొని, విదురుడు చెప్పిన సొరంగం నుండి బయటపడ్డారు. మంచివారిని ఆ దైవమే రక్షిస్తుంది.)


1_3_15 వచనము

ఇట్లు దుర్యోధనుచేయు నపాయంబులవలనం బాయుచుఁ బాండవులు లాక్షాగృహదాహంబువలన నక్షయులై జననీసహితంబుగా వనంబులకుం జనిన నందు భీమసేనుండు హిడింబాసురుం జంపి వాని చెలియలి హిడింబను వివాహంబై యేకచక్రపురంబున కేఁగి యందు బకాసురుం జంపి విప్రులం గాచె మఱి యందఱు విప్రవేషంబున ద్రుపదపురంబునకుం జని యందు ద్రౌపదీస్వయంవరంబున మత్స్యయంత్రం బర్జునుం డశ్రమంబున నురులనేసి సకలరాజలోకంబు నొడిచి ద్రోవదింజేకొనిన దాని నేవురు గురువచనంబున వివాహంబై ద్రుపదుపురంబున నొక్కసంవత్సరం బున్న నెఱింగి ధృతరాష్ట్రుండు వారి రావించి వారల కర్ధరాజ్యంబిచ్చి యింద్రప్రస్థపురంబున నుండం బనిచిన నందుఁ బాండవులు రాజ్యంబు సేయుచున్నంత.

(పాండవులు అలా తప్పించుకొని తల్లితో కూడా అడవులకు వెళ్లారు. అక్కడ భీముడు హిడింబాసురుడిని చంపి, అతడి చెల్లెలైన హిడింబను పెళ్లాడి, ఏకచక్రపురానికి వెళ్లి, బకాసురుడిని చంపాడు. తరువాత పాండవులు విప్రవేషాలలో ద్రుపదపురానికి వెళ్లారు. అక్కడ ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని గ్రహించాడు. తరువాత గురువచనం ప్రకారం పాండవులందరూ ద్రౌపదిని పెళ్లాడి ఒక సంవత్సరం పాటు ద్రుపదపురంలో ఉన్నారు. ఇది ధృతరాష్ట్రుడు తెలుసుకొని వారిని రప్పించి, సగం రాజ్యం ఇచ్చి ఇంద్రప్రస్థంలో ఉండమని ఆజ్ఞాపించాడు. పాండవులు అక్కడ రాజ్యం చేస్తూ ఉండగా.)


1_3_16 కందము

ద్వారవతి కేఁగి యర్జునుఁ

డారంగ సుభద్రఁ బెండ్లి యై వచ్చి మహా

వీరు నభిమన్యుఁ గులవి

స్తారకు సత్పుత్త్రు నతిముదంబునఁ బడసెన్.

(అర్జునుడు ద్వారకకు వెళ్లి, సుభద్రను పెళ్లాడి, అభిమన్యుడనే సుపుత్రుడిని పొందాడు.)


1_3_17 వచనము

మఱియు నగ్నిదేవుచేత దివ్యరథంబును దివ్యాశ్వంబులును గాండీవదేవదత్తంబులును నక్షయబాణతూణీరంబులుం బడసి సురగణంబులతో సురపతి నోర్చి ఖాండవదహనంబున నగ్నిదేవునిం దనిపె మఱి మయువలన సభాప్రాప్తుండై భీమునిచేత జరాసంధుం జంపించి దిగ్విజయంబు సేసి సార్వభౌముండై ధర్మరాజు రాజసూయమహాయజ్ఞంబుఁ గావించె నివి మొదలుగాఁ గల పాండవులగుణసంపదలు చూచి సహింప నోపక దుర్యోధనుండు శకునికైతవంబున మాయాద్యూతంబున ధర్మరాజుం బరాజితుం జేసి పండ్రెండేఁడులు వనవాసంబును నొక్కయేఁడు జనపదంబున నజ్ఞాతవాసంబునుగా సమయంబుసేసి భూమి వెలువరించినం జని పాండవులు వనవాసంబున నున్నంత.

(అగ్నిదేవుడి దగ్గర దివ్యరథాన్ని, గాండీవాన్ని, దేవదత్తమనే శంఖాన్ని, అక్షయతూణీరాన్ని పొంది, దేవేంద్రుడిని ఓడించి, ఖాండవదహనం చేసి, అగ్నిదేవుడిని తృప్తుడిని చేశాడు. భీముడి చేత జరాసంధుడిని చంపించి, మయుడి చేత సభాభవనాన్ని పొంది, ధర్మరాజు సార్వభౌముడై రాజసూయయజ్ఞం చేశాడు. ఇది దుర్యోధనుడు సహించలేక శకుని చేత మాయాజూదంలో ధర్మరాజును ఓడించాడు. పన్నెండేళ్లు వనవాసం, ఒక ఏడు అజ్ఞాతవాసం చేయాలనే నియమం ప్రకారం దేశం నుంచి వారిని వెళ్లగొట్టాడు. వారు అడవిలో ఉండగా.)


1_3_18 చంపకమాల

పరమగురూపదేశమునఁ బార్థుఁడు పార్థివవంశశేఖరుం

డరిది తపంబునన్ భుజబలాతిశయంబున నీశుఁ బన్నగా

భరణుఁ బ్రసన్నుఁ జేసి దయఁ బాశుపతాదిక దివ్యబాణముల్

హరసురరాజదేవనివహంబులచేఁ బడసెం బ్రియంబునన్.

(గురూపదేశం ప్రకారం అర్జునుడు తపస్సుచేసి, శంకరుడి చేత, ఇంద్రుడి చేత పాశుపతం మొదలైన దివ్యాస్త్రాలు పొందాడు.)


1_3_19 అక్కర

వనమునఁ బదియు రెండేఁడు లజ్ఞాతవాస మొక్కేఁడు

జనపదంబున నుండి తపన నయ్యేండ్లు సలిపి సద్వృత్తు

లనఘులు మును వేఁడి కొనక మఱి భారతాజి సేయంగ

మొనసిరి పాండవ కౌరవుల భేదమూల మిట్టిదియ.

(పన్నెండేళ్లు అరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాసం చేసిన తర్వాత కూడా పాండవులకు రాజ్యభాగం లభించకపోవడం వల్ల వారు భారతయుద్ధానికి తలపడ్డారు.)


1_3_20 వచనము

ఇట్టి భరతకులముఖ్యులవంశచరితానుకీర్తనంబునం జేసి యిక్కథ శ్రీమహాభారతంబునాఁ బరఁగె.

(భరతకులముఖ్యుల గురించి చెప్పేది కాబట్టి ఈ కథను శ్రీమహాభారతం అంటారు.)


1_3_21 శార్దూలము

ఆ నారాయణపాండవేయగుణమాహాత్మ్యామలజ్యోత్స్నఁ జి

త్తానందం బొనరించుచున్ జనుల కర్థాంశుప్రకాశంబుతో

మానై సాత్యవతేయధీవనధి జన్మ శ్రీమహాభారతా

ఖ్యానాఖ్యామృతసూతి యొప్పు నిఖిలాఘధ్వాంతవిధ్వంసి యై.

(కృష్ణపాండవేయుల గుణాలు అనే వెన్నెలచేత, పురుషార్థాలనే కిరణాలతో, వ్యాసుడి మేధాసముద్రంలో పుట్టిన చంద్రుడు అనే మహాభారతం పాపాలనే చీకట్లను నశింపజేస్తుంది.)


-:ఉపరిచరవసుమహారాజు వృత్తాంతము:-


1_3_22 వచనము

ఇట్టి శ్రీమహాభారతంబునకుం గర్త యయిన శ్రీవేదవ్యాసునిజన్మంబు సవిస్తరంబుగాఁ జెప్పెద వినుము.

(ఇలాంటి భారతాన్ని రచించిన వ్యాసుడి పుట్టుక గురించి చెపుతాను. వినండి.)


1_3_23 సీసము

వాసవప్రతిముండు వసు వను నాతండు

చేదిభూనాథుండు శిష్టలోక

నుతకీర్తి మృగయావినోదార్థ మడవికిఁ

జని యొక్కమునిజనాశ్రమమునందు

నిర్వేదమున మహానిష్ఠతో సన్న్యస్త

శ్రస్త్రుఁడై తప మొప్పుఁ జలుపుచున్న

నాతనిపాలికి నమరగణంబుతో

నింద్రుండు వచ్చి తా నిట్టు లనియె.


ఆటవెలది

ధరణిఁ బ్రజఁ గరంబు దయతోడ వర్ణధ

ర్మాభిరక్షఁ జేసి యమలచరిత

నేలి రాజ్యవిభవ మది యేల యని తప

శ్చరణ నునికి నీక చనియె ననఘ.

(చేదిదేశానికి రాజైన వసువు ఒకరోజు వేటకు వెళ్లి అక్కడ ఒక మునుల ఆశ్రమాన్ని చూసి, నిర్వేదం చెంది, ఆయుధాలు వదిలి అక్కడే తపస్సు చేయనారంభించాడు. ఒకరోజు ఇంద్రుడు అతని దగ్గరకు వెళ్లి అతడిని మెచ్చుకొని.)


1_3_24 వచనము

నీ వర్ణధర్మప్రతిపాలనంబునకుఁ దపంబునకు మెచ్చితి నీవు నాతోడం జెలిమి సేసి నాయొద్దకు వచ్చుచుం బోవుచు మహీరాజ్యంబు సేయుచునుండు మని వానికి దేవత్వంబును గనకరత్నమయంబైన దివ్యవిమానంబును నెద్దానినేని తాల్చిన నాయుధంబులు దాఁక నోడు నట్టి వాడని వనజంబులు గలిగిన యింద్రమాల యను కమలమాలికయును దుష్టనిగ్రహశిష్టపరిపాలనక్షమంబైన యొక్క వేణుయష్టియు నిచ్చిన నవ్వసువును దద్విమానారూఢుండై యుపరిలోకంబున జరించుటం జేసి యుపరిచరుండు నాఁబరగి యక్కమలమాలికయుఁ దనకుం జిహ్నంబుగా నవ్వేణుయష్టికి మహావిభవంబు సేయుచు మెఱసి యేఁటేఁట నింద్రోత్సవం బను నుత్సవంబు సేయుచు నీశ్వరునకు నింద్రాది దేవతలకు నతిప్రీతి సేసె నదిమొదలుగా రాజు లెల్లం బ్రతిసంవత్సరంబు నింద్రోత్సవంబు సేయుచుండుదురు.

(అతడితో స్నేహం చేసి, అతడికి ఒక దివ్యవిమానాన్ని, మరికొన్ని కానుకలను ఇచ్చాడు. వసువు ఆ విమానాన్ని ఎక్కి పైలోకాలలో తిరగటం వల్ల ఉపరిచరుడు అనే పేరు పొంది, ఏటేటా ఇంద్రోత్సవం జరిపి దేవతలకు సంతోషం కలిగించాడు. అప్పటినుండి రాజులందరూ ప్రతి సంవత్సరం ఇంద్రోత్సవం జరుపుతున్నారు.)


1_3_25 కందము

ఘనముగ నయ్యింద్రోత్సవ

మొనరించు మహీపతులకు నొగి నాయుర్వ

ర్ధనము నగుఁ బెరుఁగు సంతతి

యనవరతము ధరణిఁ బ్రజకు నభివృద్ధి యగున్.

(ఆ ఇంద్రోత్సవాన్ని చేసే రాజులకు, వారి ప్రజలకు మంచి జరుగుతుంది.)


1_3_26 వచనము

అట్టి యింద్రోత్సవంబున నతిప్రీతుం డయిన యింద్రువరంబున నుపరిచరుండు బృహద్రథ మణివాహన సౌబల యదు రాజన్యు లనియెడి కొడుకుల నేవురం బడసి వారలం బెక్కు దేశంబుల కభిషిక్తులం జేసిన నయ్యేవురు వాసవులు వేఱు వేఱ వంశకరు లయి పరఁగి ర ట్లుపరిచరుండు లబ్ధసంతానుండయి రాజర్షి యయి రాజ్యంబు సేయుచు నిజపురసమీపంబునం బాఱిన శుక్తిమతి అను మహానదిం గోలాహలం బను పర్వతంబు గామించి యడ్డంబు వడిన దానిం దన పాదంబునం జేసి తలఁగం ద్రోచిన నన్నదికిఁ బర్వతసమాగమంబున వసుపదుం డను కొడుకును గిరిక యను కూఁతురుం బుట్టిన నయ్యిరువురను శుక్తిమతి దద్దయు భక్తిమతియై గిరినిరోధంబు బాచి యుపకారంబు సేసిన యుపరిచరునకు మెచ్చి కానిక యిచ్చిన నాతండు వసుపదుం దనకు సేనాపతిం జేసికొని గిరికం దనకు ధర్మపత్నిగాఁ జేసికొని యున్నంత నగ్గిరిక ఋతుమతి యయిన దీనికి మృగమాంసంబు దెచ్చిపెట్టు మని తన పితృదేవతలు పంచిన నప్పు డయ్యుపరిచరుండు మృగవధార్థంబు వనంబున కరిగి.

(ఉపరిచరుడి ఇంద్రోత్సవాలకు ఇంద్రుడెంతో సంతోషించాడు. ఇంద్రుడి వరం వల్ల అతడికి అయిదుగురు కుమారులు పుట్టి, అనేక దేశాలకు అధిపతులయ్యారు. అలా ఉపరిచరుడు రాజ్యాన్ని పాలిస్తుండగా, దగ్గరలోని శుక్తిమతి అనే నదిని కోలాహలం అనే పర్వతం కామించి అడ్డగించింది. ఉపరిచరుడు తన కాలితో ఆ పర్వతాన్ని తొలగించాడు. పర్వతసమాగమం చేత ఆ నదికి వసుపదుడనే కుమారుడు, గిరిక అనే కూతురు జన్మించగా శుక్తిమతి వారిని ఉపరిచరుడికి కానుకగా ఇచ్చింది. ఆ రాజు వసుపదుడిని తన సేనాపతిగా, గిరికను తన ధర్మపత్నిగా చేసుకున్నాడు. ఋతుమతి అయిన గిరికకు మృగమాంసం తెమ్మని పితృదేవతలు ఆజ్ఞాపించగా అందుకోసం ఉపరిచరుడు అడవికి వెళ్లాడు.)


1_3_27 సీసము

పలుకులముద్దును గలికిక్రాల్గన్నుల

తెలివును వలుఁదచన్నులబెడంగు

నలఘుకాంచీపదస్థలములయొప్పును

లలితాననేందుమండలము రుచియు

నళినీలకుటిలకుంతలములకాంతియు

నెలజవ్వనంబున విలసనమును

నలసభావంబునఁ బొలుపును మెలుపును

గలుగు నగ్గిరికను దలఁచి తలఁచి


ఆటవెలది

ముదితయందుఁ దనదు హృదయంబు నిలుపుటఁ

జేసి రాగ మడర భాసురముగ

రమణతో వనాంతరమున రేతస్స్యంద

మయ్యె నవనిపతికి నెయ్య మొనర.

(అడవిలో గిరికాలగ్నమనస్కుడైన ఉపరిచరుడికి రేతస్స్యందమయ్యింది.)


1_3_28 వచనము

అయ్యమోఘవీర్యం బొక్కయజీర్ణపర్ణపుటంబున నిమ్ముగా సంగ్రహించి యొక్కడేగయఱుతంగట్టి దీనింగొనిపోయి గిరికకిమ్మని యుపరిచరుండు పనిచిన నదియు నతిత్వరితగతి నా కానం గడచి యాకాశంబునం బఱచునప్పుడు.

(దాన్ని ఒక ఆకుదొప్పలో చేర్చి, ఒక డేగ మెడకు కట్టి, గిరికకు ఇమ్మని ఉపరిచరుడు పంపాడు. ఆ డేగ ఆకాశంలో ఎగురుతున్నప్పుడు.)


1_3_29 కందము

అమిష మని దానిం గొనఁ

గా మది సమకట్టి యొక్కఖగ మాఖగమున్

వ్యోమమునఁ దాఁక దివిసం

గ్రామం బారెంటి కయ్యెఁ గడురభసమునన్.

(దాన్ని మాంసం అనుకొని, ఆ డేగను ఇంకొక డేగ ఆకాశంలో ఎదుర్కొన్నది. ఆ రెండిటికీ యుద్ధం జరిగింది.)


1_3_30 కందము

సునిశితతుండహతిని వ్ర

స్సినపర్ణపుటంబు వాసి చెదరుచు నృపనం

దనువీర్యము యమునానది

వనమధ్యమునందు వాయువశమునఁ బడియెన్.

(ఆ పక్షి ముక్కు దెబ్బ చేత ఆ ఆకుదొప్ప చెదిరి వసురాజువీర్యం యమునానదినీటి మధ్యలో గాలివాటున పడిపోయింది.)