ఆ భా 1 2 181 to 1 2 210
1_2_181 మత్తేభము
సకలోర్వీశుఁ డతి ప్రయత్నపరుఁడై సర్వక్రియాదక్షత
క్షకకోటుల్ పని సేయఁగా ఘనతరైకస్తంభహర్మ్యంబుఁ ద
క్షకభీతిన్ రచియింపఁ బంచి దృఢరక్షన్ దానిలో నుండె బా
యక రాత్రిందివజాగరూక హితభృత్యామాత్యవర్గంబుతోన్.
(పరీక్షిత్తు రక్షణకోసం ఒంటిస్తంభపుమేడ కట్టించి అందులో నివసించసాగాడు.)
1_2_182 వచనము
మఱియు విషాపహరంబు లయి వీర్యవంతంబు లయిన మంత్రతంత్రంబులు గలిగి యాజ్ఞాసిద్ధులైన విషవైద్యుల నొద్దఁ బెట్టికొని పరీక్షితుం డుండు నంత నట తక్షకుండు విప్రవచనప్రచోదితుం డయి పరీక్షితునొద్దకు నెవ్విధంబునఁ బోవనగునో యని చింతించుచుండె నటఁ దొల్లి.
(పరీక్షిత్తు విషవైద్యులను దగ్గర ఉంచుకొని ఉండగా; అక్కడ తక్షకుడు పరీక్షిత్తు దగ్గరకు వెళ్లడం ఎలా అని ఆలోచించసాగాడు. అంతకు ముందే.)
-:కశ్యపునకుఁ దక్షకుఁడు గోరినధనం బిచ్చి మరల్చుట:-
1_2_183 మధ్యాక్కర
ధరణిఁ జరాచరభూతసంఘంబుఁ దమవిషవహ్ని
నురగంబు లేర్చుచు నునికి కలిగి పయోరుహగర్భుఁ
డురగవిషాపేత జీవసంజీవనోపదేశంబు
గరుణఁ గశ్యపునకు నిచ్చె నఖిలలోకహితంబుపొంటె.
(పాముల విషం వల్ల చనిపోయినవారిని తిరిగి జీవింపజేసే మంత్రాన్ని బ్రహ్మ కశ్యపుడికి ఉపదేశించాడు.)
1_2_184 వచనము
అట్టి కశ్యపుండను బ్రహ్మర్షి శృంగిశాపంబునఁ బరీక్షితుండు తక్షకదష్టుండగు నేఁడు సప్తమదివసం బటె యేను వాని నపేతజీవు సంజీవితుం జేసి నా విద్యాబలంబు మెఱయుదు మఱి యదియునుం గాక.
(కశ్యపుడు ఇలా ఆలోచించాడు - పరీక్షిత్తు చనిపోతే అతడిని పునర్జీవింపజేసి నా విద్యాబలాన్ని ప్రదర్శిస్తాను. అదీగాక.)
1_2_185 తేటగీతి
ధరణియెల్లను రక్షించు ధర్మచరితు
నాపరీక్షితు రక్షించి యతనిచేత
నపరిమితధనప్రాప్తుండ నగుదు కీర్తి
యును ధనంబు ధర్మము గొను టుఱదె నాకు.
(పరీక్షిత్తును తక్షకుడి విషం నుండి కాపాడి అతడి దగ్గర ధనం పొందుతాను.)
1_2_186 వచనము
అని విచారించి హస్తినపురంబునకుం బోవు వానిఁ దక్షకుండు వృద్ధవిప్రుండయి వనంబులో నెదురం గని మునీంద్రా యెటవోయె దేమికార్యంబున కనిన వానికిం గశ్యపుం డిట్లనియె.
(అని ఆలోచించి హస్తినాపురానికి వెళ్తున్న కశ్యపుడి దగ్గరకు తక్షకుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో వెళ్లి, "మునీంద్రా! ఎక్కడికి వెళ్తున్నావు? ఏమి చేయడానికి?", అని అడగగా కశ్యపుడు ఇలా అన్నాడు.)
1_2_187 కందము
తక్షకుఁ డను పన్నగుఁడు ప
రీక్షితుఁ గఱచునటె నేఁ డరిందము నతనిన్
రక్షింపఁగఁ బోయెద శుభ
దక్షిణు నా మంత్రతంత్రదాక్షిణ్యమునన్.
(పరీక్షిత్తును ఈ రోజు తక్షకుడు తన విషంతో చంపబోతున్నాడు, నా మంత్రశక్తితో అతడిని కాపాడేందుకు వెళ్తున్నాను.)
1_2_188 కందము
అనిన విని నగుచు వాఁడి
ట్లనియెను దక్షకుఁడ నేన యశనినిపాతం
బున బ్రదుకఁగ నగునేనియు
ననఘా మద్విషనిహతుల కగునే బ్రదుకన్.
(అది విని తక్షకుడు నవ్వుతూ ఇలా అన్నాడు, "నేనే ఆ తక్షకుడిని. పిడుగు మీద పడినా చావు తప్పించుకోవచ్చేమో గానీ, నా విషం వల్ల చనిపోతే తిరిగి జీవించలేరు.")
1_2_189 వచనము
నీమందులు మంత్రంబులు నాయందుం బనిసేయవు క్రమ్మఱి పొమ్ము కాదేని నీవ చూడ నివ్వటవృక్షంబుఁ గఱచి నా విషానలంబున భస్మంబు సేసెద నోపుదేని దీనిని సంజీవితంబుఁ జేయు మని తక్షకుం డావృక్షంబుఁ గఱచిన.
(నీ మందులూ, మంత్రాలూ నా విషయంలో పనిచెయ్యవు. తిరిగి వెళ్లు. నీకు శక్తి ఉంటే, నేను ఈ మర్రిచెట్టును నా విషాగ్నితో దగ్ధం చేస్తాను, తిరిగి బ్రతికించు, అని ఆ చెట్టును కాటువేశాడు.)
1_2_190 ఆటవెలది
అయ్యహీంద్ర విషమహానలదగ్ధ మై
విపులపత్త్రదీర్ఘ విటపతతుల
గగనమండలంబుఁ గప్పిన యవ్వట
తరువు భస్మమయ్యెఁ తత్క్షణంబ.
(విశాలమైన ఆ మర్రిచెట్టు, తక్షకుడి విషానికి క్షణంలో భస్మమైంది.)
1_2_191 వచనము
కశ్యపుండును నప్పుడ యాభస్మచయంబు గూడఁద్రోచి తనమంత్రతంత్రశక్తింజేసి యెప్పటియట్ల వృక్షంబుగాఁ జేసినం జూచి తక్షకుం డతివిస్మయం బంది మునీంద్రా నీవిద్యాబలంబున నిది సంజీవితం బయ్యె నేనియు నతికుపిత విప్రశాపవ్యపగతాయుష్యుం డైన పరీక్షితుండు సంజీవితుండు గానోపండు వానియిచ్చు ధనంబుకంటె నాయం దధికధనంబు గొనిపొ మ్మనినఁ గశ్యపుండును దన దివ్యజ్ఞానంబున నట్లకా నెఱింగి తక్షకుచేత ననంతంబైన యర్థంబు గొని క్రమ్మఱి చనియె విజనం బైన విపినాంతరంబున నైన యయ్యిరువున వృత్తాంతంబు మీరె ట్లెఱింగితి రంటేని వినుము.
(కశ్యపుడు వెంటనే బూడిదగా మారిన ఆ చెట్టును తన మంత్రబలంతో పునర్జీవింపజేశాడు. తక్షకుడు ఆశ్చర్యపోయి, "మునీంద్రా! ఈ చెట్టును బ్రతికించగలిగావేమోగానీ శృంగి శాపం తగిలిన పరీక్షిత్తు చావు తప్పించుకోలేడు. అతడిచ్చే సొమ్ముకన్నా ఎక్కువ నేనిస్తాను. అది తీసుకొని తిరిగివెళ్లు", అనగా కశ్యపుడు అందుకు అంగీకరించి వెళ్లిపోయాడు. జనంలేని అడవిలో జరిగిన ఈ సంభాషణ నాకెలా తెలిసిందని అడుగుతారేమో. వినండి.)
1_2_192 తేటగీతి
ఇప్పురంబున బ్రాహ్మణుం డిందానర్థ
మేఁగి మున్న యావృక్షంబు నెక్కి దాని
తోన దగ్ధుఁడై మఱి దానితోన లబ్ధ
జీవుఁడై వచ్చి జనులకుఁ జెప్పె దీని.
(హస్తినాపురం నుండి అడవికి వెళ్లి, కట్టెల కోసం ఆ చెట్టునెక్కి ఉన్న బ్రాహ్మణుడు ఒకడు తక్షకుడి విషప్రభావానికి ఆ చెట్టుతోనే భస్మమైపోయి కశ్యపుడి మహిమ వల్ల ప్రాణాన్ని తిరిగిపొందివచ్చి ప్రజలకు ఈ విషయాన్ని చెప్పాడు.)
-:తక్షకవిషాగ్నిచే బరీక్షితుండు హర్మ్యంబుతోడ దగ్ధుం డగుట:-
1_2_193 వచనము
అట్లు కశ్యపుం గ్రమ్మఱించి తక్షకుండు తత్క్షణంబ నాగకుమారులం బిలిచి మీరలు విప్రుల రయి సురభికుసుమస్వాదువన్యఫలంబులు పలాశపర్ణపుటికలం బెట్టికొని పరీక్షితుపాలికిం జని యిం డని పంచి తానును వారితోడన యదృశ్యరూపుం డయి వచ్చిన.
(తక్షకుడు అలా కశ్యపుడిని మరల్చి, సర్పకుమారులను పిలిచి వారితో, "మీరు బ్రాహ్మణరూపాలు ధరించి, పూలను, పండ్లను, బుట్టలలో పెట్టుకొని పరీక్షిత్తు దగ్గరకు వెళ్లి ఇవ్వండి", అని, తాను కూడా వారివెంట అదృశ్యరూపంలో వెళ్లాడు.)
1_2_194 చంపకమాల
ద్విజవరులం గుమారుల నతిప్రియదర్శను లైన వారి ఋ
గ్యజుషపదక్రమంబులు క్రియన్ గుణియించుచు వచ్చువారి న
గ్గజపురవల్లభుండు గని గ్రక్కున డాయఁగఁ బిల్చి మెచ్చి భా
వజసుభగుండు చేకొనియె వారలు దెచ్చినవాని నన్నిటిన్.
(వేదాలు వల్లిస్తూ వచ్చిన ఆ బ్రాహ్మణయువకులను పరీక్షిత్తు ఆహ్వానించి వారు తెచ్చిన పూలను, పండ్లను స్వీకరించాడు.)
1_2_195 కందము
వారల నర్హప్రియస
త్కారులఁ గావించి పుచ్చి కాలనియోగ
ప్రేరితుఁడై యమరేంద్రా
కారుఁడు తద్వన్యఫలజిఘత్సాపేక్షన్.
(వారిని సత్కరించి పంపి, వారు తెచ్చిన ఫలాలు తినే కోరికతో.)
1_2_196 ఉత్పలమాల
సూరెల నున్న మంత్రులను జుట్టములం గడుఁగూర్చు మిత్త్రులన్
సారబలుండు చూచి మునిశాపదినంబులు వోవుదెంచె నం
భోరుహమిత్త్రుఁ డస్తగిరిఁ బొందెడు నం చొగిఁ దత్ఫలావలుల్
వారలకెల్లఁ బెట్టి యనవద్యుఁడు దా నొకపండు చెచ్చెరన్.
(పరీక్షిత్తు తన పక్కనే ఉన్న మంత్రులను, చుట్టాలను చూసి, "శృంగి శాపదినాలు గడిచాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు", అని, ఆ పండ్లను వారికందరికీ పెట్టి, తాను కూడా ఒక పండును.)
1_2_197 కందము
కొని వ్రచ్చుడు లోపల న
ల్లనిక్రిమి యై తోఁచి చూడ లత్తుకవర్ణం
బునఁ బామై విషవహ్నులు
దనుకఁగ గురువీరుఁ గఱచి తక్షకుఁ డరిగెన్.
(తినబోగా, అందులో నల్లనిపురుగై కనబడి, చూస్తుండగానే ఎర్రని పాముగా మారి, విషాగ్నులు జ్వలించగా, తక్షకుడు పరీక్షిత్తును కాటువేసివెళ్లాడు.)
1_2_198 వచనము
తత్పరిజనంబు లందఱు నశనిపాతంబున బెదరి చెదరినట్లు గనుకనిం బఱచి రయ్యేకస్తంభహర్మ్యంబును దక్షకవిషాగ్నిదగ్ధం బయ్యె నట్లు భవజ్జనకుండు పరలోకగతుం డైనం బురోహితపురస్సరానేకభూసురవరులు యథావిధిం బరలోకక్రియలు నిర్వర్తించి రంత.
(పరివారమంతా భయంతో పరుగెత్తగా, తక్షకుడి విషాగ్నిచేత ఆ ఒంటిస్తంభపుమేడ దగ్ధమైంది. అలా నీ తండ్రి మరణించగా అతడికి పురోహితులు యథావిధిగా పరలోకకర్మలు నిర్వహించారు.)
-:జనమేజయ మహారాజు సర్పయాగము సేయుట:-
1_2_199 కందము
కందము
ఆయుష్మంతుఁడ వై ల
క్ష్మీయుత బాల్యంబునంద మీయన్వయరా
జ్యాయత్తమహీభారం
బాయతభుజ నీవు దాల్చి తభిషిక్తుఁడ వై.
(నీ చిన్నతనంలోనే నీకు రాజ్యాభిషేకం జరిగింది.)
1_2_200 ఉత్పలమాల
పెంచితి ధర్మమార్గమునఁ బ్రీతి యొనర్చుచు ధారుణీప్రజన్
మంచి తనేకయాగముల మానుగ దక్షిణ లిచ్చి విప్రులన్
నించితి సజ్జనస్తుతుల నిర్మలమైనయశంబు దిక్కులన్
సంచితపుణ్య సర్వగుణసంపద నెవ్వరు నీ సమానులే.
(ఎన్నో మంచిపనులు చేసిన నీకు సాటి ఎవరన్నా ఉన్నారా?)
1_2_201 ఉత్పలమాల
కాదన కిట్టిపాటియపకారముఁ దక్షకుఁ డేక విప్రసం
బోధనఁ జేసి చేసె నృపపుంగవ నీవు ననేక భూసురా
పాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాది కా
కోదరసంహతిన్ హుతవహోగ్రసమగ్రశిఖాచయంబులన్.
(తక్షకుడు ఈ అపకారాన్ని (శృంగి అనే) ఒక విప్రుడి ప్రేరణ చేత చేశాడు. నీవు కూడా సర్పయాగంలో, తక్షకుడు మొదలైన సర్పాలను భస్మం చేయి.) (ఇదీ, 1_1_124 ఒకే పద్యం.)
1_2_202 వచనము
అనిన విని జనమేజయుండు కోపోద్దీపితచిత్తుండై సర్పయాగము సేయ సమకట్టి పురోహితులను ఋత్విజులను బిలువంబంచి వారల కిట్లనియె.
(అది విని జనమేజయుడు, కోపంతో, సర్పయాగం చేయటానికి నిశ్చయించి, పురోహితులను పిలిపించి, వారితో.)
1_2_203 చంపకమాల
తనవిషవహ్ని మజ్జనకుఁ దక్షకుఁ డెట్లు దహించె నట్ల యే
నును సహమిత్రబాంధవజనుం డగు తక్షకు నుగ్రహవ్యవా
హనశిఖలన్ దహించి దివిజాధిపలోకనివాసుఁ డైన మ
జ్జనకున కీయుదంకునకు సాధుమతంబుగఁ బ్రీతిఁ జేసెదన్.
(తక్షకుడు తన విషాగ్నిలో నా తండ్రిని దహించినట్లే అతడినీ, అతడి బంధుమిత్రులనూ సర్పయాగంలో దహించి నా స్వర్గస్థుడైన తండ్రికీ, ఈ ఉదంకుడికీ ఆనందం కలిగిస్తాను.)
1_2_204 వచనము
సర్పయాగం బిట్టిదని శాస్త్రవిధానంబు గలదేని చెప్పుండనిన ఋత్విజులిట్లనిరి.
(సర్పయాగవిధానం చెప్పమని ఋత్విజులను అడగగా వారు ఇలా అన్నారు.)
1_2_205 మత్తకోకిలము
నీతదర్థమ కాఁగ దేవవినిర్మితం బిది యన్యు లు
ర్వీతలేశ్వర దీనిఁ జేయరు వింటి మేము పురాణ వి
ఖ్యాత మాద్యము నావుడున్ విని కౌరవప్రవరుండు సం
జాత నిశ్చయుఁ డయ్యె నప్పుడు సర్పయాగము సేయఁగన్.
(మహారాజా! ఈ యాగాన్ని నీకోసమే దేవతలు కల్పించారు. ఇతరులు దీన్ని చేయరు. ఇది ప్రసిద్ధమైనది, ప్రాచీనమైనది, అని వారు చెప్పగా విని జనమేజయుడు ఆ యాగం చేయటానికి నిశ్చయించాడు.)
1_2_206 వచనము
ఇట్లు కృతనిశ్చయుండై జనమేజయుండు కాశిరాజపుత్రి యయిన వపుష్టమయను మహాదేవి ధర్మపత్నిగా సర్పయాగదీక్షితుం డయి శాస్త్రోపదిష్ట ప్రమాణలక్షణనిపుణశిల్పాచార్యవినిర్మితంబును యజ్ఞోపకరణానేక ద్రవ్యసంభారసంభృతంబును బ్రభూత ధనధాన్యసంపూర్ణంబును స్వస్వనియుక్తక్రియారంభసంభ్రమపరిభ్రమద్బ్రాహ్మణనివహంబును నయిన యజ్ఞా యతనంబున నున్న యారాజునకు నొక్క వాస్తువిద్యానిపుణుం డైన పౌరాణికుం డిట్లనియె.
(ఇది విని, జనమేజయుడు కాశీరాజు కూతురైన వపుష్టమ అనే మహారాణి ధర్మపత్నిగా సర్పయాగం చేయటానికి దీక్షవహించి, యజ్ఞగృహాన్ని నిర్మింపజేయగా ఒక వాస్తునిపుణుడు ఇలా అన్నాడు.)
1_2_207 కందము
అనఘా యీయజ్ఞము విధి
సనాథఋత్విక్ప్రయోగసంపూర్ణం బ
య్యును గడచన నేరదు నడు
మన యుడుగును భూసురోత్తమ నిమిత్తమునన్.
(మహారాజా! ఈ యజ్ఞం చివరిదాకా సాగదు. ఒక బ్రాహ్మణుని కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది.)
1_2_208 వచనము
అనిన వాని వచనం బవకర్ణించి రాజనియుక్తు లయి చ్యవనకులవిఖ్యాతుండైన చండభార్గవుండు హోతఁగాఁ బింగళుం డధ్వర్యుండుగా శార్ఙ్గరవుండు బ్రహ్మగాఁ గౌత్సుండుద్గాతగా వ్యాసవైశంపాయన పైల జైమిని సుమంతు శుక శ్వేతకేతు మౌద్గ ల్యోద్దాలక మాండవ్య కౌశిక కౌండిన్య శాండిల్య క్రామఠక కోహ లాసిత దేవల నారద పర్వత మైత్రే యాత్రేయ కుండజఠర కాలఘట వాత్స్య శ్రుత శ్రవో దేవశర్మ శర్మద రోమ శోదంక హరిత రురుపులోమ సోమశ్రవసు లాదిగాఁ గల మహామునులు సదస్యులుగా నీలాంబర పరిధానులును ధూమసంరక్తనయనులును నై యాజ్ఞికు లగ్నిముఖంబు సేసి వేల్వం దొడంగిన.
(అన్న అతడి మాటను పెడచెవిని పెట్టి, చాలామంది మహామునులు సదస్యులుగా జనమేజయుడు యజ్ఞాన్ని ప్రారంభించగా.)
1_2_209 కందము
ధరణిసురమంత్రహోమ
స్ఫురణను వివశు లయి భూరిభుజగప్రభు లొం
డొరుఁ బిలుచుచు నధికభయా
తురు లై కుండాగ్నులందుఁ దొరఁగిరి పెలుచన్.
(యాగప్రభావం వల్ల సర్పరాజులు ఒకరినొకరు పిలిచుకొంటూ, భయంతో, వచ్చి ఆ హోమాగ్నిలో పడ్డారు.)
1_2_210 వచనము
మఱియుఁ గోటిశ మానసపూర్ణ శల పాల హలీమక పిచ్ఛిల గౌణప చక్ర కాలవేగ ప్రకాలన హిరణ్యబాహు శరణ కక్షక కాలదంతకాదు లయిన వాసుకి కులసంభవులును బుచ్ఛాండక మండలక పిండసేక్తృ రణేభ కోచ్ఛిఖ శరభ భంగ బిల్వతేజో విరోహణ శిలిశలకర మూక సుకుమార ప్రవేపన ముద్గర శిశురోమ సురోమ మహాహన్వాదులయిన తక్షకకులసంభవులును బారావత పారిజాతయాత్ర పాండర హరిణ కృశ విహంగ శరభ మోద ప్రమోద సంహత్యానాదు లయిన యైరావత కులసంభవులును నేరక కుండవేణి వేణీస్కంధ కుమారక బాహుక శృంగబేర ధూర్తక ప్రాతరాత కాదులయిన కౌరవ్యకులసంభవులును శంకుకర్ణ పిఠరక కుఠార సుఖసేచక పూర్ణాంగద పూర్ణముఖ ప్రహస శకుని దర్యమాహఠ కామఠక సుషేణ మానసావ్యయ భైరవ ముండ వేదాంగ పిశంగ చోద్రపారక వృషభ వేగవత్పిండారక మహాహను రక్తాంగ సర్వసారంగ సమృద్ధ పఠవాసక వరాహక వీరణక సుచిత్ర చిత్రవేగిక పరాశర తరుణక మణిస్కంధారుణ్యాదు లయిన ధృతరాష్ట్రకుల సంభవులును నయి యొక్కొక్క మొగి సహస్రాయుతసంఖ్యలు గలిగి.
(ఎన్నో సర్పాలు వేలసంఖ్యలో.)