ఆ భా 1 2 160 to 1 2 190

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

క. ఆపూర్ణ తేజుఁ డపగత పాపుఁ డపాకృతభవానుబంధుఁడు నిజమా తాపితృపక్ష ప్రబలభ యాపహుఁ డా స్తీకుఁ డుదితుఁడై పెరిఁగెఁ ప్రభన్. 160

తే. చ్యవనసుతుఁడైన ప్రమతితోఁ జదివె సకల వేదవేదాంగములు నిజవిమలబుద్ధి నెఱిఁగె సకలశాస్త్రంబుల నెల్ల యందు నధిక సాత్త్వికుఁ డా స్తీకుఁ డనఁగ జనులు, 161

వ. అట జనమేజయుండు దక్షకవిషానలంబునం దన జనకుపంచత్వుం బుదఁకు వలన నెఱింగి మంత్రులం జూచి యిది యేమి నిమిత్తంబు దీని సవిస్తరంబుగాఁ జెప్పుం డనిన మంత్రు లిట్లనిరి. 162

- జనమేజయునకుఁ బరీక్షితు శాపకారణంబు మంత్రులు చెప్పుట - సం 1-36-8

సీ. అభిమన్యునకు విరాటాత్మజ యైన యు త్తరకును బుట్టిన ధర్మమూర్తి కౌరవాన్వయపరిక్షయమున నుదయించి ప్రథఁ బరీక్షితుఁడు నాఁబరగువాడు ధర్మార్థకామముల్ దప్పక సలుపుచుఁ బూని భూ ప్రజ నెల్లఁ బుణ్యచరిత ననఘుఁడై రక్షించి యరువది యేఁడులు రాజ్యంబు సేసిన రాజవృషభుఁ

ఆ. డధిక ధర్మమార్గుఁడైన నీయట్టి స త్పుత్త్రుఁ బడసి యున్న పుణ్యుఁ డన్య నాథమకుటమణిగణ ప్రభారంజిత పాపపంకజుండు భరతనిభుఁడు. 163

వ. భవత్పితృ ప్రపితామహుం డైన పాండురాజునుంబోలె మృగయాసక్తుండై యొక్కనాఁడు మహాగహనంబులఁ బెక్కుమృగంబుల నెగచి చంపి తన చేత నేటువడి పాఱిన మృగంబు వెంటం దగిలి మహాధనుర్ధరుండై యజ్ఞ మృగంబు పిఱుందం బఱచు రుద్రుండునుం బోలె. 164

పృథ్వీవృత్తము. అమిత్రమదభేది యొక్కరుఁడ యమ్మృగాన్వేషణ భ్రమాకులితచిత్తుఁడై తగిలి పాఱుచున్ ముందటన్ శమీకుఁ డనువాని నొక్కమునిసత్తమున్ సంతత క్షమాదమసమన్వితుం గనియెఁ గాననాంతంబునన్. 165

వ. కని మునీంద్రా నాచేత నేటువడి మృగం బమ్ముతోన యిట వచ్చె నది యెక్కడు బాఱె నీ వెఱుంగుదువేని చెప్పుమనిన నమ్ముని మౌనవ్రతుండు గావునఁ బలుకకున్నం గినిసి తత్సమీపంబున నపగత ప్రాణంబై పడీయున్న పాముం దనవింటికొప్పున నెత్తి యమ్మునియఱుతం దగులవైచి క్రమ్మణి హస్తిపురంబునకు వచ్చియున్నంత. 166

ఆ. ఆశమీకుపుత్త్రు డంబుజసంభవు గఱిచి భక్తితోడ ఘోరతపము సేయుచున్న సుప్రసిద్ధుండు శృంగియున్ వాఁడు భృంగిసముఁ డవంధ్యకోపి. 167

క. తనజనకునఱుతఁ బవనా శనశవముఁ దగిల్చి రాజసమునఁ బరీక్షి జ్జనపాలు చనుట కృశుఁ డను మునివలన నెఱింగి కోపమూర్ఛాన్వితుఁడై. 168

వ. శాపజలంబు లెత్తికొని విజనం బైన విపినాతరంబున విజితేంద్రియుండై మొదవులచన్నులు వత్సంబులు గుడుచునప్పు డుద్గతంబగు పయఃఫేనంబ తన కాహారంబుగా మౌనవ్రతంబునం దపంబు సేయుచున్న మహావృద్ధు మదీయజనకు నవమానించిన పరీక్షితుండు నేఁడుమొదలుగా సప్తదివసంబులలోనఁ దక్షకవీషాగ్ని దగ్ధుండై యమసదనంబున కరిగెడు మని శాపం బిచ్చి తండ్రిపాలికిం జని. 169

క. ఉరగకళేబర మంసాం తరమునఁ బడి వ్రేలుచునికి దలపఁక యచల స్థిరుఁడై పరమధ్యానా వరతేంద్రియవృత్తి నున్నవాని శమీకున్. 170

వ. కని యయ్యురగకళేబరంబుఁ బాఱ వైచి తత్క్షణంబ ప్రబుద్ధనయనుండైన తండ్రి కభివాదనంబు సేసి బాష్పపూరితనయనుండై శృంగి పరీక్షితు నుద్దేశించి తనచేసిన శాపస్థితి సెప్పిన విని శమీకుండు గరం బడలి యిట్లనియె. 171

క. క్రోధమ తపముం జెఱచును గ్రోధమ యణిమాదు లైన గుణములఁ బాపుం గ్రోధమ ధర్మక్రియలకు బాధ యగుం గ్రోధిగాఁ దపస్వికిఁ జన్నే. 172

క. క్షమలేని తపసితపమును బ్రమత్తు సంపదయు ధర్మబాహ్యప్రభు రా జ్యము భిన్నకుంభమున తో యములట్టుల యధ్రువంబు లగు నివి యెల్లన్. 173

వ. క్షమ విడిచి నీవు దృష్టాదృష్టవిరుద్ధం బైన క్రోధంబుఁ జేకొని సకల క్షమారక్షకుండైన పరీక్షితునకుం బరీక్షింపక శాపంబిచ్చి చెట్టసేసితివి రాజరక్షితులై కాదె మహామును లతి ఘోరతపంబు సేయుచు వేదవిహిత ధర్మంబులు నడపుచు మహాశక్తిమంతు లయి యున్నవా రట్టిరాజుల కపకారంబు దలంచునంతకంటె మిక్కిలిపాతకం బొండెద్ది మరియు భరతకుల పవిత్రుండైన పరీక్షితు రాజసామాన్యుంగా వగచితే. 174

ఉ. క్షత్రియవంశ్యులై ధరణిఁ గావఁగఁ బుట్టినవారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రు లనఁగాఁగల నాలుగుజాతులన్ స్వచా రిత్రము దప్పకుండఁగఁ బరీక్షితు కాచినయట్లు రామమాం ధాతృరఘుక్షితీశులు ముదంబునఁ గాచిరె యేయుగంబులన్. 175

వ. అతండు మగయావ్యసనంబున నపరిమితక్షుత్పిపాసాపరిశ్రాంతుం డయి యెఱుంగక నా కవజ్ఞఁ జేసె నేనును దాని సహించితి నమ్మహాత్మునకు నీయిచ్చిన శాపంబుఁ గ్రమ్మఱింప నేర్తేని లగ్గగు ననిన శృంగీ యిట్లనియె. 176

క. అలుకమెయి మున్న పలికితి నలుకని నాపలుకు తీక్ష్ణమై యింతకు ను జ్జ్వలదహనాకృతిఁ దక్షకుఁ డలకఁగఁ బ్రేరేఁప కేల తా నెడ నుడుగున్. 177

వ. నా వచనం బమోఘం బనిన శమీకుండు శోకాకులితచిత్తుండై తన శిష్యున్ గౌరముఖుం డనువానిం బిలిచి దీని నంతయుఁ బరీక్షితున కెఱింగించి తక్షకువలని భయంబు దలంగునట్టి యుపాయంబు సేసికొమ్మని చెప్పి రమ్మనిన వాఁడు నప్పుడ పరీక్షితు పాలికిం జని యిట్లనియె. 178

సీ. అడవిలో నేకాంతమతి ఘోరతపమున నున్న మాగురులపై నురగశవము వైచుట విని యల్గి వారితనూజుండు శృంగియన్వాఁడు కార్చిచ్చునట్టి శాపంబు నీకిచ్చె సప్తాహములలోన నాపరీక్షితుఁడు నాయలుకఁ జేసి తక్షకవిషమున దగ్ధుఁ డయ్యెడు మని దానికి గురులు సంతాప మంది

ఆ. భూతలేశ నన్నుఁ బుత్తెంచి రిప్పుడు తద్భయంబు లెల్ల దలఁగునట్టి మంత్రతంత్రవిధు లమర్చి యేమఱకుండు నది నిరంతరంబు ననియుఁ గఱప. 179

వ. అని చెప్పి గౌరముఖుం డరిగినం బరీక్షితుండు పరిక్షీణహృదయుండై తన చేసిన వ్యతి క్రమంబునకు వెఱచి మంత్రి వర్గంబుతో విచారించి యాత్మరక్ష యంద ప్రమాదుండై. 180

మ. సకలోర్వీశుఁ డతి ప్రయత్నపరుఁడై సర్వక్రియాదక్షత క్షకకోటుల్ పని సేయఁగా ఘనతరైకస్తంభహర్మ్యంబుఁ ద క్షకభీతిన్ రచియింపఁ బంచి దృఢరక్షన్ దానిలో నుండె బా యక రాత్రిందివజాగరూక హితభృత్యామాత్యవర్గంబుతోన్. 181

మఱియు విషాపహరంబు లయి వీర్యవంతంబు లయిన మంత్రతంత్రంబులు గలిగి యాజ్ఞాసిద్ధులైన విషవైద్యుల నొద్దఁ బెట్టికొని పరీక్షితుం డుండునంత నట తక్షకుండు విప్రవచనప్రచోదితుం డయి పరీక్షితునొద్దకు నెవ్విధంబునఁ బోవనగునో యని చింతించుచుండె నటఁ దొల్లి. 182

- కశ్యపునకుఁ దక్షకుఁడు గోరినధనం బిచ్చి మరల్చుట - సం. 1-38-31

మధ్యాక్కర. ధరణిఁ జరాచరభూతసంఘంబుఁ దమవిషవహ్ని నురగంబు లేర్చుచు నునికి కలిగి పయోరుహగర్భుఁ డురగవిషాపేత జీనసంజీవనోపదేశంబు గరుణఁ గశ్యపునకు నిచ్చె నఖిలలోకహితంబుపొంటె. 183

వ. అట్టి కశ్యపుండను బ్రహ్మర్షి శృంగీశాపంబునఁ బరీక్షీతుండు తక్షకదష్టుండగు నేఁడు సప్తమదివసం బటె యేను వాని నపేతజీవితుం జేసి నా విద్యాబలంబు మెఱయుదు మఱి యదియునుం గాక. 184

తే. ధరణియెల్లను రక్షించు ధర్మచరితు నా పరీక్షితు రక్షించి యతనిచేత నపరిమితధనప్రాప్తుండ నగుదు కీర్తి యును ధనంబు ధర్మము గొను టుఱదె నాకు. 185

వ. అని విచారించి హస్తినపురంబునకుం బోవు వానిఁ దక్షకుండు వృద్ధవిప్రుండయి వనంబులో నెదురం గని మునీంద్రా యెటవోయె దేమికార్యంబున కనిన వానికిం గశ్యపుం డిట్లనియె. 186

క. తక్షకుఁ డను పన్నగుఁడు ప రీక్షితుఁ గఱచునటె నేఁ డరిందము నతనిన్ రక్షింపఁగఁ బోయెద శుభ దక్షిణు నా మంత్రతంత్రదాక్షిణ్యమునన్. 187

క. అనిన విని నగుచు వాఁడి ట్లనియెను దక్షకుఁడ నేన యశనినిపాతం బున బ్రదుకఁగ నగునేనియు ననఘా మద్విషనిహతుల కగునే బ్రదుకన్. 188

వ. నీ మందులు మంత్రంబులు నాయందుం బనిసేయవు క్రమ్మణి పొమ్ము కాదేని నీవ చూడ నివ్వటవృక్షంబుఁ గఱచి నా విషానలంబున భస్మంబు సేసెద నోపుదేని దీనిని సంజీవితంబుఁ జేయు మని తక్షకుం డావృక్షంబుఁ గఱచిన. 189

ఆ. అయ్యహీంద్ర విషమహానలదగ్ధ మై విపులపత్త్రదీర్ఘ విటపతతుల గగనమండలంబుఁ గప్పిన యవ్వట తరువు భస్మమయ్యెఁ తక్షణంబ. 190

వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com