ఆ భా 1 2 151 to 1 2 180

వికీసోర్స్ నుండి

1_2_151 వచనము

ఇట్లు జరత్కారుండు వివాహసపేక్షం బ్రతీక్షించుచున్న వాసుకియుం దన చారులవలన నంతయు నెఱింగి నిజసహోదరియైన జరత్కారుం దోడ్కొని జరత్కారుమహమునిపాలికిం బోయి యిట్లనియె.

(జరత్కారుడు వివాహం కోసం ఎదురుచూస్తున్న సంగతి వాసుకి తెలుసుకొని తన చెల్లెలైన జరత్కారువును వెంటతీసుకొని అతడి దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు.)

1_2_152 శార్దూలము

ధన్యం బయ్యె భవత్కులం బతికృతార్థం బయ్యె నస్మత్కులం

బన్యోన్యానుగుణాభిధానములఁ జిత్తానంద మొందెన్ వివే

కన్యాయాన్విత భూసురోత్తమ జరత్కారూ జగన్మాన్య యి

క్కన్యాభిక్షఁ బరిగ్రహింపుము జరత్కారున్ మదీయానుజన్.

(నీకూ, నా చెల్లెలికీ ఒకరికొకరికి తగిన గుణాలున్నాయి కాబట్టి ఈ జరత్కారువును వివాహార్థం స్వీకరించు.)


1_2_153 వచనము

అనిన నొడంబడి జరత్కారుండు సనామ యగుటంజేసి యక్కన్యకను వివాహంబై ప్రథమసమాగమంబునం దన ధర్మపత్నికి సమయంబు సేసె నాకు నీ వెన్నండేని యవమానంబు దలంచితి నాఁడ నిన్నుం బాసి పోవుదుననిన నాఁటంగోలె.

(జరత్కారుడు ఆమెను పెళ్లాడి తన భార్యతో, "నాకు నువ్వు ఎప్పడైతే అగౌరవం తలపోస్తావో అప్పుడే నిన్ను విడిచి వెళ్లిపోతాను", అని పలికాడు. అప్పటినుండి.)


1_2_154 కందము

వాలుపయి నడచున ట్ల

బ్బాలిక నడునడ నడుంగి భయమున నియమా

భీలుఁడగు పతికిఁ బవళుల్

రేలును నేమఱక పరిచరించుచునుండెన్.

(జరత్కారువు కత్తిమీద నడుస్తున్నట్లు, భయంతో, పొరపాటు పడకుండా, శ్రద్ధతో భర్తకు సేవలు చేస్తూ ఉండేది.)


1_2_155 కందము

అనవరతభక్తిఁ బాయక

తనపతికిం బ్రియము సేసి తద్దయు గర్భం

బనురక్తిఁ దాల్చి యొప్పెను

దినకరగర్భ యగు పూర్వదిక్సతి వోలెన్.

(తరువాత ఆమె గర్భం ధరించి, సూర్యుడు గర్భంలో ఉన్న తూర్పు దిక్కు అనే కాంతలా ప్రకాశించింది.)


1_2_156 వచనము

అక్కోమలి యొక్కనాఁడు దన కుఱువు దలయంపిగాఁ గృష్ణాజినాస్తరణంబున నిజనాథుండు నిద్రితుండై యన్నయవసరంబున నాదిత్యుం డస్తగిరిశిఖరాసన్నుం డగుటయు సంధ్యాసమయోచితక్రియలు నిర్వర్తింపఁ దదాశ్రమవాసులైన మునులు గడంగుటం జూచి యాత్మగతంబున.

(ఒకరోజు జరత్కారుడు నిద్రిస్తున్న సమయంలో, సూర్యాస్తమయం అవుతుండగా, ఆ ఆశ్రమవాసులు సంధ్యావందనం మొదలైనవి చేయటానికి సిద్ధమవటం చూసి, జరత్కారువు తనలో.)


1_2_157 సీసము

సంధ్యలం దొనరించు సద్విధుల్ గడచిన

ధర్మలోపం బగు దడయ కేల

బోధింప వై తని భూసుర ప్రవరుండు

పదరునో బోధింపఁబడి యవజ్ఞ

దగునె నా కిట్లు నిద్రాభంగ మొనరింప

నని యల్గునో దీని కల్గెనేని

యలుకయ పడుదుఁగా కగునె ధర్మక్రియా

లోపంబు హృదయంబులో సహింప


ఆటవెలది

నని వినిశ్చితాత్మయై నిజపతిఁ బ్రబో

ధించె మునియు నిద్ర దేఱి యలిగి

యేల నిద్ర జెఱచి తీవు నావుడు జర

త్కారు విట్టు లనియెఁ గరము వెఱచి.

(నిద్రలేపకపోతే కర్మలోపం జరిగిందని కోపగిస్తాడేమో? లేపితే నిద్రకు ఆటంకం కలిగించినందుకు కోపిస్తాడేమో? నిద్రలేపినందుకు కోప్పడితే కోపాన్ని భరిస్తాను గాక! ధర్మానికి లోపం జరగకూడదు అని నిశ్చయించుకొని అతడిని మేల్కొలిపింది. అతడు నిద్రచెడినందుకు కోపంతో ఎందుకు నిద్రాభంగం చేశావు అని అడగగా ఆమె భయపడుతూ ఇలా అన్నది.)


1_2_158 కందము

ఇనుఁ డస్తమింపఁ బోయిన

ననఘా బోధింపవలసె ననవుడు నామే

ల్కనునంతకు నుండక యినుఁ

డొనరఁగ నస్తాద్రి కేఁగ నోడఁడె చెపుమా.

(సూర్యుడు అస్తమించబోవటం చూసి నిద్రలేపాననగా అతడు, "సూర్యుడు నేను నిద్రలేచేవరకూ అస్తమించటానికి భయపడడా? చెప్పు")


1_2_159 వచనము

నీవు నా కవమానంబు దలంచితివి నీయొద్ద నుండనొల్లఁ దొల్లి నీకు నాచేసిన సమయంబు నిట్టిద నీగర్భంబున నున్నవాఁడు సూర్యానలసమప్రభుండైన పుత్త్రుం డుభయకులదుఃఖోద్ధరణసమర్థుండు సుమ్ము నీవు వగవక నీయగ్రజునొద్ద నుండు మని జరత్కారువు నూరార్చి జరత్కారుండు తపోవనంబునకుం జనియె జరత్కారువును దన యగ్రజుండైన వాసుకియొద్దకు వచ్చి తద్వృత్తాంతం బంతయు నెఱింగించి యుండునంత.

("నన్ను నిద్రలేపి అవమానించావు. ఇంతకు ముందే చెప్పినట్లు నిన్ను విడిచిపెడుతున్నాను. నీకు పుట్టబోయేవాడు చాలా గొప్పవాడు. విచారించక నీ అన్న దగ్గర ఉండు", అని ఆమెకు చెప్పి తపస్సుచేసుకోవటానికి అడవికి వెళ్లిపోయాడు.)


1_2_160 కందము

ఆపూర్ణతేజుఁ డపగత

పాపుఁ డపాకృతభవానుబంధుఁడు నిజమా

తాపితృపక్షప్రబల భ

యాపహుఁ డాస్తీకుఁ డుదితుఁ డై పెరిగెఁ బ్రభన్.

(గొప్పవాడైన ఆస్తీకుడు పుట్టి పెరగసాగాడు.)


1_2_161 తేటగీతి

చ్యవనసుతుఁ డైన ప్రమతితోఁ జదివె సకల

వేదవేదాంగములు నిజవిమలబుద్ధి

నెఱిఁగె సకలశాస్త్రంబుల నెల్ల యందు

నధిక సాత్త్వికుఁ డాస్తీకుఁ డనఁగ జనులు.

(చ్యవనుడి కుమారుడైన ప్రమతి దగ్గర ఆస్తీకుడు వేదవేదాంగాలను, శాస్త్రాలను అధ్యయనం చేశాడు.)


1_2_162 వచనము

అట జనమేజయుండు దక్షకవిషానలంబునం దన జనకు పంచత్వం బుదంకు వలన నెఱింగి మంత్రులం జూచి యిది యేమి నిమిత్తంబు దీని సవిస్తరంబుగాఁ జెప్పుం డనిన మంత్రు లిట్లనిరి.

(అక్కడ జనమేజయుడు తక్షకుడి విషం చేత తన తండ్రి మరణించాడనే విషయం ఉదంకుడి ద్వారా తెలుసుకొని మంత్రులను ఆ వృత్తాంతం వివరించమని అడిగాడు.)


-:జనమేజయునకుఁ బరీక్షితు శాపకారణంబు మంత్రులు చెప్పుట:-


1_2_163 సీసము

అభిమన్యునకు విరాటాత్మజ యైన యు

త్తరకును బుట్టిన ధర్మమూర్తి

కౌరవాన్వయపరిక్షయమున నుదయించి

ప్రథఁ బరీక్షితుఁడు నాఁబరఁగువాఁడు

ధర్మార్థకామముల్ దప్పక సలుపుచుఁ

బూని భూప్రజ నెల్లఁ బుణ్యచరిత

ననఘుఁడై రక్షించి యఱువది యేఁడులు

రాజ్యంబు సేసిన రాజవృషభుఁ


ఆటవెలది

డధిక ధర్మమార్గుఁడైన నీయట్టి స

త్పుత్త్రుఁ బడసి యున్న పుణ్యుఁ డన్య

నాథమకుటమణిగణ ప్రభారంజిత

పాదపంకజుండు భరతనిభుఁడు.

(అభిమన్యుడికీ విరాటుని కూతురైన ఉత్తరకూ కౌరవవంశవినాశనం జరిగే సమయంలో పరీక్షితుడు జన్మించాడు. అతడు భరతుడంతటి గొప్పవాడు.)


1_2_164 వచనము

భవత్పితృప్రపితామహుం డైన పాండురాజునుంబోలె మృగయాసక్తుండై యొక్కనాఁడు మహాగహనంబులఁ బెక్కుమృగంబుల నెగచి చంపి తన చేత నేటువడి పాఱిన మృగంబు వెంటఁ దగిలి మహాధనుర్ధరుండై యజ్ఞమృగంబు పిఱుందం బఱచు రుద్రుండునుం బోలె.

(నీ తండ్రికి ముత్తాత అయిన పాండురాజులా వేటలో ఆసక్తిగల పరీక్షిత్తు, ఒకరోజు అడవిలో చాలా జంతువులను చంపి, తన బాణపుదెబ్బ తిన్న ఒక లేడిని అనుసరిస్తూ.)


1_2_165 పృథ్వీవృత్తము

అమిత్త్రమదభేది యొక్కరుఁడ యమ్మృగాన్వేషణ

భ్రమాకులితచిత్తుఁడై తగిలి పాఱుచున్ ముందటన్

శమీకుఁ డనువాని నొక్కమునిసత్తమున్ సంతత

క్షమాదమసమన్వితుం గనియెఁ గాననాంతంబునన్.

(అడవి చివరన తపస్సుచేస్తున్న శమీకుడనే మునిని చూశాడు.)


1_2_166 వచనము

కని మునీంద్రా నాచేత నేటువడి మృగం బమ్ముతోన యిట వచ్చె నది యెక్కడం బాఱె నీ వెఱుంగుదేని చెప్పుమనిన నమ్ముని మౌనవ్రతుండు గావునఁ బలుకకున్నం గినిసి తత్సమీపంబున నపగత ప్రాణంబై పడియున్న పాముం దనవింటికొప్పున నెత్తి యమ్మునియఱుతం దగులవైచి క్రమ్మఱి హస్తిపురంబునకు వచ్చియున్నంత.

(పరీక్షిత్తు అతడిని ఆ లేడి గురించి అడిగాడు. అతడు మౌనవ్రతం ధరించి ఉన్న కారణాన సమాధానం చెప్పకపోగా, పరీక్షిత్తు అక్కడే చచ్చిపడి ఉన్న ఒక పామును ఆ ముని మెడలో తగిలించి హస్తినాపురానికి తిరిగివచ్చాడు.)


1_2_167 ఆటవెలది

ఆశమీకుపుత్త్రు డంబుజసంభవు

గుఱిచి భక్తితోడ ఘోరతపము

సేయుచున్న సుప్రసిద్ధుండు శృంగియ

న్వాఁడు భృంగిసముఁ డవంధ్యకోపి.

(శమీకుడి కుమారుడు శృంగి.)


1_2_168 కందము

తనజనకు నఱుతఁ బవనా

శనశవముఁ దగిల్చి రాజసమునఁ బరీక్షి

జ్జనపాలు చనుట కృశుఁ డను

మునివలన నెఱింగి కోపమూర్ఛాన్వితుఁడై.

(కృశుడనే ముని ద్వారా పరీక్షిత్తు చేసిన పని తెలుసుకొని కోపంతో.)


1_2_169 వచనము

శాపజలంబు లెత్తికొని విజనం బైన విపినాతరంబున విజితేంద్రియుండై మొదవులచన్నులు వత్సంబులు గుడుచునప్పు డుద్గతంబగు పయఃఫేనంబ తన కాహారంబుగా మౌనవ్రతంబునం దపంబు సేయుచున్న మహావృద్ధు మదీయజనకు నవమానించిన పరీక్షితుండు నేఁడు మొదలుగా సప్తదివసంబులలోనఁ దక్షకవిషాగ్ని దగ్ధుండై యమసదనంబున కరిగెడు మని శాపం బిచ్చి తండ్రిపాలికిం జని.

(తన తండ్రిని అవమానించిన పరీక్షిత్తు మరో ఏడు రోజుల్లో తక్షకుడి విషం వల్ల మరణిస్తాడని శపించి శమీకుడి దగ్గరకు వెళ్లాడు.)


1_2_170 కందము

ఉరగకళేబర మంసాం

తరమునఁ బడి వ్రేలుచునికి దలఁపక యచల

స్థిరుఁడై పరమధ్యానా

వరతేంద్రియవృత్తి నున్నవాని శమీకున్.

(పాము మెడపై వేలాడుతున్న విషయం కూడా పట్టించుకోకుండా ధ్యానంలో ఉన్న శమీకమునిని.)


1_2_171 వచనము

కని యయ్యురగకళేబరంబుఁ బాఱవైచి తత్క్షణంబ ప్రబుద్ధనయనుండైన తండ్రి కభివాదనంబు సేసి బాష్పపూరితనయనుండై శృంగి పరీక్షితు నుద్దేశించి తనచేసిన శాపస్థితి సెప్పిన విని శమీకుండు గరం బడలి యిట్లనియె.

(చూసి, పాముశవాన్ని తొలగించి, తండ్రికి నమస్కరించి, పరీక్షితుడికి ఇచ్చిన శాపం గురించి చెప్పగా శమీకుడు బాధపడి ఇలా అన్నాడు.)


1_2_172 కందము

క్రోధమ తపముం జెఱచును

గ్రోధమ యణిమాదు లైన గుణములఁ బాపుం

గ్రోధమ ధర్మక్రియలకు

బాధ యగుం గ్రోధిగాఁ దపస్వికిఁ జన్నే.

(కోపం ఎన్నో అనర్థాలకు కారణం. తపస్సుచేసే మునికి కోపం తగదు.)


1_2_173 కందము

క్షమలేని తపసితపమును

బ్రమత్తు సంపదయు ధర్మబాహ్యప్రభు రా

జ్యము భిన్నకుంభమున తో

యములట్టుల యధ్రువంబు లగు నివి యెల్లన్.

(ఓర్పులేని ముని తపస్సు, జాగ్రత్తలేనివాడి డబ్బు, ధర్మంలేని రాజు ప్రభుత్వం - ఇవి పగిలిన కుండలోని నీటిలా అస్థిరమైనవి.)


1_2_174 వచనము

క్షమ విడిచి నీవు దృష్టాదృష్టవిరుద్ధం బైన క్రోధంబుఁ జేకొని సకలక్షమారక్షకుండైన పరీక్షితునకుం బరీక్షింపక శాపంబిచ్చి చెట్టసేసితివి రాజరక్షితులై కాదె మహామును లతి ఘోరతపంబు సేయుచు వేదవిహిత ధర్మంబులు నడపుచు మహాశక్తిమంతు లయి యున్నవా రట్టిరాజుల కపకారంబు దలంచునంతకంటె మిక్కిలిపాతకం బొండెద్ది మరియు భరతకుల పవిత్రుండైన పరీక్షితు రాజసామాన్యుంగా వగచితే.

(కోపంలో ఆ రాజును శపించి తప్పుచేశావు.)


1_2_175 ఉత్పలమాల

క్షత్రియవంశ్యులై ధరణిఁ గావఁగ బుట్టినవారు బ్రాహ్మణ

క్షత్రియ వైశ్య శూద్రు లనఁగాఁగల నాలుగుజాతులన్ స్వచా

రిత్రము దప్పకుండఁగఁ బరీక్షితు కాచినయట్లు రామమాం

ధాతృరఘుక్షితీశులు ముదంబునఁ గాచిరె యేయుగంబులన్.

(రాముడు, మాంధాత, రఘువు మొదలైన రాజులు కూడా పరీక్షిత్తు రక్షించినట్లు ప్రజలని రక్షించారా?)


1_2_176 వచనము

అతండు మృగయావ్యసనంబున నపరిమితక్షుత్పిపాసాపరిశ్రాంతుం డయి యెఱుంగక నాకవజ్ఞఁ జేసె నేనును దాని సహించితి నమ్మహాత్మునకు నీయిచ్చిన శాపంబుఁ గ్రమ్మఱింప నేర్తేని లగ్గగు ననిన శృంగి యిట్లనియె.

(అలసటలో ఆ రాజు చేసిన అవమానాన్ని నేను సహించాను. నీ శాపాన్ని ఉపసంహరిస్తే మంచిది అని శమీకుడు చెప్పగా శృంగి ఇలా అన్నాడు.)


1_2_177 కందము

అలుకమెయి మున్న పలికితి

నలుకని నాపలుకు తీక్ష్ణమై యింతకు ను

జ్జ్వలదహనాకృతిఁ దక్షకుఁ

దలరఁగఁ బ్రేరేఁప కేల తా నెడ నుడుగున్.

(కోపంలో శపించాను. నా శాపం ఇప్పటికే తక్షకుడిని ప్రేరేపించి ఉంటుంది.)


1_2_178 వచనము

నా వచనం బమోఘం బనిన శమీకుండు శోకాకులితచిత్తుండై తన శిష్యున్ గౌరముఖుం డనువానిం బిలిచి దీని నంతయుఁ బరీక్షితున కెఱింగించి తక్షకువలని భయంబు దలంగునట్టి యుపాయంబు సేసికొమ్మని చెప్పి రమ్మనిన వాఁడు నప్పుడ పరీక్షితు పాలికిం జని యిట్లనియె.

(నా మాట వ్యర్థం కాదు అని శృంగి చెప్పగా, శమీకుడు బాధపడి, తన శిష్యులను పిలిచి, తక్షకుడి వల్ల కలగబోయే ఆపద గురించి పరీక్షిత్తుకు చెప్పమని పంపగా గౌరముఖుడనే శిష్యుడు పరీక్షిత్తు దగ్గరకు వెళ్లి.)


1_2_179 సీసము

అడవిలో నేకాంతమతి ఘోరతపమున

నున్న మాగురులపై నురగశవము

వైచుట విని యల్గి వారితనూజుండు

శృంగి యన్వాఁడు కార్చిచ్చునట్టి

శాపంబు నీకిచ్చె సప్తాహములలోన

నాపరీక్షితుఁడు నాయలుకఁ జేసి

తక్షకవిషమున దగ్ధుఁ డయ్యెడ మని

దానికి గురులు సంతాప మంది


ఆటవెలది

భూతలేశ నన్నుఁ బుత్తెంచి రిప్పుడు

తద్భయంబు లెల్లఁ దలఁగునట్టి

మంత్రతంత్రవిధు లమర్చి యేమఱకుండు

నది నిరంతరంబు ననియుఁ గఱప.

(శృంగి శాపం గురించి చెప్పాడు.)


1_2_180 వచనము

అని చెప్పి గౌరముఖుం డరిగినం బరీక్షితుండు పరిక్షీణహృదయుండై తన చేసిన వ్యతిక్రమంబునకు సంతాపించి శమీకు నుపశమనంబునకు మెచ్చి శృంగి శాపంబునకు వెఱచి మంత్రివర్గంబుతో విచారించి యాత్మరక్షయం ద ప్రమాదుండై.

(పరీక్షిత్తు తన తప్పుకు బాధపడి అప్రమత్తంగా ఉండసాగాడు.)