ఆ భా 1 2 121 to 1 2 150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

1_2_121 వచనము

అంత నయ్యురగులు నమృతం బుపయోగింపం గానక దానియున్నస్థానంబని దర్భలు నాకిన నాలుకలు రెండుగా వ్రయ్యుటంజేసి నాటంగోలె ద్విజిహ్యులు నాఁ బరఁగిరి యమృతస్థితింజేసి దర్భలు పవిత్రంబు లయ్యె.

(తరువాత పాములు వచ్చి, అమృతం కనపడక, అక్కడ ఉన్న దర్భలను నాకగా ఆ దర్భల పదునైన అంచులవల్ల వాటి నాలుకలు రెండుగా చీలాయి. అప్పటినుండి పాములకు రెండు నాలుకలు కలిగాయి. దర్భలపై అమృతం ఉంచడం వల్ల అవి పవిత్రమయ్యాయి.)


1_2_122 కందము

ఈ సౌపర్ణాఖ్యానము

భాసురముగ వినిన పుణ్యపరులకు నధిక

శ్రీ సంపద లగు దురితని

రాసం బగుఁ బాయు నురగరక్షోభయముల్.

(ఈ కథ విన్నవారికి మంచి జరుగుతుంది.)


1_2_123 వచనము

ఇట్లురగు లమృతం బుపయోగింపం గానక చనిన శేషుండు దనతల్లి యుం దమ్ములుఁ జేసిన యధర్మంబునకు నిర్వేదించి వారల విడిచి కడునిష్ఠతో గంధమాదన బదరీవన గోకర్ణ పుష్కరారణ్య హిమవంతంబు లాదిగాఁ గల పుణ్యస్థానంబులం దనేక సహస్రవర్షంబులు బ్రహ్మ నుద్దేశించి తపంబు సేసిన బ్రహయుఁ బ్రత్యక్షంబై వరంబు వేడు మనిన శేషుం డిట్లనియె.

(ఇలా పాములు అమృతం పొందలేక వెళ్లిపోగా, ఆదిశేషుడు తన తల్లి, తమ్ములు చేసిన పనికి బాధపడి, వారిని విడిచివెళ్లి, రకరకాల పుణ్యక్షేత్రాల్లో బ్రహ్మను గురించి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు.)


-:బ్రహ్మ యనుజ్ఞవలన శేషుఁడు భూభారంబు దాల్చుట:-


1_2_124 సీసము

తల్లియు నాసహోదరులును మూర్ఖులై

ధర్మువు నుచితంబుఁ దప్పి వినత

కావైనతేయున కపకారములు సేసి

రెప్పుడు వారు సహింప కెగ్గు

సేయుదు రేను రోసితి వారితోడిపొ

త్తొల్లఁదపంబు సేయుచు శరీర

భారంబు విడిచెదఁ బరమేష్ఠి యనవుడు

నాతని సమబుద్ధి కజుఁడు మెచ్చి


ఆటవెలది


నిత్యసత్యధర్మనిరతుండ వఖిలంబు

దాల్పనోపునట్టి ధైర్యయుతుఁడ

విది యనన్యవిషయ మిమ్మహీభారంబు

నీవ తాల్పవలయు నిష్ఠతోడ.

("దేవా! నా తల్లి, తమ్ములు ధర్మాన్ని విడిచి గరుడుడికి, వినతకు కీడు చేశారు. వారు ఎప్పుడూ ఇలాగే ఓర్వలేక హాని చేయటం నాకు అసహ్యం కలుగజేస్తోంది. వారితో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. తపస్సు చేస్తూ శరీరభారం విడుస్తాను", అనగా బ్రహ్మ మెచ్చి, "సర్వాన్నీ భరించే ధైర్యం గల నువ్వు ఈ భూభారాన్ని భరించడానికి తగినవాడివి", అన్నాడు.)


1_2_125 చంపకమాల

వినతకు నాత్మజుం డయిన వీరుఁడు కశ్యపవాలఖిల్యస

న్మునులవరంబు గన్న ఖగముఖ్యుఁడు వాసపు నోర్చి యున్న స

ద్వినుతబలుండు కావున వివేకమునన్ వినతాతనూజుతో

ఘనముగఁ జెల్మిసేయు మిది కార్యము నీకు భుజంగమేశ్వరా.

("గొప్పవాడైన గరుడుడితో నువ్వు స్నేహం చేయాలి")


1_2_126 వచనము

అని బ్రహ్మ నియోగించిన శేషుం డశేషమహీభారంబు దాల్చి గరుడనితో బద్ధసఖ్యుండైయుండె నిట వాసుకియుం దల్లి శాపంబున జనమేజయు చేయు సర్పయాగంబునం దయ్యెడు సర్పకులప్రళయంబునకు వెఱచి తన బాంధవుల నైరావతాదిసహోదరుల రావించి విషణ్ణహృదయుం డై యిట్లనియె.

(అని బ్రహ్మ నియోగించగా శేషుడు భూభారం వహించి గరుడుడికి స్నేహితుడయ్యాడు. ఇక్కడ వాసుకి అనే సర్పశ్రేష్ఠుడు తన తల్లి శాపం వల్ల జరగబోయే వినాశనానికి భయపడి తన బంధువులను, తమ్ములను పిలిచి దుఃఖంతో ఇలా అన్నాడు.)


-: వాసుకి తల్లిశాపంబునకు వగచుట:-


1_2_127 చంపకమాల

చిరముగ బ్రహ్మకుం దపము సేసి యనంతుఁ డనంతధారుణీ

భరగురుకార్యయుక్తుఁ డయి పన్నగముఖ్యుల పొత్తు వాసి చె

చ్చెరఁ దనయంత నుండి మదిఁ జేర్చి తలంపఁడ యొక్కనాఁడు దు

ర్భరతర దందశూకకుల భావిభయప్రవిఘాతకృత్యముల్.


(శేషుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడు కాబట్టి మనకు సర్పయాగంలో జరగబోయే హాని గురించి ఆలోచించడు.)


1_2_128 వచనము

మఱి యమృతమథనంబునాఁడు మంథరమహానగంబునకు నేత్రంబ నయిన నా క్లేశంబునకు మెచ్చి యమరు లెల్లఁ బితామహుం బ్రార్థించి నాకు నవ్యయత్వంబును సకలభయవిమోక్షణంబునుం గా వరం బిప్పించి రైనను జననీశాపంబున నురగకులప్రళయం బగుటకు మనోదుఃఖంబు దుస్సహం బైయుండు దాని నుడిగించు నుపాయం బెద్ది యేమి సేయువార మని చింతించుచున్న యన్నాగరాజునకు నాగకుమారు లత్యుద్ధతులై యిట్లనిరి.

(అమృతమథనం జరిగేటప్పుడు నేను కవ్వంగా ఉపయోగపడినందుకు మెచ్చి దేవతలు బ్రహ్మను వేడి నాకు అమరత్వం కలిగేలా వరం అనుగ్రహింపజేశారు. నాకు భయం లేకపోయినా, మన తల్లి శాపానికి సర్పాలకు జరగబోయే హాని వల్ల దుఃఖం కలుగుతోంది. అది ఆపేందుకు ఉపాయమేది అని చింతిస్తున్న వాసుకితో కొందరు నాగకుమారులు ఇలా అన్నారు.)


1_2_129 సీసము

జనమేజయుని చేయు సర్పయాగమునకు

విఘ్న మందఱము గావింత మతఁడు

ధర్మార్థి గావున ధారుణీసురుల మై

యడుగుద మిదియుఁ జేయకు మనియును

గొందఱ మతనికిఁ గూర్చు మంత్రులమునై

యీక్రతుక్రియఁ జేసి యిహపరముల

కగుఁ బెక్కుదోషంబు లని హేతువులు సూపి

యుడిగింత మందఱు నొక్కమొగిన


ఆటవెలది

భక్షభోజ్యలేహ్యపానీయములమీఁద

సదములోని విప్రజనులమీఁద

వెగడుపడఁగఁ బాఱి వెఱపింత మొజ్జలు

తత్ప్రయోగవిధులు దప్పి పఱవ.

("ఆ యజ్ఞానికి ఆటంకాలు కలిగిద్దాం. బ్రాహ్మణరూపాలు ధరించి సర్పయాగం చేయవద్దని అడుగుదాం. మనలో కొందరం అతడి మంత్రులమై ఈ యాగం వల్ల దోషాలు కలుగుతాయని చెప్పి మానేలా చేద్దాం. యజ్ఞం జరిగే సమయంలో భోజనపదార్థాలమీద, ఋత్విక్కులమీద వికారంగా పరుగెత్తి వారు పారిపోయేలా భయపెడదాం")


1_2_130 వచనము

అనిన వారలలోఁ గొందఱు బుద్ధిమంతు లయిన భుజంగముఖ్యు లి ట్లనిరి.

(అప్పుడు కొంతమంది బుద్ధిమంతులైన సర్పముఖ్యులు ఇలా అన్నారు.)


1_2_131 కందము

ఇవి మీ కన్నియుఁ జేయఁగ

నవు నని తలఁపకుఁడు భూసురాహుతిమంత్రో

ద్భవదారుణదహనశిఖల్

గవిసిన నెద్దియును జేయఁగా నెడ గలదే.

("మీరు చెప్పినవన్నీ అవుతాయనుకోకండి. వారు పఠించే మంత్రాల వల్ల పుట్టే అగ్నిజ్వాలలు వ్యాపిస్తే అలాంటి పనులు చేయటానికి అవకాశముండదు.")


1_2_132 వచనము

అనిన విని నాగరాజానుజుం డైన యేలాపుత్త్రుం డిట్లనియె.

(అప్పుడు వాసుకి తమ్ముడైన ఏలాపుత్రుడు ఇలా అన్నాడు.)

1_2_133 ఆటవెలది

శాపమిచ్చునాఁడు జననియుత్సంగంబు

నందు నిద్రవోయినట్ల యుండి

యమరవరుల కజున కైన యన్యోన్యసం

భాషణంబు లెఱుకపడఁగ వింటి.

(మన తల్లి శాపమిచ్చిన రోజు ఆమె ఒడిలో నిద్రపోతునట్లు ఉండి దేవతలకూ, బ్రహ్మకూ జరిగిన సంభాషణ విన్నాను.)


1_2_134 వచనము

అప్పలుకులు సవిస్తరంబుగాఁ జెప్పెద వినుండు శాపానంతరంబ యమరులెల్ల నజుని కిట్లని రయ్యా కద్రువ కడునిర్దయురాలై యిట్టి యనంతబలవీర్యసంపన్ను లయిన కొడుకులం బడసి వారి కకారణంబ దారుణంబైన శాపం బిచ్చె మీరును వారింపక యుపేక్షించితిరి దీనికిం బ్రతీకారంబు గలదే యనిన నమరులకుఁ గమలసంభవుం డిట్లనియె.

(ఆ వివరాలు వినండి. శాపం ఇచ్చిన వెంటనే దేవతలు బ్రహ్మతో, "కద్రువ అకారణంగా పుత్రులను ఘోరంగా శపించింది. మీరూ ఊరుకున్నారు. దీనిని ఉపసంహరించడం సాధ్యమా?", అన్నారు. అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు.)

1_2_135 కందము

క్రూరాకారుల జగదప

కారులఁ బన్నగులఁ దాల్పఁగా నోపని యి

ద్ధారుణికి హితంబుగ దు

ష్టోరగసంహార మిప్పు డొడఁబడ వలసెన్.

("దుర్మార్గులైన నాగులను మోయలేని ఈ భూమికి మేలు కలగటం కోసం వారి వినాశనానికి అంగీకరించవలసి వచ్చింది")


1_2_136 వచనము

మఱియు సకలలోకహితాచారంబులై ప్రసిద్ధులైన నాగముఖ్యుల నెల్ల వాసుకిచెలియ లైన జరత్కారువునకు జరత్కారుం డను మహామునికిం బుట్టెడువాఁడధిక తేజస్వి యాస్తీకుండను మహాముని జనమేజయ సమారబ్ధసర్పసత్త్రప్రళయంబువలన రక్షించునని పితామహుండు దేవతలకుంజెప్పిన తెఱంగు సెప్పిన వాసుకిప్రముఖనాగముఖ్యు లెల్ల సంతసిల్లి యేలాపుత్త్రు నెత్తుకొని సాధువాదంబుల నభినందించిరి వాసుకియు నాఁటంగోలె జరత్కారుమునీంద్రుం డెన్నండు దారపరిగ్రహంబు సేయునో యని తత్సమయసమాగమం బపేక్షించి యుండునంత.

(లోకాలకు మేలు కలిగించే నాగులను, వాసుకి చెల్లెలైన జరత్కారువుకూ, జరత్కారుడనే మునికీ జన్మించబోయే ఆస్తీకుడనే ముని ఆ సర్పయాగప్రళయం నుండి రక్షిస్తాడు, అని బ్రహ్మ దేవతలకు చెప్పిన విషయాన్ని ఏలాపుత్రుడు వివరించగా అతడిని అందరూ పొగిడారు. వాసుకి అప్పటినుండి జరత్కారుడు భార్యను పరిగ్రహించే సమయం కోసం ఎదురుచూడసాగాడు.)

1_2_137 కందము

పరమతపోనిధి యాయా

వరవంశోత్తముఁడు నియమవంతుఁడు లోకో

త్తరుఁడు జరత్కారుఁడునాఁ

బరఁగిన ముని బ్రహ్మచర్యపరిపాలకుఁడై.

(యాయావరవంశానికి చెందిన గొప్పవాడైన జరత్కారుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ.)


1_2_138 కందము

ఘోరవ్రతములు సలుపుచు

దారపరిగ్రహము సేయుఁ దా నొల్లక సం

సారపునర్భవభీతి న

పారవ్యామోహపాశబంధచ్యుతుఁడై.

(ఘోరవ్రతాలు చేస్తూ, భార్యను గ్రహించక, పునర్జన్మ భయంతో వ్యామోహాలు విడిచి.)


1_2_139 వచనము

తపస్స్వాధ్యాయబ్రహ్మచర్యవ్రతంబులం జేసి ఋషులఋణంబుల నీఁగుచుఁ బరిభ్రమించువాఁడు వనంబులో నొక్కపల్వలంబు గని యందు మూషికవిలూనంబయి యొక్కమూలంబు తక్కియున్న వీరణతృణ స్తంబంబు నవలంబించి తలక్రిందై యాదిత్యకిరణంబు లాహారంబుగా వ్రేలుచున్న ఋషుల గొందఱం జూచి డాయం బోయి జరత్కారుండిట్లనియె.

(ఇలా తిరిగే జరత్కారుడికి ఒకరోజు అడవిలో ఒక కొలను కనిపించింది. అందులో ఎలుకలు కొరకటంచేత ఒక్కవేరు మాత్రమే మిగిలి ఉన్న గడ్డిదుబ్బును పట్టుకొని తలకిందులుగా, సూర్యకిరణాలే ఆహారంగా, వేలాడుతున్న కొందరు మునులను చూసి ఇలా అన్నాడు.)


1_2_140 కందం

కడునుగ్రము దల క్రిందుగఁ

బడి వ్రేలుట యిదియు నొక తపంబొకొ నా కే

ర్పడఁ జెప్పుఁ డీతపం బేఁ

దొడఁగెద ననవుడును నయ్యధోముఖవిప్రుల్.

(తలకిందులుగా వేలాడటం చాలా కష్టం. ఇది కూడా ఒకరకమైన తపోవిశేషమా? నేను కూడా చేస్తాను అనగా ఆ మునులు ఇలా అన్నారు.)


1_2_141 కందము

అనఘ యిది యేటితప మే

మనుపమ దుఃఖితుల మగుట నాధారము లే

కను సంతానోచ్ఛేదం

బున వ్రేలెద మధమలోకమున తెరువు చనన్.

("ఇది తపస్సేమిటి? మా తరువాత సంతానం లేకపోవటం వల్ల ఇలా వేలాడుతున్నాము")


1_2_142 వచనము

మందభాగ్యుల మయిన మావంశంబున జరత్కారుం డను పాపకర్ముండు పుట్టి దారపరిగ్రహంబు సేయను సంతానంబు వడయను నొల్లకున్నవాఁ డే మాతని పితృపితామహులము మాపట్టిన యవురుగంట వేళ్ళెల్లం గాలుండు మూషికవ్యాజంబునం దరతరంబ కొఱికిన నొక్కవేర తక్కి యున్నయది యదియును జరత్కారుం డనపత్యుం డైనం దెగు నే మధఃపాతుల మగుదు మాతం డపత్యంబు వడసెనేని యూర్ధ్వగతుల మగుదుము.

(మా వంశంలో జరత్కారుడనే పాపి పెళ్లి చేసుకోవటానికీ, సంతానం పొందటానికీ ఒప్పుకోవటంలేదు. మేము అతని తండ్రితాతలము. ఈ దుబ్బువేళ్లన్నీ యముడు ఎలుక రూపంలో కొరికేయగా ఒక్కవేరు మాత్రం మిగిలింది. జరత్కారుడు సంతానం పొందకపోతే అది కూడా తెగి మేము అధోలోకాల్లో పడతాము, లేకపోతే పైలోకాలకి వెళ్తాము.)


1_2_143 తేటగీతి

నీవు మా చుట్టమవపోలె నెమ్మితోడ

నవహితుండవై మాపల్కు లాదరించి

తా జరత్కారుఁ గని చెప్పవయ్య వాని

నెఱుఁగుదేని మాపడియెడు నీయవస్థ.


(మా బంధువులా మా మాటలు విన్నావు. ఆ జరత్కారుడు నీకు తెలిస్తే మా అవస్థగురించి అతడికి చెప్పు.)


1_2_144 వచనము

అనిన విని జరత్కారుం డతికారుణ్యచిత్తుం డయి యపత్యార్థం బవశ్యంబు వివాహంబు గావలయు నని యెంతయుం బ్రొద్దు చింతించి తనపితృవర్గంబున కిట్లనియె.

(జరత్కారుడు ఇది విని సంతానం కోసం పెళ్లిచేసుకోవాలని ఆలోచించి వారితో ఇలా అన్నాడు.)


1_2_145 కందము

మీరలు నాపితృదేవత

లారాధ్యుల రేను మీకు నాత్మజుఁడ జర

త్కారుఁ డనువాఁడు ముందఱ

దారపరిగ్రహము సేయఁ దగులదు బుద్ధిన్.

(జరత్కారుడనే మీ కుమారుడిని నేనే. పెళ్లిచేసుకోవాలనే ఆలోచన ఇంతకుముందు నాకు లేదు.)


1_2_146 కందము

మిమ్మిట్లు చూచి మీకు హి

తమ్మెట్లగు నట్ల కా ముదంబున దారా

ర్థమ్ము ప్రవర్తింపఁగఁ జి

త్త మ్మిప్పుడు పుట్టె నాకు ధర్మస్థితిమై.

(ఇలా వేలాడుతున్న మిమ్మల్ని చూసి మీకు మేలు జరగటం కోసం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను.)


1_2_147 వచనము

అనిన నమ్మహామునులు జరత్కారుపల్కులకు సంతసిల్లి యిట్లనిరి.

(ఆ మునులు సంతోషించి ఇలా అన్నారు.)


1_2_148 చంపకమాల

తగియెడు పుత్త్రులం బడసి ధర్మువు దప్పక తమ్ము నుత్తముల్

పొగడఁగ మన్మహామతులు పొందుగతుల్ గడు ఘోరనిష్ఠతోఁ

దగిలి తపంబు సేసియును దక్షిణ లిమ్ముగ నిచ్చి యజ్ఞముల్

నెగడఁగఁ జేసియుం బడయు నేర రపుత్త్రకు లైన దుర్మతుల్.

(పుత్రులు గల సజ్జనులు పొందే ఉత్తమలోకాలను పుత్రులు లేని దుర్జనులు ఎన్ని యజ్ఞాలు చేసినా పొందలేరు.)


-: జరత్కారుండు వివాహంబు చేసికొనఁబూనుట:-


1_2_149 వచనము

కావున నీవు కృతదారపరిగ్రహుండవై సంతానంబు వడసి మమ్ము నూర్ధ్వలోకగతులం జేయు మనిన జరత్కారుం డట్లేని నాకు సనామ్నియయినదాని వివాహంబు గావలయు నని వారికి నమస్కరించి వీడ్కొని సనామకన్యాన్వేషణపరుండై భూవలయం బెల్లఁ గలయం గ్రుమ్మరి.

(కాబట్టి పెళ్లిచేసుకొని, సంతానం పొంది మమ్మల్ని ఊర్ధ్వలోకాలకు పంపమనగా జరత్కారుడు తనతో సమానమైన పేరు గల కన్యను పెళ్లి చేసుకుంటానని వారికి నమస్కరించి అలాంటి కన్యను వెదుకుతూ భూచక్రమంతా తిరిగి.)


1_2_150 తరువోజ

అనవరత వ్రతాయాసఖేదమున నతికృశం బగుచున్న యంగంబునందుఁ

దనరి యేర్సడ సిరల్ దద్దయు ముదిమిఁ దల వడంకుచునుండఁ దన పితృవరుల

ఘనముగా నూర్ధ్వాభిగమనులఁ జేయఁ గడఁగి వివాహంబుగా జరత్కారుఁ

డనఘుండు దనకోర్కి కనురూప యైనయట్టి కన్యకఁ గానఁడయ్యె మర్త్యమున.

(తనకు తగిన కన్య జరత్కారుడికి భూలోకంలో కనపడలేదు.)