ఆ భా 1 2 091 to 1 2 120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

1_2_91 మత్తేభము

వితతోల్కాశనిపుంజ మొక్కొయనగా విన్వీథి విక్షిప్తప

క్షతివాతాహతిఁ దూలి తూలశకలాకారంబులై వారిద

ప్రతతుల్ సాల్పడి నల్గడం జెదరఁగాఁ బాఱెన్ మనోవేగుడై

పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దత్పాలుర్ భయం బందఁగన్.

(వారు భయపడేలా గరుడుడు అమృతం దగ్గరకు ఎగిరి వెళ్లాడు.)


1_2_92 వచనము

అంత.

(అప్పుడు.)


-:గరుడఁ డమృతరక్షకులతో యుద్ధము సేయుట:-


1_2_93 కందము

కల్పాంతనలకీలా

కల్పాయతపక్షుఁ బక్షిగణవిభు శౌర్యా

కల్పుఁ గని యమృతరక్షు ల

నల్పక్రోధు లయి తాఁకి రార్చి కడంకన్.

(ఆ అమృతరక్షకులు గరుత్మంతుడిని సాహసంతో ఎదుర్కొన్నారు.)


1_2_94 కందము

తడఁబడ నేసియు వైచియుఁ

బొడిచియు వివిధాస్త్రశస్త్రములు నుద్ధతులై

కడుగొని యుద్ధము సేసిరి

కడిమిమెయిన్‌ విబుధవరులు గరుడనితోడన్‌.

(గరుత్మంతుడితో రకరకాలుగా యుద్ధం చేశారు.)


1_2_95 వచనము

గరుడండును నిజపక్షవిక్షిప్తరజోవృష్టి నమరవరుల దృష్టిపథంబుఁ గప్పి స్వర్గలోకంబ నిరాలోకంబుగాఁ జేసిన నమరేంద్రుపనుపునం బవనుం డా రజోవృష్టి చెదర వీచె నంత.

(గరుడుడు తన రెక్కలతో దుమ్మురేపి స్వర్గాన్ని చీకటిమయం చేయగా ఇంద్రుడు వాయువును ఆజ్ఞాపించి ఆ దుమ్ము చెదిరిపోయేలా చేశాడు.)


1_2_96 మాలిని

పరశు కులిశ కుంత ప్రాస బాణాసనోద్య

త్పరిఘ కణప చక్ర ప్రస్ఫురద్బాహుసేనా

పరివృతుఁడయి తాఁకెన్ భౌమనుండ న్మహాకిం

కరుఁడు సమరకేళీగర్వితున్ వైనతేయున్.

(భౌమనుడనే వాడు రకరకాల ఆయుధాలతో గరుత్మంతుడిని ఎదుర్కొన్నాడు.)


1_2_97 కందము

బలవత్ఖగేంద్రకోపా

నలభస్మీభూతుఁడై క్షణంబున వాఁడున్‌

బల మఱి క్రాఁగె నుదగ్ర

జ్వలనజ్వాలావలీఢశలభమపోలెన్‌.

(కానీ గరుత్మంతుడి కోపమనే అగ్నిలో మిడతలా మాడిపోయాడు.)


1_2_98 సీసము

పక్షతుండాగ్రనఖక్షతదేహులై

బోరన నవరక్తధార లొలుక

విహగేంద్రునకు నోడి నిహతులై సురవరుల్

సురరాజుమఱువు సొచ్చిరి కలంగి

సాధ్యు లనాయాససాధ్యులై పాఱిరి

పూర్వాభిముఖు లయి గర్వ ముడిఁగి

వసువులు రుద్రులు వసుహీన విప్రుల

క్రియ దక్షిణాశ్రితు లయిరి భీతి

ఆటవెలద

వంది యపరదిక్కుఁ బొంది రాదిత్యు లా

శ్వినులు నుత్తరమున కొనరఁ బఱచి

రనల వరుణ పవన ధనద యమాసురుల్

వీఁక దఱిఁగి కాందిశీకు లయిరి.

(గరుడుడి పరాక్రమానికి దేవతలూ, దిక్పాలకులూ చెల్లాచెదురయ్యారు.)


1_2_99 కందము

తలరఁగ రేణుక్రథన

ప్రలిహ ప్రరుజాశ్వకృంత పదనఖులను ర

క్షులఁ గులిశనిశాతనఖా

వలిఁ బక్షీంద్రుండు వ్రచ్చి వందఱలాడెన్.

(గరుడుడు అమృతానికి కావలి కాసేవారిని తన గోళ్లతో చీల్చి ముక్కలు చేశాడు.)


1_2_100 వచనము

ఇట్లు నిర్జరవరుల నెల్ల నిర్జించి యూర్జితుండై గరుడం డమృతస్థానంబున కరిగి దానిం బరివేష్టించి ఘోరసమీరప్రేరితంబై దుర్వారశిఖాజిహ్వలనంబరంబు నాస్వాదించుచున్న యనలంబుం గని తత్క్షణంబ సకలనదీజలంబుల నెల్లఁ బుక్కిలించుకొని వచ్చి యయ్యనలంబు నాఱంజల్లి తీక్ష్ణధారంబై దేవనిర్మితంబై పరిభ్రమించుచున్న యంత్రచక్రంబు నారాంతరంబున సంక్షిప్తదేహుండై చొచ్చి యచ్చక్రంబుక్రింద.

(అలా దేవతలను ఓడించి, అమృతం చుట్టూ ఉన్న అగ్నిని చూసి, అన్ని నదుల్లో ఉన్న నీటినంతా నోటిలో ఉంచుకొని వచ్చాడు. ఆ నీటితో మంటలను ఆర్పి, అమృతాన్ని రక్షిస్తూ పదునైన అంచులు ఉన్న చక్రాన్ని చూసి సూక్ష్మరూపం ధరించి ఆ చక్రం కిందికి వెళ్లాడు.)


1_2_101 ఉత్పలమాల

ఘోరవికారసన్నిహితకోపముఖంబులు దీప్తవిద్యుదు

ల్కారుణదారుణాక్షములు నై నిజదృష్టివిషాగ్ని నన్యులం

జేరఁగ నీక యేర్చుచుఁ బ్రసిద్ధముగా నమృతంబు చుట్టు ర

క్షారతి నున్న యుగ్రభుజగంబుల రెంటిని గాంచి చెచ్చెరన్.


(అక్కడ భయంకరమైన పాములు రెండు అమృతాన్ని కాపాడుతూ ఉండటం చూసి.)


1_2_102 వచనము

అయ్యురగంబులం దన పక్షరజోవృష్టి నంధంబులఁ జేసి వాని శిరంబులు ద్రొక్కి పరాక్రమం బెసంగ నమృతంబు గొని గరుడండు గగనంబున కెగసిన.

(తన రెక్కలతో దుమ్మురేపి వాటిని గుడ్డివాటిగా చేసి, వాటి తలలు తొక్కి, అమృతం తీసుకొని ఆకాశానికి ఎగిరాడు.)


1_2_103 కందము

కలహమున నిట్లు సురవీ

రులఁ బల్వుర నోర్చి యొక్కరుఁడ యమృతముఁ దె

క్కలి కొని యాస్వాదింపక

యలోలుఁ డగు వానిఁ జూచి హరి యిట్లనియెన్.

(ఇలా దేవతలను ఓడించి అమృతాన్ని సాధించి కూడా దాన్ని రుచి సైతం చూడకుండా ఉన్న గరుత్మంతుడిని చూసి, విష్ణువు ఇలా అన్నాడు.)


1_2_104 కందము

నీవిజయోత్సాహమునకు

లావునకు జవంబునకు నలౌల్యమునకు స

ద్భావమునకు మెచ్చి వరం

బీవచ్చితి వేఁడు మెద్ది యిష్టము నీకున్.

("నిన్ను మెచ్చాను. నీకేది ఇష్టమో కోరుకో")


-:శ్రీమన్నారాయణుఁడు గరుడునకుఁ బ్రసన్నుఁ డగుట:-


1_2_105 వచనము

అని ప్రసన్నుండై యానతిచ్చిన యాదిదేవుండగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి గరుడం డిట్లనియె.


1_2_106 సీసము

అమృతాశనంబు చేయకయును దేవ నా

కజరామరత్వంబు నందుటయును

నఖిలలోకంబుల కగ్రణివైన నీ

యగ్రంబునందు ని న్నధికభక్తి

గొలుచుచు నునికియుఁ గోరితిఁ గరుణతో

దయచేయు ముద్ధతదైత్యభేది

యనవుడు వానికి నభిమతంబులు ప్రీతుఁ

డై యిచ్చి హరి యిట్టు లనియె నాకు

ఆటవెలది

ననఘ వాహనంబ వై మహాధ్వజమవై

యుండు మనినఁ బక్షియును బ్రసాద

మనుచు మ్రొక్కి పఱచె నంత నాతనిమీఁద

వజ్ర మెత్తి వైచె వాసవుండు.

("దేవా! అమృతం తాగకుండానే నాకు అమృతత్వం కలగాలనీ, భక్తితో నిన్ను సేవిస్తూ ఉండాలనీ కోరుకుంటున్నాను", అన్నాడు. విష్ణువు అతని కోరికలను అనుగ్రహించి తనకు వాహనంగా ఉండేలా వరమిచ్చాడు. గరుత్మంతుడు మహాప్రసాదమని ఎగిరిపోగా ఇంద్రుడు అతడిపై వజ్రాయుధాన్ని ప్రయోగించాడు.)


1_2_107 వచనము

అదియును నంబరంబున నగ్నికణంబులు చెదరం బఱతెంచి పక్షిరాజు పక్షంబులు దాఁక వచ్చినం జూచి గరుడండు నగి నీచేయు వేదన నన్నుం దాఁక నోపదు నీవు మహామునిసంభవంబ వగుటను దేవేంద్రునాయుధంబ వగుటను నిన్ను నవమానింప గాదు గావున మదీయైకపర్ణశకలచ్ఛేదఁబు సేయుము నాయందు నీశక్తి యింతియ యనిన సకలభూతసంఘం బెల్ల నాతని పర్ణంబులసుస్థిరత్వంబునకు మెచ్చి సుపర్ణుండని పొగడె సురేంద్రుండును నవ్విహగేంద్రు మహాత్మ్యంబునకు మెచ్చి యచ్చెరువంది యిట్లనియె.

(ఆ వజ్రాయుధం గరుత్మంతుడి రెక్కలపైకి రాగా, అతడు నవ్వి, "నీవు నన్ను బాధపెట్టలేవు. కానీ, దధీచి వంటి మహాముని వెన్నెముకతో తయారైనదానివీ, ఇంద్రుని ఆయుధానివీ కనుక నిన్ను అవమానించను. కాబట్టి, నా ఈకను ఒకదాన్ని ఛేదించు. నాపై నీ శక్తి ఇంతే", అనగా అతని రెక్కల దృఢత్వాన్ని స్తుతించి సకలభూతాలూ అతన్ని సుపర్ణుడని పొగిడాయి. ఇంద్రుడు కూడా ఆశ్చర్యపోయి.)


1_2_108 ఆటవెలది

నిరుపమానశౌర్య నీతోడఁ జెలిమి సే

యంగ నా కభీష్టమైనయదియు

నిట్టి విక్రమంబు నిట్టి సామర్థ్యంబుఁ

గలదె యొరుల కిజ్జగంబునందు.

(గొప్పవాడివైన నీతో నాకు స్నేహం చేయాలని ఉంది.)


1_2_109 కందము

అమరుఁడ వజరుఁడ వజితుఁడ

వమేయుఁడవు నీకు నమృత మది యేల ఖగో

త్తమ దీని నొరుల కిచ్చిన

నమరులకును వా రసాధ్యు లగుదురు పోరన్.

(నువ్వు మరణం, ముసలితనం, పరాజయం లేనివాడివి. నీకు అమృతం ఎందుకు? అది ఇతరులకిస్తే వారు దేవతలకి కూడా అసాధ్యులవుతారు.)


1_2_110 కందము

నీ వొరులకు నీయమృతం

బీ వలవదు నాకు మగుడ నిచ్చిన నీకి

ష్టావాప్తియగువిధం బేఁ

గావించెద ననిన హరికి గరుడం డనియెన్.

(అమృతాన్ని నాకు తిరిగి ఇస్తే నీకు ఇష్టమైనది జరిగేలా చేస్తాను, అని ఇంద్రుడనగా గరుడుడు ఇలా పలికాడు.)


1_2_111 వచనము

ఏను మదీయమాతృదాసీత్వనిరాసార్థం బురగుల కమృతంబు దెచ్చి యిత్తునని కాద్రవేయులతో నొడివి వచ్చినవాఁడ నీయమృతంబు గొనిపోయి వారల కిచ్చి మదీయజననీదాస్యంబుఁ బాచికొనిన నురగు లీ యమృతం బుపయోగింపకుండ ముందఱ నీవు గొని చను మనిన నగ్గరుడని మహానుభావంబునకు మెచ్చి నీ బలపరాక్రమంబులు వినవలతుం జెప్పు మనిన నయ్యింద్రునకు గరుడం డిట్లనియె.

("నా తల్లి దాస్యం పోగొట్టడానికి నాగులకు ఈ అమృతం తెచ్చి ఇస్తానని చెప్పాను. ఇది నేను వారికిచ్చిన తaరువాత వారు దాన్ని తాగకముందే నువ్వు తిరిగి తీసుకో". ఇంద్రుడు గరుత్మంతుడిని మెచ్చుకొని, "నీ బలపరాక్రమాలు వినాలని ఉంది", అనగా గరుడుడు ఇలా చెప్పాడు.)


1_2_112 కందము

పరనిందయు నాత్మగుణో

త్కరపరికీర్తనముఁ జేయఁగా నుచితమె స

త్పురుషుల కైనను నీ క

చ్చెరువుగ నా కలతెఱంగుఁ జెప్పెదఁ బ్రీతిన్.

(ఇతరులను నిందించడం, తమ గుణాలను తామే మెచ్చుకోవటం సజ్జనులకు తగదు. అయినా సత్యమైనదాన్ని చెప్తాను.)


1_2_113 ఉత్పలమాల

స్థావరజంగమ ప్రవితతం బగు భూవలయంబు నెల్ల నా

లావునుఁ బూని తాల్తు నవిలంఘ్యపయోధిజలంబు లెల్ల ర

త్నావళితోన చల్లుదు బృహన్నిజపక్షసమీరణంబునన్

దేవగణేశ యీక్షణమ త్రిమ్మరి వత్తుఁ ద్రివిష్టపంబులున్.

(నేను ఈ భూమిని మోయగలను, నా రెక్కలతో అన్ని సముద్రాలనీటినీ వెదజల్లగలను, మూడులోకాలనూ క్షణంలో చుట్టి రాగలను.)


1_2_114 వచనము

అని చెప్పిన గరుడని జవసత్త్వసామర్థ్యంబులకు మెచ్చి సంతసిల్లి నీవు నాతో నెప్పుడు బద్దసఖ్యుండవై యుండవలయునని వెండియు దేవేంద్రుండు గరుడని కిట్లనియె.

(అని గరుడుడు చెప్పగా ఇంద్రుడు సంతోషించి, అతడి స్నేహం కోరి, ఇలా అన్నాడు.)


1_2_115 కందము

నాకభిమత మొనరించితి

నీకిష్టము చెప్పికొను మనిన దుర్మదులై

మాకిట్ల హితముఁ జేసిన

యా కద్రువపుత్త్రు లశన మయ్యెడు నాకున్.

("నాకిష్టమైనదాన్ని చేశావు. నీ కోరిక తెలుపు", అన్నాడు. అప్పుడు గరుడుడు ఇంద్రుడితో, "మాకు అపకారం చేసిన కద్రువ కొడుకులు నాకు ఆహారంగా కావాలి.")


1_2_116 కందము

భవదభిరక్ష్యము లగు నీ

భువనంబులయందు సర్పములు ద్రిమ్మరుటన్

దివిజాధిప నీ కెఱిఁగిం

పవలసె నీయాజ్ఞ నాకుఁ బడయఁగ వలసెన్.

("నీ రక్షణ ఉన్న లోకాల్లో పాములు తిరుగుతుండటం వల్ల నీ ఆజ్ఞ అవసరమైంది")


1_2_117 వచనము

అని గరుడండు దనకు నురగభోజనత్వంబు సురపతిచేతం బడసి తదనుగమ్యమానుండై యురగులయొద్దకు వచ్చి మరకతహరితంబైన కుశాస్తరణంబున నమృతకలశంబు నిలిపి యురగులకుం జూపి యిట్లనియె.

(అని గరుడుడు ఇంద్రుడి అనుమతి పొంది, అతడు తన వెనుకే రాగా, నాగుల దగ్గరకు వచ్చి, దర్భలపై అమృతమున్న పాత్రను పెట్టి, పాములతో ఇలా అన్నాడు.)


1_2_118 కందము

అనిమిషనాథ సుగుప్త మ

యిన యమృతము దెచ్చి మీకు నిచ్చితి నస్మ

జ్జననీ దాస్యము వాసెను

దినకరపవనాగ్నితుహినదీప్తుల కరిగాన్.

(మీరు అడిగిన అమృతం తెచ్చి మీకు ఇచ్చాను. సూర్యుడు, వాయువు, అగ్ని, చంద్రుడు సాక్షులుగా నా తల్లి దాసీత్వం తొలగిపోయింది.)


1_2_119 వచనము

మీరలు స్నాతాలంకృతులరై వచ్చి దీని నుపయోగింపుం డని పంచి తల్లిందన వీ పెక్కించుకొని విహగేంద్రుండురగుల కదృశ్యుండై యున్న సురేంద్రు వీడ్కొని చనియె నిట యురగులును నమృతోపయోగకుతూహలంబున నొండొరులం గడవఁ గృతస్నానాలంకృతులై చనుదెంచుటకు ముందఱ.

(స్నానం చేసివచ్చి ఇది తాగండని చెప్పి, వినతను తన వీపుపై ఎక్కించుకొని, నాగులకు కనపడకుండా ఉన్న ఇంద్రుడి దగ్గర సెలవు తీసుకొని వెళ్లిపోయాడు. పాములు స్నానం చేసి రాకముందే.)


1_2_120 కందము

అమరాధిపుఁ డమృతముఁ గొని

యమరావతి కరిగి తొంటియట్టుల సుస్థా

నమున నవిచలిత రక్షా

క్షముఁడై రక్షించుకొని సుఖస్థితి నుండెన్.

(ఇంద్రుడు ఆ అమృతాన్ని తిరిగి తీసుకొని అంతకు ముందులాగానే మంచిరక్షణ ఉన్నచోట దాన్ని ఉంచాడు.)