ఆ భా 1 2 061 to 1 2 090

వికీసోర్స్ నుండి

1_2_61 తేటగీతి

కోపితుండైన విప్రుండు ఘోరశస్త్ర

మగు మహావిషమగు నగ్నియగు నతండ

యర్చితుండైన జనులకు నభిమతార్థ

సిద్ధికరుఁడగు గురుడగుఁ జేయుఁ బ్రీతి.

("అతడు కోపగిస్తే ఆయుధం, విషం, అగ్ని అవుతాడు. అతడిని సేవిస్తే సిద్ధి కలుగజేస్తాడు.")


1_2_62 వచనము

అని బ్రాహ్మణస్వరూపంబుఁ జెప్పిన నెఱింగి వినతకు మ్రొక్కి వీడ్కొని గరుడం డతిత్వరితగతిం బఱచి సముద్రోదరంబున నున్న నిషాదుల ననేక శతసహస్రసంఖ్యలవారిని బాతాళవివరంబునుం బోని తనకంఠబిలంబుఁ దెఱచి యందఱ నొక్కపెట్ట మ్రింగిన నం దొక్కవిప్రుం డుండి కుత్తుకకు దిగక నిప్పునుంబోలె నేర్చుచున్న నెఱింగి నాకంఠబిలంబున విప్రుండున్న వాఁడేని వెలువడి వచ్చునది యనిన గరుడని కవ్విప్రుం డిట్లనియె.

(అని వినత చెప్పగా, గరుడుడు ఎగిరి వెళ్లి ఆ నిషాదులందరినీ ఒకేసారి మింగాడు. వారిలో ఒక బ్రాహ్మణుడు ఉండి, తల్లి చెప్పిన విధంగా గొంతుదిగకపోగా, గరుడుడు తన గొంతులో ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే బయటికి రావాలని పలికాడు. ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు.)


1_2_63 ఉత్పలమాల

విప్రుఁడ నున్నవాఁడ నపవిత్రనిషాది మదీయభార్య కీ

ర్తి ప్రియ దీనిఁ బెట్టి చనుదెంచుట ధర్మువె నాకు నావుడు న్

విప్రులఁ బొందియున్న యపవిత్రులుఁ బూజ్యులుగారె కావునన్

విప్రకులుండ వెల్వడుము వేగమ నీవును నీనిషాదియున్.

("నేను ఉన్నాను. కానీ నా భార్య నిషాదవనిత. ఆమెను విడిచిరావటం ధర్మం కాదు". అప్పుడు గరుడుడు ఇద్దరినీ బయటకు రమ్మన్నాడు.)


1_2_64 వచనము

అనిన నాగరుడనియనుగ్రహంబున బ్రాహ్మణుండు నిషాదీసహితుండై వెలువడి వచ్చి గరుడని దీవించి యథేచ్ఛం జనియె గరుడండును గగన పథంబునం బఱచి కశ్యపుం గని నమస్కరించి యస్మజ్జననీదాస్యనిరా సార్థం బురగుల కమృతంబుఁ దేర నరిగెద నిషాదఖాదనంబున నాఁకలి వోవకున్నయది నా కాహారంబుఁ బ్రసాదింపు మనినఁ గొడుకు కడంకకు మెచ్చి కశ్యపప్రజాపతి యిట్లనియె.

(అతడు తన భార్యతో బయటకు వచ్చి, గరుడుడిని ఆశీర్వదించి వెళ్లాడు. గరుడుడు ఆకాశమార్గాన తన తండ్రి అయిన కశ్యపుడి దగ్గరకు వెళ్లి, "నా ఆకలి ఇంకా తీరలేదు. ఇంకా ఆహారం అనుగ్రహించండి", అనగా కశ్యపబ్రహ్మ ఇలా అన్నాడు.)


-:గజకచ్ఛపముల వృత్తాంతము:-


1_2_65 కందము

అనలనిభుండు విభావసుఁ

డనువిప్రుఁడు నియమవంతుఁ డర్థాఢ్యుం డై

తనరి సుఖ మున్న నాతని

యనుజన్ముఁడు సుప్రతీకుఁ డనువాఁ డతనిన్.

(విభావసుడనే ధనవంతుడైన విప్రుని దగ్గరకు అతడి తమ్ముడైన సుప్రతీకుడనేవాడు వచ్చి.)


1_2_66 కందము

మన పితృవర్గము వడసిన ధన

ము విభాగించి యిమ్ము ధర్మస్థితి నా

కని యడుగం బోయిన నయ్య

నుజునకు విభావసుం డహంకారమునన్.

(మన తండ్రితాతల సంపదను ధర్మం ప్రకారం పంచుకుందామనగా విభావసుడు గర్వంతో.)


1_2_67 కందము

తా నలిగి యిచ్చె శాపం

బేనుఁగవై యుండు మని సహింపక వాఁడున్

మానుగఁ గూర్మమ వగు మని

వానికిఁ బ్రతిశాప మిచ్చె వసులోభమునన్.

(తమ్ముడిని ఏనుగువు కమ్మని శపించాడు. అప్పుడు సుప్రతీకుడు అన్నను తాబేలువు కమ్మని శపించాడు.)


1_2_68 వచనము

ఇట్లన్నయుందమ్ముండును నన్నోన్య శాపంబులం జేసి యోజనత్రయోత్సేధంబు గలిగి దశయోజనవృత్తం బైన కూర్మంబును షడ్యోజనోత్సేధంబు గలిగి ద్వాదశయోజనవిస్తృతంబైన గజంబును నై సరోవరవిపినంబుల నుండి యర్థనిమిత్తం బైన పూర్వవైరంబునఁ దమలో నిత్యంబు నొండొండితోడం బెనంగి పోరుచుండునవి నీ కాహారంబుసు మ్మరుగుము కార్యసిద్ధి యయ్యెడు మనిన గరుడండును మనోవేగంబునం బఱచి యా రెంటినిం గాంచి.

(వారు ఆ రూపాలలోకి మారి ఇంకా పోట్లాడుకుంటున్నారు. వెళ్లి వారిని తినమని కశ్యపుడు చెప్పాడు. అప్పుడు గరుడుడు ఎగిరివెళ్లి ఆ రెండింటినీ చూసి.)


1_2_69 కందము

చఱచి యొకచేతఁ గూర్మముఁ

బెఱచేత గజంబుఁ బట్టి పెనఁచి ఖగేంద్రుం

డిఱికికొని గగనవీథిం

బఱచె వియచ్చరవిమానపంక్తులు దూలన్.

(ఒక కాలితో ఏనుగును, ఇంకొక కాలితో తాబేటిని పట్టుకొని ఆకాశంలోకి ఎగిరాడు.)


1_2_70 కందము

కనక వ్రతతీవితతులఁ

బెనఁగిన సురభూరుహములఁ బెద్దయు బెడఁ గై

తనరిన యలంబతీర్థం

బున కరిగె నగంబు లొక్కమొగి గ్రక్కదలన్.

(అలంబం అనే అందమైన తీర్థానికి వెళ్లగా అక్కడి కొండలు ఒక్కసారిగా కదిలిపోయాయి.)


1_2_71 వచనము

అందు రోహిణంబను పాదపోత్తమంబు గరుడనిం గని సంభావించి శత యోజనాయతంబైన మదీయశాఖాపై నుండి యిగ్గజకచ్ఛపంబుల భక్షించి పొమ్మనిన గరుడండు నట్ల చేయుదునని యమ్మహాశాఖపై నూఁద సమ కట్టి యందు.

(అక్కడ రోహిణం అనే చెట్టు గరుడుడిని గౌరవించి తన కొమ్మపై నిలిచి ఆ ఏనుగును, తాబేటిని తిని వెళ్లమన్నది.)


1_2_72 కందము

పాదంబులు పెట్టుడుఁ ద

త్పాదపఘనశాఖ విఱిఁగి బల్లన నుచ్చై

ర్నాదమున దిక్కు లద్రువఁగ

భేదిల్లె విహంగతతులు భీతిం బఱవన్.

(గరుడుడు అలాగేనని ఆ చెట్టుకొమ్మపై వాలగా, అది పెద్దశబ్దంతో విరిగిపోయింది.)


1_2_73 వచనము

అమ్మహాశాఖ నవలంబించి తలక్రిందై యాదిత్యకిరణంబులు తమ కాహా రంబుగాఁ దపంబు సేయుచున్న వాలఖిల్యమహామునిగణంబులం జూచి యిది భూమిపయిం బడిన నిమ్మునులకు బాధ యగు నని దానిం గఱచికొని గజకచ్ఛపంబులం గరంబుల నిఱికికొని గరుడండు గగనంబునం బఱచి తనకు నూఁద నిమ్మగుప్రదేశం బెందునుం గానక గంధమాదనంబునకుం జని యందుఁ దపంబు సేయుచున్న కశ్యపులం గనుంగొని మ్రొక్కిన.

(ఆ కొమ్మ కిందపడితే, దానికి తలకిందులుగా వేలాడుతూ సూర్యుడి కిరణాలే భోజనంగా తపస్సు చేస్తున్న వాలఖిల్యులనే మునులకు బాధకలుగుతుందని నోటితో ఆ కొమ్మను, కాళ్లతో ఆ అన్నదమ్ములను పట్టుకొని, ఆకాశంలోకి ఎగిరి, వాలడానికి సరైన చోటు ఎక్కడా కనపడక, గంధమాదనపర్వతం దగ్గరకు వెళ్లి, అక్కడ తపస్సు చేస్తున్న కశ్యపుడిని చూసి నమస్కరించాడు.)


1_2_74 చంపకమాల

కనకమహీధర ప్రతిమకాయు మహాజవనిర్జితప్రభం

జను నవిచింత్యభూరిబలసత్త్వసమన్వితు దీప్తహవ్యవా

హనసము వైనతేయునిఁ దదాస్యగతద్రుమశాఖ నున్న య

త్యనఘుల వాలఖిల్యులను నమ్మునినాథుఁడు జూచి నెమ్మితోన్.

(కశ్యపుడు వారిని చూసి.)


1_2_75 వచనము

ఇగ్గరుడండు భువనగహితమహారంభుండు మీకు బాధ యగు నని యిత్తరు శాఖ విడువ నేరకున్నవాఁడు వీనిం గరుణించి మీ రొండుకడ కరుగుం డనిన వాలఖిల్యులు కశ్యపుప్రార్థనం జేసి దాని విడిచి హిమవంతంబున కుం జనిరి గరుడండును ముఖనిక్షిప్తశాఖాస్థలితవచనుం డగుచుఁ దండ్రికిట్లనియె.

("గరుత్మంతుడు మీకు బాధకలుగుతుందని మీరున్న కొమ్మని విడువలేకున్నాడు.వీడిని అనుగ్రహించి వేరే చోటికి వెళ్లండి", అనగా ఆ వాలఖిల్యులు కొమ్మని విడిచి హిమాలయాలకు వెళ్లారు. గరుడుడు కశ్యపుడితో.)


1_2_76 కందము

ధరణీసురవిరహిత మగు

నరణ్యదేశంబు నాకు నానతియిం డి

త్తరుశాఖ విడువవలయును

గరము నిరోధ మిది యనినఁ గశ్యపుఁ డనియెన్.

("ఈ కొమ్మను విడిచిపెట్టటానికి ఒక అడవిప్రాంతాన్ని నాకు తెలియజేయండి", అనగా కశ్యపుడు ఇలా అన్నాడు.)


1_2_77 కందము

హిమశైలకందరాభా

గము కడ నిష్పురుషనగము గల దచ్చో నీ

ద్రుమశాఖ విడువు మది దా

నమానుష మగమ్య మీశ్వరాదులకైనన్.

("హిమాలయాల్లో నిష్పురుషం అని ఒక కొండ ఉంది. అక్కడ విడిచిపెట్టు")


1_2_78 వచనము

అది యిచ్చటికి లక్షయోజనంబులు గల దరుగు మనిన గరుడండును మనో వేగంబునం బఱచి యా నిష్పురుషనగంబునం దత్తరుశాఖ విడిచి హిమ వంతంబు మీఁదికిం బోయి గజకచ్ఛపంబుల భక్షించి మహాసత్త్వనంపన్నుండై నాకలోకంబున కెగయ సమకట్టి పక్షవిక్షేపంబుఁ జేసిన.

("అది ఈ గంధమాదనపర్వతానికి లక్షయోజనాల దూరంలో ఉంది". గరుడుడు అక్కడికి వెళ్లి కొమ్మను విడిచి, హిమాచలం మీదికి పోయి ఏనుగును, తాబేటిని తిని, బలం పొంది, స్వర్గానికి ఎగరడానికి సిద్ధమయ్యాడు.)


-:గరుడం డమృతహరణార్థం బెగయుట:-


1_2_79 కందము

ఘనపక్షానిలచలితా

వనిరుహములవలనఁ దొరఁగ వరపుష్పచయం

బనిమిషజయార్థ మరిగెడు

వినతాసుతుమీఁదఁ బుష్పవృష్టియ పోలెన్.

(అతడి రెక్కలనుండి పుట్టే గాలివల్ల కదిలిన చెట్లనుండి పూలు గరుత్మంతుడిపై పూలవానలా కురిశాయి.)


1_2_80 వచనము

ఇ ట్లమృతహరణార్థంబు గరుడండు గగనంబున కెగసిన నట దేవలోకంబునందు.

(ఇలా అతడు ఎగరగా, అక్కడ దేవలోకంలో.)


1_2_81 మాలిని

సురపతిసభఁ జూడంజూడ నంగారవృష్టుల్

గురిసెఁ గులిశధారల్ గుంఠితం బయ్యె దిక్కుం

జరమదము లడంగెన్ సర్వదిక్పాలకాంతః

కరణములు భయోద్వేగంబునన్ సంచలించెన్.

(ఇంద్రసభలో నిప్పులవర్షం కురిసింది, వజ్రాయుధం బండబారింది, దిగ్గజాల గర్వం అణగారింది, దిక్పాలకులు భయపడ్డారు.)


1_2_82 వచనము

ఇట్టి మహోత్పాతంబులు పుట్టిన సురపతి బృహస్పతిం జూచి యిది యేమి నిమిత్తం బని యడిగిన దాని నెఱింగి బృహస్పతి సురపతి కిట్లనియె.

(ఈ ఉత్పాతాలకు కారణమేమిటని ఇంద్రుడు బృహస్పతిని అడిగాడు. అప్పుడు బృహస్పతి ఇలా చెప్పాడు.)


1_2_83 సీసము

బ్రహ్మణ్యుఁ డగు కశ్యపబ్రహ్మవరమున

వినతకుఁ బుట్టిన యనఘమూర్తి

వాలఖిల్యులదయ వరపక్షికులమున

కింద్రుడై పరగిన యిద్ధతేజుఁ

డుదధిలో నున్న యత్యుగ్రనిషాదుల

నారంగ మ్రింగిన ఘోరవీరుఁ

డిభకచ్ఛపముల రోహిణశాఖతో నెత్తి

కొని దివిఁ బఱచిన యనిలవేగి


తేటగీతి

వీఁగి తనతల్లిదాస్యంబు నీఁగబూని

తడయ కమృతంబు గొనిపోవఁ గడఁగి వచ్చెఁ

గామరూపసంపన్నుండు గామగమనుఁ

డతఁడు నీకు నసాధ్యుండు శతమఖుండ.


-:వాలఖిల్యుల వృత్తాంతము:-


1_2_84 వచనము

అగ్గరుడని మాహాత్మ్యంబు నీవు నెఱుంగుదు వది యెట్లనినఁ దొల్లి కశ్యపప్రజాపతి పుత్రార్థియై భవత్ప్రభృతులైన దేవగణంబులను వాలఖిల్య ప్రముఖులైన మహామునిగణంబులను దనకు సహాయులనుగాఁ బడసి పుత్త్రకామేష్టి సేయు నాఁడు నీవు నీబలంబునకుం దగిన యిధ్మభారంబు మోచికొని యశ్రమంబున వచ్చువాఁడవై యల్పకుశపలాశేధ్మభారంబులు మోచికొని వడవడ వడంకుచు వచ్చువారి నల్పసత్త్వుల నంగుష్ఠప్రమాణ దేహుల ననవరతోపవాసకృశీభూతశరీరుల వాలఖిల్య మహామునులం జూచి నగిన నమ్మునులు సిగ్గువడి కడు నలిగి.

("అతడి గొప్పతనం నీకు కూడా తెలుసు. ఎలాగంటే, పూర్వం కశ్యపుడి పుత్రకామేష్టి యాగానికి అందరూ సహాయం చేసేటప్పుడు, నువ్వు నీ బలానికి తగిన సమిధల మోపును సునాయాసంగా మోస్తూ, చిన్నమోపులను కూడా కష్టపడి మోస్తున్న బలహీనులైన, బొటనవేలంతటి చిన్నదేహాలు గల వాలఖిల్యులను చూసి నవ్వావు. అప్పుడు వాళ్లు సిగ్గుపడి, కోపంతో.")


1_2_85 కందము

రణవిజయుఁ డనలతేజుం

డణిమాదిగుణాఢ్యుఁ డుదితుఁ డయ్యెడు వీరా

గ్రణి శతమఖుకంటెను శత

గుణవీర్యుం డైన పుత్త్రకుం డజితుండై.

("ఇంద్రుడికంటే వందరెట్లు బలవంతుడు, అజేయుడు పుడతాడు")


1_2_86 వచనము

వాఁడు రెండవయింద్రుం డయ్యెడు మని మహావీర్యవంతంబులైన మంత్రంబుల వేల్చుచున్నంత నంతయు నెఱింగి నీవు కశ్యపు పాలికిం బోయి నాకుం గరుణింపుమని ప్రార్థించినఁ గశ్యపుప్రజాపతి యమ్మునుల కిట్లనియె.

("పుట్టి రెండో ఇంద్రుడు అవుతాడు, అని శక్తిగల మంత్రాలతో హోమం చేస్తుండగా నువ్వు కశ్యపుడిని వేడుకున్నావు. కశ్యపుడు వాలఖిల్యులతో.")


1_2_87 ఉత్పలమాల

ఉండు నితండు పద్మజునియోగమునం ద్రిజగంబులందు నిం

ద్రుం డయి భూతరాశిఁ దనదోర్బలశక్తిఁ గడంగి కాచుచున్

రెండవయింద్రుఁడైన విపరీత మగున్ భువనప్రవృత్తి మీ

రొండువిధంబు సేయు టిది యుక్తమె బ్రహ్మనియుక్తి యుండఁగన్.

("రెండో ఇంద్రుడు ఉంటే లోకవ్యవహారం తారుమారవుతుంది, బ్రహ్మనియమాన్ని కాదని మీరిలా చేయడం తగదు.")


1_2_88 వచనము

మీవచనం బమోఘంబు గావున నింక నాకు నుద్భవిల్లెడు పుత్త్రుండు పక్షికులంబున కెల్ల నింద్రుం డయ్యెడు మని కశ్యపుండు వారల నొడంబఱిచి నీయింద్రత్వం బేకాధిష్ఠితంబు సేసెనట్టి కశ్యపప్రజాప్రతి యజ్ఞమహిమను వాలఖిల్యుల తపోమహిమను వినతకుం బుట్టి విహగేంద్రుండైన యాగరుడండిప్పుడమృతహరణార్థం బరుగుదెంచుటం జేసి స్వర్గలోకంబున మహోత్పాతంబులు పుట్టెనని సురపతికి బృహస్పతి చెప్పిన విని యింద్రుం డమృత రక్షకులనెల్ల రావించి మీర లతిప్రయత్నంబున నమృతంబు రక్షించుకొని యుండుండని పంచిన వల్లెయని.

("అని, వారి వాక్కు వ్యర్థం కాదు కాబట్టి, పుట్టబోయేవాడు పక్షిజాతికి ఇంద్రుడయేలా వాలఖిల్యులను అంగీకరింపజేశాడు. అలాంటి గరుత్మంతుడు ఇప్పుడు అమృతం కోసం వస్తున్నాడు", అని వివరించగా ఇంద్రుడు అమృతాన్ని రక్షించేవారిని పిలిపించి చాలా జాగ్రత్తగా అమృతాన్ని కాపాడమని చెప్పి పంపాడు.)


1_2_89 కందము

వారలు బహుప్రకారా

కారులు వీరులు నిశాతఖడ్గాదిమహా

దారుణశస్త్రధరులు

కృష్ణారుణసితపీతఘనతరాంగత్రాణుల్.

(వారు రకరకాల ఆకారాలూ, ఆయుధాలూ గల వీరులు.)


1_2_90 కందము

సమకట్టి యొక్కమొగి న

ప్రమాదులై నిలిచి రేయుఁబవలును రక్షా

క్షములై యమృతము చుట్టును

నమేయబలు లుండి రంత నతిరభసమునన్.

(అమృతం చుట్టూ వారు కావలి ఉండగా అంతలో ప్రచండమైన వేగంతో.)