Jump to content

ఆ భా 1 2 001 to 1 2 030

వికీసోర్స్ నుండి

ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము


1_2_1

శ్రీవనితావల్లభ వేం

గీవిషయాధీశ కావ్యగీతప్రియ నా

నావనినాథ కిరీటత

టీవిలసద్రత్నసంఘటితపదకమలా.

(వేంగీదేశరాజా! రాజరాజనరేంద్రా!)


-:కద్రూవినతలు పుత్త్ర్రులం గోరి పడయుట:-


1_2_2 వచనము

ఆక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె నాదియుగంబునం గశ్యప ప్రజాపతి భార్యలైన కద్రువయు వినతయు ననువారలు పుత్త్రార్థినులై యనేకసహస్రవర్షంబులు కశ్యపునారాధించినం గశ్యపుండును బ్రసన్నుండై మీ కోరిన వరంబు లిచ్చెద వేఁడుం డనిన.

(ఆ కథకుడు శౌనకాదిమునులకు ఇలా చెప్పాడు. కృతయుగంలో కశ్యపప్రజాపతి భార్యలైన కద్రువ, వినతలు పుత్రులకోసం చాలాకాలం కశ్యపుడిని ఆరాధించగా, అతడు ప్రసన్నుడై మీరు కోరిన వరాలు ఇస్తాను కోరుకొమ్మనగా.)


1_2_3 తరలము

అనలతేజులు దీర్ఘదేహులు నైనయట్టి తనూజులన్

వినుతసత్త్వులఁ గోరెఁ గద్రువ వేవురం గడువేడ్కతో

వినత గోరె సుపుత్త్రులన్ భుజవీర్యవంతుల వారి కం

టెను బలాధికులైనవారిఁ గడింది వీరుల నిద్దఱన్.

(కద్రువ గొప్పవారైన వెయ్యిమంది కుమారులను కోరుకోగా, వినత వారికంటే బలవంతులైన ఇద్దరు పుత్రులను కోరింది.)


1_2_4 వచనము

కశ్యపప్రజాపతి తొల్లి పెద్దకాలంబు తపంబు సేసి పుత్త్రకామేష్టిఁ జేసెఁ గావునఁ గద్రువకు వేవురు కొడుకులను వినతకు నిద్దఱు కొడుకులను వారి కోరినయట్ల యిచ్చి గర్భంబు లిమ్ముగా రక్షింపంబనిచిన నయ్యిద్దఱును దద్దయు సంతసిల్లి యున్నంత గర్భంబులు గొండొక కాలంబునకు నండంబు లైన నయ్యండంబులు ఘృతకుండంబులం బెట్టి రక్షించుచున్నంత నేనూఱేం డ్లకుఁ గద్రూగర్భాండంబులు తరతరంబ యవిసిన నందు శేష వాసు క్యైరా వత తక్షక కర్కోటక ధనంజయ కాళియ మణినాగాపూరణ పింజర కైలా పుత్త్రవామన నీలానీల కల్మాష శబలార్య కోగ్రక కలశపోతక సురాముఖ దధిముఖ విమలపిండ కాప్త కరోటక శంఖ వాలిశిఖ నిష్ఠానక హేమగుహ నహుష పింగళ బాహ్యకర్ణ హస్తిపద ముద్గరపిండక కంబ లాశ్వతర కాళీ యక వృత్తసంవర్తక పద్మ శంఖముఖ కూష్మాండక క్షేమక పిండారక కర వీర పుష్పదంష్ట్ర బిల్వక బిల్వపాండర మూషకాద శంఖశిరఃపూర్ణభద్ర హరిద్ర కాపరాజిత జ్యోతిక శ్రీవహ కౌరవ్య ధృతరాష్ట్ర శంఖ పిండ వీర్యవ ద్విరజస్సుబాహు శాలిపిండ హస్తిపిండ పిఠరక సుముఖ కౌణపాశన కుఠర కుంజర ప్రభాకర కుముద కుముదాక్ష తిత్తిరి హలిక కర్దమ బహు మూలక కర్క రాకర్కర కుండోదర మహోదరు లాదిగాఁగల వేవురు నాగముఖ్యులు పుట్టిన.

(కశ్యపుడు పుత్రకామేష్టియాగం చేసి వారు కోరిన విధంగా పుత్రులను అనుగ్రహించి గర్భాలను కాపాడమని చెప్పగా అవి తరువాత అండాలుగా మారాయి. కొంతకాలానికి కద్రువకు శేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైన వెయ్యిమంది నాగముఖ్యులు పుట్టారు.)


-:అనూరుఁడు జనించి వినతకు శాప మిచ్చుట:-


1_2_5 కందము

తన గర్భాండంబుల రెం

టను బ్రియనందనులు వెలువడమి నతిలజ్జా

వనత యయి వినత పుత్త్రా

ర్థిని యొక యండంబు విగతధృతి నవియించెన్.

(తన గర్భంనుండి పుట్టిన అండాలు రెండింటినుంచీ పుత్రులు జన్మించకపోవటం వల్ల వినత సిగ్గుతో క్రుంగి, ధైర్యం కోల్పోయి, పుత్రుల కోసం ఒక గుడ్డును పగులగొట్టింది.)


1_2_6 కందము

దాన నపరార్ధకాయ వి

హీనుఁడు పూర్వార్ధతనుసహితుఁ డరుణుఁ డనం

గా నుదయించె సుతుండు మ

హానీతియుతుండు తల్లి కప్రియ మెసఁగన్.

(అప్పుడు దేహంలో కింది సగభాగం లేకుండా అరుణుడనే పేరుగల మహానీతిపరుడైన పుత్రుడు జన్మించాడు.)


1_2_7 వచనము

ఇట్లు వికలాంగుండై పుట్టిన యనూరుండు వినతకు నలిగి నన్ను సంపూర్ణశరీ రుం గానీక యండం బవియించిన యవినీతవు కావున నీవు నీ సవతికి దాసివై యేనూఱేం డ్లుండుమని శాపం బిచ్చి యింక నీ రెండవ యండంబు తనకుఁదాన యవియునంతకు నుండ ని మ్మిందుఁ బుట్టెడు పుత్త్రుండు మహాబలపరాక్రమ సంపన్నుండు నీదాసీత్వంబు వాపు నని చెప్పి సూర్యరథసూతుండయి యరిగె వినతయు నయ్యండం బతిప్రయత్నంబున రక్షించుకొని యుండె నంత.

(ఇలా వికలాంగుడిగా పుట్టిన అనూరుడు వినతపై కోపగించుకుని, ‘నాకు సంపూర్ణశరీరం కలిగేంతవరకూ ఆగకుండా అండాన్ని పగులగొట్టిన నీతిలేనిదానివి కాబట్టి నీ సవతికి దాసిగా ఉండు’, అని శపించి, ‘ఈ రెండవ గుడ్డు నుండి పుట్టేవాడు మహాబలవంతుడు. నీ దాసీత్వాన్ని పోగొడతాడు’, అని తెలిపి సూర్యుడికి రథసారథిగా వెళ్లిపోయాడు. వినత కూడా ఆ రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండింది. )


-:దేవాసురు లమృతమును బడయఁగోరి సముద్రమును మథించుట:-


1_2_8 కందము

అమరాసురవీరులు ము

న్నమలపయోరాశిఁ ద్రచ్చి యమృతము వడయన్

సమకట్టి సురేంద్రపురో

గములై హరిహరహిరణ్యగర్భులతోడన్.

(పూర్వం దేవాసురులు పాలసముద్రాన్ని మథించి అమృతాన్ని పొందగోరి, ఇంద్రుడిని ముందుంచుకొని విష్ణుశంకరబ్రహ్మలతో.)


1_2_9 ఉత్పలమాల

మేరుమహామహీధరముమీఁదికి నందఱుఁ బోయి యేక్రియన్

వారిధిఁ ద్రచ్చువారము ధ్రువంబుగ దానికిఁ గవ్వమెద్ది యా

ధారము దాని కెద్ది యని తద్దయు వెన్బడి యున్న నచ్యుతాం

భోరుహగర్భులిద్దఱును బూనిరి సర్వము నిర్వహింపఁగన్.

(మేరుపర్వతం మీదికి అందరూ వెళ్లి, "సముద్రాన్ని మథించటం ఎలా? అందుకు స్థిరమైన కవ్వమేది? ఆ కవ్వానికి తగిన ఆధారమేది?", అని చింతించి వెనుకాడుతుండగా బ్రహ్మవిష్ణువులు ఆ కార్యాన్నంతా నిర్వహించటానికి పూనుకున్నారు.)


1_2_10 చంపకమాల

అరుదుగ సర్వశైలములయంత తనర్పును నార్జవంబు సు

స్థిరతయు నోషధీరసవిషశేషతయం గల దుత్తమంబు మం

థరకుధరంబు గవ్వ మగు దానికి నంచును నిశ్చయించి య

య్యిరువురుఁ బంపఁగాఁ బెఱికి యెత్తె ననంతుఁడు తద్గిరీంద్రమున్.

(గొప్పదైన మంథరపర్వతం ఈ మథనానికి తగిన కవ్వమౌతుందని బ్రహ్మవిష్ణువులు నిర్ణయించి శేషుడిని ఆజ్ఞాపించగా అతడు ఆ పర్వతాన్ని పెళ్లగించి పైకెత్తాడు.)


1_2_11 వచనము

ఇట్లు పదునొకండు వేల యోజనంబుల తనర్పును నంతియు పాఁతునుం గల మంథరనగం బనంతుం డనంత శక్తిం బెఱికి యెత్తిన నందఱును నప్పర్వ తంబు దెచ్చి సముద్రంబులో వైచి దానిక్రింద నాధారంబుగాఁ గూర్మరాజు నియమించి యోక్త్రంబుగా వాసుకి నమర్చి.

(ఆ మంథరపర్వతాన్ని దేవాసురులు సముద్రంలో వేసి, దానికి ఆధారంగా ఆదికూర్మం ఉండగా, కవ్వపు తాడుగా వాసుకిని ఏర్పాటుచేసి.)


1_2_12 శార్దూలము

క్షోణీచక్రభరంబు గ్రక్కదల దిక్కుల్ మ్రోయఁగా నార్చియ

క్షీణోత్సాహసమేతులై రయమునన్ గీర్వాణులుం బూర్వగీ

ర్వాణవ్రాతము నబ్ధిఁ ద్రచ్చునెడఁ దద్వ్యాకృష్టనాగానన

శ్రేణీ ప్రోత్థవిషాగ్నిధూమవితతుల్ సేసెం బయోదావలిన్.

(భూమి కదిలిపోయేలా, దిక్కులు ప్రతిధ్వనించేలా కేకలు వేస్తూ దేవాసురులు సముద్రాన్ని మథించేటప్పుడు వాసుకి ముఖాలనుండి వెలువడే విషాగ్ని పొగలమేఘాల్ని సృష్టించింది.)


1_2_13 కందము

ఉరగపతి తలలవల నురు

తరజవమున నసురు లూఁది తత్పుచ్ఛము ని

ర్జరవరు లూఁది మహామ

త్సరమున వడిఁ ద్రచ్చి త్రచ్చి జవమఱియున్నన్.

(వారు మథించి మథించి అలసిపోగా.)


1_2_14 కందము

నారాయణుండు వారిక

వారిత జవసత్త్వములు ధ్రువంబుగ నిచ్చెన్

వారును దొల్లిటికంటెన

పార ప్రారంభులై రపరిమితశక్తిన్.

(విష్ణువు వారికి స్థిరమైన శక్తిని ప్రసాదించాడు.)


1_2_15 చంపకమాల

ఉడుగక యొండొరుం జఱచి యొక్క బలంబున దేవదానవుల్

వడిగొని వార్ధి నిట్లు దరువం దరువున్ విష ముద్భవిల్లి నల్

గడలను విస్ఫులింగములు గప్పఁగఁ బర్విన దానిఁ జెచ్చెరన్

మృడుఁడు గడంగి పట్టుకొని మ్రింగి గళంబున నిల్పెఁ బొల్పుగన్.

(ఆ మథనంలో ఒక భయంకరమైన విషం నలుదిక్కులా అగ్నికణాలు వెదజల్లుతూ ఉద్భవించగా దాన్ని శివుడు తన కంఠంలో పొందికగా నిలిపాడు.)


1_2_16 వచనము

మఱియు జ్యేష్ఠయుఁ జంద్రుండును శ్రీయును నుచ్చైశ్శ్రవంబును గౌస్తు భంబును నైరావణగజంబును నమృతపూర్ణశ్వేతకమండలుధరుం డైన ధన్వంతరియు నాదిగా ననేకంబు లుద్భవిల్లిన నందుఁ ద్రిభువనవంద్య యయిన శ్రీదేవియు నిజప్రభాపటలపర్యుదస్త ప్రభాకరగభస్తి విస్తరంబయిన కౌస్తుభంబును నారాయణువక్షస్స్థలంబున విలసిల్లె. నుచ్చైశ్శ్రవంబను యుగ్యంబు నైరావణ గజంబును సురరాజయోగ్యంబు లయ్యె నంత నయ్య మృతంబు నసురులు చేకొనిన.

(ఇంకా, జ్యేష్ఠాదేవి, చంద్రుడు, ఉచ్చైశ్రవం, కౌస్తుభమణి, అమృతంతో నిండిన కమండలంతో ధన్వంతరి, ఐరావణం మొదలైనవి పుట్టగా లక్ష్మీదేవినీ, కౌస్తుభాన్నీ విష్ణువు తన వక్షఃస్థలంలో నిలుపుకున్నాడు. ఉచ్చైశ్రవాన్నీ, ఐరావణాన్నీ ఇంద్రుడు స్వీకరించాడు. అప్పుడు రాక్షసులు అమృతాన్ని తీసుకోగా.)


1_2_17 కందము

నారాయణుండు కృత్రిమ

నారీరూపమునఁ తన్మనంబుల కతి మో

హారంభకారుఁడై యమ

రారులచేఁ గ్రమ్మఱంగ నమృతము గొనియెన్.

(అప్పుడు విష్ణువు మోహినీరూపం ధరించి, రాక్షసులకు మోహం కలిగించి, వారి నుండి అమృతాన్ని గ్రహించాడు.)


1_2_18 వచనము

ఇట్లుపాయంబున నసురుల వంచించి యమృతంబుగొని విష్ణుదేవుండు దేవ తల కిచ్చిన నయ్యమృతంబు దేవత లుపయోగించుచో దేవరూపంబు దాల్చి రాహువు వేల్పులబంతి నయ్యమృతం బుపయోగించుచున్నఁ దత్సమీపంబున నన్ను చంద్రాదిత్యులు వాని నెఱింగి నారాయణునకుం జెప్పిన నయ్యమృతంబు వాని కంఠబిలంబు సొరకముందఱ.

(ఇలా అసురులను వంచించి విష్ణువు అమృతాన్ని దేవతలకివ్వగా వారు దాన్ని తాగేటప్పుడు రాహువు దేవతారూపంలో అది తాగబోగా సూర్యచంద్రులు గుర్తించి విష్ణువుకు చెప్పారు. విష్ణువు ఆ అమృతం రాహువు గొంతులోకి దిగకముందే.)


1_2_19 కందము

అమరారి మర్దనుఁడు

చక్రము గ్రక్కున నేయ రాహుకంఠము దెగి దే

హము ధరణిఁ బడియెఁ దన్ముఖ

మమృత స్పర్శమున నక్షయంబై నిలిచెన్.

(విష్ణువు తన చక్రాన్ని ప్రయోగించగా రాహువు కంఠం తెగి దేహం నేల మీద పడింది. తల మాత్రం అమృతస్పర్శ వల్ల అక్షయమై నిలిచింది.)


1_2_20 వచనము

నాఁ టంగోలె రాహువునకుఁ జంద్రాదిత్యులతోడి విరోధంబు శాశ్వతంబయి ప్రవర్తిల్లుచుండె.

(అప్పటినుండి రాహువుకు సూర్యచంద్రులతో విరోధం శాశ్వతంగా సాగుతూంది.)


-:దేవదానవుల యుద్ధము:-


1_2_21 సీసము

అంత దేవాహితు లమృతంబు గానక

యెంతయు నలిగి బలీంద్రుఁ గూడి

మంతనం బుండి యమర్త్యులతోడి పొ

త్తింతియ చాలు నింకేల యనుచు

సంతనకట్టి యుత్సాహ సమేతులై

యంతంబు లేని రథాశ్వములను

దంతుల నమితపదాతుల నొడఁ గూర్చి

యంతకాకారులై యార్చి యమర


ఆటవెలది

వరులఁ దాఁకి యేసి రురుతరశరపక్ష

జాతవాతరయవిధూత మగుచుఁ

జెదర జలదపంక్తి బెదర వజ్రాయుధు

హృదయ ముదిలకొనఁగఁ ద్రిదశగణము.


(అప్పుడు రాక్షసులు కోపగించి, తమరాజైన బలిచక్రవర్తిని కలిసి, ఆలోచించి, దేవతలతో స్నేహం ఇక చాలని నిశ్చయించి, చాలా సైన్యం సమకూర్చుకొని, ఇంద్రుడు భయపడేలా దేవతలపైన ఆయుధాలు ప్రయోగించారు.)


1_2_22 మహాస్రగ్ధర

అమరేంద్రారాతు లిట్లాహవముఖమున నేయంగఁ దత్తీక్ష్ణబాణౌ

ఘము ఘోరంబై సురానీకము పయిఁ బెలుచం గప్పినం జూచి దైత్యో

త్తములం గోదండ చక్రోద్యతభుజులు మహాదారుణుల్ వీరలక్ష్మీ

రమణుల్ దుర్వారవాత్యారమున నరనారాయణుల్ దాఁకి రల్కన్.


(రాక్షసులు ఇలా బాణాలు ప్రయోగించటం చూసి గాండీవంతో నరుడు, చక్రంతో నారాయణుడు అసురులను పెనుగాలి వేగంతో ముట్టడించారు.)

1_2_23 మత్తేభము

నరచాపప్రవిముక్తదారుణబృహన్నారాచధారల్ భయం

కరదైరేయనికాయకాయములపైఁ గప్పెన్ దిశల్ నిండ బం

ధురధాత్రీధరతుంగ శృంగతటసందోహంబుపైఁ గప్పు దు

ర్ధరధారాధరముక్తసంతతపయోధారావళిం బోలుచున్.


(నరుని ధనుస్సునుండి వచ్చే బాణాలు మేఘాలనుండి కురిసే దట్టమైన నీటిధారల్లా రాక్షసుల శరీరాలను కప్పాయి.)


1_2_24 మత్తేభము

పతదుర్వీధరధాతునిర్ఘ రజలాభంబై మహాదేహని

ర్గతసాంద్రారుణపూర మొక్కమొగి నొల్కం ద్రెస్సి నారాయణో

న్నతదోర్దండ విముక్త చక్రనిహతిన్ నాకద్విషన్మ స్తక

ప్రతతుల్ ఘారరణంబునం బడియె భూభాగంబు గంపింపఁగన్.


(రాక్షసుల దేహాలనుండి రక్తం ఎడతెగకుండా ప్రవహిస్తుండగా, నారాయణుని చక్రం వల్ల వారి తలలు తెగి, భూమి కంపించేలా, యుద్ధరంగంలో పడ్డాయి.)


1_2_25 వచనము

ఇట్లు సముద్రతీరంబున నమరాసురులకు నతిఘోరయుద్ధం బయ్యె నందు నరనారాయణు లపారపరాక్రములైయసురవీరులఁ బెక్కండ్ర జంపిన నుక్కడంగి దెసచెడి యసురులు సముద్రంబు సొచ్చిన నమరులు సమరలబ్ధ విజయులై యమరపతి నమృతరక్షణార్థంబు ప్రార్థించి యథాస్థానంబున మంథరనగంబుఁ బ్రతిష్ఠాపించి తమతమ నివాసంబులకుం జని సుఖంబుండి రంత.

(ఇలా సముద్రతీరంలో జరిగిన పోరాటంలో నరనారాయణుల పరాక్రమం వల్ల రాక్షసులు చెల్లాచెదురై, దిక్కులేక సముద్రంలో ప్రవేశించారు. దేవతలు యుద్ధంలో గెలిచి, అమృతాన్ని రక్షించటంకోసం ఇంద్రుడిని ప్రార్థించి, మంథరపర్వతాన్ని అంతకు ముందుండే చోట మళ్లీ నిలిపి, వారి వారి నివాసాలకి వెళ్లి సుఖంగా ఉన్నారు.)


-:కద్రూవినత లుచ్చైశ్శ్రవమును జూచి పందెములు సఱచుట:-


1_2_26 కందము

అమృతముతో నుద్భవమై

యమరేశ్వరయోగ్యమైన హయరత్నము త

ద్విమలోదధి తీరంబునఁ

గొమరుఁగ నేకతమ యిచ్చఁ గ్రుమ్మరుచున్నన్.

(అమృతంతో పాటు ఉద్భవించిన ఉచ్చైశ్శ్రవం ఆ పాలసముద్రం ఒడ్డున ఒంటరిగా తిరుగుతుండగా.)


1_2_27 వచనము

కద్రువయు వినతయు వినోదార్థంబు విహరించువారు కరిమకరనికరాఘాతజాత వాతోద్ధూతతుంగతరంగాగ్రసముచ్చలజ్జలకణాసారచ్ఛటాచ్ఛాదిత గగనతలంబైనదాని నుద్యానవనంబునుంబోలె బహువిద్రుమలతాలంకృతంబైనదాని నాటకప్రయోగంబునుంబోలె ఘనరసపాత్రశోభితరంగరమ్యంబైనదాని దివంబునుం బోలె నహిమకరభరితంబైన దాని మఱియు.

(కద్రూవినతలు అక్కడ విహరిస్తూ సుందరమైనదీ.)


1_2_28 చంపకమాల

అలఘుఫణీంద్రలోకకుహరాంతరదీప్తమణిస్ఫురత్ప్రభా

వలి గలదాని శశ్వదుదవాసమహావ్రతశీతపీడితా

చలమునిసౌఖ్యహేతువిలసద్బడబాగ్ని శిఖాచయంబులన్

వెలుఁగెడుదానిఁ గాంచి రరవిందనిభానన లమ్మహోదధిన్.

(ప్రకాశించేదీ అయిన ఆ మహాసముద్రాన్ని చూశారు.)


1_2_29 మత్తేభము

వివిధోత్తుంగతరంగఘట్టితచలద్వేలావనై లావలీ

లవలీలుంగలవంగసంగతలతాలాస్యంబు లీక్షించుచున్

ధవళాక్షుల్ సని కాంచి రంత నెదురం దత్తీరదేశంబునం

దవదాతాంబుజ ఫేనపుంజనిభు నయ్యశ్వోత్తమున్ దవ్వులన్.

(తరువాత ఎంతో అందమైన ఆ ఉచ్చైశ్శ్రవాన్ని చూశారు.)


1_2_30 వచనము

కని కద్రువ వినతం జూచి చూడవె యల్ల యతిధవళంబైన యశ్వంబునందు సంపూర్ణచంద్రునందు నల్లయుంబోలె వాలప్రదేశంబునందు నల్లయై యున్నది యనిన విని వినత నగి నీ వేకన్నులం జూచితె యక్క యెక్కడిది నల్ల యీయశ్వరాజుమూర్తి మహాపురుషకీర్తియుంబోలె నతినిర్మలంబై యొప్పుచున్నయది యనిన విని నవ్వి వినతకుఁ గద్రువ యిట్లనియె.

(ఆ గుర్రాన్ని చూసి కద్రువ వినతతో, "చూడవే, తెల్లని ఆ గుర్రానికి చంద్రుడికి మచ్చలా తోక నల్లగా ఉంది", అన్నది. అప్పుడు వినత, "అక్కా! మచ్చ ఎక్కడిది? గుర్రం తెల్లగానే ఉంది", అనగా కద్రువ వినతతో ఇలా అన్నది.)