ఆ భా 1 1 151 to 1 1 164

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

1_1_151 కందము

తన సతి కపకారము సే

సిన పాముల కలిగి బాధ సేయుదు నని చి

క్కనిదండము గొని పాములఁ

గనినప్పుడ యడువఁదొడఁగె గహనములోనన్.

(తన భార్యకు కీడు చేసిన పాములపై కోపంతో అడవిలో పాములు కనబడిన వెంటనే వాటిని కర్రతో కొట్టటం ఆరంభించాడు.)


1_1_152 చంపకమాల

తిరుగుచుఁ బుట్టలం బొదలఁ ద్రిమ్మరు పాముల రోసిరోసి ని

ష్ఠురతరదీర్ఘ దండమున డొల్లఁగ వ్రేయుచు వచ్చివచ్చి య

య్యిరవున డుండుభంబను నహిం గని వ్రేయఁగ దండ మెత్తుడున్

హరిహరియంచు డుండుభమహాహి భయంపడి పల్కు భార్గవున్

(అడవిలో తిరుగుతూ పాములను వెదకి వెదకి కర్రతో అవి చచ్చిపడేలా కొడుతూ వచ్చి ఒక చోట డుండుభమనే విషంలేని పామును చూసి కొట్టటానికై కర్ర పైకెత్తగా అది భయపడి హరినామాన్ని జపిస్తూ రురుడితో ఇలా అన్నది.)


1_1_153 మత్తకోకిలము

ఏమి కారణమయ్య పాముల కింత యల్గితి వీవు తే

జోమయుండవు బ్రాహ్మణుండవు సువ్రతుండవు నావుడుం

బాము లెగ్గొనరించె మత్ప్రియభామ కేను రురుండ ను

ద్దామసత్త్వుఁడ నిన్ను నిప్పుడ దండతాడితుఁ జేసెదన్.

("గొప్పవాడివైన నీకు పాములంటే ఇంత కోపం ఎందుకయ్యా?". అప్పుడు రురుడు, "నా భార్యకు పాములు అపకారం చేశాయి. నేను రురుడనే భార్గవుడిని. నిన్ను ఇప్పుడే ఈ దండంతో కొట్టిచంపుతాను", అని పలికాడు.)


1_1_154 వచనము

వ. అని రురుం డలిగి కృతాంతకరదండంబుబోని తన దండం బెత్తికొనుడుఁ దత్క్షణంబ డుండుభంబు మునియై యెదుర నిలిచినం జూచి రురుం డిట్లనియె.

(అని యమదండం వంటి తన కర్రతో ఆ పామును కొట్టబోగా డుండుభం మునిరూపం ధరించి రురుడి ఎదుట నిలబడింది. అది చూసి రురుడు ఇలా అన్నాడు.)


1_1_155 కందము

ఉరగమవై యుండి మునీ

శ్వరవేషము దాల్చి యున్న వడు వెంతయు న

చ్చెరు విది యెట్టులు నావుడు

రురునకు నిట్లనియె మునివరుం డనురక్తిన్

("పామువైయుండి మునివేషం ధరించటం వింతగా ఉంది. ఇది ఎలా జరిగింది?", అనగా ఆ మునివరుడు.)


-:సహస్రపాదుని వృత్తాంతము:-


1_1_156 వచనము

ఏను సహస్రపాదుండను మునిముఖ్యుండ నాసహాధ్యాయుండు ఖగముండను మునిముఖ్యుం డగ్నిహోత్రగృహంబున నున్న నే నపహాసార్థంబు తృణమయసర్పం బమ్మునిపై వైచిన నతం డులికిపడి నా కలిగి నీవు నిర్వీర్యంబైన యురగంబ వగుమని శాపం బిచ్చిన నేనును మేలంబు సేసిన నింత యలుగనేల క్షమియింపుమనినం బ్రసన్నుండై ఖగముండు నా వచనం బమోఘంబు గావునఁ గొండొక కాలంబు డుండుభంబవై యుండి భార్గవ కులవర్ధనుండైన రురుం గనిన యప్పుడు శాపవిముక్తుండ వగుదు వనెనని సహస్రపాదుండు రురునకుఁ దన వృత్తాంతం బంతయుం జెప్పి వెండియు నిట్లనియె.

(నేను సహస్రపాదుడనే మునిని. ఖగముడనే నా సహపాఠిపై పరిహాసానికై గడ్డితో చేసిన ఒక పామును వేయగా అతడు భయపడి, నాపై కోపించి, శక్తిలేని పామువుకమ్మని శపించాడు. వేళాకోళానికి చేశాను, మన్నించమనగా ఆతడు ప్రసన్నుడై, "నా పలుకు వ్యర్థం కాదు కాబట్టి ఇలా కొంతకాలం ఉన్న తరువాత భృగువంశానికి చెందిన రురుడిని చూసినప్పుడు నీకు విముక్తి కలుగుతుంది", అని అన్నాడని పలికి ఇలా అన్నాడు. )


1_1_157 ఉత్పలమాల

భూనుతకీర్తి బ్రాహ్మణుఁడు పుట్టుడుఁ దోడన పుట్టు నుత్తమ

జ్ఞానము సర్వభూతహిత సంహితబుద్ధియుఁ జిత్తశాంతియున్

మానమదప్రహాణము సమత్వము సంతతవేదవిధ్యను

ష్ఠానము సత్యవాక్యము దృఢవ్రతమం గురుణాపరత్వమున్.

(బ్రాహ్మణుడు పుట్టగానే అనేక గొప్పగుణాలు కూడా కలుగుతాయి.)


1_1_158 వచనము

అయ్యా నీవు బ్రాహ్మణుండవు భృగువంశసముత్పన్నుండవు సర్వగుణసంపన్నుండ విది యేమి దొడంగి తిట్టి దారుణక్రియారంభంబు క్షత్రియులకుం గాక బ్రాహ్మణులకుం జనునే బ్రహ్మణు లహింసాపరు లొరులు సేయు హింసలు వారించు పరమకారుణ్యపుణ్యమూర్తులు జనమేజయుండను జనపతి చేయు సర్పయాగంబునందుఁ గద్రూశాపంబున నయ్యెడు సర్పకులప్రళయంబును భవత్పిత్రు శిష్యుండయిన యాస్తీకుండను బ్రాహ్మణుండ కాఁడె యుడిగించె నని చెప్పి సహస్రపాదుండు రురునకు సర్పఘాతంబునందుపశమనబుద్ధి పుట్టించె ననిన విని శౌనకాదిమహామును లక్కథకున కిట్లనిరి.

("అయ్యా! గొప్పవాడివైన నీవు ఇలా చేయటం ఎందుకారంభించావు? బ్రాహ్మణులు అహింసాపరులు, ఇతరులు చేసే హింసను ఆపే దయగలవారు. జనమేజయుని సర్పయాగంలో నాగులకు జనని అయిన కద్రువ శాపం వల్ల జరిగే సర్పవినాశనాన్ని నీ తండ్రి శిష్యుడైన ఆస్తీకుడే కదా వారించింది?", అని సహస్రపాదుడు పలికి రురుడికి సర్పఘాతయత్నం మానివేసే బుద్ధి కలిగించాడు అని కథకుడు చెప్పగా విని శౌనకాదిమహర్షులు అతడిని ఇలా అడిగారు.)


1_1_159 ఆటవెలది

ఒరుల వలనఁ బుట్టు నోటమియును నెగ్గుఁ

బొరయకుండ నరసి పుత్త్రవరులఁ

దగిలి కాచునట్టి తల్లి సర్పములకు

నేల యలిగి శాప మిచ్చె నయ్య.

(అయ్యా! ఇతరుల వల్ల జరిగే హాని కలుగకుండా పుత్త్రులను కాపాడే తల్లే వారికి ఎందుకు శాపమిచ్చింది?)


1_1_160 వచనము

అని సౌపర్ణాఖ్యాన శ్రవణకుతూహలపరులై యడిగిన.

(అని గరుడుని కథ వినే ఆసక్తితో అడగ్గా.)


1_1_161 ఉత్పలమాల

రాజకులాగ్రగణ్య మృగరాజపరాక్రమ రాజరాజ వి

భ్రాజితశుభ్రకీర్తిపరిపాండురసర్వదిగంతరాళ ఘో

రాజిముఖోపలబ్ధవిజయప్రమదాశ్రితబాహుదండ ని

స్తేజితవైరివీర కులదీప మృడప్రియ విష్ణువర్ధనా.

(విష్ణువర్ధనబిరుదాంకితుడివైన రాజరాజా!)


1_1_162 కందము

ఆదిక్షత్రచరిత్ర ధ

రాదేవాశీః పరంపరావర్ధితని

త్యోదయ సత్యోదిత విమ

లాదిత్యతనూజ విక్రమాదిత్యనిభా.

(విమలాదిత్యుని కుమారా!)


1_1_163 తోటకము

నిరవద్యనరేశ్వర నిత్యనిరం, తరధర్మమతీ గుణధామ జగ

త్పరిపూరిత కీర్తివిభాసి విభా, కరతేజ నృపోత్తమ కాంతినిధీ.

(రాజరాజనరేంద్రా!)


1_1_164 గద్యము

ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీ మహా భారతంబునం దాది పర్వంబున ననుక్రమణికయును బౌష్యోదంకమాహాత్మ్యంబును భృగువంశకీర్తనంబు నన్నది ప్రథమాశ్వాసము.

(ఇది నన్నయ రచించిన శ్రీమహాభారతంలోని ఆదిపర్వంలో అనుక్రమణిక, పౌష్యోదంకుల కథ, భృగువంశకీర్తనం గల ప్రథమాశ్వాసం.)