ఆ భా 1 1 121 to 1 1 150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

-:ఉదంకుండు జనమేజయునకు సర్పయాగబుద్ధి గలిగించుట:-


1_1_121 చంపకమాల

మితహితసత్యవాక్య జనమేజయ భూజనవంద్య యేను సు

స్థితి గురుదేవకార్యములు సేయఁగఁబూను టెఱింగి వంచనో

న్నతమతియై యకారణమ నా కపకారము సేసిఁ దక్షకుం

డతి కుటిలస్వభావుఁడు పరాత్మవిశేషవివేకశూన్యుఁడై.

(జనమేజయా! నేను గురుకార్యం చేయయత్నించటం తెలుసుకుని కుటిలస్వభావం గల తక్షకుడు అకారణంగా నాకు అపకారం చేశాడు.)


1_1_122 వచనము

అదియునుం గాక.

(అదీ గాక.)


1_1_123 చంపకమాల

అనవరతార్థదానయజనాభిరతున్ భరతాన్వయాభివ

ర్ధను సకలప్రజాహితవిధాను ధనంజయసన్నిభున్ భవ

జ్జనకుఁ బరీక్షతున్ భుజగజాల్ముఁడసహ్యవిషోగ్రధూమకే

తనహతిఁజేసి చేసె నతిదాంతుఁ గృతాంతనికేతనాతిథిన్.


(నీ తండ్రి అయిన పరీక్షితుడిని కూడా తక్షకుడు తన విషంతో సంహరించాడు.)


1_1_124 ఉత్పలమాల

కాదన కిట్టిపాటియపకారముఁ దక్షకుఁ డేకవిప్ర సం

బోధనఁ జేసి చేసె నృపపుంగవ నీవు ననేకభూసురా

పాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాదికా

కోదరసంహతిన్ హుతవహోగ్ర సమగ్రశిఖాచయంబులన్.

(తక్షకుడు ఈ అపకారాన్ని (శృంగి అనే) ఒక విప్రుడి ప్రేరణ చేత చేశాడు. నీవు కూడా సర్పయాగంలో, తక్షకుడు మొదలైన సర్పాలను భస్మం చేయి.)


1_1_125 ఉత్పలమాల

ప్రల్లదుఁడైన యొక్క కులపాంసను చేసినదానఁ దత్కులం

బెల్లను దూషితం బగుట యేమి యపూర్వము గావునన్ మహీ

వల్లభ తక్షకాధము నెపంబున సర్పము లెల్ల నగ్నిలోఁ

ద్రెళ్లఁగ సర్పయాగ మతిధీయుత చేయుము విప్రసమ్మతిన్

(కులభ్రష్టుడు ఒక్కడు చేసిన దాని వల్ల కులాన్నంతా నిందించటం కొత్తేమీ కాదు. కాబట్టి అధముడైన తక్షకుడి నెపంతో సర్పాలన్నీ అగ్నిలో పడేలా విప్రసమ్మతితో సర్పయాగం చేయి.)


1_1_126 వచనము

అని యి ట్లయ్యుదంకుండు జనమేజయునకు సర్పయాగంబునందు బుద్ధి పుట్టించె ననిన విని శౌనకాదిమహామును లక్కథకున కిట్లనిరి.

(ఇలా ఉదంకుడు జనమేజయుడికి సర్పయాగబుద్ధి పుట్టించాడని కథకుడు చెప్పగా విని శౌనకాది మహామునులు ఈ విధంగా పలికారు.)


1_1_127 చంపకమాల

అమితజగద్భయంకరవిషాగ్నియు నప్రతిహన్యమానవీ

ర్యముఁ గలయట్టి సర్పముల కాజనమేజయు చేయు సర్పయా

గమున నుదగ్రపావకశిఖాతతులం దొరుఁగంగఁ గారణం

బమలచరిత్ర యేమి చెపుమయ్య వినం గడువేడ్క యయ్యెడున్.

(అమలచరిత్రా! భయంకరమైన విషం, పరాక్రమం గల సర్పాలు ఆ జనమేజయుడు చేసే యాగంలో అగ్నిజ్వాలల మధ్య పడటానికి కారణమేమిటి?)


-:భృగువంశ కీర్తనము - భృగు వగ్నికి శాపమొసంగుట:-


1_1_128 వచనము

అని యడిగిన వారికి సక్కథకుం డిట్లని చెప్పెఁ దొల్లి సర్పకులజననియైన కద్రువశాపంబు కారణంబునంజేసి జనమేజయు సర్పయాగంబున సర్వభక్షకుం డైన యగ్నియందు సర్పంబులకెల్ల నకాండ ప్రళయంబైన దాని భృగువంశ జుండైన రురుండు గావించు సర్పఘాతంబు సహస్రపాదుం డుడిగించినట్లు జరత్కారుసుతుండైన యాస్తీకుం డుడిగించె దీని సవిస్తరంబుగాఁ జెప్పెద వినుండని భృగువంశ కీర్తనంబు నాస్తీకుచరితంబును జెప్పందొడంగె.

(అప్పుడు ఆ కథకుడు, 'పూర్వం సర్పకులానికి జనని అయిన కద్రువ ఇచ్చిన శాపం వల్ల అగ్నిలో అన్ని సర్పాలకూ ప్రళయం కలుగగా దానిని, భృగువంశసంజాతుడైన రురుడు చేసే సర్పఘాతాన్ని సహస్రపాదుడు మాన్పించినట్లు, జరత్కారు దంపతుల కుమారుడైన ఆస్తీకుడు మాన్పించాడు. ఇది వివరంగా చెపుతాను. వినండి', అని భృగువంశ కీర్తనం, ఆస్తీకుడి కథ చెప్పటం ఆరంభించాడు.)

1_1_129 సీసము

భృగుఁడను విప్రుండు మగువఁ బులోమ యన్

దాని గర్భిణిఁ దన ధర్మపత్ని

నగ్నిహోత్రమునకు నగ్నులు విహరింపు

మని పంచి యభిషేచనార్థ మరుగ

నంత బులోముఁడన్ వింత రక్కసుఁ డగ్ని

హోత్రగృహంబున కొయ్య వచ్చి

యత్తన్విఁ జూచి యున్మత్తుఁడై యెవ్వరి

సతి యిది సెప్పుమా జాతవేద


ఆటవెలది

యనఁగ నగ్ని దేవుఁడనృతంబునకు విప్ర

శాపమునకు వెఱచి శాపభయము

దీర్చుకొనఁగఁ బోలుఁ దీర్ప రా దనృతాభి

భాషణమున నైన పాపభయము.


(భృగుడు అనే విప్రుడు, పులోమ అనే పేరుగల గర్భవతి అయిన తన భార్యను అగ్నిహోత్రానికి అగ్నులు ప్రజ్వలింపజేయమని చెప్పి, స్నానానికై వెళ్లగా పులోముడనే రాక్షసుడు ఆ అగ్నిహోత్రగృహానికి వచ్చి, ఆమెను మోహించి, 'ఓ అగ్నీ, ఈమె ఎవరి భార్య?', అని అడగ్గా అగ్నిదేవుడు అసత్యదోషానికీ, విప్రశాపానికీ భయపడి, 'శాపహాని తొలగించుకోవచ్చు, అసత్యమాడటం వల్ల కలిగే పాపాన్ని తొలగించలేము'.)


1_1_130 వచనము

అని విచారించి యప్పరమపతివ్రత భృగుపత్ని యని కలరూపుఁ జెప్పిన నప్పులోముండు నిది నాకుఁ దొల్లి వరియింపంబడిన భార్య పదంపడి భృగుండు పెండ్లియయ్యె నని వరాహరూపంబున నాసాధ్వి నతిసాధ్వసచిత్త నెత్తికొని పర్వంబర్వం తద్గర్భంబున నున్న యర్భకుండు గరం బలిగి కుక్షిచ్యుతుండై చ్యవనుండు నాఁ బరగె నమ్మునికుమారుని.

(అని ఆలోచించి, ఆ మహాపతివ్రత భృగుపత్ని అని నిజం చెప్పగా పులోముడు, 'ఈమె పూర్వం నాకు భార్యగా ఎన్నబడింది. తరువాత భృగుమహర్షితో పెళ్లిజరిగింది', అని, వరాహరూపం ధరించి ఆమెను ఎత్తుకుని చాలాదూరం పరుగెత్తగా ఆమె గర్భంలో ఉన్న శిశువు కోపంతో గర్భంనుండి జారి చ్యవనుడు అనే పేరు పొందాడు. ఆ కుమారుడిని.)


-:చ్యవనునివలనఁ బులోముఁ డనురాక్షసుండు చచ్చుట:-


1_1_131 కందము

సముదితసూర్యసహస్రో

పమదుస్సహతేజు జగదుపప్లవసమయా

సమదీప్తి తీవ్రపావక

సముఁ జూచుచు నసుర భస్మసాత్కృతుఁ డయ్యెన్.

(అగ్నితో సమానమైన, తీక్ష్ణమైన తేజస్సుగల ఆ మునికుమారుడిని చూస్తూ పులోముడు దగ్ధుడై భస్మమయ్యాడు.)


1_1_132 వచనము

పులోమయు నక్కొడుకు భృగుకులవర్ధను నెత్తికొని నిజాశ్రమంబునకు వచ్చె నంతకు ముందఱ నారక్కసునకు వెఱచి యక్కోమలి యేడ్చుచుంబోయినఁ దద్బాష్పధారాప్రవాహంబు మహనదియై తదాశ్రమసమీపంబునం బాఱిన దానికి వధూసర యను నామంబు లోకపితామహుండు సేసె నంతఁ గృతస్నానుండై భృగుండు సనుదెంచి బాలార్కుండునుంబోని బాలకు నెత్తికొనియున్న నిజపత్నిం జూచి యసుర సేసిన యపకారంబున కలిగి యయ్యసుర నిన్నె ట్లెఱింగె నెవ్వరు సెప్పిరనినఁ బులోమ యిట్లనియె.

(అప్పుడు పులోమ చ్యవనుడిని ఎత్తుకుని ఆశ్రమానికి తిరిగివచ్చింది. అంతకు ముందు ఆమె ఆ రాక్షసుడికి భయపడి ఏడుస్తున్నప్పుడు, ఆ కన్నీళ్ల ధార గొప్పనదై ఆశ్రమం దగ్గర ప్రవహించగా, ఆ నదికి బ్రహ్మ "వధూసర" అనే పేరు పెట్టాడు. తరువాత భృగుమహర్షి స్నానం చేసివచ్చి బాలసూర్యుని వంటి కుమారుడిని ఎత్తుకుని ఉన్న భార్యను చూసి, రాక్షసుడు చేసిన అపకారానికి కోపించి, "ఆ రాక్షసుడికి


1_1_133 కందము

ఈయగ్ని దేవుఁ డసురకు

నోయన చెప్పుటయు విని మహోగ్రాకృతితో

నాయసుర నన్ను సూకర

మై యప్పుడ యెత్తికొని రయ౦బునఁ జనుచోన్.

(పులోముడికి ఈ అగ్నిదేవుడు నా గురించి చెప్పగా, అతడు భయంకరమైన వరాహాకారంలో నన్ను ఎత్తుకుని వేగంగా వెళ్లే సమయంలో.)


1_1_134 కందము

కుక్షిచ్యుతుఁడై సుతుఁ డా

రాక్షసు భస్మంబు సేసి రాజితశక్తిన్

రక్షించె నన్ను ననవుడు

నక్షణమ మునీంద్రుఁ డగ్ని కతిరోషమునన్.

(కుమారుడు గర్భంలోనుండి జారి ఆ రాక్షసుడిని బూడిద చేసి నన్ను రక్షించాడు, అనగానే భృగువు వెంటనే కోపంతో అగ్నికి.)


1_1_135 వచనము

నీ వతిక్రూరుండవు సర్వభక్షకుండవు గమ్మని శాపం బిచ్చిన నగ్నిదేవుండిట్లనియె.

("నీవు అతిక్రూరుడివి, సర్వభక్షకుడివి అవుతావు", అని శాపమిచ్చాడు. అప్పుడు అగ్నిదేవుడు ఇలా అన్నాడు.)


1_1_136 కందము

తనయెఱిఁగిన యర్థం బొరుఁ

డనఘా యిది యెట్లు సెప్పుమని యడిగినఁ జె

ప్పనివాఁడును సత్యము సె

ప్పనివాఁడును ఘోరనరకపంకమునఁ బడున్.

(తనకు తెలిసిన విషయాన్ని ఎవరన్నా అడిగినప్పుడు చెప్పనివాడు, అబద్ధం చెప్పేవాడు ఘోరమైన నరకమనే బురదలో పడతారు.)


1_1_137 వచనము

కావున నే నసత్యంబునకు వెఱచి యక్కోమలి భృగుపత్ని యని కల రూపుఁ జెప్పితి నఖిల జగత్కర్మసాక్షి నై యుండి యసత్యం బెట్లు పలుక నేర్తు నది నిమిత్తంబుగా నీవు నాకు శాపం బిచ్చిన నే నలిగి నీకుఁ బ్రతిశాపం బీనోపనివాఁడను గాను వినుము.

(కాబట్టి అబద్ధానికి భయపడి ఆమె భృగుపత్ని అని నిజం చెప్పాను. జగత్కర్మసాక్షినైయుండి అబద్ధమెలా చెప్పగలను? నీ శాపానికి ప్రతిశాపం ఇవ్వలేనివాడిని కాను.)


1_1_138 చంపకమాల

అడిచినఁ దిట్టినన్ మఱి మహాపరుషంబులు పల్కి యల్కతోఁ

బొడిచిన నుత్తమద్విజులు పూజ్యులు వారల కెగ్గు సేసినం

జెడు నిహముం బరంబు నిది సిద్ధము గావు టెఱింగి భక్తినె

ప్పుడు ధరణీసురోత్తములఁ బూజలఁ దన్పుదు నల్గ నోడుదున్.

(కొట్టినా, తిట్టినా, కఠినవాక్యాలతో పోట్లాడినా ఉత్తమద్విజులు పూజ్యులు. వారికి హానిచేస్తే ఇహపరాలకు చెడు కలుగుతుంది. కాబట్టి నేను వారిని భక్తితో పూజిస్తాను. వారిపై కోపించటానికి భయపడతాను.)


1_1_139 వచనము

నీవు బ్రాహ్మణుండవు నీ వెద్ది సేసిన నీక చను లోకహితుండ నయిన నాకు శాపం బిచ్చి లోకంబులకెల్లఁజెట్ట సేసితి వదెట్లనిన వేదోక్తంబు లయిన నిత్య నైమిత్తిక బలివిధానంబులందు మహాద్విజులచేత నాయందు వేల్వంబడిన హవ్యకవ్యంబులు నా ముఖంబునన దేవపితృగణంబు లుపయోగింతు రట్టి యేను సర్వభక్షకుండనైనఁ యశుచినైనఁ గ్రియానివృత్తి యగుఁ గ్రియాని వృత్తియైన లోకయాత్ర లేకుండు నని యగ్నిభట్టారకుండు నిఖిలలోక వ్యాప్తంబైన తన తేజోమూర్తి నుపసంహరించిన.

(నీవు బ్రాహ్మణుడివి, నీవేది చేసినా నీకే తగును. లోకాలకు మేలుచేసే నాకు శాపమిచ్చి లోకాలన్నింటికీ కీడు చేశావు. హోమంలో అందించే వస్తువులు నా ద్వారానే పితృదేవతలు ఉపయోగిస్తారు. అలాంటి నేను అపవిత్రుడిని అయితే కర్మలకు లోపం కలుగుతుంది. అలా జరిగితే లోకయాత్ర సాగదు, అని లోకవ్యాప్తమైన తన తేజస్సును ఉపసంహరించాడు.)


1_1_140 సీసము

త్రేతాగ్ను లెల్లను దేజరిల్లమిఁ జేసి

క్రతుకృత్యములు వినిర్గతము లయ్యె

నగ్నిహోత్రములందు నౌపాసనాది సా

యంప్రాతరాహుతు లంత నుడిగె

దేవతార్చనలందు దీపధూపాది స

ద్విధులు వర్తిల్లక విరతిఁ బొందెఁ

బితృకార్యములఁ బితృపిండయజ్ఞక్రియ

లడఁగె విఛ్ఛిన్నంబు లై ధరిత్రి


ఆటవెలది

నంత జనులు సంభ్రమాక్రాంతులై మహా

మునుల కడకుఁ జనిరి మునులు నమర

వరులకడకుఁ జనిరి వారును వారును

బ్రహ్మకడకుఁ జనిరి భయము నొంది.


(అగ్ని ప్రజ్వరిల్లకపోవడం చేత లోకాల్లో కార్యాలన్నీ ఆగిపోయాయి. ప్రజలు సంభ్రమంతో మునుల వద్దకు వెళ్లారు. మునులు దేవతల దగ్గరకు వెళ్లారు. మునులూ, దేవతలూ భయపడి బ్రహ్మ వద్దకు వెళ్లారు.)


1_1_141 వచనము

బ్రహ్మయు భృగుశాపనిమిత్తంబున నగ్నిభట్టారకు నుపసంహారంబును సకలలోకవ్యవహారవిచ్ఛేదంబును నెఱింగి యగ్నిదేవు రావించి యిట్లనియె.

(భృగుశాపం మూలంగా అగ్నిభట్టారకుని ఉపసంహారం, లోకవ్యవహారవిచ్ఛేదం తెలుసుకుని అగ్నిదేవుడిని పిలిపించి ఇలా అన్నాడు.)


1_1_142 చంపకమాల

ప్రకటితభూతసంతతికి భర్తవు నీవ చరాచర ప్రవృ

త్తికి మఱి హేతుభూతుఁడవు దేవముఖుండవు నీవ లోకపా

వకుఁ డవు నీవ యిట్టి యనవద్యగుణుండవు నీకు విశ్వభా

రకభువన ప్రవర్తనపరాఙ్ముఖభావముఁ బొందఁ బాడియే.

(లోకాలను భరించేవాడివైన ఓ అగ్నీ! లోకవ్యవహారం పట్ల ఇలా విముఖత చూపటం న్యాయమా?)


1_1_143 వచనము

అమ్మహామునివచనం బమోఘంబు గావున నీవు సర్వభక్షకుండ వయ్యును శుచులయం దెల్ల నత్యంతశుచివై పాత్రులయం దెల్లఁ బరమపాత్రుండవై పూజ్యులయం దెల్ల నగ్రపూజ్యుండవై వేదచోదితవిధానంబులయందు విప్ర సహాయుడవై భువనంబుల నడపుమని విశ్వగురుండు వైశ్వానరుం బ్రార్థించి నియోగించి భృగువచనంబు ప్రతిష్ఠాపించె నట్టి భృగునకుఁ బుత్త్రుండై పుట్టి పరగిన.

(భృగుమహాముని వాక్యం వ్యర్థం కాదు కాబట్టి నీవు సర్వభక్షకుడివైనా పవిత్రులలో పవిత్రుడివై, పాత్రులలో పాత్రుడివై, పూజ్యులలో పూజ్యుడివై లోకవ్యవహారం నిర్వహించమని బ్రహ్మ అగ్నిని నియోగించి భృగువు వాక్యాన్ని ప్రతిష్ఠాపించాడు. అలాంటి భృగువుకు పుత్రుడైన.)


1_1_144 కందము

చ్యవనునకు సుకన్యకు ను

ద్భవ మయ్యె ఘనుండు ప్రమతి ప్రమతికి నమృతో

ద్భవ యగుఘృతాచికిని భా

ర్గవముఖ్యుఁడు రురుఁడు పుట్టెఁ గాంతియుతుండై.


(చ్యవనుడికీ సుకన్యకీ ప్రమతి పుట్టాడు. ప్రమతికీ అమృతంతోపాటు పుట్టిన ఘృతాచికీ భృగువంశంలో ముఖ్యుడైన రురుడు జన్మించాడు.)


-:ప్రమద్వర సర్పదష్టయై చచ్చి మరల బ్రతుకుట:-


1_1_145 వచనము

అట్టి రురుండను మునివరుండు విశ్వావసుండను గంధర్వరాజునకు మేనకకుం బుట్టినదాని స్థూలకేశుండను మునివరు నాశ్రమంబునఁ బెరుఁగుచున్నదాని రూపలావణ్యగుణంబులఁ బ్రమదాజనంబుల యందెల్ల నుత్కృష్ట యగుటం జేసి ప్రమద్వర యన నొప్పుచున్న కన్యక నతిస్నేహంబున వివాహంబుగా నిశ్చయించి యున్నంత.

(విశ్వావసుడనే గంధర్వరాజుకూ, మేనక అనే అప్సరసకూ పుట్టి స్థూలకేశుడనే ముని ఆశ్రమంలో పెరుగుతున్న ప్రమద్వర అనే కన్యను రురుడు పెళ్లాడటానికి నిశ్చయించి ఉండగా.)


1_1_146 తేటగీతి

కన్నియలతోడ నాడుచు నున్నదానిఁ

బాదమర్దితమై యొక్క పన్నగంబు

గఱచెఁ గన్నియ లందఱు వెఱచి పఱచి

యఱచుచుండఁ బ్రమద్వర యవనిఁ ద్రెళ్ళె.


(తోటి కన్యలతో ఆడుకుంటున్న ప్రమద్వరను వారు పాదాలతో తొక్కిన ఒక పాము కరచింది. ఇతరకన్యలందరూ భయపడి, పరుగెత్తి, ఏడుస్తూ కేకలు వేస్తూండగా ప్రమద్వర భూమిపై పడింది.)


1_1_147 వచనము

దాని నెఱింగి కరుణాకలితహృదయులై గౌతమ కణ్వకుత్స కౌశిక శంఖ మేఖల భరద్వాజ వాలఖిల్యోద్దాలక శ్వేతకేతు మైత్రేయ ప్రముఖులు ప్రమ తియు రురుండును స్థూలకేశాశ్రమంబునకు వచ్చి విషవ్యపగతప్రాణ యై పడియున్న యక్కన్యం జూచి దుఃఖితులై యుండ నచ్చోట నుండనోపక రురుండు శోకవ్యాకులహృదయుండై యేకతంబ వనంబునకుం జని.

(ఈ విషయం తెలిసి గౌతముడు, కణ్వుడు, కుత్సుడు, కౌశికుడు (విశ్వామిత్రుడు), శంఖుడు, మేఖలుడు, భరద్వాజుడు, వాలఖిల్యులు, ఉద్దాలకుడు, శ్వేతకేతుడు, మైత్రేయుడు మొదలైన ప్రముఖులు, ప్రమతి, రురుడు స్థూలకేశుని ఆశ్రమానికి వచ్చి నేలపై పడి ఉన్న ప్రమద్వరను చూసి దుఃఖితులవగా రురుడు అక్కడ ఉండలేక శోకవ్యాకులమైన హృదయంతో ఒంటరిగా అడవికి వెళ్లి.)


1_1_148 చంపకమాల

అలయక యేన దేవయజనాధ్యయనవ్రతపుణ్యకర్మముల్

సలుపుదునేని యేన గురుసద్ద్విజభక్తుఁడ నేని యేన య

త్యలఘుతపస్వినేని దివిజాధిపభూసురులార మన్మనో

నిలయకు నీప్రమద్వరకు నిర్విషమయ్యెడు నేఁడు మీదయన్.

(ఓ దేవతలారా! బ్రాహ్మణులారా! నేను అలసటలేక పూజలు, యజ్ఞాలు, వ్రతాలు, వేదపఠనం వంటి పుణ్యకార్యాలు చేసేవాడనైతే, గురుభక్తుడనైతే, గొప్పతపస్వినైతే మీ దయ వల్ల ప్రమద్వర విషవిముక్తురాలు అగుగాక!)


1_1_149 చంపకమాల

అపరిమితాజ్ఞఁ జేసియు మహాపురుషుల్ విషతత్త్వసంహితా

నిపుణులు మంత్రతంత్రములు నేర్చి విధించియు దీనికిన్ విష

వ్యపగతమైన జీవ మిది వచ్చు నుపాయము సేయరొక్కొనా

తపముఫలంబు నధ్యయనదానఫలంబులు నిత్తు వారికిన్.

(ప్రమద్వరకు ప్రాణాలు తిరిగివచ్చే ఉపాయం చేసిపెట్టరా? అలా చేసినవారికి నా తపఃఫలాన్నీ, అధ్యయనఫలాన్నీ, దానఫలాన్నీ ఇస్తాను)


1_1_150 వచనము

అని దీనవదనుండై యాక్రోశించువానికి నాకాశంబున నుండి యొక్క దేవ దూత యిట్లనియె నయ్యా! కాలవశంబయిన నెవ్వరికిం దీర్చఁ దరంబుగా దొక్క యుపాయంబు గలదు చేయనోపుదేనిఁ జెప్పెద వినుము నీ యాయు ష్యంబునం దర్థం బిక్కన్య కిమ్మనిన రురుం డట్ల చేయుదు నని తన యాయుష్యంబునం దర్థం బక్కన్యక కిచ్చిన నక్కోమలి దొల్లింటికంటె నధికశృంగార సమన్వితయై విషనిర్ముక్త యయ్యె నట్లు దేవదూత ధర్మరా జానుమతంబునఁ దన చెప్పిన యుపాయంబునం బ్రమద్వరను బంచత్వంబు వలనం బాపె రురుండును దాని వివాహంబై యిష్టోపభోగంబుల ననుభ వించుచు నుండి.

(అలా విలపిస్తున్న రురుడికి ఆకాశంనుండి ఒక దేవదూత, "అయ్యా! మరణాన్ని తొలగించటం సాధ్యం కాదు. అయినా ఒక మార్గముంది. నీ ఆయుర్దాయంలో సగం ఈమెకు ఇవ్వు" అని పలికాడు. రురుడు అందుకు సమ్మతించగా, ఆ దేవదూత యముని అనుమతితో ప్రమద్వరను మృత్యువునుండి ఉద్ధరించాడు. ఆమె ముందటికంటే ఎక్కువ సౌందర్యంతో విషం నుండి విముక్తి పొందింది. రురుడు ప్రమద్వరను వివాహం చేసుకుని సుఖంగా ఉండి.)