ఆ భా 1 1 091 to 1 1 120
-:ఉదంకుండు పౌష్యుమహాదేవి కుండలంబులం దేఁబోవుట:-
1_1_91 కందము
పంకజభవసన్నిభుఁ డఘ
పంకక్షాళనమహతపస్సలిలుఁ డనా
తంకమతి పైలశిష్యుఁడు
దంకుండను మునివరుండు దద్దయు భక్తిన్.
(గొప్పముని అయిన పైలుడి శిష్యుడైన ఉదంకుడనే ముని భక్తితో.)
1_1_92 కందము
గురుకులమునందు గురులకుఁ
బరిచర్య లొనర్చి తా నపరిమితనిష్ఠా
పరుఁడై జ్ఞానము వడసెను
గురుదయ నణిమాదికాష్టగుణములతోడన్.
(గురువులకు సేవలు చేసి, నిష్ఠతో జ్ఞానాన్ని, అణిమాది అష్టసిద్ధులను పొందాడు.)
1_1_93 వచనము
అయ్యుదంకుండు గురుహితకార్యధురంధరుం డయి గురుపత్నీనియోగంబునం బౌష్యుండనురాజుదేవికుండలంబులం బ్రతిగ్రహించి తేరంబూని వనంబులో నొక్కరుండ చనువాఁ డెదుర నొక్క మహోక్షంబు నెక్కి చనుదెంచు వాని నొక దివ్యపురుషుం గని వాని పన్నిన వృషభగోమయ భక్షణంబు సేసి యమ్మహాత్ము ననుగ్రహంబు వడసి యతిత్వరితగతిం జని పౌష్యమహారాజుం గాంచి దీవించి గృహీతసత్కారుండై యిట్లనియె.
(ఆ ఉదంకుడు, గురుపత్ని కోరిక మేరకు, పౌష్యుడనే రాజు భార్య కర్ణాభరణాలు తేవటానికై, అడవిలో ఒక్కడే వెడుతుండగా ఒక పెద్ద ఎద్దునెక్కి వస్తున్న దివ్యపురుషుడిని చూసి, అతడు ఇచ్చిన గోమయం తిని, అతడి అనుగ్రహం పొంది, త్వరగా వెళ్లి పౌష్యమహారాజు వద్దకు చేరి, అతని సత్కారాన్ని స్వీకరించి ఇలా అన్నాడు.) (మూలంలో ఉదంకుడు గోమయభక్షణం చేయటానికి మొదట అంగీకరించలేదు. 'మీ గురువు కూడా ఈ గోమయభక్షణం చేసినవాడే', అని దివ్యపురుషుడు చెప్పి ఒప్పిస్తాడు.)
1_1_94 తేటగీతి
ఏను గుర్వర్థ మర్థినై మానవేశ
కడఁగి వచ్చితి నిపుడు నీకడకు వేడ్క
దండితారాతి నీదేవికుండలమ్ము
లిమ్ము నాపూన్కి యిది సఫలమ్ము గాఁగ.
(ఓ రాజా! నా గురువుగారి పని మీద, నీ రాణి ధరించే కర్ణాభరణాల కోసం నీ దగ్గరకు వచ్చాను.)
1_1_95 వచనము
అనినం బౌష్యుం డిట్టి మహాత్మున కీఁగాంచితిఁ గృతార్థుండ నైతినని సంతసిల్లి యుదంకున కిట్లనియె నయ్యా మదీయధర్మపత్ని యక్కుండలంబులు దొడిగి యున్నయది మద్వచనంబున వాని నిప్పించుకొ మ్మనిన నుదంకుం డంతఃపురమునకుఁ జని పౌష్యుమహాదేవిం గానక క్రమ్మఱి పౌష్యు పాలికి వచ్చి నీదేవి నందులం గాన నీవ యక్కుండలంబులు దెప్పించి యిమ్మనినఁ బౌష్యుం డిట్లనియె.
(ఇలాంటి మహాత్మునికి ఇవ్వగలిగే వాడిని అయ్యాను అని పౌష్యుడు సంతోషించి, "నా భార్య వాటిని ధరించి ఉంది. నా మాటగా చెప్పి అవి గ్రహించండి" అనగా ఉదంకుడు అంతఃపురానికి వెళ్లి, పౌష్యుడి మహారాణి కనపడక, తిరిగివచ్చి రాజుతో, "నీ దేవి అక్కడ కనపడలేదు. నీవే ఆ కుండలాలు తెప్పించి ఇవ్వ", మనగా పౌష్యుడు ఇలా అన్నాడు.)
1_1_96 కందము
భూవినుత నిన్ను ద్రిభువన
పావను నశుచి వని యెట్లు పలుకఁగ నగు న
ద్దేవి పవిత్రపతివ్రత
గావున నశుచులకుఁ గానఁగా దనవద్యా!
(భూవినుతా! నిన్ను అపవిత్రుడివని చెప్పడం ఎలా? నా దేవి పవిత్రురాలు, పతివ్రత. అపవిత్రులకు కనపడదు.)
1_1_97 వచనము
అనిన విని యుదంకుం డప్పుడు దలంచి యావృషభగోమయ భక్షణానంతరంబున నాచమింపమినైన నాయశుచిభావంబునఁ గాకేమి యప్పరమ పతివ్రత మదీయదృష్టిగోచర గాకున్న దయ్యె నని పూర్వాభిముఖుండయి శుద్ధోదకంబులం బ్రక్షాళితపాణిపాదవదనుండయి యాచమించి పౌష్యానుమతంబున నద్దేవియొద్దకుం జనిన నదియును నమ్మహామునికి నమస్కరించి కుండలమ్ము లిచ్చి యిట్లనియె.
(అప్పుడు ఉదంకుడు ఆలోచించి, గోమయభక్షణానంతరం ఆచమనం చేయకపోవటమే తన అపవిత్రతకు కారణమని తలచి, ఆచమనం చేసి, పౌష్యుడి అనుమతితో అతడి రాణి వద్దకు పోగా, ఆమె ఉదంకుడికి నమస్కారం చేసి, కుండలాలు ఇచ్చి ఇలా అన్నది.)
1_1_98 కందము
తక్షకుఁ డీకుండలము ల
పేక్షించుచు నుండువాఁ డభేద్యుడు మాయా
దక్షుండు వానివలన సు
రక్షితముగఁ జేసి చనుము రవినిభతేజా!
(రవినిభతేజా! ఈ కుండలాలను తక్షకుడు తాను పొందాలని కోరుకుంటున్నాడు. అతడు అభేద్యుడు, మాయాదక్షుడు. అతడు వీటిని అపహరించకుండా జాగరూకతతో వెళ్లండి.)
1_1_99 వచనము
అనిన నుదంకుం డట్ల చేయుదునని యద్దేవి వీడ్కొని పౌష్యుపాలికిం బోయిన నతం డయ్యా! నీ వతిథివి మాయింటఁ గృతభోజనుండవై పొమ్మని క్షణియించిన నొడంబడి యుదంకుండు గుడుచుచో నన్నంబు కేశదుష్టంబైన రోసి కరం బలిగి యి ట్లపరీక్షితంబైన యశుద్ధాన్నంబు పెట్టినవాఁడ ధుండ వగు మని శాపం బిచ్చిన నల్గి యల్పదోషంబున నాకు శాపం బిచ్చిన వాఁడవు నీ వనపత్యుండ వగుమని ప్రతిశాపం బిచ్చిన నుదంకుండు నేననపత్యుండఁ గా నోప దీనిఁ గ్రమ్మఱింపు మనినఁ బౌష్యుండిట్లనియె
(ఉదంకుడు అలాగే చేస్తానని పలికి, రాణి వద్ద సెలవు తీసుకొని, పౌష్యుడి దగ్గరకు వెళ్లగా, అతడు ఉదంకుడిని భోజనం చేసి వెళ్లవలసిందని కోరాడు. ఉదంకుడు సమ్మతించి భోజనం చేస్తుండగా, అన్నంలో వెండ్రుక ఉండటంచేత, అది అపవిత్రం అయిందనే కోపంతో , "పరీక్షంచకుండా అపవిత్రమైన అన్నం పెట్టినందుకు గుడ్డివాడవు అవుతావు గాక", అని శాపమిచ్చాడు. అప్పుడు పౌష్యుడు, "చిన్నతప్పుకు నన్ను శపించావు కాబట్టి నీకు సంతానం లేకపోవు గాక" అని ప్రతిశాపమిచ్చాడు. "సంతానం లేకపోవటాన్ని నేను భరించలేను. శాపం ఉపసంహరించ", మని ఉదంకుడు అనగా పౌష్యుడు ఇలా పలికాడు.)
1_1_100 ఉత్పలమాల
నిండుమనంబు నవ్యనవనీతసమానము పల్కు దారుణా
ఖండలశస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్క మీ
రెండును రాజులందు విపరీతము గావున విప్రుఁ డోపు నో
పం డతిశాంతుఁ డయ్యు నరపాలుఁడు శాపము గ్రమ్మఱింపఁగన్
(జగన్నుతా! విప్రుల మనసు కొత్తగా తీసిన వెన్నతో సమానం, మాట వజ్రాయుధంతో సమానం. రాజులలో ఈ రెండూ అందుకు విరుద్ధంగా (మాట మృదువుగా, మనసు కఠినంగా) ఉంటాయి. కాబట్టి, విప్రుడు శాపం ఉపసంహరించగలడు గానీ రాజు ఆ పని చేయలేడు.) (మూలంలో వ్యాసుడు విప్రులమాటను మంగలికత్తితో పోల్చాడు.)
-:తక్షకుండు కుండలంబు లపహరించుట:-
1_1_101 వచనము
కావున నా కశక్యంబు నీయిచ్చిన శాపంబు గ్రమ్మఱింపు మనిన నుదంకుం డట్లేని నీకు నల్పకాలంబున శాపమోక్షం బగు నని పౌష్యునకు ననుగ్ర హించి మగుడి నేఁడ పోయి గురుపత్నికిఁ గుండలంబు లీఁగంటినని సంతోషించి చనువాఁ డెదుర నొక్క జలాశయంబు గని శుచిప్రదేశంబునఁ దనచేతి కుండలంబులు పెట్టి యాచమించుచున్నంతఁ దనతోడన వచ్చి తక్షకుండు నగ్నవేషధరుండై యక్కుండలంబులు గొని పాఱిన నుదంకుండును వాని పిఱుందన పాఱి పట్టికొనుడు.
(కాబట్టి శాపం తొలగించటం నాకు శక్యం కాదు, నీ శాపమే తొలగించమని పౌష్యుడు అన్నాడు. అప్పుడు ఉదంకుడు, "నీకు కొద్ది కాలంలోనే విముక్తి కలుగుతుంది" అని పౌష్యుడిని అనుగ్రహించి తిరిగివెడుతుండగా అతడికి ఒక సరస్సు కనిపించింది. కుండలాలను ఒక శుభ్రమైన చోట ఉంచి ఆచమనం చేస్తుండగా తక్షకుడు నగ్నరూపంలో వచ్చి కుండలాలు దొంగిలించి పరుగెత్తసాగాడు. ఉదంకుడు కూడా తక్షకుడి వెనుకనే పరుగెత్తి అతన్ని పట్టుకొన్నాడు.)
1_1_102 కందము
విడిచి దిగంబరవేషము
విడువక మణికుండలములు విషధరపతి యే
ర్పడ నిజరూపముతో న
ప్పుడ యహిలోకమున కరిగె భూవివరమునన్.
(సర్పరాజైన తక్షకుడు దిగంబరవేషం విడిచి, నిజరూపం ధరించి, వెంటనే ఆ చెవికమ్మలతో, భూమిలోని ఒక కలుగు ద్వారా నాగలోకానికి వెళ్లిపోయాడు.)
1_1_103 వచనము
ఉదంకుండును వానితోడన తగిలి యవ్వివరంబున నురగలోకంబున కరిగి నాగపతుల నెల్ల నిట్లని స్తుతియించె.
(ఉదంకుడు కూడా తక్షకుడి వెనుకనే ఆ కన్నం ద్వారా నాగలోకం చేరి అక్కడి రాజులను ఇలా స్తుతించాడు.)
1_1_104 చంపకమాల
బహువనపాదపాబ్ధికులపర్వతపూర్ణ సరస్సరస్వతీ
సహితమహీభర మజస్రసహస్రఫణాళిఁ దాల్చి దు
స్సహతరమూర్తికిన్ జలధిశాయికిఁ బాయక శయ్యయైన య
య్యహిపతి దుష్కృతాంతకుఁడనంతుడు మాకుఁ బ్రసన్నుఁడయ్యెడున్.
(భూభారాన్ని ధరిస్తూ, దుస్సహతరమైన విగ్రహం గల విష్ణువుకు ఎల్లప్పుడూ శయ్యగా ఉండే అనంతుడికి మామీద అనుగ్రహం కలుగుగాక.)
1_1_105 చంపకమాల
అరిది తపోవిభూతి నమరారుల బాధలు వొందకుండఁగా
నురగుల నెల్లఁ గాచిన మహోరగనాయకుఁ డానమత్సురా
సురమకుటాగ్రరత్నరుచిశోభితపాదున కద్రినందనే
శ్వరునకు భూషణం బయిన వాసుకి మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.
(రాక్షసుల నుండి నాగులను కాపాడిన గొప్పరాజు, వంగి నమస్కరించే దేవతల, రాక్షసుల కిరీటాల పైభాగంలో ఉండే మణుల కాంతితో ప్రకాశించే పాదాలుగల శివుడికి ఆభరణమైన వాసుకి మమ్మల్ని అనుగ్రహించుగాక.)
1_1_106 ఉత్పలమాల
దేవమనుష్యలోకములఁ ద్రిమ్మరుచున్ విపులప్రతాపసం
భావితశక్తిశౌర్యులు నపారవిషోత్కటకోపవిస్ఫుర
త్పావకతాపితాఖిలవిపక్షులు నైన మహనుభావు లై
రావతకోటిఘోరఫణిరాజులు మాకుఁ బ్రసన్ను లయ్యెడున్.
(మహానుభావులైన ఐరావత నాగవంశంలోని కోటిసంఖ్యాకులైన సర్పరాజులకు మాపట్ల అనుగ్రహం కలుగుగాక.)
1_1_107 ఉత్పలమాల
గోత్రమహామహీధరనికుంజములన్ విపినంబులం గురు
క్షేత్రమునం బ్రకామగతిఖేలన నొప్పి సహాశ్వ సేనుఁడై
ధాత్రిఁ బరిభ్రమించు బలదర్పపరాక్రమదక్షుఁ డీక్షణ
శ్రోత్రవిభుండు తక్షకుఁడు శూరుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.
(గొప్పవాడు, అశ్వసేనుడి తండ్రి అయిన తక్షకుడికి మాపై అనుగ్రహం కలుగుగాక.)
1_1_108 వచనము
అని యి ట్లురగపతుల నెల్ల స్తుతియించి యందు సితాసితతంతుసంతాన పటంబు ననువయించుచున్నవారి నిద్దఱ స్త్రీలను ద్వాదశారచక్రంబుం బరి వర్తించుచున్నవారి నార్వురఁ గుమారుల నతిప్రమాణతురంగంబు నెక్కిన వాని మహాతేజస్వి నొక్క దివ్యపురుషుం గని విపులార్థవంతంబులైన మం త్రంబుల నతిభక్తియుక్తుండై స్తుతియించినం బ్రసన్నుండై యద్దివ్యపురు షుం డయ్యుదంకున కిట్లనియె.
(ఇలా ఆ రాజులను స్తుతించి, అక్కడ తెల్లని, నల్లని దారాలతో వస్త్రాన్ని నేస్తున్న ఇద్దరు స్త్రీలను, పన్నెండు ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకులను, ఎత్తైన గుర్రాన్ని ఎక్కిన ఒక దివ్యపురుషుడిని చూసి, అర్థవంతాలైన మంత్రాలతో అతడిని స్తుతించగా అతడు ప్రసన్నుడై ఉదంకుడితో ఇలా అన్నాడు.)
1_1_109 కందము
మితవచన నీ యధార్ధ
స్తుతుల కతిప్రీతిమానసుఁడ నైతి ననిం
దితచరిత నీకు నభివాం
ఛిత మెయ్యది దానిఁ జెపుమ చేయుదు ననినన్.
(మితవచనా! నీ స్తుతులకు మెచ్చాను. నీకేమి కావాలో చెప్ప," మనగా.)
1_1_110 వచనము
ఉదంకుండు గరంబు సంతసిల్లి యిన్నాగకులం బెల్ల నాకు వశం బగునట్టు లుగ ననుగ్రహింపు మనిన నప్పురుషుం డట్లేని నీయశ్వకర్ణరంధ్రాధ్మానంబు సేయు మనిన వల్లె యని తద్వచనానురూపంబు సేయుడుఁ దత్క్షణంబ.
(ఉదంకుడు సంతోషించి, నాగకులం మొత్తం తన వశమయ్యేలా అనుగ్రహించమని కోరాడు. ఆ దివ్యపురుషుడు అప్పుడు, "అలాగైతే ఈ గుర్రం చెవిలో ఊద"మని అన్నాడు. ఉదంకుడు అలాగే చేయగా.)(మూలంలో ఆ దివ్యపురుషుడు ఉదంకుడికి గుర్రం అపానంలో ఊదమని చెప్పినట్లు ఉంది.)
1_1_111 శార్దూలము
పాతాళైకనికేతనాంతరమునం బర్వెం దదశ్వాఖిల
స్రోతోమార్గవినిర్గతో గ్రదహనార్చుల్ పన్నగవ్రాతముల్
భీతిల్లెన్ భుజగాధినాథుమనమున్ భేదిల్లెఁ గల్పాంతసం
జాత ప్రోద్ధతబాడబానల శిఖాశంకాధికాతంకమై.
(ఆ గుర్రం సర్వేంద్రియమార్గాల నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు పాతాళంలో వ్యాపించగా పాములన్నిటితో పాటు ఆ సర్పాల రాజు కూడా భయపడ్డాడు.)
-:తక్షకుండు కుండలంబులం దెచ్చి యుదంకున కిచ్చుట:-
1_1_112 కందము
శంకరనిభుఁడగు విప్రు భ
యంకరకోపాగ్ని యొక్కొ యనుచును జాతా
తంకుఁడయి కుండలంబులు
దంకునకును దెచ్చి యిచ్చెఁ దక్షకుఁ డంతన్.
(అప్పుడు తక్షకుడు భయంతో ఆ కుండలాలను తెచ్చి ఉదంకుడికి ఇచ్చాడు.)
1_1_113 వచనము
ఇట్లు నాగలోకంబున కెల్ల మహాక్షోభంబు గావించి తక్షకుచేతఁ గుండలంబులు గొని యుదంకుఁ డాత్మగతంబున.
(ఇలా నాగలోకానికంతా మహాక్షోభం కలిగించి, తక్షకుడి దగ్గర కుండలాలు తీసుకుని ఉదంకుడు మనసులో.)
1_1_114 సీసము
కుండలమ్ములు వేగ కొనిరమ్ము నాలవ
నాఁటికి నని పూని నన్నుఁ బనిచె
గురుపత్ని నేఁడ యక్కుండలంబులు దొడ్గు
దివస మీదివస మతిక్రమింప
కుండంగఁబోక యెట్లొడఁగూడు నిన్నాగ
భవన మెప్పాట వెల్వడఁగఁబోలు
నేఁడు పోవనినాఁడు నిష్పలం బిమ్మహా
యత్నమంతయు నని యధికచింతఁ
ఆటవెలది
దవిలియున్న సయ్యుదంకు నభిప్రాయ
మెఱిఁగి దివ్యపురుషుఁడిట్టు లనియె
నీహయంబు నెక్కి యేఁగుమ యిది వడి
గలదు మనముకంటె గాడ్పుకంటె.
(నాలుగురోజుల్లో కుండలాలు తెమ్మని గురుపత్ని నన్ను పంపింది. ఇవి ధరించవలసింది ఈ రోజే. రోజు దాటకుండా ఈ నాగలోకం నుంచి అక్కడకు చేరటం ఎలా? చేరకపోతే ఈ ప్రయత్నమంతా వ్యర్ధం కదా అని ఆలోచించటం ఆ దివ్యపురుషుడు గ్రహించి ఇలా అన్నాడు, "ఈ గుర్రం ఎక్కి వెడితే గాలి కంటే, మనసు కంటే వేగంగా చేరవచ్చు.")
1_1_115 వచనము
అనవుడు నద్దివ్యపురుషు వచనంబున నత్తురంగంబు నెక్కి తత్క్షణంబ యయ్యుదంకుండు గురుగృహంబునకు వచ్చె నిట గురుపత్నియు శుచిస్నాతయై నూతనపరిధానశోభితయై యక్కుండలంబులు దొడువ నవసరంబైనఁ దదాగమనంబు గోరుచున్నయది యప్పు డయ్యుదంకుం గని తద్దయు సంతసిల్లి తదానీతరత్నకుండలభూషితయై బ్రాహ్మణులం బూజించి నిజసంకల్పితమహోత్సవం బొనరించె నట్లు గురుకార్యంబు నిర్వర్తించి యున్న యుదంకుం జూచి గురుం డిట్లనియె.
(అప్పుడు ఉదంకుడు ఆ గుర్రమెక్కి తక్షణమే గురుగృహం చేరాడు. పవిత్రస్నానం చేసి, నూతనవస్త్రాలు ధరించి కుండలాలకోసం ఎదురుచూస్తున్న గురుపత్నికి ఉదంకుడు ఆ కర్ణాభరణాలు అందించగా ఆమె తాను అనుకున్న పూజ పూర్తిచేసింది. గురుకార్యాన్ని పూర్తిచేసిన ఉదంకుడిని చూసి పైలుడు ఇలా అన్నాడు.)
1_1_116 కందము
ఈయున్న పౌష్యు పాలికిఁ
బోయి కడుం బెద్దదవ్వు పోయినయ ట్ల
త్యాయతవిమలతపోమహి
మా యిన్నిదినంబు లేల మసలితి చెపుమా.
"ఉదంకా, ఇక్కడే ఉన్న పౌష్యుడి దగ్గరకు పోయి, చాలా దూరం పోయినట్లు ఆలస్యం ఎందుకు చేశావు?"
1_1_117 వచనము
అనిన నుదంకుం డిట్లనియె నయ్యా మీయానతిచ్చినట్ల మసల వలవదు తక్షకుండను దుష్టోరగంబు సేసిన విఘ్నంబున నింత మసల వలసె మిమ్ము వీడ్కొని చనువాఁడ నెదుర నొక్కమహోక్షంబు నెక్కి చనుదెంచు వాని నొక్కదివ్య పురుషుం గని వాని పన్నిన వృషభగోమయ భక్షణంబు సేసి చని పౌష్యుమహాదేవికుండలంబులు ప్రతిగ్రహించి వచ్చుచోఁ దక్షకుచేత నపహృతకుండలుండనై వాని పిఱుందన పాతాళలోకంబునకు బోయి నాగపతులనెల్ల స్తుతియించి యందు సితాసితతంతుసంతానపటంబు ననువయించుచున్నవారి నిద్దఱస్త్రీలను, ద్వాదశారచక్రంబుఁ బరివర్తించుచున్నవారి నార్వురఁ గుమారుల నతిప్రమాణతురగారూఢుడైన యొక్కదివ్యపురుషుం గని తత్ప్రసాదంబునఁ గుండలంబులు వడసి తదాదేశంబున నత్తురంగంబు నెక్కి వచ్చితి నిది యంతయు నేమి నాకెఱింగింపుఁ డనిన గురుం డిట్లనియె.
(అయ్యా! తక్షకుడనే సర్పరాజు కలిగించిన విఘ్నం వల్ల ఇంత ఆలస్యం అయింది. మీ దగ్గర వీడ్కోలు తీసుకుని వెడుతుండగా ఒక పెద్ద ఎద్దునెక్కి వస్తున్న దివ్యపురుషుడు కనిపించాడు. అతడు తినమన్న గోమయం తిని రాణి వద్ద కుండలాలు తీసుకుని వస్తుండగా తక్షకుడు వాటిని అపహరించాడు. నేను అతడి వెనుకనే నాగలోకానికి వెళ్లి అక్కడి రాజులను స్తుతించాను. అక్కడ తెల్లని, నల్లని దారాలతో వస్త్రాన్ని నేస్తున్న ఇద్దరు స్త్రీలను, పన్నెండాకులు గల చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకులను, ఎత్తైన గుర్రాన్ని ఎక్కిన ఒక దివ్యపురుషుడిని చూశాను. అతడి అనుగ్రహం చేత కర్ణాభరణాలు తిరిగి పొంది, అతడు ఆజ్ఞాపించిన విధంగా ఆ గుర్రాన్ని ఎక్కివచ్చాను. ఇదంతా ఏమిటి? దీని అంతరార్థం నాకు తెలపండి" అని అడగ్గా పైలుడు ఇలా అన్నాడు.)
1_1_118 సీసము
అప్పురుషుం డింద్రుఁ డయ్యుక్ష మైరావ
తంబు గోమయ మమృతంబు నాగ
భువనంబు లోఁగన్న పొలఁతు లిద్దఱు ధాత
యును విధాతయు వారియనువయించు
సితకృష్ణతంతురాజితతంత్రమది యహో
రాత్రంబు ద్వాదశారములు గలుగు
చక్రంబు మాసాత్మసంవత్సరంబు కు
మారు లయ్యార్వురు మహితఋతువు
ఆటవెలది
లత్తురంగ మగ్ని యప్పురుషుండు ప
ర్జన్యుఁడింద్రసఖుఁడు సన్మునీంద్ర
యాది నింద్రుఁ గాంచి యమృతాశి వగుట నీ
కభిమతార్థసిద్ధి యయ్యె నయ్య.
(సన్మునీంద్రా! ఆ పురుషుడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం. గోమయం అమృతం. ఆ ఇద్దరు స్త్రీలు ధాత, విధాతలు. వారు నేసే తెల్లని, నల్లని దారాల మగ్గం దినరాత్రాలకు రూపం. పన్నెండు ఆకులు గల ఆ చక్రం సంవత్సరానికి రూపం. దానిని తిప్పుతున్న ఆరుగురు యువకులు ఋతువులకు రూపాలు. ఆ గుర్రం అగ్ని. దానిని ఎక్కినవాడు ఇంద్రుడి మిత్రుడైన పర్జన్యుడు (మేఘుడని కూడా చెప్పవచ్చు). నీకు అమృతం లభించటం చేత వాంఛితార్థసిద్ధి కలిగింది. కుండలాలు లభించాయి.)
1_1_119 కందము
కర మిష్టము సేసితి మా
కరిసూదన దీన నీకు నగు సత్ఫలముల్
గురుకార్యనిరతులగు స
త్పురుషుల కగుటరుదె యధికపుణ్యఫలంబుల్
(కుండలాలు తెచ్చి నాకు ఇష్టమైన పని చేశావు. గురుకార్యాల్లో ఆసక్తిగల సజ్జనులకు పుణ్యఫలాలు కలగటం అరుదేమీ కాదు కదా?)
1_1_120 వచనము
నీవలనం బరమసం ప్రీతిహృదయుండ నయితి నీవును గుర్వర్థంబునందు ఋణ విముక్తుండవయితివి నిజేచ్ఛనుండు మనినఁదదనుజ్ఞ వడసి యుదంకుండనేకకాలంబు దపంబు సేసె నట్టి యుదంకుండు తక్షకు చేసిన యపకారంబునకుం బ్రతీకారంబు సేయం జింతించి యెక్కనాఁడు జనమేజయమహీపాలు పాలికిం బోయి యిట్లనియె.
(గురుకార్యం చేయటం వల్ల నువ్వు ఋణవిముక్తుడివి అయ్యావు, ఇక నీ ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు, అనగా ఉదంకుడు పైలుడి అనుమతితో చాలాకాలం తపస్సు చేశాడు. తరువాత ఒకరోజు ఉదంకుడు తనకు తక్షకుడు చేసిన అపకారానికి ప్రతీకారం చేయనాలోచించి మహారాజైన జనమేజయుడి వద్దకు వెళ్లి ఇలా అన్నాడు.)