ఆ భా 1 1 031 to 1 1 060

వికీసోర్స్ నుండి

1_1_31 వచనము

అనిన నుగ్రశ్రవసుం డట్లేని మీకు నభిమతంబైన పుణ్యకథఁ జెప్పెద దత్తావధానులరై వినుం డని శౌనకాదిమహామునుల కిట్లని చెప్పం దొడంగె. కృష్ణద్వైపాయనుండను బ్రహ్మర్షి తొల్లి వేదంబు లేకీభూతంబులై యేర్పడ కున్న ఋగ్యజుస్సామాథర్వణంబులుగా విభాగించి తనశిష్యులయిన పైల వైశంపాయనసుమంతుజైమినులం బంచి క్రమంబునఁ జతుర్వేదసూత్రం బులఁ జేయించి వేదవ్యాసుండై నిజతపోమహత్త్వంబునంజేసి బ్రహ్మచేత ననుజ్ఞాతుండై యష్టాదశపురాణంబులును నీతిధర్మశాస్త్రార్థతత్త్వంబులును జతుర్వేదవేదాంతాభిప్రాయంబులును జతుర్వర్గవర్గానుబంధబంధురకథేతి హాసంబులును జతుర్యుగ మహర్షి రాజవంశచరితంబులును జతుర్వర్ణాశ్రమ ధర్మక్రమంబులును జతుర్ముఖప్రముఖనిఖిలసురమునిగణపూజితుండైన శ్రీకృష్ణుని మాహాత్మ్యంబును బాండవాదిభారతవీరులమహాగుణంబును దన విమలజ్ఞానమయంబైన వాగ్దర్పణంబునం దేర్పడి వెలుంగుచుండ.

(మీకు ఇష్టమైన పుణ్యకథను చెపుతానని ఉగ్రశ్రవసుడు మునులతో ఇలా చెప్పనారంభించాడు - కృష్ణద్వైపాయనుడనే బ్రహ్మర్షి కలసి ఉన్న వేదాలను ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణవేదాలుగా విభజించాడు, పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనే తన శిష్యులచేత వరుసగా ఆ వేదాలకు సూత్రాలను రచింపజేశాడు. ఈ కారణం వలన వేదవ్యాసునిగా ప్రసిద్ధి పొందాడు. బ్రహ్మ ఆజ్ఞచేత అష్టాదశపురాణాలను, ఎన్నో గొప్పవిషయాలు నిర్మలమైన జ్ఞానంతో నిండిన తన వాక్కనే అద్దంలో ప్రకాశిస్తుండగా - (భారతాన్ని రచించాడని తర్వాతి పద్యంతో అన్వయం))


1_1_32 సీసము

ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని

యధ్యాత్మవిదులు వేదంత మనియు

నీతివిచక్షణుల్ నీతిశాస్త్రం బని

కవివృషభులు మహాకావ్య మనియు

లాక్షణికులు సర్వలక్ష్యసంగ్రహ మని

యైతిహాసికు లితిహాస మనియుఁ

బరమపౌరాణికుల్ బహుపురాణసముచ్చ

యం బని మహిఁ గొనియాడుచుండ


ఆటవెలది

వివిధవేదతత్త్వవేది వేదవ్యాసుఁ

డాదిముని పరాశరాత్మజుండు

విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై

పరుగుచుండఁ జేసె భారతంబు.

(ఎంతోమంది ఎన్నోరకాలుగా ప్రశంసించే భారతాన్ని గొప్పవాడు, పరాశరుని పుత్రుడు అయిన వేదవ్యాసుడు రచించాడు.)


-:పర్వానుక్రమణిక:-


1_1_33 వచనము

ఆదియునుం బౌష్యంబు పౌలోమం బాస్తీకం బాదివంశావతారంబు సంభవపర్వంబు జతుగృహదాహంబు హైడింబంబు బకవధ చైత్రరథంబు ద్రౌపదీవయంవరంబు వైవాహికంబు విదురాగమనంబు రాజ్యార్ధలాభం బర్జున తీర్థయాత్ర సుభద్రాకల్యాణంబు హరణహారిక ఖాండవదహనంబు మయ దర్శనంబు సభాపర్వంబు మంత్రపర్వంబు జరాసంధవధ దిగ్విజయంబు రాజసూయం బర్ఘ్యాభిహరణంబు శిశుపాలవధ ద్యూతం బనుద్యూతం బార ణ్యంబు కిమ్మీరవధ కైరాతం బింద్రలోకాభిగమనము ధర్మజతీర్థయాత్ర జటాసురవధ యక్షయుద్ధం బాజగరంబు మార్కండేయోపాఖ్యానంబు సత్యా ద్రౌపదీ సంవాదంబు ఘోషయాత్ర ప్రాయోపవేశంబు వ్రీహిద్రోణకాఖ్యా నంబు ద్రౌపదీహరణంబు కుండలాహరణం బారణేయంబు వైరాటంబు కీచకవధ గోగ్రహణం బభిమన్యువివాహం బుద్యోగంబు సంజయయానంబు ధృతరాష్ట్ర ప్రజాగరణంబు సానత్సుజాతంబు యానసంధి భగవద్యానంబు సేనానిర్యాత్ర యులూక దూతాభిగమనంబు సమరథాతిరథసంఖ్యానంబు కర్ణ భీష్మవివాదం బంబోపాఖ్యానంబు జంబూఖండ వినిర్మాణంబు భూమి పర్వంబు భీష్మాభిషేకంబు భగవద్గీత భీష్మవధ ద్రోణాభిషేకంబు సంశ ప్తకవధ యభిమన్యువధ ప్రతిజ్ఞాపర్వంబు జయద్రథవధ ఘటోత్కచవధ ద్రోణవధ నారాయణాస్త్ర ప్రయోగంబు కర్ణపర్వంబు శల్యపర్వంబు హ్రద ప్రవేశంబు గదాయుద్ధంబు సారస్వతంబు సౌప్తికపర్వం బైషీకంబు జల ప్రదానంబు స్త్రీపర్వంబు శ్రాద్ధపర్వంబు రాజ్యాభిషేకంబు చార్వాకనిగ్ర హంబు గృహప్రవిభాగంబు శాంతిపర్వంబు రాజధర్మానుకీర్తనం బాపద్ధ ర్మంబు మోక్షధర్మం బానుశాసనికంబు భీష్మస్వర్గారోహణం బాశ్వమేధికం బనుగీత యాశ్రమవాసంబు పుత్త్రసందర్శనంబు నారదాగమనంబు మౌస లంబు మహాప్రస్థానికంబు స్వర్గారోహణంబు హరివంశంబు భవిష్య త్పర్వంబు ననుశతపర్వంబులు గలిగి.

(ఆ భారతం (పైన పేర్కొన్న) శతపర్వాలను కలిగి)


1_1_34 సీసము

ఆయురర్థులకు దీర్ఘాయుర వాప్తియు

నర్థార్థులకు విపులార్థములును

ధర్మార్థులకు నిత్యధర్మసంప్రాప్తియు

వినయార్థులకు మహావినయమతియుఁ

బుత్త్రార్థులకు బహుపుత్త్రసమృద్ధియు

సంపదర్థుల కిష్టసంపదలును

గావించు చెప్పుడు భావించి వినుచుండు

వారికి నిమ్మహాభారతంబు


ఆటవెలది

భక్తియుక్తులైన భాగవతులకు


శ్రీ వల్లభుండు భక్తవత్సలుండు

భవభయంబులెల్లఁ బాచియిష్టార్థసం

సిద్ధిఁగరుణతోడఁ జేయునట్లు.

(ఈ భారతాన్ని ఎప్పుడూ ధ్యానించేవారికి వారు కోరుకున్నవి విష్ణువు దయవల్ల లభిస్తాయి.)


-:పర్వసంగ్రహము:-

1_1_35 వచనము్ మఱియుఁ బౌష్యోదంకమాహాత్మ్యంబును భృగువంశకీర్తనంబును నాగ గరుడసంభవంబును సముద్రమథనంబు నుచ్చైశ్శ్రవోజన్మంబును సౌపర్ణో పాఖ్యానంబును నాస్తీకచరితంబును జనమేజయసర్పయాగంబును శ్రీ మహా భారతకథాశ్రవణప్రవృత్తియు వ్యాసజన్మంబును దేవదైత్యదానవముని యక్షపక్షిగంధర్వాది నానావిధభూతసంభవంబును దదంశావతారంబును రాజ వంశానుకీర్తనంబును యయాతిచరితంబును భారతవంశానుకీర్తనంబును గంగాశంతనుసమాగమంబును వస్తూత్పత్తియు స్వర్గగమనంబును దదంశ సంఘాతంబున గాంగేయజన్మంబును దద్రాజ్యనివర్తనంబును బ్రహ్మచర్య ప్రతిజ్ఞాపరిపాలనంబును సత్యవతీవివాహంబును జిత్రాంగద విచిత్రవీర్య జన్మంబును జిత్రాంగద రాజ్యాభిషేకంబును జిత్రాంగద మరణానంతరంబున భీష్ముండు విచిత్రవీర్యుం గౌరవరాజ్యంబున నభిషిక్తుం జేయుటయు వాని పరోక్షంబునఁ గృష్ణద్వైపాయనమునివలన ధృతరాష్ట్ర పాండురాజుల జన్మంబు నాణిమాండవ్యోపాఖ్యానంబును ధర్ముండు మాండవ్య శాపంబున శూద్రయోనియందు విదురుండై పుట్టుటయును ధృతరాష్ట్రపాండురాజుల వివాహంబును బాండవధార్తరాష్ట్రసంభవంబును బాండునిర్యాణంబును గృప ద్రోణజన్మకథనంబును గుమారాస్త్రవిద్యాగ్రహణంబును గుమారాస్త్రసందర్శ నంబును గర్ణార్జునుల పరస్పర క్రోధంబును ద్రుపదగ్రహణమోక్షణంబును యుధిష్టిరుయౌవరాజ్యాభిషిక్తుం జేయుటయు దుర్యోధను దుర్మంత్రంబును వారణావతయాత్రయు జతుగృహదాహంబును విదురోపదిష్టద్వారంబునఁ బాండవాపక్రమణంబును హిడింబాదర్శనంబును హిడింబువధయును ఘటో త్కచసంభవంబును బాండవుల కేకచక్రపురంబున విప్రగృహంబున నజ్ఞాత చర్యయు బకవధయు ధృష్టద్యుమ్న ద్రౌపదీజన్మకథనంబును గృష్ణద్వైపా యన సందర్శనంబును గంగాతీరంబున నంగారపర్ణు నర్జునుండు జయించు టయుఁ దాపత్యవసిష్ఠౌర్వోపాఖ్యానంబును బాండవులు పాంచాలదేశంబు నకుం జనుటయు ద్రౌపదీస్వయంవరంబును బంచేంద్రోపాఖ్యానంబును ద్రౌపదీవివాహంబును విదురాగమనంబును గృష్ణసందర్శనంబును రాజ్యార్ధ లాభంబును ఖాండవప్రస్థనివాసంబును సుందోపసుందోపాఖ్యానంబును నారదువచనంబున ద్రౌపదియందు సమయక్రియయును నులూపీసమాగమం బును జిత్రాంగదయందు బభ్రువాహను జన్మంబును ద్వారకా గమనంబును వాసుదేవానుమతంబున నర్జుడుఁడు సుభద్ర వివాహం బగుటయు సుభద్రా హరణంబును హరణహారికయు నభిమన్యుసంభవంబును గాండీవదేవదత్త దివ్యరథాశ్వలాభంబును ఖాండవదహనంబు నగ్నిభయంబువలన మయ భుజంగమోక్షణంబును మందపాలోపాఖ్యానంబును ననువృత్తాంతంబుల నొప్పి తొమ్మిదివేలుందొమ్మన్నూటయెనుబదినాలుగు శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 9984 శ్లోకాలు కలిగి.)


1_1_36 కందమ

మదిఁ బౌష్యపర్వ మాదిగఁ

బదునెనిమిది పర్వములను బర్వి మనః ప్రీ

తిద మగుచు నాదిపర్వం

బది వినఁగా నొప్పు భారతాద్యం బగుచున్.

(పౌష్యపర్వం మొదలుగా 18 ఉపపర్వాలతో ఆదిపర్వం భారతంలోని మొదటి పర్వమౌతోంది.)


1_1_37 వచనము మఱియు ధర్మరాజునకు సభాప్రాప్తియుఁ గింకరదర్శనంబును నారదువలన లోకపాల సభాశ్రవణంబును రాజసూయ మహాధ్వరారంభంబును జరాసంధ వధయును గిరివ్రజనిరుద్ధులైన రాజులఁ గృష్ణుండు విడిపించుటయును దిగ్విజయంబును రాజసూయంబు నర్ఘ్యాభిహరణంబును శిశుపాలవధయును రాజసూయవిభూతికి దుఃఖితుండై సభాస్ఖలితుండై యున్న దుర్యోధనుంజూచి ద్రౌపదీభీమసేనులు నగుటయును దత్కారణంబున జూదం బాడుటయు నందు శకునికైతవంబున ధర్మరాజపరాజయంబును ద్యూతదుఃఖార్ణ వమగ్నులైన పాండవులం బాంచాలి యుద్ధరించుటయును బునర్ద్యూతపరా జితులై పాండవులు వనవాసగతు లగుటయునను వృత్తాంతంబుల నొప్పి నాలుగువేలున్ మున్నూటపదునొకండు శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 4311 శ్లోకాలు కలిగి.)


1_1_38 కందమ

పర్వి సభాప్రభృతిగ నవ

పర్వములను విస్తరిల్లి పండితచేతో

నిర్వృతిఁ జేయుచు రెండవ

పర్వమునా రమ్యమగు సభాపర్వ మిలన్.

(తొమ్మిది ఉపపర్వాలతో సభాపర్వం భారతంలోని రెండవ పర్వమౌతోంది.)


1_1_39 వచనము మఱియు మహారణ్యంబునందు గిమ్మీరవధయును గృష్ణపాంచాలాగమనంబును సౌభకాఖ్యానంబును యుధిష్ఠిరభీమసేనసంవాదంబును గురూపదేశంబున నర్జునుండు దివ్యాస్త్రంబులు వడయఁ దపశ్ఛరణంబు సేయుటయు నీశ్వరుతోడి యుద్ధంబును లోకపాలసందర్శనంబును దివ్యాస్త్రలాభంబును స్వర్గగమనంబును నిట బృహదశ్వుండను మహామునిం గాంచుటయు యుధిష్ఠిరాదుల పరిదేవనంబును నలోపాఖ్యానంబును దమయంతీపతివ్రతాస్తుతియు యుధిష్ఠిరాదులకు నర్జునకుశలవార్త రోమశుండు సెప్పుటయును ధర్మజు తీర్థాభిగమనంబును జటాసురవధయును బాంచాలీనియుక్తుండై భీముండు సౌగంధికపుష్పాహరణార్థంబు గంధమాదనంబునందలి కొలనికిఁ జని యందు మణిమంతుఁడు మొదలుగాఁగల యక్షరాక్షసులం జంపుటయు నాజగరంబు నగస్త్యోపాఖ్యానంబును వాతాపిభక్షణంబు నపత్యార్థం బగస్త్యమహాముని లోపాముద్ర నభిగమించుటయు శ్యేనకపోతంబులైన యింద్రాగ్నులు శిబిమాంసంబు గొనుటయు ఋష్యశృంగు చరితంబును బరశురామ చరితంబును గార్తవీర్యవధయును మాంధాతృజన్మంబును సౌకన్యాఖ్యానంబును భార్గవుండయిన చ్యవనుండు శర్యాతి యజ్ఞంబును నాశ్వినుల సోమపీథులం జేసి వారిచేత జవ్వనంబు వడయుటయు జంతూపాఖ్యానంబును యజ్ఞపుత్త్రుండైన సోమకుండు బహుపుత్త్రార్థంబు యజ్ఞంబుసేసి పుత్త్రశతంబును బడయుటయు వంద్యష్టావక్రుల వివాదంబును సముద్రంబును జయించి తిత్తిరియను మహర్షి తన తండ్రిం బడయుటయు దివ్యాస్త్రంబులు వడసి యర్జునుండు హిరణ్యపురనివాసులయిన పౌలోమకాలకేయనివాతకవచాదులం జంపుటయు గంధమాదనంబున కందఱుం గూడవచ్చుటయు మార్కండేయబహువిధోపాఖ్యానంబును గృష్ణసందర్శనంబును సత్యాద్రౌపదీసంవాదంబును ఘోషయాత్రయుఁ జిత్రసేనాది గంధర్వులఁ బెక్కండ్ర జయించి దుర్యోధనుని విడిపించుటయు దుర్యోధనుని ప్రాయోపవేశంబును వ్రీహిద్రోణకాఖ్యానంబును సరస్వతీగీతయు ధుంధుమారుచరితంబును జయద్రధఁ డాశ్రమాంతరంబున ద్రౌపది నపహరించుటయు భీముండు వానిం బరిభవించుటయు నుద్దాలకోపాఖ్యానంబును వైన్యోపాఖ్యానంబును శ్రీరామాయణకథయును సావిత్ర్యుపాఖ్యానంబును బాండవులు క్రమ్మఱి ద్వైతవనంబునకు వచ్చుటయుఁ గర్ణుకవచకుండలంబు లింద్రుండు గొనుటయు నారణేయోపాఖ్యానంబును యముండు ధర్మజు ననుశాసించుటయు యమువలన వరంబులు వడసి పాండవులు పశ్చిమదిక్కునకుం జనుటయు ననువృత్తాంతంబుల నొప్పి పదుమూఁడువేలు నాఱునూట యఱువదినాలుగు శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 13664 శ్లోకాలు కలిగి.)

1_1_40 కందము

అరణ్యపర్వ మనఁగా

నారణ్య ప్రముఖ షోడశాంతఃపర్వా

ధారమయి సకలసూరిస

భారమ్యంబగు తృతీయ పర్వము వెలయున్.

(ఆరణ్యం మొదలుగా 16 పర్వాలు కలిగి అరణ్యపర్వం భారతంలోని మూడవ పర్వమౌతోంది.)


1_1_41 వచనము మఱియు విరాటనగరంబునకుం జనుచుండి తత్సమీపశమీవృక్షంబునఁ బాండవులు తమ యాయుధంబులు నిక్షేపించి తమ్మెవ్వరు నెఱుంగకుండ విరాటుం గొలిచి యునికియు నందు భీముండు సింహబలుం దొట్టి సకల కీచకుల వధించుటయు గోగ్రహణంబునఁ గురుబలంబుల నెల్ల నొక్కరుండ జయించి ధనంజయుండు గోగణంబులఁ గ్రమ్మఱించుటయు విరాటరాజపుత్త్రియైన యుత్తర నభిమన్యుండు వివాహం బగుటయు నను వృత్తాంతంబుల నొప్పి మూఁడు వేలు నేనూఱు శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 3500 శ్లోకాలు కలిగి.)

1_1_42 కందమ

పర్వుచు వైరాటాదిక

పర్వచతుష్టయమునను సభారంజనమై

సర్వమనోజ్ఞము నాలగు

పర్వమునాఁ దగి విరాటపర్వము వెలయున్.

(వైరాటం మొదలుగా గల నాలుగు ఉపపర్వాలతో విరాటపర్వం భారతంలోని నాల్గవ పర్వమౌతోంది.)


1_1_43 వచనము మఱియు భారతరణోద్యోగులైన పాండవు లుపప్లావ్యంబున విడియుటయు నర్జునదుర్యోధనులు ద్వారకానగరంబునకుం జని శ్రీకృష్ణునిం గని సహాయ త్వంబునకుం బ్రార్థించుటయు నారాయణుండు వారి నాశ్వాసించి నారాయణ గోపాలబలంబుల నిరూపించి వారలం గోరికొం డనుటయు నారాయణుని నొక్కని నర్జునుండు గోరికొనుటయు ధృతరాష్ట్రుండు వనుప నుపశమనార్థం బుపప్లావ్యంబున సంజయుండు పాండవుల కడకుం బోవుటయు వాసుదేవ సహితులైన పాండవుల రణప్రారంభంబు విని ధృతరాష్ట్రుండు నిద్రాహారం బులు విడిచి చింతాక్రాంతుం డగుటయు హితవచనుండైన విదురు పల్కులు వినమియు ధృతరాష్ట్రునకు మనస్తాపోపశమనంబుగా సనత్సుజాతుం డధ్యాత్మ కథలు సెప్పుటయు వాసుదేవార్జునుల యత్యంతసాంగత్యం బెఱింగి వచ్చి సంజయుండు సకల రాజసమక్షంబున విస్తరించుటయు సర్వభూతహితుండైన శ్రీకృష్ణుండు పాండవ ధార్తరాష్ట్రులకు సంధి గావింపం దలంచి హస్తిపురం బునకుం జని యందుఁ గర్ణాది దుష్టశిక్షితుండైన దుర్యోధను దుర్మంత్రం బెఱింగి విశ్వరూపంబుఁ జూపుటయుఁ గృష్ణుండు కర్ణునిం దన రథం బెక్కిం చుకొని యుపాయంబున ననునయించి యొడంబఱుప నేరక కర్ణుచేతం బ్రత్యాఖ్యాతుండయి క్రమ్మఱి వచ్చుటయు బలాతిబలసంఖ్యానంబు నెల్లి యుద్ధంబు సేయవలయునని కురుపతి పనుప నులూకుండను దూత పాండవుల పాలికి వచ్చి పరుసంబులు పలుకుటయు సమరథాతిరథసంఖ్యానంబు నర్ధరథు లలోనం గలయం దన్నెన్నిన నలిగి కర్ణుండు భీష్ము పదిదినంబులు సమర పరాఙ్ముఖుం డగుటయు రామభీష్ముల యుద్ధ కీర్తనంబు నంబోపాఖ్యానంబును సంక్రందనోపాఖ్యానంబును శ్వేతాభిషేకంబు ననువృత్తాంతంబుల నొప్పి యాఱువేలుం దొమ్మన్నూట తొంబది యెనిమిది శ్లోకంబులు గలిగి. (పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 6998 శ్లోకాలు కలిగి.)

1_1_44 కందము

విదితంబై యుద్యోగము

మొదలుగఁ బదు నొకఁడు పర్వముల నెంతయు నొ

ప్పిదమై యేనగు పర్వం

బిదినా నుద్యోగపర్వ మిమ్మగు సభలన్.

(ఉద్యోగం మొదలుగా గల పదకొండు ఉపపర్వాలతో ఉద్యోగపర్వం భారతంలోని అయిదవ పర్వమౌతోంది.)


1_1_45 వచనము మఱియు జంబూఖండవినిర్మాణంబు సంజయుండు ధృతరాష్ట్రునకుం జెప్పుటయు భూవిస్తారంబును భీష్మాభిషేకంబును బాండవమధ్యమవిషాదంబును వాసుదేవుండు మోక్షదర్శనహేతువులం జెప్పి యర్జును మోహభ్రాంతిఁ జెఱుచుటయు శిఖండిం బురస్కరించుకొని యర్జునుండు భీష్ముని వధియించుటయు నను వృత్తాంతంబుల నొప్పి యైదువేలు నెనమన్నూట యెనుబది నాలుగు శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 5884 శ్లోకాలు కలిగి.)


1_1_46 కందమ

జంబూఖండవినిర్మా

ణం బాదిగ హృదయ రోచనములగు నేన్ప

ర్వంబులను భీష్మ పర్వము

పంబి వినం బొలుచు షష్ఠపర్వం బగుచున్.

(జంబూఖండవినిర్మాణం అనే ఉపపర్వం మొదలుగా గల అయిదు ఉపపర్వాలతో భీష్మపర్వం భారతంలోని ఆరవ పర్వమౌతోంది.)


1_1_47 వచనము మఱియు ద్రోణాభిషేకంబును సంశప్తకు లర్జునుం బాపికొనిపోయి యేకతంబు యుద్ధంబు సేయుటయు నర్జునుచేత సుప్రతీకగజంబు తోడన భగదత్తు చావును ద్రోణ కర్ణాదులు పెక్కండ్రు గూడుకొని యధర్మయుద్ధంబున నభిమన్యుం జంపుటయు నర్జునుప్రతిజ్ఞయు నభిమన్యువధకుం గ్రుద్ధుండై యర్జునుం డేడక్షౌహిణుల బలంబుల నొక్కరుండ చంపి సైంధవుం దునుముటయును దొమ్మిది కోట్లు సంశప్తకుల నర్జునుండు నిశ్శేషంబు సేయుటయు నలంబస శ్రుతాయు జలసంధ సోమదత్త భూరిశ్రవో బాహ్లిక విరాట ద్రుపద ఘటోత్కచ ధార్తరాష్ట్ర నారాయణ గోపాలాది వధయును ద్రోణవధయు నశ్వత్థామ నారాయణాగ్నేయాస్త్రకీర్తనంబును గృష్ణార్జునుల మాహాత్మ్యంబును ననువృత్తాంతంబుల నొప్పి పదివేలుం దొమ్మన్నూట పందొమ్మిది శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 10919 శ్లోకాలు కలిగి.)


1_1_48 కందము


విన నేడగు పర్వము మే

లనఁగా ద్రోణాభిషేక మాదిగఁ గల య

య్యెనిమిది పర్వములను న

త్యనుపమమై ద్రోణపర్వ మమరున్ సభలన్.

(ద్రోణాభిషేకం మొదలుగా గల 8 ఉపపర్వాలతో ద్రోణపర్వం భారతంలోని ఏడవ పర్వమౌతోంది.)


1_1_49 వచనము మఱియుఁ గర్ణాభిషేకంబును గర్ణునకు రథంబు గడప శల్యుం బూన్చుటయుఁ ద్రిపురదహనోపాఖ్యానంబును కర్ణశల్యుల పరస్పర వివాదంబును హంస కాకీయోపాఖ్యానంబును యుధిష్ఠిరార్జునుల పరస్పర క్రోధవచనంబులు నర్జు నానునయంబును వృషసేనువధయును దుశ్శాసనుం జంపి భీముండు తద్వక్షో రక్తం బాస్వాదించుటయు విప్రశాపనిమిత్తంబునఁ గర్ణురథచక్రంబు భూమియందుఁ గ్రుంగుటయు నాగాస్త్రభయంబున నర్జునురథంబు శ్రీకృష్ణుండు భూమియందుఁ జొనుపుటయు నింద్రాదిత్యుల పరస్పర సంవాదంబును గర్ణు వధయును నను వృత్తాంతంబుల నొప్పి నాలుగు వేలుం దొమ్మన్నూఱు శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 4900 శ్లోకాలు కలిగి.)

1_1_50 కందము

అనుపమబలు లగు కర్ణా

ర్జునవీరుల శౌర్యమహిమ శోభిల్లంగా

నెనిమిది యగు పర్వం బిది

యనఁ బరగుం గర్ణపర్వ మతిహృద్యంబై.


1_1_51 వచనము మఱియు భారతవీరు లెల్లఁ బరలోకగతులైన శల్యుండు రణభారంబు పూను టయుఁ గురుకుమారవధయును ధర్మజురోషంబున శల్యు మరణంబును గురు ముఖ్యులవధయును సహదేవునిచేత సపుత్త్రకుండైన శకునిచావును సంజయగ్రహణమోక్షణంబును హ్రదప్రవేశంబును భీమదుర్యోధనుల గదా యుద్ధంబును సరస్వత్యాదిపుణ్యతీర్థకీర్తనంబు నను వృత్తాంతంబుల నొప్పి మూఁడువేలు నిన్నూట యిరువది శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 3220 శ్లోకాలు కలిగి.) (కర్ణార్జునుల శౌర్యాన్ని తెలిపే కర్ణపర్వం భారతంలోని ఎనిమిదవ పర్వమౌతోంది.)

1_1_52 ఆటవెలది

సభల విస్తరిల్లి శల్యాదికములైన

నాల్గుపర్వముల వినంగఁ జాలి

నవమపర్వ మనఁగ నవ్యార్థరమణీయ

మగుచు శల్యపర్వ మతిశయిల్లు.

(శల్యం మొదలైన నాలుగు ఉపపర్వాలతో శల్యపర్వం భారతంలోని తొమ్మిదవ పర్వమౌతోంది.)


1_1_53 వచనము మఱియు భీముగదాభిఘాతంబున దుర్యోధనుండు తొడలు విఱిగిపడిన బాండవులు రణం బుపసంహరించి చనిన నాఁటి రాత్రి కృపకృతవర్మాశ్వత్థామలు పాండవశిబిరంబుపయిం జనుటయు నందశ్వత్థామ కోపోద్దీపితుండై తన ప్రతిజ్ఞదీఱ ధృష్టద్యుమ్నపురోగము లైన సర్వపాంచాలురను బ్రతివింధ్యాదిద్రౌపదేయులను బాండవామాత్యులను సుఖసుప్తులయినవారి వధించుటయు నందు శ్రీకృష్ణప్రసాదంబునఁ బాండవులేవురు సాత్యకియుం దప్పుటయుఁ బుత్త్రభ్రాతృవధదుఃఖితయై పాంచాలి యనశనంబు సంకల్పించుకొనుటయు దద్వచనంబున భీముం డశ్వత్థామ పిఱుందం జనుటయు భీమసేనభయార్తుండయి యశ్వత్థామ యుపాండవం బయ్యెడ మని శరమోక్షణంబు సేయుటయు నట్లు గాకుండెడమని శ్రీకృష్ణుండు దానిం బరిహరించుటయు దాని దునియ నర్జునుండు తన దివ్యబాణంబున నేయుటయు వ్యాసాశ్వత్థామల యన్యోన్య శాపంబులు నశ్వత్థామ శిరోరత్నంబుఁ బాండవులు గొనుటయు నను వృత్తాంతంబుల నొప్పి రెండు వేలు నెనమన్నూట డెబ్బది శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 2870 శ్లోకాలు కలిగి.)


1_1_54 కందము

నుతసౌప్తికాది పర్వత్రితయంబునఁ దనరి వసుమతీసురవరస

మ్మతమై సౌప్తికపర్వము ప్రతిభ వినం బొలుచు దశమపర్వం బగుచున్.

(సౌప్తికం మొదలైన మూడు ఉపపర్వాలతో సౌప్తికపర్వం భారతంలోని పదవ పర్వమౌతోంది.)


1_1_55 వచనము మఱియు వీరపత్నీవిలాపంబును గాంధారీధృతరాష్ట్రుల కోపప్రసా దంబులును ధర్మజుండు రణనిహతులైన పితృపితామహాభ్రాతృపుత్త్ర భృత్యామాత్యమాతులాచార్య మిత్రాదులం బరీక్షించి యథావిధి సంస్క రింపం దగువారలం బంచుటయు భారతవీరుల కుదకదానంబు సేయు టయుఁ దత్సమయంబునఁ గుంతీదేవి పాండవులకుఁ గర్ణుండు గూఢో త్పన్నుండని యెఱింగించుటయు ధర్మజువిలాపంబును ధర్మజురాజ్యాభి షేకంబును చార్వాకనిగ్రహంబును గృహప్రవిభాగంబును ననువృత్తాం తంబుల నొప్పి వేయునేడునూటడెబ్బదియైదు శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 1775 శ్లోకాలు కలిగి.)

1_1_56 కందము

పర్వుచు స్త్రీపర్వాదిక

పర్వంబుల నేనిటం గృపాయుతమై స్త్రీ

పర్వంబు పదునొకండగు

పర్వము నావెలయు సుకవిపండితసభలన్.

(స్త్రీపర్వం మొదలైన అయిదు ఉపపర్వాలతో కృపాయుతమైన స్త్రీపర్వం భారతంలోని పదకొండవ పర్వమౌతోంది.)


1_1_57 వచనము మఱియు బంధువర్గంబునెల్ల వధియించి పరమనిర్వేదనపరుండై కృష్ణువచ నంబుల శాంతుండైయున్న ధర్మజునకు శరతల్పగతుండైన భీష్ముండు ధర్మ విదులయిన రాజులకెల్ల హితంబుగా రాజధర్మంబులు నాపద్ధర్మంబులు నేవాని నెఱింగిన సర్వజ్ఞానసంపన్ను లగుదు రట్టి మోక్షధర్మంబులుఁ జెప్పుటయునను వృత్తాంతంబుల నొప్పి పదునాలుగు వేల నేనూట యిరువదియైదు శ్లోకం బులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 14525 శ్లోకాలు కలిగి.)


1_1_58 కందము

సకలహితంబై శాంత్యా

దికపర్వచతుష్కమున విదితమై సమబు

ద్ధికిఁ బండ్రెం డగు పర్వం

బ కడున్ మేలనఁగ శాంతిపర్వము వెలయున్.

(శాంతి మొదలైన నాలుగు ఉపపర్వాలతో శాంతిపర్వం భారతంలోని పన్నెండవ పర్వమౌతోంది.)


1_1_59 వచనము మఱియుఁ బితామహుండగు గాంగేయువలన సర్వధర్మనిశ్చయంబును దానవిధులును నాచారవిధులును ధర్మరా జెఱుంగుటయుఁ బుత్త్రానుశాసనంబును భీష్మస్వర్గారోహణంబు నను వృత్తాంతంబుల నొప్పి పండ్రెండువేల శ్లోకంబులు గలిగి.

(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 12000 శ్లోకాలు కలిగి)


1_1_60 కందము

ఒనరుఁ ద్రయోదశపర్వం

బనఁగా ననుశాసనాద్యమగు పర్వయుగం

బున మేలై విబుధశ్రే

ణినుతంబై యానుశాసనికపర్వ మిలన్

(అనుశాసనం మొదలైన రెండు ఉపపర్వాలతో అనుశాసనిక పర్వం భారతంలోని పదమూడవ పర్వమౌతోంది.)