ఆ భా 1 1 001 to 1 1 030
శ్రీమదాంధ్రమహాభారతము
ఆదిపర్వము
నన్నయ కవి ప్రణీతము
పరిష్కర్త - కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
ప్రచురణ - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ
1_1_1 శార్దూలవిక్రీడితము (మంగళశ్లోకము)
శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వ స్సురై
ర్భూయాసుః పురుషోత్త మామ్బుజభవ శ్రీకన్ధరా శ్శ్రేయసే.
-:అవతారిక:-
1_1_2 వచనము
అని సకలభువనరక్షణ ప్రభువులై యాద్యులైన హరిహరహిరణ్యగర్భ పద్మోమావాణీపతుల స్తుతియించి తత్ప్రసాదసమాసాదిత నిత్యప్రవర్ధ మాన మహామహీరాజ్యవిభవుండును నిజభుజవిక్రమవిజితారాతిరాజ నివహుండును నిఖిలజగజ్జేగీయమాననానాగుణరత్నరత్నాకరుండును నై పరగుచున్న రాజరాజనరేంద్రుండు.
(అని త్రిమూర్తులను పొగడి గొప్పరాజైన రాజరాజనరేంద్రుడు)
1_1_3 ఉత్పలమాల
రాజకులైకభూషణుఁడు రాజమనోహరుఁ డన్యరాజతే
జోజయశాలిశౌర్యుఁడు విశుద్ధయశశ్శరదిందుచంద్రికా
రాజితసర్వలోకుఁ డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుఁడు రాజమహేంద్రుఁ డున్నతిన్.
(గొప్పరాజైన రాజరాజనరేంద్రుడు ఔన్నత్యంతో)(మీది పద్యంతో అన్వయం)
1_1_4 కందము
విమలాదిత్యతనూజుఁడు
విమలవిచారుఁడు గుమారవిద్యాధరుఁ డు
త్తమచాళుక్యుఁడు వివిధా
గమవిజితశ్రముఁడు తుహినకరుఁ డురుకాంతిన్.
(విమలాదిత్యుని పుత్రుడు, శ్రేష్ఠుడైన చాళుక్యవంశపు రాజు, గొప్పవాడు అయిన రాజరాజనరేంద్రుడు)
1_1_5 చంపకమాల
ఘనదురితానుబంధకలికాలజదోషతుషారసంహతిం
దన యుదయప్రభావమున దవ్వుగఁ జోపి జగజ్జనానురం
జన మగు రాజ్యసంతతవసంతనితాంతవిభూతి నెంతయుం
దనరుఁ జళుక్యమన్మథుఁడు ధర్మనిబద్ధదయార్ద్రబుద్ధి యై.
(చాళుక్యరాజనే మన్మథుడు ధర్మనిబద్ధమైనదీ, దయార్ద్రమైనదీ అయిన బుద్ధిగలవాడై ప్రకాశిస్తున్నాడు.)
1_1_6 ఉత్పలమాల
ఆశ్రితపోషణంబున ననంతవిలాసమునన్ మనీషివి
ద్యాశ్రమత త్త్వవిత్త్వమున దానగుణాభిరతిన్ సమ స్తవ
ర్ణాశ్రమధర్మరక్షణమహామహిమన్ మహి నొప్పు సర్వలో
కాశ్రయుఁ డాదిరాజనిభుఁ డత్యకలంకచరిత్రసంపదన్.
(సర్వలోకాశ్రయుడు (చాళుక్యరాజులకు బిరుదు), గొప్పగుణాల్లో పూర్వపురాజులకు సమానుడు అయి ప్రకాశిస్తున్నాడు.)
1_1_7 సీసము
నిజమహీమండలప్రజఁ బ్రీతిఁ బెంచుచుఁ
బరమండలంబుల ధరణిపతుల
నదిమి కప్పంబుల ముదముతోఁ గొనుచును
బలిమి నీయని భూమివలయపతుల
నుక్కడఁగించుచు దిక్కులఁ దనయాజ్ఞ
వెలుఁగించుచును విప్రకులము నెల్లఁ
బ్రోచుచు శర ణన్నఁ గాచుచు భీతుల
నగ్రజన్ములకు ననుగ్రహమునఁ
ఆటవెలది:
జారుతరమహాగ్రహారంబు లిచ్చుచు
దేవభోగముల మహావిభూతిఁ
దనరఁ జేయు చిట్లు మనుమార్గుఁ డగు
విష్ణువర్ధనుండు వంశవర్ధనుండు.
(గొప్పరాజైన విష్ణువర్ధనుడు(రాజరాజనరేంద్రుడు))(మీది వచనంతో అన్వయం)
1_1_8 వచనము
అఖిలజలధివేలావలయితవసుమతీవనితావిభూషణంబైన వేంగీదేశంబునకు నాయకరత్నంబునుంబోని రాజమహేంద్రపురంబునందు మహేంద్రమహిమ తోఁ బరమానందంబున ననవరతమహామహీరాజ్యసుఖంబు లనుభవించుచు సకలభువనలక్ష్మీవిలాసనివాసంబయిన రమ్యహర్మ్యతలంబున మంత్రి పురోహిత సేనాపతి దండనాయక దౌవారిక మహాప్రధాన సామంత విలాసినీ పరివృతుఁడయి యపారశబ్దశాస్త్రపారగులైన వైయాకరణులును భారత రామాయణానేకపురాణప్రవీణులైన పౌరాణికులును మృదుమధురరసభావ భాసురనవార్థవచనరచనావిశారదులయిన మహాకవులును వివిధతర్కవిగా హితసమస్తశాస్త్రసాగరగరీయ:ప్రతిభులైన తార్కికులును నాదిగాఁ గలుగు విద్వజ్జనంబులు పరివేష్ఠించి కొలుచుచుండ విద్యావిలాసగోష్ఠీసుఖోపవిష్టుం డయి యిష్టకథావినోదంబుల నుండి యొక్కనాఁడు.
(భూమి అనే స్త్రీకి అలంకారమైన వేంగీదేశానికి నాయకరత్నం వంటి రాజమహేంద్రపురంలో రాజ్యసుఖాలనుభవిస్తూ లక్ష్మీనివాసమైన రమ్యహర్మ్యతలంలో రాజోద్యోగులు, కవులు, పండితులు చుట్టూ ఉండగా విద్యాగోష్ఠులతో సుఖంగా కూర్చుండి, ఇష్టకథలతో ఉండి ఒకరోజున.)
1_1_9 సీసము
తన కులబ్రాహ్మణు ననురక్తు నవిరత
జపహోమతత్పరు విపులశబ్ద
శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది
నానాపురాణవిజ్ఞాననిరతుఁ
బాత్రు నాపస్తంబసూత్రు ముద్గలగోత్ర
జాతు సద్వినుతావదాతచరితు
లోకజ్ఞు నుభయభాషాకావ్యరచనాభి
శోభితు సత్ప్రతిభాభియోగ్యు
ఆటవెలది:
నిత్యసత్యవచను మత్యమరాధిపా
చార్యు సుజను నన్నపార్యుఁ జూచి
పరమధర్మవిదుఁడు వరచళుక్యాన్వయా
భరణుఁ డిట్టు లనియెఁ గరుణతోడ.
(గొప్ప పండితుడైన నన్నయతో రాజరాజనరేంద్రుడు ఇలా పలికాడు)
1_1_10 చంపకమాల
విమలమతిం బురాణములు వింటి ననేకము లర్థధర్మశా
స్త్రములతెఱం గెఱింగితి నుదాత్తరసాన్వితకావ్యనాటక
క్రమములు పెక్కు సూచితి జగత్పరిపూజ్యమునైన యీశ్వరా
గమములయందు నిల్పితిఁ బ్రకాశముగా హృదయంబు భక్తితోన్.
(అనేకపురాణాలు విన్నాను, ధర్మార్థశాస్త్రాలు తెలుసుకున్నాను, చాలా కావ్యనాటకాలు తిలకించాను, శైవాగమాల్లో హృదయాన్ని భక్తితో ఉంచాను.)
1_1_11 వచనము
అయినను నాకు ననవరతంబును శ్రీమహాభారతంబునందుల యభిప్రాయంబు పెద్దయై యుండు.
(అయినా నాకు శ్రీమహాభారతంలోని తాత్పర్యం గొప్పదిగా అనిపిస్తుంది.)
1_1_12 మత్తేభము
ఇవి యేనున్ సతతంబు నాయెడఁ గరం బిష్టంబు లై యుండుఁ బా
యవు భూదేవకులాభితర్పణమహీయఃప్రీతియున్ భారత
శ్రవణాసక్తియుఁ బార్వతీపతిపదాబ్జధ్యానపూజామహో
త్సవమున్ సంతతదానశీలతయు శశ్వత్సాధుసాంగత్యమున్.
(ఈ అయిదు విషయాలూ(పద్యంలో ఉన్నవి) నా హృదయంలో మిక్కిలిప్రీతికరాలై ఉంటాయి. తొలగవు.)
1_1_13 వచనము
మఱి యదియునుంగాక.
(అదీగాక)
1_1_14 చంపకమాల
హిమకరుఁ దొట్టి పూరుభరతేశకురుప్రభుపాండుభూపతుల్
క్రమమున వంశకర్త లనఁగా మహి నొప్పిన యస్మదీయవం
శమునఁ బ్రసిద్ధులై విమలస ద్గుణశోభితులైన పాండవో
త్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్ట మెంతయున్.
(చంద్రుడు మొదలుగా పూరువు, భరతుడు, కురురాజు, పాండురాజులు వరుసగా వంశకర్తలవగా భూమిమీద ప్రకాశించిన మా వంశంలో ప్రసిద్ధులైన పాండవుల చరిత్ర వినటం నాకెప్పుడూ ఇష్టమే.)
1_1_15 చంపకమాల
అమలసువర్ణశృంగఖురమై కపిలంబగు గోశతంబు ను
త్తమబహువేదవిప్రులకు దానము సేసిన తత్ఫలంబు త
ధ్యమ సమకూరు భారతకథాశ్రవణాభిరతిన్ మదీయచి
త్తము ననిశంబు భారతకథాశ్రవణప్రవణంబ కావునన్.
(ఎంతో పుణ్యం చేసిన ఫలితం భారతకథను వినే ఆసక్తిచేత కలుగుతుంది. నా హృదయం కూడా ఈ కథను వినాలని కుతూహలపడుతూ ఉంటుంది. కాబట్టి)
1_1_16 కందము
జననుతకృష్ణద్వైపా
యన మునివృషభాభిహిత మహాభారతబ
ద్ధనిరూపితార్థ మేర్పడఁ
దెనుఁగున రచియింపు మధికధీయుక్తిమెయిన్.
(వ్యాసమునివృషభుని మహాభారతంలో ఉన్న అర్థం స్పష్టమయ్యేటట్లు తెలుగులో రచింపుము.)
1_1_17 కందము
బహుభాషల బహువిధముల
బహుజనములవలన వినుచు భారతబద్ధ
స్పృహులగు వారికి నెప్పుడు
బహుయాగంబులఫలంబు పరమార్థ మిలన్
(అనేక విధాలుగా భారతకథని వింటూ అందులో ఆసక్తి పెంచుకున్నవారికి అనేక యాగాలు చేసిన ఫలం కలుగుతుంది.)
1_1_18 వచనము
అని యానతిచ్చిన విని యక్కవివరుం డిట్లనియె.
(అని ఆజ్ఞాపించగా నన్నయ ఇలా పలికాడు.)
1_1_19 చంపకమాల
అమలినతారకాసముదయంబుల నెన్నను సర్వవేదశా
స్త్రముల యశేషపారము ముదంబునఁ బొందను బుద్ధిబాహువి
క్రమమున దుర్గమార్థ జలగౌరవభారతభారతీసము
ద్రముఁ దఱియంగ నీఁదను విధాతృనకైనను నేరఁ బోలునే.
(ఆకాశంలోని నక్షత్రాలసమూహాలను లెక్కించటానికీ, సర్వవేదసారాన్ని తెలుసుకోవటానికీ, బుద్ధి అనే భుజాల బలంతో దుర్గమమైన అర్థం అనే నీటితో కూడిన భారతవాఙ్మయమనే సముద్రాన్ని ఈదటానికీ బ్రహ్మకైనా సాధ్యమౌతుందా?)
1_1_20 వచనము
అయినను దేవా నీయనుమతంబున విద్వజ్జనంబుల యనుగ్రహంబునం నానేర్చువిధంబున నిక్కావ్యంబు రచియించెద నని.
(అయినా ప్రభూ, నీ సమ్మతితో, పండితుల దయతో, నాకు తెలిసినవిధంగా ఈ కావ్యాన్ని రచిస్తాను.)
1_1_21 తరలము
హరిహరాజగజాననార్కషడాస్యమాతృసరస్వతీ
గిరిసుతాదిక దేవతాతతికిన్ నమస్కృతి సేసి దు
ర్భరతపోవిభవాధికున్ గురుఁ బద్యవిద్యకునాద్యు నం
బురుహగర్భనిభుం బ్రచేతసుపుత్త్రు భక్తిఁ దలంచుచున్.
(దేవతలకు నమస్కరించి, గొప్ప ఆచార్యుడు, ఆదికవి, ప్రచేతసుని పుత్రుడు అయిన వాల్మీకిని భక్తితో స్మరిస్తూ.)
1_1_22 ఉత్పలమాల
భారతభారతీశుభగభస్తిచయంబులఁ జేసి ఘోరసం
సారవికారసంతమసజాలవిజృంభము వాపి సూరిచే
తోరుచిరాబ్జబోధనరతుండగు దివ్యుఁ బరాశరాత్మజాం
భోరుహమిత్రుఁ గొల్చి మునిపూజితు భూరియశోవిరాజితున్.
(భారతవాక్కులనే కిరణాలతో సంసారంలోని దుర్గుణాలనే చీకట్లను పోగొట్టి పండితహృదయాలనే పద్మాలను వికసింపజేయటంలో ఆసక్తికలవాడున్నూ, గొప్పవాడున్నూ అయిన వ్యాసుడనే సూర్యుని కొలిచి.)
1_1_23 వచనము
మఱియును
(అంతేకాక.)
1_1_24 చంపకమాల
పరమవివేకసౌరభవిభాసితసద్గుణపుంజవారిజో
త్కరరుచిరంబులై సకలగమ్యసుతీర్థములై మహామనో
హరసుచరిత్రపావనపయఃపరిపూర్ణములైన సత్సాభాం
తరసరసీవనంబుల ముదం బొనరం గొనియాడి వేడుకన్.
(గొప్పజ్ఞానమనే సౌరభంతో ప్రకాశించే సద్గుణసమూహమనే పద్మాలచేత అందమైనవై, అందరూ చేరదగ్గ తీర్థాలై (సత్పురుషులు కలవై), మంచి ప్రవర్తనలనే పవిత్రజలాలతో నిండిన పండితసభలనే సరస్సులను సంతోషం కలిగేలా కొనియాడి.)
1_1_25 ఉత్పలమాల
పాయక పాకశాసనికి భారత ఘోరరణంబునందు నా
రాయణునట్లు తానును ధరామరవంశవిభూషణుండు నా
రాయణభట్టు వాఙ్మయధురంధరుఁడుం దనకిష్టుఁడున్ సహా
ధ్యాయుఁడు నైనవాఁ డభిమతంబుగఁ దోడయి నిర్వహింపఁగన్.
(భారతరణంలో అర్జునునికి కృష్ణునివలె, వానసవంశానికి అలంకారమైనవాడు, వాఙ్మయధురంధరుడు, మిత్రుడు, సహాధ్యాయుడు అయిన నారాయణభట్టు తోడుగా నిర్వహింపగా.)
1_1_26 ఉత్పలమాల
సారమతిం గవీంద్రులు ప్రసన్నకథాకవితార్థయుక్తి లో
నారసి మేలు నా నితరు లక్షరరమ్యత నాదరింప నా
నారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా
భారతసంహితారచనబంధురుఁ డయ్యె జగద్ధితంబుగన్.
(కవీంద్రులు ప్రసన్నకథాకవితార్థయుక్తిని ప్రశంసించగా, ఇతరులు అక్షరరమ్యతను ఆదరింపగా, ఎన్నో మంచి అర్థాలతో కూడిన సూక్తులకు నిధి అయిన నన్నయ తెలుగులో మహాభారతరచనాబంధురుడైనాడు.)
-:భారతకథాప్రస్తావన:-
1_1_27 వచనము
తత్కథాప్రారంభం బెట్టి దనిన.
(ఆ కథాప్రారంభం ఎటువంటిదనగా.)
1_1_28 సీసము
నైమిశారణ్యపుణ్యక్షేత్రమునఁ గుల
పతి శౌనకుండను పరమమౌని
బ్రహ్మర్షి గణసముపాసితుండై సర్వ
లోకహితార్థంబు లోకసుతుఁడు
ద్వాదశవార్షికోత్తమసత్రయాగంబు
మొగిఁ జేయుచున్న నమ్మునులకడకు
వచ్చి తా నుగ్రశ్రవసుఁడను సూతుఁడు
రౌమహర్షణి సుపౌరాణికుండు
ఆటవెలది
పరమభక్తితోడఁ బ్రణమిల్లి యున్న
నక్కథకువలన మునినికాయ మెల్ల
వివిధపుణ్యకథలు వినువేడ్క నతనిఁ
బూజించి రపరిమితవిశేషవిధుల.
(నైమిశారణ్యంలో కులపతి అయిన శౌనకుడనే గొప్పముని పన్నెండు సంవత్సరాలు జరిగే సత్రయాగం చేస్తుండగా, రోమహర్షణుని కుమారుడు, పౌరాణికుడు అయిన ఉగ్రశ్రవసుడనే సూతుడు ఆ శౌనకాదిమునుల వద్దకు వచ్చి నమస్కరించగా, ఆ కథకుని ద్వారా వివిధపుణ్యకథలు వినాలనే ఆసక్తితో ఆ మునులంతా అతన్ని అనేకవిధానాలలో పూజించారు.)
1_1_29 వచనము
అక్కథకుండు వెండియు నమ్ముని సంఘంబునకు నమస్కారంబు చేసి యే ననేక పురాణపుణ్యకథాకథనదక్షుండ వ్యాసశిష్యుండైన రోమహర్షణునకుఁ బుత్త్రుండ నావలన నెక్కథ విన వలతు రనిన నమ్మును లతని కిట్లనిరి
(ఆ కథకుడు మళ్లీ ఆ మునులకు నమస్కారం చేసి, "నేను అనేకపురాణాలలోని పుణ్యకథలను చెప్పటంలో సమర్థుడిని, వ్యాసశిష్యుడైన రోమహర్షణుని కుమారుడిని, నానుండి మీరు ఏ కథ వినాలని కోరుతున్నారు?", అనగా ఆ మునులు ఇలా అన్నారు.)
1_1_30 కందము
కందము
ఏయది హృద్య మపూర్వం
బేయది యెద్దాని వినిన నెఱుక సమగ్రం
బై యుండు నఘనిబర్హ ణ
మేయది యక్కథయ వినఁగ నిష్టము మాకున్.
(ఏ కథ మనోహరమో, ఏది అపూర్వమో, దేన్ని వింటే సమగ్రమైన జ్ఞానం లభిస్తుందో, ఏది పాపాలని తొలగించేదో ఆ కథ వినటం మాకు ఇష్టం.)