ఆ భా 10 2 1 to 10 2 30

వికీసోర్స్ నుండి

10_2_1
శ్రీశాశ్వతత్వకరణక
లాశాలిదయాదియాదినిర్మలజ్ఞానమయా
నాశోత్పత్తరహిత శు
ద్ధాశయసంభజనమహిత హరిహరనాథా.


10_2_2 వ.
దేవా వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె నట్లు సూర్యోదయం బైన
యాసమయంబున సమీరనందనాదిసోదరులును శౌరిసాత్యకులుం బరివేష్టింప
నున్నధర్మతనయుపాలికిఁ బఱతెంచి ధృష్టద్యుమ్నునిసారథి సాష్టాంగదండప్రణా
మంబు సేసి కరకమలంబులు మొగిడ్చి.


10_2_3 సీ.
నరవర మనవీడు నడిరేయి కృతవర్మయును గృపాచార్యుండుఁ దనకుఁ దోడు
గా వచ్చి జనులు నిద్రావివశాత్ములై యుండ నశ్వత్థామ యొకఁడు సొచ్చి
తొలుత ధృష్టద్యుమ్నుఁ ద్రుంచి తత్సోదరతనయాదిపాంచాలతతుల ముట్టి
యన్యాయవిధిని నింద్యం బైనవిక్రమలీలాతిశయమున నేలఁ గలిపి


ఆ.
చేదిబలము నెల్లఁ జెండి మాత్స్యప్రభ,ద్రకులు మేలుకాంచి ద్రౌపదేయు
లను శిఖండిఁ గూర్చికొని తన్నుఁ దాఁకిన,బెట్టు చంపె నంతవట్టువారి.


10_2_4 వ.
మఱియును.


10_2_5 స్రగ్ధర.
వీ డెల్లం దల్లడిల్లన్ వివిధగతుమై విక్రమోల్లాస మొందం
గ్రీడాకల్పంబుగా నాకృతిఁ గని ప్రజ శంకించి దైత్యుం డనం జెం
డాడెన్ శీర్షవ్రజంబున్ హరులగముల వేఁటాడె నేనుంగులం దు
న్మాడెం గౌక్షేయహేలాభ్యసనలసితబాహార్గళాభీషణుండై.


10_2_6 తే.
అడవి దరమిడి నఱుకంగ నందుఁ గలవి
హంగమంబులు గలగొన నఱచు తెఱఁగు
దోఁచె నాతఁడు యోదులఁ దునుమఁ గలఁగి
యన్యజనము లాక్రందించునప్పుడధిప.


10_2_7 క.
అఱచినఁ బఱచిన వ్రేళులు,గఱచిన నతఁ డించుకయును గరుణింపక యం
దఱ నుఱుముసేసె గుంపుల,కుఱికి యుఱికి ఖడ్గదారుణోల్లసనములన్.


10_2_8 వ.
ఆసమయంబున.


10_2_9 మహాస్రగ్ధర.
కృపుఁడున్ హార్దిక్యుఁడున్ వాకిటనిలిచి భయాక్షిప్తయోధవ్రజంబున్
నృపులున్ వేనిర్గమింప న్వివిధశరముల న్మేదినిం గూల్చుచున్ ఘో
రపుసంరంభంబు దుర్వారముగఁ గెరలి రౌద్రంబురూపంబు దాల్పం
గుపితక్రవ్యాదులో నాఁ గుచరితనిరతిం గ్రూరతాధుర్యులైనన్.


10_2_10 వ.
తత్ప్రదేశంబు నవ్వీటిలోనుంబోలెఁ బీనుంగుపెంట యయ్యె నట్లు శిబిరంబునం
గలకరితురగనరనికరంబులు నిశ్శేషత్వంబు నొందె నాయుశ్శేషంబుకతంబు
నం గృతవర్మచేతం బట్టువడి యతండు మందల విడువ నిట వచ్చితి నని చెప్పి
నం బాండవాగ్రజుండు.


10_2_11 తే.
శోకవేగసంతప్తుఁడై సొలసి వ్రాల,సంభ్రమమ్మునఁ బట్టిరి సాత్యకియును
గవలు భీమసేనుండును గరతలముల, నుమ్మలికము నెమ్మనములఁ గ్రమ్ముదేర.


10_2_12 వ.
కొండొకసేపునకు మూర్ఛ దేఱి యన్నరపాలుం డెలుంగు రాల్పడ నిట్లనియె.


- ధర్మరాజు తనపుత్రు లశ్వత్థామచేఁ జచ్చుట విని పలవించుట -


10_2_13 సీ.
ఎట్టివారలకైన నెఱుఁగంగ నగునె కార్యంబులగతు లుపాయంబు బలుపు
వెలయంగ నట్లు శత్రుల బంధుమిత్రపుత్రామాత్యయుతముగ నాహవమున
నందఱ నేఁ దెగటార్చినవాఁడనై విజయంబు సేకొని విభవ మెసఁగ
నిట యేఁగుదెంచితి నట బంధుమిత్రపుత్రామాత్యయుతముగ నస్మదీయ


తే.
బలము నెల్లను ముట్టి శత్రులు నితాంత,ఘోరముగఁ దెగటార్చిరి కుత్సితంపు
విధమువాటిల్లె నస్థిరవిజయమునఁ బ,రాజయమ యాడు నింక ధరాజనంబు.


10_2_14 స్రగ్ధర.
బాణజ్యాలానితాంతప్రసరణముల శుంభద్ద్విషత్సాంద్రసైన్య
శ్రేణీకాంతారముల్ చూర్ణితములు గఁ బటుక్రీడమైఁ దేజరిల్లెన్
ద్రోణాచార్యాగ్నివేఁడిం దొడరక మెఱసెన్ దోర్విలాసంబు వైరులా
ప్రాణంబుల్ నాఁచికోల్ దప్పదు తుది విధి యబ్బాలురం ద్రెళ్లవైచెన్.


10_2_15 మహాస్రగ్ధర.
శరదంష్ట్రాభీషణం బైచటులరిపుమృగస్వైరవిధ్వంసలీలా
స్ఫురణన్ శోభిల్లురాధాసుతుఁ డనుపులివిస్ఫూర్జితంబున్ సహింపన్
వెరవున్ దర్పంబుఁ గల్గెన్ వికలపిపులచే వీటిఁబోయెం గుమారో
త్కర మిం కేమందు నాపత్పరికలన ప్రమాదంబునం గాక యున్నే.


10_2_16 స్రగ్ధర.
శాతాస్త్రస్ఫారవీచీసముదయరభసాశ్చర్యసంపాదిహేలా
స్ఫీతంబైక్రమ్ముదేరన్ బెదరక కలఁచెన్ భీష్మవారాశిఁ దుచ్ఛా
రాతివ్యాపారదుర్వారతఁ దెగియెఁ గుమారవ్రజం బక్కటా ని
ద్రాతంద్రావ్యాప్తినక్రూరతఁ బొరసి భుజాప్రౌఢి వమ్మయ్యెఁ జుమ్మీ.


10_2_17 ఆ.
అధికబలము గెల్చి యవనీపతులు గొంద,ఱతివిహీనరిపులయాక్రమమున
మడిసి రకట జలధివెడలి సన్నపుఁ గ్రయ్య, మునిఁగి రూపడంగుజనులమాడ్కి.


10_2_18 చ.
జనకుఁడు లేమికిం గుడువిషాదము నొందెడికృష్ణ యిమ్మెయిం
దనయులు భ్రాతలుం దెగుట దా విని మూర్ఛ మునుంగునెమ్మనం
బును నవశంపుమేను నయి భూస్థలిఁ ద్రెళ్లక యున్నె తేఱెనే
నిని బటుశోకవేగమున నిర్భరవేదనఁ జెంద కుండునే.


10_2_19 క.
మున్నిట్టితెఱఁగుశోకం, బెన్నఁడు దా ననుభవించి యెఱుఁగ దకట నేఁ
డన్నెలఁత యలఁతపెల్లున,నెన్నియవస్థలకు వచ్చి యె ట్లయ్యెడినో.


10_2_20 వ.
అని వగలం బొగిలి పాంచాలి రావింపం దలంచి తనపనువున నవ్వెలంది ద్రుపద
విరాటులు చచ్చినమఱునాఁడు తదీయపత్నులకు శోకాపనోదంబు సేయుటకై
సుభద్రయు నుత్తరయును దోనరుగ విడిదలనుండి విరాటుపురంబున కరిగి
ద్రుపదుండును గొడుకులు నవ్వీటికి వచ్చునాఁడు దోడన వచ్చి కోడండ్రును
దానును నంద యున్నయాద్రుపదుపత్నిం గాంచి పందంపడి సుభద్ర యర్జును న
నుమతి వడసి ద్వారవతికింబోవ నమ్మత్స్యపురంబున నునికిం యన్నరనాథుండు
నకులుం గనుంగొని యతిత్వరితగమనంబునకుం దగురథంబునం జటులంబు
లైనరథ్యంబులం బూన్చికొని యుపప్సావ్యంబునకుం జని ద్రుపదనందనను దక్కు
ను మనదెసం గలుగునంగనలను ద్రుపదమత్స్యపతిపక్షంబుభామలను దోడ్కొని
యవ్విడిదలకుం జనుదెమ్మని చెప్పి యేము నయ్యెడకుం జనుదెంచెదమనుటయు
నతండు తదుక్తప్రకారంబునం జనియె నజ్జనవల్లభుండు తక్కటితమ్ములును దామో
దరసాత్యకులును నడలుచుఁ దన్నుం బొదివికొని చనఁ గౌరవశిబిరంబునం గల
జనంబులు గొల్చి వోవ నేడ్చుచు నిజశిబిరంబునకుం బోయి తత్ప్రదేశంబున.


10_2_21 మహాస్రగ్ధర.
స్ఫురదశ్వత్థామచంచద్భుజలసదసివిస్ఫూర్జితక్రూరధారా
పరికృత్తావ్యక్తగాత్రప్రకరుల సఖులన్ బంధులం బుత్రులం దాఁ
గరణం బుప్పొంగ నార్తిం గనుఁగొని వికలాంగత్వముం బొంది మూర్ఛా
పరతంత్రుండై ధరిత్రిం బడినఁ బడిరి తద్భ్రాతలుం గేశవుండన్.


10_2_22 వ.
ఇట్లు పడి సాత్యకిప్రయత్నంబున నందఱుం దెలిసిరి ధర్మనందనుండు వెడవెడ
దెలిసియు మగుడ నిగుడునడలున మనంబు మునుంగ వెగడొంది నందనుల
తనువులమీఁద వదనంబు బాష్పాంబుధారాక్రాంతంబుగాఁ బ్రకటాక్రందనంబు
సేయుచుఁ బలవించు చుండెఁ గృష్ణార్జునులు సముచితభాషణంబుల బోధించి
రి తక్కటివారును దగుమాటల నుపచరించిరి కొండొకసేపునకు నవ్విభుండు
రోదనంబు దక్కి.


10_2_23 తే.
పుత్రులకు బాంధవులకును మిత్రతతికి
నగ్నికార్యంబు వొగులుచు నాచరించి
యొక్కచోట నాసీనుఁడై యుండె ద్రుపద
తనయ వచ్చుట వార్చి నెమ్మనము దలర.


10_2_24 వ.
అద్దేవియు నకులునిచేత నుపప్లావ్యంబున సుతసోదరమరణప్రకారంబు విను
టంజేసి.


10_2_25 క.
అలఁత గదిరి నో రెండఁగఁ,బలవించుచుఁ దోడుతోడ బాష్పజలం బ
గ్గల మైక్రమ్మఁగ సొలయుచుఁ,దెలియుచు నాతనికి నడలు దీపింపంగన్.


10_2_26 వ.
అరుగుదెంచి యంతంత నవనీకాంతుఁ గాంచి యధికశోకాక్రాంత యై యా
ర్తిం గూరి యాక్రందనంబు సేయ నమ్మాద్రీపుత్రుం డొయ్యన యయ్యంగన న
రదంబు డించె నుచిత నాహనంబుల నెక్కితోడన వచ్చినవనితాజనంబు లవతర
ణంబు సేసి వనట వందురుచుఁ బరివేష్టించి రప్పు డావధూరత్నంబు.


10_2_27 క.
పెనుమంచునఁ జెలు వేదిన,వనజంబునుబోలె నశ్రువారిపరీతా
ననము చెలువెడలఁ గొడుకులఁ,బనువుచుఁ జరణములుతొట్రువడదీనగతిన్.


10_2_28 వ.
కొన్నియడుగులు వచ్చి వసుధాతలంబున వ్రాలిన వేగంబ వాయునందనుం డా
ద్రుపదనందనఁ గ్రుచ్చి యెత్తి ధర్మసూనుసమీపంబునకుఁ దెచ్చిన నమ్మగువ
మగుడ నిలం బడి యమ్మహీపతియాననం బాలోకించి యెలుంగు రాలుపడ
ధైవమానుషంబులు సుసంగతంబులై యుండుటయు నతనికి సామ్రాజ్యంబు
చొప్పడుటయు నుగ్గడించి.


10_2_29 చ.
కలిమికి నొప్పు గాఁగ బలఁగం బయి నీకడ నాతనూభవుల్
మెలఁగఁగఁ జూడఁ గానన యమేయభుజాబలశాలి విక్రమో
జ్జ్వలుఁడు సుభద్రపట్టియును వమ్మయి పోయి ననూనభోగముల్
గలిగెనయేనియున్ మఱవఁగా వశమే మన కాకుమారులన్.


10_2_30 వ.
అని యప్పు డశ్వత్థామోద్దామరణకరణస్మరణంబు దనచిత్తం బుత్తలపెట్టఁ
గోపంబు దీపింప నాసీనయై.