ఆ భా 10 1 91 to 10 1 120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

10_1_91 ఆ.

ఒడుంతలఁపు లుడిగి రం డని పోవ నా
రధికవరులు గడగి రధము లెక్కి
మొనసి చనిరి వారు మువ్వురు నగ్నిత్ర
యంబుఁ బోలి యొప్పి యప్సు డధిప.


10_1_92 వ.


అట్లు చని నిద్రావశం బైనపాండవశివిరంబు డగ్గఱి రనిన విని ధృత
రాష్ట్రుండు సంజయున కిట్లనియె.


10_1_93 ఆ.


రాజుఁ గూల్చి జయముఁ దేజంబుఁ బొందిన
యత్యుదగ్రవిభవు లైనయరుల
శిబిర మాక్రమింపఁ జిత్తంబులందుఁ దెం
పొదవి మువ్వు రట్లు గదియు టరిది.


10_1_94 వ.


వారు చేసినవిధంబు వివరింపు మనిన నాసూతసుతుండు విచిత్రవీర్య
నందనున కిట్లనియె నట్లు శిబిరద్వారప్రదేశంబునకు నడచి సహాయులం
గడచి యశ్వత్థామ యుద్దామరభసంబున జన నుత్సహించె నట్టియెడ.


-: అశ్వత్థామకు శివుఁడు భూతాకృతి యై తోఁచుట :-


10_1_95 సి.


క్షరిత శోణితమగు శార్దూలచర్మంబు పరిధానకరణి విభాసితముగ
నురగాత్మకములైనయుపవితములుహారములు నంగదంబులుపొలుపుమిగుల
వివృతవిశాలాస్యవివరంబు నిశితదంష్ట్రానికరంబు ఘోరంబు గాఁగ
భాసురకాంతివిణసంబు లగులోచనంబులు బహుసహస్రంబు లొప్ప


తే.


నుగ్రమును సుందరంబును నుజ్జ్వలంబు
నై మహాకార మద్భుత మావహింప
భూత మొరటి భీషణస్ఫురణ మెసక
మెసఁగ నగ్గురుపుత్రుకట్టెదుర నిలిచె.


10_1_96 క.


విను మాభూతం బిట్టిది
యని కలరూ పేర్పటింప నమరులకు వశం
బె నరేంద్ర తదాకృతి గనుఁ
గొనినన్ భేదిల్లవలయుఁ గొండకు నైనన్.


10_1_97 వ.


ఇట్లతనియగ్రభాగంబున నావిర్భూతం బైన యమ్మహాభూతంబు నాస్య
కుహరంబున నాసికాచివరంబులఁ జెవులఁ గన్నుల నన్నింట మంటలు
వెడలి మింట నడరఁ దదీయతనుతేజోమరీచిసంఘంబుల శంఖచక్రగదా
హస్తులై హృషీకేస లనేకులు వెడలి రిట్లఖిలభూతభయంకరం బగు నమ్మ
హాభూతంబు నాలోకించి యవ్వీరవరుండు.


10_1_98 చ.


హృదయమునం గలంక యొకయించుకయేనియు లేక వీరసం
పద యలరంగ భల్లముఖబాణతతుల్ నిగిడింపఁ బెద్దగా
వదనము విచ్ఛి భూత మనివార్యవిధంబునఁ ద్రావె బాడబం
బుదధిజలంబు ద్రగెడుమహొగ్రసముద్ధతి వాని నన్నిటిన్.


10_1_99 చ.


అతులశరంబు లట్లు వృధ యైనఁ గనుంగొని ద్రౌణి రశ్మిమం
డిత మహనీయశక్తి నిగిడించిన భూతముఁదాఁకి యంత్యకా
లతిమిరవైరిమండలవిలగ్న మహొల్కయుఁ బోలెఁ బిన్న పి
న్నతునియలై యడంగె నరనాధ యతండు విషాద మందఁగన్.


10_1_100 చ.


అలఘతరాత్మసారుఁ డగు నగ్గురుపుత్రుఁడు ఘోరఖడ్గమున్
బిలగతసర్పముం దిగిచి భీషణారేఖ నటించుభంగి న
గ్గలపురయంబునం బెఱికి గాఢవిముక్తము గాఁగ వైచినం
బొలుపఱి పోయె దూదిక్రియ భూతశరీరసమాగమంబునన్


10_1_101 తే.


సరభసంబుగఁ దోమరసమితిఁ జక్ర
వితతిఁ బరఁగించి పేర్చె నవ్వీరవర్యుఁ
డదియు నదియును దొడ్తోడ నల్ల నగుచు
మ్రింగె నమ్మహాభూతంబు మేదినీశ.


10_1_102 క.


అలిగి యతండు నితాంతో
జ్జ్వలగద వైచుటయు నదియు సత్వరలీలన్
జలచర మామిషముంగొను
పొలుపు నెఱయ మెఱయ మ్రింగె భూతం బధిపా.


10_1_103 ఆ.


ఇవ్విధమున సకల హేతులు వమ్మయి
పోవ నతివిషణ్ణబుద్ధి యగుచు
నట్టునిట్టుఁ జూచు నతనికి బహుజనా
ర్దనులు దోఁచి రంబరమున నెల్ల.


10_1_104 ఉ.


భీకరవిష్ణురూపములు పెక్కిటు లొక్కటఁ దోఁప తీవ్రతా
పాకులమానసుం డగుచు నగ్గురుసూనుఁడు దుర్మదంబునం
జేకొననైతి నట్లు కృపుచెప్పినసత్యహితోపదేశముల్
నా కిది పెద్దయే యని మనంబున నిట్లని వల్కె వెండియున్.


10_1_105 ఆ.


మహితశాస్త్రకలితమార్గంబు విడిచి ని
జేచ్ఛఁ బగఱ గెలువ నెవ్వఁ డరుగు
వాని నయ్యధర్మవర్తనక్రౌర్యమ
యెవ్విధమునఁ జెఱుచు నింత నిజము.


10_1_106 సీ.


గోవు బ్రాహ్మణబాలకుని వృద్ధునంధునిసఖుఁ దోడఁబుట్టువు జడుంబ్రమత్తు
మత్తుని గురుని నున్మత్తుని సుప్తుని నంగ నాభిరతుని నస్త్రశస్త్ర
నిహతి నొప్పించుట విహితంబు గాదని యార్యులు సెప్పుదు రట్టిధర్మ
మార్గంబుదొఱంగి దుర్మంత్రఁబుమైఁబగయడఁగింపఁ గడఁగిననసురవృత్తి


ఆ.


జేట కాక కార్యసిద్ధి గా నేర్చునే, పెద్దయెత్తికొనిన భీతి మగుడఁ
బడుట కష్టసరణి బలిమి దయ్యముతోడఁ జెల్ల దింకనేమి సేయునాఁడ.


10_1_107 ఉ.


అక్రమవృత్తి గీడుతెరు వై ఫలియింపదె ద్రోణసూతి దు
ర్విక్రమనింద కర్హుఁడె సవిస్మయ మైనమనంబు భూతవృ
త్తిక్రమవేది గాదు గణుతింపఁగ నేమియొ యమ్మహాద్భుత
ప్రక్రియ కాదికారణము పాపనిరూఢుఁడు నీతిఁ గాంచునే


10_1_108 వ.


అని పెక్కుభంగుల వగచి పల్లటిల్లినచిత్తంబుఁ బట్టుకొల్పి యిట్లని
నిశ్చయించె.


10_1_109 శా.


భావం బేకముఖంబుఁ జేసికొని యాపద్ధ్వాంతభానున్ మహా
దేవుం బర్వతకన్యకాప్రియు దయార్ద్రిభూతచేతస్కులో
కావిర్బావవివర్ధనాలయకృతివ్యాపారపారంగతున్
దేవేంద్ర ప్రముఖామరార్చితుని భక్తిప్రౌఢతం గొల్పెదన్,


10_1_110 ఆ.


అఖిలదేవతామయాత్ముఁడద్దేవుఁ డ
ట్లగుట నిఖిలదైవికాపదుదయ
నిరసనం బొనర్చు నియతి నప్పరమేశుఁ
గొలిచి యిపుడు కీడు దొలఁగఁద్రోతు.


10_1_111 వ.


అని యిట్లు నిశ్చయించి నియతుండై రథంబు డిగ్గి ధరణీతల బునం
గూర్పుండి భావంబున భూతనాథు నెలకొలిపి యక్కుంభజనంభవుండు.


-: అశ్వత్థామ శివున కాత్మోపహారం బొసంగ నిశ్చయించుట :-


10_1_112 సీ.


స్థాణు నుగ్రుని శివు శర్వు నీశానుని భద్రప్రదుని కుంభు రుద్రు గిరిశు
నవ్యయు శ్రీకంఠుహరుఁ బరమేశ్వరుఁ బురహరు నజుని శంకరుఁద్రినేత్రు
బహురూపు విశ్వరూపత్వసంవ్యాప్తుని నంబికాహృదయేశు నమరవంద్యు
గణనాథు విభు శూలఖట్వాంగధరు జటామండలాలంకృతమౌళి నభవు


ఆ.


నాశ్రయించి యతని కాత్మోపహార మ
ర్పించువాఁడఁ గాక పెక్కుతలఁపు
లేల నాకు నమ్మ హేశ్వరేశ్వరుఁ డెట్టి
గతి యొనర్చె నది సుఖంబ కాదె.


10_1_113 వ.


అని తలంచి భూతకృత్యం బైనపరాక్ర మప్రతిబంధరూపం బుగ్గడించి


10_1_114 క.


ఏనీయాపదఁ గడచిన
నానాభూతోపహారనవ్యార్చన నీ
శానునిఁ బ్రీతుం జేసెద
బూని ప్రమథగణము నన్నుఁబొగుడునటులుగన్.


10_1_115 చ.


అని హృదయంబునం బలుకుల మ్మహానీయచరిత్రు ముందటం
గనకపువేది దోఁచె నధికద్యుతిజాలము లుల్లసిల్ల నం
దనలము విస్ఫురత్పటుశిఖావలి నొప్పి వెలింగె దానికి
న్మనము దలిర్ప నిశ్చయమునం దెలివొందె నతండు నెంతయున్.


10_1_116 ప.


అప్పుడు ప్రదీప్తవదనులుఁ బ్రజ్వలితనేత్రుల నేకపాదులుఁ గరితురంగ
సింహ సూకరాననమానముఖులును దీవ్రదంష్ట్రాకరాళాస్యులును మఱియు
ననేక ప్రకారంబు లగువక్త్రంబులం బొలుచువారును వక్రాంగులు దీర్ఘ
దేహులు హ్రస్వశరీరులు నతిస్థూల కాయులుఁ గృశమూర్తులుఁబింగళ
గాత్రులు నీలతనులు మఱి నానావర్ణంబులు గలుగువారును బంచశిఖులును
జటాధారులును గపాలధరులును మఱియు బహుభంగికంబులై మౌళీత
లంబులం బొలుపొందు వారును లోనుగా వివిధవిశేషవికృతస్వరూపులుగున
సంఖ్యాతప్రమథులు చిత్రాంబర మాల్యాంగరాగంబులు రత్నకనకమయ
భుజగాస్థిమాలాభూష్ణంబులునుధనుస్తూలకృపాణముసలముద్గరపరశుభిండి
వాల స్థూల ప్రభృతిస్ఫార ప్రహరణంబులు మెఱయ మృదంగపణవడ
మరుఘంటాగోముఖాదితూర్యంబులు మొరయ విస్పురద్ధ్వజఫతాకాకుంచి
కలు శోభిల్లఁ బాడుచు నార్చుచు బొబ్బిలిడుచునపుడు గఱచుచుఁ
ద్రుళ్ళుచు గురువులు వాఱుచుఁ గరటిబృంహితంబులుఁ గంఠీరవగర్జితం
బులు శంఖరవంబులు భేరీద్వనులుం బోనియెలుంగులు సెలంగ బెట్టి
దంబులగు పలు దెఱంగులపలుకు లెసంగ బ్రహ్మద్వేషు లగువారిమాంస
రుధిరంబులఁ బూర్ణంబు లగు కపాలంబులు గరతలంబులం గొని యాభీ
లంబు లగుభక్షణ పానంబు లాచరించుచు సోమపానశమధమతోప బ్రహ్మ
చర్య ప్రముఖంబు లగు తమవిశిష్టకర్మంబులకు భవుండు విస్మయంబు
నొందుంగాని యష్టగుణం బగునైశ్వర్యంబు నొందియుఁ దారు విస్మితులు
గానియట్టిమహానుభావు లద్దేవునకు గౌరికి గజముఖషణ్ములకంటె నర్మిలికిం
బట్టగుభవ్యులు దివ్యజనస్తవ్యు లయ్యస్త్ర గురుతనూభవుతెం పెఱుంగుటకు
సౌప్తికవ్యాపార ఘోరత్వంబుఁ గనుంగొని వినోదించుటకు వచ్చి యతని
చిత్తంబునకు బెదరు పుట్టించువారై భీషణకారంబుల నుల్లసిల్లిన
నాధైర్యధుర్యుండు.


10_1_117 మ.


వెఱ పావంతయు లేక వారిఁ గలయన్ వీక్షించి నెమ్మోమునం
జిఱునవ్వున్ మదిఁ దెంపుసొంపు వెలయం జెల్వంబు రెట్టింప నం
దఱుఁ గీర్తింప రధంబుమీఁదిఘనకోదండంబుఁ చే నంది చి
చ్చుఱుకం జేరె నుదాత్తభంగి మహనీయోత్సాహసందీప్తుఁడై


10_1_118 ఆ.


ఇవ్విధమునఁ జేరి యవ్వేదిలోపల
భాసమానుఁ డైనపావకునకు
దేహ మొక్కయాహుతిగం జేయుటకుఁదగు
నంత లేకయునికి నతఁడు సూచి


10_1_119 క.


తనయరదము మీఁదం గల
ధనుర్వితానము లసత్ప్రధరజాలముల
గొనివచ్చి వేదియం దిం
ధనములుగాఁ బేర్చి తెంపు దలకొనుమదితోన్


10_1_12 వ.


పేర్చి యప్పరమేశ్వరు నుద్దేశించి.