Jump to content

ఆ భా 10 1 61 to 10 1 90

వికీసోర్స్ నుండి

10_1_61 ఆ.

నెమ్మి డప్పి దేఱ నిద్రించి వేగినఁ
దెలివితోడ నత్యుదిర్ణవృత్తిఁ
గడఁగి యేము దోడ నడతేర నడరిన
నరిగణంబు గెలుతు వశ్రమమున.


10_1_62 మ.


వరదివ్యాస్త్రవిదుండు బాహుఘనుఁ డశ్వత్థామ పైఁ బోవ ను
ద్ధరలీలం గృతవర్మయుం గృపుఁడు నుద్యోగస్ఫురన్మూర్తు లై
వెరవుం జేవయుఁ జూపి తో నడవ దోర్వీర్యోద్ధతిన్ మార్కొన
న్నరయోధావళి గాదు దేవతతికి నా దెమ్మెయిం జూడఁగన్.


10_1_63 వ.


అని మఱియును.


10_1_64 చ.


విను కృతకర్మ దివ్యశరవేది బలాధ్యుఁడు శౌర్యశాలి యే
నును సమరోద్యమంబునకు నూర్కోనఁ జాలుట నీ వెఱుంగు ది
ట్లని గణుతింప రాదు గురునట్టిడ యీకఁ డనంగవచ్చు న
న్ననఘనచరిత్ర యిట్టిరధికావలి వైరుల నెట్లుఁ జేయదే.


10_1_65 వ.


కావునఁ గోదండంబు నెక్కుడించి కంకటం బూడ్చి నిద్రింపు మేము
నిద్రాగమనంబున జడులమై యున్నవారము ప్రధారం బగుటయు నెల్ల
వారలకు నుల్లంబు దెలివొందు నప్పుడు గడంగి యోధులం బౌద- పేరు
వాడి పొలియింతము మనము పాంచాలసహితంబుగా బాండవులం దెగ
టార్చుటయొండె వారిచేతం దెగుటయొండె నయ్యెడుం గాక రిత్త మరలు
దుమే యనిన మామకు నశ్వత్థామ యిట్లనియె.


10_1_66 తే.


అలుక యెత్తినవానికి నర్ధచింత
కునకు నాతురునకుఁ గామగోచరాత్ము
నికిని వచ్చునే విను నిద్ర నీవు నెఱుఁగు
దెఱిఁగియుండి యి ట్లేటికి నేఁడు నన్ను.


10_1_67 క.


ఎన్నఁబడి జను లెఱింగిన
యిన్నాలుగు తెఱఁగులందు నెయ్యది యైనన్
గన్ను మొగుడ నీదటె నా
కిన్నియుఁ గలుగంగ నిద్ర యేటికి వచ్చున్.


10_1_68 చ.


గురుదెసవంత నాతురతఁ గూరెద వైరిఁ దలంచి కోపసం
భరితుఁడ నయ్యెదన్ సమరభంగినిరూపణచింత నొందెదం
గురుపతికిం బ్రియం బెసఁగఁ గోరుట నుత్తలపాటు సెందెదం
బురుషవరేణ్య యే నిదుర వోవఁగ నెమ్మెయి నేర్తుఁ జెప్పుమా.


10_1_69 శా.


సారాచారనిరూఢుఁ డైనధనురాచార్యున్ వధింపంగఁ గ
న్నారం జూచితి వీవుఁ దత్పరిభవం బ ట్లుండె భగ్నోరుఁ డై
రారా జెంతయు దీనవృత్తిఁ జెవులారం బల్కఁగా విన్న యే
నీరే యూరక నిద్రవోదునటె యి ట్లేలంటి వీరోత్తమా.


10_1_70 ఆ.


మనము వినఁగ రాజు పనివినభంగి కే
క్రూరచిత్తుఁ డైనఁ గుందకున్నె
కరుణ లేక యున్న పురుషున కేనిఁ గ
న్నీరు దొరుఁగకుండునే మహాత్మ.


10_1_71 చ.


అతఁడు మదీయసఖ పరుఁ డక్కట యేఁ గసుగంద కుండ నా
క్షిలపతి యిమ్మెయిం బరులచేతఁ బరాభవ మొందె దానిఁ జూ
చితి మును లోకు ల-భునిచేటును బాండు నూజకోటియు
న్నతియును జెప్ప వింటి నది నామది సూఁడెడు నిద్ర వచ్చునే.


10_1_72 వ.


అదియునుంగాక.


10_1_73 ఉ.


కవ్వడియున్ ముకుందుఁడును గావలిగా భయ మేది యున్నవీ
డెవ్వరి కైన ముట్టుకొని యే నని వేర్చి జయింప వచ్చునే
యెవ్వధి నైననుం ఒ-ఱయే పడఁగించుట పౌరుషంబ యే
నొవ్వక గెల్తు రాత్రి యి నూల్కొని తాఁకితినేని మాతులా.


10_1_74 ఆ.


ఇట్లు నిశ్చయించి యో-కంపుఁగడఁకతో
నున్నవాఁడ నిట్టినన్ను మాన్ప
రామి యెఱుంగ కంటి రారాజుమన్నన
వమ్ము చేసి మరలవచ్చు నెట్లు.


10_1_75 క.


సమయింతుఁ బొదివి సౌప్తిక
సమయంబున నెల్లభంగిఁ జతురంగసమే
తము గాఁగఁ బాండునృపసుత
సముదయమును ద్రుపదభూపసంతానంబున్.


10_1_76 వ.


సమయించి మఱి విశ్రిమించియు నిద్రించియు సుఖిఁచెద నీవు నిద్రపేరు
సెప్పి యుద్యోగంబు మాన్పి మరల్పఁ జూచెద విది తగ వగువే యనిన
గురునందనునకు గౌతముం డి ట్లనియె.


-: కృపాచార్యుఁడు నిద్రాసక్తులఁ జంపఁ దగదని యశ్వత్థామకు హితవు చెప్పుట :-


10_1_77 చ.


అలుక మనంబున గదిరి నాతఁడు దాను నెఱుంగఁ డొడ్లచేఁ
దెలియఁడు కార్యతంత్రములు ధీమహీతుం డగువాని కైననుం
జెలులును జుట్టలుం దగిలి నెప్పఁగఁ జొప్పడుఁగాక తక్కుని
ర్శల మగునీతితంత్రము దిరం బయి చిత్తమునందు నిల్చునే.


10_1_78 క.


మతి నెప్పుడుఁ దా ధర్మ
స్థితి నూహించుచును హితులు సెప్పెడివెర వు
ద్ధతి దక్కి యాచరించుచు
జితేంద్రియత గలిగి నడవఁ జెందు శుభంబుల్.


10_1_79 తే.


దుష్పధంబులఁ జొరనీక తొలఁగఁ దివుతు
రాప్తజనములు దగ వశ్యు లయినవార
లందుఁ బుణ్యంబు దొలఁగనియతఁడు దొలఁగు
దొలఁగ నేరఁడు భాగ్యంబు దొలఁగువాఁడు.


10_1_80 క.


మతిమంతు లైనవారికి
హితు లగువెరవుగలవార లెఱిఁగింతురు దు
స్థ్సిత గాకుండఁగఁ గార్యము
గతి యొత్తియుఁదప్పులిడియుఁ గడవఁబలికియున్.


10_1_81 క.


నాపలుకువట్టి యాగ్రహ
దీపితుఁ డగు టుడిగి మదికిఁ దిన్నదనము నీ
వాపాదింపుము సలమును
గోపముఁ గ్రౌర్యంబు విడువు గుణరత్ననిధీ.


10_1_82 వ.


అట్లైనం బశ్చాత్తాపంబునం బడవు నిద్రించినవానిని నాయుధంబులు విడిచిన
వానిని వాహనవైకల్యంబు నొందినవానిని శరణుసొచ్చినవానిని దలవీడిన
వానిని వధియించుట ధర్మంబుగా దీసమయంబున సమస్తసైన్యంబును
బాండవ పాంచాలురు నిద్రపోవుదురు నిదుర సావునట్టిదకాదె పీనుంగులుం
బోలెఁ బడి యున్నవారిం బొడిచి పాపంబు గట్టుకొని నరకంబునఁ బడుట
మేలె మహాస్త్రవిదు లగురధికముఖ్యులయందు మేటి యనం బరఁగి
యింతకు మున్నేమిటం గల్మషంబు లేని నీయట్టివాని కిట్టిదుష్కర్మంబు
గర్తవ్యం బగునె యిది మడుగుఁజీర యందు మసిదాఁకిన ట్లయ్యెడు
సూర్యసంకాశుండ వగునీవు సూర్యోదయసమయంబునఁ బ్రకాశప్రకారం
బైనపరాక్రమంబున కుపక్రమింపు మనవుడు నశ్వత్థామ గృపాచార్యున
కి ట్లనియె


సీ.


నీచెప్పినది యెల్ల నిజము శాసింపంగఁ దగువాఁడ వై హితం బగుదెఱంగు
నా కెఱింగించితి నీ కేను జెప్పెద నేర్పడ వినుమయ్య నెల్లనృపులు
గనుఁగొనుచుండ మజ్జనకుని సన్న్యస్తశస్త్రుని నట్లు పాంచాలరాజ
సుతుఁడు ధృష్టద్యుమ్మ్నుఁ డతిపాతకం బని కొంకక తల పట్టుకొని వధించె


10_1_83 ఆ.


భీష్మ నాశిఖండిపేరఁ గృతిమసమ
రమున నర్జునుండు సమయఁ జూచె
నరద ముర్వి----ంగి యనువు దప్పిన డిగ్గి
యెత్తుచుండఁ గర్ణు నేసె నరుఁడు.


10_1_84 ఆ.


చేయి వరుఁడు దునమఁ బ్రాయోపవేశ ప్ర
వృత్తమైఁ బ్రశాంతచిత్తుఁ డైన
పుణ్యపురుషు నట్టి భూరిశ్రవునిఁ గృష్ణు
ననుజుఁ డట్లు సంపె నాగ్రహమున.


10_1_85 చ.


పలువురు గూడి కౌరవనృపాలకు నొక్కరుఁ జుట్టుముట్టి వి
చ్చలవిడిఁ బాపకర్మ మనుశంక యొకించుకయేని లేక యూ
రులు గద నుగ్గు సేయఁగ మరుత్సుతునిం బురికొల్పి రన్నిభం
గుల మును వారె కాదె చెడఁగ్రొచ్చిరి సంగరధర్మ సేతువున్.


10_1_86 వ.


వారి నెట్లు నిందింపవు మమ్ము నెట్లు వారించెద వాలింపుము.


10_1_87 ఆ.


తోడలు విఱిగి నేలఁ బడియుండి ననుఁ గని
మానవేంద్రుఁ డట్లు దీనవృత్తి
నాడెఁ గొన్ని మాటలవి యంతరంగంబు
నందుఁ జిక్కి కినుక యలఁత సేసె.


10_1_88 వ.


వాని వెలార్పవలయు మజ్జనకహననసంతుష్టుం డగుధృష్టద్యుమ్నుండు
లోనైన యప్పాపాత్ములఁ బాపంబుతెరుపున రూపుమాపెద దీనంజేసి
కీటజన్మంబు పాటిల్లినను మేల కాని యీకడంక మాన నేర నన్ను వారింప
నెవ్వరివశం బగు నని దిగ్గున లేచి యగ్గురుతనయుండు రధం బెక్కినం
గనుంగొని యగ్గౌతముండును గృతవర్ముండు.


10_1_89 ఆ.


ఏకనిశ్చయమున నిట యేఁగుదెంచితి
మనఘ నీవు నేము నధిపుపనికి
నిట్టిమమ్ము వేఱు పెట్టి యెక్కటికార్య
మాచరించువాఁడ వగుట దగునె.


10_1_90 చ.


అనవుడు నాతఁ డిట్టులను నమ్మహితాత్ములకే నవశ్యముం
జని ద్రుపదాత్మజుం బొదివి చంపెద దుర్గతిఁ బోవుచావుగా
ఘనభుజశక్తిశౌర్యము నకంపితధైర్యమునున్ వెలుంగ మీ
రును దెలివొంది కూడికొన రూఢికి నెక్కుద మెల్లభంగులన్.