ఆ భా 10 1 1 to 10 1 30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

10_1_1
శ్రీమత్కౌస్తుభరత్నో
ద్దామారుణరశ్మిభూతిధవళమరీచి
స్తోమపరభాగరమ్యమ
హామహితస్ఫురితవక్ష హరిహరనాథా.


10_1_2 వ.
దేవా వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె.


10_1_3 తే.
సంజయునిచేత గురుసుతోత్సాహమట్లు
వినినధృతరాష్ట్రుఁ డిట్లను వీరవర్యుఁ
డనఁగఁ జాలునశ్వత్థామయును సహాయ
రథికులును విక్రమించినక్రమము సెపుమ.


10_1_4 వ.
అనుటయు నమ్నానవపతి కాసూతసూనుం డిట్లను నవ్విధంబునఁ గురుపతి
యశ్వత్థామ కభిషేకంబు సేయించిన నాకృపాచార్యుండును గృతవర్మయు
గురుపుత్రునుత్సాహంబున కుపోద్బలకం బగునుద్యోగంబునం బొదలి రమ్ము
వ్వురు మహీపాలుండు పాండవులం బరిమార్చుటకుం బనిచిన నట్లు పూని దక్షి
ణంబు మట్టి పడమట నున్న పాండవశిబిరంబున కభిముఖు లైచని రత్తెఱం
గున నవ్వీటికెలని కనతిదూరంబుగాఁ జని యారథికవరు లాలించి.


10_1_5 ఉ.
అందలివార లెల్లను జయంబునఁ బొంగుచుఁ బేరెలుంగు లం
దంద చెలంగఁ గాఁ బలుక నార్వఁగ నొత్తిలి నవ్వ నాకసం
బందినయట్టిమ్రోఁత విని యక్కడ వోవఁగ నుల్కి రప్డు ద
మ్ముం దడవన్ వడిన్ వెడలు మూఁకలుమ్రోయుటగాఁ దలంచుచున్.


10_1_6 వ.
ఉలికి యట వోవు టుడిగి యొచ్చటి కేనియుం దొలంగి నిలిచి మఱి కర్జంబుఁ
జూచికొనువారై యారథికవరులు మగిడి తూర్పుదెస కొంతద వ్వరిగి రనిన
నమ్మాటలు వెడవెడ వినుచుం దనకుం బాటిల్లినదురవస్థ చింతించుచు నాంబి
కేయుం డిట్లనియె.


10_1_7 సీ.
సంజయ కురురాజు సమయునే యిట్లు భీముని చేత బలశౌర్యముల నజయ్యుఁ
డని నమ్మియుండితిఁ దనయులు నూర్వురు మడియుట వినియు నామనము పెక్కు
పఱియలై పోవనిభంగిఁ జూడఁగ ఱాత నొనరించినది గాఁగ నోవు నింక
నడియరితనమున నప్పాండవుల నాశ్రయింపఁగఁ జాల నే నెక్కడేనిఁ


ఆ.
బోదుఁ గాక యట్టిభూపాలుతండ్రినై,ప్రాభవమునఁ బేర్చి పరమదైన్య
వృత్తి కోర్వఁ దగునె విన వశమే మాట,లామరుత్తనూజుఁ డాడ నాకు.


10_1_8 వ.
అని పలికి యశ్వత్థామప్రభృతు లేమి సేసి రనుటయు నజ్జనపతికి సంజయుం డి
ట్లనియె.


10_1_9 క.
ఇమ్మెయి నారథికవరులు, గ్రమ్మఱి చని యడవి సొచ్చి కని రొకమడు వం
దిమ్ముల సూతిజనులు ర,థ్యమ్ముల నీళ్లకును దిగువ నప్పుడు దారున్.


10_1_10 వ.
రథంబులు డిగ్గి యంబుపానంబు సేసి యామ్రోఁతదెస నాలించు చుండిరి.


10_1_11 తే.
అంతఁ బశ్చిమధరణీధరాగ్రపశ్చి,మంబునకుఁ బోయె మార్తాండమండలంబు
సాంధ్యసమయకృత్యంబులు సలిపి రపుడు,రథికవర్యులు మువ్వురు రాజముఖ్య.


10_1_12 వ.
సలిపి వా రొక్కవటవిటపిసమీపంబున నాసీను లై రాసమయంబున.


10_1_13 తే.
వారిముఖమండలములతో వారిజములు
మొగిడె శోకతమంబుతో నిగిడెఁ దిమిర
పటలి బహువిచారములతోఁ బరఁగఁ బొల్చె
భూతబేతాళగణములు భూపవర్య.


10_1_14 క.
కలుగు గురుసుతున కెట్లుం,గలహం బని చూడ నమరగణ మధికకుతూ
హలమున వచ్చెనొ యనఁ జు,క్కలు దోఁచెన్ గగనవీథిఁ గౌరవనాథా.


10_1_15 వ.
ఇట్లు రాత్రియగుట దివాచరంబు లైనజంతువు లుపశాంతవర్తనంబు లయ్యె
రాత్రిచరంబు లైనవి సంచరింపం దొడంగె నప్పు డమ్మువ్వురు నెవ్వగలఁ
గూరినమనంబులతోఁ గురుబలం బకారణంబ పొలియుట యుగ్గడించి తత్సం
బంధ కలితంబు లైనభాషణంబులు చెల్లుచుండ నుండి డప్పి గూరి కొండొక
సేపునకు మహీతలంబున మేనులు వైచి వందరుచుండి రందుఁ గృపకృతవర్ములు
నిద్రవొందిరి గురునందనుండు క్రోధాతిశయంబునం జేసి నిదురవోవక వటవిట
పంబు గలయం గనుంగొనువాఁడు తదీయశాఖోపశాఖల నానాకాకంబులు నిలీ
నంబులై నిద్రించుచుండ నాలోకించె నయ్యవసరంబున.


10_1_16 సీ.
మిడుఁగుఱుగములు గ్రమ్మినయట్లు నిగిడెడు రోచులు గలమిడిగ్రుడ్లు దనర
మెఱుఁగారుకెంజాయమెఱసినయెఱకల మోపున నెసఁగుపెన్ మ్రోఁతతోడఁ
గాళులభీషమాకారత వేళ్లతో లీలమై నెగసినశైల మనఁగఁ
గరముగ్రమగుమొగ మిరుదెసమురియించి యామిషంబులయిక్కలరశికొనుచు


తే.
నచటిబయ లెల్లఁ దాన యై యజ్కజంపుఁ
జందమును ఘోరమైననిస్వనముఁ జండ
గతియు భూతవితానభీకరముగా ను
లూక మొక్కటి వచ్చె భూలోకనాథ.


- అశ్వత్థామ యులూకంబు కాకంబులఁ జంపుట నాలోకించుట -


10_1_17 వ.
వచ్చి యవ్విటపివిటపంబు నూఁది యక్కాకంబుల నాలోకించి యంగంబుల
యుద్భటత్వం బుడిపికొని గమనంబు తిన్నఁదనంబు దలకొనఁ జొచ్చి వాని
నాక్రమించి.


10_1_18 ఉ.
కొన్నిటికంఠముల్ నులుపుఁ గొన్నిటికాళులు ద్రుంచు నుగ్రతం
గొన్నిటిపక్షముల్ నఱకుఁ గొన్నిటిపొట్టలు వ్రచ్చులీలమైఁ
గొన్నిటు నప్పళించుకొని కోలెముకల్ నుఱుమాడు నిట్టుల
య్యన్నిటి నయ్యులూకము రయం బెసఁగన్ వధియించె భూవరా.


10_1_19 వ.
ఇవ్విధంబున నిద్రావివశంబు లైనయవ్వాయసంబుల వివిధంబు లగువధంబులు
గీటడఁగించి యాకౌశికంబు శత్రువులం బొదివి సమయించినమేటిమగని
మాడ్కి మోదంబు నొందినం గని యగ్గురునందనుం డాచందం బొనర్చుటకు
డెందంబున నుత్సాహంబు వొడమి పొంగి తనలోన.


10_1_20 తే.
ఇవ్వహంగమ ముపదేశ మిచ్చె నాకు,నిద్రవోవంగ శత్రుల నిగ్రహింతు
నింతలె స్సగునే ముందఱేమి తెఱఁగు,గాననైతిని నాపూనుకార్యమునకు.


10_1_21 వ.
అని వెండియు.


10_1_22 ఉ.
పాండునరేంద్రనందనుల బాంధవపుత్రయుతంబు గాఁగ ను
ద్దండత నే వధింతు నని దర్ప మెలర్పఁగఁ గైరవాధినా
థుండు వినంగఁ బల్కితిని దుర్దమదోర్బలు లమ్మహాత్మకుల్
గండున బెట్టు పైఁ బడుట కార్యము గాదు దలంచి చూడఁగన్.


10_1_23 క.
అరవాయి గొనక బెట్టుగఁ,బరికొని యక్కడిఁదిమగలపై నడరుట యు
ద్ధురగతి నగ్నిజ్వాలో,త్కరముపయిన్ మిడుత యుఱుకుకరణియ కాదే.


10_1_24 వ.
పాండవులం బరిమార్చుపని నేఁడ చేయక మఱి చేసిన రారాజు నిర్గతప్రాణుండైన
నాకెలసం బెవ్వరి కెక్కెడుఁ జక్కటితోజిబవరంబున నబ్బలుమగల గెలువరా
దని యిట్లురియాడునాచిత్తంబుచింతాపరంపర వాయ నీపక్షివిచేష్టితంబు లో
చనగోచరంబయ్యుఁ బగతురఁ దెగటార్చునెడ నన్యాయం బనక యుపాయం బె
య్యది దొరకొనిన దాన నుత్సహింపవలయుట శాస్త్రసిద్ధంబ కాదే యెట్లనిన.


10_1_25 తే.
ఎత్తినప్పుడు విడియుచో నిఱకటంపుఁ, దెరువునందు నడవు సెడి తిరుగఁబడిన
యట్టియెజ నిద్రవోయెడునవసరమున,శాత్రవుల బెట్టు పైఁబడి చంపవలయు.


10_1_26 వ.
అనునీతివాక్యంబులు విందు నంగీకృతక్షత్త్రధర్ముం డగువానికి నిట్టివి కర్త
వ్యంబు లట్లుఁ గాక పాండవేయులు పితామహగురు లైనభీష్మద్రోణులఁ దెగ
టార్చునెడం జక్కటి గలతెఱంగున సంగరంబు చేసిరె యంగరాజును రారా
జును బరిమార్చినంభంగులఁ దలంపం గూడునె కావునఁ గల్మషోపాయులగుకౌం
తేయుల నిద్రాసమయంబున గొబ్బున నిగ్రహించుట నీతియ కాని నింద్యంబు
గాదని నిశ్చయించె నట్లు క్రూరవ్యవసాయుం డగునగ్గురుసుతుండు దనమామను
గృతవర్మను మేలుకొల్పి యిట్టిసమయంబున నిద్రించితి మని లజ్జించు చున్న
యారథికవరులతో నిట్లనియె.


10_1_27 సీ.
మొగదప్పితిమి రణమున మన మకట మువ్వురము రారాజునొక్కరునిఁ బాండు
తనయులు దమవారుఁ దారును బెక్కండ్రు గూడి చుట్టును ముట్టి గుల్లపఱచి
రేకాదశాక్షౌహిణీశ్వరుఁడట్లొంటిమెయిఁ జిక్కి పోరుచుండియున బాడి
దప్పఁ డవ్విభుని నధర్మవిక్రమమునఁ బాపాత్మకుం డగుబకవిరోధి


ఆ.
గూల్చె నంతఁ బోక కురుదేశరాజ్యాభి,షిక్తమైనయతనిశిరము దన్నెఁ
బరిభవంబు నొంచెఁ బ్రాణాంతకరవేద,నాతిశయముకంటె నన్నరేంద్రు.


10_1_28 క.
లావును వెరవును గలుగుమ,హావీరు లనేకు లట్టు లన్నిదినము లా
భూవిభునకై పెనఁగి జయ,మీ వలఁతులు గాక పోయి రే మన వచ్చున్.


10_1_29 ఆ.
ఎవ్వ రెంతఁ జేసిరేనియు విధి యొండు, దలఁప నాఫలంబు దలఁగ కేల
యుండు నిట్లు గాఁగ నున్నది గాకేమి,యెసకమెసఁగుకౌరవేంద్రుమనుపు.


10_1_30 వ.
అని పలుమాట లాడి మీమది కలంగకున్నదేని యీమహావ్యసనంబునకుఁ గర్త
వ్యం బెద్ది చెప్పవలయు ననినఁ గృపాచార్యుండు ధనురాచార్యనందనుమొగం
బు గనుంగొని నీవు చెప్పఁ దలఁచినయంతవట్టునుం జెప్పి కార్యం బడిగితేని
నాకుఁ దోఁచినదానిం జెప్పెద విను మని యిట్లనియె.