ఆ భా 10 1 181 to 10 1 210

వికీసోర్స్ నుండి

10_1_181 మహాస్రగ్ధర.
చతురంగచ్ఛేదకేళీసరభసకలనాశ్చర్యధౌరేయనానా
గతులం దన్నెల్లవారుం గడిఁదియసుర నాఁగా నతిక్రూరచేష్టో
ద్ధతి యొప్పం జొచ్ఛిసైన్యాస్త్రముల నతనియస్త్రంబులం ద్రుంచి వీఁకం
బ్రతివింధ్యుం గిట్టి రెండై పడఁగఁ దునిమెఁ దద్భాసమానాంగయష్టిన.


10_1_182 వ.
ఇవ్విధంబున ధర్మతనయనందనుని నడుము దెగ నడిచి యార్చి పేర్చిన్.


10_1_183 మహాస్రగ్ధర.
అతిశోకక్రోధవేగవ్యథితహృదయుఁడై యశ్వసాదిత్వవీరో
ద్ధతిఁ బ్రౌఢస్ఫుర్తి సెల్వొందఁగ సబళముఁ దద్గాత్రముం జొప్పెఁ బూఁచె
న్శృతసోముం డల్లఁ బట్టె న్గురుసుతుఁ డదియున్ స్రుక్క చెన్నారనల్క
న్ధృతఖడ్గుం డైనఁ జేయున్సిరముఁ దురగము న్వ్రేల్మడిం ద్రుంచి వైచెన్.


10_1_184 వ.
ఇవ్విధంబునఁ జిత్రవధంబునకు గోచరుండైనకీచకాంతకతనయుం గనుంగొని.


10_1_185 మహాస్రగ్ధర.
నినుఁ గూడన్ వీఁడె వచ్చెన్ నృపుఁ డనుచు శతానీకుఁ డాభీలచక్రం
బున నశ్వత్థామవక్షంబునను రుధిరముం బొంగఁగాఁ జేయ నప్పా
టున నీడంబోక బల్వేటున నిలఁబడ నాటోపముంజూపి యంతం
దనివో కాదుర్జయుం డాతనిశిరమును దద్గాత్రముం బాపె లీలన్.


10_1_186 వ.
ఇట్లు నకులసూనుండు సమసిన.


10_1_187 మహాస్రగ్ధర.
శ్రుతసేనుం డప్డు కోపస్ఫురదరుణమరీచుల్ దలిర్పంగఁ జక్షు
ర్ద్వితయంబుం గెంపునం బొందినచెలువము సందీప్తఘోరంబుగా బె
ట్టతనిం జంచద్గదన్ వ్రేయఁగ నుఱక తదాస్యచ్ఛిదాస్ఫారకేళీ
చుతురుండై యక్కుమారున్ జముకడ కనిచెం జండదోర్దర్ప మొప్పన్.


10_1_188 వ.
ఇత్తెఱంగున వికృతాననుం డై పడి మృతుండైనసహదావసుతుం జూచి రోషం
బునం జేర్చి.


10_1_189 మహాస్రగ్ధర.
వితతజ్యానాద మాశావితతి నినిచి దోర్వీర్య మేపార బాణ
ప్రతతిం దన్ముంప వీఁకం బలక జడియుచున్ బల్విడిం జేర్చి చంచ
ధ్గతిఁ గ్రీడం దంతిహేలాదళనరతమృగేంద్రస్ఫురన్మూర్తి దోఁపన్
శ్రుతకీర్తిం గిట్టి కంఠత్రుటనవిలసనారూఢి నవ్విప్రుఁ డొప్పెన్.


10_1_190 వ.
ఇట్లు ద్రౌపదీతనయపంచకంబు పంచత్వంబు నొందినఁ గ్రోధాతిరేకంబునఁ బ్ర
భద్రకులును శాంతనవాంతకుండును ధృష్టద్యుమ్నాంతకుఁ జుట్టు ముట్టి.


10_1_191 చ.
శరములఁ దోమరంబులను జక్రములన్ వెసఁ గప్పి బెట్టు ము
ద్గరకరవాలకుంతముఖదారుణహేతుల నొంప నాతఁ డు
ద్ధురగతులం బ్రభద్రకులఁ ద్రుంచుచుఁ గేళి యొనర్పఁ గా శిఖం
డి రుచిరమార్గణంబు భ్రుకుటిస్థలి నొంచె సముద్భటోన్నతిన్.


- అశ్వత్థామ శిఖండిం బొదివి చంపుట -


10_1_192 క.
గురుసుతుఁడు క్రోధమయ మగు, బరవసమున నప్పు డాద్రుపదనందనుమే
నిరువఱియ గాఁగ నేసెను, శిరము నుదగ్రతఁ గృపాణశిక్ష మెఱయఁగన్.


10_1_193 వ.
ఇవ్విధంబున దొరలు దెగినను బాంచాలప్రభద్రకమత్స్యసైన్యశేషంబులు
వోక పెనంగిన నతండు మాతంగవితానవిదళనం బప్పుడు సలిపినకంఠీరవంబు
తనమీఁద హరిణకులంబు గవిసిన నెట్టి దగునట్టివాఁడగుచుఁ బేర్చి యార్చె
నత్తెఱంగుతుములంబునఁ బొడగానమిఁ బాండునందనులు కృష్ణసాత్యకులును
నాశిబిరమున లేక యునికియెఱింగె నప్పుడు గనుంగొనుజనంబులకు నితం డశ్వ
త్థామ యనుబుద్ధి వొడమె నది యెట్లనినఁ గురుపాండవులు భండనంబుఁ జేయం
దొడంగినయది మొదలుగా రాత్రు లచ్చటిజనులు నీలతనువును రక్తాస్యనయ
నయు రక్తాంబరధరయు రక్తమాల్యానులేపనయు నగు లేమ యొక్కతి దమవీటి
వారు నిద్రపోవుచుండఁ దలలు వీడ మేనులు వికృతంబులైవ్రేలం బాశంబులఁ
గరితురగసహితంబుగా బంధించి ఘోరసంరంభంబునం దెచ్చి తెచ్చి యశ్వ
త్థామయగ్రభాగంబునం బెట్ట నుగ్రభావంబున నతండు దునుముచు నార్చు
చునికిఁ గలలుగాంతు రట్లగుటంజేసి నిద్రాసక్తులం జంపుటయు నవ్విధంబునా
ర్పును నేర్పడ ననుసంధించి యక్కలలఫలంబు గాకేమి యని తలంచి చొచ్చి
పోటునకు నయ్యరాతి రాత్రిమైవచ్చుట నిశ్చియించి యశ్వత్థామఁగా నెఱింగి
రవ్వీరుండుమెఱుంగుమెఱచినట్లు వివిధగతులఁ జరించినం జెండాడినం జూచియు
నీడంబోక రణక్రీడ సల్పిన నబ్బలుమగండు సముద్దండబాహుదండవిలాసుండై.


10_1_194 మహాస్రగ్ధర.
తలలన్ హస్తమ్ములం బాదములఁ దనువులం దత్ప్రదేశంబుఁ గప్పుం
దొలఁగించున్ వానిఁ గ్రొన్నెత్తురు వఱపి హయస్తోమదంతిప్రతానం
బుల మేదోహంసఖండంబుల దనుజమహాభోజనం బావహించు
న్మలఁగం బాఱుం జెలంగున్నలి నెసఁగు జయోన్మత్తుఁడై మానవేంద్రా.


10_1_195 తే.
అట్లు విహరించి హతశేషు లైనజనులు
పాఱఁ గనుఁగొని రథ మెక్కి పటురయమున
వారి వెనుకొని మెఱుఁగువాలారుతూపు
గములు వరఁగించి యందఱ సమయఁ జూచి.


10_1_196 క.
ఆకలన నట్లు సేసి మ,హాకులజనతతులు గాఁగ నన్యస్థలులున్
భీకరరథగతుల నుద,గ్రాకృతియై మెఱసి యమ్ము లడరింపంగన్.


10_1_197 వ.
ఇట్లెసఁగుబహుళకోలాహలంబున హయంబులు నిభంబులుఁ గట్లు దెంచుకొని
కలయంబాఱెఁ బాఱుటయు గోడిగలకై దంతపాతకలహంబులం గెరలుగుండ్ల
క్రందునను నొండొంటిమదగంధంబులు సహింపక మార్కొని పోరాడు
సామజంబులసమ్మర్దంబునను గాళ్లు దునిసియుఁ జేతులు నలిసియు నురంబు లవి
సియు వెన్నలు విఱిగియుఁ బ్రక్కలు నొగిలియుఁ దలలు పగిలియుఁ జాఁపకట్టు
వడి చదిసియుఁ గ్రంతల నిఱకటంపుఁజోట్ల మానవకోట్లు పీనుంగుతిట్ట లగు
చుండఁ బలకయు వాలునుం గొని యువ్వాలుమగండు వేడుకం దేరు డిగ్గి యగ్గ
జంబులను ఘోటకంబులను బొదివి పాటవాటోపం బొప్ప విపాటనవినోదంబు
సలిపె నప్పుడు గొందఱు నెఱయ మేల్కననిభ్రమను భయంబునను బాదం
బులు గుదివడఁ బాఱ లేక నెల వెడలినయెలుంగుల నస్తవ్యస్తపుమాట లాడఁ
గొందఱు జనకసహోదరాదు లగుబంధువులఁ బేరు వేరం బిలుచుచుం దిరిగి కను
దిరిగి తమవారు గానివారలచెట్టలు వట్టుకొని చనఁ గొందఱు కైదువులు గొని
కదిసి నిదురకన్నులం బొదువుచెలులను జుట్టంబులను బగఱ యని సమయింపఁ
గొంద ఱెదురుగాఁ జనుదెంచినవారిది యేమి యని యడుగ నశ్వత్థామ సొచ్చి
పొడుచుచున్నవాఁ డనిన వా సుదేవార్జునులు శిబిరంబున లేమి నప్పాపాత్మున
కిట్లు సేయ వచ్చెం గాక వారున్నఁ దన్ను గాసి సేయరే యని పలుకఁ గొంద
ఱు బీభత్సుం డిట్టపరాక్రమంబు సేసినం జూచి మనంబున రోయ కుండునే
యతం డెన్నఁడేనియు వాహనవికలుఁడైన వానినిఁ జేత నాయుధంబులు లేనివా
నిని దల వీడినవానిని వెఱచినవానిని వెఱఁగుపడినవానినినిద్రించువానినినొం
చునేయనియర్జునునగ్గింప నయ్యందఱ నగ్గురునందనుండు గురుతరం బయినకురు
రాజుపరిభవంబు లప్పటప్పటికిఁ దలంపఁ బెంపారుదారుణక్రూరత్వంబునఁ గోలు
మసంగి యించుకయరవాయి గొనక చెండియుం ద్రుంచియుం జించియుఁ దుం
గమడుగుఁ జొచ్చినమాతంగంబుపగిది బడలువడం జేసె నాసమయంబున.


10_1_198 సీ.
ఆయోధవరుబారి కగ్గంబు గాక దవ్వుల భీతిఁ దలలచీరలును వీడఁ
బాదంబు లట దొట్రువడఁ బాఱి కొందఱు మానవాధీశులు సైనికులును
విడిదల వాకిట వెడలుచోఁ గృపకృతవర్మలఁ గని వఱువట్లు వట్టు
పెదవులు దడుపుచు సదయతఁ గావరే యనుచు మ్రొక్కఁగ నమ్మహాత్ములపుడు


తే.
రాక్షసావేశసంభృక్రౌర్యులగుట, నధిప యాత్మీయమానుషహాని దలఁప
లేక వారలఁ బొదివి యనేకభల్ల, దారితులఁ జేసి రందఱఁ దరతరంబ.


10_1_199 క.
ధరణి నెఱి దప్ప నొఱగిన,కరిహయనరచయము లొఱలఁ గాఁ గరుణము భూ
వర యొరసె శిబిరమునఁ దన, కరయఁగ జేరుగడ లేమి నది వృథ యయ్యెన్.


10_1_200 వ.
అట్టియెడ.


10_1_201 మహాస్రగ్ధర.
దనుజవ్రాతంబు కాంతాతతియును బ్రజలుం దారు నానావిధోగ్ర
ధ్వను లాకాశావకీర్ణత్వమహిమఁ బొరయం దంష్ట్ర లత్యంతఘోర
త్వనిరూఢిం బొంద నార్చుం దఱచుగ నగు నుత్తారసల్లాపముల్ సే
యు నలిం గ్రందారఁ బైపై నురవడిఁ గవియున్ హుంకృతాభీలభంగిన్.


10_1_202 వ.
ఇవ్విధంబున వివిధవికారాననంబులు బహుభంగికకరపాదంబులు గలుగునపరి
మితక్రవ్యాదులు గవిసి మేదోమాంసమస్తిష్కమజ్జంబు లానుచుం జవియైన
వానిఁ బుత్రమిత్రకళత్రాదుల కొసంగుచు నన్యకోటి బెరసినయెడఁ ద్రోద్రో
పులాడి యవియుఁ గైకొనుచుం గీలాలపానంబున మత్తిల్లి నృత్యంబులుసేయుచు
మఱియు ననేకప్రకారంబుల విహారంబు సలుపుచు నుల్లసిల్లిరి పదంపడి యఱ
బీనుఁగు లొఱలుటయును దానవగణంబుకలకలంబును డిందువడియె నప్పుడు
జగంబులు గొని కాలిన కాలాగ్నియుంబోలెఁ బాండవశిబిరంబు నిరవశేషం
బుగా సమయించి శమియించి చాపాచార్యనందనుండు మేనెత్తుట జొత్తిల్లిమో
హాంధ్యంబుతోఁ గలసి యునికింజేసి సాంద్రతరరక్తసిక్తంబు లైనబాహుఖ
డ్గంబు లేకద్రవ్యంబుచందంబు నొంద మరలి తాను బ్రవేళించుతఱి నెట్లుండె
నట్ల నిశ్శబ్దం బైనయవ్విడిదల వెడలుచుండఁ దెలతెల వేగె నిట్లు ప్రతిన నెఱపి
కృపకృతవర్మపాలికిం జనుదెంచి వారలతో నిట్లనియె.


- అశ్వత్థామ పాంవశిబిరంబు వెడలి కృపకృతవర్మలఁ గూడికొనుట -


10_1_203 సీ.
సకలపాంచాలురు సమసిరి పాంచాలికొడుకు లందఱు జముకడకుఁ జనిరి
చేదిమాత్స్యప్రభద్రాదిబలంబులు నిరవశేషంబుగా నేలఁ గలిసె
మాటలు పెక్కేల మానిసి గుఱ్ఱ మేనుం గనుపే రెల్లఁ ద్రుంగెఁ బాండు
భూవరనందను లేవురుఁ గృష్ణుఁడు సాత్యకియును నెందుఁ జనిరొ కాని


తే.
తండ్రియును నేలినాతఁడు దైన్యపడిన, దాని కరులపై వచ్చి యీశానువరము
గాంచి మీరలుపెనుఁబ్రాపుగాఁగవీడు,దఱియుటకునెతదగునంతపఱుపఁగంటి.


10_1_204 వ.
అని చెప్పిన వినుచు మున్ను రాక్షసావేశంబునం జేసి నీచపరాక్రమంబు లాచ
రించి తదనంతరంబ తెలిసి యారథికవరులు వగం బొగలుచున్నవారు గావున
నగ్గురునందను నగ్గింపం దలంపక యూరకుండి తమమనోవికృతి యతం డెఱుం
గకమున్న తలలు వంచుకొని తగుతెఱంగునఁ బొగడిన నతండు.


10_1_205 తే.
పాండుతనయులు నాచేతఁ బట్టువడుట, తెగుటగలిగిన ననుఁ గొంతపొగడఁదగును
జలముమైరిత్తవాండ్రను జంపుటరయ,మీరు గొనియాడునంతటిపౌరుషంబె.


10_1_206 వ.
అనిన విని వారలు ధృష్టద్యుమ్నప్రముఖపాంచాలురను బ్రతివింధ్యాదిద్రౌపదే
యులను బేరుకొని వారివారిబలంబులను మాత్స్యానీకప్రభృతిసైన్యంబులను
నొక్కరూపేనియుఁ ద్రిక్కకుండ నొక్కరుండవ రెండుజాములలో నేలం గలి
పితి కరం బచ్చెరువు గాదెయని యతనిం గౌఁగిలించుకొనిరనుటయు సంజయు
నకు ధృతరాష్ట్రుం డిట్లనియె.


10_1_207 క.
కురుపతికి జయము గొరెడు,గురుపుత్రుఁడు మున్న యేలొకో యిటు తఱికిం
జొరక యెడమడిసినను మఱి, వెరవుం జేవయును జూప వేడుకవడియెన్.


10_1_208 వ.
అనిన యమ్మహీపతి కతం డి ట్లనియె.


10_1_209 ఉ.
పాండునృపాలనందనులబాహుబలంబున కోడి యాతఁ డు
ద్దండతఁ గుంది యుండి వసుధావరునూరులు నుగ్గుసేసి భీ
ముండు దదుత్తమాంగము సముద్ధతిఁ దన్నిన దాన శోకముం
జండతరప్రకోపము నసహ్యపువేదన సేయ నత్తఱిన్.


10_1_210 ఆ.
గురునిచావుతెఱఁగు క్రొత్తయై మనమున,నావహిల్లుటయు మహాగ్రహమున
బాసయిచ్చి రాజుపనుపును బడసి యు,దగ్రవృత్తి నరిగి యట్లు సేసె.