ఆబ్రహాము లింకను చరిత్ర/ఇరువదియొకటవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వాషింగ్టనునకు సమానుడుగ సమ్మానించుచున్నారు. * వీరిరువురును మహాకష్టదినముల రాజ్యాంగమును నడపి సంరక్షించి జయప్రదముగ నిక్కట్టులనుండి తప్పించి స్వాతంత్ర్యమున మెలగుట గలుగ జేసిరి.

_______

ఇరువదియొకటవ ప్రకరణము

ఘోరహత్య ; అంత్యము.

లింకను దేశాధ్యక్షత వహించినదిమొద లెవ్వ రతని పైబడి యెఫ్ఫుడు వధించెదరొ గదా యనుభయ మందఱకు నుండె ననువిషయ మిదివఱకే తెలుపబడెను. అతనికిగూడ నట్టి యంతము దనకు వేచియున్నదేమో యనిశంకించుటకు దగినంత సూచనలు పొడసూపెను. అధికారము వహిం ______________________________________________________________ పైగారవముసూప నాతనిసతికి నిచ్చుభరణమును రాజ్యాంగమువారు మిక్కిలి యౌదార్యము గనుపఱచుచు హెచ్చించి యున్నారు.

  • రాజ్యభవనమున నొకప్రక్కన జాతీయ స్వాతంత్ర్యముం గలుగ జేసిన వాషింగ్టను జ్ఞాపకార్థ మతనిపేర నొక శాసన మొప్పచుండెను. యుద్ధముముగిసినతోడనె దానికి సమానముగ మఱియొక ప్రక్కన సంయోగపు స్థైర్యమునకును స్వాతంత్ర్యోద్ధరణమునకు గారణభూతు డగు లింకనుజ్ఞాపకార్థము మఱొండు శాసనము నిలిపి యాస్థానము నలంకరించిరి. చినదాదిగ దన్ను బ్రాణములు గొందుమని జంకించుచు వైరులు వ్రాయుచువచ్చిన పత్రము లనేకము లత డందు కొనుచుండెను. అయిన నవి దనకు బ్రారంభమున గొంచె మార్తి గలుగ జేసినను రానురాను సర్వసాధారణ మగుటవలన నలయింప లేకుండెనట. ఏమివింత? ప్రాణాపాయసూచనలు గూడ సాధారణము లగునే?

ఇతరాధికారులు పలుమాఱు లింకను సంరక్షణార్థము గొంతదండు నతనిగృహముచుట్టు నుంచుటకును నాతనివెంబడి పంపుటకును బ్రయత్నించిరి. దాని కత డంగీకరింపకుండెను. అట్లు చేయుటవలన లాభ మొక్కటియు లేదనియు దుర్మార్గుల కవనమ్మకముం గనుపఱచి వారి కోపానలంబు నింక నెక్కుడు చేయువిధం బగుననియు, దన్ను సంహరింప నిశ్చ యించిన వారి కెన్నియో మార్గములు గలవనియు, వానినెల్ల నాపుటకు బ్రయత్నించుట రాజ్యాంగపు బనిని నిల్పుటయే యనియు, నట్టియుద్యమముల ఖండించుచు వచ్చెను.

1865 వ సంవత్సరము 14 తేది ప్రాత:కాలమున లింకను కుమారుడు సేనానాయకుల నొక్కడు లీ పట్టువడిన తెఱం గెఱింగింప నేతెంచెను. అతనితోడన జనరిల్లాల నను స్నేహితునివద్దనుండి లింకనుకు రిచ్మండుపట్టణము జొచ్చినరీతి మరల సాహసించి దనప్రాణముల నపాయస్థితియం దిడుకొనగూడదని బోధించుచు నుత్తరము వచ్చిచేరెను. లింకను నద్దానికి సమ్మతించి జాగ్రత్తగ నుండెను.

నాడ ప్రథమజయపు నాలుగువ సంవత్సరోత్సవదినము. నాడ రిపులచే జిక్కియుండిన సంయోగరాష్ట్రపు ధ్వజము గోటపై కెక్కింప నియమిత మయియుండెను. ఈ రెండుత్సవములును మహాసంతసమున జరుపబడెను. ప్రతిగ్రామమునుండియు రాజభక్తు లనేకులు గుంపులుగుంపులుగ విచ్చేసి సంపూర్ణ హృదయమున నుపన్యాసములు విని, మంగళవాద్యముల కలరి, మిక్కిలి సంతుష్టహృదయ లయి యుండిరి.

ఇంకను దమ యాహ్లాదమును వెల్లడిసేయ నాటిరాత్రి మహావైభవమున గడప నిశ్చయించి నాటకాదివినోదముల కేర్పాటులు గావించిరి. అం దొక గొప్పనాటక శాలయందలి ప్రదర్శనము వీక్షింప రాష్ట్రపు నుద్యోగస్థుల బ్రాముఖ్యు లెల్లరును నాహూయమాను లైరి. లింకను మొదలుగ నందఱు నచటికి దఱలుదురని వార్తాపత్రికలు ఘోషించెను.

నిశాసమయమున నెనిమిదిగంటలమీద నలుబదినిమిషములకు లింకను దనభార్యతోను గొప్ప యుద్యోగస్థులతోను నాటకశాలం బ్రవేశించెను. ఆ మహనీయుని రాక కచ్చటిజనులుప్పొంగి కరాస్ఫాలనంబున జయజయారావంబుల నతనికి స్వాగత మిచ్చుచు గారవముసూప లేచి నిలిచిరి. అతడు నాట్యరంగమున కెదురుగ నొక యుత్తమాసనమున నాసీనుడయ్యెను. ఆశాలయందలి జనులెల్లరు దమతమస్థానముల గూర్చుండిరి. సద్దడగినాటకము ప్రారంభమాయెను.

పదిగంట లగునప్పటి కొకగుండు రివ్వుమని పాఱుట విననాయెను. కొంద ఱది నాటకమున నొకభాగ మేమోయని తలంచుచుండిరి. అయిన లింకనుసతికేక లిడుటయు హతకుడు లింకను నాసనము క్రిందినుండి నిర్గమించుటయు నొక ఘోరకార్య మనివార్యముగ జరిగెననుట యెల్లరకుం దెల్లము సేసెను. ఆ హతకుడు రంగస్థలమున కెగసి

"రాజబ్రువు లిట్లె మడయుదురు గాత" మని గర్జించుచు దళతళమెఱయు నొక ఖడ్గముం ద్రిప్పి,

"నేటికి దక్షిణసీమల పగదీరె" ననుచు దప్పించుకొని పోయెను.

చూపరులెల్ల రొక్క నిమిషమాత్రము దిగ్భ్రమజెంది చూచిరి. వెంటనె వారిలో నొకడు 'జాన్ విల్కుసుబూ త'ని బిగ్గరగ నఱచె. అనేకులు 'వానిం గాల్వుడి కాల్వు డని' వాని వెన్నంటిరి. స్త్రీలు గొల్లుమని యేడ్చి మూర్ఛవోయిరి. పురుషు లొడలుదెలియనివారింబోలె నదరించుచు బెదరించుచుచుండిరి. అందఱును వ్యాకులచిత్తు లయిరి. వారి యవస్థ వర్ణింప నలవిగాదు. మహా వైభవమున సంతోష తరంగముల నోలలాడుచుండిన జను లెల్లరును నగాధశోక కర్దమాంబుధి మునింగి లేవకుండిరి. ఇట్లుండ జిచ్చునకు గాలి తోడ్పడినతెఱంగున లింకను కార్యదర్శి సీవార్డు చంపబడెనని తెలియనాయెను. లోకుల ఖేదభయంబులు దెల్ప నుక్తులుచాలవు. ఎచ్చట జూచినను హత్యల వార్తయె మెండయ్యెను. రాజ్య మరాజక మగు ననియు గొప్ప యుద్యోగస్థు లెల్లరును బ్రాణము లర్పింప సిద్ధపడవలె ననియు వదంతి గలిగెను.

'బూతు' మొదలుగా గల్గు కొందఱు దుర్మార్గులు దాస్యవ్యాపార పక్షపాతు లొక సంఘముగ జేరి రాజకీ యోద్యోగస్థుల దుదముట్టింప దీర్మానించి యుండిరి. లింకనును మార్చి 4 వ తేదీననె సంహరింప బ్రయత్నించిరి. గాని వారి పన్నుగడలు జయమందలేదు. కాన తమ మనోరథము నిపుడు తీర్చికొనిరి. సేనానాయకుడు పనివడి పిలడెల్ఫియాకు వెడలి యుండె గాన దప్పించుకొనియెను. లేకున్న లింకనుతో నతడును దివికేగియుండును.

రాజ్యాధికారు లీ దుర్మార్గులవెదకిపట్టిరి. బూతును అతని స్నేహితులును దాము చేసిన కార్యములకు ఫలముగ గుండు దెబ్బలు దిని పరలోకప్రాప్తి జెందిరి. లింకను జంపబడె ననువార్త యునైటెడ్ రాష్ట్రమున నంతయు రెండవరోజుదయమున దెలియనాయెను. పట్టణపట్టణ మందును, బల్లియపల్లియయందును, దు:ఖ తిమిరములు దట్టము లయ్యెను. అంగళ్లయందలి నలుపువస్త్రములెల్లయు నుపయోగింపబడియెను*ప్రతి మనుజుడు వేరొక్కరుని దనస్నేహితుని జూచినపుడెల్ల "ఘోరముఘోర మ"ని విలపించుట విన నాయెను. జనులు సభలు చేర్చి తమ దు:ఖమును వెల్లడించిరి. దేవాలయముల ననేకులు గుమిగూడి దైవము లింకను జీవమును సుగతిం జేర్చుగాతమని ప్రార్థించిరి.

ఇక నీగ్రోల స్థితి యంటిమే యూహింపం గూడజాలము. తండ్రి గతుడైన శిశువు లెట్లు విలపింతు రట్లు లింకను చావునకు వీరు విలపించిరి. ఎచ్చట జూచినను నీ నల్లవారు దు:ఖముచే ముఖములు వాంచి చేతులు పిసికికొనుచు 'దైవమా' 'దైవమా' 'దైవమా' యని మొఱ్ఱలిడుచు నేరు పలుకరించినను బలుకనేరక వీధులంబడి పోవుచుంటయ ననేకు లొక్కటిగజేరి మోకాళ్లపై నొరగి దేవునికి దమ యార్తహృదయముల నివేదించుటయు గాన నయ్యెను. ______________________________________________________________

  • పాశ్చాత్యులు దు:ఖము గనుపఱుప నల్లవస్త్రముల ధరింతురు. తమగృహాదుల నలుపున గప్పుదురు. వార్తాపత్రికలలోను జాబులలోను గూడ గాగితము చుట్టును నల్లగీతల ముద్రింతురు. లింకను మరణవార్త దేశదేశములకు బర్వెను. మన చక్రవర్తినిగా నుండిన విక్టోరియాయును, ఫ్రాంసు చక్రవర్తిగ నుండి స్వాతంత్ర్యమునకు బాటుపడిన నెపోలియను, నతని సతియు, ఫ్రాంసు, రష్యా, ఇటలీ, ప్రషియా మొదలగు దేశముల రాజ్యాంగమువారును దమ దు:ఖమును వెల్లడిసేయుచు లింకనుసతి నోదార్చుచు పత్రికలు వ్రాసిరి. స్వాతంత్ర్యము గోరువారందఱును లింకను మరణము విని యశ్రులు రాల్చిరి.

లింకను కళేబరమును రెండవరోజు వాషింగ్టనునందు సితగృహమునకు దీసికొనిపోయిరి. అచ్చటినుండి యుచితవిధమున స్ప్రింగుఫీల్డునకు నతని స్వగ్రామమునకుం గొంపోవ నేర్పఱచిరి. ద్రోవయం దొక్కొక్కపట్టణమునను కోట్లకొలది ప్రజలు లింకను శవమునకు మహా గౌరవము జూపి తమదు:ఖమును వెల్లడిచేసిరి. శోకార్ద్రహృదయులు సల్పు సపర్యల గొనుచు లింకను దేహమాత్రుడై యిలువచ్చి చేరెను. అచ్చట నతని బంధుమిత్రు లెంత పొగిలిరో చదువరుల యూహింతురుగాక. మరణానంతరకృత్యముల నొనర్చి నతాన నులై మౌనమున దు:ఖధారల వెల్లడించుచు వేనవేలు జను లాతని కళేబరమును సమాధి జేర్చిరి. * అచ్చట నాచార్యులు ______________________________________________________________

  • అచ్చట నొక పెద్దభవనముగట్టి రాజ్యాంగమువారు లింకనును గౌరవించియున్నారు. లింకనునుగుఱించి నుడివిన వాక్యములలోని ముగింపుభాగముతో మనమును ముగింతుముగాక.

"నాయకశిఖామణీ! ఇక సెలవొసంగుము. పోయివచ్చెదము. దేశ మంతయు నిను వీడ జాలక దు:ఖించు చున్నారు. అయిన నేమిచేయనగు. దేవునియాజ్ఞ యైనది. మాకోరిక లిపుడు పనికిరావు. నిన్ను మే మెప్పుడును మఱువము. దేశమున దల్లులు దమ కుమారులకు నీపేర మొదట గఱపుదురు గాత. మన బాలురెల్లరు నీగుణముల సంపాదింప బ్రయత్నింతురుగాక. రాజ్యనిర్వాహకులు నీ జేసిన కార్యముల గని జ్ఞానము సెందుదురుగాత. పెదవులు గదలలేకున్నను నీమాట లింకను మాకు వినవచ్చుచున్నవి. నీ వదనమునకు జలనము లేకున్నను దానినుండి యుద్భవించిన స్వాతంత్ర్యమున కగు వాక్కుల ఛాయ లోకమునందెల్ల ప్రౌడముగ విననగుచు బానిసల నలర జేయుచున్నది. కాలుడు నిను నిర్బంధించి నట్లగుపడుచుండినను గీర్తిచే నీ స్వేచ్ఛమై లోకమునందెల్ల సంచరించుచున్నాడవు. నీ చావు నీకొఱకు గాదు; నీ సంహారకుడు నీపై వైరమూనడయ్యెను. మనములు గట్టివైచి మాజాతీయత సంహరింప నతడును నతనివారును సమకట్టిరి. అయిన నీప్రాణములైన నర్పించి మాయిడుమల దప్పించినందులకు మాయుద్ధారకుండుగ మేము నిను బూజించు చున్నారము. భూమియు నిన్ను దన జయోపేతపుత్రుండని యుగ్గడించుచున్నది. వీరాగ్రేసరా! దేశోద్ధారకా! లోక పూజితా! సన్మిత్రా! నీకు బరలోకమున మే లగుగాత."