ఆధునిక రాజ్యాంగ సంస్థలు/విజ్ఞప్తి

వికీసోర్స్ నుండి

విజ్ఞప్తి

పూర్వము హిందూదేశమందు ప్రజలందరు నాలుగు వర్ణములుగా అనగా బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజింపబడుటచే క్షత్రియులకు తప్ప తదితర వర్ణములకు రాజ్యతంత్రము, పరిపాలన మొదలగు విషయములందు సంబంధము లేకయే జీవించుచుండిరి. శత్రుశిక్షణ, ప్రజారక్షణ క్షత్రియులయొక్క ధర్మమై యుండెడిది. దానివలన తక్కిన వర్ణములవా రెవ్వరు దేశసేవ, పరిపాలన మొదలగు వానియందు పాల్గొనుట, యుద్ధము చేయుట ఎన్నడును చేసినవారుకారు. మొదట అలగ్జాండరు, పిమ్మట మహమ్మదుఘోరీ, తరువాత బేబరు, ఆఖరున ఇంగ్లీషు, ఫ్రెంచి, డచ్చి మొదలగు యూరోపియనులు హిందూదేశముపై దండెత్తినప్పుడు ఎవరోకొందరు రాజపుత్రులు తప్ప తక్కిన జనసమూహము లెవ్వరును శత్రువులతో పోరాడినట్లు కాన్పించదు. అదిగాక రాజ్యము ఏవిధముగానున్నదో పరిపాలన సక్రమముగా జరుగుచున్నదో లేదో వా రెన్నడును గుర్తించెడివారుకారు. విద్యకూడ ఏకొద్దిమందికో తప్ప తక్కినవారెవ్వరికిని లేనికారణముచే ఇటువంటి పరిస్థితు లేర్పడి యుండవచ్చును.

కాని పూర్వపు ఆచారములు, అజ్ఞానము, పరిస్థితులు ఈ కాలమందు మారినవి. ఇదివరకు చాల విజ్ఞానమును ప్రజలు సంపాదించిరి. ఇకముందు పూర్తిగా పరిపాలనాతంత్రము, రాజనీతిశాస్త్రము ప్రతిమానవునికిని తెలిసి, అనుభవమునకు తెచ్చుకొని ఆచరణలోనికి దిగవలసిన కాలమువచ్చినది. మాంటేగ్యూషేంమ్సుఫర్డు చట్టము మార్చివేసి కొత్త రాజ్యాంగ శాసనము అమలులోనికి రానున్నది. దానివలన ప్రతిరాష్ట్రమందును పూర్తియైన బాధ్యతాయుత ప్రభుత్వము అమలులోనికి వచ్చుచున్నది. కేంద్రప్రభుత్వమందు కూడ కొన్నిమార్పులు రానున్నవి. ఇవన్నియు తమయొక్క హక్కులను, విధులను గుర్తెరింగిన వోటర్లచేత నెన్నుకొనబడిన శాసనసభ్యులు పరిపాలకులను అనగా మంత్రులను ఎన్నుకొని ప్రజలకు బాధ్యులై జవాబుదారితో పరిపాలనను సక్రమముగా జరిగించవలెను. పాశ్చాత్యదేశములలో నేరీతిగా ప్రజాస్వామిక రాజ్య మేర్పడినదో ఆరీతిగా మన హిందూ దేశములోకూడ అమలులోనికి రావలెను.

ఇందులకు ముఖ్యమైన సాధనములు, ప్రజలలో విద్య ప్రబలియుండుట రాజనీతి శాస్త్రము చక్కగా తెలియజేయు గ్రంథములు పఠించుట, మన యాంధ్రభాషలో నిదివరకు (Political Science) రాజనీతి శాస్త్రమును బోధించు గ్రంథములును, ప్రపంచములోనుండు దేశములలో జరుగుచున్న పరిపాలనాక్రమమును వర్ణించు పుస్తకములును విశేషముగా లేవని చెప్పవచ్చును. ఆలోటును తీర్చి ఇంగ్లాండు, అమెరికా, జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీ, జకోస్లొవోకియా, ఆస్ట్రేలియా, కెనడా, మొదలగు నానాదేశములందు అమలులోన్న రాజ్య తంత్రమును వర్ణించుచు, రాజ్యములో నన్నియంగములును ఏయే దేశములలో నేరీతిని పనిచేయుచున్నవో సరిపోల్చుచు, భేదములను కనిపెట్టుచు, మన హిందూదేశమునకు ఏయేమార్గములు పనికివచ్చునో, యివన్నియు తేటతెల్లముగా వర్ణించు గ్రంథము ముఖ్యముగా అవసరము.

మొదట ఈశాస్త్రముయొక్క రూపురేఖలు కొంతవరకు మనకు---------యున్నది. దేశము, పరిపాలన, పరిపాలకులు,--------,లాకోర్టులు, పరిపాలింపబడు ప్రజలు మొదలగు ననేక విషయములను గుర్తించి, వానివాని స్వభావములను ఏర్పాటుచేసి వాని పరస్పర సంబంధములను వర్ణించుశాస్త్రమే రాజనీతి శాస్త్రము.

ప్రపంచములో సృష్టియొక్క ప్రారంభమున సర్వాంగములు వృద్ధి చెందిన పరిపాలనాక్రమము ప్రజలకు తెలియనే తెలియదు. మొదట జనులు అడవులలో జంతువులవలె పచ్చి మాంసమును తినుచు గృహములు, బట్టలు, ఆస్తిమొదలగునవి లేకయే జీవించెడివారు. క్రమముగా కొన్ని జంతువులను మచ్చిక చేసికొని ఆవులు, గేదెలు, కుక్కలు, గుఱ్ఱములు, మేకలు మొదలగువానిని జాగ్రత్తపెట్టుకొని వానివలన జీవయాత్ర గడుపుచు, ఒక ప్రదేశమునుండి మరియొక ప్రదేశ మునకు తిరుగుచు నుండెడివారు. ఆపరిస్థితులలో వివాహములు, కుటుంబములు, ఆస్తులు, కొంతధర్మశాస్త్రము, మతము మొదలగునవి యేర్పడినవి. క్రమముగా కుటుంబ యజమానుడు అనగా తండ్రి కుటుంబమునకు పెద్దయై పుత్ర పౌత్ర కళత్రాదులను పాలించుచు రాజనీతి శాస్త్రమునకు బీజమును వేసినవాడాయెను. ఈ కుటుంబములయొక్క పెద్దలలో ముఖ్యుడు రాజనియు, కులముయొక్క పెద్దయనియు పిలువబడుచుండెడివాడు. శత్రువులతో పోరాడునప్పుడును తదితర విషమ పరిస్థితులందును వీనియొక్క యధికారము ప్రబలి ఏకరాజ్యాధిపత్యము బ్రాముఖ్యతకు వచ్చినది.

ఈజనసమూహములు దేశసంచారము చేసిచేసి కొంత కాలమైన పిమ్మట అక్కడక్కడ శాశ్వతనివాసములనేర్పాటు చేసికొనిరి. గ్రీసుదేశములోను, హిందూదేశమందును గ్రామములలో నివాసము చేయ మొదలిడి గ్రామపంచాయతీల పరిపాలనా క్రమము అమలులోనికి వచ్చెను. కొంత కాలమునకు ఈగ్రామములు పట్టణములక్రింద మారి (City States) పట్టణరాజ్యములు నిర్మింపబడినవి. ఏథెన్సు, రోము, స్ఫార్టా మొదలగు రాజ్యములు అభివృద్ధిజెంది వాని వాని స్పర్థలచే నాశన మొందినవి. మరికొంతకాలమునకు (Territorial States&Empires) సామంతరాజులు, చక్రవర్తులు ఏర్పడిరి. రోమన్ రాజ్యము, అలగ్జాండరు రాజ్యము మొదలగునవి మిక్కిలి విశా లమగునవియై, అప్పటికి తెలిసిన ప్రపంచమంతను వ్యాపించి, అభివృద్ధిని జెంది క్రమముగా క్షీణించినవి. తరువాత జర్మనులు, ఫ్రాంకులు, ట్యూటనులు మొదలగు జనసమూహములు ఆయాదేశములలోవచ్చి నివాసమునేర్పరచుకొని ప్రస్తుతపు రాజ్యాంగ సంస్థలను నిర్మించిరి.

ఈ రాష్ట్రములే మిక్కిలి ఉన్నతస్థితియందు ప్రస్తుతము ఉన్నవి. ఈరాష్ట్రములు వివిధరీతులుగా, చిత్ర విచిత్రరూపు రేఖలతో విరాజిల్లుచున్నవి. ఈరాజ్యములను మనము అనేక విధములుగా విభజింపవచ్చును.

కొన్ని రాజ్యములు రాజులచే పాలింపబడుచు మన హిందూదేశములోని స్వదేశసంస్థాములవలె నిరంకుశ ప్రభుత్వములనబడుచున్నవి. యీరోషిమహాసంగ్రామమునకు ముందు రషియాదేశము ఈరీతిగానే పాలింపబడుచుండెడిది. కాని కొన్ని రాజ్యములలో అనగా ఇంగ్లాండు, ఇటలీ మొదలగువానిలో రాజునామమాత్రముగా నుండి, ప్రభుత్వము ప్రజలచే నెన్నుకొనబడు మంత్రులచే చేయించుచు, తాను నిస్పక్షపాతగానుండి రాజ్యము చేయుచుండెను. దీనిని (Limited Monarchy) నియమితమగు ఏక ఛత్రాధిపత్యమందురు. మరికొన్ని దేశములలో రాజు లేనే లేడు. వీనిని రిపబ్లికు లందురు. అమెరికా, ఫ్రాంసు, చైనా మొదలగువానిలో ఎన్నుకొనబడిన (President) అధ్యక్షుడు రాజ్యమునకు అధిపతియై యుండును. రాజుపాలించినను, అధ్యక్షునిక్రింద నున్నను ప్రభుత్వములో విశేషమైన భేదములుండవచ్చును. ఇంగ్లాండునందు ఒకే ప్రభుత్వము కలదు. మిగిలిన లోకల్ బోర్టులు, చిన్న సంస్థలు లండనులోనుండు ప్రభుత్వముచే నిర్మింపబడినవి. కనుక వానిని (Subordinate) తాబేదారు సంస్థలని చెప్పుదురు. జర్మనీలో కేంద్రప్రభుత్వము వేరు. సమ్మేళనరాజ్యములోచేరిన వివిధరాష్ట్రముల ప్రభుత్వము వేరు. అనగా ప్రషియా, బవేరియా, సేక్సనీ మొదలగు చిన్న రాష్ట్రములు వానివాని పరిపాలనాక్రమమును మార్చక పూర్వమువలెనే జీవముతో నున్నవి. కాని 1914 సంవత్సరమునకుముందు జర్మనీలోను, ఇంగ్లాండునందును రాజులే పరిపాలకులుగానుండిరి. అమెరికాలోను, ఫ్రాంసుదేశములలోను అధ్యక్షుడు అధిపతిగా నుండెను. కాని అమెరికాలో 48 చిన్న రాష్ట్రములు కలిసి సమ్మేళనరాజ్యమును ఏర్పరచికొనెను. కనుక అక్కడ కేంద్రప్రభుత్వము 48 చిన్న ప్రభుత్వములును గలవు. కాని ఫ్రాంసులో నొకేప్రభుత్వముకలదు. దీనికి (Unitary State) ఐక్యరాజ్యాంగమందురు.

కొన్ని రాజ్యములలో మంత్రులు ప్రజలచే నెన్నుకోబడు శాసనసభ్యులకు జవాబుదారులుగాను, బాధ్యులుగాను ఉండి శాసనసభలో మెజారిటీపార్టీలో ముఖ్యులుగా నుండి రాజ్యమును చక్కగా నడిపించుచు నుందురు. ఇంగ్లాండులోను, ఫ్రారాంసులోను, ఆస్ట్రేలియా, ఇటలీమున్నగు దేశములలోను ఈరీతిగా జరుగుచున్నది. ముఖ్యమంత్రియే ప్రభుత్వమునకు అధిపతి. రాజుగాని, అధ్యక్షుడుగాని ముఖ్యమంత్రికి అనుగుణముగా నడుపుచు శాసనసభలు తీర్మానించిన అన్ని చట్టములకును సంతకముచేయుచు నుండవలెను. కాని అమెరికాలోను, మరికొన్నిదేశములలోను, శాసనసభలకు మంత్రులకు ఏమియు సంబంధముండదు. దీనిని (Independent Executive) స్వతంత్రపుమంత్రివర్గము అని అందురు. వీరు అధ్యక్షునికే జవాబుదారులు. ప్రస్తుతము హిందూదేశములో కేంద్రప్రభుత్వమందు మంత్రులు వైస్రాయిగారికే జవాబుదారులు గాని శాసనసభలకుగారు.

ఇంకను కొన్నిదేశములందు ప్రభుత్వమునకుజెందిన వారికి వేరు లాకోర్టులును, సామాన్యప్రజలకు వేరు లాకోర్టులును గలవు. ఫ్రాన్సుమున్నగు ఐరోపాఖండపు దేశములలో (Administrative Law) ప్రభుత్వమువారిచే నిర్మింపబడిన లా కలదు. మామూలు సివిల్ లా, సామాన్యప్రజలకు జెందును. కాని ఇంగ్లాండు అమెరికా మొదలగు దేశములలో ప్రభుత్వపు నౌకర్లకును సామాన్యులకును ఒకే "లా' (Common Law) అనగా సివిల్ న్యాయసూత్రములే వర్తించును. ముఖ్యమంత్రినైనను సాధారణమైన కోర్టులో విచారణ చేయవచ్చును. కొన్నిదేశములలో నూతన చట్టములు శాసనసభల మూలముగా గాక వోటర్లందరిచేతను ఆమోదింపబడవలెను. దీనిని (Referundum) రిఫరెండమ్ అందురు. స్విట్జర్లాండులో నీపద్ధతి అమలులో నున్నది.

ఇంగ్లాండులో నే చట్టమునైనను సాధారణపద్ధతిని మార్పు జేయవచ్చును. కాని అమెరికామొదలగు దేశములలో కొన్ని చట్టములు విశేషవిపరీతపద్ధతిని గాని మార్పు జేయుటకు వీలు లేదు. కేంద్రశాసనసభయును 48 రాష్ట్రములలో నున్న శాసనసభలును కొన్ని పద్ధతులప్రకారము నూతన చట్టమును ఆమోదించవలెను.

ఇట్లు ఎన్ని దేశములు ప్రపంచములోనున్నవో అన్ని చిత్రవిచిత్రమైన భేదములతో ఆయాప్రజలకు, వారిచరిత్రకు, పూర్వాచారములకు సరిపడిన ప్రభుత్వములు అమలులోనున్నవి. ఈపుస్తకములో రాజనీతి శాస్త్రము విపులముగా వర్ణింపబడియున్నది. (Comparative Politics) వివిధ రాజ్యాంగ సంస్థలు సరిపోల్చబడినవి. ప్రతిదేశము యొక్క ప్రభుత్వాంశములును మనహిందూదేశమునకు ఏరీతిగా వర్తించునో పరీక్ష చేయబడినవి.

మొదటిప్రకరణములో ప్రజాస్వామిక రాజ్యమునకు కావలసిన విషయములు వర్ణింపబడినవి. విద్య, ప్రజానాయకులు, మతసామరస్యము మొదలైనవి చెప్పబడినవి. రెండవ ప్రకరణములో రాజ్యాంగవిధానపుచట్టము, దానిని మార్పుజేయువిధము, వివిధరాజ్యములలో నేరీతిగానున్నదో వివరముగా తెలుపబడినది. ఇదియునుగాక (Fundamental Rights) ఫండమెంటల్ హక్కులు అనగా పౌరముఖ్యస్వత్వములు పేర్కొనబడిని. మూడవయధ్యాయములో (Separatien Of Powers) శాసనసభలు, మంత్రివర్గము, న్యాయస్థానములు విభజింపబడి వేరువేరుగానుండు అవసరము చర్చింపబడినది. వానివాని పరస్పరసంబంధముకూడ చూపబడినది. నాల్గవదానిలో ఐక్యరాజ్యాంగములు, సమ్మేళనరాజ్యములు వర్ణింపబడినవి. ఐదవప్రకరణము చాలాపెద్దది. ఇందు శాసనసభలు, ఎన్నికలు, వోటింగుపద్ధతులు, వోటర్లబాధ్యతలు, వోటుహక్కును పొందుటకు కావలసిన నిబంధనములు విపులముగా వివరింపబడినవి. ప్రొపోర్షనల్‌వోటింగు పద్ధతి మిక్కిలి విచిత్రమైనదియు నూతనముగా అమలులోనికివచ్చి వృద్ధినిబొంద వలసియున్నదియు గనుక దీనిని అందరును గుర్తింపవలయును. ఇదిగాక శాసనసభ్యులు వారి బాధ్యతలు (Duties), వారు గమనించవలసిన విషయములు మొదలైనవి ప్రతిశాసనసభ్యుడును చదివితీరవలసినవి. ఆరవప్రకరణమందు రెండవశాసన సభ అనగా కౌన్సిల్, సెనేటుసభనుగురించి అనేకవిషయములుగలవు. ఇంగ్లాండు, అమెరికా మొదలగు దేశములన్నిటిలోనుగల రెండవశాసన సభావిశేషములు హిందువులమగు మనము గమనింపవలసినవిషయము. ఎక్కడనైనను రెండవ సభను సృజించుట మిక్కిలి విషయమైనపని. మనదేశములో (Council Of State) కౌన్సిల్ ఆఫ్ స్టేటు ఎట్లువర్తించునో, హిందూదేశపు భవిష్యత్తు ఏరీతిగానుండునో అయ్యది కాల గర్భమందున్నది. కనుక మనకు ఈప్రకరణము చాలముఖ్యము. ఏడవప్రకరణము శాసనసభ అనగా ప్రజలమొదటి సభ (Popular Assemble) ని వర్ణించుచున్నది. (Parties) ఫార్టీలు, పార్టీలయొక్క నిబంధనములు, చట్టములు చేయు పద్ధతులు మొదలగునవి చెప్పబడినవి. తుది ప్రకరణయందు క్రొత్తవిషయముకలదు. కార్మికుల పాలనయందు ప్రభుత్వమే రీతిగానుండవలెనో వర్ణింపబడినది. కొదువవిషయములు రెండవ భాగమున వివరింపబడినవి.

భారతదేశపు భావిరాజ్యాంగపరిణామమును ఆదర్శముగానుంచుకొని సుప్రసిద్ధ ఆంధ్రనాయకులగు ఆచార్య శ్రీ రంగాగారు ఈగ్రంథమున విపులముగా ఆధునికరాజ్యాంగ సంస్థలను విమర్శించిరి. కావున ప్రస్తుతపరిస్థితులలో ఆంథ్రమహాజనులకు రాజకీయవిజ్ఞానము కలుగజేసి భావిరాజ్యాంగ నిర్మాణమున తమకర్తవ్యము గుర్తింపజేయునను యాశతో ఈగ్రంథమును మాజాతీయగ్రంథమాలయందు నాల్గవపుష్పముగా ప్రచురించినారము. మాయుద్యమము నందుగల యభిమానముచే శ్రీరంగాగారిందులకు తోడ్పడినందులకు వారికి మాకృతజ్ఞతాభివందనములు. ప్రస్తుత ఆర్ధికపరిస్థితులలో దేశాభిమానులును, మాపోషకులును, శాశ్వతచందాదారులును, సహాయులును, చందాదారులును, మాకు ఒసంగుచున్న ప్రోత్సాహమునకు వందనములర్పించుచు ఇంకను ఆధునిక విజ్ఞానముగలిగించి జాతీయభావము పెంపొందించుటకై కృషిజేయు మాయందు ఆంధ్రులెల్లరు సంపూర్ణాదరణాభిమానములు చూపెదరుగాక యనికోరుచున్నాను.

సంపాదకులు