Jump to content

ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/శుభాశుభములు(2)

వికీసోర్స్ నుండి

26. శుభాశుభములు(2)

1925 వ సంవత్సరాంతమున మద్రాసు అడియారులో జరిగిన యొక సభాసందర్భమున నేను శ్రీదేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావుపంతులుగారితోఁ గలసి మాటాడుచు, నేను వ్రాసియుంచిన "కమలాక్షి" నవలను దాము ప్రకటింతురా యని యడిగితిని. వారు బాగుగ నాలోచించి, తా మిటీవల క్రొత్తరకఁపుఁ బుస్తకములు ప్రకటింప యోజించుచుంటిమి గాన, ఆ గ్రంథమాల కేపేరు పెట్టుట యుక్తమో చెప్పుమని న న్నడిగిరి. దానికి "నాగేశ్వర గ్రంథమాల" యని గాని, "ఆంధ్రగ్రంథమాల" యని గాని పేరు పెట్టుఁ డని నే నంటిని. వారి కోరికమీఁద "కమలాక్షి" ప్రతిని వారి కంపితిని. "ఆంధ్రగ్రంథమాల"కుఁ 'గమలాక్షి'యె ప్రథమపుష్ప మైనను, ఆ సమయమునకె సిద్ధమైన మఱికొన్ని పుస్తకము లుండుటచేత, నా పుస్తక మాగ్రంథమాలలో చతుర్థకుసుమ మయ్యెను.

ఈ పుస్తకములో వలసిన మార్పులు చేయుటయందు నాకు శ్రీ దుర్భా సుబ్రహ్మణ్య శర్మగారు ముఖ్యముగఁ దోడుపడిరి. ఇది మాప్రియజనకున కీక్రింది పద్యమునఁ గృతియిచ్చితిని.

                     తే. "అర్మిలినిబ్రోచి మమ్ము విద్యావివేక
                         వినయవంతులఁ జేసి, సద్వృత్తి నిలిపి,
                         స్వస్థ్సితినిగన్న మాకూర్మి జనకుని కిది
                         అంకిత మొనర్తు సుబ్బారాయాఖ్యునకును."

1925 వ సంవత్సరము ఏప్రిలులో ముద్రిత మయిన యా పుస్తకపుఁ బ్రతులు నాకు నరసాపురమున నా తమ్ముఁడు కృష్ణ మూర్తి తృతీయ పుత్రిక కామేశ్వరమ్మ వివాహసమయమున నందినవి. ఆ వివాహమునకు సకుటుంబముగ నేను గుంటూరునుండి యా వేసవిని వచ్చియుంటిని. అదివఱకుఁ గొలఁది దినముల క్రిందటనె గుంటూరు కృష్ణామండలములలో ప్రబలమగు గాలివాన వీచి, జనులకును జంతుజాలమునకును జాల నష్టము గలిగించెను. ఈ తుపాను నాధారము చేసికొని, "గాలివాన" అను శీర్షికతో నే నొక కథను గల్పించి, కృష్ణాపత్రికలోఁ బ్రచురించితిని.

ఆ మెయినెలలో రామాముద్రాలయమున నా "ఇంగ్లీషు వారి సంసారపద్ధతులు" పునర్ముద్రిత మయ్యెను. చిరకాలము క్రిందట నేను 'సత్యసంవర్థని,' 'జనానాపత్రికల'కు వ్రాసిన చిన్న వ్యాసములును, ఇటీవల నప్పు డప్పుడు బహిరంగ సభలలోను సమావేశములలోను జదివిన యుపన్యాసములును, శిథిల మగుచుండెడి ప్రాఁత పత్రికలనుండి తీసి యిపుడు "వ్యాసావళి" యను పేరిట రామా ముద్రాలయమున కచ్చున కంపితిని. ఈ పుస్తకము రెండుభాగముల యచ్చు చిత్తులను దిద్దుపట్ల శ్రీ మున్నంగి లక్ష్మీనరసింహ శర్మగారు నాకుఁ దోడుపడిరి. సామాన్యముగ నా పుస్తకముల తుది యచ్చు చిత్తులు నేనె దిద్దుకొనినఁ గాని నాకు సంతృప్తి గలుగదు. ఐనను, సెలవుదినములలో నే నొకచోట నుండక తిరుగుచుండుటవలన, ముద్రణసౌకర్యమునకై రామాముద్రాలయమువారీ ప్రత్యేక మగు నేర్పాటు చేసిరి. 1925 వ సంవత్సరము జూను నెలలో "వ్యాసావళి" మొదటి భాగమును, మఱుసటి సంవత్సరము ఏప్రిలులో రెండవ భాగమును ప్రచుర మయ్యెను.

1925 వ సంవత్సరమున వేసవితుదిని మా తమ్ముఁడు వెంకటరామయ్య, వ్యాధిగ్రస్తయగు తనభార్య రత్నమ్మను నెల్లూరు కొని వచ్చెను. అచటఁ గొన్నిదినము లుంచి, మే మామె నంత చెన్నపురికిఁ దీసికొనిపోయి, రాజధానీవైద్యాలయమున నుంచి, మాల్కముసను వైద్యునిచే మం దిప్పించితిమి. ఆ పురమున నొకనెల యుండిన పిమ్మట, కొంత స్వస్థపడిన తన సతిని మా తమ్ముఁడు భీమవరము తరలించెను.

నేను జిరకాలముక్రిందట ఓరియంటలు భీమాకంపెనీలో భీమా చేయించిన యొక పాలిసీసొమ్ము వేయి రూపాయిలు నా కీ యాగష్టునెలలో వచ్చెను. ఇంతకాలము నేను జీవింతు ననియు, జీవితకాలములోనే నే నీ పైక మందుకొనుభాగ్యము గాంతు ననియును, భీమా చేసిన ముప్పది సంవత్సరములక్రిందట నేను గలనైన ననుకొన లేదు ! ముప్పది సంవత్సరముల క్రిందటికంటె నేమి కారణముననో నే నిటీవలనే మంచి దేహారోగ్యము గాంచియుంటిని. దేహారోగ్య మెటులుండినను, ఆర్థికవిషయమున వెనుకటికంటె నిపుడు నాపరిస్థితులు బాగుగ నుండెను.

కొంతకాలము క్రిందటినుండి నెల్లూరు మండల వైద్యాధికారిగ నుండి, నా కనేకసందర్భములందు సాయపడి, మా యింటనే జరుగుచుండు "ప్రార్థనసమాజ" సభలలో ప్రాముఖ్యము వహించి, న్యాయమూర్తియు ధర్మశీలుఁడు నని నెల్లూరుమండల వాస్తవ్యులచేఁ బొగడ్తల నందిన కెప్టెను యస్. కె. పిళ్లగారిపుడు బదిలీయై వెడలిపోవు సందర్భమున, వారి, గౌరవార్థమై యీ యాగష్టునెలలో మా యింట నొక విందు గావించి, ఆయనయందు నాకుఁ గల భక్తి ప్రేమములను గొంత వెలిపుచ్చితిని.

ఈ దసరా సమయమున జరిగిన ఇంటరుమీడియేటు విశ్వవిద్యాలయపుఁబరీక్షలో నా కెంతో తోడుపడి, చిరకాల మీ నెల్లూరు విద్యాలయమున మొదటి గుమాస్తాగా నుండిన శ్రీ కృష్ణయ్యగారు రాచకురుపువలనఁ జనిపోవుటకు మిగుల విషాద మందితిని.

ఈ పరీక్షా దినములలో నా మనస్సున నొక కథ సంకల్పిత మయ్యెను. అది లిఖించుట కైన నా కీ పరీక్షతొందరలో వ్యవధానము లేకుండినను, ఎటులో తీఱిక చేసికొని, మూఁడు నాలుగు దినములలో నద్దానిని బూర్తి పఱిచితిని. ఇది "రాజేశ్వరి" నవల. మఱుసటి సంవత్సరము దీనిని నెల్లూరులోఁ బ్రచురించితిని.

1926 వ సంవత్సరము జనవరి మాసారంభమున "మండల విద్యాబోధకసమాజ" సమావేశము జరిగెను. ఆ సందర్భమున విద్యార్థుల క్రీడావిశేషములును జరిగెను. ఆ సభలలో జరిగిన చర్చలలో నేను గొంత పాల్గొంటిని.

నే నిదివఱకు కాల్ధరిగ్రామములోఁ గొనిన భూమి కంటియుండు సుమారు అయిదు యకరముల భూమి యమ్మకమునకు రాఁగా, మూఁడువేల రూపాయిలకు, బైగా వెచ్చించి యది నే నిపుడు కొంటిని.

మఱుసటినెలలో మా పినతండ్రి నాగరాజుగారి భార్య వియమ్మగారు కానూరులోఁ జనిపోయిరి. మా పినతండ్రిని చిన్ననాఁడు దాయాదులలో నొకరు పెంచుకొనిరి. వివాహితుఁ డైన పిదప యౌవనముననే యాయన మా తండ్రితోపాటు కర్నూలు ప్రాంతములకుఁ బోయి, అచట లోకాంతరగతులయిరి. ఆయన యాస్తిని జిరకాలము వియ్యమ్మగా రనుభవించి యిపుడు చనిపోయిరి. మేమె వారి ముఖ్య వారసులము. పురుషవారసు లందఱిలోను పెద్దవాఁడ నగుటచేత నేనె యామె యపరకర్మలు నెల్లూరులో నిపుడు జరిగించితిని. బ్రదికియుండు కాలమున నామె మాయం దంతగ ననురాగము లేక, తన మేనకోడలియొద్ద నివసించి, వారి కుటుంబమును బోషించుచువచ్చెడిది. వియ్యమ్మగా రెవరిని దత్తు చేసికొనక చనిపోయినను, మేనకోడలును ఆమె భర్తయును దమ కుమారుని వియ్యమ్మ పెంచుకొనె నని ప్రతీతి కల్పించి, ఆమె భూములను స్వాధీనపఱచుకొనుటచేత, సోదరులము మువ్వురమును మా పెత్తండ్రుల కుమాళ్లు మువ్వురునుగూడి, వారలమీఁద వ్యాజ్యెము వేసితిమి. నేను మా సోదరులతో నీ తరుణమున రేలంగి వెళ్లి రాజీ విషయమై చేసిన కృషి విఫల మగుటచేత, న్యాయస్థానమున కేగ వలసి వచ్చెను.

నా భార్యయు, ఆమెయన్నయును తమచెల్లెలి కుమారుఁడు కృష్ణారా విపుడు ఉద్యోగము చేయు శ్రీహరికోటగ్రామము పోయి, అచటఁ గొన్నిదినములు నివసించి వచ్చుటచేత, వారిరువురకు నంతట మన్యపుజ్వరము సోఁకి, కొంతకాలము వారిని బీడించెను. నాకును రమ్మని యాహ్వానము వచ్చినను, కళాశాలాకార్యములు నెపముగఁ జేసికొని, నే నీవ్యాధిబారినుండి తప్పించుకొంటిని.

మామఱఁదలు చెన్నపురిప్రయాణము గట్టి వచ్చినను, ఆమె హృద్రోగము నెమ్మదిపడలేదు. అంతకంతకు వ్యాధి ముదిరి, యామె యా మేనెలలో భీమవరమున లోకాంతరగతయయ్యెను. మరణసమయమునఁ దన మువ్వురు పుత్రులు పుత్రికయును జెంతనుండుటవలన నామె కొంత చిత్తశాంతి నందినను, కని పెంచి విద్యాబుద్ధులు నేర్పిన తన తనయుల యభ్యున్నతిని గనులారఁ గాంచ నోఁచికొననైతినని యామె కొంత వ్యాకులతఁ జెందెను. ఇఁక నడివయస్సున ప్రియపత్నీ వియోగము సంభవించి, కుటుంబపరిపోషణాభారమంతయు శిరమునఁబడిన మా సోదరుఁడు వెంకటరామయ్య తాను తీవ్రదు:ఖావేశపరవశుఁడయ్యును, సుతులకు ధైర్యముచెప్పు బాధ్యత వహింపవలసివచ్చి, ఎంతయో యోరిమి దాల్చి, సంసారకార్యములు చక్క పెట్టుకొనవలసి వచ్చెను.

ఆకష్టసమయమున మాతమ్మునిచెంత నేను లేను. మఱఁదలికి వ్యాధి ప్రకోపించెనను తంత్రీవార్త నందుకొని, కొలఁది నెలలక్రిందటనె ప్రసవమైన వారిపెద్దకోడలిని శిశువును మేము ఉభయులము వెంటఁ దీసికొని, నెల్లూరునుండి బయలుదేఱి భీమవరము చేరునప్పటికె, మాకు దు:ఖవార్త తెలియవచ్చెను. ఇది జరిగిన యొకటి రెండు నెలలోనె వెంకటరామయ్య కుమార్తె చిన్నశిశువు, ఆయేఁట వేడిగాడుపులకు తాళ లేక చనిపోయెను. వేసవి తుదిదినములలో మాతమ్ముఁడు నేను జెన్నపురి పోయితిమి. అచ్చటి నేత్రవైద్యుఁ డాతని కనులు పరీక్షించి, వానికి సులోచనము లిచ్చెను. ఇవి పెట్టుకొనుటవలన మాతమ్మునికిఁ జూపు చక్కపడెను.

ఈసంవత్సర మధ్యమున నా "వ్యాసావళి" రెండవభాగము ఏలూరులో ముద్రింపఁ బడెను. ఈరెండుపుస్తకములలోను, నే నిదివఱకు నా పత్రికలలో వ్రాసిన మంచి వ్యాసములె కాక, 'ఆంధ్రపత్రిక' సంవత్సరాది సంచికలందును, ఇతర పత్రికలందును ముద్రణ మయిన నా వ్యాసోపన్యాసములలో ముఖ్యమగు నవియును, బ్రకటింపఁబడియెను. నా వ్యాసములలో నెల్ల 'పుత్రలాలన' 'పతివిలాసిని' 'ఉత్తర గోగ్రహణము' 'అత్తకోడండ్రపొత్తు' ముఖ్యములు. మా తమ్ముఁడు వెంకటరామయ్య వ్రాసిన "జంతుకోటి ప్రాణరక్షణోపాయముల" నాలుగు భాగములును, జంతు స్వభావ చారిత్రక వినోదవిషయములతోఁ గూడుకొని యున్నవి. నాయుప వ్యాసములలో, "ప్రాథమిక పాఠశాలోపాధ్యాయుఁడు," "వీరేశలింగముపంతులుగారు"ను ముఖ్యములు. భావ విస్ఫురణమునందును భాషాసౌష్ఠవమునందును నా శైలి కిటీవలఁ గలిగిన పరిణామ మీ కడపటి యుపన్యాసమునఁ గాన నగును.

ఈ సంవత్సరమున దసరా సెలవులలో నొక పరిచితునితోఁ గూడి నేను నెల్లూరుమండల దక్షిణదిగ్భాగమందలి గ్రామములు కొన్ని చూచివచ్చితిని. చెంగల్పట్టు జిల్లాకుఁ జేరిన గ్రామమైన ఈగాయవారిపాలెపుఁ బ్రజలు తెలుఁగువారె. వీరిలో రాజులు ప్రముఖులు. అచట ఆంధ్రవైష్ణవబ్రాహ్మణులును గలరు. చుట్టు పట్టుల గ్రామములలోఁగూడ నాంధ్రులు గాన వచ్చిరి. ఒక గ్రామ జమీందారు తెలుఁగు బ్రాహ్మణుఁడె.

ఈ సంవత్సరము నూతనముగ బెజవాడలో స్థాపింపఁబడిన "ఆంధ్ర విశ్వవిద్యాలయ" ప్రథమసభ సెప్టెంబరు 9 వ తేదిని జరిగెను. కళాశాలాధ్యక్షుఁడ నగుటచేత నద్దాని సభ్యులలో నే నొకఁడను. ఆ సందర్భమున నేను బెజవాడ పోయి వెనుక నచట నుద్యోగమున నుండు కాలమునాఁటి స్నేహితులను గొందఱిని జూచితిని. ధన్వాడ అనంతముగారు, వారి పెద్ద కుమారుఁడు డాక్టరు రామచంద్రరావుగారును నా కాసభలోఁ గాన వచ్చిరి.

అక్టోబరునెల సెలవులలో నేను గోదావరిజిల్లా పోయి, నరసాపురము భీమవరము గ్రామములలో నుండు సోదరులను తక్కిన బంధువులను జూచితిని. నా భార్యకు మిగుల జబ్బుగ నుండె నని నా కాదినములలో నెల్లూరునుండి తంత్రి వచ్చుటచే నందఱము నలజడి నొందితిమి. తమ్ముఁడు వెంకటరామయ్య, చెల్లెలు కన కమ్మయును నాతో నపుడు బయలుదేఱి నెల్లూరు వచ్చిరి. మన్యపు జ్వరము మరల తగులుటచేత నాభార్య మిగుల బలహీన యయ్యెనే గాని, ప్రబలమగు వ్యాధి కామె లోను గాలేదని వైద్యుఁడు మాతులుల్లాగారు చెప్పిరి !

గతసంవత్సరము నేను వ్రాసిన "రాజేశ్వరి" డిసెంబరు నెలలో నెల్లూరునందలి ఆంధ్రరంజనీముద్రాలయమునఁ బ్రచుర మయ్యెను. ఇది 'కమలాక్షి' కంటెను జిన్నదగు నవల. వీరేశలింగముపంతులనాఁటి రాజమహేంద్రవరపరిస్థితులు చిత్రించుటయె దీని ముఖ్యోద్దేశము. కథాసంవిధానమందును, రచనాప్రణాళికయందును మంచిమార్పులు కొన్ని సూచించి, యీగ్రంథమునకు రుచిరత నాపాదించిన మదీయమిత్రులు, విమర్శనకళాకుశలులు, బ్ర. శ్రీ. పండిత దుర్భా సుబ్రహ్మణ్యశర్మగారికి నా కృతజ్ఞతాపూర్వక సమస్కృతు లాచరించితిని.

ఈపుస్తకప్రారంభపుఁ బుటలలో మా చెల్లెలు కామేశ్వరమ్మ చాయాపటమును ముద్రించి, ఆమె కీ కథ నిట్లు కృతి యిచ్చితిని : -

                    తే. గీ. "మాకుఁ గడగొట్టు చెలియలై మహి జనించి
                            వరగుణంబులఁ జెలువారి పరువమునన
                            శిశులతో భర్తతో దివిఁ జేరినసతి
                            కిత్తు నీకృతిఁ బ్రీతిఁ గామేశ్వరికిని"

నెల్లూరు దండువారి వీధిలో మా బస కెదురుగ నొక ప్రాఁత యింట దోరనాల కనకమ్మయును పేద ముసలి వైశ్యవితంతు వుండెడిది. ఆమెకుఁ గల యేకపుత్రికయు, మనుమరాలు నామె కన్నుల యెదుటనే చనిపోయిరి. ఈమె యనుదినమును జాలసేపు మాయిం టికి వచ్చి కూర్చుండుచు, నాభార్యతో ముచ్చటించుచు, కాలము గడుపు చుండెడిది. ఆమెకుఁ జేత నైనంత సాయము చేయుచుండు వారము. 1925 వ సంవత్సరాంతమున నామె కాలధర్మము నొందెను. చనిపోవునపు డామె కొంచెము సొమ్ము నాభార్యచేతి కిచ్చి, దానితోఁ దన పేరిట నే ధర్మకార్యమైన నెలకొల్పుఁ డని కోరెను. కావున 1926 వ సంవత్సరము అక్టోబరు నెలలో ఆమెపేర ట్రంకురోడ్డుమీఁద పశువులు నీరు ద్రావుట కనువగు నీటితొట్టి నొకటి పురపాలక సంఘము వారిచేఁ గట్టించి, అద్దాని ముఖఫలకముమీఁద "దోరనాల కనకమ్మధర్మము" అని వ్రాయించితిని. ఆ డిశెంబరు నెలలో మా తమ్ముఁడు కృష్ణమూర్తి సకుటుంబముగ చెన్నపురి పోవుచు, మార్గ మధ్యమున నెల్లూరునఁ గొన్ని దినములు నిలిచెను. అంత మా చెల్లెలితోఁ గలసి వా రందఱును చెన్నపురి వెళ్లిరి. న్యాయవాదిపరీక్షలో మొదటితరగతిని మా తమ్ముఁ డపుడు జయమందెను. సెలవులలో మేము గుంటూరు వెళ్లి వచ్చితిమి.

27. నెల్లూరు గాలివాన

నూతనముగ స్థాపిత మయిన కళాశాలలో నా కిపుడు పూర్తిగఁ బను లున్నను, ఎటులొ తీఱికచేసికొని, కథలు వ్యాసములును వ్రాయుచువచ్చితిని. నాకు వలసినంత వ్యవధానము లేకుండుటయె యాకాలమున నేను చిన్నకథ లల్లుట కొకకారణము. చిన్న కథలని నేను వానిరచనమున నశ్రద్ధఁ బూనువాఁడనుకాను. కథాచమత్కృతియందుఁగాని, శైలిసొబగునఁగాని, యేలోపము గనఁబడినను, దానినిఁ దొలఁగించువఱకును, నాకుఁ దోఁచెడిదికాదు ! మొదటిప్రతి వ్రాసిన కొన్నిదినములకుఁగాని నాకథ సిద్ధమయ్యెడికాదు. కథ నెన్నిమాఱులో