ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/పర్లాకిమిడిలో ప్రథమదినములు

వికీసోర్స్ నుండి


ఆత్మచరిత్రము

తృతీయ భాగము

ఆత్మ చరిత్రము

తృతీయభాగము : ఉపన్యాసకదశ

1. పర్లాకిమిడిలో ప్రథమదినములు

1902 వ సవత్సరము ఫిబ్రవరి ప్రారంభమున నేను పర్లాకిమిడి ప్రవేశించుటతోనె నాజీవితమున నూతన దశాప్రారంభ మయ్యెనని చెప్పనగును. నేనిదివఱకు సంవత్సరముల కొలఁది పాఠశాలలలో నుపాధ్యాయత్వము సాగించి యలసితిని. బెజవాడపురమను వేడిమంగలమున నేండ్లకొలఁది వేఁగితిని ! వత్సరముల తరబడిని పత్రికాధిపతినై, చందాదారులతో నుత్తరప్రత్యుత్తరములు జరిపి డస్సిపోయితిని. ఇప్పుడీ పనులన్నిటిలో నాకుఁ గొంతవిరామము గలిగెను ! ఇంతటినుండి నేను కళాశాలలో నుపన్యాసకుఁడనైతిని. పెద్దతరగతులకు నున్నతవిద్య బోధింపనా నా కిన్నాళ్ల కవకాశము కలిగెను. మనసు వచ్చినట్టుగ కళాశాల తరగతులకు నాయభిమానవిద్యను నేనిఁక బోధింపవచ్చును. ఈపర్లాకిమిడిపట్టణమున పెద్దరాజమార్గము చివర దట్టముగ పచ్చని పొదలల్లుకొనిన యున్నతపర్వతము గలదు. రెండవ కొనయందు దర్శనీయమగు తటాకముగలదు. ఏ నడివేసఁగినో తక్క సామాన్యముగఁ గాల మిచట సౌమ్యముగనుండును. కొన్నిమాసముల నుండి "జనానాపత్రిక" సంబంధమగు చిన్న పనులన్నియు మద్రాసు ననే జరుగుచుండెను. కావున నేను పర్లాకిమిడియం దడుగిడుట యే నూతన సౌఖ్యలోకమునో జొచ్చుటవలె నాకుఁ దోఁచెను ! రెయిలు బండి పట్టణము సమీపించుచుండఁగనే, కొండక్రింద చెట్లగుబురుల మధ్య గృహశిఖరములు గానవచ్చి, ఇచ్చటియిండ్లు ప్రకృతికాంతతో దాగురుమూతలాఁడుచున్నవా యనునట్లు తోఁపించెను ! చల్లని పిల్ల వాయువులు ప్రసరించు "సీతసాగరము" శీతసాగరమనియే భ్రమ నొందితిని ! ఇచటిజనుల వేషభాషాచారములు క్రొత్తలుగనుండి, మనస్సునకు వింతయగు నానందము గొలిపెను. నేనీ నూతన దేశమున, నూతనోద్యోగమునఁ బ్రవేశించి, నూతనవిద్య గఱపుచు, నూతనాశయముల మదిని నిలుపఁజొచ్చితిని !

వచ్చిన క్రొత్తఱికమున రెండుదినములు పైడిగంటమువారు నాకును తమ్మునికిని నాతిథ్య మొసఁగిరి. అంత కళాశాల కంటియుండు భోజనవసతిగృహమున భుజించుచు, అచటిమేడమీఁదిగదిలో బస చేసితిమి. కళాశాలాధ్యక్షులగు మంగు శ్రీనివాసరావుగారిని, మఱికొందఱు బోధకులను నేను జూచితిని. నే నిచటి కళాశాలలోని ప్రథమశాస్త్ర తరగతులలో 'శారీరశాస్త్రమును', ప్రవేశపరీక్షతరగతులలో నాంగ్ల సాహిత్యమును బోధింపవలయును. కళాశాలకు రెండుదినములు వెళ్లి నాపనులు చూచుకొంటిని. ఇంతలో జ్వరము రక్తగ్రహణియును నన్ను బాధించెను. అందుచేత సెలవు పుచ్చుకొని యింటనే యుండవలసినవాఁడ నైతిని. చుట్టును అడవి పెరిఁగియుండుటచేత, పట్టణములోనికి రాత్రులు చిఱుతపులులు వచ్చు చుండు నని జనులు చెప్పిరి. ఒకనాఁడు పట్టపగలే పెద్ద చిఱుతపులియొకటి మాదాపున నుండు వొక యింటఁ బ్రవేశించెను ! ఆ యింటియాఁడుది చొరవతోఁ దలుపుమూసి, బయట గొళ్లెము పెట్టి, కేకలు వేసెను. చుట్టుపట్టులనుండి జనులు వచ్చి, రాజుగారికి వార్త నంపిరి. అపు డాపూరియింట కప్పు కొంత తొలఁగించి, పైనుండి తుపాకిపేల్చి, రాజుగారు పులిని జంపివేసిరి ! నే నీపురమునఁ బాదము పెట్టఁగనే నన్ను వ్యాధి వేధించుటయు, ఇచట నటవీ మృగములు బాహాటముగ సంచారముచేయుటయుఁ జూడఁగా, ఇందలి నివాసము నాకు బొత్తిగ సరిపడకుండునట్లు తోఁచెను ! కావున నిచ్చటినుండి మొదటనే ధైర్యముతో వెనుకంజ వేయుట కర్తవ్యము కాదా యని తమ్ముఁడు నేనును దలపోసితిమి ! కాని సాధకుఁడగు పాత్రుఁడును పేరుగల యోఢ్రవైద్యుఁడు నాకు మంచిమం దిచ్చి, వ్యాధినివారణముఁ జేసెను. అంతట తమ్ముఁడు నన్నిక్కడ విడిచి రాజమంద్రి వెడలిపోయెను.

కళాశాలలో నే జెప్పవలసిన చదువు నా కమితప్రియమైనది. 'శారీరశాస్త్రము' కొంత క్రొత్తవిషయమైనను, పరిశ్రమముచేసి, మంచిపుస్తకములు చదివి, అందుఁ గావలసిన పరిజ్ఞాన మలవఱచుకొంటిని. ఆంగ్ల సాహిత్యము నాకుఁ గొట్టినపిండియే. పరీక్షకుఁబోవు తరగతికావిషయము బోధించుటయందు నా కమితాసక్తి. పాఠశాలలోనివారు నాకు వేగమే మిత్రులైరి. అధ్యక్షుఁడు శ్రీనివాసరావుగారు సాధుపుంగవుఁడు. ఈయన సహాయాధ్యాపకుల జోలికేమియుఁ బోక, స్వేచ్ఛానందములతో వారిపనులు వారిని జేయనిచ్చు చుండువారు. పై యధికారియం దట్టి సుగుణ మమూల్యమని నేను గ్రహించితిని. శ్రీగిడుగు రామమూర్తిపంతులుగారు తమ యభిమాన విద్యయగు చరిత్రమున మిన్నలు. రాజకుమారుల గురువులును, కళాశాల తరగతులలో నాంగ్లోపన్యాసకులు నగు కాండ్లరుదొర మితభాషియగు సుజనుఁడు. స్నేహపాత్రులును విద్యాశాలలో ప్రకృతి శాస్త్రోపాధ్యాయులునునగు శ్రీ సుందరరామయ్యగా రిదివఱకే రాజ మంద్రికళాశాలలో నాకుఁ బరిచితులు. శ్రీయుతులు వేమూరి నారాయణమూర్తి, రాంపల్లి వెంకయ్యగార్లు గోదావరిమండల వాస్తవ్యులేయగుటచే, త్వరలో నాకు స్నేహితులైరి. ఓడ్రబోధకులగు శ్రీగంతాయతుగారు, తక్కిన యుపాధ్యాయులును, శీఘ్రమె నాకుఁ బరిచితులైరి. నా తరగతులలోని శిష్యులకు నాకును వేవగమే స్నేహ సౌహార్దము లేర్పడెను. ప్రతితరగతిలోను ఓడ్రులు పలువురుండుట చేత, వారిస్వభావాదులు గుర్తెఱుఁగుటకు నా కవకాశము కల్గెను. వారందఱికిని తెలుఁగు బాగుగఁ దెలియుటచేత, బోధనావిషయమగు కష్టము లెవ్వియు నాకుఁ గానఁబడలేదు.

పర్లాకిమిడిలో 'ప్రార్థనసమాజ' మదివఱకే యేర్పడి యుండెను. ఇతరచోట్లవలెనే యిచ్చటను సభ్యులలోఁ బలువురు విద్యార్థులు. అక్కడకుఁ బోయినప్పటినుండియు సమాజప్రార్థనము జరుపుటను గుఱించి నే నెక్కువశ్రద్ధ వహించువాఁడను. సామాన్యముగ నేనే ప్రార్థన జరిపి, యేదో విషయమును గుఱించి ధర్మోపన్యాసము చేయుచుండువాఁడను. ఆ ప్రదేశమునకు నేను గ్రొత్తవాఁడ నగుటచేత, నాపలుకులు వినుట కనేకులు వచ్చి, నా కెంతో యుత్సాహము గలిగించుచుండిరి. కాని నే నీప్రదేశమునకు వచ్చినప్పటి నుండియును, ఇదివఱకు సమాజ నాయకులుగ నుండిన సుందరరామయ్యగారు మందిరమున నడుగిడకుండుట నా కెంతయు నిరుత్సాహకరముగ నుండెను.

అనుదినమును షికారు పోవుచుండుట నా కభ్యాసము. ఇట్టి వ్యాయామమున కీపట్టణము మిగుల ననువుగ నుండెను. నిశ్శబ్దములగు ప్రదేశములు, దర్శనీయములగు నడవిచెట్లు, కొండలు, కనుమలు, సెలయేళ్లును నాకుఁ జిత్తాకర్షములుగ నుండెను ! ఒక్కొకప్పుడు రెండు పూఁటలును నే నీవిహారనిమగ్నుఁడనై యుండు వాఁడను. ఐన నా వాహ్యాళి చీఁకటి పడకుండఁగనే పరిసమాప్తి కావలయును ! పట్టణమున కన్ని ప్రక్కలను నడవులు గలవు. ఒక దిక్కున చిఱుతపులులును, ఒక ప్రక్క నడవిపందులును, వేఱొకదిశ నెలుగుగొడ్లును గ్రుమ్మరుచుండు నని వదంతి ! అన్నివైపులను సర్పములు సమృద్ధి !

నేను వచ్చిన యొకనెలకు బ్రాహ్మసామాజికులగు చండీచరణుసేనుగారు బంగాళమునుండి వచ్చిరి. 7 వ మార్చిని జరిగిన బహిరంగ సభలో "ప్రజలఋణము తీర్చు టెట్లు?" అను విషయమును గుఱించి సేనుగారు ప్రసంగించిరి. సభకు నే నగ్రాసనాధిపతిని. రాజావారి తమ్ములు వచ్చి యుండిరి. ఇదివఱకే వారిని కోటలో సందర్శించితిని. నాలుగు దినముల పిమ్మట సేనుగారు వెడలిపోయిరి.

ఇటీవల మద్రాసువెళ్లినపుడు, వీరేశలింగముగారితో సంభాషణ సందర్భమున వారి జీవితకథ నాంగ్లమున వ్రాయుదునని నేనంటిని. దీని కొకవిధమున వారు సమ్మతించిరి. తాము 'స్వీయచరిత్రము' వ్రాయుటయుక్తమాయని వారడుగఁగా, అదిమంచిదనిచెప్పి, నేను వారినిఁ బ్రోత్సహించితిని. ఆపుస్తకమున ముద్రింపఁబడిన కాగితము లెప్పటివప్పుడు నాకు వారు పంపెదమనిరి. వారి జీవితచరిత్ర మిట్లు రెండువిధముల వేగమే ప్రచురింపఁబడఁగలదని నేను సంతసించితిని. కాని, క్రొత్తప్రదేశమండలి కార్యకలాపము వలన నాకంతగ తీఱిక లేకపోయినను, ఏప్రిలు "జనానాపత్రిక" లోను, "సంఘసంస్కారిణీ" పత్రికయందును నేను పంతులుగారి చరిత్రమును నాంగ్లమున రచింతునని ప్రకటించి, అవ్విధముననైన నాగ్రంథప్రారంభము కాఁగలదని యాశించితిని. నేను కళాశాల ప్రవేశించిన క్రొత్తఱికమున నొకనాఁడు ప్రథమశాస్త్ర పరీక్షతరగతిలో నొక పిల్లవాఁడు దుమదుమలాడు మొగమునఁ గూర్చుండుట చూచి, కారణమేమని నేనడిగితిని. కోపోద్రేకమున నాతఁడు ప్రత్యుత్తర మీయఁబోఁగా, కోపము విద్యార్థుల కనర్థదాయకమని నేనంటిని. ఆతని వైఖరి నాకు బాగుగఁ గానఁబడ లేదు. తనను గొప్పవానిగ భావించి గురువు గౌరవింప వలెనని యాతని కోరిక యని వానిమాటలవలనఁ దేలెను. తానెంత తెలివిగలవాఁడైనను, గురు వాతనిని శిష్యునిగనే పరిగణించునని నేను జెప్పివేసితిని. పిమ్మటాతఁడు నాయొద్దకువచ్చి, తనతప్పు సైరింపుఁడని వేఁడెను. తరగతిలోఁ జేసిన నేరమునకు తరగతిలోనే తాను క్షమాపణ వేఁడినచో నేను క్షమింతునని చెప్పివేసితిని. దీనికాతఁడు సమ్మతింప లేదు. కావున నేనీసంగతి కళాశాలాధ్యక్షునికి నివేదింపఁగా, విద్యాలయమునకు రెండుదినము లాతఁడు రాకుండునట్టుగ వానికి శిక్షవేసిరి. పిమ్మట నెపుడును విద్యార్థులతో నాకు సంఘర్షణము గలుగ లేదు.

21 వ మార్చిని నా భార్య పర్లాకిమిడి వచ్చునని తెలిసి, నేను నౌపడావెళ్లి కనిపెట్టుకొని యుంటిని. ఆరాత్రి మెయిలుమీఁద తమ్ముఁడు కృష్ణయ్య వదెనను గొనివచ్చెను. మఱునాఁడు మువ్వురమును రెయిలుమీఁద పర్లాకిమిడి వచ్చితిమి. వెంకయ్యగారియింట నొక భాగమున మేము కొన్నిదినములు గడిపి, రాజవీథిలో నుండు వేఱొక పూరియింటిలోనికి వెడలిపోయితిమి.

ఈ క్రొత్తప్రదేశమునకు వచ్చినదిమొదలు నా చిరకాలాభ్యాసములలోఁ గొన్నిటియందు మార్పు గలిగెను. వీనిలో ముఖ్యమైనది దినచర్య పుస్తకములను గుఱించినది. కళాశాల తరగతులలోని బోధనకై యధికముగఁ బరిశ్రమించుటచేత నాదినచర్యను పుస్తకములందు సరిగా లిఖింప మానివేసితిని. తీఱికసమయముల దొకింత వ్రాయుచు పిమ్మట కొంతకాలమునకు దినచర్య పుస్తకముల నుంచుటయే విరమించివేసితిని. కళాశాలను వేసవిసెలవులకు 2 వ మేయి తేదీని మూసిరి. పుస్తకములు, విలువగల సామానులు నొక మిత్రునింట వేసి మేము కాకినాడ బయలుదేఱితిమి.

2. క్రొత్తప్రదేశము

1902 వ సంవత్సరము వేసంగిలోఁ గొన్నిదినములు మాబావమఱఁది వెంకటరత్నముగారియింట నేను గడపితిని. ఇపుడాతఁడు కాకినాడలో కలెక్టరు కచేరిలో గుమాస్తాగా నుండెను. మాయప్పు త్వరలోఁ దీర్చి వేయుట యుక్తమని నా కాతఁడు బోధించెను.

మేయి నెలలో చివరభాగమున నేను రాజమంద్రి వెళ్లితిని. మా రాజమంద్రి నివేశస్థలములు అమ్మివేసి ఋణములు తీర్చుట మంచిదని నేను సోదరులకుఁజెప్పితిని. ఈవిషయమున పెద్దతమ్మునికి నాకు నభిప్రాయభేదమేర్పడెను.

ఈ సెలవులలో నేను జదివిన పుస్తకములలో ఫ్రెంచిరచయిత వ్రాసిన "స్త్రీరాజ్ఞి" అను పుస్తక మెన్నఁదగినది. నానాదేశపు స్త్రీల లక్షణము లాతఁడు వర్ణించి, తాను బరిణయము కాంక్షించినచో, సుదతులందఱి సౌందర్యమును దాల్చిన స్త్రీ పుడమినుండుట యసంభవము గాన, తాను బహభార్యత్వమున కొడంబడెద నని నుడివెను. దీనిలోనుండి గైకొనిన "గాబ్రియలు సోదరి" వృత్తాంతమును జనానాపత్రికలోఁ బ్రచురించితిని.