ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/ఉద్యోగవిరామము

వికీసోర్స్ నుండి

28. ఉద్యోగవిరామము

1928 వ సంవత్సర ప్రారంభమున గూడూరులో మండల విద్యాశాలలకు సంబంధించిన యాటలపోటీలు జరిగెను. ఆసమయమున నేను గూడూరు వెళ్లి, మాపిల్లలకుఁ బ్రోత్సాహము గలిగించితిని.

నేను గుంటూరుకళాశాల వీడి నెల్లూరునకు వచ్చునపుడె, యిచట నైదువత్సరములు మాత్రమె యుండి యంతట నుద్యోగ విరామముచేతు నని మనస్సున సంకల్పించుకొంటిని. మెల్లూరుపురమున కళాశాలను నెలకొల్పి, దాని నభివృద్ధికిఁ గొనివచ్చుట మిగుల ప్రయాసకరకార్య మయ్యెను. 1920 వ సంవత్సరమధ్యమున పదునెనిమిది బాలురతో నారంభమయిన కళాశాల, 1928 వ సంవత్సరమున సుమారు 200 విద్యార్థులతో విరాజిల్లుచుండెను. ప్రతిసంవత్సరమును పెక్కండ్రు ఇంటరుమీడియేటు పరీక్షలో గెలుపొందుటయెగాక, వీరిలోఁ గొందఱు మొదటితరగతిలోఁ గూడఁ గృతార్థు లగుచువచ్చిరి. బోధకులును తగిన నైపుణ్యానుభవములు గలవారలే.

విద్యాబోధనమందు కళాశాలాపరిస్థితు లిట్లు ప్రోత్సాహకరముగ నుండినను, ఆర్థికవిషయముమాత్రము మిక్కిలి యసంతృప్తికరముగ నుండెను. కళాశాలకగు వ్యయములో విద్యార్థులజీతములు పోఁగా, మిగిలినదానిలో కొంత దొరతనమువారును, తక్కినది కళాశాలాధిపతులగు శ్రీ వెంకటగిరిరాజావారును వహింపవలయును. కళాశాల కేటేటఁ గావలసిన పుస్తకపరికరాదుల కగు వ్యయములో సగము దొరతనమువారును, మిగిలినది రాజాగారు నీయవలయును. ఇట్లు క్రమముగ జరిగిననేకాని, కళాశాలలోని పని సరిగా నడువ నేరదు. దొరతనమువా రిచ్చు ధనము సంవత్సరాంతమునఁగాని రాదు. రాజాగారి పెట్టుబడి మాత్రము నెలనెలయును సరిగ వచ్చినఁగాని, ఉపాధ్యాయులకు నెలజీతములు సక్రమముగ ముట్టవు. జీతములు సరిగా లభింపని యుపాధ్యాయులచేతను సేవకులచేతను పనులు గైకొనుట సులభముగాదు. మే మెన్నిమాఱులు మొఱలిడినను, సకాలమున నుపాధ్యాయులకు జీతము లందఁజేయు విషయమై కళాశాలా పాలకవర్గమువారును, శ్రీ రాజాగారును నుపేక్షచేయుచునేవచ్చిరి.

ఇదిగాక, కళాశాలను శ్వాశ్వతసంస్థగ నిలుపఁగోరితిరేని, దానికి వలయు మూలధనము నొసంగుఁ డనియు, అందు బి. యే. తరగతులు కూడఁ జేర్పించుఁడనియును, శ్రీరాజావారికిఁ బలుమాఱు మనవిచేసితిమి. ఇవి రెండును తమకు సమ్మతమె యని శ్రీరాజాగారు పలుమాఱు సెలవిచ్చినను, ఆప్రకార మమలుమాత్ర మెప్పటికిని జరుగదయ్యెను. ఈ రెండుమార్పులును గలిగి కళాశాలకు స్థిరత్వమేర్పడెనను సుచ్వార్తవినినవెంటనే యుద్యోగవిరామము చేయ నేనిటీవల నిశ్చయించుకొంటిని. నేను సంవత్సరము లిట్లు లెక్కపెట్టుకొనుచుండినను, కళాశాల యార్థికపరిస్థితులలోమాత్రము మార్పేమియుఁ గలుగలేదు ! కళాశాలకు స్థిరత్వమేర్పడిన శుభవార్త విని యుద్యోగము మానుకొను భాగ్యము నాకిఁక లభింపనట్టు స్పష్టమయ్యెను. ఇచట వచ్చెడి జీతముమీఁదనే యాధారపడవలసిన యవశ్యత నాకిపుడు లేకుండెను. నేనిదివఱకు సంపాదించిన భూములమీఁద సంవత్సరమునకు వేయిరూపాయిలకుఁ దక్కువగాని యాదాయము వచ్చుచుండెను. నివసించుటకు గుంటూరు భీమవరముపట్టణములలో విశాలగృహములు గలవు. వయస్సుమరలి, శక్తులుడిగిపోవుచున్న మేము ధనకాంక్షచే నింకను పర దేశప్రవాసముచేయుట యుక్తముగాదని నాభార్య పలుమాఱు నన్ను హెచ్చరించెను. నాశక్తియుక్తుల నిఁక గ్రంథరచనాది దేశహితైక కార్యములకు వినియోగించుట కర్తవ్యమనియు, కనీసము హాయిగ నేను విశ్రాంతి ననుభవింపవలసినతరుణ మిపుడు వచ్చెననియును నేను దలపోసితిని. కావున 1928 వ సంవత్సరము ఫిబ్రవరినెలలో నా పనికి రాజీనామా నిచ్చితినను కాకితమును కళాశాల కార్యదర్శి శ్రీ నరసింహాచార్యులుగారిచేత వేసితిని. ఇట్లు చేయవలదనియు, కనీస మిఁక రెండుమూఁడు సంవత్సరములు నేను కృషిచేసినచో కళాశాలా పరిస్థితులు చక్కపడుననియు ఆయన నొక్కిచెప్పెను. నేనందుల కియ్యకొనలేదు. పిమ్మట జరిగిన పాలకవర్గమువారి సభలోఁగూడ సభికు లిదేయభిప్రాయమును వెలువరించిరి. ఉద్యోగవిరామమె నాకు వాంఛనీయమని నేను గట్టిగఁ జెప్పితిని. పాలకవర్గమువా రంత దీనికి సమ్మతించి, నేను కళాశాలకుఁ జేసిన కృషి నభినందించుచు, తీర్మానము చేసికొనిరి. అంతట మెయి 1 వ తేదీని నేను కళాశాలాధ్యక్షతా భారమును కార్యదర్శి కొప్పగించి, నాసామానులు పుస్తకములును రెయిలులో పంపివైచి, సకుటుంబముగ గుంటూరునకు బయలు దేఱితిని.

జులై నెలలో నేను మరల నెల్లూరు సందర్శించితిని. అపుడు సెలవులలో జీతము గైకొనుట, కళాశాలాధికారు లిడు విందు నారగించుట, విద్యార్థు లొసఁగిన విజ్ఞాపనపత్రిక నందుకొనుటయును, నేను జరిపిన కార్యప్రణాళిక. ఎనిమిది వత్సరము లీ పురమున నివసించి, కన్నబిడ్డనువలెఁ గడు ప్రేమమున నీ కళాశాలను బెంచి, ఇపుడు నేను విశ్రాంతిని గైకొంటిని. నా శిరమునుండి హిమాలయ పర్వతమును బోలిన యొక మహాభారతము తొలఁగిపోయెను ! దైవానుగ్రహమున ముప్పదిరెండు సంవత్సరములు ఉపాధ్యాయునిగ నుండి, న్యాయపథము వీడక నా విధ్యుక్తములు నెరవేర్చి, ఇంత కాలమునకు విశ్రాంతి గైకొంటినని నే నమితానందభరితుఁడ నయితిని. నన్నూరు రూపాయిల మాసవేతనముతోఁ గూడిన కళాశాలాధిపత్యము, ఆయున్నతపదవి కనుబంధములగు నుపవేతనములు గౌరవోద్యోగము లన్నియు నంతరించెనని నా మనస్సున కిపు డావంతయు వంత లేదు ! రణరంగమునఁ బోరుసల్పి వచ్చిన సైనికుని వలెను, రంగస్థలమున నాట్యము ముగించిన పాత్రవలెను, నావిద్యాబోధకవృత్తి కార్యకలాప మితంటితో సంతృప్తికరముగ సమాప్తి చేసితినని నే నానందించితిని. నావిధ్యుక్తములు నే నెట్లు నెరవేర్చితినో నే జెప్పుటకంటె, నావిద్యాబోధనలాభ మందిన శిష్యసముదాయమును, నిరతము నాక్రియాకలాపమునకు సాక్షిభూతులుగ నుండిన సోదర బోధకవర్గమును ప్రస్తావించుట కర్హులు. దైవముఖముగఁ జూచియె నాపనులు నెరవేర్చితి నని నావిశ్వాసము. నా విద్యా విషయకమగు కృషి యూశ్వరార్పితమగుఁగాక !

స్వాగతపత్రికలు, వీడుకోలు వాక్యములును, భావోద్రేకపూరితము లగుటంజేసి, యుత్ప్రేక్షా ద్యలంకార భూయిష్ఠములుగ నుండును. ఐనను, ప్రయాణికుని కింటివారి సాగనంపుఁ బలుకులు పలుమాఱు జ్ఞప్తికి వచ్చి యాత్రయం దుత్తేజకములుగ నుండును. నా నెల్లూరు విద్యార్థులు వీడుకొలుపుసందర్భమునఁ జదివిన పత్రములలోని వాక్యములును, పద్యములును నా కీ సమయమున స్ఫురణకు వచ్చుచున్నవి. పొగడ్తల కన్నివిధములను నిఁక దూరస్థుఁడను గావలసినవాఁడ నయ్యును, వారి పలుకులఁ గొన్ని యిట నుదాహరించిన నాయహంభావత్వమును జదువరులు మన్నింతురు గాక ! "* * ఈ చిన్న సంస్థను (కళాశాలను) బ్రోచుట కై మీరు శక్తివంచనలేకుండఁ బాటుపడితిరి. మీ వివేకదాక్షిణ్యములచే మాభక్తిప్రేమములు మీరు వడసి రని చెప్పుటలో నతిశయోక్తిలేదు. మీసునిశితబోధనము, మీ సులభసరళ ప్రసంగములు, మీ సరసవచోధోరణియు మేమెన్నఁడును మఱువఁ జాలము. * * మీ నిరాడంబర నియమబద్ధ జీవితము, విధ్యుక్తములందు మీరు కనఁబఱిచిన సద్భావసదుత్సాహములును మా కాదర్శప్రాయము లయినవి. మీ రిపు డీ కర్మకాండ విడిచి, మహాజ్ఞానులరీతిని సాంఘిక సాహిత్యవిషయములందుఁ బాల్గొనుటకును, ఈశ్వరధ్యానతత్పరు లగుటకును, విశ్రాంతిని గైకొనుచున్నారు. * * మీకుఁ జిరాయురైశ్వర్యములును, ఉత్తమోద్యమములందు విజయమును, బ్రసాదింప దేవ దేవుని సవినయముగఁ బ్రార్థించుచున్నారము."

                   సీ. "నీయుజ్జనపుటింపు నీభాషణముసొంపు
                                    ప్రియమార నెటు విస్మరింతుమయ్య
                        నీక్షమాతిశయంబు నీశాంతభావంబు
                                    ప్రియమార నెటు విస్మరింతుమయ్య
                        నీధర్మనిరతియు నీశిష్య సంప్రీతి
                                    ప్రియమార నెటు విస్మరింతుమయ్య
                        నీబోధమహిమంబు నీన్యాయ హితదృష్టి
                                    ప్రియమార నెటు విస్మరింతుమయ్య
                        ఎట్టివేళల కినుక యింతేనిలేక
                        మాదొసంగుల క్షమియించి మమ్ముఁ బ్రోచు
                        వరగురుని నిన్ను మేమెట్లు మఱుతుమయ్య?
                        రాయసము వెంకటశివుఁడ రమ్యయశుఁడ !