Jump to content

ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/అబ్బావు' మరణము

వికీసోర్స్ నుండి

తరగతి. పెద్దవస్త్రములను ధరించువారు తెలుఁగువారలలో నాఁడువారును, బంగాళావారిలో మగవారును. అక్కడ పుణ్యాంగనలు రంగుచీరలె ధరింతురు. తెల్లని కోకలు గట్టువా రా దేశమున వెలయాండ్రు. కాని, మనకును వారికిని సామాన్యగుణములును లేక పోలేదు. హిందూశాస్త్రపద్ధతులు, సంప్రదాయములును హిందువు లందఱికిని ముఖ్యములే.

గుంటూరిలో డిప్యూటి కలక్టరుపదవి నందిన శ్రీ జయంతి రామయ్యపంతులుగారి ప్రోత్సాహమున మే మిపు డానగరమున "ఆంధ్రసాహిత్యపరిషత్తు" సభ జరుపఁదలంచితిమి. 14 వ మార్చిని నా యధ్యక్షతక్రింద జరిగిన బహిరంగసభలో, సమ్మానసభ యొకటి యేర్పడెను. కొండ వెంకటప్పయ్యగారి నధ్యక్షులుగను, ఉలుగుండము రంగారావుగారిని నన్నును కార్యదర్శులగను నెన్నుకొనిరి. మే మంత చందాలు పోగుచేసి, సభలకుఁ గావలసిన వసతులు గలిపించితిమి.

ప్రతినిధులకు పురవిద్యాలయమున విడిదలు భోజనములు నేర్పాటు చేసితిమి. విద్యార్థుల స్వచ్ఛందసేవాదళము మంచి సాయము చేసెను. ఏప్రిలు 22-23-వ తేదీలందు కళాశాలాభవనమున బహిరంగ సభలు జరిగెను. బొద్దనాయకూరు జమీందారులు అధ్యక్షులు. వేదము వేంకటరాయశాస్త్రిగారు, రాజా మంత్రి ప్రెగడ భుజంగరావుగారు మున్నగు ప్రముఖులు విచ్చేసిరి. సభలు జయప్రదముగ జరిగెను.

16. 'అబ్బావు' మరణము

గుంటూరు సభలు ముగియఁగనే మా పిల్ల వానిని, ఇక్కడఁ జదువుచుండు మా తమ్ముని కుమారుఁడు నరసింహమును దీసి కొని, మేము భీమవరము వెళ్లితిమి. అచట నరసింహమున కుపనయనము జరిగెను. మా రెండవతమ్మునిఁ జూచుట కంతట నేను నరసాపురము పోయితిమి. గన్నవరమున నుండు మారెండవ మఱఁదలి కుమారుఁడు రామచంద్రరావున కంతట పెండ్లి యగు నని తెలిసి, మే మచటి కేగి, పెండ్లివారితో ర్యాలి తరలి వెళ్లితిమి. పెండ్లిలో మా పిల్ల వానికి మరల జబ్బుచేసెను. అదివఱకు తోడిపిల్లలతోఁ గూడి యాడుకొనుచుండు మాపసివాఁ డంతట మంచ మెక్కెను. వానికి జ్వరము వచ్చి యొడ లుబ్బి, శ్వాస పుట్టెను. పెండ్లియైన తోడనే మేము గన్నవరము మరలి వచ్చితిమి. జూను రెండవతేదీ సాయంకాలమున పిల్లవాఁడు కనులు తేలవైచెను. అరగంటలో వాని ప్రాణము లెగిరిపోయెను.

మా దంపతుల కిరువురకును మితిలేని దు:ఖము సంప్రాప్తమయ్యెను. లోక మంధకార బంధుర మయ్యెను. సంతానప్రాప్తి లేకున్నను మనసు నెటులో సరిపెట్టుకొని దినములు గడపుమాకు, దైవమీ పిల్లవాఁడను నెరను జూపించి, లేనిపోని యాసలు గలిపించి, యీ బాలకుని గుఱించి శ్రమపడునట్లు చేసి, తుదకు బాల్యముననె వాని యసువులఁ గొనిపోయి, మమ్మీదు:ఖవార్ధినిఁ బడఁద్రోచె నని మేము వగచితిమి. తీఱని విచారమునకు నేను లోనయితిని. అనుంగు చెల్లెలినేగాక యామె సంతతి నంతనుగూడ నంత మందించినవిధి నాధుని విపరీతపుఁ జేఁతలకు నేను వెత నొందితిని. లోకమున నావంటి దురదృష్టవంతులు లేరనుట స్పష్టము.

ఆరోజులలో రేయింబవళ్లు పిల్లవానినిగుఱించియె నేను దలపోయుచుండువాఁడను. ఐదవసంవత్సరము జరుగుచుండు నీ యర్భకునికి ఆజన్మరోగకారణమున తగిన శరీరదార్ఢ్యము గలుగనేలేదు ! వాఁడు నిలుచుండుటగాని, నడచుటగాని, కనీసము సరిగాఁ గూర్చుండుటగాని లేదు; దేఁకుచుండువాఁడు. పెద్దతల, దొప్ప చెవులు, శుష్కించినదేహమును గలిగియుండువాఁడు. ఐనను, వయస్సునకుఁ దగిన తెలివితేటలు వానికి లేకపోలేదు. నాభార్యను "అమ్మా" యనియును, నన్ను "అన్నా" యనియును బిలుచుచు, పెంపుడుతల్లి మీఁద వాఁ డమితానురాగము గాంచియుండువాఁడు. నామీఁద వాని కెంతప్రేమ మున్నను, "అన్నపైయన్న !" అని పలుకుచుఁ బరియాచకమున నన్ను నిరసించుచుండువాఁడు ! తల్లిదేవుఁడు దేవు నరుఁగునందును, తనదేవుఁడు తన చిన్ని తాటియాకుల పెట్టెలోను నుండెనుగాని, అన్నకుమాత్రము దేవుఁ డెచటను లేఁడని యాకుఱ్ఱఁడు పలికి నన్నుఁ బరిహసించువాఁడు.

ఈయర్భకునికి మేము పేరైనఁబెట్టలేదు. ఏమి పేరుపెట్టము ? ఏమని పేరు పెట్టము ? పుట్టిననాఁడే కన్నతల్లిని గోలుపోయిన దురదృష్టునకు ముద్దులు ముచ్చటలు నెట్లు జరుగును ? బారసాలలు, పండుగులు నెట్లు కొనసాగును? వీనిని తల్లి పేరుతోనే పిలువుఁడని మా తమ్ముఁడు వెంకటరామయ్య చెప్పుచుండువాఁడు. బాలకుఁ డింట నాడుకొనుచుండునపుడు, ఏవో ముద్దుపేళ్లుపెట్టి తల్లియు నేనును వానిని బిలుచుచుండువారము. కాని, యెప్పటికప్పుడు బ్రదుకె యస్థిరముగఁ గానఁబడెడివానికి నేపేరు పెట్టుటకును మాకు మనసొప్పకుండెను. వీనిపేరేమి యని మమ్మెవరైన నడిగినపుడు, పెద్దవాఁడై వానిపేరు వాఁడె పెట్టుకొనునని మే మనుచుండువారము. మాటలు వచ్చినపిదప, చెలికాండ్రతో మాటాడుచు, వీఁడు తనపేరు "అబ్బావు" అని చెప్పుకొనుచుండువాఁడు ! ఆ పేరుతోనే తోడిపసివారలు వానిని సంబోధించుచుండువారు. తన కెందఱు పిల్లలని యెవరైన నడిగి నపుడు, "ఇద్దఱు అబ్బావులు, ఒక అమ్మావు !" అని వాఁడు చెప్పి, తన చిన్న పెట్టెలోనుండు మూఁడు బొమ్మలను జూపించుచుండువాఁడు !

లోకమును వట్టికలఁ జేసి, మమ్ము దు:ఖతోయములఁ ద్రోచివైచి, యిపు డీపిల్లవాఁడు వెడలిపోయెను ! ఊరక యుండువారలకు పుత్రమోహమును గలిపించి, వెనువెంటనె యాశాభంగము గావించి, వీఁడు దాఁటిపోయెను ! వీనిని గుఱించి తలపోయునపుడు, నాతల దిర్దిర తిరిగిపోవుచుండెను ! లోక మంధకారబంధుర మగుచుండెను ! ఎంత బలహీనుఁ డైనను, ఇంతలో వాఁడు చనిపోవునని నే ననుకొనలేదు ! ఏచికిత్సలొ చేసి, ఏసాధనములొ గలిపించి, మెల్లగ వాని శరీరమున జవచేరు ప్రయత్నములు చేయుచుంటిమి. ఎటులో మృత్యువును మఱిపించి వాఁడు పెద్దవాఁ డైనచో వానికి సత్తువ గలుగు నని మే మాసపడుచుంటిమి. సంతానము లేని లోపమును దీర్చుటకె దైవము వీనిని మాకుఁ బ్రసాదించె నని తలంప సాగితిమి. వీఁడు పెద్దవాఁడై, విద్యాబుద్ధులు నేరిచి, పిల్లలతండ్రియై, కనినవారికిని బెంచినవారికిని గొమరుఁడై వారి వంశములు తరింప చేయు ననుకొంటిని ! కాని, వీని బాల్యమరణముచే నాయాశలన్నియు నీటఁ గలసిపోయెను ! నా మనస్సు శోకదందహ్యమాన మయ్యెను. జీవితము దు:ఖభాజన మయ్యెను !

'అబ్బావు' మృతినొందిన పెక్కేండ్లవఱకును, నేను వానిని దలంచుకొని దు:ఖింపని దినము లేకుండెను. నా మనస్సు పిల్లవాని వైపునకు సదా గడియారమువలె ములుసూపుచుండెను. పగలు వ్యర్థమైపోయిన యాశలు, రాత్రులు స్వప్న రూపము దాల్చి నా మనస్సును జీకాకుపఱుచుచుండెను. పసివాని ముద్దుపల్కులు నా చెవులకు సదా వినవచ్చుచునే యుండెను. నాయాత్మ కంధత్వము గ్రమ్మెను ! ఐహికాముష్మికము లిఁక సారాహీనులుగఁ దోఁచెను ! నిస్సారముగను, అతి దుర్భరముగను నుండిన యీ హేయఁపు బ్రదుకు నంతమొందింప నే విషద్రావకమైనఁ ద్రావ నేను గాంక్షించుచుంటిని ! కాని, పాపపు ప్రాణమును మఱింత పాపమార్గమునఁ బాపుకొనుటకు నామన సొప్పకుండెను.

నాకోరికమీఁద నాశిష్యుఁడగు చామర్తి రాజశేఖరము, నా మనస్సంతృప్తికొఱ నీ క్రింది పద్యముల నాదినములలో నాకు రచియించి యిచ్చెను. ఇది నెపముగా నాపాపము వానికిని సోఁకెనా యనునట్టుగ నీ యువకుఁడు, ఇరువదిసంవత్సరముల లేఁబ్రాయముననె తానును మృత్యువు నోటఁబడిపోయెను -

                    ఉ. అల్లన నమ్మయంచు మఱి
                                యన్న యటంచును మమ్ముఁ బిల్చి యు
                        ద్యల్ల లితంబుగాఁ బలువి
                                ధంబుల క్రీడలు సల్పుచున్న మా
                        యుల్ల ము పల్లవించు జిగి
                                యొప్పెడి నీయెలనవ్వు లెల్ల జా
                        బిల్లి వెలుంగు వెల్లికల
                                వెల్లువల న్మఱపించుచుండెడిన్.

                   చ. జననమునాది నీబ్రదుకు
                                సంశయమయ్యె ననుక్షణంబు నీ
                       జనని కపాయ మొండొదవఁ
                                జాలదుగా యని నమ్మియుండు మా

                        మనసున నున్న యాశలటు
                                 మాయములయ్యె విధిక్రమానువ
                        వర్తనమున మందభాగ్యమునఁ
                                 దల్లికిఁ బాసిన బిడ్డ వైతిగా !
 
                    ఉ, ఒక్కొకవేళఁ బల్కు సమ
                                 యోచిత వాక్యము లాలకించి నీ
                        చెక్కిలిదోయి ముద్దుగొని
                                 చింతను బాసి ప్రమోద మందుచో
                        నెక్కడలేని నీదు బల
                                 హీనపుఁ బుట్టువు నెంచినంత నే
                        దక్కుదువో యటంచు మదిఁ
                                 దత్తరపాటు ఘటిల్లు నక్కటా !

17. దు:ఖోపశమనప్రయత్నములు (1)

పిల్లవాఁడు చనిపోయిన వెంటనే మేము మా బావమఱఁదితోఁ గూడి, వారి స్వగ్రామ మగు వెలిచేరు వచ్చి యచ్చటఁ గొన్నిరోజు లుంటిమి. బాలకుని మరణవార్త వినిన మాతమ్ముఁడు వెంకటరామయ్య, తన కప్పుడె గుంటూరినుండి వచ్చిన పిల్లవాని చాయాపటపుఁ బ్రతులు నాకుఁ బంపెను. వెనుక కొన్ని నెలల క్రిందట నాపరిచితు లొకరు గుంటూరిలో మాయింటికి వచ్చి, మా పిల్లవానిని గుర్చీమీఁదఁ గూర్చుండఁ బెట్టి, వాని చాయాపటము తీసిరి. దాని ప్రతులు సిద్ధముచేసి పిమ్మట నాకుఁ బంపెద మని యాయన చెప్పిరి. కాని, నేనాసంగతియె మఱచిపోయితిని. నాఁడామిత్రుఁడు దైవికముగ పటము తీసి యుండనిచో మా యర్భ