ఆకాశదేశానా ఆషాఢమాసాన

వికీసోర్స్ నుండి

ఈ గీతాన్ని మేఘసందేశం (1982) చిత్రంకోసం వేటూరిసుందరరామమూర్తి రచించారు. సంగీతం: రమేష్ నాయుడు పాడినవారు: యేసుదాస్


ఆకాశదేశానా.. ఆషాడమాసానా
మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా
విరహమో.. దాహమో.. విడలేని మోహమో..
వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం..||

వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని.. కడిమివోలె నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో..
విన్నవించు నా చెలికి విన్న వేదనా.. నా విరహ వేదనా||

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని.. శిధిల జీవినైనాని
తొలకరి మెరుపుల లేఖలతో రుధిర బాష్పజల ధారలతో..
విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా ||