ఆంధ్ర వీరులు - రెండవ భాగము/P165

వికీసోర్స్ నుండి

ఆచార్యులవారి కప్పగించెను. అమరవాయి నాగిరెడ్డి, బోరవెల్లి వెంకనబోయ, ధర్మవరము వెంకటరెడ్డి, అక్కి కురుమన్న, సానె లింగన్న అను బాలురతోఁగలిపి సోమనాద్రికిఁ గేశవాచార్యులు ఆంధ్రము, సంస్కృతము, అర్థశాస్త్రము, గణితశాస్త్రము, ధనుర్విద్య నేర్పెను. ఒకనాఁడు సోమనాద్రి చెట్టుక్రింద గూర్చుండి పాఠములు చదివిచదివి యలసి నిదురఁ బోయెను. బాలునిముఖమున కెండ సోకకుండఁ జెట్టుపైనున్న త్రాఁచుఁబాము తనపడగ గొడుగువలెఁబట్టెను. ఆచార్యుఁడిది చూచి యీ బాలుఁడు మహారాజగుట నిక్కమని తలంచి యట నుండి వెడలిబోయెను. కేశవాచార్యుల యొద్దఁ జదువవలసిన దంతయు సూక్ష్మగ్రాహి యగు సోమనాద్రి కొలఁదికాలములో ముగించి గురువుగారిని సెలవిమ్మని వేఁడెను. కుమారునివలె నింటనున్న సోమనాద్రిని విడిచిపెట్టఁజాలక కన్నీరువిడిచి' కుమార! నీవేనాఁటికేని మహారాజువగుదు వేని మమ్ములను మఱువకు'మని హెచ్చరించెను. సోమనాద్రి నిరాశతోఁ జిఱునవ్వు నవ్వి 'నావంటి గర్భదరిద్రుఁడా రాజగువాఁడు? నేనే రాజునగుదునేని మీరు మంత్రులు కాకపో'రని సెలవు పుచ్చుకొనెను. సహపాఠులు సోమనాద్రినిజేరి 'మమ్ము మఱచి పోవకుము సుమా!'యని హెచ్చరించిరి. సోమనాద్రి వారందఱ నాదరించి "నేనే రాజునగుదునేని మీయందఱ సహాయము కోరెదను. మీరు నాకుఁ దోడునీడ గాక తప్ప"దని హెచ్చరించెను. వారందఱు