ఆంధ్ర రచయితలు/శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి

1866

వెలనాటి వైదిక బ్రాహ్మణులు. కౌశికసగోత్రులు. ఆపస్తంబ సూత్రులు. తల్లి: వేంకట సుబ్బ సోమిదమ్మ. తండ్రి: వేంకట సోమయాజి. జన్మస్థానము: ఎర్నగూడెమునొద్ద నున్న దేవరపల్లి. నివాసము: రాజమహేంద్రవరము. విరచితగ్రంథముల సంఖ్య యించుమించుగా 200. అందలి ముద్రిత గ్రంథములు కొన్ని:- 1. బొబ్బిలియుద్ధ నాటకము. 2. వేణిసంహారము. 3. కలభాషిణి. 4. రాజభక్తి. 5. భోజరాజ విజయము. 6. శ్రీనాథ కవిరాజీయము (నాటకములు) 7. గౌతమీ మహత్మ్యము. 8. సత్యనారాయణోపాఖ్యానము 9. గజానన విజయము 10. శ్రీకృష్ణ కవిరాజీయము. 11. సావిత్రీ చరిత్రము (పద్యప్రబంధములు) 12. బ్రహ్మానందము (అచ్చతెలుగు కావ్యము) 13. సంస్కృతకవి జీవితములు. 14. కాళిదాస విలాసము. 15. తెనాలి రామకృష్ణ చరిత్రము (వచనములు) 16. శ్రీకృష్ణ మహాభారతము (అష్టాదశ పర్వములు) 17. శ్రీకృష్ణ రామాయణము. 18. శ్రీకృష్ణమహాభాగవతము (నేటికముద్రితము), 19. గణేశపురాణము - ఇత్యాదులు. ఈ కవిని గూర్చి విపుల విషయము తెలియుటకు అనంతపంతుల రామలింగ స్వామి విరచితమైన ' శ్రీకృష్ణ కవిజీవితము ' పరికింప వలయును.

అయిదాఱేడుల యీడునం బ్రతిదినం బా భారతామ్నాయమున్ నియమం బొప్ప ఋరాణము న్వి నిచి నిర్ణిద్ర ప్రభోధాస్తి మా యగార్ధము సెప్పి తత్కధలు లో నంటింప నెంతేనియుం బ్రియ మయ్యెడి నాకు భారతముపై నిత్యానుబంధంబున్.

నేనాంధ్రంబున గించి

న్న్యూనంబుగ మాఱుకృతుల నున్నతి నొందం

గా నొనరించితి లోకము
వానిం జవిచూచి యెఱుగు బలుకగనేలా!


అని పదునెనిమిది పర్వములతో నిండిన మహాభారతము నొక్క చేతిమీదుగా ననువదించి వెలువరించిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి వంటి భాగ్యవంతులు తెనుగు వారిలో గంటికి గనబడువారరుదు. ఆశ్చర్యముపై నా శ్చర్యము మహాభారతమే కాక శ్రీమద్రామాయణము, భాగవతము కూడ శాస్త్రులు గారి చేతి మీద నాంధ్రీకరింప బడుట. భారత భాగవత రామాయణములు మూడును ముచ్చటగా తెనిగించి యచ్చువేయించి సహస్రమాన జీవితోత్సవము జరిపించుకొనియు నడుము వంచని పండితులు కృష్ణమూర్తి శాస్త్రి గారు. మహామహోపాధ్యాయులు, కళా ప్రపూర్ణులు, కవి సార్వభౌములు నగు శ్రీపాద వారి శతాధిక గ్రంధ రచనము కొందఱి కామోదము కలిగింప కున్నను భారత రామాయణా ద్యాంధ్రీకరణము మాత్ర మాశ్చర్యానందములు కలిగించనదని చెప్పవచ్చు. వీరి తెనుగుసేత యథా మాతృకముగా సాగినది. తొల్లిటి కవిత్రయము పరివర్తనము సేయక విడిచిన భగవత్గీతాది ఘట్టములు సైతము శాస్త్రులుగారు తూచాలు తప్పక తెనిగించిరి. భారతాంధ్రీకరణములో నన్నయ తిక్కనలను మించి యౌచితిని బాటించితినని శాస్త్రులు గారి విశ్వాసము. కవిత్రయ భారతము నందలి యౌచితీ సుందరత వేఱొక యాంధ్రగ్రంథముననే లేదని విమర్శకుల వ్రాతలు విమర్శనములు శాశ్వతముగా నుండవు. కృష్ణమూర్తి శాస్త్రులుగారు మహాభారత పీఠికలో నొకమాట చెప్పినారు.


నన్నయ తిక్కనాది కవినాథులకన్నను మిన్నగా దెలుం
గు న్నుడువంగలాడ నధికుండను నేనని కాదు, గ్రంథమం

దు మ్మెరసుల్ కొఱంతలును దోచునటంచని కాదు వెండియుం

బన్నుట భారతేష్టతను బట్టి చాపల మంచు నెంచుడీ.


శ్రీకృష్ణమహాభారతము పేరు కవిత్రయభారతము వెనుక సుస్థిరముగా నుండుననుటకు సందేహములేదు. భారతము వ్రాయుట మాటలతో బనికాదు. భల్లూకపుబట్టు పట్టవలయును. ఏదేనొక మహోన్నత కార్యము తల పెట్టునపు డనేకాఘాతములు తగులుచుండును. అనేకాశయములు వెన్నాడు చుండును.


"ఆదరణీయసారవివిధార్థ గతిస్ఫురణముగా నౌచితీపోషణము చేసి కొనుచు గవినాథులగు నన్నయాదులు మున్నే మహాభారత మనువదించి యాంధ్ర కవితాలోకమున ననశ్వరయశస్సు నార్జించుకొని యుండిరి. వాగనుశాసనుడగు నన్నయభట్టారకు నంతవాడుకూడ భారతాంభోనిధిని తుదముట్ట నీదలేడయ్యె. ఒక వేళ, మనమీ గ్రంథము పూర్వసుకృత బలమున బూర్తి చేసినను గవిత్రయభారతమువలె రసికామోదము కలిగించునో, లేదో ?"


ఇత్యాది ప్రశ్నములే తద్గ్రంథరచనారంభమున బొడమి కవిమనస్సును గలచివై చుట సహజము. ఇదియన నేల ? ఏ మహోద్యమమందైన నిట్టి ప్రశ్నములేపుట్టి వ్యగ్రోత్సాహమును గొంత భగ్న మొనర్చు చుండుట తఱచు. ఇట్టిస్థితిలో నీసంశయములు వేనికిని దావీయక ధైర్యస్థైర్యములతో నక్షయదీక్షతో మహాభారత మంతయు బదునై దేండ్లలో సమగ్రముగా ననువదించి చరితార్థులైన కృష్ణమూర్తి శాస్త్రిగారు వజ్రసంకల్పులు, అరణ్యపర్వ రచనా కాలములో నీకవిరాజున కెన్నియో యిడుమలు గలిగినవి. ద్రోణపర్వము వ్రాయుచున్నపు డిక్కవికి స్మరణీయమగు నొక విషాదఘట్టము. అతికష్టంబుగ నిట్లు కాలమును ద్రోయంజాలి యున్నప్పుడున్

గృతినిర్మాణము మానకెట్లొ యిరుమూడే పర్వముల్ పూర్తి చే

సితి ద్రోణంబు దొడంగి యార్జుని వధంబున్ వ్రాయుచున్నప్డు నా

సుతునింజెంద 'హాతో సిమేసుత' యటంచున్ ఫల్గునుండేడిచెన్.


అది తెలిగించు నామమునం దొకసందియ మావహిల్లె న

య్యదనున నాసుతా! యనక హాసుతయంచు దెలుంగుసేయగా

మొదలిడినాడ; నాసుతుడు పొంత వసింపగ రాగ, నిప్పుడి

ప్పదనున నుండకంచు నెడ బాపుడు నైన దిగు ల్మదిం బడెన్.


ఈసంశయముతో గ్రంథము రచించుచుండ దైవవశమున నీభారతకవి కుమారరత్నము 'సుదర్శనసుధి' యనునతడు స్వర్గతుడయ్యెను. ధైర్యశాలి యగు కవిరాజు గర్భశోకము డిగద్రావి భారతము సాంతము రచించెను.


శ్రీకృష్ణ మహాభారతమునకు రాజరాజ నరేంద్రుడు ముక్త్యాలసంస్థాన ప్రభువు శ్రీరాజా వాసిరెడ్డి చంద్రమౌళీశ్వర ప్రసాదరావు. పాలకొల్లు వాస్తవ్యులు, వణిగ్వరులు నగు శ్రీ రేపాక సత్యనారాయణమూర్తి, శ్రీ చుండూరి నారాయణరావుగారలు భీష్మద్రోణపర్వములు, కర్ణశల్య సౌప్తిక స్త్రీపర్వములు మాత్రము కృతినొంది స్వర్ణాభిషేకముచే గవిరాజును గౌరవించిరి. సంస్కృత మహాభారతము నన్నయభట్టార కాద్యాంధ్ర మహాకవిత్ర యాంధ్రీకృతమైన పిమ్మట మరల దానిని పద్యరూపముగ ననువదింప సాహసించి పరిపూర్ణముగా గృతార్థులైనవారు వీ రొక్కరే. ఆంధ్ర వ్యాసులని కొండాడ బడిన ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రిగారు 'ఆంధ్రమహాభారత నవనీత' మను పేరితో బదుమూడుపర్వము లనువదించిరి. అం దాదిపర్వము మాత్ర మిటీవల నచ్చునకు వచ్చినది. శ్రీ తాడూరి లక్ష్మీనరసింహకవి భారతాంధ్రీకరణమునకు దొరకొని విరాటోద్యోగములు మాత్రము రచించిరి. అది నేటి కచ్చుకాలేదు. మతుకుమల్లి నృసింహకవి పితామహుడు మాధవకవి 'అభినవభారత' మనుపేర భారత మాంధ్రీకరించె ననియు, నం దాదిపంచకము మిగిలి తక్కినది తాడిపర్తి గ్రామములో దగులబడిన దనియు దెలియుచున్నది. కవిత్రయభారతముతరువాత శ్రీకృష్ణభారతమే సంపూర్ణముగా రచింపబడి సమగ్రముగా ముద్రణమునకు వచ్చినది. నన్నయభట్టారకుడు గంటముపట్టి భారతరచనకు గడగిన రాజమహేంద్రవరముననే కవిరాజు కలముపట్టి మహాభారతము పూర్తిచేయుట మెచ్చుకొన దగినది. శాస్త్రిగారి షష్టిపూర్తితో పాటు భారతరచనా పూర్తియు నగుట మఱియు మెచ్చుకోదగినది. ప్రాచీనభారతముతో శ్రీకృష్ణ భారతము కూడ రసికరంజన మొనరించుగాక! కృష్ణభారతకవిత యిటులు జాలువాఱుచుండును.


ధృతరాష్ట్రుడు భీష్మపతనమునకు దు:ఖించు ఘట్టములోనివి:

చ. కురు వృషభుండు భీష్ము డెటుకూలెనొ నేలకు నాశిఖండిచే

శరములచే హతుండయి విసంజ్ఞతనెట్లు వహించెనో సుతుల్

దొరనటు కోలుపోయి యెటు తొట్రిలుచుండిరొ నీనుడు ల్వినం

గరము మదీయమానసము గంపమునొందెడు నార్తి గుందెడున్.


ఉ. ఎవ్వరతండు పాండవుల కేడైఱజూపుచు దద్బలంబులం

ద్రెవ్వగసేయ సేగుతఱి ధీరతతో మునువోవ జాలిరో

యెవ్వరు వెంబడింజనిరొ యెవ్వరు వానికి దోడుసూపిరో

యెవ్వరు వానిగ్రవ్వుకొని యెప్పుడునుండిరొ చెప్పు సంజయా!


ఉ. వేడెవెలుంగు చీకటుల వేయికరంబుల నూడ్చిపుచ్చున

ట్లోడ కతండు శాత్రవుల యుబ్బరమెల్ల నడంచివై చుచో నేడు సమర్థుడై యెదుర సేయగ నుండెనొ పాండవేయు లే

పోడిమి దాత కట్టివని పుట్టగ జేసిరొ ముట్ట జెప్పవే?


మ. పదినాళుల్ పడవాలుగా నిలిచి చాపంబూని కోపంబునం

బదులున్నూఱులు వేలుకోల లొకటంబాఱం బ్రయోగించుచుం

గదనంబుం బొనరించి శత్రుసమితంగారించి కారించి యా

సదిసూనుండు ప్రశాంతుడయ్యె నకటా నా భాగ్యదోషంబునన్.


క. కాలాగ్ని వోలె బగఱం

దూలించుచు గాల్చిపుచ్చి దుర మొనరించెన్

గాలికివిఱిగిన మ్రాన్వలె

గూలెనటే నేల కతడు కుంఠితబలుడై.


వీరి కవితలో దెలుగు పదముల పాలు హెచ్చు. భావమున కంత గంభీరిమ లేకపోయినను, పద్యరచనములో మంచి ధారాళత గల తీరు కృష్ణమూర్తి శాస్త్రిగారికి నిసర్గజమైనది. కూర్చున్న వాడు కూర్చున్నటు లుండి లక్షలు పద్యములు రచించిన యీ కవిరాజు పట్టుదల తెలుగు కవుల కొకయొరవడి.


మొదటినుండియు శాస్త్రిగారికి శ్రీనాథునిపై నభిమానము మెండు. కవితారీతిలో శ్రీనాథునకు వీరికి నెంతో యంతరము. కొంతవఱకు శ్రీ నాథుని జీవితముతో వీరిజీవితమున కున్న పోలిక నీపద్యము వెల్లడించుచున్నది.


గౌతమీ మాహాత్మ్యకర్త కంఠము జుట్టు

కొని యుండెనేగదా ఋణము చిలువ

కవిమిత్త్రు మేనెల్ల జివికించెనేగదా

యప్పులవారి వాక్యాయుధములు

శ్రౌతి మాన్యక్షేత్ర సమితి కొదువ బెట్ట

బడెగదా వృషల సంభవునియొద్ద అష్టశతావధా నాడ్యున కిప్పుడు

చేరియున్నదిగదా నీసరసంబు

పేటలంకల పాట లీపాటుదెచ్చె

మాల పురుపులపాలయ్యె మఱిపొగాకు

అప్పు ముప్పదివేల రూప్యంబులింక

నెట్లుదీర్చెడు శ్రీపాద కృష్ణమూర్తి.


ద్వితీయశ్రీనాథుడని శాస్త్రులుగారిని కొందరు ప్రశంసింతురు. కవిరాజ కవిసార్వభౌమమాది బిరుదములు తాల్చుట, కనకాభిషేకము బడయుట యివి యిందులకు దార్కాణలు. అతనివలె నీతడు లంక వ్యవసాయము చేసి యుప్పులపా లాయెను. పయిపద్య మాసందర్భములోనిది. జీవితములో నిన్ని సన్మానములుచేయించుకొన్న కృష్ణమూర్తి శాస్త్రిగారు రెండవ శ్రీనాథుడే యనుటలో సంశయములేదు.


1933 లో రాజమహేంద్రవరమున గౌతమీ గ్రంథాలయమునందు వీరికి జరిగిన గండపెండేరపుగాంకయు, నాటి సభామహోత్సవము తెలుగుచరిత్రములో నదృష్టమైన ప్రకరణములు.ఆసభకు యాజమాన్యము వహించిన శతావధాని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు కృష్ణమూర్తిశాస్త్రి డాకాలున గండపెండెరము నిండు పరిషత్తులో దొడిగి తమ సహృదయతను వెల్లడించుకొనిరి. వేంకట శాస్త్రిగారివంటి శిష్యుడుండుట శ్రీపాద కవికి దర్ప కారణము. ఈ గురుశిష్యుల వాగ్వాదములు కొంతకాలమునకు దేశము మఱచిపోవును. ఇక మఱచిపో జాలనిది వారి శైష్యోపాధ్యాయిక. గండపెండెరము తొడిగించుకొన్న నాటి సభలో శ్రీపాద కవిరాజు చెప్పిన యీ పద్యము మహోదారమైనది.


శా. నాకీరిచ్చిన గండపెండెరమిలన్ నాస్వత్వ మేనాటికిం

గాకుండు న్విను---ప్రాణములతో గన్పట్టునందాక నా డాకల న్విలసిల్లు నెప్డుచెడకుండన్, దీని నాంధ్రావనీ

ప్రాకామ్యంబగు 'యూనివర్సిటి' వహింపంజెల్లు స్వత్వంబుగన్.


ప్రాచీనకాలమున బెద్దనాది కవిపితామహులు పడసిన యిట్టి మహామహిత సన్మానము లిపు డీకవిరాజు పొందుట యానందవిషయము. మఱియు నీయన స్వదేశసంస్థానములలో గొన్నింట శతాష్టావధానములు ప్రదర్శించి సన్మానితులైరి. బంగళా రాజధానిలో 'మయూర భంజి' (మౌరోబంజి) పట్టణమునకు బోయి యా సంస్థానాధీశుని మ్రోల సంస్కృతమున శతావధానము చేసి బహుకారము నందినటులు వారి చరిత్ర చెప్పుచున్నది. శాస్త్రులుగా రాయా సందర్భములలో జెప్పిన సమస్యా పూరణములు, చాటువులు స్మరింప దగియున్నవి.


అవ్వతాతా, డంకానగారా, రా రా పోరా, మేనా సవారి అను మాటలు వచ్చునటులుగా, ఊర్వశి యర్జునుంగోరి యతడు తనకు వశుడు గామింజేసి పడిన విరహమునుగూర్చి వ్రాయమనగా శాస్త్రులుగారిటులు వ్రాసిరి.


శా. ఆ పాకారి కుమారుడట్లు విభవం బవ్వారిగా రాగ, రా

రాపోరా యను సందడిం బడు సుధర్మంజూచి నే నవ్వతా

తా పాల్మాల నరింప కేగెనను వా డంశానగారా కహా

మీపాలం బడితింజెలున్ మనుప రే మేనా నవారించితిన్.


"వడ్డాణ మలంకరించె వనితకుచములన్"- కుళీరకుహరే కరీ పరిలునాతి పంచాననమ్" ఈసంస్కృతాంధ్ర సమస్యలకు కృష్ణమూర్తి శాస్త్రిగారి పూరణము లుదాహరణీయములు. క. షడ్డకులు పోరుచో భూ

రాడ్డమ్మున నుడువనేగు రభసమ్మున నౌ

నడ్డాక దెగుడు మెడగొను

వడ్డాణ మలంకరించె వనితకుచములన్.


శ్లో. అహో మధువసంచయ; కవికులాధినాథం సదా

పదప్రచర ఉత్పతన్ హరిగ తావధానస్థితమ్,

కరోతి యది చేత్తి రస్కృతి మిహాఘయుక్తే కతా

కుళీరకుహరే కరీ పరిలునాతి పంచాననం


బాలాత్రిపురసుందరీ దేవతోపాసకు డగుటచే నీకవివరు డన్నమాట విధిగా జరిగెడిదని కొన్నాళ్ళక్రిందటి వాడుక. అదియటులుండ, శ్రీ శాస్త్రులుగారు పత్రికాసంపాదకతచే గొంతకీర్తి సంపాదించుకొనిరి. 'కళావతి' యను ముద్రణాలయమును మదరాసులో నెలకొలిపి పిమ్మట దానిని రాజమహేంద్రవరమునకు మార్చి యవిచ్ఛిన్నముగా దానిని పదియేండ్లు నడపిరి. 'గౌతమి' యను తెనుగుమాసపత్రిక 1908 లో నారంభించిరి. అది యొకయేడు నడచి యాగిపోయినది. వీరి వజ్రాయుధము, మానవసేన, వందేమాతరం అను పత్రికలు నాడు మంచి ప్రచారము లోనికి వచ్చినవి.


ఈతీరున బత్త్రి కాసంపాదకులై, శతాధిక గ్రంథరచయితలై, భారత బాగవత రామాయణాంధ్రీకర్తలై, కవిరాజులై, కవిసార్వభౌములై, కళాప్రపూర్ణులై, మహామహోపాధ్యాయులై, ఆంధ్రవ్యాసులై, కనకాభిషిక్తులై, పూర్ణపురుషాయుషజీవులై విరాజిల్లుచున్న కృష్ణమూర్తి శాస్త్రిగారి సమగ్రజీవితము వ్రాసినచో మఱియొక మహాభారతము.

            ______________