ఆంధ్ర రచయితలు/మచ్చా వేంకటకవి

వికీసోర్స్ నుండి

మచ్చా వేంకటకవి

1856-1903

తెలగాకొలము. జననము: 1856 సం. రాక్షసనామ వత్సరము. నిర్యాణము: 9 జనవరి 1903. తండ్రి: గంగయ్య. పుట్టినయూరు: నైజాము మండలములోని జల్నా. గ్రంథములు: 1. శ్రీశుద్ధాంధ్ర నిరోష్ఠ్యనిర్వచన కుశచరిత్ర, 2. వైదర్భీ పరిణయము, 3. చెన్నకేశవ రామాయణము (రామాయణ సంగ్రహ శతకము), 4. ఛాయాపుత్ర శతకము (శనిస్తవము), 5. రుక్మిణీ నాటకము, 6. ద్రౌపదీ వస్త్రాపహరణము, 7. మయూర ధ్వజోపాఖ్యానము, 8. అంబరీషోపాఖ్యానము (పయి మూడును గాక ప్ర బంధములు) 9. ముఖలింగేశ్వరోదాహరణము, 10. జావళీలు, 11. హరిభజన కృతులు.

మచ్చా వేంకటకవి పేరు తలపుగొన్నపుడు మఱపురాని యీక్రింది విషయము మామిత్రులవలన విన్నది ముందు మనవిసేయవలసియున్నది.

ఇది 1900 సం. ప్రాంతములో జరిగిన ముచ్చట. ఇచ్ఛాపుర గ్రామమున వేంకటకవియు, దర్భా వేంకటశాస్త్రియనుపేరుగల డిప్యూటికలెక్టరు హోదాలోనున్న యొకరును గలసికొనిరి. వీరిరువురు స్వల్పమైన పరస్పర పరిచయము గలవారు. కలసికొనగానే వేంకటశాస్త్రిగారు వేంకటకవినిజూచి "ఓహో,మచ్చాకవి! యెప్పుడువచ్చితి"ననెను. వెను వెంటనే వేంకటకవి "ఓహో, దర్భాశాస్త్రి! మూనాళ్ళయివచ్చితి" నని బదులుపలికెను. అపుడు కలెక్టరు హోదాలో నున్న పెద్దమానిసి "వేంకటకవిగారూ! వేరుగా దలంపకుడు. మీరు వయస్సున జిన్నలగుటచే జనవుగొని యటులు సంబోధించితి" నని సర్దుకొను చుండగా వేంకటకవి యందుకొని "తామేల యటులు భావించితిరి? "వేంకట" శబ్దముపయి మీకనాదరభావ ముండెనేమో యనుకొని యిటులు సంబోధించితి" నని ప్రత్యుత్తరము చెప్పెను. ఈ సమయ స్పురణ మునకు బ్రక్కనున్న వారు విఱుగబడి నవ్విరి. అధికారి సరసుడగుటచే వేంకటకవి యాత్మగౌరవమునకు సంతసించెను.

ఇట్టిదే వేఱొక సన్నవేశము. శ్రీ విక్టోరియా మహారా-యస్తమించిన సందర్భమున సర్లాకిమిడి కళాశాలలో నొకపరామర్శసభ జరిగెను. ఆయూరి దాజుగారును, మహోన్నతులయిన యాంగ్లేయోద్యోగులును, కవులును బెక్కు రక్కడ నుండిరి. మన వేంకటకవి యాకళాశాలలో బ్రధాన పండితుడుగా నుండెను. మహారాజ్ణి నిర్యాణమును గూర్చి వేంకటకవియు గొన్ని పద్యములు రచించి సభలో జదువ నుండెను. కొంతతఱికి వారివంతు రాగా గాలిజోడువీడక గద్దెపైక్కో ముద్దులొలుకు గళస్వరముతో దన మధుర పద్యములు పఠింపమొదలిడెను. అప్పుడు రాజుగారి కార్యదర్శి చింతలపాటి హనుమంతరావుపంతులు గారు తొందరపాటున లేచి దేశభాషాపండితులకు వర్తమానగౌరవాచార ఫక్కి తెలియదనియు, నిట్టి వారిని వేదిక నెక్కింపరాదనియు నొక్కిసభలో జెప్పెను. అంతట వేంకటకవి యేదో బదులు పలుకుచుండగా, ఆకళాశాలలో నపుడు ప్రధమ సహాయోపాధ్యాయులుగా నున్న శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారు లేచి యిట్లు పలికెను. "వేంకటకవి సామాన్యకవిగాకాడు. ఆంధ్ర మండలములో నితనివంటి కవులు చాల తక్కువగానున్నారు. ఇతని కవిత్వ పటుత్వము నేటివారిలో గొందఱకేగాని లేదు. ఇట్టివానికి స్వేచ్ఛ నీయవలయును. "రామమూర్తి పంతులుగారి యీమాటల కచటి సభ్యులు నివ్వెఱపడి చూచుచుండిరి.

పై నుదాహరించిన రెండు ముచ్చటలవలనను మన వేంకటకవి మంచి సమయస్ఫురణమ్ను నిరంకుశత కలవాడనుట స్పష్టము. కవివ్యుత్పన్ను డయినపుడుగాని నిరంకుశత యందగింపదు. కవిత్వము వ్యుత్పత్తి రెండును గలవాడు మన వేంకటకవి.

ఈ కవిపూర్వులు నాటికి రెండునూర్లఏండ్లక్రితము మచలీ బందరు నుండి విశాఖపట్టణమండలములో నున్న శ్రీకాకుళమునకు బోయి మహమ్మదీయ ప్రభుసైన్యములో సరదారులుగా నుద్యోగించిరట. ఈ కవి తండ్రి గంగయ్య పటాలములో బనిచేయుచుండగా జాల్నాపురిలో నీయన జన్మము తటస్థించెను. ఈగంగయ్య తెలుగు సారస్వతము కొంత యెఱిగినవాడు. బ్రౌనుదొరకు సమకాలికుడు. నాడు జిల్లా జడ్జిగానున్న బ్రౌనుతో రాజమహేంధ్రవరమున నున్నపుడు చెలిమి కలుపుకొని మన్ననలు పొందెను. ఈసందర్భము వేంకటకవి తన వైదర్భీపరిణయ కావ్యమున నిటులు ముచ్చటించెను.

శా.సీ.పీ.బ్రౌన్ దొరగారు మండలపు జడ్జినుప్రమేయంబునం

దేపారం జని గంగయాహ్వయుడు హాయింగాంచి తానాంధ్ర వి

ద్యాపాండిత్యము మేటి గ్రంధపఠనాద్యస్తోక నైపుణ్యమున్

జూపెన్ రాజమహేంధ్ర పట్టణమునన్ సూర్యుత్తముల్ మేలనన్.

ఈ వేంకటకవి మూడేండ్ల పసిప్రాయమున నుండగా "జాల్నా" లో నొకచోరుడు మిఠాయిపొట్లము తినజూపి యెత్తుకొనిపోయి, యొడలి బంగారము నూడ బెరికికొని దవ్వుల నొక పాడునూతిలో బాఱవైచెనట. ఆపసిబిడ్డ తండ్రులు సైనికోద్యోగులగుటచే పలువురు నాలుగు మూలలకు వెళ్ళి వెదుకగా, నీరులేని పాడునూత నేడ్చుచున్న పిల్లవానిని బయటకులాగి బుజ్జగించుచున్న బాటసారులు, వారికాబిడ్డ నిచ్చి బహుమానితులయిరట. పసిబిడ్డ చెవుల నంటుజోళ్ళు చోరునిచే ద్రెంచ బడుట కారణముగా ,చెవితమ్ములు వేంకటకవికి మఱి కలియలేదు. ఇట్టి గండము గడచిన పసిబిడ్డ పండితకవి కావలయునో?

వేంకటకవి తొట్టతొలుత దండ్రికడనే తెనుగు పొలుపులు గుర్తుపట్టెను. సంస్కృతము తెలికిచెర్ల శివరామశాస్త్రిగారి కడ నభ్యాసము. శ్రీకాకుళము హైస్కూలులో ఆంగ్లభాషాపఠనము-గంజాము మండలము లోని పురుషోత్తమ పురములో "సబురిజిస్ట్రారు" గా బనిచేయుచుండిన వేంకటకవి భాషమీద మక్కువతో , పర్లాకిమిడి కళాశాలలో ప్రధాన పండితపదవి లభింపగా నది గ్రహించెను. అది మొదలు వేంకటకవి సారస్వత వ్యవసాయమునకొక మెఱుగు గాలము.ఈయన రచనలు ప్రధానముగా నాటి అముద్రిత గ్రంధ చింతామణి (నెల్లూరు) పురుషార్ధ ప్రదాయని (బందరు) పత్రికలలో గాన నగును. మన వేంకటకవికి సమస్యా పూరణములపై వేడుక మెండు. "వార్తాలహరి" యను పత్రికలో త్రిపురాన తమ్మయకవి (ఆంధ్ర దేవీభాగవతగ్రంధకర్త) యొసగిన "ప్రద్యుమ్నాగారమందు భానుడు వొలిచెన్" అను సమస్యకు వేంకటకవి వ్రాసిన పూరణములెట్టి మధురధోరణిలో నున్నవో చదువుడు. ఏకారణముననో యివి వేంకటకవి తనశిష్యుని పేర వెలువరించెను.

క. మద్యమ్ము ద్రావినవో

విద్యున్నేతల గుఱించి వెత జెందితివో

విద్యావిహీన! యెక్కడి

ప్రద్యుమ్నాగారమందు భానుడు వొలిచెన్!

క. విధ్యానిధి నిటు డొకసతి

జోద్యమ్ముగ గూడునెడ రజోగుణ మిషచే

హృద్యమ్మగు నక్కోమలి

ప్రద్యుమ్నాగారమందు భానుడువొలిచెన్.

విద్యాధరార్చితా! యర

పద్యమ్మున నీసమస్య పరగ ముంగితున్

హృద్యమ్మగు ప్రాగ్గిరి దీ

ప్రద్యుమ్నాగారమందు భానుడు వొలిచెన్. ఈవేంకటకవి సాహిత్య వివాదములు మొదలగునవి యానాటి ఆంధ్రభాషాసంజీవని, హిందూజన సంస్కారిణి (చెన్నపురి) బుధవిధేయి మున్నగు పత్రికలలో గననగును.

మండపాక పార్వతీశ్వరశాస్త్రి యీవేంకటకవి నిటు లుట్టఠించెను:

మచ్చరము లేదు కవితలో మచ్చలేదు

మచ్చయిన లేదు నుతికి సొమ్మచ్చలేదు

మచ్చయన మెచ్చదగు పుట్టుమచ్చగాన

మచ్చవేంకటకవినామ మచ్చమయ్యె.

     20. 2. 1894 సం. బొబ్బిలి


       ----------