Jump to content

ఆంధ్ర రచయితలు/పరవస్తు చిన్నయసూరి

వికీసోర్స్ నుండి

పరవస్తు చిన్నయసూరి

1806 - 1862

సాతాని శ్రీవైష్ణవుడు. అభిజనము: చెంగల్పట్టు జిల్లాలోని పెరంబూదూరు. ఉనికి: చెన్నపురము. తల్లి: శ్రీనివాసాంబ. తండ్రి: వేంకటరంగయ్య. సూరి జననము: 1806 - నిర్యాణము: 1862. రచించిన గ్రంథములు: చింతామణివృత్తి 1840- పద్యాంధ్రవ్యాకరణము 1840- సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణము 1844- పచ్చయప్ప నృపయశోమండనము 1845- ఆదిపర్వవచనము 1847- శబ్దలక్షణ సంగ్రహము 1853- నీతిచంద్రిక 1853- నీతిసంగ్రహము 1855- బాలవ్యాకరణము 1855- విభక్తి బోధిని 1859- ఆంధ్రధాతుమాల- అక్షరగుచ్ఛము- ఆంధ్రశబ్ద శాసనము- బాలవ్యాకరణ శేషము- ఇంగ్లీషులా చట్టముల భాషాంతరీకరణము- ఆంధ్రకౌముది (వచనము)- ఆంధ్రకాదంబరి (వచనము) అకారాది నిఘంటువు- చాటుపద్యములు- సుజనరంజనీ పత్రిక- యాదవాభ్యుదయము.


ప్రాచీనాంధ్ర భాషాయుగమునకు నన్నయవలె, అర్వాచీనాంధ్ర భాషాశకమునకు ' చిన్నయ ' మార్గదర్శకుడు. నన్నయ తననాటి వ్యావహారికమును గ్రాంథికవ్యాహారముగా సంస్కరించుటకు చింతామణి రచించిన శబ్దశాసనుడు. చిన్నయ దేశభాషలో బాలవ్యాకరణము రచించి యాంధ్రపాణిని యనిపించుకొనిన సూరి. చింతామణికి శేషగ్రంథముగా 'అథర్వణ కారికలు' బాలవ్యాకరణమునకు శేషగ్రంథముగా 'ప్రౌఢవ్యాకరణము' వెలువడినను విద్వాంసుల శాస్త్రార్థముల కాగినవి చింతామణి బాలవ్యాకరణములు రెండే. నన్నయభట్టు భారతామ్నాయము నాంధ్రీకరించి తెలుగున బద్యకవితకు బాటవేసెను. చిన్నయ సూరి నీతిచంద్రిక సంధానించి యాంధ్రమున గత్యకవితకు ఘంటాపథము కల్పించెను. ఆదికవి యనబడిన నన్నయభట్టారకునకు బూర్వ మాంద్రమున బద్యకవిత్వము చేయుటకు వీలుపడదు. అటులే, చిన్నయసూరికి బూర్వము గద్యగ్రంధములు రచించినారు. లేదనుటకు ధైర్యము చాలదు. కాని 'నీతిచంద్రిక ' వంటి యుత్తమ వచన శైలి యనన్య లభ్యమైన వైలక్షణ్యము గలిగియే యున్నది. కావున బద్యమున నన్నయకువలె గద్యమును జిన్నయకు నాద్యస్థానము నీయలెను.

చిన్నయసూరి తండ్రి వేంకటరంగయ్యగారు మంచి పండితులు. వీరు చెన్నపురిలో ఈస్టుఇండియాకంపెనీలో పాలనముననున్న యున్నత యున్నత న్యాయస్థానమునగల పండితుసభ్యులలో నొకరు. 1836 లో వీరు మరణించిరి. చనిపోవునప్పటికి వీరి వయస్సు నూటపదియేండ్లవరకునుండును.సూరి తండ్రికడనే తెనుగు, అరవము, సంసృతప్రాకృతములు చదువుకొనెను. కంచి రామానుజాచార్యులతో దర్కాలంకార మీమాంసలుఠించెను, ఉత్తరదేశ పండితుడు రామశాస్త్రి యనునాయనకడ వేదవేదార్ధరహస్యములు సంగ్రహించెను. ఈ రామశాస్త్రియే సూరికి హయగ్రీవమంత్రోపదేశ మొనరించెను. సూరి స్యయంకృషిచే నాంగ్లముతోగూడ నించుగపరిచయము కలిగించుకొనెను. వేదము వేంకటరమణ శాస్త్రులుగారు (వేదము వేంకటరాయ శాస్త్రి గారి తండ్రి) చిన్నయసూరినాటివారు. వీరువుదు సాహిత్యగోష్టి చేసెడువారు. సూరిగారి యాంగ్లభాషాపరిచయము బ్రౌనుదొర మున్నగువారితో విశేషస్నేహము చేకూర్చినది. ఉన్నతోద్యోగులగు నాంగ్లేయులెందఱో సూరిగురుత్వమున సంసృతాంధ్రములు సాధించిరి. వారివారి సాహాయ్యమున పచ్చయప్పకళాశాలలో సూరి ప్రధాన పెండితపదము సంపారించి 1845 మొదలు 1848 వఱకు నచట నుద్యోగించెను. చెన్నపుర రాష్ట్రీయ కళాశాలలో సూరి ప్రధానాంధ్రోపాధ్యాయుడై యుండెను. మొట్టమొదట నాంధ్ర మహాభాగవతము నెలువరించిన పండితవరులు పురాణము హయగ్రీవశాస్త్రి గారు నాడు ద్వితీయాంధ్రోపాధ్యాయులుగా నుండిరి. వీరిర్వురును సహపాఠులు. నాడు విశ్వవిద్యాలయ కార్యదర్శి ఎ.జె. ఆర్బత్ నట్ దొర కాశినుండి తర్క మీమాంసా పండితుల రావించి చిన్నయను బరీక్షచేయించి సమర్థుడని యెఱిగి చిన్నయసూఱి యను నక్షరములతో స్వర్ణకంకణము నొండు 'సీమ' నుండి తెప్పించి బహుమానించెను. నాడు మొదలు చిన్నయ చిన్నయసూరి.

ఆ కాలమున మదరాసులో న్యాయమూర్తి శ్రీరంగనాథశాస్త్రి పదునైదు భాషలలో బ్రవేశము గల పెద్దన్యాయాధిపతి.

ఆయనకు హయగ్రీవశాస్త్రిగారిపై నభిమాన మధికము. ఆ కారణమున నాయనతో "సూరిగారి ప్రథమోపాధ్యాయ పదవి మీకు వచ్చునట్లు చేసెద" నని రెండుమూడుసారులు చెప్పుచు వచ్చిరట. అంతట హయగ్రీవ శాస్త్రిగారు "ప్రధానోపాధ్యాయస్థానమునకు సూరిగారే సమర్ధులు" అని చెప్పి రంగనాథశాస్త్రిగారికి సూరి ప్రతిభ చూపించనెంచి యొక యాదివారమున వారిని సూరి యింటికి గొంపోయిరట. రంగనాథ శాస్త్రిగారి కోరికపై జిన్నయసూరి యలంకారవిషయము ముచ్చటించుట కారంభించెను. ఆ మహోపన్యాస మట్లు గంగాప్రవాహమువలె బోవుచునే యున్నది. రంగనాథ శాస్త్రిగా రేకతానులై చెవులొగ్గి వినుచుండెను. హయగ్రీవశాస్త్రి తమసహపాఠి శక్తి కానందభరితుడగుచుండెను. రాత్రి పదిగంటలయినది. అప్పుడు న్యాయాధిపతికి మెలకువ వచ్చి సూరి శాస్త్ర జ్ఞానమునకాశ్చర్యపడి, పూర్వాభిప్రాయము తొలగించుకొని సెలవుగైకొని యింటికి బోయెను.

సూరిగారికి బేరుపొందిన శిష్యులెందఱో కలరు. శబ్దరత్నాకర కర్తలు, ప్రౌఢవ్యాకర్తలునైన బహుజనపల్లి సీతారామాచార్యులు గారు వీరి శిష్యరత్నము. ఆంధ్ర విశ్వగుణాదర్శకర్త పంచాంగము తేవప్పెరుమాళ్ళయ్య నూరికడనే పఠించెను.

బ్రౌనుదొర, గాజుల లక్ష్మీనృసింహము సెట్టి, జస్టిస్ రంగనాథశాస్త్రి, కుమారస్వామిశాస్త్రి మున్నగు మహనీయులు నెచ్చెలులై చిన్నయసూరి భాషాసేవకు నిరంతర ప్రోత్సాహ మిచ్చుచుండువారు. తొట్టతొలుత సూరిని గ్రంథ రచనోద్యమములో బెట్టినవాడు లక్ష్మీనృసింహము శ్రేష్ఠి. ఆంధ్రశబ్దశాసనము, ఆంధ్రనిఘంటువు, వీరియెచ్చరిక వలన నూసూరి వ్రాయనారంభించెను. కాని యవి రెండును దుదముట్టలేదు. ఈ నిఘంటువిషయము మిచట గొంత ముచ్చటింపవలసినది కలదు.

చిన్నయసూరి యాంధ్రనిఘంటు రచనోద్యమము నెఱిగిన వారు పెక్కుమంది యుండరు. ఆ యుద్యమము కడముట్టలేదు గాని పదముల పట్టిక వ్రాసికొని, యర్థనిర్ణయమునకు గావలిసిన ప్రాచీన మహాకవి ప్రయుక్త వాక్యములనెత్తి, కొన్నింటి కర్థనిర్ణయము చేసి సూరి చాల బరిశ్రమనకు బాలుపడి దైవ దుర్వపాకమున రాచపుండు బయలుదేఱి, 1862 లో బ్రాణములు గోలుపోయెను. ఆచార్య మరణానంతరము వారియాప్తశిష్యులు బహుజనపల్లి సీతారామాచార్యులుగారు సూరి గారి కోడలికడనున్న నిఘంటు సామాగ్రిని కారణాంతరము చెప్పి పుచ్చుకొని యంతయు సంగ్రహించి వ్రాసికొని మరల నది యామెకిచ్చివేసిరని యొక వదంతి. ఈ వదంతిలోని యౌగాములు నిర్ధారింపజాలము. కాని శబ్దరత్నాకరమునకును, అముద్రితమగు చిన్నయసూరి నిఘంటువునకును బెక్కుచోట్ల నక్కాసెల్లెండ్ర పోలికలు కలవు. శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారి కిది యెటులో లభించినటులు, ఆయనకడ వీరేశలింగము పంతులుగారు బిలిచికొని, సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయము వారికి, అనగా ఆంధ్ర సాహిత్యపరిషత్కార్యాలయమునకు వెలకో, ఊరకో యిచ్చియుందురని విన్న సంగతి. ఏమైనను, తన్నిఘంటు కార్యాలయ పండితులు ప్రామాణికముగా నీవ్రాతకాకితములు చూచు కొన్నారన్నది నా కనుగొన్న సంగతి. శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువున చి.ని. అను సంకేతాక్షరములతో నున్న పద సందర్భము లరసిన నిది విశదము. సూరి స్వహస్తాక్షరములతో నక్షిపర్వ మొనరించుచున్న యసంపూర్ణ నిఘంటుపత్రములు భాషాచరిత్రమున శాశ్వతముగ గల్పించుకొనగలవనుటలో నాశ్చర్యము లేదు. శబ్దరత్నాకరకారుల యీ వాక్యములువినుడు.

"సంస్కృతాంధ్రములయందు విశేష పాండిత్యము కలిగి యాసేతు హిమాచలము చాలబ్రసిద్ధి వహించియుండిన పరవస్తు చిన్నయసూరిగారు జీవితులై యుండిన కాలంబున దీర్ఘనూత్రతతో ననేక గ్రంథపరిశోధనంబు గావించి మిగుల విరివిగా బ్రయోగసహితంబుగా అకారాది తెనుగు నిఘంటు వొకటి వ్రాయం బ్రారంభించి నడపుచుండిరి."

ఈ మాటలను బట్టి చూచిన సీతారామాచార్యులవారికి సూరిపై గల గౌరవభావమును, శబ్దరత్నాకరమునకు సూరి నిఘంటువుతోగల సంబంధము విస్పష్టమగును. ఆచార్యులవారి "ప్రౌఢ వ్యాకరణము" లోని సూత్రములకును, అచ్చున కెక్కని సూరి సూత్రములకును గొన్నింట గురుశిష్య సంబంధమున్నది. సూరి "బాలవ్యాకరణ శేషము" ఆంధ్రియభాగ్యవశమున సశేషమైపోయినది.

బాలవ్యాకరణము

బాలవ్యాకరణము నకు చిన్నయసూరి యని ప్రసిద్ధవ్యవహారము. కిరాతార్జునీయమునకు భారవి యని, శిశుపాలవధమునకు మాఘమని పేరులున్నవి. టెన్నిసన్ చూచితిరా? షెల్లీ చదివితిరా ? యనునది పాశ్చాత్యము. తెలుగున నిట్టివాడుక చిన్నయసూరికి దక్కినది. సూరి కీర్తిచంద్రికకు బాలవ్యాకరణము శారదరాత్రి. సంస్కృత భాషావ్యాకరణములెన్నో యున్నవి. కాని పాణినీయముముం దవి నిలబడలేక పోయినవి. తెలుగున జాలమంది వ్యాకర్తలు పుట్టిరి. వారు చిన్నయ సూరికి లొచ్చు. దీనినిబట్టి సూరిని కాదనిపింపగల శాస్త్ర పండితులు లేరనికాదు. అవ్యాప్త్వతివ్యాప్తులు లేకుండ స్వల్పాక్షరములు నుండి విశ్వతోముఖమైన యర్థము వచ్చు సూత్రరచనము సూరికి జక్కగ నలవడినదు. ఇది విద్వత్సాధారణమైన యభిప్రాయము.

మును మదుపజ్ఞం బగుచుం
దనరిన వ్యాకృతిని సూత్రతతి యొకకొంతం
దెనిగించి యిది ఘటించితి
ననయము బాలావబోధ మగుభంగిదగన్

అని చిన్నయసూరి వ్రాసికొనెను. అది కాదని గుప్తార్థప్రకాశికా కారులు కల్లూరు వేంకటరామశాస్త్రిగారు "బాలవ్యాకరణము శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి గారి హరి కారికల కనువాదము గాని సూరి స్వతంత్ర రచనము కాదనియు, అబ్రాహ్మణడుగట సూరి కట్టి పాండిత్య విశేషముండ" దనియు వ్రాసి, సూరిని త్రోసిరాజన జూచిరి. తత్వజ్ఞులెవరూ నీవాదము నిరాధారమగుట నంగీకరింపలేదు. "కాళహస్తిలో కృష్ణమూర్తి శాస్త్రి గారికినీ, సూరిగారికినీ జరిగిన వివాదములో శాస్త్రి గారొక విషయమున పరాజితులై సహింపనేరక సూరి బాలవ్యాకరణము నణంచటకు 'హరికారికలు' సంస్కృతమున వ్రాసి బాలవ్యాకృతికిది మాతృకయమని ప్రచారము చేసెడివా " రని జనశ్రుతి. దీని కుపష్టంభకముగా వీరేశలింగము పంతులు గారు 'కవులచరిత్ర' లో కృష్ణమూర్తిశాస్త్రిగారి చరిత్రయం దిట్లు వ్రాసినారు.

" ఈ కృష్ణమూర్తికవి కాళహస్తిలో నున్నపుడు చేయబడిన ప్రధానగ్రంథ మింకొకటి కలదు. ఆ కాలమున నీయనకు చెన్నపురి శాస్త్ర పాఠశాలలో నాంధ్రపండితుడైన పరవస్తు చిన్నయసూరికిని సిద్ధాంతకౌముదిలోని సూత్రవిచారము కొంత నడచెను. మన పండితులు సాధారణముగా మత్పరగ్రస్తులగుట సుప్రసిద్ధమే కదా! అట్టివారీర్ష్యచేత దమకు లాభములేకపోయినను బరులకు నష్టము కలుగుటయే తమ యభీష్టసిద్ధిగా భావించి కొన్ని సమయములందు బరులకీర్తికి భంగము కలిగింపజూతురు. అంతకు పూర్వము కొంతకాలము క్రిందట జిన్నయ సూరి బాలవ్యాకరణము రచియించెను. దానితో సరిపోల్పదగిన యాంధ్రవ్యాకరణము మావరకు వేఱొకటి లేదు. అట్లుండగా కృష్ణమూర్తి గారిచే జేయబడిన వ్యాఖ్యానముతో గూడిన హరికారిక లనబడెడి యాంధ్రవ్యాకరణసూత్రగ్రంథ మొకటి యటు తరువాత నల్పకాలము నకు వెలువడెను. అదియే హరిభట్టకృతమై యధర్వణాదులచే బేర్కొనబడిన కారికావళియైన పక్షమున జిన్నయసూరి తన వ్యాకరణములోని సూత్రములన్నిటిని హరికృతగ్రంథమునుండి దొంగిలించి తన పేరిట బ్రకటించినట్లు స్పష్టమగుచున్నది. అయినను మూలగ్రంథములో జూపబడిన లక్ష్యములు కొన్ని యధర్వణాచార్యుల కిటీవలి యాధునిక గ్రంథములలోని వగుట చేత వ్యాఖ్యానమును మాత్రమే గాక మూలగ్రంథమును సైతము కృష్ణమూర్తిగారే రచించిరేమోయని పలువురు సందేహపడుతున్నారు. అట్టిగ్రంథమును రచియింపగల సామర్థ్యమా విద్వత్కవికి గల దనుటలో సందేహము లేదు. ఈయన ఎటువంటి గ్రంథకల్పనము సేయు సంశయపడపవారు కారని చూపుటకై చరమదశ యందు మాడుగల్లులోనున్నపు డొకరాత్రిలో జేసిన ట్టీయన కారోపింపబడిన యశ్వశాస్త్ర కథ కొంత తోడ్పడుతున్నది". [1]

ఈ వాక్యములు సావధానముగా జదివినచో సూరిగారి బాలవ్యాకరణమున కసూయపడి కృష్ణమూర్తిశాస్త్రిగారు హరికారికలు రచించిరనుట సుస్పష్టము. ఇది గాక హరికారికలు పెక్కుచోట్ల నసందర్భములుగా నున్నవికూడను. ప్రథమమున మదుపజ్ఞంబని చెప్పిన 'సంస్కృత వ్యాకరణము' ను ప్రచురము కాదని తలంచి బాలవ్యాకరణము తెనుగున సూరి రచించినాడు. చిన్నయసూరి కృష్ణమూర్తిశాస్త్రిగారి వలె సర్వతంత్రస్వతంత్రుడు, షడ్దర్శనీపారంగతుడు కాకపోవచ్చును. బాల వ్యాకరణము రచించుటకు దగిన పాణినీయపాండితియు ప్రయోగపరిజ్ఞానము లేనివాడనుట అన్యాయము.

ఆంధ్ర విశ్వవిద్యాలయ పండితులు శ్రీ దువ్వూరి వేంకటరమణశాస్త్రి గారీ వాదమును బలపఱుచు గడకు వారు నిష్కరించి తేల్చిన యభిప్రాయమిది.

"...పూర్వోదాహృతములగు సంశయములన్నియు బాల వ్యాకరణమే ప్రాథమికమని స్థాపింపజాలియుండుట వల్లను, సూరి గారు విద్వాంసులని పండితపరంపరాయాతమగు ప్రసిద్ధి యుండుటవల్లను, నాంధ్ర సాహిత్య పరిష త్కార్యాలయము వారు ప్రచురించిన సూరిగారి జీవితమును బట్టియు, సూరిగారు రచించిన నిఘంటువును బట్టియు వీరిట్టి వ్యాకరణ గ్రంథము స్వతంత్రముగా రచించుటకు సమర్థులని స్పష్టముగా దెలియుచుండుట వల్లను, బూర్వోదాహృతమగు నశ్వశాస్త్రకథనుబట్టి శిష్టు కవిగారిట్టి గ్రంథ కల్పనము చేయగలిగినవారని స్పష్టపడుచుండుట వల్లను హరికారికలకు బాలవ్యాకరణమే మూలమని నా అభిప్రాయము." [2]

నీతిచంద్రిక

ఇది సూరికృతులలో నత్యుత్తమము. వచన కథారచనా విధానమునకు జిన్నయసూరియే శ్రీకారముచుట్టె ననుటకు జరిత్ర పరిశీలకు లొప్పకున్నను నీతిచంద్రికలోని శైలి రసాలవాల మనుట సహృదయ సామాన్యమున కిష్టాపత్తియే. సూరి వాణీదర్పణ మను ముద్రాయంత్రమును నెలకొలిపి నీతిచంద్రిక తొలిముద్రణము 1858లో వేయించెను. వీరేశలింగకవి "చిన్నయసూరి ధీరు లెద జేరిచి సారెకు నాదరింపగా మున్ను రచించిమించె సగము స్వచనంబుగ నీతిచంద్రికన్" అని తానుత్తరార్థము గూర్చెను. కొక్కొండ వేంకటరత్నము పంతులు గారును 'విగ్రహమూ గావించిరి. సూరి వచనములోని సొగుసు వీరిర్వురకును దూరమైనది. మిత్రభేదము మిత్రలాభముకంటె బ్రౌఢము. రచనా చతురతకును, సామెతలు చక్కగ వాడుటకును, ప్రయోగ విశేషములు ప్రదర్శించుటకును చిన్నయసూరి శ్రద్ధ తీసికొనెను. రసానుగుణములగు వృత్తులు, పాత్రోచితములగు పదములు నీతిచంద్రికయందే పరికింపవలయును. సూరి సూత్రాంధ్రవ్యాకరణము - ఆంధ్ర ధాతుమాలయు నాంధ్ర సాహిత్యపరిషత్తు ప్రకటించినది.

ఇతడు సంస్కృతాంధ్రములలో జక్కనిరీతిగల కవిత సంతరించెను. పచ్చపనృప యశోమండనము చూడుడు.

"గగనంబట్లు రసప్రపూర్ణ విలసత్కందంబులు న్మీఱి య
భ్రగసాలంబుగతిన్ సితచ్ఛదములన్ భాసిల్లి మేరుక్రియన్
జగదామోద సుపర్ణభాస్వరముగా జానొంది పచ్చావనీ
శగుణంబు ల్గణుతించుకోశ మిది యిచ్చ న్మెచ్చుగావించెడిన్
గుణస్య బాధికాం వృద్ధిమ కృతవాన్ పాణినిః పురా
అబాధితగుణాం వృద్ధిమకరో త్పచ్చపప్రభుః"

సంస్కృతాంధ్రకవితలు రెండును ధారాళగతినుండి పండిత హృదయముల నాకర్షించుచున్నవి.

చిన్నయసూరి వ్యాకర్తయే కాదు, కావ్యకర్త కూడను. భాషాభిజ్ఞుడే కాదు, సంగీతకళావిజ్ఞుడు కూడను. సుస్థిరయళ స్సంపాదకుడే కాదు, "సుజనరంజనీ పత్రికా" సంపాదకుడు కూడను.

సూరి కంఠధ్వని చాల శ్రావ్యముగ నుండెడిదట. ఆయన సంగీతము కొంతనేర్చెను. సూరి 'సుజనరంజని' యను మాసపత్రిక కొన్నియేండ్లు వెలువరించినట్లు తెలియును. అందు బట్టపరీక్షార్థులకు విద్వాంసులకు గలుగు భాషాసందేహములకు చక్కని సమాధానములు ప్రచురింపబడుచుండెడివట. "ఇదివరలో జిన్నయసూరి ముద్రింపించుచు వచ్చిన సుజనరంజనీ యను పత్రికయందు పై నుదహరించిన మూడు గ్రంథములు భట్టుమూర్తిరచించె నని వ్రాసియున్నది" (అముద్రితగ్రంథ చింతామణి - 1886 ఫిబ్రవరి) ఈ వ్రాతను జూచిన 'సుజనరంజని' సూరి నడపినటులు సువిశదము.

సూరి కవితా నిపుణుడు. వచనరచనా మార్గదర్శకుడు. సంఘసంస్కారపరుడు. భాషాపోషకుడు. ఇతడు ప్రాచీనుల యడుగుజాడలలో నడిచెను. ఇతనికి నన్నయ చెప్పినది వేదము. ఇతనికడ శాస్త్రాది గ్రంథములతో నిండిన భాండాగార ముండెడిదని ప్రసిద్ధి.

బ్రౌనుదొర ప్రోత్సాహము - లక్ష్మీనరసింహశ్రేష్టి హెచ్చరిక, సూరి భాషాసేవకు జేయూత నిచ్చినవు. సూరి మరణించినను నాతని కీర్తి జ్యోతి బాలవ్యాకరణ నీతిచంద్రికా స్నేహమున నధునాతనాంధ్ర భాషాభవనములో దేదీప్యమానముగ వెలుగుచునే యున్నది.

  1. కవుల చరిత్ర 588 పుట
  2. బాలవ్యాకరణ హరికారికల పౌర్యాపర్య విమర్శనము - ఆంధ్ర సాహిత్యపరిషత్పత్రిక సంపుటము 14 - సంచిక 4