ఆంధ్ర రచయితలు/తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి
తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి
1892
వెలనాటిశాఖీయ బ్రాహ్మణుడు. ఆపస్తంబ సూత్రుడు. భారద్వాజ సగోత్రుడు. తల్లి: లక్ష్మీదేవమ్మ. తండ్రి: కృష్ణశాస్త్రి. జన్మస్థానము: గుంటూరు మండలములో మంగళగిరి క్షేత్ర సమీపమున నున్న కాజ గ్రామము. జననము: నందన సంవత్సర భాద్రపద బహుళ షష్ఠీ సోమవాసరము. 12-9-1892.
కృతులు: 1. కావ్యావళి. (రెండు భాగములు), 2. హృదయేశ్వరి (ఉపకావ్యము), 3. పద్మావతీ చరణ చారణ చక్రవర్తి (పద్య నాటిక -- ముద్రి), 4. రాజజామాత. 5. సహజయానపంథీ, 6. నోణక భార్య, 7. వరపరీక్ష (ఈ నాలుగు గీతి నాటికలు), 8. వకుళమాల (గీతికా స్వగతము), 9. రత్నాకరము (గీతికాసంవాదము), 10. ఆవేదన (ఖండకావ్యము), 11. కవిప్రియ (పద్యనాటిక), 12. యక్షరాత్రి (గీతి నాటిక), 13. సాధకుడు (వాకోవాక్యము), 14. కవిరాజు (సర్గబంధము), 15. వ్యాకరణ దర్శన చరిత్ర (ఆంధ్రీకరణము ఈ రెండును రచనలో నున్నవి) 16. మహారాష్ట్ర జీవనప్రభాతము, 17. జీవనసంధ్య, 18. మాధవీ కంకణము, 19. రమాసుందరి, 20. కాంచనమాల, 21. కుంకుమ భరణి (అచ్చువడిన నవలలు) ఇత్యాదులు.
శ్రీకృష్ణలీలాతరంగిణి రచించిన శివనారాయణతీర్థులు పూర్వాశ్రమములో తల్లావజ్ఝుల వంశీయు లని ప్రసిద్ధి. రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడుగా రీవంశము వారికి నాలుగు వందల యకరముల మాగాణి బహుమానమిచ్చినారు. అది యిపుడు విచ్చిన్నమైపోయినదేమో, కాని నేటికిని కాజ గ్రామములో "తల్లావజ్ఝలవారి చెరువు" అని యున్నది. పెక్కు తరముల నుండి తల్లావజ్ఝలవారు సంగీత సాహిత్యములలో మంచి నిపుణత గాంచి వచ్చుచున్న----- .................... .......................... .................... ..................................
(పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు)
శ్రీశివశంకరశాస్త్రిగారి ప్రతిభ యీనాడు సాహిత్యలోకములో బ్రత్యక్షముగ గనుచున్నాము. ఈయన మంచి సంస్కృత పండితుడని వాడుక. వాడుకయేగాని రెడ్డిగమువైచుకొని శిష్యులకు బాఠప్రవచనము చేసినవాడు కాడు. ఆయన, అధమపక్షము 'మెట్రీక్యూలేషన్ ' పరీక్షలోనైన సముత్తీర్ణుడు కాకపోయి యుండడని కొందరి నమ్మకము. నమ్మకమే కాని, నిజమున కాయన యటులు కాలేదు. పరీక్షకు గూరుచుండి జామిట్రి ప్రశ్నపత్రము చూచుసరికి విరక్తి గలిగి, కాగితములపై బొమ్మలుగీసి యిచ్చివైచెనట. ఆ యుచితజ్ఞఉడు రేఖాగణితమునకు రేఖలతో సమాధాన మీయవలయు ననుకొన్నాడు కాబోలు ! శివశంకరశాస్త్రి గారికి సా ప్రాకృతములు, వంగము, మహారాష్ట్రము, హిందీ, మున్నగు వాజ్మయములతో జక్కని పరిజ్ఞానమున్నదట. గ్రీకు, లాటిన్, జర్మన్ సారస్వతములు సవిమర్శముగ జూచిరట. శాస్త్రిగారు మహాకవులని నేటి సాహిత్య ప్రపంచమున నొక ప్రతీతి. ఆలోచించినచో నచ్చుపడినంతలో నాయనవి మహాకావ్యములు లేవు, ఉపకావ్యములు, ఖండకావ్యములు, గీతినాటికలు, పద్యనాటికలు తప్ప తల్లావజ్ఝలవారు అమ్ంచి కథకులను --ములో బ్రథితి. వంగము నుండి హిందీ నుండి యనువాదములే హెచ్చు. " నీలకంఠం కథలు " మాత్రము చాల వ్యాప్తిలోనికి వచ్చినవి. శాస్త్రిగారికి సంగీతములో నుత్సాహమున్నది గాని, మధురముగా బద్యము చదువగ నేను వినలేదు. ఆయనకు శిల్ప చిత్రకళలలో నెనలేని --- వానిలో ప్రత్యేకమైన పరిజ్ఞానము కూడ సంపాదించిరి.
...................
.........................
........................
..................
..................
.....................
(పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు) సరిచేసి యొసగుట యొకటి-అనేక వాజ్మయములలో నచ్చుపడిన గ్రంథము లెల్ల జూచి, ఆయా సారస్వత రహస్యము లర్థము చేసికొని సంభాషణ సమయములో సాహిత్య సముద్రుడు వలె దోపింపజేసికొనుట రెండు-పద్యరచనలో, వచనరచనలో బత్రికా సంపాదకతలో గ్రొత్తదారు లేరిచూపుట మూడు- శివశంకరశాస్త్రిగారు ఏవంవిధ గుణత్రివేణీ సంగమ తీర్థము. ఈ తీర్థములో నవగాహించిన తెలుగు యువకు లెందరో !
శాస్త్రిగారు పండ్రెండవ యేటనే కవితకు శ్రీకారము చుట్టుకొనిరి. నోరి హనుచ్ఛాస్త్రిగారి కడ ఛందస్సు కూడ నేరిచిరట. ఛందస్సు కూడ నొక శాస్త్రముగాన, ఆ శాస్త్రీయ విషయము లేవో కొన్ని గురుముఖమున వినుటయే గాని పద్యము లల్లుట నేర్చుకొనగా వచ్చునది కాదు. అభ్యాసాగత మైనది యట్లే యుండును. మన శాస్త్రిగారికి గవితా గురువు ప్రతిభయే. వీరి కననేల ! సహజ కవుల కందరకు బ్రతిభయే గురుత్వము చేయును.
మెట్రిక్యులేషన్ వరకు జదివి శాస్త్రి గారంతతో బాఠశాల చదువు చాలించి, కంభంపాటి సీతారామ శాస్త్రిగారు, వేదాంతం శ్రీ రామశాస్త్రిగారల సన్నిధిని సంస్కృత సాహిత్య గ్రంథము లధ్యయనము చేసిరి. వేదాంతము లక్ష్మీపతి శాస్త్రిగారి యొద్ద వ్యాకరణము, శ్రీ జగద్గురు కల్యాణానంద భారతీ స్వాములతో వేదాంతము పాఠము చేసిరి. కురుగంటి శ్రీ రామశాస్త్రి గారి కడ నైయాయిక గ్రంథములు చదువుకొనిరి. ఆ తరువాత దర్శనములలో స్వయంకృషి. వినబడిన భాష, కనబడిన గ్రంథము చదువక విడువలేదు. వివిధ సారస్వతములలో సొగసులు కనుప తెలుగులో జొనుపు నేరుపు విరి కధికముగనున్నది. సాహితీసమితి కి సభాపతిత్వము నిర్వహించి యువకవుల నెందరనో ప్రోత్సహించెను. నవ్యసాహిత్యపరిష న్నిర్మాణ కర్మకారులలో బెద్ద భారము మోసినవారు శివశంకర శాస్త్రిగారు. సాహితి, సఖి, పత్రికలకు వీరు సంపాదకత సాగించి నవ్యసాహిత్య పత్రికలకు మెరవడిగ యొరవడి పెట్టినారు. ప్రతిభ కు సంపాదకవర్గములోని వారని జగమెరుగును. ఆఖ్యాయికా పరంపర, సాహితీ సమితి పరంపర, సరస్వతీ గ్రంథ మండలి, విశ్వజనీన గ్రంథావళి, ఆంధ్రప్రచారినీ గ్రంథమాలలకు బడిన శాస్త్రిగారి సంకలనముద్ర లొకవిదితమైనది. అదిగాక, శివశంకర శాస్త్రిగారి కచ్చువనులలో నసాధారణమైన తెలివియున్నది. ముద్రణ సౌందర్యము కొరవడిన గ్రంథమాయన ముట్టడు. ఆయన వ్రాత పుస్తకము ముద్రిత పుస్తకములవలె నంతరించుకొనును. అచ్చుతప్పులున్న గ్రంథము నాయన మెచ్చడు సరికదా, అది తెలుగువారి యసడ్డయని విసుగుకొనును. తాను సంపాదించిన పత్రికలకు బంపిన వ్యాసములకు సొంతముగా మరియొక ప్రతివ్రాసి మరి యచ్చున కిచ్చుచుండ నలవాటీయనలో నున్నది. రమణీయార్థము నెంత యారాధించునో, గ్రంథ బహిస్సౌందర్యమునంతగా నారాధించుక వినరులు శివశంకర శాస్త్రిగారు.
కవితతోపాటు శిల్పము- చిత్రకళ ఈ రెండు వీరిని వలపించిన కళలు. ప్రత్యేకించి యాకళలలో రెండు మూడేండ్లు పరిశ్రమించిరి. పాచ్య పాశ్చాత్య శిల్ప-చిత్రకళలలో వీరికి గల పరిచితి, ఖండాంతర వాసుల పరిచయమును జేకూర్చినవి. కాని, శాస్త్రిగారిది వేసిన శిల్పము, - చిత్రము నేవరయలేదనుట చిత్రము కాదు. ఆయననేమి! ఆయా కళా విజ్ఞాన సంబంధి గ్రంథము లెన్నో వాజ్మయములలో వారు చదివియుందు రనుటలో నాశ్చర్యము లేదు.
................ ....................... ..................... ............... ................ ...............
(పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు) మతము. యతిప్రాసములు, శబ్దాలంకారములు వసరి పారవేయ వలయునన్న యభిప్రాయము వీరికి లేదు. పద్యముల నడుమ వచనము నిరికించుటను శాస్త్రిగారు సహింపరు. అందులకే వీరివన్నియు బద్యనాటికలు, గీతినాటికలును. కావ్యాత్మరసమన్న వాద మనుసరింతురు. ఉపాసనలో శైవము, మతములో నద్వైతము వీరారాధింతులు. రాధాకృష్ణ భక్తి యనిన యాసక్తి మెండు. "పద్మావతీ చరణ చారణ చక్రవర్తి" రచనము నీ భక్తియే పురికొల్పియుండవచ్చును. శాస్త్రిగారికి బౌద్ధములో మంచి ప్రవేశ మున్నది.
1930-31 లోను, 1932 లోను రాజకీయ విషయకముగ సంచరించి కారాగార ప్రవేశము చేసిరి. అక్కడ యువకుల నెందరనో కవులుగ, నటకులుగ, కథకులుగ దిద్ది ప్రోత్సహించినారు. తెలుగులో నన్నయ - తిక్కన - శ్రీనాథులు వీరి ప్రేమకు స్థానమైన కవులు. భట్టుమూర్తి మీద, అంతకంటె వేయిరెట్టులు పోతనమిద వీరికి భక్తి హెచ్చు.
అభినవాంధ్రకవి నిర్మాణమునకు శాస్త్రిగా రొక యంత్రమని చెప్పుకొందురు. నాలుగు గేయములు గొలుకు కవి దగ్గరనుండి, మేలిమి కావ్యములు సంతరించు కవిదాక బుజ్జగించి చేరదీసి యోపికతో వారి రచనలు సరిచేసి, అవసరమైనచో దా నొకప్రతి వ్రాసి, ప్రచురణమున కుపాయములు సూచించి సహృదయత శాస్త్రిగారిలో ఘనముగ నున్నది. కృష్ణా గుంటూరు మండలములలో వీరి మూలమున బేరునకు వచ్చిన రచనలు బెక్కు రున్నారు. శాస్త్రిగారి నెవరోగాని "చాకిరేవు" అని పరిహాసము చేసిరట. దీని యంతరార్థము, "ఎందరో కవులు తమ రచన వస్త్రము లిక్కడ ఉదుకుకొని పోవుదు" రని - నవ్య సాహిత్య పరిషత్ప్రచురణములపై వీరిచేయి పడనిది లేదన వలయును.
శివశంకరశాస్త్రిగారు వంగభాషలో నుండి శ్రీ శరత్ చంద్ర చట్టోపాధ్యాయుని రచనములు తెలుగులోనికి దెచ్చిన వారిలో మొట్ట మొదటివా రయి యుందురు. ఇది సిద్ధాంతము కాక పోవచ్చును. సరస్వతీ గ్రంథమండలివారు వీరి "అరక్షణీయ" వెలువరించిరి. ఎందరో తరువాత దరువాత శరత్ చంద్రుని పూర్తిగా దెలుగు వానిగ జేసికొన్నారు. అన్య సారస్వతములలోని యంద మెరిగి యా రచనలు తెలుగులో బెట్టవలెనని ప్రోత్సాహము చేసినవారిలో శాస్త్రిగా రొకరనుటలో సంశయింప బనిలేదు. హిందీ నుండి, వంగము నుండి చాల రచనలు వీ రనువదించినవి ప్రచురణములై యున్నవి. శాస్త్రిగారి వచన రచన బహు - సుందరముగ నుండి సులభముగ నర్థమగు తీరున జాలువారును. పద్యరచనా సౌందర్యము వీరి కలములో నంతగా వెలయలే దని కొందర యభిప్రాయము. కాని, యఖండమైన వేదన నుండి వీరి కవిత ప్రాదుర్భవించినది. "హృధయేశ్వరి" యందులకు నిదర్శనము. ప్రణయ కవిత కీ కృతి యాకరము.
మన్మనమ్మున లీనమై మాటు వడిన
విమల కవితా ప్రవాహము నెగ్గలించు
నిన్ను వర్ణింప నెంచిన నిమిషమందు
నీవు నాకు సరస్వతీదేవి వమ్మ !
ఇది వారి విశ్వాసము. ప్రేయసి యీయన దృష్టిలో మహాదేవి. ఆమె నొక పవిత్ర దృష్టిలో సంభావించుట వారి తలపు. రాధా కృష్ణుల ప్రేమ సౌభాగ్యము శివశంకర శాస్త్రిగారికి మేలు బంతి.
నిన్ను ధ్యానించు కొలది నిర్నిద్ర మగుచు
ప్రమదమున జేరు మానస బంభరంబు
రాధికానాథు పాద నీరజ యుగమ్ము;
వింత గొల్పెడు నా ముక్తికాంతవమ్మ !
"తలచుచున్నాను నా ప్రియతమ వటంచు
ఎంచుచున్నాను నిన్ హృదయేశ్వరి గను
వలచుచున్నాను జీవితేశ్వరిగ నిన్ను
భావనము సేయుచుంటి నిన్ దేవిరీతి.
నీవు ప్రాణాధికవు నాకు నిశ్చయముగ
వాంచనీయ సుఖాధి దైవతమ వీవు
సాటిగానని నా సరస్వతివి నీవు
వాస్తవమ్ముగ భాగ్య దేవతవు నాకు.
నిన్ను బ్రేమించుచున్నాను నిశ్చయముగ
నీ యెడ జెలంగు నా ప్రేమ నిర్మలంబు
నిండు హృదయంబుతో నన్ను నీకే మున్ను
అర్పణము చేసికొంటి సహర్షముగను."
బిల్హణుని కథ పద్యనాటికగా వీరు సంతరించిరి. దాని పేరు కవిప్రియ. బహుళముగా బద్యనాటికా రచనమే శాస్త్రిగారి కిష్టము. సంభాషణము సర్వము ఛందోబంధితమై యుండుటచే గవిత్వ చారుత్వము కొంత కొరవడియుండుట సహజము. వీరి "కావ్యావళి" ప్రథమ భాగము ముద్రిత మైనది. భానుమతి, లోపాముద్ర, శిష్యురాలు ఇత్యాది శీర్షికలతో వీరేరుకొన్న ప్రతి చరిత్రయు బ్రాచీన సంస్కృతిని గురుతింప జేయునవి. రచన ప్రాబంధిక ధోరణీ ననాథము. "దివ్యలోచనాలు" అను ఖండకావ్యములోని యీ వృత్తములు చిత్తరంజకములు.
భగవద్రామానుజులు
పరమాకారణ జాయమాన కరుణాపాంగ ప్రసారంబునన్
భరితా జ్ఞాన దురంత సంతసమునన్ భంజించుచున్, విష్టవ
స్థిర సంరక్షన భార మూనిన మహాశ్రీరంగనాథా! భవ
చ్ఛరణాంబ్జంబుల కే నొనర్చెద నమస్కారంబు భక్తప్రియా!
అవలోకింపుము వత్స ! అల్లవె రమాహ్లాదానుసంధాన వై
భవముల్, ధిక్కృతభానుమండల రుచుల్, బ్రంహ్మాండసందీపక
చ్ఛవులున్, భక్తిభరప్రసన్నజనతా సంరక్షణ ప్రాభవో
త్సవముల్, రంగశాయాన దివ్యకరుణా సంఫుల్ల నేత్రాబ్జముల్.
ధనుర్దాసు
అహహా ! యెంతమనోహరంబులు త్వదీయప్రస్ఫుర న్నేత్రముల్,
మిహిరప్రస్ఫుట చండమండల సమున్మేష ప్రభల్ కల్గియుం
దుహినాంశుద్యుతి శీతలమ్ములయి సంతోషంబొసంగెన్; భవ
న్మహిమంబొప్పు మహాద్భుతమ్ముగను శ్రీమద్రంగధామప్రభో !
అవలోకింపగనైతి నేటి వర కాహాదుర్విపాకంబునన్
భువనత్రాణన భూరి శీతల కృపా పూర్ణ బ్రభావ స్ఫుర
ద్భవదక్షిద్వితయంబు! దేశికదయావ్రస్యంది వాజ్మాధురిన్
నవసౌభాగ్యముకల్గె నక్కజముగా నా కో జగన్నాయకా !
స్థిరతాత్పర్యముతోడ గంగొనినచో దేవా, భవన్నేత్రముల్
తిరుగన్నేర్చునె బుద్ధి యన్యనయనోద్రిక్త ప్రమోదంబునన్ !
పరమప్రీతిని భృంగ మానవసుధాపానాభిలాషన్ దళ
త్సరసీజంబుల వ్రాలుగాని యితరాక్ష్మాజంబులం జేరునే !