ఆంధ్ర రచయితలు/తంజనగరము తేవప్పెరుమాళ్లయ్య

వికీసోర్స్ నుండి

తంజనగరము తేవప్పెరుమాళ్లయ్య

1872 - 1921

తల్లి: శ్రీరంగమ్మ. తండ్రి: రంగమన్నారయ్య. నివాసము: చెన్నపురి. జననము: 1872. అంగీరస నామవత్సరము. అస్తమయము: 1921. రచనలు: 1. భగవద్గీత వ్యాఖ్య 2. వచన భాగవతము. 3. వచన రామాయణము 4. వచన భారతము 5. నన్నెచోడుడు (జీవిత విషయము) 6. సర్వదర్శన సంగ్రహము 7. కర్ణచరిత్రము (ఆముద్రి) 8. మను వసు చరిత్రాదులకు వ్యాఖ్యానములు, పీఠికలు ఇత్యాదికము.

తేవప్పెరుమాళ్ళయ్యగారికి దేవరాజసుధి యని పండితుల వ్యవహారము. ప్రధానముగా నీసుధీమణి పీఠికాకారుడుగాను, వచన రచనా విశారదుడుగాను బేరందెను. మదరాసులో నానందముద్రాలయమువారి యాదరణమున నీయన మృదువగు వచనములో భారత భాగవత రామాయణములు రచించెను. మను, వసు చరిత్రాది పూర్వకావ్యములకు వ్యాఖ్యలు గావించెను. నన్నె చోడుడు మున్నగు కవుల కాల నిర్ణయమును గూర్చిన వ్యాసములు "ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక" "భారతి" మొదలగువానిలో వెలువరించెను. రెండు భాషలయందును జక్కని చిక్కని చాటుకవిత కొంత సంతరించెను. శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యస్థానమున బండితుడై పదార్థవిచారము చేసెను. మొత్తము నలువదితొమ్మిదేండ్లు మాత్రము జీవించెను. సుకృతీగతాయుః.

ఈ దేవరాజసుధి పూర్వులు తంజనగరరాజాస్థానమున సంగీత విద్వాంసులుగ నుండిరి. వీరితాతగారు తేవప్పెరుమాళ్ళయ్య యన బడు వారు. ఆయన మంచి పాండితి గలిగి, వాగ్ధాటియుండి భక్తియోగమును గూర్చి యుపన్యాసము లిచ్చుచుండువారట. శతావధానము చేయగలరనియు వినికి. వీరికి దంజనగర రాజ పోషణము పసివడక చెన్నపట్టణము వచ్చివైచిరి. పట్టణమున బహుకాలము భగవద్విషయక ప్రవచనములతో గాలక్షేపము చేసిరి. ఇట్టి యీతాతగారిపేరు నిలబెట్టుటకు మన తేవప్పెరుమాళ్ళయ్యగారు పుట్టి, వారికంటె నూరురెట్టులు ధట్టుడై వెలసెను. మనదేవరాజసుధి పండితుడుగాని, పండితపుత్రుడు గాడు. ఇతనితండ్రి రంగమన్నారయ్యగారు వ్యాపారసరణిలో జేయి తిరిగిన వారు. ఆయన శతసంవత్సర దీర్ఘాయువునంది మొన్న 1921 లో బుత్ర శోకమనుభవించి, రెండేడులుండి మఱి మరణించెను.

మన తేవప్పెరుమాళ్ళయ్యకు దేవరాజసుధి యను పేరున్నటులు మన మెఱుగుదుము. చిన్నతనములో నీయనకు జిన్నయ్య యనికూడ వ్యావహారికనామ ముండెడిదట. శ్రీ పరవస్తు చిన్నయసూరిగారి శిష్యులును, విశ్వగుణాదర్శాంధ్రీకర్తలు నైన తేవప్పెరుమాళ్ళయ్యగారి కడ మన దేవరాజసుధి కావ్యనాటకాదులు, వ్యాకరణము పఠించెను. పదునాఱుసంవత్సరముల వయస్సు దాటకుండ గనే "మెట్రిక్యులేషన్" పరీక్ష నుత్తీర్ణుడై, ప్రవేశపరీక్షకు జదువుచుండగా, సంసారపు జిక్కులు పెక్కు తటస్థించి, యాచదువు నంతతో నాపివేసినవి. విస్థారమగు బధిరత్వముండిన కారణమున దొరతనమువారి యుద్యోగముల కానపడక, దేవరాజసుధి సాహుకారులదగ్గర నాశ్రయము సంపాదించుకొని కొన్నేండ్లు గడపెను. ఆసమయముననే యాంగ్లము, అఱవము చక్కగా గృషిచేసి, తెనుగెల్ల స్వయముగ జదివిచూచి, సంస్కృతములో శ్రద్ధమై సిద్దాంతకౌముది పఠించి, కొంతతర్కము, కొంచెము మీమాంస గురుముఖమున నధ్యయనించెను. ఆ సాహిత్యపు సాహసముతో "భగవద్గీత" తీసి విశేషార్ధ ప్రతిపాదకముగ నొక వ్యాఖ్య వ్రాసెను. ఆరచనయే యానందముద్రాలయము వారికి దేవరాజసుధికి జెలికారము గఱపెను. తదాదిగ నీ దేవరాజు ప్రాచీన కావ్యములు, శతకములు, భారత భాగవతాది పురాణములు పాఠ భేదములతో సరిచూచి సరస పాఠములెత్తి, వలసినవానికి లఘువ్యాఖ్యలు వ్రాయుచు దెలుగు విమర్శకుల కాదరణీయములగు భూమికలు వెలయించుచు, కవి జీవితములు ప్రమాణమాన్యములుగా బ్రకటించుచు నానందముద్రాలయము మూలమున దెలుగుబాసకు వాజ్మయపువిందు లిచ్చెను. చిన్నయసూరి వచనరచన నొరవడిగా నుంచుకొని, దానికంటె నొకమెట్టు దిగువనుండు సులభభాషలో సంపూర్ణముగా రామాయణ భాగవతములు హృద్యగద్యములో వ్రాసి వెలువరింప జేసెను. వచనభారతము కొన్నిపర్వములు మాత్రమైనవి. మన దేవరాజసుధి వాజ్మయసేవా సౌధమునకు ఆనందముద్రాలయమువా రాధార స్తంభాయమానులు.

ఈయన చివరిదశలో శ్రీసూర్యరాయాంధ్రనిఘంటు కార్యవ్యవహర్తగ బనిచేసి, తన్నిఘంటువునకు బహు గ్రంధపరిశీలనము గావించి పదపదార్థము లెత్తియిచ్చెను. పాండితిని మించిన వినయగరిమ కలవారీయన.

                   -----------------------