ఆంధ్ర రచయితలు/జయంతి రామయ్య

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జయంతి రామయ్య

1860 - 1941

వెలనాటి బ్రాహ్మణుడు. కౌశికగోత్రుడు. కృష్ణయజుర్వేది. ఆపస్తంబ సూత్రుడు. తండ్రి: రామయ్య. తల్లి: సోమమ్మ. జననము: 18-7-1860 సం|| రౌద్రినామ సంవత్సరమున నాషాఢ బహుళ అమావాస్య సూర్యోదయకాలము. నిధనము: 9-2-1941. అభిజనము: అమలాపురము తాలుకా ముక్తీశ్వరము. మృతునొందు కాలము నాటికి వీరి వయస్సు 81 సంవత్సరములు. విరచిత గ్రంథములు: 1. ముక్తీశ్వర శతకము. 2. ఉత్తరరామచరితము. 3. ఆంధ్రచంపూ రామాయనము 4. అమరుకము. 5. ఆంధ్రవాజ్మయ వికాసవైఖరి. 6. శాసనపద్యమంజరి (2 భాగములు) 7. బాలరామాయణము. 8. Defence of Literaary Telugu. 9. Dravidian Lexicography- మున్నగునవి. దేశచరిత్ర స్వరూప ప్రయోజనములు - రాజరాజు, నందంపూడి శాసనము-ఆంధ్ర నిఘంటు నిర్మాణపద్ధతి- బమ్మెర పోతరాజు నివాసస్థానము- ఉత్తరరామచరిత నాటకరస విచారము మొదలగు విషయములపై ఆంధ్రసాహిత్య పరిషత్పత్రికలో బ్రకటింపబడిన వ్యాసముల మొత్తము 50. 1. The Southern School of Telugu Literature. 2. Krishnaraya మొదలగు వ్యాసములు ఆంధ్రేతిహాస పరిశొధన మండలివారి పత్రికలో బ్రకటింపబడినవి. 5. 'ఎపిగ్రాఫికా ఇండికా ' లో వెలువరింపబడిన వ్యాసములు 8. ఉపోద్ఘాతములు వ్రాసిన గ్రంథములు: రాయవాచకము, సర్వేశ్వరశతకము, కవిజనాశ్రయము, విప్రనారాయణ చరితము, మన్నారుదాసవిలాసము మొదలగునవి.

ఆంధ్రభాషోద్ధరణాభిలాషులగు కొందఱు ప్రభువులచేతను, ఆంధ్రభాషాప్రవర్ధకులగు కొందఱు ప్రముఖులచేతను 1911 లో ఆంధ్రసాహిత్యపరిషత్తు స్థాపింపబడినది.తదధ్యక్షులగు జయంతి రామయ్యపంతులు గారు నాటినుండియు ంవిచ్ఛిన్నముగ నాంధ్రిసేవ చేయుచున్నారని తలంపవలయును. 'సాహిత్యపరిష' దుత్పత్తికి బూర్వము పేర్కొన దగిన--భాషాసంస్థలు రెండు మూడు మాత్రమే తెలుగున గలవు. పరిషత్తు సేవాఫలిత మంతయు రామయ్యపంతులుగారిచేతను, పంతులుగారి గౌరవసేవయంతయు బరిషత్తుచేతను బెక్కువత్సరము లనుభవింప బడుచు వచ్చినది. ఆంధ్రసాహిత్యపరిషత్తును కొమార్తెగాను, సూర్యరాయాంధ్ర నిఘంటువును గుమారునిగాను భావించుకొని పంతులుగారు తమయనపత్యతావ్యథను బావుకొని మనుగడ సాగించినారు.

రామయ్యపంతులుగారు బి.యె. పట్టభద్రులు. చదువుచున్న సమయమున వీరిబుద్ధివిశేషమును వెలిబుచ్చు విశేషమొకటి వారి పెద్దలిట్లు చెప్పుకొందురు. బ్రహ్మసమాజమత ప్రబోధకుడగు పండిత శివనాథశాస్త్రి మతప్రచారమునకు 1881 లో రాజమహేంద్రవరము వచ్చి యాంగ్లేయభాషలో గంభీరోపన్యాసము గావించెనట. ఆకాలమున క్లుప్తలేఖనము లేకుండుటచే నెట్టియుపన్యాసములైన నచ్చులోనికి వచ్చుట కవకాశముండెడిది కాదు. మనపంతులుగా రప్పుడు రూళ్ల పెనిసిలు కాగితములు పుచ్చుకొని తూచాలు తప్పకుండ శివనాథశాస్త్రిగారి యుపన్యాసము లన్నియు వ్రాసి చెన్నపురిలోని యాంగ్ల పత్రికలకు బంపిరట. శివనాథశాస్త్రిగారు తమ యుపన్యాసములు యథాతథముగా నాపత్రికలలో వెలువరింపబడుట గని యబ్బురపడి యివి వ్రాసిన వారెవరని తెలిసికొన - బి. యె. తరగతి విద్యార్థి జయంతి రామయ్య వ్రాసె నని తేలినది. అప్పుడెల్లరు "ఈ చికిలికన్నుల చిన్నవాడేనా గంగాప్రవాహము బోలు నీమహోపన్యాసము వ్రాసినది" అని యాశ్చర్యచకితు లైరట. పంతులుగారు చిన్ననాట గన్నులు చికిలించెడివారని యెఱిగినవారు చెప్పుచుందురు.

రామయ్యపంతులుగారు 1886 లో బి.ఎల్. పరీక్షలో నుత్తీర్ణతనందిరి. ఆనాటి విచిత్ర మొకటి వీరినిగూర్చి చిలకమర్తి లక్ష్మీనరసింహముగారు చిఱునవ్వునవ్వుకొనుచు నిట్లుచెప్పుచుందురు. "రామయ్య పంతులుగారు చదువునాటికి మదరాసు పోవుటకు రైలుత్రోవలేదు. పొగయోడయే యాధారము. రామయ్యగారు పొగయోడలో బ్రయాణము చేయుచుండ నొకసారి యోడమీదనుండి జారి సముద్రములో బడిపోయిరి. ఓడకప్తాను చూచి తొందరగ వచ్చి పడిపోయిన పంతులుగారి జుట్టుపట్టుకొని మునిగి తేలుచ్చున్న సమయమున బయటికి లాగి బ్రతికించెనట. ఆయనజుట్టే ప్రాణభిక్ష పెట్టినది" పరిశోధకపండితశిరోమణి కాదగిన యిట్టి మహాశయుడు జలగండము పాలగు టెట్లు సమకూడును ?

పంతులుగారు ప్రథమమున మాధ్యమికపాఠశాలలో నధ్యాపకులు. తరువాత మండలాధికారి (జిల్లా మేజస్ట్రేటు) కచేరీలో లేఖకులు. అటుపై నచ్చటనే ప్రధానలేఖకులు. అనంతరము సహాయ మండలాధికారి (డిప్యూటి కలెక్టరు), తదనంతరము రాష్ట్రన్యాయాధికారి (ప్రెసిడెన్సీ మేజస్ట్రేటు) పిమ్మట శాసనసభాసభ్యుడు (ఎం.ఎల్.ఎ.)

క్రమముగా నుపకారవేతనము పొంది కళాప్రపూర్ణుడై సలక్షణాంధ్ర భాషాప్రతిష్ఠాపకు డని యశస్సు గాంచెను. రామయ్యపంతులుగారు తెఱపిలేని రాజకీయోద్యోగములకు దమ నవయౌవనమంతయు దారవోసిన పట్టభద్రులు. ఏయుద్యోగమున నున్నను వీరికి సాహిత్యోద్యోగము మాత్రము సన్నగిల్లలేదు. పగలెల్ల నుద్యోగధర్మము నిర్వహించుకొని రాత్రులు వీరు నిరంతరము సాహిత్యకృషి చేయుచుండెడి వారు. ఉద్యోగధర్మమున నేగ్రామమున కేగినను నచటి పండితులను గవులను సందర్శించి వారితో నేవో భాషావ్యాసంగములు సేయుచుండుట వీరికలవాటు. వీరిభాషాభిలాష క్రమముగా బెరిగినది. ఉద్యోగము నిర్వహించు నోపికయు దఱిగినది. ముక్తీశ్వరమున గాలు మీద గాలు వైచుకొని గ్రంథసమీక్షకు, భాషాతత్త్వ పర్యవేక్షణమునకు గడగి యనేకశాసనములు పరిశోధించి యనేకరహస్యములు వెలికిదీసి వెలువరించిన మహాత్ముడీయన. రామయ్యపంతులుగారి జీవితకృతిలో 'ఆంధ్ర సాహిత్యపరిషత్తు' రసవదధ్యాయముగాన నీసందర్భమున దానిని స్మరించుకొనుట సముచితము.

పరిషత్తున కాదిలో నాంధ్రసంస్థానము లెన్నియో యార్థిక సాహాయ్యమొనరించినవి. పీఠికాపుర ప్రభువులు, బొబ్బిలిమహారాజులు, వేంకటగిరి సంస్థానాధిపతులు, ఉయ్యూరు జమీందారులు, తుని రాణిగారు మున్నగు వార లెందఱో చేయూత నిచ్చిరి. దానితో నాంధ్రసాహిత్యపరిషత్తు లేచినది. ఆంధ్రరచయిత లెల్లరు దాని యుత్పత్తికి గర్వించిరి. ఆంధ్రదేశమునందలి తాళపత్త్ర గ్రంథములు, ప్రాచీన శాసనములు సంపాదించి సంశోధించి ముద్రించుట కీపరిషత్తు గొప్పపనిచేసినది. నేటికిని జేయుచున్నది. మొట్టమొదట నీపరిషత్కార్య నిర్వాహకసంఘములో బేరుమోసినపండితు లెందఱో ప్రవేశించిరి. ఆకారణమున నీసంస్థ విశేష విఖ్యాతి గడించుకొనినది. గ్రాంథికాంధ్రమునకు బరిషత్తు చేసినసేవ యపారము. అఖండము.

రామయ్యపంతులుగారు మొక్కవోని గ్రాంథి కాంధ్రవాదులు. గిడుగు రామమూర్తి పంతులుగారికి వీరికి జరిగిన వాద ప్రతివాదములు జగమెఱిగినవే. రామయ్యపంతులుగారి గ్రాంథికవాద సారాంశమిది. "దేశమభివృద్ధి నొందినకొలది జనుల యాచారములు, భాషలు మొదలగు వానిలోనున్న యంతర్భేదములు నశించి క్రమముగా నవి యేకారమును బొందుట లోకమర్యాదయైయున్నది. దీనికి వ్యతిరేకముగా గ్రామ్యవాదులు చిరకాల సంప్రాప్తమైన యేకాకార గ్రాంథికాంధ్రభాషను రూపుమాప యత్నించుచున్నారు. వీరియత్నము కొనసాగినచో నాంధ్రవాజ్మయము భావికాలపు దెలుగువారికి దురవగాహమై పతనము లేక నశించి పోవలసివచ్చునుగదా ? లోకహితార్థము మహాకవు లించుమించుగ వేయిసంవత్సరములనుండి సంపాదించి మనపరముచేసిన సర్వాంగ సుందర వాజ్మయ భాగ్యమును మన మనుభవింపలేక పాడుచేసుకొన్నవార మగుదుము. తాను సంపాదించుట లేదుగదా పెద్దలు సంపాదించి యిచ్చిన దానినైనను నిలుపుకొనలేక చెడగొట్టుకొన్న వాడెట్టి ప్రజ్ఞాశాలియో యూహింపుడు. పెద్దలు కట్టిన దివ్యభవనమును బడగొట్టుకున్న పిమ్మట నిలువనీడ యెద్ది ? ఎద్దియో యొకకొంప కట్టుకొందమందురా ? దానికి సాధనసామగ్రియేది ? అదియెన్నటికి గొనసాగును ? ఇకముందు గ్రామ్యకవులు గ్రంథములు రచింపవలసినది గ్రామ్యభాషయందేకదా ? ఇదిబహుముఖములుగా నున్నది. అందేభాషలో రచింతురు ? గోదావరీ కృష్ణా మండలములలో విద్యాధికులు వాడుచుండు సంభాషణభాషయందట. ఆభాష యేకాకారముగ నున్నదా ? ఆభాషలోనున్న గ్రంథము లితరమండలములలో నున్న తెనుగువారికి సులభముగా నర్థమగునా ? గ్రాంథికభాషను బోగొట్టితమకర్థముగాని గ్రామ్యభాషనేర్చుకొమ్మని బలవంతపెట్టుట వీరికి ముల్లుదీసికొఱ్ఱుకొట్టినట్లగును గదా ? ఈవృథా ప్రయత్న మేల ? వ్యావహారిక భాష సుగమమను గ్రామ్యవాదులలో నెంతమంది చంద్ర శేఖరశతకము చదివి యన్వయింపగలరో? భాషీయదండకమను చిన్న పొత్తము నెంతమంది యర్థముచేసికొన గలరో? అధికసంఖ్యాకులకు సులభముగా దెలియుటే ప్రయోజనమైనచో విద్యాధికుల వాడుకభాషయేల? విద్యావిహీనులైన ప్రాకృతజనుల భాష యేలకూడదు? ఏభాషను గ్రాంథికభాషగా గ్రహించినను గాలక్రమమున వానిరూపములు స్థిరపడి యిప్పటిగ్రాంథిక భాషయందుగల వన్న దోషము లన్నియు దానికిని బుట్టునుగదా? అట్టిచో నీనిరర్థకప్రయత్న మేల?

"ఆధునికాంధ్రవాజ్మయవికాసవైఖరి."

ఇది యటుంచి పంతులుగారి శాసన పరిశోధనశక్తి ముచ్చటించు కొందము. వీరు 1200 శాసనములవఱకు బరిశోధించి తత్తద్విశేష ములు వెలిబుచ్చిరి. ఆశాసనములలో 400 శాసనము లాంధ్రవిశ్వవిద్యా పీఠమునకు బ్రచురణార్థమొసగిరి. 'ఇండియా గవర్న మెంటు ' వారు శ్రీపంతులుగారి శాసనపరిశీలన ప్రతిభ నెఱిగి యాంధ్రదేశమునకు సంబంధించిన 800 శాసనములు పరిష్కరించుటకు వీరి కొసగి యుండిరి. వాని నన్నిటిని సంశోధించి పీఠికలు, లఘువ్యాఖ్యలు వ్రాసి పంతులుగారు ప్రభుత్వమునకు బంపిరి. అవి ముద్రితములగుట యాంధ్రులకుపకారము. వీరు పరిశోధనము గావించిన శాసనములలో 'తొత్తరమూడిశాసనము' తొట్టతొలిది. "యద్ధమల్లుని బెజవాడ శాసనము" ముఖ్యము. ఈశాసనపఠనమున వీరగపఱిచిన ప్రతిభోన్నతికి ప్రభుత్వము ప్రశంసించినది.

రామయ్యపంతులుగారు భాషాపోషకులుగాను, పరిశోధనపండితులుగాను గీర్తింపబడవలసినవారే కాని కవులుగా బేర్కొనదగినవారు కారని కొందఱయుద్దేశము. కాని వీరు రచించిన పద్యకావ్యములును లేకపోలేదు. 'అమరుకము' ననువదించిరి. ఈ యుదాత్తకృతికన్యకను యతిలోకసుందరాకారున కర్పించి ధన్యులైరి. "తెలుగుననె పుట్టె నీకృతి తొలుత ననెడి భావమాత్మ దోచెడుభంగి జెలగి" నీశృంగార కావ్యమనువదించిరి. అమరుకమునకుగల యాంధ్రానువాదములలో మండపాక పార్వతీశ్వర శాస్త్రిగారి తరువాత వీరిదే సరసముగ నున్నది. ఈపద్యము లెంత హృద్యమగు శైలిలో నడచినవో చూడుడు.

అలకంబుల్ చెదరంగ గుండలయుగం బల్లాడ లే జెమ్మటం

దిలకంబించుకజాఱ గన్ను గవయెంతే దాంతమై యొప్పగా

జలజాతాంబక కేళి సల్పెడు సరోజాతాక్షి నెమ్మోము ని

చ్చలుమిమ్ముంగృప బ్రోచెడున్ హరిహరస్రష్టాదులిం కేటికిన్

పొగరుంగుబ్బలు పొట్టివై పులకలం బూనంగ నే నెంతయున్

బిగికౌగింటను గూర్ప జీర నడుము న్వేవీడి జాఱంగ దా

ళగ లేనింకను మానుమానుమని బల్ దైన్యంబుగా బల్కునీ

చిగురుంబోడికిమూర్ఛయో నిదురొకో చిత్తమ్మునం జేరెనో ? "పలువురింతకు బూర్వమే తెలుగు చేసినట్టిదీనిని మరలజేయంగనేల, యనిన నయ్యవి కావ్యంబు గుణగుణంబు, తప్పె యగుగాని యరయ నాతప్పుగాదు." అనిచెప్పుకొని భవభూతి యుత్తరరామ చరితము నాంధ్రీకరించిరి. ఉన్న వానిలో నుత్తమమనుటకు వీలులేదు గాని వీరి యాంధ్రీకృతి చక్కగనున్నది. భాష బహుమృదువుగ నున్నది. సమాసములగడబిడ లేదు. మచ్చున కందలిపద్యమొకటి.


ఎండం బుల్గులు గూండ్లలోనొదిగి యెంతే స్రుక్కికూజింప గా మెండై కాకులుక్రిందనీడ బురువుల్ మేయంగ మిట్టాడగా గండూతిం గిరులెల్ల దమ్ము నొరయంగా రాలు పుష్పాళిచే నండం గల్గినభూరుహంబు లిదిగో యర్చించు గోదావరిన్.


మఱియొక ముఖ్యవిషయము: ఆంధ్రసాహిత్య పరిషత్పక్షమున 'శ్రీ సూర్యరాయాంధ్రనిఘంటు' వనుపేర నొకమహాకోశము రచింప బడుచున్న దని తెలుగుదేశ మెఱుగును. కొందఱు ప్రసిద్ధాంధ్రపండితుల సాహాయ్యమున శ్రీ రామయ్యపంతులుగా రీనిఘంటువునకు సూత్రపాతము వేసి రెండుసంపుటములవఱకు బ్రకటించిరి. ఈనిఘంటు కృతిభర్తలు శ్రీపీఠికాపురాధీశ్వలు శ్రీ రావు వేంకటకుమార మహీపతి సూర్యరావు బహద్దరువారు. శ్రీ మహారాజవా రీకృతికై దగ్గఱగ రెండులక్షలు వ్యయించిరి. శ్రీ వారి యౌదరాతిశయమువను, పంతులుగారి సంకల్పబలమునను నీ బృహత్కోశము పూర్తియయి యాంధ్రి నలంకరించు గాక!

రామయ్యపంతులుగారు ధన్యులు. వీరిపేరు నిఘంటువుతో పాటు సుస్థిరస్థాయి. గ్రాంథిఠాంధ్రీభవనమునకు నాలుగే యాధారస్తంభములు. ఆంధ్రసాహిత్య పరిషత్తు. శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు. పీఠికాపురాధీశ్వరులు. జయంతి రామయ్యపంతులు.

పంతులుగారు "ఆధునికాంధ్రవాజ్మయ వికాస వైఖరి" యను గ్రంథము వెలువఱిచిరి. నూతనాంధ్ర వాజ్మయ మెట్లు పరిణమించి నదియు కక్కగ నిందువివరించిరి. ఇది యుపయోగకరమగు కూర్పు. 1937 లో ఆంధ్రేతిహాస పరిశోధకమండలి పంతులుగారికి 75 వ జన్మదినోత్సవము గావించి యాంగ్లములో నభినందన సంపుటము ప్రకటించినది. ఆంధ్రవిశ్వవిద్యాలయము వీరికి కళాప్రపూర్ణబిరుద మొసగి సన్మానించినది. రామయ్యపంతులుగారిది ధన్యజీవితము. సంపూర్ణ విద్యాభ్యాసము గావించిరి. మహోన్నతపదవుల నాక్రమించిరి. దీర్ఘాయుర్భాగ్యము బడసిరి. నంతతహరినామస్మరణము గావించిరి. గొప్పకీర్తిప్రతిష్టలు సంపాదించిరి. అనాయాసమరణము, అదైన్యజీవనము చేకుఱిన మహాశయు డీయన.

ఈయన విశిష్టతను గుఱించి అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి 'చాటుధారాచమత్కారసార' గ్రంథముననిటు లుపశ్లోకించెను.

శ్లో. జయంతిరామ కీర్తిస్తే సకలాశానువర్తినీ సజాత్వసి రజోయుక్తా ప్రసూతే-ర్థి సుతాంబహున్.

శ్లో. శ్రీరామస్య గుణాస్స నామకలనాద్యస్మిన్ జయంతిశ్రితా యజ్జిహ్వాంచల రంగనాట్యలలనా హౌణీలద్రామిడీ గైర్వాణీ ఘనవైకృత ప్రభృతయో భాషా జయంత్యన్వయ శ్రీరామార్యసుత స్సరామయసిధీర్లక్ష్యా చిరంజీవతు!

శ్లో. యస్యాజ్ఞా నరపాలఫాల ఫలకాగ్రాంచన్మణీ పట్టికా తాదృ "గ్యాపిలు" నామహూణనృపతే స్సమ్మానసంధానితాం డైష్టీం, కాల్కటరీం పహన్ భువి జయంత్యన్వయ్య పేరార్యస త్పౌత్ర: కౌశికగోత్రజో విజయతే శ్రీరామయార్యాగ్రణీ.

శ్లో. జయంతి రామార్య మణేర్వచాంసి జయంతి రామార్య లసద్వచాంసి జయంతి రామార్య మణేర్యశాంసి జయంతి రామార్యరిస న్మహాంసి

             ___________