Jump to content

ఆంధ్ర రచయితలు/ఉమర్ అలీషా కవి

వికీసోర్స్ నుండి

ఉమర్ అలీషా కవి

1885 - 1945

ఇస్లాం మతస్థులు. తండ్రి: మొహియద్దీన్. నివాసము: పిఠాపురము. పుట్టుక: 1885 సం. నిర్యాణము: 23 జనవరి 1945 సం|| గ్రంథములు: పద్మావతి, మణిమాల, స్వర్గమాత, విషాదసౌందర్యము, మదాలస, బ్రహ్మవిద్యావిలాసము, శాంత, చంద్రగుప్త, విచిత్ర బిల్హణీయము, దానవవధ, సూఫీ వేదాంతదర్శము, ఇలాజుల్ గుల్భా, ముసద్దాస్ ఆలి, ఉరుపత్తూరు చక్రవర్తి, శ్రీమద్వాల్మీకి రామాయణము, మున్నగునవి.

అలీషాకవి మాతృభాష ఉరుదు. మతము ఇస్లాము. ఇట్టివాడు తెలుగుబాసలో దిట్టమైన సాహిత్యము కలిగించుకొని కవిత్వము గట్టి పేరు సంపాదించుట మెచ్చుకోదగిన సంగతి. ఈయన తెనుగులో నొకటి రెండు పుస్తకములు కాదు, ఏబది గ్రంథములవఱకు సంతరించి రనగా నతిశయోక్తముకాదు. కవితా ధోరణియా సులభరమణీయమైనది. భావనావేశము సరేసరి. గ్రంథరచనా విషయ మటులుంచి, యీయన తెనుగులో నుపన్యసించుట విన్న వారున్నచో నడుగవచ్చును అచ్ఛమైన మధువాహిని యోడిగిలునటులుండెడిది. భాషలో నిర్దుష్టత - పలుకుబడిలో గ్రొత్తబెడగు, ధారాళత వీరియుపన్యాసమునకు మెఱుగులు తెచ్చినవి. మాటనేరుపు, వ్రాతతీరుపు సరితూకముగా నలవడిన యీ కవి ధన్యుడు. తెలుగుబాస కడుపున బుట్టిపెరిగినవారికే దిక్కు లేదు. ఈయన యంతసొగసుగా గవిత కట్టెను! అలీషాకవి తండ్రి అరబ్బీ పారశీక సంస్కృతములు చదువుకొనెను. ఒక ఆధ్యాత్మిక విద్యాపీఠమునకు వీరి కుటుంబము వారిది యాచార్యత్వము. తండ్రి సాహచర్యమునను, మఱికొందఱు గురువుల సేవ వలనను మన ప్రకృత కవి అరబ్బీ పారశీకములు, సంస్కృతాంధ్రములు, ఆంగ్లము తగిన తీరున జదువుకొనెను. ఈ చదువునకు సహజమైన కవితాధోరణి తోడు. పదునాఱవ యేటనే కవిత్వమునకు శ్రీకారము చుట్టుకొనెను. పదునెన్మిదవయేట 'మణిమాల' యనునాటకము వ్రాసెను. అది మొదలు క్రమముగా బహు గ్రంథరచన. దేశమును భాషను సమప్రతిపత్తితో సేవించుకొనుచున్న వీరిని జాలమంది పిలిచి యుద్యోగము నిత్తుమని యడగిరి. అల్పములైన పనుల కిష్టపడక 1934 సం. లో వీరు అఖిలభారత శాసనసభకు సభ్యులై యామరణ మాయుద్యోగమే నిర్వహించిరి. 1936 సం.లో, International Academy Of America ఉమర్ అలీషాకవికి Doctor Of Literature బిరుదమునిచ్చి మెచ్చినది. 'నూఫీవేదాంత దర్శము' అనుపద్యకావ్యము మొదల నీకవి స్వీయగాథ కొన్నిపద్యములలో హృద్యముగా వర్ణించుకొనెను. అవి మన కవసర పడును.


క. ఆ మొహియద్దీన్ బాద్షా

నామ మహాయోగి కగ్రనందనుడను నా

నా మహితాగమ హిత వి

ద్యామతి 'ఉమ్రాలిషా' మహాకవి నేనున్.


సీ. రచియించినాడ విభ్రాజితదివ్య ప్ర

బంధముల్ పది కావ్య బంధములుగ

వ్రాసినాడను కల్పనాసక్తమతి పది

నాటకంబులను గర్ణాట ఫక్కి

కూర్చినాడను గళా కోవిదుల్ కొనియాడ

నవలలు పది నవ నవల లనగ

తెలిగించినాడ నుద్దీపితాఖండ పా

రసి కావ్యములు పదిరసికు లలర


గీ. రసము పెంపార నవధాన క్రమములందు

నాశువులయందు పాటలయందు కవిత

చెప్పినాడ నుపన్యాససీమ లెక్కి

యవని "ఉమ్రాలిషా కవి" యనగ నేను. పుట:AndhraRachaitaluVol1.djvu/413 పుట:AndhraRachaitaluVol1.djvu/414 ఉ. రాజులజూచితిన్ సుకవిరాజుల నోర్చితి బేరుమ్రోయ, రా

రాజుల యోలగంబున విరాజిత పండిత సత్కవీంద్ర వి

భ్రాజిత మౌలవీబిరుద పట్టములందితి యూనివర్సిటిన్

దేజముమీఱ సభ్యుడయితిన్ మతబోధకుడైతి గ్రమ్మఱన్.


ఉ. వ్యాసములున్ విమర్శనలు భావకవిత్వ రసైక చారు వి

న్యాసములున్ మతాంతర మహాపరివర్తన తత్త్వ రూపకో

పాననముల్ పురాణములు వ్రాసితి భారతభూమి నే నుప

న్యాసము లిచ్చుచున్ దిరిగినాడను 'ఉమ్రలిషా' కవీంద్రుడన్.


సీ. సాధించితిని యోగసాధనంబులు హిమా

గమ మెక్కి మతిని చక్కాడి యాడి

బోధించితిని జ్ఞాన సాధన క్రమములు

చెవినిల్లుగా జేసి చెప్పి చెప్పి

సవరించితిని పెద్ద సారస్వతంబును

శబ్ద శాస్త్రంబులు చదివిచదివి

చూపించితిని రాజ్యలోపంబు లాంగ్లప్ర

భుత్వంబు ముంగర మోపిమోపి


గీ. ఇప్పుడప్పుడె నలువదియేండ్లపైన

దాటిపోయెను వయసు నీనాటికైన

శాంతి గలుగదు నీకళాధ్వాంతమందు

జీవితము తెన్ను నుడిబోవు నావబోలు.


ఉ. ఏను హిమాలయంబుపయి నెక్కి తపస్యుల జూచి వారి వి

న్నాణములన్ గ్రహించి విజనంబగుచోట రచించినాడ నా

నా నవకావ్య మార్గముల నంతముగా హృదయాంతరంగ వి

జ్ఞానము విశ్వరూపముగ గన్పడు నట్లు దృశంబు మార్చుచున్.

                 _______________________