ఆంధ్ర రచయితలు/అల్లంరాజు రంగశాయి కవి

వికీసోర్స్ నుండి

అల్లంరాజు రంగశాయి కవి

1860 - 1936

ఆరామ ద్రావిడ శాఖీయ బ్రాహ్మణులు. హరితసగోత్రులు. ఆపస్తంబసూత్రులు. తల్లి: చిన్నమాంబ. తండ్రి సుబ్రహ్మణ్యకవి. జన్మస్థానము: పీఠికాపుర పరిసరమున నున్న చేబ్రోలు. జననము: 1860- రౌద్రి సంవత్సర నిజాశ్వయుజ శుక్లతృతీయా సౌమ్యవాసరము. నిర్యాణము: 1936. యువ చైత్రబహుళదశమి. గ్రంథములు: 1. శ్రీమదాంధ్రచంపూభారతము (ఆంధ్రీకరణము. 1913 ముద్రి) 2. రామాయణచంపువు (సంపూర్ణముగ ముద్రణమునకు రాలేదు) 3. రఘురామ శతకము. 4. పరమాత్మ శతకము 5. సర్వేశ్వర శతకము. 6. గోవింద శతకము. 7. లక్ష్మీ శతకము. 8. మాధవ శతకము. 9. కుక్కుటలింగ శతకము. 10. గోపాలస్వామి శతకము. 11. మల్లికార్జున శతకము. సంస్కృత గ్రంథములు: 1. దైవస్తోత్రరత్నావళి. 2. నారాయణానందలహరి. 3. కవిమానసరంజని.

పండితుని పుత్రుడు పండితుడగు సంప్రదాయములే దనుకొందురు. రంగశాయికవిగారి తండ్రి సుబ్రహ్మణ్యకవి. ఆయన భద్రాపరిణయాది మహాప్రబంధ ప్రణేత. అతనితండ్రికవి. అతనితండ్రికవి. వీరిచరిత్రములన్నియు 'ఆంధ్రకవులచరిత్ర' గ్రంథము నలకరించియున్నవి. వీరివంశమున దరమున కొకకవి చొప్పున వచ్చుచున్నారు.

రంగశాయికవి సంస్కృతాంధ్రములు తలస్పర్శిగ జదివెను. కవితయీయనకు నిసర్గముగ జనించినది. ఈయన ధారణాబలము, మేధాపటుత్వము శతవధానాష్టావధానములను నిరాఘాటముగ జేయించినది. అపారమైన శ్రీనారాయణభక్తి రంగశాయికవిగారిచే నరాంకితము గావింపనీయలేదు. కవులలో నిట్టి సాత్త్వికమూర్తి తఱచు కనుపట్టడని పెక్కురువలన వినుకలి. అందఱచేతను 'చాదస్తపుబ్రాహ్మణు' డనిపించు కోబడిన కర్మిష్ఠి. ఈయన సత్యవరతగొప్పది. ఈయన జయపురము, నూజవీడు మున్నగు సంస్థానములలో సత్కారములొంది, గోడే గజపతిరావు ప్రభునొద్ద ముప్పది సంవత్సరములుండి బహుగౌరవములు పడసెను. బంధకవితయందును, జిత్రకవితయందును, సమస్యాపూరణ మందును, అవధానములందును రంగళాయికవి మంచినేర్పు గలవాడు. శ్రీ సూర్యరాయనిఘంటు కార్యస్థానమున గొంతకాలము పండితపదవిలో నుండెను. అంతే, యాయన గావించిన భృతకవృత్తి మఱి, తదితరమైన యుద్యోగము లేవియు జేసియెఱుగడు. ఉన్న దానితో సరిపెట్టుకొని, క్లుప్తముగ సంసారము దిద్దుకొనుచు, నయినవానిని కానివానిని యాచింపకుండ మర్యాదగ గాలక్షేపముచేసిన సంతుష్టద్విజుడాయన. కృతులు నరుల కీయలేదు. శతకములతో భగవద్ధ్యానము చేసికొని తరించెను. సంస్కృతాంధ్రములలో మొత్తమాయన పది పండ్రెండుశతకములు వ్రాసికొనెను.


అనంతభట్టు రచించిన 'భారతిచంపువు' సొంపుగా దెలిగించెను.భోజరాజు 'రామాయణచంపువు' కూడ దెలిగింప మొదలిడి బాలకాండముదాక రచించెనని వారి కుమారులవలన నేను విన్నవిషయము. రంగశాయికవిగారి కీర్తి శాశ్వతముగ నిలుపుటకు వారి 'భారతచంపువు' ఒకటిచాలును. ఆకావ్యములోని పద్యగద్యములసంఖ్య యించుమించు 1250 - శబ్దసంస్కార మెచ్చటను జాఱలేదు. కవిత ధారావాహికమై 'అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి' గారికి సరిపడినకుమారులు వీరనిపించుచున్నది. చంపూ భారతావతారికలో రంగశాయికవి గ్రంథ .................... ................. .............. ............... ............................

(ఈఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు) మ. ఒక గీర్వాణపుశ్లోకముం దెనుగుగానూహించి పద్యంబు పొం

దికతో జెప్ప బ్రయానమౌ, నయిన దీనింగల్పనాలంక్రియా

దికముల్ వర్తిలుచున్న వన్నియును బూర్తింగల్గున ట్లెల్లవా

రికి సర్థంబగునట్లు నే సులభమౌరీతిం దెనింగించెదన్.

ప. అని యంగీకరించి పీఠికాపుర సమీపస్థితి చేబ్రోలు గ్రామంబున నివసింపుచు శాలివాహనశకంబునందు వేయు నెనిమిది నూఱుల పదుమూడు వత్సరంబులు గడుప సడరు నందనసంవత్సర శ్రావణ శుద్ధ సప్తమీదినంబున నేతత్ప్రబంధంబు దెనిగింప నారంభించితి......

అనగా, నీభారతచంపువు క్రీస్తుశకము 1891 లో నుపక్రమించి రని తెలియును. రచన కెన్నాళ్ళు పట్టినదోగాని, అచ్చుపడుటమాత్రము 1913 లో జరిగినది. సంస్కృతములో ననంతభట్ట మహాకవి కవిత్వము చాల మాధుర్యముగలది. ఆ మాధుర్యమునకు వెలితిరాకుండ దెలుగులో రంగశాయికవి మిక్కిలిసొంపుగ దీనిని రచించెను. రెండు మచ్చు పద్యములు:

మ. ఘనరత్నోజ్జ్వల కుండలాడ్య ధరయుక్తంబౌ సమస్తాంగ శో

భన కర్ణత్రితయంబు మ్రోల నిరుగ్రేవల్‌పూను దుర్యోధనుం

డు నిజాకారగులైన తొంబదిపయిం దొమ్మండు సోదర్యులుం

దనువేష్టింపగ వచ్చె సైన్యపటహధ్వానావృతాకాశులై.

ఉ. పిమ్మట నెల్ల చోట్ల బడవేసినపువ్వుల సౌరభంబులం

గ్రమ్మినదై స్వస త్పటహరాజియునై యగరూత్థధూపవా

హమ్మగు చందువల్ గలదియై మణిమంచిని విష్టరా ట్కదం

బమ్మును నౌ స్వయంవరపు మంటపమెక్కిరి పాండునందనుల్. [ద్వితీయ స్తబకము 86.87]

వీరి చిత్రకవిత్వమున కుదాహరణముగ నీపద్య మొకటి పైగ్రంథములోనిదే చూపుచున్నాడను. క. మామా మీమోమౌమా

మామా మిమ్మొమ్ము మామమామా మేమా

మే మొమ్మము మీమైమే

మేమే మమ్మోము మోము మిమ్మౌ మౌమా.

ఇది యేకాక్షర కందము ఈకవిగారి 'చంపూభారతము' తెలుగుబాసకు జక్కనియలంకారమనుట యసంశయవిషయము.

అర్థము: మామా, మా=చంద్రునియొక్క, మా=శోభ, మీమోమౌన్=మీముఖమందు అగును 'అన్యస్యా: క్వచిద్భవే చ్చాన్యా! అనుసూత్రముచే నిచట ప్రథమకు సప్తమ్యర్థము. మామామా, మామా=మామాయొక్క, మా=మేథ మిమ్మొమ్ము, మిమ్ము=మిమ్మును,ఒమ్మున్=అనుకాలించును. మామమామా=మామకు మామవై నటువంటి ఈదేవా ! మేమా మేమొమ్మము, మేము, ఆము=గర్వములు, ఏమి=ఏమియును ఒమ్మము=అనుకూలించుము. మీమై=మీశరీరము మేమేమే=మేము, ఏమే. మమ్ము=మమ్మును, ఓము మోముము=రక్షింపుము రక్షింపుము, ఇమ్మౌమౌమా=అనుకూలము ఆగుమా అగుమా, నిఘంటువు: చంద్రేమాసిచ మా:పుమాన్,మాస్త్రీమా నేమృతౌ వేలా మేధా శ్రీ మధ్య మాతృషు-అనినానార్ధ రత్నమాల-

'తాతోపి పీతాయతే అని సంస్కృత సమస్యను రంగశాయికవిగారి కేరో యిచ్చిరట. దాని నెటులు పూరించెనో పరికింపుడు:

శ్లో. క్షీరాంభోథి తరంగ శ్రీకరరుచా కాకోపి హంసాయతే


జిలై న్తు కలయన్ హంసోపి కాకాయతే!
సమాకులో గిరి వరో మేరుక్షితిధ్రాయతే


(ఈఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు) శా. కాణాదర్శివర ప్రణీతమగు తర్కం బేనెఱుంగంజుమీ

పాణిన్యారచితంబు వ్యాకరణ మొప్పం గొంచె మీక్షించితిన్

వాణీనైపుణి లేదు రాజసభలన్ వాదింప లేనమ్మ యే

వాణిజ్యంబును నేనెఱుంగ నికనంబా! లక్ష్మి!రక్షింపుమా.

కవి గర్వరాహిత్య మీపద్యములో బ్రస్ఫుట మగుచున్నది. కవి సత్యవాదియనుట కీపద్యమే గొప్ప యుదాహరణము. వాస్తవముగ, రంగశాయికవికి నోటిధాటి తక్కువ. ఏదో వ్రాసికొనుచు నజ్ఞాతముగ గాలయాపనముచేయువాడే గాని, రాజసభలకుబోయి ఝంకారముగ లేనిపోని బొంకులాడి విత్తసంపాదనముచేయు దారు లీయన యెఱుగడు. ఈకవివరుని సంస్కృత కవితాధోరణి మనోహరముగనున్నది. ఆభాషలో నీయన రచించినవి మూడు గ్రంథములు: 'నారాయణానందలహరి' లోనివి రెండు చూపెదను-

శ్లో. రసజ్ఞా స్మాకీనా మధురరసయుక్తానపి బహూన్

పదార్థన్నేచ్ఛంతీ తవరుచిరనామ్నో మధుర తాం

విదిత్వా త్వామేవ స్మరతిఖలు శశ్వద్గతరుచి

ర్భవంతం సంస్తోతుం ప్రతికల మియం కాంక్షతి హ రే!

శ్లో. యథావీణాగానం తవహిత మభూ న్నా రదమునే

ర్యథా ప్రహ్లాదోక్త స్తుతిఫణితి రాపాభ్యుపగమమ్!

యథా నమ్యక్ప్రీతి శ్శుకవచనరీతి స్సమభవత్

తదై వాస్మత్ర్పోక్తస్తుతిరపి మురారే భవతు తే:

రంగశాయికవి శతకములు, తెనిగింపులు తప్ప స్వతంత్రకావ్య మొక్కటియు రచింపలేదు. అటులు రచించు నుద్దేశము కూడ నాయనకు లేదని విన్నాను. "అసత్య వస్తువులను వర్ణించి, యభూత కల్పనములు చేసి స్వతంత్రకావ్యములు రచించుట నా సత్యవ్రతమునకు భంగము కలిగించును గాన మానివైచితి" నని సమాధానము చెప్పెడివాడట. నిజము; రంగశాయికవి మడికట్టుకొనిగాని కవిత్వము వ్రాయువాడు కాడు.

ఈయన పిఠాపురములో శ్రీ సూర్యరాయనిఘంటు కార్యస్థానమున నుద్యోగించిన నాళ్ళలో ద్రోవలో నేయంట రాని యాకో కాలికి దగిలినటు లనుమానము తట్టిన నింటికివెళ్ళి సచేలస్నానముచేసి కార్యాలయమునకు వచ్చెడివాడని వింటిని. 'ఆఫీసు' సమయమున కాలస్యమైనను, దనయాచారమునకు లోటులేకుండ బ్రవర్తించిన యమాయకు డీయన: రాజకీయతంత్రములు, లౌకికయంత్రములు, తెలియక, శుద్ధవైదిక సంప్రదాయమున, జీవయాత్ర గడపిన పవిత్రమూర్తి రంగశాయికవి. ఆయన 1836 రాగనే, తనచంపూభారతములో, తనశతకములలో దనజీవితము దాచుకొని మహాప్రస్తానము సాగించెను, "శుచిర్వప్ర శ్శుచి:కవి:."

                           ________