Jump to content

ఆంధ్ర రచయితలు/అడివి బాపిరాజు

వికీసోర్స్ నుండి

అడివి బాపిరాజు

1895

నియోగి బ్రాహ్మణులు. తల్లి: సుబ్బమ్మ. తండ్రి: కృష్ణయ్య. జన్మస్థానము: భీమవరము. జననము: 8 అక్టోబరు 1895 సం. రచనలు: 1. నారాయణరావు 2. హిమబిందు 3. తుపాను 4. కోనంగి. 5. గోనగన్నారెడ్డి. 6. అడివి శాంతిశ్రీ 7. మధురవాణి (ఇత్యాదులు నవలలు) 8. అంజలి. 9. రాగమాలిక. 10. తరంగిణి (ఇత్యాదులు కథలు) 11. తొలకరి 12. హారతి. 13. గోధూళి (ఇత్యాదులు పాటల సంపుటములు) 14. తీర్థయాత్ర. (వ్యాస సంపుటము.) 1. ఆంధ్రసామ్రాజ్ఞఇ. 2. కృతిసమర్పణం. 3. భగీరధీలోయ 4. దుక్కిటెద్దులు. 5. ఉషాసుందరి. (ఇత్యాదులు రేడియో నాటికలు.)

శ్రీ బాపిరాజుగారు కళాప్రపూర్ణులు. ఈ బిరుదము విశ్వవిద్యాలయ ప్రసాదము వలన జేకూరినది కాదు. అసలు, సహజముగా నాయన బహు కళాప్రపూర్ణులు. కవిత్వము, శిల్పము, చిత్రకళ, గానము, నాట్యము మొదలగు నెన్నో కళలలో బాపిరాజుగారు సుపరిణతమైన యెఱుక గలవారు. దేశభక్తి, రచనాశక్తి, యీయనలో మూర్తికట్టుకొని యున్నవి. చరిత్రముపై వీరికి గొప్ప యభిమానము. శాస్త్రములపై మంచి విశ్వాసము. రసార్ద్రమైన హృదయము. తియ్యని పలుకుబడి. ఇన్ని విశిష్ట లక్షణములు గల రసికుడు గ్రంథరచన గావించుచో మరి యవి సుధాభాండములుగా నుండవా ?

పాశ్చాత్య సారస్వతమునను, ప్రాచ్య సాహిత్యమునను సమానముగానే వీరు పరిశ్రమించినవారు కావున, ఆయన కృతులలో సంప్రదాయ సిద్ధమైన సౌందర్యము, వింత కలిగించు క్రొత్తపోకడలు కూడ నుండును. ఈయన ' శశిబాల ' నుపాసించును. గోదావరి, యనగా బాపిరాజుగారి కెంతో యాప్యాయము. ఈకవి చిక్కని పాటలు వ్రాయును; చక్కగా బాడును. 510


ఉప్పొంగి పోయింది గోదావరీ తాను
తెప్పున్న ఎగిసింది గోదావరీ.
కొండల్లు ఉరికింది కోనల్లు నిండింది
ఆకాశ గంగతో హస్తాలు కలిపింది - || ఉప్పొంగి ||
ఆడవిచెట్లన్నీని జడలలో ముడిచింది
ఊళ్లు దండల గుచ్చి మెళ్ళోన తాల్చింది - || ఉప్పొంగి ||
వడులలో గర్వాన నడలలో సుడులలో
పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తు వచ్చింది - || ఉప్పొంగి ||
శంఖాలు పూరించి కిన్నెరలు మీటించి
శంకరాభరణ రాగాలాప కంఠయై - || ఉప్పొంగి ||
నరమానవుని పనులు సిరిమొగ్గి వణకాయి
కరమెత్తి దీవించి కడలికే నడిచింది - || ఉప్పొంగి ||

ఈ మొదలగు పాటలు వీరివి పరివ్యాప్తములై యున్నవి. సన్నని స్త్రీకంఠస్వరముతో, అభినయము చేయుచు గూడ బాపిరాజుగారు పాడుచున్నపుడు, ఈపాట లెంతో ముచ్చటగా వినవేడుక. ఈయన పద్య బంధములు వ్రాయుటకు దఱచుగా నిచ్చగింపనివారు.

ఇక, బాపిరాజుగారి ప్రతిష్ఠకు బతాక నెత్తిన రచనలు నారాయణరావు, హిమబిందు, గోన గన్నారెడ్డి, తుపాను, కోనంగి మున్నయిన నవలలు, "నారాయణరావు" రచనతో వీరిపేరు సుప్రతిష్ఠితమై వెలసినది. అది యాంధ్ర విశ్వవిద్యాలయమువారి సత్కారమునకు భాజన మగుటయేకాక, ఆంధ్ర ప్రజల డెందము రూపించిన కూర్పు. వచన రచన బాపిరాజుగారిది హృదయంగమ మైనది. గ్రాంథికము, వ్యావహారికము తుల్య ప్రపత్తితోనే వ్రాయ గలవారు. వ్రాతలో నెన్నో క్రొత్తమలుపులు, పొలుపులు చూపగలరు. పాత్రలతో సర్వాత్మనా కలియగల శక్తి వీరిలో నున్నది. సంఘమర్యాదలు సుసూక్ష్మ 511


ముగా గుర్తింపగలరు. మానసిక తత్త్వము క్షణములో దెలిసికొన గలరు. ఈ విశిష్టలక్షణములతో బాపిరాజుగారు పెద్దపెద్ద నవలను వ్రాసిరి. పుటలు పెంచుటయే పరమార్థముగా భావించినవారు గాక, రసఘటములుగా వీరు నవలలు తీర్చినారు. విషయము వచ్చినపుడు దానిని ఆమూలచూడము ప్రత్యక్షముచేయుట వీరి కలవాటు. సగము సగము, తెలిసీతెలియని యెరుకతో గొలుకుట కాయన యిష్టపడరు. ధర్మము-శిల్పము-కవిత్వము-ప్రేమ-సంగీతము-మొదలయిన వానిపై ఆయన తన నవలలలో సందర్భము ననుసరించి కావించిన విశాల చర్చలు ప్రత్యేకగ్రంథములు కాగలయవి. 'హిమబిందు ' లో నెన్నో ప్రకరణములు బాపిరాజుగారికి పురాతన శాస్త్రములలో గల ప్రగాఢ ప్రవేశమును తార్కాణించుచున్నవి. ఆంధ్ర చరిత్రయు, బౌద్ధయుగ చరిత్రయు, లెస్సగా బరిశ్రమించి యాకళించినవా రగుటచే వీరి నవలలు చాలభాగము చారిత్రకములై యున్నవి. చరిత్రలో నిట్టి కృషిచేసిన నవలా రచయితను వేరొకని మనము చూడము.

ఇట్టి బాపురాజుగారి కళాజీవితము చైత్రరథము. ఆయన నిత్యమందహాసి. ఆయన న్యాయవాదిగా నుండదగిన చదువు బి. యల్. చదివెను. భీమవరములో నొకయేడు ' బల్ల ' కట్టెను గాని, హృదయ మొప్పుకొనక, బందరు ఆంధ్రజాతీయకళాశాలలో ప్రిన్సిపాలు పదవిలో బ్రవేశించెను. ఇది 1935 మొదలు నాలుగేండ్లు సాగినది. అక్కడనుండి చెన్నపురి జీవనము కొన్నాళ్లు. చలన చిత్రములు కొన్నింట చిత్రకళా దర్శకత్వము నిర్వహించెను. అనసూయ - ధ్రువవిజయము ఇత్యాదులు - 1942 వ సంవత్సరములో నివన్నియు మాని హైదరాబాదున ప్రచురిత మగుచున్న ' మీజాను ' పత్రికకు సంపాదకత్వము నెరపుటకై వెళ్లిరి. అది 42 సం|| వరకు నిర్వహించిరి. ఇది యిటు లుండగా, బందరు, భీమవరము, హైదరాబాదు, మదరాసు మున్నగు ప్రసిద్ధస్థలము 512

లలో కళాపీఠములు స్థాపించి కులపతిగానుండి కళారాధనము చేసినారు. బాపిరాజుగారి చిత్రములు మంచికీర్తి సంపాదించుకొన్నవి. ఖడ్గతిక్కన, శబ్దబ్రహ్మ, శ్వేతతార, శశికళ, రుద్రమదేవి, నాగనృత్యం, సముద్రగుప్తుడు, బుద్ధుడు, సూర్యదేవ, భిక్షుకి, గౌరీశంకర్, భిక్షుకి, మీరాబాయి, ఈ చిత్రములు ప్రతిష్ఠ తెచ్చుకొన్నవి.

అమృతహృదయముతో నిన్నికళల లోతులు ముట్టిన బాపిరాజుగారు ధన్యులు. ఆయన యక్షరములలో రసికహృదయ తంత్రులను పలికింప జేయగలశక్తి యున్నది. ఆయన పాటలు, బొమ్మలు జీవన్మూర్తులవలె దెలుగున సంచరింప గలవి. ఆయన నవలలకు ఉత్తమ స్థానము వచ్చినది. మరపురాని బాపిరాజుగారి ప్రేమగీత మిది పాడుకొందము.

మరచిపోవబోకె బాల మరచిపోవకే !
అరచి అరచి పిలువలేను
తరచి తరచి కోరలేను
పరచిపోవు కాంక్షలొనె తీపిలోనె, మరచిపోవకే !
హోరుమనే కెరటాలే
మారుమోగె నాపాటలు
ఒరిగిపడే రేఖలోనె నురుగులోనె మరచిపోవకే !
ఒక్కణ్ణే యిసుకఒడ్డు
ఒక్కణ్ణే నీరుదెసలు
ఒదిగిపోవు దూరాలూ
చెదిరిపోవు మేఘాలూ, మరచి పోవకే !
అదుముకొన్న నీతలపులు
దిదిమిరాల్చు నాహృదయము
ఏరలేను రేకలన్ని
ఏరలేను పుప్పొడినీ, మరచిపోవకే !