ఆంధ్ర మాత

వికీసోర్స్ నుండి
ఆంధ్ర మాత
గుర్రం జాషువా


||ఆంధ్రాలి మోదంబు నాశించి పోయినా
తిక్కనాకర్యుని వాణి త్రుప్తినంద

గజ్జెలందెల కాలు గడలించి మన్న బొ
బ్బిలి కోట దొలికోడి పలికి కులుక

నాడువీధులందు రత్నము లమ్ముకొన్నట్టి
తెలుగుల సంపత్తి తలపుకెక్క

ఖండాంతరముల బంగారు పూజలు గొన్న
కలికి పోగరమేను పులకరింప||


మూడు కొండల శివలింగములు రహింప
నాలశింపక రాష్ట్ర సింహాసనమున
నాధివశింపుము జయము నీయందు కలదు
దివ్యదాసయ సుమవల్లి తెలుగు తల్లి

గణ గాంధేయ శక ప్రకాశలాన మింకన్ శోక కాత్యంత ప్రా
క్తనపుంజీకటి చిందులాడెడు విముగ్ధ ప్రాంతముల్ నిద్ర మే
ల్కొన శంఖారవ మాచరింపు మిక నుగ్గుంబాలలో గాంతమం
దిన విధ్వాంశులగన్న వీర జనయిత్రీ ఆంధ్రరత్నాక్షితీ

కులముల్ గొమ్ములాటొడ గుమ్ముకొని చిక్కుల్ పెక్కు శృష్టించు పె
ద్దల కాలాలు గతించి పోయినవి స్వాతంత్య్రంబు సిధ్ధించె రా
జుల సింహాసన మెక్కినారు ప్రజ లెచ్చుందగ్గులం బాపూజీ
హలిక శ్రేష్టుడు దున్నినా డిపుడు లేవంతస్థు లాంధ్రాక్షితి

పెను స్వార్ధంబు మహా పిశాచమువలెన్ బీడింప దేశంబు చి
క్కిన శల్యంబయి తూలిపోయినది ఈ కీడుం దొలగించు చ
క్కని మార్గం బుపదే శమిచ్చుకొని ముక్తాస్వఛ్ఛభావంబు నీ
యనుగుం బిడ్డలలో సృజింపుము త్రిలింగాద్రిక్షమాభూషణీ

ఆలాపించిన సత్కవీశ్వరుల దివ్యాశీర్వచశ్శక్తిచే
నాలాభించిరి భారతీయులు స్వరాజ్య స్వర్ణ దండంబులే
డాలాలంబు కవి ప్రపంచమున కమ్మా వాజ్ఞ్మయోద్యానమున్
బాలింపగల దాతలం గని రసజ్ఞత్వంబు చాటింపుమీ

కృతులందుటకు పల్లకీ మోయ దొర కొన్న
కృష్ణరాయడు రాజ్యమేలినాడు

మనుమసిధ్ధియును దిక్కన గన్న కావ్యంబు
కొరచూపులు జూచుకొన్ననాడు

తెలుగురాయని యోప్పులొలుకు గుప్పిటిలోన
లేత కస్తూరి గుబాలించునాడు

ముత్యాల మందిరంబుల సత్కవులమీద
బంగార మేరులై పారునాడు


కవుల పల్కులు వేదవాక్యంబులగుచు
క్షితితలంచును గంపింప జేయునాడు
గారావంబుననన్నేల గాంచవైతి
తెలుపగదవమ్మ నన్నుగన్న తెలుగు తల్లి

అలసానికులజు డూయలమంచములనుండి
పసిడి లేఖను బూని వ్రాయునాడు
పోతనార్యుని గేహమున భారతీదేవి
చిగురుజేతుల వంట జేయునాడు
భువన భీకరుడు వేములవాడ భీమన్న
గంగ్రాజునకు జోలె గట్టునాడు
శ్రీనాధకవి పాండితీ వైభవము మీఱ
డిండిమభట్టు నొండించునాడు

కనుల జూచెడు భాగ్యంబు గలిగి యున్న
నేడు నా కవిత్వంబు రాణించియుండు
గారావంబుననన్నేల గాంచవైతి
తెలుపగదవమ్మ నన్నుగన్న తెలుగు తల్లి

జననం బందే నపూర్వవైఖరులతో, సంగీత సాహిత్య మం
డన నీ తెల్గుమిఠారి చెన్నపురి వీటన్ గజ్జెమ్రోయించుచున్
డనువుప్పొంగ బురాట నాంధ్ర విబవోద్యానంబురేకెత్త, మో
హన గానంబుల నాలాపింపగదవయ్యా ఆంధ్ర యోధాగ్రణీ

ఒకనాడాంధ్రుని కట్టి శాత్రవ బలవ్యూహాలపై రక్తనా
టకమున్ సల్పుట విశ్మరింపకుము, గాఢంబైన పాశ్చాత్య శో
భకు నీ విప్పుడు లోభివైతివి, ప్రదీప్తంబైన నీ ప్రజ్ఞ మా
రక పోనీక సముధ్ధరింపు కొను మాంధ్రా వీర యోధాగ్రణీ

బోనావాడవుగాన నీదు విభవంబున్ సత్కలా మర్మముల్
జాలా భాగము కొల్ల బెట్టితివి నీ శాస్త్ర ప్రపంచంబులో
మేలెల్లన్ గబలించినారు పరభూమీశాగ్రణుల్, నేటికిన్
బోలేదేమియు దిద్దుకొమ్ము బలగంబున్ స్వీయ విజ్ఞానమున్

తలికోట యుధ్ధాన నళియ రాముని వల్ల
ప్రిదిలిపోయినది నీ వీరదట్టి
మాయనాయకురాలి మారాముడుల చేత
సమియించె నీ బాలచంద్రరేఖ
బుధ్ధిమాలిన చిన్ని పొరపాటుకతనమున
విటమయ్యె నీ కొండవీటి పఠిమ
ఉత్సాహయుతమైన యుడుకునెత్తురు లేక
ప్రాప్తింపలేదు రాష్ట్ర ధ్వజంబు

పరువు దూలిన నీ యనాదరణ కతన
మేఠి నీ భాష పొలిమేర దాటలేదు
పరుల విజ్ఞానమునకు సంబరము పడక
కడగి యోత్తుము నీ వీర కాహలంబు

చీనా పెగోడాల సిగమీది పుష్పమై
పొడమె నీ రాతి చెక్కడపు చెణుకు
అరవ పాఠకుల తంబురకు ప్రాణమువోసి
కులికె నీ చిన్నారి తెలుగుబాణి
హిమవదిరులదాక జృంభించి పగవాని
తరిమి వెన్నాడె నీ కరకుఠాలుగు
మొగలు రాజుల సభా భూములనూరేగె
నీ జగన్నాధ పండితుని పలుకు

యెందు జూచిన నీ యశస్వందనములు
నడచిపోయిన జాడ లప్పుడును గలవు
దిక్తఠంబుల యలర నెట్టింపవోయి
తెలుగు మన్నీల పశువు నిగ్గుల పతాక

తెలుగుం గేసరులున్ మహర్షులును గాంధీ శాంతి సేనాపతుల్
గలరాంధ్రప్రముఖుల్ త్వదీయులు భుజస్కంధంబు నండింత్రు నీ
అలఘ శ్రేయములీనమోచినవి రాష్ఠ్రార్ధంబు యట్నించి నీ
బలముంగొంచియ మాకలించుకొనరా ప్రఖ్యాత వీరాంధ్రుడా

"https://te.wikisource.org/w/index.php?title=ఆంధ్ర_మాత&oldid=25532" నుండి వెలికితీశారు