ఆంధ్ర మహనీయులు/వెలుగోటి యాచమనాయఁడు

వికీసోర్స్ నుండి

వెలుగోటి యాచమనాయఁడు

           ఉ. గొల్పురి జగ్గరాజు లొకకోటియుఁడెబ్బదికోట్ల మాకరా
               జబ్బలు లక్ష్మిమీఁద బదియార్గురు రా వెలువెంకులైనమా
               నిబ్బరగండయాచధరలోపతి ముందట నిల్వ

అతిస యోక్తులతో గూడిన యీపైచాటుపద్య మొకఁటి యాంధ్రవాఙ్మయము నలంకరించి చాటుపద్యరత్నాకరమను గ్రంథమున గన్పట్టుచున్నది. చదువరుల స్థూలదృష్టికి నట్లు గాన్పించినను ఒక కాలంబున దక్షిణహిందూ దేశచరిత్రము నందు సంభవించిన మహాభయంకర మగునట్టియు, మహాద్భుతమగునట్టియు నొక మహావిప్లవము కడదాటించిన యొక మహావీరవ్యక్తియొక్క చరిత్రశోభను గర్భీకృతము గావించికొని యామహావ్యక్తియొక్క యశోవైభవము దిగ్దిగంతములవఱకు వెదజల్లునట్టిదిగా నున్నది. ఈవిప్లవము విజయనగరసామ్రాజ్యము నారవీటివంశస్థు లయినరాజులు పరిపాలన చేయుకాలమునఁ బదియేఁడవశతాబ్దిమొదట, అనఁగా 1614 వ సంవత్సరమున రాయవేలూరునగరమున మొట్టమొదట ప్రారంభ మైనది. దీనికి ముఖ్యకారకుఁడు పై చాటువులోని జగ్గరాజు, వీనికి దక్షిణవామహస్తములుగా నేర్పడి తోడ్పడి విప్లవాగ్నిని విజృంభింపఁ జేసి మండఁబెట్టినవారు మాకరాజును, వెంకప్పనాయఁడు ననువారు. వీరినిఁ బ్రతిఘటించి వీరి దుష్ప్రయత్నములను భగ్నపఱచి శాశ్వతమైన విజయకీర్తిని గాంచినవాఁడు యాచమనాయఁడు. ఇతఁడు పద్మనాయకకులాభరణము,వేంకటగిరిపురాధీశ్వరుఁ డయిన వెలుగోటి యాచమనాయనిమనుమఁడు. కాళహస్తిపురాధీశ్వరుఁ డయిన దామర్ల వెంగళనాయని దహోత్రుఁడు. ఇతనితండ్రి కస్తూరి రంగప్పనాయఁడు. తల్లి వేంకటాంబ. వీ రెల్లరును 1586 మొదలుకొని 1614 వ సంవత్సరము వఱకు విజయనగరసామ్రాజ్యమును బరిపాలించిన శ్రీమద్రాజాధిరాజ పరమేశ్వర శ్రీవీరప్రతాప శ్రీవీర వేంకటపతి దేవమహారాజ సేనాపతులును నాతని సేవించెడుమండలాధీశ్వరులు నై యుండిరి. సత్యము, నీతి, న్యాయముఁ దప్పకుండ ధర్మపరిపాలనముఁ జేసి విజయనగరసామ్రాజ్యసింహాసన మధిష్టించి వాసిఁ గాంచినవారిలో నీతఁ డొక్కఁడు. ఈతఁ డెంతటిసామ్రాజ్యసంపదలతో దులతూఁగు చున్నను సంతానాపేక్షతో నాఱుపర్యాయము లార్గురుపడతులను వివాహముచేసికొన్నను సంతానసౌభాగ్యమునుఁ గన్నులారఁ జూచుకొనుభాగ్యము మాత్ర మబ్బినది కాదు. ఇతనికి వేంకటాంబ, రాఘవాంబ, పెదఓబమాంబ, పినఓబమాంబ, కృష్ణాంబ, కొండాంబ అను భార్య లున్నట్టు లీయార్వురనామములు శాసనములవలన నైన నేమి గ్రంథముల వలన నైన నేమి, తదితరలేఖలవలన నైన నేమి దెలిసికొన సాధ్య మగుచున్నవి. అందుగుల వెంకయవిరచిత మగు నరపతివిజయమునందు :-

        "సీ. పరమపాతివ్రత్యగరిమచే మిక్కిలి
                   యతిశయిల్లినవెంకటమ్మగారిఁ
            జిరయశోనిధి యైనజిల్లేళ్ల రంగనృ
                   పాధిపు పుత్రి నోబమ్మగారి
            జిల్లేళ్లకృష్ణరాట్చీతమయాఖు ప్రి
                   యాత్మజ యైనకృష్ణమ్మగారి
            భూరి శౌర్యోగ్ర గొబ్బూరి యోబక్షమా
                   ధ్యక్షు తనూజఁ గొండమ్మగారి
         గీ. నెమ్మివరుసఁ బాణిగ్రహణమ్ముఁ జేసి
            వీర వేంకటపతిరాయవిభుఁడు వేడ్క
            నలరు నప్పద్మముఖులతో ననుదినంబు
            నధికసౌఖ్యాంబునిధి నోలలాడె మిగుల."

అని యభివర్ణించి యున్నాఁడు. ఇందుఁ బేర్కొనఁబడిన కొండమ్మతండ్రి యగుగొబ్బూరి యోబక్షమాధ్యక్షునకుఁ బై చాటువునందుఁ బేర్కొనఁబడిన గొబ్బూరి జగ్గరాజు కుమారుఁ డై యుండును.

వేంకటపతిరాయలునకు సంతానము లేదు గావున నతని వెనుక సింహాసనము నధిష్ఠింపఁదగిన హక్కు గలవా రాతనియన్న యైనరామరాయని కుమారులగు తిరుమల రాజును, శ్రీరంగరాజును నై యుండిరి. కొందఱు రాజ బంధువులును, కొందఱుమండలాధిపతులును తిరుమలరాజునే యువరాజుగ భావించి యట్లు ప్రశంసించు చున్నను, తిరుమల రాజు మొదటనుండియు రాయలయాజ్ఞలను మీఱుచు నవిధేయుఁ డై ప్రత్యర్థులతోఁ జేరి సామ్రాజ్యప్రతిష్ఠకు భంగము కలుగురీతిఁ బ్రవర్తించుటవలన నాతనియెడ నసహ్యత జనింప నతనితమ్ముఁడును, గుణవంతుఁడును స్ఫురద్రూపియు నగు శ్రీరంగరాజునే దగ్గఱకు జేరదీసి యువరాజుగఁ జేసెను. ఆకాలమునాఁటి పోర్చుగీసుపాదిరులు తిరుమలరాజునెడఁ దమకుఁ గలమైత్రి ననుసరించి రాయలతో జరుపు నుత్తరప్రత్యుత్తరములలోఁ దిరుమలరాజునే యువరాజుగ భావించి ప్రశంసలు సలుపు చుండఁగా నాతఁడు గర్హించు చుండెనని తెలుపుచున్నారు. తనయెడ నిట్టివైమనస్యము కలిగి యుండుటచేతనే శ్రీరంగపట్టణము రాజధానిగాఁ గర్ణాటసామ్రాజ్యమును రాజప్రతినిధిగాఁ బరిపాలనముఁ జేయుచున్న తిరుమలరాజు రాయలయుత్తరువును శిరసావహించి 1610 లో రాజ్యమును రాజుయొడయరున కప్పగించి శ్రీరంగపట్టణమును విడిచిపోయెనని చెప్పుదురు. ఇట్లు తిరుమలరాజు సిగ్గుమాలినవిధముగాఁ బ్రవర్తించుటవలన మండలాధిపతు లెవ్వరును వానిపక్షమును బూనికొన సాహసింపలేక పోయిరఁట. "సామ్రాజ్యమునందలి మహామండలేశ్వరులలో రాయలకుఁ దరువాత నధికారమును, పలుకుఁబడియు చలాయింపఁ గలవారిలో ఓబలరాయఁ డొక్కడు. ఈతని సంతకముతో రాధారిపత్రము గలవా రెట్టిభయమును, నాటంకమును లేక యేబాటపై నైనను, ఏనదిమీఁద నైనను నిశ్చింతతోఁ బ్రయాణము చేయవచ్చును. ఈతనియాజ్ఞను నుల్లంఘించుట యన నేయుద్యోగస్థుని కైనను మరణశిక్షను బొందుట యగును."

ఇందుఁ బేర్కొనఁబడిన ఓబలరాయలు, వేంకటపతి రాయలమామగారు. రంగరాజు రాయలకుఁ బ్రేమ పాత్రుఁడును, అన్న కుమారుఁడును, దత్తపుత్రుఁడును, యువరాజును నగు చిక్కరాయలు. ఈతని యువరాజుగఁ జేసినట్లు నరపతివిజయమను రామరాజీయములోని :-

         క. అతనికి శ్రీరంగమహీ
            పతి గలిగెను నా మహానుభావుఁడు శౌర్యో
            న్నతి వెంకటపతిరాయనృ
            పతిచే యువరాజుపట్టబంధము నొందెన్.

అను పద్యమువలన విదిత మగుచున్నది. రాయలు తరువాత రాజ్యమునకు రావలసిన యువరాజును చిక్కరాయలనుట దేశీయసంప్రదాయము. కనుకనే రామరాజీయమున శ్రీరంగ చిక్కరాయమనుజవిభుడే చిక్కరాయ లనియు, యువ ఈ పేజీ రెండవసారి వచ్చి యున్నది. ఈ పేజి రెండవసారి వచ్చి యున్నది. రాజనియు సుగుణగణములు గలవాఁ డనియు, శూరుఁ డనియు, సౌందర్యవంతుఁ డనియు నభివర్ణించి యుండుటయె గాక వయస్సు వచ్చిన యౌవనవంతుఁడనియు, జిల్లేళ్ళ నారసింహభూపుని పుత్రిక యగు ఓబమ్మను పెండ్లిచేసికొనియె ననికూడ దెలుపఁబడినది. 1599 వ సంవత్సరము నాఁటికి సంతానవంతుఁ డై కూడ నుండవలయును. ఈరామరాజీయ గ్రంథకర్త యగు వేంకయకవి జగ్గరాజును దుర్యోధనునిగాను, ఈ శ్రీరంగరాజుపుత్రుఁ డయిన రామదేవరాయలను, ధర్మరాజునుగాను వర్ణించి యుండుటచేత నీతఁడును నీతని కృతిపతియు జగ్గరాజునకుఁ బ్రతిపక్షకోటిలోనివా రనుట స్పష్టము. మఱియు రామరాజీయమున వేంకటపతిరాయల యన్న కొడుకు శ్రీరంగరాజును, వీనికుమారుఁడు రామదేవరాజును వర్ణించి పిమ్మట వీరవేంకటపతిరాయల గుణగణములను, మాధుర్య మొల్కుబల్కులతో నభివర్ణింపఁబడియెను.

గొబ్బూరి ఓబలరాజపుత్రిక యగు కొండమ్మయే బాయమ్మ యనియు జగ్గరాజు బాయమ్మయన్న యనియు, ఓబల రాయలు మరణించిన వెనుక నీతఁడు తనసోదరి యగు నీరాణి కొండమ్మ మూలమున సామ్రాజ్యమునఁ బ్రముఖుఁడై రాయలపైఁ బలుకుఁబడి సంపాదించి మితిమీఱిన రాజ్యకాంక్షచే దుష్ప్రవర్తనము చూపినాఁడు. ఓబలరాయలు పోయినవెనుక నాతని కుమారుఁ డయినజగ్గరాజునెడను, ఆతని కుమార్తె యగుకొండమ్మ యెడను దయను, ప్రేమను జూపియుండుటను, 1611 వ సంవత్సరము నుండి కొండమ్మకుఁ గొడుకుఁ బుట్టినట్టు కల్పనచేసి రాజ్య మపహరింపవలె నని ప్రయత్నము చేసినారు. కాని వీరవేంకటపతిరాయల మొదట తా నెట్లు ప్రతిజ్ఞపట్టి యాచరించుచు వచ్చెనో దానిని చనిపోవునపుడు సైతము మఱువలేదు.

అయినను సామ్రాజ్యాధీశ్వరుం డగు వీరవేంకటపతిరాయలవారు 1614 వ సంవత్సరములో అక్టోబరునెల నడిమికాలమున దాను మరణించుటకు మూన్నాళ్లకుముందే యొకనాఁడు మంత్రి పురోహిత సామంత దండనాయక దౌపారిక బంధుజన విద్వజ్జన సమక్షంబునఁ దనసోదరపుత్రుఁడు, యువరాజు నగు శ్రీరంగరాజునుఁ దనదగ్గఱకుఁ దీసికొని "నాయనా! శ్రీరంగా! నేనిఁకజీవింపను. నిన్నీ సామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తునిఁజేయుచున్నాను. ఇదిగో! నా చేతియుంగరమును దీసికొని ధరింపుము." అని పలికి తన కుడిచేయి చాచి యాతని కం దిచ్చెనఁట! అట్లు పలికి చేయిచాచినతోడనే శ్రీరంగరాజు గన్నుల వెంట బొటబొటబాష్పజలంబు లొలుక గద్గదకంఠముతో 'మహాప్రభూ! దేవరా! ఈసామ్రాజ్యము నేలుట కెవ్వరుర్హులో నీ యుంగరము వారి కలంకరింపుము. ఈప్రభుత్వము నా యంతట నేను కోరినవాఁడను గాను" అని పలికి సాష్టాంగ పడి బావురు మని యేడ్చుచు నాతని పాదములం బట్టికొనియెనఁట! అపుడు రాయలు తనచుట్టు నున్నవారిని నారాకుమారు లేవనెత్తు డని యాజ్ఞాపింపగా నట్లుగావించి వార లాతని రాయలకుడిచేయితోఁ బట్టుకొనుట కను వగునట్టు నిలిపి రఁట! తనచేయి చాచి యిదిగో! యీ యుంగరమును గైకొను మని మరల పలికెనఁట! అతఁడు యుంగరము తనకు ముప్పు వాటిల్లఁజేయునని విధివశమున ముందుగాఁ దెలిసి కొన్నవానివలె 'ఓరాజా ! నీయాజ్ఞ నుల్లఘించి నేనీ యుంగరము దీసికొనకున్నందునకు నన్ను క్షమింపము'మని చేతులు శిరస్సునకుఁ జేర్చుకొనియెనఁట! అంత తనచేతి యుంగరమునుదీసి పై కెత్తి తీసికొమ్మని రెండవమాఱు మరల కోరగాఁ జుట్టునున్న దండనాయకులు ప్రోత్సహింపఁ గన్నీ రోడ్చుచు దానిని తీసికొని ముందుగా శిరమునఁ బెట్టుకొని తీసి తరువాత వ్రేలికిఁ బెట్టుకొనియెనఁట! పిమ్మట రాయలు రెండు లక్షల క్రుజడావుల విలువగలిగిన పట్టాభిషేక కాలములందును, ప్రత్యేక పర్వదినములందును సామ్రాజ్యసార్వభౌములు ధరింపఁ దగినదుస్తుల నిప్పించుటయెగాక యాఱు లక్షల క్రుజడావుల విలువఁగలిగిన తన చెవి వజ్రములను, మఱి రెండు లక్షల క్రుజడావుల విలువఁగలిగిన తనచెవికమ్మలను, ఇంకను విలువఁగలిగిన పెద్దపెద్ద ముత్తేములనుఁ దెప్పించి యిప్పించె నఁట! ఇట్టి యాభరణముల నన్నిఁటి నొసంగి తన తరువాత శ్రీరంగరాజు పట్టాభిషిక్తుఁడు గాఁదగిన రాజకుమారుఁ డని ప్రకటించి యుండె నఁట!

తరువాత నాఱుదినములు బ్రదికె ననియు జనిపోవు నప్పటికి నఱువదియేడేండ్లవయ స్సుండె ననియు బర్రాదాసు తెలుపుచున్నాఁడు. వాని యారామములోనే మంచిగంధపుఁ గట్టెలతోడను, సుగంధద్రవ్యములతోఁడను రాయలప్రేతమునకు దహనసంస్కారకర్మ జరుపఁబడెనఁట! వీనితో వీని రాణులు మూవురుమాత్రము సహగమనము గావించిరఁట?

శ్రీరంగరాజును పట్టాభిషిక్తునిఁ జేయుటకు వేంకటపతిరాయలు సూచించిన యీమార్గము కొందఱకు సంతోషకరముగ నున్నను, మఱికొందఱకు దుఃఖకరముగ నుండెను. రాజబంధువులలోనేగాక సామ్రాజ్యమండలాధిపతులలోను, దండనాయకులలోను బెద్దకలవరము జనించె నఁట! పులికాట్టు నందున్న ఒలందులకు నీకలహమేరీతిగఁ బరిణమించునో, తమవర్తకమునకుఁ, దమవర్తకపుశాలాస్థానమునకు నెట్టివిపత్తు గలుగునో యని భయకంపితు లయిపోయిరఁట !

శ్రీరంగరాజు యధాశాస్త్రీయముగఁ బట్టాభిషిక్తుఁ డయ్యెను. జగ్గరాజు, మాకరాజు, రావెల వెంకటపతినాయఁడు తక్క తక్కిన సామంతమండలాధిపతులెల్లరును విననితు లై కానుక లర్పించి నమస్కరించి సార్వభౌమునిగ నంగీకరించిరి.

కొంతకాలము గడచినపిమ్మట శ్రీరంగరాయలు తనకొల్వున నున్న యుద్యోగస్థులలోఁ గొందఱపై ధనాపహరణము మున్నగు నభియోగములు రాఁగా విచారించి వారిని వారివారి పదవులనుండి తొలఁగించుట తటస్థించెను. వీరందఱు నదివఱకె శత్రువులుగా నేర్పడి కుట్ర చేయుచున్న జగ్గరాజు, మాకరాజు, వెంకులతోఁ గలిసి రాయలను సింహాసనభ్రష్ఠునిఁ జేయుటకై ప్రయత్నించు చుండిరి. ఇ దంతయు నెఱింగి శ్రీరంగరాయలు జాగరూకతతో వ్యవహరించుచు దుర్గమును, నంతఃపురమును సురక్షితముగ నుంచుకొనియెను. ఈ కుట్రల కన్నిఁటికిని మూలకారకుఁడగు గొబ్బూరి జగ్గరాజు. శ్రీరంగరాజును రాజ్యభ్రష్ఠుని గావించి తనమేనల్లుఁడైన శిశువునకుఁ బట్టము కట్టి తాను సామ్రాజ్యము నేలుటకు మంచితరుణము సంభవింవిన దని సంతోషించుచుఁ దన కాప్తు లయినవారితో యోజించి ఘనమైన పన్నాగమును బన్ని వంచనచేఁ గార్యము నెఱవేర్పఁ దలఁచి విప్లవమునకు సంసిద్ధుఁ డయ్యెను.

సామ్రాజ్య వ్యవహారనిర్వాహకదృష్టియం దుండి శ్రీరంగరాయలు వీరిపట్ల నలక్ష్యభావముతోఁ గొంతకాల మేమరియుండి వీరివంకఁ జూడక పోయెను. అందువలన వీరి పన్నాగము లాతనికిఁ దెలియ రాలేదు. ఒకనాఁ డాకస్మికముగాఁ దనకు ముఖ్యశత్రువుగా నేర్పడియున్న మహామండలేశ్వర గొబ్బూరి జగ్గరాజ దేవమహారాజుకడనుండి యొక దూత రాయలకడకు వచ్చి యొక లేఖను సమర్పించెను.

"ఇదివఱకు మీకు ప్రతిపక్షినైయున్న నేనును, నాతోడి మిత్రులును, మా ప్రయత్నములను మేము విడిచి మిమ్మె సార్వభౌములుగ భావించి సేవింప నిశ్చయించుకొన్నారము.మీరు తొంటిభావములను విడిచి మా కనుజ్ఞ దయ చేసినయెడల దేవరసాన్నిధ్యమునకు విచ్చేసి మాకానుక లర్పించి కృతప్రణాము లగుదుము." అని యందు వ్రాసి యుండెను. పరాక్రమవంతులయిన యీశత్రుపక్షమువారి నెల్లరఁ దనవంకకుఁ జేరఁదీసికొని సామ్రాజ్యమును బలపఱచి కొనుట యత్యావశ్యక మైనదిగా భావించి యందుల కంగీకరించినట్లు తెలుపుచు జగ్గరాజున కా దూఁతచేతనే ప్రత్యుత్తరము పంపి తన దుర్గాధ్యక్షున కీవర్తమానముఁ దెలియఁజేసి వారు వచ్చినయెడల నెట్టిమాటంకమును గలిగింపకుండ నుండవలయు నని యాజ్ఞ చేసెను.

మఱియు వారిని సామ్రాజ్యసామంతులుగ భావించి యధామర్యాదలు దప్పకుండ గౌరవభావముతో వారికి స్వాగతము నొసంగవలసిన దని కూడ నుత్తరువు గావించెను.

అమాయకుఁ డయినయారాయలు జగ్గరాజు పన్నిన యీమాయావ్యూహమునం దగుల్కొని యట్టియుత్తరువు లిచ్చియుండుటచేత జగ్గరాజునకును, వానిమిత్రులకును దుర్గములోఁ బ్రవేశించుట యత్యంతసులభసాధ్య మై పోయెడు. పాప మాదురదృష్టవంతుఁ డగురాయ లొకరీతిగఁ దలంప దైవ మింకొకరీతిగఁ దలంచెను.

అతఁడు తనమిత్రవర్గముతోఁ బ్రవేశించి రాయల పరివారమున కిఱుకపడకుండునట్లు తన రక్షకభటుల నాయా ద్వారములకడకుఁ బంపి వారివారిస్థానముల నిలువ నేర్పాటు గావించెను. ఇంతలో వీరు తలపెట్టిన ద్రోహకార్యము రాయలవర్గమువారికిఁ బొడకట్టెను. అంత రాయల సైనిక వర్గమువారు దుర్గద్వారములను మూసివేయఁ జూఁచిరి. అప్పటికే కార్యము మించిపోయినది. అంతయు నిష్ప్రయోజనముగాఁ బరిణమించెను. జగ్గరాజు సైనికభటులు రాయల దుర్గరక్షకులను సంహరించుచు నంతఃపురభాగములకుఁ బఱు విడు చుండిరి. ఇంతలో నొక శత్రునాయకుఁ డొకఁడు రాయలనుఁబట్టికొని జగ్గరాజుకడకుఁ దీసికొనివచ్చి 'ఇదిగో! రాయలను నీకర్పించు చున్నా' నని పలికెను.

అతఁడు రంగరాయలను జూఁచి "రంగరాజా! నీవు నాకు ఖైదీవయినావు. నీ విఁక నిశ్శబ్దముగ నావలికి పోతివా నీ ప్రాణములను నీవు సంరంక్షించుకొనఁగలవు. ఈదినము మొదలుకొని రాజ్యకాంక్ష విడిచి సామ్రాజ్యముపైఁ గల హక్కునంతయు వదలుకొని మరల యెన్నఁడును జేపట్టుటకుఁ బ్రయత్నింపకుండుము" పొమ్ము అని పలికెను.

అతఁడు మోసపోయెను. దుర్గ మంతయు శత్రుసైన్యములతో నిండిపోయెను. ఇంక చేయున దేమి గలదు? అట్టి కఠిన మైన యాజ్ఞకుఁ దలయొగ్గక తప్ప దయ్యెను. ఆ దురదృష్టవంతుఁడు తనభార్యను, బిడ్డలను దీసికొని క్లేశముచే వాడిపోయిన మోమును, వాల్చిన కన్నులును గలిగి మాఱు మాటలేక తల వంచికొని పోవుచుండెను. ఒక్క మనుష్యుఁ డయినను నమస్కరించువాఁడు లేఁ డయ్యెను. ఇది ద్రోహమని పలికినవాఁడు లేకపోయెను. ఆక్షణమువఱకు రాజుగ నున్నవాఁ డంతలో దిక్కుమాలినవాఁడు గావలసివచ్చెను. ఆహా! మానవుని బ్రతు కింతేగదా! రాయలపక్షమున నున్న మహావీరు లందఱునుఁ బిఱికిపంద లైపోయిరి. రాయల కంతయు నంధకారబంధురముగాఁ గన్పట్టెను. పాప మాదురదృష్టవంతుఁ డైన రంగరాజు వెల్తురు నెప్పటి కయినను జూడఁ గలుగుదునా యని తలపోయు చుండెను. రాయవేలూరునగరమున నుద్భవించి దట్టముగా నలముకొన్న యీ మబ్బులు సామ్రాజ్యము నంతయు వ్యాపించిపోయినవి.

కాని విజయనగరసామ్రాజ్యము శూరుల కెన్నడను బేదవడి యుండలేదు. ఈ విప్లవసమయమున నొక మహావ్యక్తి బాలభాస్కరునివలె విజృంభించుట కవకాశము చిక్కెను. ఆవ్యక్తియె మన కథానాయకుఁ డైన శూరవరాగ్రణి.

ఆదినమున వేలూరునగరమున వెలుగోటి యాచమనాయఁడు లే కుండెను. ఆనగరమునకుఁ గొన్నిమైళ్లదూరమున నున్నవాఁడు. ఇచట నేమి జరిగియుండునో యాతఁ డెఱుంగ కుండెను. ఈ దుర్వార్త చెవిని బడినతోడనే తాను తన దుర్గమునకుఁబోయి తనసైన్యమునంతయు నొక చోటికిఁ జేర్చికొని తనకు మిత్రుఁ డయిన రాయలపక్షముఁ బూని యెప్పుడు శత్రువులను మర్దించి రాయలను రక్షించి సామ్రాజ్యమును రాయలకు నిలుపుట కవకాశము గలుగునా యని నిరీక్షించు చుండెను.

అట్లు జగ్గరాయలు రాయవేలూరు నాక్రమించుకొని రంగరాయలను, వానికుటుంబమును చెఱశాల యందుంచెను. తన మేనల్లుని సార్వభౌమునిగఁ బ్రకటించి మండలాధిపతుల నెల్ల నంగీకరింప నిర్బంధించెను. ఎల్లరును జగ్గరాయలయెడఁ గల భీతిచే కానుక లర్పించి కృతప్రణాయి లయిరి. కాని యొక్క మాండలికుఁడు మాత్రము రాఁ డయ్యెను. అతఁడే పెనుమాడి మండలాధిపతి వెలుగోటి యాచమనాయఁడు. ఇందునకు యాచమనాయనిపై గినిసి జగ్గరాయలు తక్షణము వచ్చి యీనూతన ప్రభువునకుఁ గృతప్రణాముఁడ వయి నీవు పంపవలసిన కానుకలనుఁ చెల్లించిపోవలసిన దని సమాచారము పంపెను.

"అనామధేయుఁడైన యొకబాలునికి కానుక లర్పించు మనుష్యుఁడనా ? కానని చెప్పుము. నాప్రభువు శ్రీరంగరాయలు. వానికే నా కానుకలు; వానికే నా ప్రణామములు; వాని ప్రయోజనముకొఱకే యీకత్తినివరలోఁబెట్టక చేత బట్టియున్నాను. పో; పొమ్ము; పోయి నా యీపల్కులు నీ ప్రభువునకు నివేదింపుము" అని యా శూరుఁడు పలికెను.

ఇట్టిస్వాతంత్ర్యముతో గర్జించి పలికిన పలుకులు జగ్గరాయలచెవినిఁ బడినపుడు "ఓహో! ఇతఁడు వట్టిమూర్ఖుని వలె నున్నాఁడు. నాలుగువేల సైన్యము మాత్రమె గల తా నేమి చేయఁగలఁడు" అని పలికి 'నీవు మా సన్నిధానమునకు రానియెడల మేమె నీకడకు వచ్చి నిన్ను నాశనముఁ జేయుచున్నా' మని రెండవమాఱు మరల సమాచార మంపెను.

అందులకా మహాశూరుఁ డిట్లు ప్రత్యుత్తర మిచ్చెను. అవశ్యము రావచ్చును. తా నెప్పుడు సిద్ధముగా నున్న నప్పుడే రావచ్చును. ఎప్పుడు వచ్చినను యాచమనాయఁడ నైన నేను నావంటి మనుష్యులతో నిరీక్షించి యుందును. పో; పొమ్ము; పోయి నాయీపలుకులు జగ్గరాయల దర్బారులో పలుకుము. ఈపలుకులు విన్నమాత్రమున జగ్గరాయలకు మిన్నువిఱిఁగి మీఁదబడినట్లు తోఁచెను.

అప్పు డతఁ డిట్లు తలపోసికొనియెను. "ఇతఁడు నిక్కముగా శూరుఁడే. తాను తనబొందెలోఁ బ్రాణము లున్నంత దనుక రంగరాయల పక్షమునఁ బోరాడుటకు నిశ్చయించి కొని యున్నవాఁడు. ఇట్టివానిపట్ల సామదానభేదదండోపాయములను, జతుర్విధసాధనములనుఁ బ్రయోగింపవలయును. ముందుగా దండోపాయమువలన నపాయము వాటిల్లఁ గలదు. ఇప్పు డితనితో యుద్ధము దలపెట్టినయెడల దామర్ల వెంగళనాయఁడు, దామర్ల చెన్నప్పనాయఁడు మొదలుగా నీతని బంధువర్గమువా రందఱును నీతనిపక్షమునఁ జేరుదురు. అప్పుడు రంగరాయల బంధువర్గము వీరినిఁ జేరుదురు. తక్కిన మండలాధిపతులను నాపక్షమున నిలుపుకొనుట దుస్సాధ్యమగును. ఈతని సామముచేతను, దానములచేతను జక్కపఱుపజూతును."

ఇట్లు తలపోసి యాచమనాయని ననేకవిధములుగాఁ గొనియాడుచు 'నీవు నామేనల్లునిపక్షమున నుందు వేని విశేషముగా వరుంబడి వచ్చెడి భూములను నొసంగుచు నిన్ను యున్నత పదవికిఁ గొనివచ్చెద' నని వాగ్దత్తము చేయుచు నొక జాబు వ్రాసిపంపెను.

"అహో! నేఁ డితఁడు వంచకుఁ డై నావంశమును, నాపౌరుషపరాక్రమములను, నాసుగుణములను బొగడుచు నన్ను లంచములనిచ్చి లోపఱుచుకొనవలయు నని సంకల్పించి యీజాబు వ్రాసియున్నవాఁడు. నేనా యీ మాయలమారి మల్లన్నకు లోబడునది" అని తలపోసి 'ఏమీ! నాకు జగ్గరాయలు భూములొసంగునా? నాకు భూము లిచ్చుటకు జగ్గరాజునకు భూము లెక్కడివి? ఈభూములు నాప్రభు వగు శ్రీరంగరాయలవి కావా? నా ప్రభువుభూములను, ధనమును దానము చేయుటకు జగ్గరాజునకు హక్కుగలదా? అతని యందే నాభక్తి కుదురుకొని యున్నది. అతనికే నాసేవ ఇతరులకుఁ గాదు. అని పలికి 'ఓయీ! పో; పొమ్ము; పోయి నీ సామంతు లందఱితో గలిసి దండెత్తి రమ్ము. మీచేతనైన న న్నోడింపుఁడు. నేనుమాత్రము నా ప్రభువును విడిచి యీషణ్మాత్రమైన హక్కు గాని, పేరు లేనిబొమ్మను సేవించుఁవాడను గా నని నా యీపలుకులను నెల్లవారు వినునట్లుగా బహిరంగ సభలోఁ బల్కుము. పొమ్ము.' అని వానినిఁ బంపివేసెను.

ఇ ట్లత్యంతము రంగరాయనిమీఁది భక్తి ప్రేరేచు చుండఁగా నత్యమిత ధైర్యసాహసములతో నెదుర్కొని దర్పముఁ జూపుచు శత్రువు పల్కుచున్న గంభీరోక్తులకును, చేయుచున్న యుద్ధసన్నాహమునకును భయపడి ప్రత్యుత్తర మిచ్చుటకు నేమియుఁ దోఁపక జగ్గరాయలు తదితరసామంత మండలాధిపతులను స్తోత్రపాఠములుఁ జేయుచుఁ, గౌరవించుచు వారల నందఱ నేకీభవింపఁ జేసి యేకాకి యై యెదిరించుచున్న యాశత్రువీరునిఁ దలపడి నాశనము జేయవచ్చు నన్నయాశతో నుండెను.

ఇంతలో యాచమనాయఁడు చెఱలో నున్న తన ప్రభువును విడిపించు టెట్లని యాలోచించు చుండెను. ఒక దుర్మార్గుని చేతిలోఁ బూర్తిగాఁ జిక్కిపోయి యితరుల కెవ్వరికిఁ జొఱరాని కారాగృహంబున నున్నవాని విడిపించుటకుఁ బ్రయత్నించునపుడు వాని కెట్టివిధమైన హానియుఁ గలుగకుండఁ జూడ వలయునుగదా! ఎన్నివిధములఁ బ్రయత్నించినను కార్యము కొనసాఁగ దయ్యెను.

ఇట్లుండ నాతనిమనంబున కొక యోచన తట్టెను. ఏదైన నుపాయముచేత రంగరాయలపుత్రులలో నొకనినైన నీవలకు వచ్చునట్లు చేసి యాతనినే రాయలుగాఁ బ్రకటించి పట్టాభిషిక్తునిఁ జేయుట యుక్తమని భావించెను. అందు కొక యుపాయమును జింతించెను. పదభ్రష్టుఁ డైనరాయలకును, వాని కుటుంబమునకును బట్ట లుతుకుటకై నియమింపఁబడిన చాకలివానివలన యీ కార్యమును నిర్వహింప సాహసించెను. ఒకనాఁడు రహస్యముగా చాకలివానిని రప్పించి ఓయీ! నీవు రంగరాయని పుత్రులలో మొదటికుమారుఁడు, పెద్దవాఁడు గనుక సాధ్యపడదు గాన రెండవవాడు, పండ్రెండేండ్లబాలుఁడు గావున వాని నెటులయిన నాకడకుఁ జేర్చఁ గలిగితివా, నీకును, నీ సంతతివారికిని జన్మదారిద్ర్యము తీర్చునంతటి బహుమానమును గావింతు' నని ప్రోత్సహించెను. వాఁడు పరమానందముఁ జెంది ప్రభూ! ఈకార్యము నాకును విధ్యుక్తధర్మమే గావున నవశ్యము నట్లు గావించెద నని పలికెను. అప్పుడు యాచమనాయఁడు చెరలో నున్నరంగరాయలకు నీసమాచారము దెలుపుచు రెండవకుమారుని వీనివశము చేయవలసిన దని యొక జాబు వ్రాసి వానికిచ్చెను. ఆచాకలివాఁడాజాబుఁ దీసికొని కన్నుల నద్దికొని యాతనికడ సెలవు గైకొని వెడలిపోయెను.

ఆజాబును చాకలివాఁడు తనవంతుదినము రాఁగానే శుభ్రముగావించిన రాయలబట్టల నడుమ పైకిఁగనఁబడకుండు నట్లుగా మడతలలో నిమిడ్చి కోటలోని కారాగృహమునకు యధారీతినిఁ బోయెను. కావలివా రెవ్వ రనుమానించ లేదు. అట్టుపోయి యాజాబును రంగరాయలకిచ్చెను. అతఁ డాజాబును చదువుకొని యాచమనాయఁడు దనయందుఁ గనుపఱచెడు భక్తివిశ్వాసముల కాతనిమెచ్చికొనుచు రెండవకుమారుని రామదేవరాయనిఁ బిలిచి యాసంగతి నంతయు నాతనికి నచ్చఁజెప్పి నీ కెంతమాత్రము భయము లే దని బోధించి యాపండ్రెండేండ్లబాలుని వానిపరము చేసెను. వాని నొక గంపలోఁ బరుండఁ బెట్టి మాసిపోయిన గుడ్డలతోఁ గప్పి పైన మిక్కిలిగమాసి యంటువడి యున్న గుడ్డలను గప్పి యతిసాహసముతో నాగంప నెత్తికొని వచ్చినదారిని పోయెను. కావలి వారతని నెఱింగినవా రగుటచేతను ప్రతిదిన మట్లు చాకలి వాండ్రు పోవుచుండుట చేతను వారి కెట్టి యనుమానమును గలుగకుండుటచే యధాప్రకారము ద్వారములగుండఁ బోనిచ్చిరి. అతఁ డంటుగుడ్డలు మోసికొని పోవుచున్నాఁ డని యితరు లందఱును వానికి దూరముగాఁ దొలఁగుచు వచ్చిరి గాని యెవ్వరికి నెట్టివిధ మైనయనుమానమును గలుగలేదు.

అట్లు చాకలివాఁడు నిరాటంకముగా నిర్భయుఁ డై కోటనుదాటి యొక రహస్య ప్రదేశమునకుఁ గొనిపోయి వానిని బయటకుఁ దీసి యాబాలుఁడు తనకు నాతనికి నెట్టి విధమైన విపత్తు గలుగకుండ నట్టికష్టమున కోర్చియుండినందు కాతఁ డదృష్టవంతుఁ డని భావించి శ్లాఘించుచు నాప్రదేశముననే మూఁడుదినము లుండునట్లునియమించి నాల్గవనాఁ డెవ్వరికిఁ దెలియకుండ నాతని యాచమనాయని చెంతకుఁ జేర్చెను. అంతటి మహోపకారమును గావించినందుకు వానిని మెచ్చికొని తాను చెప్పిన ప్రకారము కొంతధన మొసంగి రామదేవుని పట్టాభిషిక్తుని గావించిన వెనుక తనవాగ్దత్తము సంపూర్ణముగా నెఱవేర్తునని చెప్పి వానిప్రాణమును గాపాడుట కభయప్రదానముగూడఁ జేసెను.

అటుపిమ్మట నెద్దియో కపటోపాయమున రంగరాయల రెండవకుమారుని యాచమనాయఁడు తనచెంతకుఁ జేర్చికొని యున్నాఁడని జగ్గరాయనికిఁ దెలియవచ్చెను. అట్లు తన్ను మోసపుచ్చినందుకు నతఁడు క్రోధోద్దత్తుఁడై రంగరాయని కారాగృహమునకు మునుపటికంటె నిబ్బడిగాఁ గాపువెట్టి యాతని వెచ్చమునకుఁగా నిచ్చుభృతిని తగ్గించుటయెగాక సన్నని బియ్యమునకు బదులుగా ముతుక బియ్యమును, చచ్చుపుచ్చు కూరగాయలను మాత్ర మిప్పించుటకుఁ గట్టడిచేసెను.

వెలుగోటి యాచమనాయఁడు రంగరాయని రెండవ కుమారుడు రామదేవరాయని మాయోపాయముచేతఁ జెఱనుండి విడిపించుకొని చెంతకుఁ జేర్చికొని వానికిఁ బట్టము గట్ట నున్నాఁడనువార్త యగ్నిహోత్రమువలె సర్వత్ర వ్యాపించెను. అంత రంగరాయని పక్షమువారు, జగ్గరాయల భయముచే నణఁగిమణఁగి పడియున్న మండలాధిపతులు, దండనాయకులు, తదితరులు నిట్లు తలపోసిరి. "ఈరాజ్యమునకు వాస్తవమైన హక్కుదారుఁడు రంగరాజుగాని జగ్గరాజు మేనల్లుఁడు కాఁడు. వాఁడు కృతిమపు ప్రభువు. వీనికి సామ్రాజ్యము కట్టఁబెట్టుట మనకు ధర్మము కాదు. కనుక మనమెల్లరము మనసైన్యములతో జగ్గరాయల బంధము నుండి తప్పించుకొని యాచమనాయని సైన్యములలోఁ జేరి రామదేవరాయనికిఁ బట్టము గట్టుట పరమధర్మము."

ఇట్లు చింతించి వా రెల్లరును ధైర్యసాహసములఁ జూపి తమతమ పరివారములతోను సైన్యములతోను యాచ మనాయనిఁ జేరుటకు సంకల్పించుకొని తమనిశ్చితాభిప్రాయమును యాచమనాయనికిఁ దెలియఁజేసిరి.

ఇట్టి శుభవార్త వినవచ్చినపుడు యాచమనాయని యుత్సాహ మినుమడించి రంగరాయని నె ట్లయిన విడిపించవలయునని యభిలాష మరల యుదయించెను. తనకు విశ్వాసపాత్రులును తెలివితేటలు గలిగి నేర్పరు లయిన యువకులను గొందఱను రప్పించి వారల కిట్లు బోధించెను. "మీరు రంగరాయని చెరశాలయున్న దుర్గమునకుఁబోయి మీ నేర్పరి తనముఁ జూపి యాదుర్గములో నుద్యోగములు సంపాదించుటకుఁ బ్రయత్నింపుఁడు. ఈ కార్యమునందు మీకు జయము గలిగినపక్షమున రహస్యముగా నితరులకు గానరాకుండు నటుల వెలుపలనుండి రాయలుండు గృహములోనికి భూమిలోపల నొకసొరంగమునుఁ ద్రవ్వి రంగరాయని దీసికొని రావలయును. మీకర్హ బహుమానములను విరివిగాఁ జేయింపఁగలను."

అని చెప్పి వారిని పంపించెను. ఆతని యాజ్ఞను శిరసావహించి వారు పోయి తమ నేర్పరితనమునుజూపి, యుద్యోగములను సంపాదింపఁగలిగిరి. ఈ ప్రయత్నమునందు విజయము లభించినందువలనఁ దమ ప్రభువుమీదఁ గల భక్తి విశ్వాసములు వెల్లడి యగునట్లు తాము వచ్చినకార్యమునకుఁ బూనుకొని యా సొరంగమును ద్రవ్వి యొకనాటిరాత్రి రంగరాయని గదిక్రిందికివచ్చి యుపరిభాగమును బెల్లగించి గదిలో బ్రవేశించినపుడు రంగరాయలు వారినిగాంచి వారలను జగ్గరాయలబటులుగాఁ దలంచి తన్నుఁ జంపుటకు వచ్చినవా రని భావించి భయపడియు వీరపురుషోచిత మైనధైర్యముతో నుండి నిశ్చేష్ఠితుఁ డయ్యెను. అంత వార లాతనికి సాష్టాంగ నమస్కృతులు గావించిరి. వారి నాయకుఁ డగు నొకయువకుఁడు యాచమనాయకుఁ డిచ్చిన ------కుజాబునుఁ దీసి యాతని కిచ్చెను.

అంతట తత్తరముతోఁ రంగరాయ లాజాబునుఁ జదువుకొని యాచమనాయకుని భక్తివిశ్వాసముల కబ్బురపడుచుఁ దన దురవస్థను దలపోసికొనునప్పుడు లోపలినుండి యుబుకుకొని వచ్చెడు దుఃఖప్రవాహము నాపుకొని 'ఇటువంటి భక్తివిశ్వాసములతోఁ గూడికొని ధైర్యసాహసములఁ జూఁపుచు నన్నుఁ జెఱనుండి తప్పించుటకుఁ జూపిన యీ మార్గము నుల్లంఘించుట తనవంటివానికి యుక్తము గా' దని పలికి భార్యకును, బిడ్డలకును జెప్పి తాను కట్టుకొనియున్న దుస్తులను విసర్జించి యొక చిన్న యంగవస్త్రమును జుట్టఁ బెట్టుకొని వారల వెనుక సొరంగములోనికి దిగి సొరంగము మార్గమున బయలు వెడలెను. దుమ్మును, ఱాళ్లును పైఁ బడుచుండ చేతులు, మోకాళ్లును క్రిందనాన్చుకొని యొక్కపలుకైన బలుకకుండ నూపిరి విడుచుట కష్టముగా నున్నను సహించి చాలదూరము ప్రాకుచు వచ్చిరిగాని దురదృష్టవశమునఁ గస్తీ తిరుగుచున్న కావలివాఁ డాసమయమున నాసొ రంగముపై నడుచుట సంభవించి భూమిపై పట్టతిమాత్రముగా నుండుటచేత నాసొరంగములో వారిపై బడుట సంభవించెను. అయ్యది కత్తులు దూయుట కనువగు ప్రదేశము కాదు. రాయలను సురక్షితస్థానమునకు త్వరలోఁ గొనిపోవుటకు సాధ్యము గాదు. ఈ కావలివాని మొఱ్ఱల నాలకించి తక్కిన కావలివాండ్రందఱు నొక్కపెట్టునఁ బఱువెత్తుకొని వచ్చి అంగవస్త్రము మాత్రము గలిగి దేహమంతయు దుమ్ముతోఁ గప్పఁబడి మోకాళ్ళుకొట్టుకొనిపోయి రక్తము గారు చుండ రంగరాయలను జగ్గరాయలకడకు నీడ్చికొని పోయిరి. అతఁడు కోపము పట్టఁ బగ్గములులేక యువ్వెత్తువ లేఁచి మండిపడుచు నాతనికి ప్రత్యేకముగాఁ జీకటికొట్టుకైదు విధించి చంద్రగిరిదుర్గమునకుఁ బంపించెను. అటుపిమ్మట వాని భార్యను, బిడ్డలను నచటికే పంపెను. వీరిప్రయత్నము విఫలమై రంగరాయనిబ్రతుకు మఱింత దుర్భరమైపోయినందుకు ఖేదపడుచు యాచమనాయఁడు ధైర్యసాహసముల ప్రసిద్ధిగాంచి విశ్వాసపాత్రుఁడుగా నున్న మఱియొక యువకుని రప్పించి ఓయీ! రంగరాయలు చంద్రగిరిదుర్గమున నున్నవాఁడని వినుచున్నాను. ఇపు డాదుర్గమును సంరంక్షించుచున్న భటుల సంఖ్య తక్కువగా నున్నట్లు తెలియుచున్నది. మఱియు జగ్గరాయలు తనపక్షమును బలపఱచుకొనుట కై మండలాధిపతులకడకుఁ బోయియున్నాఁ డని వినుచున్నాను. ఇచటి నుండి నాసైన్యములతో నేను కదలితినా జగ్గ రాయనికిఁ దెలిసి తన యరువదివేలమంది సైనికులతో వచ్చి మనపైఁబడి మనల నఱకి వేయును. నీకు తోడుగా నీవంటి వీరభటులనే యైదునూర్ల మందిని నీకు స్వాధీనపఱచు చున్నాను. నీవు నాయకత్వమును వహించి చంద్రగిరిదుర్గమును భేదించి రంగరాయనిఁ జెఱనుండి విడిపించికొని రాఁ గలవా' యని ప్రశ్నించెను. ఇది యెంతకార్య మట్లే కార్యము నిర్వహించుకొని వత్తును. ప్రాణములనైన గోల్పోవుదును కాని రాయలను తీసికొని రాకుండ రిక్తహస్తములతో రా నని ప్రతిజ్ఞావాక్యములను ధైర్యముతోఁ బలికెను.

అ ట్లయిదువందలసైనికులతను సనద్ధము చేసి యాతనికి నాయకత్వము నొసంగి పంపెను. అంతట నావీరయువక నాయకుఁడు ధైర్యముతోఁ బోయి యాకస్మికముగా దుర్గముపైఁ బడి కావలివానిని సంహరించి ద్వారములను వెల్వరించి కొనిపోయి రక్షకసైన్యముపైఁ బడి నురుమాడఁగా వారి యెదుట నిల్వజాలక హతశేషు లయినవారు పఱువిడి పోయిరి. ఈ విజయవార్తను యాచమనాయకునికిఁ బంపుచు జగ్గరాయలును, వానిసైన్యములును వచ్చి మమ్ము ముట్టడించకమునుపే మాకు సహాయార్థము గొంత సైన్యమునుఁ బంప వలసిన దని యావీరయువకుఁడు ప్రార్థింపుచు వ్రాసెను గాని యీ సైన్యము వచ్చి వారిని గలిసికొనుటకుబూర్వమే జగ్గరాయలసైన్యములు వచ్చి దుర్గములోఁ జొఱఁబడి యాభటుల నొక్కని విడిచిపెట్టక సంహరించివైచిరి. ఈప్రయత్న మిట్లు తుదముట్టినవెనుక జగ్గరాయలు రంగరాయలు బ్రతికియున్నంతదనుక యాచమనాయఁ డిట్టి ప్రయత్నములనుఁ జేయుచుండక మానఁ డని తలంచి రంగరాయని, వానికుటుంబమును దెగటార్చవలయునని నిశ్చయించికొని ఘోరమైన హత్యకుఁ బూనికొనియెను. యాచమనాయఁడు శక్తివంచనలేక యెన్నివిధములచేతఁ బ్రయత్నించినను రంగరాయని రక్షింపఁజాలకపోయెను. విధిచైదమున కడ్డమేమి యుండును?

ఒకనాఁడు జగ్గరాయలు నీచుఁడును, దుర్మార్గుఁడును, హంతకుఁడును, మానవస్వాభావికవర్తనమునకు విరుద్ధవర్తనము గలవాఁడు నగు తనసోదరుని రప్పించి వాని నిట్లు ప్రేరేపించెను. సోదరా! ఈయాచమనాయఁడు నాకు మనశ్శాంతి లేకుండఁ జేయుచున్నాఁడు. ఎప్పటికైన నీతఁడు మనప్రాణముల దీసికొనక మానఁడు. ఎన్నియో భూములు, ద్రవ్యము, పదవులు నొసంగెద నని యెంతయాస వెట్టినను, తనపట్టినపట్టు విడువక రంగరాయని పైగలప్రేమ వీడకయున్నాఁడు. ఎంత కాలము రంగరాయలు బ్రతికియుండునో యంతకాల మాతనిం దక్క యన్యులఁ గొలువఁజాలఁడు. రంగరాయల మరణము మనకు క్షేమకరము గావునఁ దక్కినవిషయము నీకు విడిచి పెట్టుచున్నాను."

ఇట్టి పల్కులు తనయన్ననోటనుండి వెల్వడినతోడనే యాదురాత్ముఁడు కత్తిదూసి "ఇదెంతటి కార్యము నేను నిర్వహించి వత్తు" నని బయలువెడలిపోయెను.

ఇట్లాతఁడు తన్ను తా నెఱుంగని చిత్తముతో మానుషస్వభావమును సంపూర్ణముగా విడిచిపెట్టి రాక్షసాకృతి వహించి రంగరాయ లున్నప్రదేశమును వెదకికొనుచుఁ బోయి యాతని వీక్షించి "ఓయీ! రంగా! నేటితో నీకు కాలము పరిసమాప్తిఁ జెందినది. ఆ పని నీకత్తితో నీవు తీర్చుకొందువా? ఆ కార్యము మఱియొకఁడు తీర్పవలయునా? వెంటనే ప్రత్యుత్తర మిమ్ము. ఇంక జాగుసేయఁ దగదు." అని గట్టిగా నొత్తి పలికెను.

వీని యాకృతిని వీక్షించియు, వీని క్రూరము లయిన వాక్కుల నాలించియు క్షాత్రవంతునికుండు ధైర్యమును వీడక యాతనితో 'ఓయీ నేను మరణముతో నాకన్నులను మూయులోపల నాభార్యను, బిడ్డలను జూడవలయు నని యున్నది. నా కావర మొసంగవా? యని పలికెను.

అంత భార్యయు, బిడ్డలును నాతనికడకు వచ్చిరి. వారలనుఁ జూచి విచారింపక తెగువతో శాంతవచనముల నిట్లు పలికెను. 'నే నిపుడు చావవలయును. నే నెవ్వరికి నెట్టి యపకృతియుఁ జేసి యుండలేదు. అన్యాయముగా నొకరి సొత్తు నేను దీసికొన లేదు. చా వన్న భయము నాకు లేశమాత్రములేదు.' అని పలికెను.

"ప్రభూ! అట్లనే కానిమ్ము. నన్ను నీ శత్రువులబాఱి పడకుండ ముందుగ ద్రుంచివేయుము. అదియె నా కోరిక; నీకు పాపము లేదు. ఇంతకన్న నా కేమియుఁ గోరిక లేదు. నా కోరిక దీర్పుము" అని ధైర్యముతో నామె వేఁడికొనెను.

అంత రంగరాయలు మాఱుమాట పలుక లేదు. తన చద్రాయుధముతో నామె వక్షఃస్థలమును బొడిచివైచెను. వానికుమాళ్ళ నిరువురను, ఒక కుమార్తెను, నట్లే గావించెను. ఇం కొకయాడుబిడ్డ గలదు. ఆబిడ్డ యేడువ లేదు. రాయల కాబిడ్డయందెక్కువ మక్కువ యుండెను. ఆబిడ్డ విచారముతో తండ్రినిఁ జూఁచుచు నిలువంబడి యుండుటను జూచి రంగరాయలు గిఱ్ఱున వెనుకకుఁ దిరిగి కత్తితోఁ తన వక్షఃస్థలమును పూర్ణమైన సత్తువతోఁ బొడుచుకొని క్రిందికొఱఁగి ప్రాణములను విడిచెనఁట! ఆపాపాత్ముఁ డగు జగ్గరాయనితమ్ముఁడు మరణముఁ జెందిన రాయనిబిడ్డ బ్రతికియుండరా దని మానుషత్వమును విడిచి తనఖడ్గముతో నాచిన్ని యాడుబిడ్డనుగూడఁ ద్రుంచివైచెనట! ఈ విధానము పోర్చుగీసువారి లేఖలు సారాంశమునుబట్టి వ్రాయఁబడినది.

కాని యొకనాటిరాత్రి ద్రోహి యైనజగ్గరాయలే వారి కారాగృహమును బ్రవేశించి నిద్రపోవుచున్న రంగరాయని, వానిభార్యను, బిడ్డలను సంహరించిరని యాకాలమున రచింపఁబడిన సాహిత్యరత్నాకరము, రఘునాథాభ్యుదయ మను గ్రంథములనుఁబట్టి తెలియు చున్నది. ఎట్లయినను యాచమనాయనిచే సరంక్షింపఁబడిన రాకుమారుఁడు తక్క రంగరాయని కుటుంబమంతయు నాతనితో నీవిధముగా నాశనమై పోయినది.

ఇట్టి దుష్కృత్యమును గావించిన జగ్గరాయలకు మనశ్శాంతి యెక్కడ కలుగును? యాచమనాయని కీఘోరమైన వృత్తాంతము చెవినిఁబడినతోడనే యాగ్రహమహోదగ్రుఁడై జగ్గరాయని కిట్లు వర్తమాన మంపెను.

"ఓజగ్గరాయా! నీస్వాధీనములో నున్న నీ ప్రభువును, వానిబిడ్డలను దయ లేశములేక సంహరించి పౌరుషహీనులు గావించు దుష్కృత్యముఁ జేసినావు. అది వీరపురుషధర్మము కాదు. నీవు పురుషుఁడ వైతేని యారాయలపుత్రుఁడే యొకఁడు సురక్షితముగా నాకడ నున్న వాఁడు. వానిని నాతోఁ గూడ నీవును నీసైన్యములు వచ్చి బహిరంగప్రదేశమునఁ గత్తికట్టి పోరాడి జంపుఁడు. అప్పుడుగాని నీవును నీమేనల్లుఁడును ప్రభుత్వము సేయుటకు సమర్థులు కారు. అట్లు చేసిన నాడె నీమేనల్లుని సింహాసనమునఁ గూర్చుండబెట్టఁగలవు. అంత పర్యంతము రాజ్యము నీకుగాని నీమేనల్లునకుగాని స్వాధీన మైన దని తలంపకుము. నిన్ను మాత్రము ప్రాణములతో విడుచువాఁడను గా నని యెఱుంగుము. ఇట్టి దుర్మార్గముఁ జేసిన నిన్ను దునుమాడుదనుక నీయాచమనాయఁడు నిద్రించు వాఁడు కాఁడని నమ్ముము.

జగ్గరాయలు గావించిన యీదుష్కృత్యము దేశమం దంతట వెంటనే వ్యాపించెను. అట్లు వ్యాపించినతోడనే రంగరాయలయం దభిమానము, విశ్వాసముగల సామంతరాజులు, భక్తివిశ్వాసములు గలదండనాయకులు, న్యాయము, ధర్మము దప్పనిభృత్యులు, కోపోద్దీపితులై దుర్మార్గుఁ డైనజగ్గరాయని నాశనము చేయవలయునని నిశ్చయించుకొనిరి. దుర్మార్గుఁ డైనవాఁడు కాలక్రమమున నాశనము జెందకపోఁడనియుఁ బ్రజలఁ బీడించి మోసమున సజ్జను లైనవారి కపకారము జేయువాఁడు తప్పక నాశనమగుననియు, యాదుర్వార్తవినిన వారు తలంచిరి. వీరపురుషు లనేకులు కత్తిగట్టి యాచమనాయనిపక్షమునఁ బూని జగ్గరాయని దునుమాడుదిన మెన్నడు చేకూరునా యనితలంచుచుఁ దగుప్రయత్నములఁ జేయు చుండిరి. సామంతరాజులనేకులు దుర్మార్గుఁ డైనజగ్గరాజును తుత్తునియలుగ నఱికి రంగరాయలుకుమారుఁడు బాలుఁడు నైనరామదేవరాయని సామ్రాజ్యాధిపత్యమున నిల్పి పట్టముఁ గట్ట సంకల్పించి సేనానివహముల సమకూర్పఁ దమ దండనాయకుల కాజ్ఞాపించిరి. దేశములోని ప్రజలెల్లరు రాజకుటుంబమును నాశనముఁ జేసినవాఁడు ప్రజలరక్షించునా యనియుఁ బ్రజల మాయోపాయమున వంచించి పరిపాలింప నెంచినవాఁడు నాశనముగాక మానఁ డనియుఁ దలంచి జగ్గరాయని నాశనము విను దిన మెప్పుడు సమకూడునా యని తలంచు చుండిరి. దుర్మార్గుల నాశనము జేయకున్న లోకము దుఃఖ పరంపరలపాలు గాక మానదని తలంచి సంస్థానములోని వీరు లంద ఱొకటై సేనలలోఁ జేరి యాచమనాయనికి బాసటయై నిలువ సంకల్పించిరి. జగ్గరాయలును నట్టిప్రయత్నమునం దేమరక యనేక మండలాధిపతులను మాయోపాయవిధానములఁ దనప్రక్కకు నాకర్షించు చుండెను. సామ్రాజ్యమున నిరుపక్షములేర్పడినవి. అఱువదివేల సైనికులను జగ్గరాయలును, ముప్పదివేల సైనికులను యాచమనాయఁడును ప్రోగుచేసిరి. ఇందెవ్వరును దక్కనుసుల్తానుల నాహ్వానింప లేదు. వారుగూడ నిందు జోక్యమును గలిగించుకొనలేదు. జగ్గరాయలకు సైన్యమెక్కువగలదని యాచమనాయఁ డెన్నడును భయపడియుండలేదు. సత్యము, ధర్మము, తన ప్రక్కఁ గలదను దృఢవిశ్వాసముతో, నున్నవాఁడు యాచమనాయఁడు. తనకే జయము కలుగునన్న విశ్వాసముతో రామదేవరాయని వేయికన్నులతోఁ గాపాడుచుఁ బదివేలసైన్యములనడుమ నుంచుచు వచ్చెను. వేంకటపతిరాయలు మరణముఁ జెందినవెనుక మూఁడు సంవత్సరములకాల మీతగవులలోఁ గడిచిపోయినది. అనేకపర్యాయములు రామదేవరాయనిఁ బట్టుకొన వలయు నని జగ్గరాయలు యాచమనాయని సైన్యములను దలపడుచు వచ్చెను గాని యాతనికి విజయము సమకూర లేదు. యాచమనాయఁడు తనసైన్యములను మూఁడునాలుగు భాగములుగా విడఁదీసి దగ్గఱగా నుంచుకొనుచు రామదేవరాయ లేభాగమున నున్నదియుఁ దెలియకుండఁ జేయుచు వచ్చెను. రాజబంధువులనేకులు రామదేవరాయలపక్షమును వహించి యాచమనాయనితోఁ జేరిరి. కాని యధిక సైన్య ములు గలవారును బలాఢ్యులు నైనతుండీరమండలాధిపతి యగు కృష్ణప్పనాయకుఁడును పాండ్యమండలాధిపతి యగు ముద్దువీరప్పనాయఁడును వేంకటపతిరాయలయెడఁ గల పూర్వ ద్వేషమును బురస్కరించికొని జగ్గరాయలపక్షమునఁ జేరినందున నతనిబల మెక్కువగా నుండెను. అందుచేత యాచమనాయఁడు తనపక్షమున నింకను సైన్యము నధికముగ సమకూర్చు కొనవలసియుండుటచేత మనస్ఫూర్తితో జగ్గరాయల సైన్యముల నెదుర్కొనక తప్పనిపట్టుదల సర్వరక్షణార్థము పోరాడుచు గాలయాపనము సేయుచుండవలసి వచ్చెను గాని పౌరుషము కొఱవడి గాదు. జగ్గరాయల సైన్యములు తుండీరమండలాధిపతి యగు కృష్ణప్పనాయకుని సైన్యములతోఁ గలిసికొని రామదేవరాయనిఁబట్టుకొనుటకై రామదేవరాయని పక్షమునుబూనిన సైన్యములను, అనఁగా యాచమనాయనిఁ జేరిన సైన్యముల నెదుర్కొనుచు నచట రామదేవరాయలు లేకుండుట దెలిసినేని వారిని వీడి మరి యొకసైన్యమును దలఁపడు చుండెను. వేంకటపతిరాయల యెడఁగల పూర్వవైరమును పురస్కరించుకొని తుండీర మండలాధిపతి యగు కృష్ణప్పనాయకుఁ డిదివఱకె జగ్గరాజు సైన్యములనుఁ గలిసికొని చిక్కుకలిగించుచున్నాడు. మధుర నాయకుఁడును వీరవేంకటపతిరాయలయెడఁ గలపూర్వవైరములను బాటించియె జగ్గరాయనికి బాసట యయ్యెను. జగ్గరాజు, తుండీరమండలాధిపతియు గలిసి మధురనాయకుఁడగు ముద్దువీరప్పనాయని సైన్యములతో జేరుకొనవలయు నని చేయు ప్రయత్నములను భగ్నము గావింపుచు దమ సైన్యములను మధురనాయకునకు శత్రువును, వీరవేంకటపతిరాయల భృత్యకోటిలోనివాఁడై యత్యంత మిత్రుఁడుగా నుండి సామ్రాజ్యపక్షమున నున్న తంజావూరినాయకుఁ డగురఘునాథ నాయని సైన్యములఁ గలిసికొనవలయు నని యాచమనాయఁడు మొదలుగా రాజపక్షమువారి ప్రయత్నములను భగ్నము గావింపుచు జగ్గరాజు మొదలుగా రాజద్రోహ పక్షమువారును, బ్రయత్నించుచుండుటవలన నాకాలమునఁ బలుతావులయందు నుభయపక్షములవారికిని ఘోరయుద్ధములు జరుగుచు వచ్చెను. ఎంతటిమహావీరుఁ డైనను రఘునాధనాయనితోఁ గలియకున్న యాచమనాయఁడు జగ్గరాయని సైన్యములను, వారిపక్షమువారి సైన్యములను నోడించుట సులభసాధ్య మగు కార్యము కాదు. యాచమనాయనికి రఘునాథరాయలను గలిసికొనవలయునన్న తుండీరమండలాధిపతి రాజ్యములోనుండి పోవలయును గాని వేఱొక మార్గ మనువుగఁ గన్పట్టలేదు. ఈసందర్భమున జగ్గరాయని తోను, వానిపక్షమునఁజేరి సామ్రాజ్యమునకు విద్రోహులుగాఁ బ్రవర్తించుచున్న తదితరులతోను యాచమనాయనికి జరిగిన యుద్ధములనే తనబహుళాశ్వచరిత్రమునందు దామర్ల వెంగళభూపాలుడు తన బావమఱఁదియగు యాచమనాయని శౌర్యకృత్యములను దావలుపాపవిభు నుత్తరమల్లూరి కడ నోడించుటయు, మన్నె రాజులను తిరుపతినుండి బాహు విక్రమంబునఁ బాఱఁదోలుటయు, చెంగలుపట్టు నాక్రమించిన రీతియు, పాలెంబుకోటబహిర్భాగమున యతిరాజుపై గవిసి చూపిన శౌర్యపటిమయు, అంతకుముందె జగ్గరాజుమున్నగు ప్రముఖులను తిరుచనాపల్లిదొరను పీచమడంచుటయు వర్ణించెను.

ఇతఁడు ఉత్తరమునుండి దక్షిణదిశకు శత్రుసైన్యముల నడుమనుండి యుద్ధములుసేయుచు విజయములను గాంచుచు రఘునాథరాయనిఁ గలిసికొనుటకై పోవుచుండుటయు నిపుణముగ దెలిపెను. ఈమహావీరుఁడు తనపట్ల మహాద్వేషముతో నున్నరఘునాధనాయనితోఁ గలిసికొన్న యెడల నగ్నికి వాయువు తోడ్పడినటుల రామదేవరాయని పక్షము వారు విజృంభించి తప్పక రామదేవరాయనికిఁ బట్టముఁ గట్టఁగల రని భయబడుచు నీతని జగ్గరాయ లడ్డగింపుచు వచ్చెను. పైన నీవీరునిచే చేటొందిన యతిరాజు జగ్గరాజునకు దాయాది. ఇతఁడు రామదేవరాయలు పట్టాభిషిక్తుఁడు గాకుండ నడ్డుపెట్టిన ద్రోహులపక్షముననుండి యుద్ధములు చేసి పలాయనుఁ డయ్యును రామదేవరాయలు పట్టాభిషిక్తుఁ డయినవెనుక వానికి తనకుమార్తె కొండమ్మ నిచ్చి వివాహముఁ జేయవలసిన వాఁ డయ్యెను.

ఈ విషయము తుండీరమండలాధిపతి యగుకృష్ణప్పనాయని, వీరవేంకటపతిరాయ లీతఁడు సామ్రాజ్యమునకు ద్రోహియై ప్రవర్తించినందువలనఁ బెనుగొండనగరమునఁ జెఱబెట్టి యున్నప్పుడు రాయలకు విశ్వాసపాత్రుఁడై భక్తితో మెలఁగిన రఘునాధనాయనికోరిక ననుసరించి బంధవిముక్తుని గావించెను. ఆవిశ్వాసముచేత నితఁడు తన కుమార్తెలలో నొకర్తును రఘునాధనాయిని కిచ్చి వివాహము చేసెను. ఇట్లు జరిగినను దుర్మార్గుఁడై యీతఁడు రఘునాధనాయని శత్రువు లగుమధురనాయకుఁ డయిన వీరప్పనాయనితోడను, వానిమిత్రుఁడగు జగ్గరాయలతోడను కలసి యల్లుఁడయిన రఘునాధనాయనితోడను. రామదేవరాయల రక్షకుఁ డగుయాచమనాయనితోడను బోరాడుటకు సిద్ధపడెను. యాచమనాయఁడు రఘునాథనాయనితోఁ గలియకుండ నెన్నియో యాటంకములను గల్పించి యడ్డు పెట్టుచు వచ్చెను. ఇంకను విశేష మేమన నితఁడు పోర్చుగీసువారికిఁ బరమమిత్రుఁడు గాఁ గూడ నుండెను. వీని సైన్యములలో నొక పోర్చుగీసుపటాలము గూడ నుండెను.

ఈ పోర్చుగీసుభటులను యజ్ఞనారాయణదీక్షితులు తన సాహిత్యరత్నాకరమునందు 'పొడవుగ నుండు మీసములు గలవారనియు, వంగిన కనుబొమ్మలు గలవా రనియు, కోలమోము గలవా రనియు, రాగిరంగు మేనులు గలవా రనియు, టోపీలలో నెఱ్ఱని పక్షియీకలను ధరించువా రనియు, ఎఱ్ఱని లాగులను తొడుగువా రనియు, కవచములు ధరించువా రనియు, పెద్దకత్తులను చేఁబూనువా రనియు నభివర్ణించి యున్నాఁడు. యాచమనాయని సైన్యములు రఘునాథనాయని సైన్యములను జేరకుండుట కై జగ్గరాయలు ప్రోత్సహించినందువలన మధురవీరప్పనాయఁడు కావేరి కడ్డముగాఁ గట్టఁబడిన పెద్దయానకట్టనుగూడ బ్రద్దలు కొట్టి నాశనము గావించె నని సాహిత్యరత్నాకరమునందును, రామభద్రాంబ విరచిత మగు రఘునాధాభ్యుదయమునందును, గూడఁ దెలుపఁబడి యుండెను. ఈ సందర్భమున రాజ విద్రోహ పక్షమువారు చేసిన దుండగములను జెప్ప నలవికాదు. ఇంత చేసినను యాచమనాయఁడును, రఘునాథనాయఁడును వీరి ప్రయత్నముల నన్నిటిని భగ్నము గావించి విజయపతాక మెత్తుట తప్పినది కాదు.

యాచమనాయఁడు రామదేవరాయనివెంటనిడుకొని వచ్చుచున్నాఁ డని విని తాను తన సైన్యములతో కుంభకోణమునకుఁ బోయి వారలను గలిసికొని కుంభకోణము నందు రామదేవరాయలను బట్టాభిషిక్తునిఁ జేయుటకు నిశ్చయించికొని రాజ్యపరిపాలనాభారము నంతయు మంత్రియగు గోవిందదీక్షితుల పైఁ బెట్టి బయలు వెడలెను.

అట్లు బయలువెడలి రఘునాథనాయకుఁడు కుంభకోణమువద్ద రామదేవరాయలను వానిరక్షకుఁ డగుయాచమనాయనిఁ గలిసికొని వారలను తంజావురికిఁ గొనివచ్చెను. విజయనగరసామ్రాజ్యము దక్షిణభాగముననున్న చోళమండలము వారొక్కరు తక్క తక్కిన వారెల్లరును సామ్రాజ్యవిద్వేషు లై జగ్గరాయలపక్షమునఁ జేరికొనిరి. ఉత్తరభాగమునందలి మండలాధిపతులలోనే యిద్దఱుముగ్గురొ తక్క తక్కినవారు రామదేవరాయని ప్రక్కజేరినవా రగుటచేత ప్రధానయుద్ధ రంగము దక్షిణదిశయందే యేర్పడుటచేత నుత్తరమండలాధిపతుల సైన్యముల సంఖ్యకంటె దక్షిణమండలాధిపతుల సైన్య మధికముగ జేరుట కనుకూలపరిస్థితులు కలవు. కాన తంజాపురాధీశ్వరుఁడు రఘునాథనాయకుఁడు సామ్రాజ్యపక్షమునఁ జేరుటచేత నాలోపము గన్పట్ట లేదు. మఱియును జగ్గరాజు పన్నిన దుస్తంత్ర ముత్తరమండలములవారికి బోధపడునట్లు దక్షిణమండలములవారికి బోధపడి యుండక పోవచ్చును. అదియునుగాక తుండీరమధురమండాలాధిపతులు జగ్గరాయని చేరుటకూడఁ గా వచ్చును. కొందఱు జగ్గరాయని పక్షమే న్యాయ మైనదని తలంచి యుండ వచ్చును. ఈ తుది యుద్ధమునాఁటికి జగ్గరాయలు తననాయకత్వమును పాండ్యమండలాధీశ్వరుఁ డగు వీరప్పనాయనికిని, యాచమనాయఁడు తన నాయకత్వమును చోళమండళాధీశ్వరుఁ డగురఘునాథ రాయనికిని విడిచిపెట్టి రని చెప్పక తప్పదు. ఇట్లుభయపక్ష సైన్యములకు గావేరీతీరమున తోపూరుగ్రామ సమీపమున ఘోరసంగ్రామము జరిగినది. ఈ యుద్ధము 1616 - 17 సంవత్సరమున జరిగినట్లు గుంటూరివాస్తవ్యుఁ డయిన అయ్యపరాజు నారప్ప వ్రాసిన కమ్మనక్కణ మను లేఖ వలనఁ దెలియుచున్నది. ఈ క్రిందిలేఖ తంజాపురీశ్వరుఁడును, రఘునాథనాయని పుత్రుఁడు నగు విజయరాఘవనాయనిచే రచియింపఁబడిన 'రఘునాథాభ్యుదయ' మను నాటకమునఁ జొనుపఁబడి యన్నది.

కమ్మవక్కణః-
              "శ్రీమన్మహాచోళ సింహాసనేంది
               రా మనోహరు లైనరఘునాధ
               నయ్యవారికి యుత్తరాది గుంటూరి
               యయ్యపరాజు నారప్ప విన్నపము.
               లంచిత నలవత్సరాషాఢ శుద్ధ
               పంచమీపుష్యార్కపరిఘయాగమున
               స్వామివారా పళవానేరినగర
               నామతీర్థము పురాణశ్రవణంబు
               రామవిగ్రహపూజ రామజపంబు
               శ్రీమూర్తి దానాద్య శేషదానములు
               గావించి విజయంబు గలుగ నక్షతలు
               శ్రీవైష్ణవు లొసంగ శిరమునఁ దాల్చి
               ఆదిత్యహృదయజపానంతరమున
               నయుదారుగడియలయపు డారగించి
               భేరుల మ్రోయించి పెండ్లికిఁ బోవు
               తీరున తగిన ముస్తీదు గావించి
               యెదుటి పాళెంబున కెఱుక సేయించి

               కదలి వచ్చి విజయగరుఁడాద్రినెక్కి
               రామభద్రగజాధిరాజంబు నెక్కి
               రామభద్రకుమారరత్నంబు గొలువ
               మతిశాలి పురుషోత్తమయ నరసప్ప
               జతగూడి నగరిమదాశీల్ గనుక
               యెదు రెచ్చరించుడు నేకపార్శ్వమున
               మదగజం బెక్కి సమ్మదమున నడువ
               అస్తెప్పయళగప్ప యాప్తు లై యొక్క
               మస్తేన్గుపై నెక్కి మక్కువ నడువ
               రాజులు మన్నీలు రౌతులు దొరలు
               తేజీల పై నెక్కి ధీరు లై కొలువ
               చేరున నొక గంధసింధురం బెక్కి
               యారామ దేవరాయలు చనుదేర
               తరతరమ్ములకును తగ లైనకతన
               నెఱనమ్మఁ దగినకోనేటి కొండ్రాజు
               కట్టరంగపరాజు కస్తూరిరాజు
               మిట్టపాళెంపు సంపెటనాగరాజు
               రామరా జలయౌకు రఘునాథరాజు
               మామ ఓబలరాజు మనుబోలురాజు
               శ్రీరంగపతిరాజు శ్రీగిరిరాజు
               వీరరాఘవరాజు విఠ్ఠలరాజు
               నందేలచిట్రాజు నారపరాజు

               కందనవోట్రాజు గడితిమ్మరాజు
               కాలువ రాజులు కడపరాజులును
               పాళెలరాజులు పంటరాజులును
               శ్రీపతిరాజు కైజీతంపుదొరలు
               జూపల్లివారు దేసురిరెడ్ల తెగలు
               మామమూర్తెప్ప గుమారరంగయ్య
               పామినాయనివారు బలుబూరివారు
               మండువవారు కంబము కొండవీటి
               కొండపల్రెడ్లు నంకుశరావువారు
               ... ... ...
               మాదనసేపెరుమా మొదలారి
               మొద లైనగురిదొరల్ ముందర నడువ
               కదనరంగమునకు కదలి పోవుటకు
               నేఁడెనిమిది వేల యెలగోలుప్రజల
               ... ... ...
               చివగడల్ కైదువుల్ సెలవు సేయించి
               సవరణతో నేరు జాలకప్పించి
               భ్రమసిన పడమటిపాళెంబుమీద
               దుమికి హుటాహుటి దొక్కొనినడువ
               అమ్ములచేత చేయమ్ములచేత
               దుమ్ములచేత దోదుమ్ములచేత
               బల్లెలచేత తుపాకులచేత

                నల్ల మూఁకలచేత నడగొండ లైన
                మత్తేభములచేత మావులచేత
                కత్తులచేత చీకాకుసేయింప
                పోరిలో సనుసె గొబ్బురిజగ్గరాజు
                పారె మూఁకలవెంట బడి మాకరాజు
                దగగొట్టి పగబుట్టి దళవాయిచెంచు
                సిగవిడి తెగలార చింతింప కేఁగె
                ... ... ...
                విడివడిపారె రావెళ్ల మాదన్న
                మధురవారిని గూర్చి మ మ్మింతఁ జేసి
                విధి యంచు తనపాలివిధి దూఱుకొంచు
                దొరలెల్ల నవ్వంగ తుండీరవిభుఁడు
                పరువెత్తె తనజెంజిపట్టణంబునకు
                తిరువంది నాపిళ్ళ తిత్తప సెట్టి
                పురము తిమ్మానేండు భుజబలరావు
                చినరౌతు యెఱ్ఱమ సెట్టిలోనైన
                తనవద్ది దొరలెల్ల తనుడించి పాఱ
                యింతిల నెడఁబాసి యిలు చూఱయుచ్చి
                సంతరించినబొక్కసము విడిఁ బుచ్చి
                తురగంబు డిగ్గి కైదువ పాఱవైచి
                విరిగిపాఱు దొడంగె వీరపనేండు
                జయలక్ష్మి చేపట్టి స్వామివా రపుడు

                దయమీఱఁగా ధర్మదారపట్టించి
                బంగారు బొమ్మను పాండ్యభూపాలుఁ
                డింగితవేది యై యిచ్చిన మెచ్చి
                తంజాపురము చేరి తనవంశవజ్ర
                పంజరంబై సార్వభౌమ సామ్రాజ్య
                లక్షణంబులతో కళావతి సతియు
                కుక్షసంభవ రాజగోపాలుఁ డనఁగ
                విజయసంధాయియై వెలయుడు నున్న
                విజయరాఘవనామ విఖ్యాతిఁ గాంచి
                యాముహూర్తమున బట్టాభిరామాభి
                రామ మై మించు శ్రీరామసౌధమున
                చలువరాజగతిపై జాళువాపసిఁడి
                పలకలగొప్ప దప్పరములోఁ జేరి
                పేరోలగంబున్న పెద్దమ్మవార
                లారతు లెత్తినా రని వ్రాసి రాఁగ
                కొలువులో చదివించికొని స్వామివారి
                బలపౌరుషము లెంచి పాచ్ఛాపువారు
                సమయోచితోక్తుల జాల లాలించి
                తమముద్రచే కాగితము శిఖాచేసి
                ఘనముగా మీ కుడుగరలు గట్టించి
                హనుమోజిపంతుల నంపించినారు
                యిటువలెనడచిన దిక్కడికార్య
                మటు గాన నెఱిఁగుండవరించేది."

ఈ కమ్మవక్కణమునందు రామదేవరాయనిపక్షములోని నాయకులను వక్కాణించునపుడు యాచమనాయని నామము స్మరింపఁబడ కుండుట నత్యాశ్చర్యకర మైనవిషయము. ఇందేకాదు. రఘునాథాభ్యుదయమునందు నీకీర్తి యంతయు రఘునాథనాయని కొక్కనికె కట్టిపెట్టెను. బహుళాశ్వచరిత్రమునందొక్క యాచనికె ముడివెట్టెను. రామ రాజీయమున యాచమనాయని యర్జునునిగను, రఘునాథనాయని కృష్ణునిగను, జగ్గరాజును దుర్యోధనునిగను, రామదేవరాయని ధర్మరాజుగను, చెంచునాయని దుశ్శాసనునిగను,వీరప్పనాయని శకునిగను, వెంకుని శల్యునిగను, మాక రాజును కర్ణునిగను, రామదేవుని మేనమామ యగుజిల్లేళ్ల సింగరాజును (నరసింహరాజు) భీమసేనునిగను నభివర్ణించి కురుపాండవయుద్ధముతోఁ బోల్చియున్నాఁడు.

రామభద్రాంబ యను కవయిత్రి తాను రచించిన 'రఘునాథాభ్యుదయ' మను సంస్కృతకావ్యమునం దీ యుద్ధము ని ట్లభివర్ణించి యున్నది. శత్రుసైన్యములతో రాయల సైన్యములు యుద్ధమునకుఁ దలఁపడినప్పుడు పూర్వ పశ్చిమసాగరములు రెండు నెదుర్కొన్న ట్లుండెనఁట! మొట్టమొదట ఫిరంగులు తుపాకుల యుద్ధముఁ బ్రారంభమై కొంత కాలము జరిగినవెనుక రఘునాథరాయని యాశ్వికపటాల మర్ధచంద్రాకృతిగ నేర్పడి మధురసైన్యములను తారసించి చుట్టఁబెట్టి ధ్వంసము చేయుచుండ వసరివెనుక పదాతివర్గము వారు వచ్చి పైఁబడి రట! వారిని నిల్వరించుట దుస్సాధ్యముగ నుండి కుప్పతిప్పలుగఁ దమవారు గూలుచుండుటఁ జూచి రణరంగమున నిలువఁజాలక తొలుత మధురసైన్యము వెన్నిచ్చిపాఱఁ దొడంగెను. ఆదురంతమును జూడ జగ్గరాయలును వానిబందువర్గమును, వానిసైన్యములును రఘునాథనాయని సైన్యముల నెదుర్కొని ఘోరసంగ్రామము సలిపిరి. జగ్గరాయనిఁ జూచినతోడనే రఘునాథనాయఁడు సింహగర్జనము గావింపుచు తన యీటెలపటాలమునుఁ బురి కొల్పుకొని వానిపయిఁ బడి యీటెలతో వానిని, వానిబంధువులను, వానిసైన్యములను బొడిచివైచి నాశనము గావించిరఁట.

జగ్గరాయనిచే నాశనము గావింపఁబడిన యానకట్ట వానిసైనికుల పుఱ్ఱెలతో నింపి రక్తముతో నదికించి యా యానకట్ట రఘునాథనాయఁడు పునర్నిర్మాణము చేసెనా యన్నట్లుగఁ గంటి కగపడె నని రామభద్రాంబ వర్ణించినది. ఎప్పుడు జగ్గరాయలును వానిబంధువర్గమును సమరముననేలఁ గూలిరో యప్పుడు వీరప్పనాయనికిఁ దనరాజ్య ముండునో యూడునో యను భీతి జనించి దానిఁ గాపాడుకొనవలయు నన్న యావేదనతోఁ గూడినయాతురము పుట్టెను. తన యేనుంగులను, తనగుఱ్ఱములను, తనబొక్కసమును తన కుటుంబమును సహితము విడిచిపెట్టి క్రోశమాత్రము సిగ్గును పోఁద్రోలి పఱువెత్తుకొని పోయెనఁట! తుండీరవిభుఁ డయిన కృష్ణప్పనాయఁడు కూడ పాండ్యునిపాటుఁ జూచి భీతచిత్తుఁ డై తనయుద్యోగస్థులెల్లరు నవ్వుచుండ విధిని దూఱుకొనుచుఁ బాఱిపోయె నఁట ! తమ మిత్రులందఱుఁ బలాయను లగు చుండుటను జూచియు దళవాయిచెండు, రావిళ్ళ వెంకు, మాక రాజు మొదలగు శత్రుయోధులు ఏనుఁగు ఘంటలతోడను, రక్తప్రవాహములతోను రణరంగమంతయు భీభత్సముగా గన్పట్టుచుండ నాదృశ్యము నెన్నఁడు చూడనివా రగుట ధైర్యమును గోల్పోయి పక్కబలముచూసి కాళ్లకు బుద్ధి చెప్పిరి. మధురనాయకుఁ డగువీరప్పనాయని బంధించి సైనికులు రఘునాథరాయని సమ్ముఖమునకుఁ గొనిరాఁగా నాతఁడు వానిప్రాణములను గాఁచెనఁట! ఈ విజయమును సూచింపుచు రఘునాథనాయఁడు విజయస్తంభమును గావేరీ తీరమునఁ బ్రతిష్ఠాపించెను. హతశేషు లయిన శత్రునాయకు లెల్లరును రామదేవరాయలను శరణు వేడుకొనవలసినవా రయిరి. తరువాత నాసంవత్సరముననే యథావిధిగ రఘునాథనాయఁడు రామదేవరాయలను సామ్రాజ్యమునకు బట్టాభిషిక్తుని గావించెను. రామదేవరాయల ప్రాణములను శత్రువులచేఁ జిక్కకుండఁ గాపాడి యాచమనాయఁడును సామ్రాజ్యము నిలువంబెట్టి రఘునాథనాయఁడును శాశ్వతమైనయశస్సును సంపాదించుకొనఁగల్గిరి.

సమాప్తము.