Jump to content

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగం 2019-20

వికీసోర్స్ నుండి

ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారి ప్రసంగం

2019, జూలై 12వ తేది.


పరిచయ పలుకులు

అధ్యక్షా మరియు గౌరవనీయులైన సభ్యులారా !

మీ సమ్మతితో 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఈ సభా సమక్షంలో ఉంచుతున్నాను.

1. ఇది నా మొట్టమొదటి బడ్జెట్. ఈ అరుదైన గౌరవాన్ని ఇచ్చినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిగారికి నేను రుణపడి ఉంటాను. గౌరవనీయ ముఖ్యమంత్రిగారికి, సభాపతి గారికి, సభకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

2. యథాతధ స్థితిని మార్చేందుకు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిగారికి ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన మన రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంతమంది ఈ తీర్పును వ్యాఖ్యానించడానికి వివిధ సిద్ధాంతాలను ప్రతిపాదించారు. కొంతమంది ఇంకా వివరణల కోసం వెదుకుతున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రిగారు పేర్కొన్నట్లుగా, ప్రధానంగా రెండు అంశాల కారణంగా ఈ తీర్పు వెలువడిందని నేను నమ్ముతున్నాను. అవి, నమ్మకం మరియు విశ్వసనీయత.

3. మహాత్మాగాంధీ కలలుగన్న భారతదేశం గురించి ఆయన అన్న మాటలను గుర్తుకుతెస్తున్నాను.

“ఈ దేశ నిర్మాణంలో తనకు కూడా ఒక పాత్ర ఉన్నదని ఈ దేశంలోని ప్రతి పేద వ్యక్తి అర్ధం చేసుకోవాలి. ఆర్ధిక, సామాజిక, రాజకీయ అసమానతలు లేకుండా సమాజంలో ప్రతి వ్యక్తి నివసించగలిగేలా ఉండాలి” అధ్యక్ష, నేను ఈ ఆర్ధిక సంవత్సరానికి సమర్పిస్తున్న బడ్జెటు మహాత్మాగాంధీ యొక్క గొప్ప లక్ష్యాన్ని సాధించే దిశలో మొదటి అడుగు అని మీ ద్వారా సభకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా జాతిపిత గాంధీజీ చెప్పిన మాటలను మనం గుర్తుకు తెచ్చుకోవాలి.

“నేను సత్యానికి తప్ప దేనికి లొంగి ఉండను. సత్యంకాక నేను సేవించవలసిన మరి ఏ దేవుడు లేడు”.

ఏడు తప్పులు చేయకుండా ప్రజలను నిలువరించాలని గాంధీగారు పేర్కొన్నారు. విలువలు లేని రాజకీయం అనేది ఈ తప్పులలో ఒకటి. మరో విధంగా చెప్పాలంటే రాజకీయాలలో విశ్వసనీయత లోపించడం. 43 రోజుల ఈ ప్రభుత్వంలో, పరిపాలనకు మరియు మన రాష్ట్ర అభివృద్ధికి దన్నుగా ఉండే విలువలతో కూడిన రాజకీయాలను పునరుద్ధరించడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రిగారు నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రజలు కోరినట్లుగా ఒక ధృఢమైన మార్పు ప్రారంభమయిందని తెలియజేయడానికి ఈ విలువలు ఒక సంకేతం.

4. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోను ఎన్నికలలో గెలవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాయి. తరువాత దానిని మరిచిపోతున్నాయి. ఇది అనైతికం. కానీ, మన గౌరవ ముఖ్యమంత్రిగారు తన ప్రారంభోత్సవ ప్రసంగంలోనే పార్టీ మేనిఫెస్టో అత్యంత పవిత్రమైన గ్రంథానికి సమానమని ప్రకటించి, ఒక క్రొత్త ఒరవడికి నాంది పలికారు. మా మేనిఫెస్టో కేవలం ఒక ప్రకటన పత్రంగా ఉపయోగించడానికి ఉద్దేశించినది మాత్రమే కాదు. ఇది ఈ ప్రభుత్వానికి ఒక నిర్వహణా నియమ సంపుటిగా ఉండటమే కాకుండా ఒక ప్రధాన నియమావళిగా ఉంటుంది.

5. ఈ బడ్జెట్ ద్వారా ప్రజల సంక్షేమానికి మరియు వారి కన్నీటిని తుడవడానికి గట్టి నిబద్ధతతో సురాజ్యం దిశగా ఈ ప్రభుత్వం చర్యలను కూడా తీసుకుంటున్నది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిగారి సమర్ధ నాయకత్వంలో ప్రజలకు చేసిన వాగ్ధానాలను నెరవేర్చడానికి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని మరియు కార్యాచరణ ప్రణాళికలను కలిగివుంది. ఈ లక్ష్యం మన సమగ్ర సంక్షేమ అజెండాను స్పష్టపరుస్తున్నది. ప్రభుత్వం తమ వెన్నంటే ఉంటుందనే రైతాంగ నమ్మకంతో, తమ పిల్లల విద్యాభ్యాసంపై ప్రతి కుటుంబం ధైర్యంతో, ఉద్యోగావకాశాలపై విశ్వాసంతో యువత ఉండాలని ఈ ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉంది. మా సమగ్ర, సంక్షేమ అజెండా అయిన నవరత్నాలలో ఈ దృక్పధం కనిపిస్తుంది. దీనిని సవివరంగా వివరిస్తాను. అంతేగాక,

* గోదావరి జలాలను శ్రీశైలంకు తీసుకురావడం, రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించడం మరియు కృష్ణా ఆయకట్టును స్థిరీకరించడం.
  • ప్రతి గ్రామం మరియు కుటుంబానికి పైపుల ద్వారా త్రాగునీటిని సమకూర్చడం.
  • ప్రతి పట్టణ ఆవాసంలో మురుగునీరు శుద్ధి ప్లాంటులు మరియు ఘన వ్యర్ధ పదార్ధాల నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం.
  • పోలవరం, వంశధార, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ మరియు ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం.
  • ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక కేటగిరి హోదాను సాధించడం.
  • విశాఖపట్నంలో మోనోరైల్ ప్రాజెక్టును అమలుచేయడం.
  • పట్టణ ప్రాంతాల నుండి ప్రారంభిస్తూ దశల వారీగా ప్రజా రవాణా వ్యవస్థను శిలాజ ఇంధనాల నుండి విద్యుత్ విధానానికి మార్చడం, తద్వారా మన రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థని పర్యావరణ సుస్థిరత సాధించే విధంగా కట్టుదిట్టం చేయడం.
  • కడప స్టీల్ ప్లాంట్‌ను నిర్మించి, నిర్వహణలోకి తీసుకురావడం.
  • ఆరోగ్యకరమైన జీవనం కోసం స్వచ్ఛమైన మరియు పర్యావరణ సానుకూలత కల్పించడం, పరిరక్షించడం వంటి ముఖ్యమైన అంశాలు మన ముఖ్యమంత్రిగారి దృక్పధంలో ఉన్నాయి.

రాజకీయ అనుబంధం ఆధారంగా పక్షపాతం చూపని నాయకుని నాయకత్వంలోని ప్రభుత్వంలో ఒక భాగం అయినందుకు నేను గర్వపడుతున్నాను. ప్రజలందరికీ వారి రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా మా మేనిఫెస్టోలోని కార్యక్రమాలన్నింటినీ సంపూర్తిగా అందించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రిగారు అధికారులందరినీ ఆదేశించారు. కులం మరియు వారి రాజకీయ అనుబంధం ఆధారంగా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి తద్వారా ప్రజల నిజమైన హక్కులను, సమాన అవకాశాలను అధికారికంగా ఉల్లంఘించిన మునుపటి పాలనా వ్యవస్థకు, ఈ ప్రభుత్వానికీ ఉన్న వ్యత్యాసాన్ని గమనించవలసిందిగా గౌరవ సభ్యులను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నేను కోరుతున్నాను. 6. పారదర్శకత మా మూడవ సూత్రం. ఈ ప్రభుత్వం అన్ని కాంట్రాక్టు పనులలో పారదర్శకంగా ఉండటానికి కట్టుబడి ఉంది. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉత్తర్వులు మాదిరిగా జిల్లా స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ చూడటం కోసం వారి ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో ఉంచాలని కలెక్టర్లందరిని మన గౌరవ ముఖ్యమంత్రిగారు ఇదివరకే ఆదేశించారు.

7. నాల్గవ సూత్రంగా మా నాయకుడు మునుపటి ప్రభుత్వం మాదిరిగా కాకుండా అవినీతిరహిత పరిపాలనను నిర్ణయాత్మకంగా ముందుకు తీసుకొచ్చారు. అన్ని స్థాయిలలో, అన్ని కార్యాలయాలలో రాష్ట్రాన్ని అవినీతిరహితంగా చేయాలని మంత్రులను అదేవిధంగా అధికారులందరినీ గౌరవ ముఖ్యమంత్రిగారు ఆదేశించారు. న్యాయ సంబద్ధతకు సంబంధం లేకుండా రాజకీయ నాయకులకు సహకరించాలనే మునుపటి ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా న్యాయపరమైన నియమాలకు లోబడి మాత్రమే రాజకీయ ప్రతినిధుల అభ్యర్థనలను పరిశీలించాలని మన గౌరవ ముఖ్యమంత్రిగారు అధికారులందరినీ కోరారు. సాధారణంగా పనులకు సంబంధించిన టెండర్స్ ఇవ్వడంలో అవినీతికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుతో కలుపుకొని సాగునీటి ప్రాజెక్టులు మరియు పని కాంట్రాక్టులలో అవినీతిని నిరోధించడానికి ఈ ప్రభుత్వం జూడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నది.

ఆర్థిక వ్యవస్థ మరియు ఆర్థిక స్థితి

8. మునుపటి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించామని చెప్పుకున్నప్పటికీ, తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం, యువతకు ఉద్యోగాలు లేకపోవడం, మౌలిక సదుపాయాల కొరత, పేదలకు సరైన సహాయం చేయకపోవడం మొదలైన వాటిని మేము గుర్తించాము. ప్రకటించుకున్న విధంగా మునుపటి ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్ర వాస్తవ అవసరాలను తీర్చలేదని ఇది వివరిస్తుంది, చెప్పిన విధంగా వృద్ధి జరగలేదు. అతిశయం, క్షేత్ర స్థాయిలో వాస్తవికత మధ్య స్పష్టమైన అంతరం ఉన్నది. గత ఐదు సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధి సాధించిందని మాకు తెలియచేసారు. ఈ వృద్ధి అంకెలు యదార్ధమా లేక కల్పితమా అని మేము ఇంకా నిర్ధారించుకుంటున్నాము. ఆర్ధిక వ్యవస్థ రెండంకెల వృద్ధి రేటు పెరిగితే అన్నదాత ఆకలితో ఎందుకున్నాడు? అక్కా చెల్లెళ్లలో విషాదం, యువతలో అసంతృప్తి ఎందుకు ఉంది? మార్పు కోసం ఇంత భారీగా, నిర్ణయాత్మక ఓటు వేయడమెలా జరిగింది? ఆర్ధిక వ్యవస్థ రెండంకెల వృద్ధి రేటును సాధించడం నిజమయినట్లయితే, వృద్ధిని వక్రీకరించి ధనవంతులను మరింత ధనవంతులుగా మరియు పేదలను మరింత పేదలుగా చేసి, వృద్ధి వనరులు కొద్దిమంది చేతులలో కేంద్రీకృతం చేసి అధిక సంఖ్యాకుల దుఃఖానికి కారణమయిందని దీని అర్థం. ఉద్యోగాలలేమి; ఆదాయ లేమిలో వృద్ధి; విలాసాల కోసం ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా విలువైన వనరుల దుబారా వంటివి; పేదలు, అణగారిన ప్రజలలో తీవ్ర కోపానికి కారణమయింది. సమాజంలో పెరుగుతున్న అసమానతల ధోరణిని తక్షణమే అరికట్టవలసియున్నది. మా బడ్జెట్ ద్వారా ఆదాయాల లేమి వంటి వాటిని లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాము. తద్వారా సామాన్య స్త్రీ, పురుషుల కోసం కుటుంబ ఆదాయ ఆధారిత వృద్ధి మరియు అభివృద్ధిలో పెరుగుదల సాధించడం జరుగుతుంది.

9. బహుశా మన దేశ చరిత్రలోనే ఎప్పుడూ వారసత్వంగా పొందని అత్యంత దయనీయ ఆర్థిక స్థితిని ఈ ప్రభుత్వం వారసత్వంగా పొందినది అని నేను మన గౌరవ సభ్యులకు మరియు మన ప్రజలకు తెలియజేస్తున్నాను. విభజన సమయంలో రూ.1,30,654 కోట్లుగా ఉన్న అవశేష రాష్ట్ర రుణం (ప్రభుత్వ రుణం రూ.97,124 కోట్లు, ప్రజా పద్దు రూ.33,530 కోట్లు) 2018-19 నాటికి రూ.2,58,928 కోట్లకు (ప్రభుత్వ రుణం రూ.1,92,820 కోట్లు, ప్రజా పద్దు రూ.66,108 కోట్లు) విపరీతంగా పెరిగింది. అంతేకాకుండా, వివిధ సంస్థల ద్వారా దాదాపు రూ.10,000 కోట్లు రుణం తీసుకొని ప్రభుత్వ ఖర్చు కోసం మళ్లించింది. దీనికి అదనంగా, సుమారు రూ.18,000 కోట్ల విలువైన బిల్లులు పెండింగులో ఉన్నాయి.

10. ఈ రుణాలన్నింటితో పాటు, ఫిబ్రవరిలో సమర్పించిన 2019-20 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ క్రింద వాగ్దానాలను నెరవేర్చడానికి దాదాపు రూ.45,000 కోట్ల పనరుల అంతరాయం ఉన్నదని మాకు తెలిసింది. ఈ వనరుల అంతరం, ఈ ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసిన నూతన కార్యక్రమాల అమలు కోసం బడ్జెట్ అవసరాలను మరింత పెంచింది. ఇది ఈ ప్రభుత్వానికి సంక్రమించిన భిన్నమైన ఆర్ధిక పరిస్థితి.

ప్రత్యేక కేటగిరీ హోదా

11. ఈ సందర్భంలో, ప్రత్యేక హోదా డిమాండు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి గౌరవ ప్రధాన మంత్రిగారితో జరిగిన వివిధ సమావేశాలలో మన ముఖ్యమంత్రిగారు గట్టిగా చెప్పారు. మొదటది, రాజధాని ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించడం ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రమే జరిగింది. రెండవది, ప్రత్యేక హోదా ఇస్తామని హమీ ఇచ్చిన తర్వాతనే 2014, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. ఏదేని ఇతర విభజన సందర్భాలలో ఇలాంటి పరిస్థితి లేదు. మూడవది, రాష్ట్ర విభజన రాష్ట్ర ఆర్థిక వనరులను తీవ్రంగా దెబ్బతీసినందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే తన నియంత్రణలో లేని కారణాల వల్ల ప్రత్యేక హోదా కావాలని డిమాండు చేస్తున్నది. విభజన తరువాత తెలంగాణ తలసరి రాబడి ఒక రూపాయి ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొంత తలసరి రాబడి వెంటనే సుమారు 60 పైసలుకు పడిపోయింది. అదే సమయంలో తలసరి రెవెన్యూ వ్యయం విభజన తరువాత సంవత్సరాలలో తెలంగాణాతో సమానంగా ఉన్నది. నాలుగవది, ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రమే ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. అయితే, దీని అమలు పెండింగులో ఉంది.

12. అధ్యక్షా, ఒక దేశ గొప్పతనం దాని ప్రజలు, సహజ వనరులు మరియు లిఖితపూర్వక శాసనాల కంటే ఎక్కువనే విషయం మీకు తెలుసు. దేశంలో విలువలు, సాంప్రదాయాలు మరియు సిద్ధాంతాలు కూడా ఏదేని జాతిలో అంతర్ భాగంగా ఉంటాయి. మన భారతదేశ గొప్ప నాగరికతలో ఒక సాంప్రదాయం నాటుకుపోయింది. సమాజంలోని స్థానిక పెద్దలు, పిల్లల మధ్య పూర్వీకుల ఆస్తి విభజన సక్రమంగా జరిగేలా చూస్తారు. ఇదే స్ఫూర్తితో మన రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రాలను విభజించే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. 2014, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పలు ఇతర అంశాల అమలుతోపాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రిగారు హామీ ఇచ్చారు.

13. అందువలన, ఈ ప్రతిష్టాత్మక సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానమంత్రిగారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే, ప్రజాస్వామ్యానికి అత్యున్నత సాధనమైన పార్లమెంటు న్యాయ స్పూర్తితో హమీ ఇవ్వడమే కాకుండా, తగినంత ప్రోత్సాహకం ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తన ఔత్సాహిక ప్రజలతో 2022 కు పరివర్తనం చెందడంలో ప్రముఖ రాష్ట్రాలలో ఒకటిగా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉండేది. కేవలం కొంత స్పష్టత విభజన చట్టంలో లేకపోవడం వల్ల మన నాగరికత యొక్క ఘనమైన సాంప్రదాయాల ప్రకారం ఇవ్వబడిన హమీలు నిష్ప్రయోజనం కాకూడదు. ఇంతేగాక ఆంధ్రప్రదేశ్ కు హామీలను ఇచ్చిన తరువాత మాత్రమే పార్లమెంటు సభ్యులు ప్రతిపాదించిన సవరణలను వదిలి వేయడం జరిగింది.

14. అధ్యక్షా, భారతదేశ కుటుంబ వ్యవస్థ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా గౌరవించడం జరుగుతున్నది. మన గొప్ప దేశంలో, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చిన హామీలను అమలుపర్చడంలో వెనకడుగు వేయరు. కాగా కొన్ని సందర్భాలలో ఈ నిజం మారిపోయింది. పార్లమెంటు మన రాష్ట్రానికి జన్మనిచ్చింది. హామీ ఇచ్చిన ప్రకారం మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలని చిత్తశుద్ధితో కోరుతున్నాను.

15. పార్లమెంటుకు సాధికారతనిచ్చే భారత రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్‌ను పూర్తి వైవిధ్యత గల మన దేశ ప్రజల ఆకాంక్షలన్నింటికీ తగినంత ప్రాతినిధ్యం ఉండేలా చూడటానికి ప్రవేశపెట్టడమయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఖచ్చితంగా చివరి విభజన కాబోదు. మన ఘనమైన నాగరికత యొక్క సాంప్రదాయాలను మరియు ప్రజాస్వామ్య దేశంగా మన ఔన్నత్యాన్ని కాపాడేందుకు భవిష్యత్తు తరాలకు మంచి ఉదాహరణగా నిలిచేందుకుగాను, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను పార్లమెంటు మరియు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలి.

కఠినమైన ప్రత్యామ్నాయాలు

16. ముఖ్యమంత్రిగారు మరియు ఈ ప్రభుత్వం ప్రత్యేక హోదాను సాధించేందుకు కృషి చేస్తూనే ఉన్నారు. మనకున్న పరిమిత ఆదాయాలలోనే ఖర్చులు భరించాల్సి ఉంది. ఈ ప్రభుత్వానికి ప్రాప్తించిన ద్రవ్య స్థితి వల్ల చాలా కఠినమైన ప్రత్యామ్నాయాలను చూసుకోవాల్సి వచ్చింది.

17. ఈ సందర్భంగా 2022లో భారతదేశ 75వ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకొనే అవకాశం ఈ ప్రభుత్వానికి దక్కడం గమనించాల్సిన ముఖ్యమైన అంశం. దీనితోపాటు 2022 నాటికి మన రాష్ట్రం అభివృద్ధి పరంగా ఏ స్థానంలో ఉంటుందనే విషయాన్ని నిర్ణయించడంలో అపారమైన బాధ్యత కూడా ఉంచుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో ఈ సంవత్సరం మనం 150వ జయంతి వేడుకలను జరుపకొనే మహాత్మాగాంధీ మాటలను మరోమారు మార్గదర్శకంగా తీసుకోవడమయింది.

“నేను మీకు ఒక తాయత్తు ఇస్తాను మీరు సందేహంలో ఉన్నపుడు లేదా మీరు ఇబ్బంది పరిస్థతులలో ఉన్నపుడు ఓ పరీక్షను అనుసరించండి. మీరు చూచిన నిరుపేద మరియు అత్యంత బలహీన వ్యక్తి ముఖాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు చేపట్టబోయే చర్య అతనికి ఏ విధంగానైనా ఉపయోగపడుతుందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆయన దాని ద్వారా ఏదైనా పొందగలడా? ఆయన జీవితం మరియు విధి రాతపై అతని నియంత్రణను ఆ చర్య పునరుద్ధరిస్తుందా ? మరోవిధంగా చెప్పాలంటే ఆకలితో, ఆధ్యాత్మికతలేమితో బాధపడుతున్న లక్షలాది మందికి ఈ చర్య విముక్తినిస్తుందా ? అపుడు మీ సందేహాలను తెలుసుకొంటే మీరంతట మీరే మారతారు”.

మహాత్మా గాంధీ

18. మహాత్మాగాంధీ మాటలను పునస్కరించుకొని 2022 నాటికి రాష్ట్రంలో లేమితనం లేకుండా చూడాలని భావిస్తున్నాను. అందువల్ల, సంపద కల్పన మరియు సంక్షేమ కార్యక్రమాల మధ్య అధిక కష్టతరమైన ప్రత్యామ్నాయాలను రూపొందిస్తూ, సంక్షేమం పట్ల ఆ రెండింటిని సమతుల్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. సింగపూర్ అంతర్జాతీయ విమానాలకు వయబులిటి గ్యాప్ ఫండింగ్ ను సమకూర్చాలా లేదా వేలాది మంది తల్లులు, పిల్లలకు ప్రత్యామ్నాయంగా మెరుగైన పోషకాహారాన్ని అందించాలా అనే విషయంలో మొదటి దానిని వదిలి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మా మనస్సాక్షి మరియు ఎంపికలు స్పష్టంగా ఉన్నాయి.

19. ప్రభుత్వం ఈ బడ్జెట్లో “'నవరత్నాలు పై ప్రత్యేక దృష్టితో మా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ మేనిఫెస్టోను ఏ విధంగా రూపొందించాము అనే విషయాన్ని మర్చిపోము. గౌరవ ముఖ్యమంత్రి గారు 14 నెలల కాలంలో తన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో సుమారు 2 కోట్ల మంది ప్రజలను ఎక్కువగా పేదలను వ్యక్తిగతంగా కలుసుకొని వారు భావించిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల వాస్తవ అవసరాల వ్యక్తీకరణల సమ్మేళనంగా ఈ పత్రాన్ని రూపొందించడమయింది.

20. ఈ నేపధ్యంతో, నా బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పిస్తున్నాను. సాంప్రదాయకంగా, బడ్జెట్ ప్రసంగాలలో, శాఖలు మరియు పథకాలకు కేటాయింపుల వివరాలు ఉంటాయి. నా ప్రసంగంలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకాలు మరియు బడ్జెట్ ను గణనీయంగా పెంచిన పథకాలపై దృష్టి పెడతాను. శాఖల వారీ బడ్జెట్ కేటాయింపులు మరియు ప్రాధాన్యత / నూతన పథకాల వివరాలను ఈ ప్రసంగానికి అనుబంధంగా ఇవ్వడమైనది.

వైఎస్ఆర్ రైతు భరోసా

21. రైతులు స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిగారి మొదటి ప్రాధాన్యతగా ఉన్నారని గౌరవ సభ్యులకు తెలుసు. అందువలన ప్రభుత్వం ఆయన జన్మదినమైన జూలై 8వ తేదీని ‘రైతు దినోత్సవం"గా ప్రకటించింది. ఈ రోజును సాగు అంశాలను సమీక్షించడానికి, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, సేవల అందింపులో ఏవేవి ఇబ్బందులను పరిష్కరించడం, విస్తరణ మద్దతును అందించడం మొదలగు వాటికి ఉద్దేశించడమయింది.

22. రైతుల సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత. ఈ దిశగా గౌరవ ముఖ్యమంత్రిగారి అధ్యక్షతన ప్రభుత్వం వ్యవసాయ కమీషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమీషన్ క్షేత్ర ఆదాయాల పురోగతిని రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఆచరణలో పెట్టవలసిన అవసరమైన చర్యలను నిర్ణీత కాలంలో చేపడుతుంది.

యథాభజిం వినాక్షేత్రం

ముప్తం భపతి నిష్ఫలం

అంటే,
ఎంత సారవంతమైన నేల అయినా,
ఎంత బాగా దున్నినా,
ఎంత చేయి తిరిగిన రైతు అయినా ....
విత్తనం వేయకపోతే పంట పండదు.

23. వైఎస్ఆర్ రైతు భరోసా : మా మేనిఫెస్టోలో ప్రతి రైతుకు పంట కాలం ప్రారంభానికి ముందే మే నెలలో ప్రతి సంవత్సరం రూ.12,500/-లు పెట్టుబడి మద్దతును సమకూర్చుతామని ప్రతిపాదించాం. మన ముఖ్యమంత్రిగారు మే నెల చివరలో ప్రమాణ స్వీకారం చేసారు. దయనీయమైన ఆర్థిక స్థితిని ప్రభుత్వానికి వారసత్వంగా ఇవ్వడమయింది. 2020 మే నెల నుండి ఈ మొత్తాన్ని సమకూర్చాలని ఈ ప్రభుత్వం నిర్ణయించినట్లయితే, ఎక్కువమంది ప్రజలు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఏమైనప్పటికీ, మా ముఖ్యమంత్రి రైతుల సంక్షేమం పట్ల ఆయనకు గల నిబద్ధతకు ప్రతీకగా 15, అక్టోబరు 2019 నుండే ఈ మొత్తాన్ని కౌలు రైతులతో సహా రైతులందరికీ సమకూర్చాలని నిర్ణయించారు. రూ.8,750 కోట్ల పెట్టుబడి వ్యయంతో వైఎస్ఆర్ భరోసా పథకం వలన 64.06 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు. ఇందులో 15.36 లక్షల మంది కౌలు రైతులూ ఉన్నారు. సాగు పెట్టుబడి మద్ధతు కోసం కౌలు రైతులను అరులుగా గుర్తించిన తొలి ప్రభుత్వం మాదేనని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను.

24. వైఎస్ఆర్ వడ్డీలేని రుణాలు : రైతులకు పరపతి వ్యయాన్ని తగ్గించేందుకు, కౌలు రైతులకు ఇచ్చిన వాటితో సహా ఈ ప్రభుత్వం రైతుల కోసం వైఎస్ఆర్ వడ్డీలేని రుణాలను అమలు చేస్తున్నది. ఈ ప్రయోజనం కోసం ఈ బడ్జెటులో నామమాత్రపు రూ. 100 కోట్లను ప్రతిపాదిస్తున్నాను.

రైతుకు పంట ప్రాణం.
పంటకు వాతావరణం ప్రాణం.
పంట రాకపోతే రైతు తట్టుకోలేడు.
వాతావరణం సరిగా లేక పోతే పంట తట్టుకోలేదు.
అంటే....
పంటకు బీమా కావాలి. బీమాతోనే రైతుకు ధీమా వస్తుంది.

25. వైఎస్ఆర్ పంటల బీమా - వైఎస్ఆర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన : రైతుల సంక్షేమమనే ఈ భావనకు కొనసాగింపుగా, పంటల బీమాలో భారాన్ని వారికి తొలగిస్తూ రైతుల యొక్క పంటల బీమా ప్రస్తుత వాటాను చెల్లించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 1,163 కోట్ల బడ్జెటును కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. దీనివలన 60.02 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది.

26. సాగు ఆదాయాలను పెంచేందుకు ప్రతి అవకాశాన్ని అన్వేషించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది. అందువలన, స్థానిక పశువుల కోసం రూ.15,000/-లు, సంకరజాతి పశువులకు రూ.30,000/-ల రేటు చొప్పున పశువులకు బీమాను కల్పించడం ద్వారా పశువుల పెంపకానికి ఈ ప్రభుత్వం తగు ప్రాముఖ్యతనిస్తున్నది. ఈ ప్రయోజనం నిమిత్తం, రూ.50 కోట్ల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను. అది 20 లక్షల పశువులకు వర్తిస్తుంది.

27. 2022 నాటికి వ్యవసాయ ఆదాయాలను రెండింతలు పెంచే లక్ష్యాన్ని సాధించేందుకు ఒక విధాన స్థాయిలో అన్ని చర్యలను చేపట్టేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎ) పెట్టుబడి మద్ధతును కల్పించడం బి) పరపతి, బీమా, సాగునీరు, శీతల గిడ్డంగి మున్నగువంటి ఇన్ పుట్ వ్యయాలను తగ్గించడం సి) ఇ-నామ్ ద్వారా ఆదాయాలను పెంచడం, అయినకాడికి అమ్ముకునే బాధను నియంత్రించేందుకు నిల్వ సామర్థ్యాన్ని కల్పించడం డి) ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నిధి ద్వారా విపత్తులను తగ్గించడం మరియు ఇ) రైతు ఆత్మహత్యలు మరియు ప్రమాద మరణాల విషయంలో సహాయాన్ని అందించడం వంటివి ఇందులో కొన్ని చర్యలు.

28. రైతు భరోసాలో భాగంగా, ఉచితంగా బోరుబావులను త్రవ్వేందుకు ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆ ప్రకారంగా ఈ సంవత్సరంలో రూ.200 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించడమయింది.

29. వ్యవసాయ కార్యకలాపాలను సమర్ధవంతంగా కొనసాగించటంలో, వ్యవసాయ ఉత్పత్తులు మరియు ఇతర సరకుల రవాణాలో మోటారు వాహనాల లభ్యత చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ట్రాక్టర్లు వినియోగం కోసం రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం ట్రాక్టర్లకు రోడ్ టోల్ మినహాయింపును కల్పించింది.

30. మన రైతులు నాణ్యమైన ఉపకారాలతో ఉత్పాదకతను పెంచుకునేటట్లు, అంతేకాకుండా యోగ్యతలేని వర్తకుల నుండి రైతులను కాపాడేటట్లు చూడటానికి, ఈ ప్రభుత్వం భూసారం, విత్తనం, ఎరువులు, పురుగు మందులను పరీక్షించే సదుపాయాలతో వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇందునిమిత్తం, బడ్జెటులో రూ.109.28 కోట్ల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను. 31. వ్యవసాయ ఆదాయ పెంపుదల : రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర ఉండేటట్లు చేయడానికి, ఇ-నామ్ అమలును ఈ ప్రభుత్వం శీఘ్రతరం చేస్తుంది. రైతులకు నూటికి నూరు శాతం ఆన్లైన్ చెల్లింపును దశలవారీగా అమలు చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. 13 శీతల గిడ్డంగులను, 24 గోదాముల అభివృద్ధిని కూడా చేపట్టడమవుతుంది. తద్వారా, రైతులు ధరలు తక్కువగా ఉన్నప్పుడు నిల్వ చేసుకునేందుకు, ధరలు ఎక్కువగా ఉన్న రోజులలో విక్రయించుకునేందుకు సులభతరంగా ఉంటుంది. మన రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించి, ఉత్తమ ప్రయోజనాలను పొందడానికి 17 రైతుబజార్లు ఎంచుకొనడం జరిగింది. శీతల గిడ్డంగులు మరియు గోదాముల అభివృద్ధి కోసం రూ.200 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.

32. సాగు నష్ట నివారణ : ముఖ్యంగా ధరల హెచ్చుతగ్గులు మరియు ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న అపరిమిత నష్టాల పట్ల మా ప్రభుత్వం చాలా సున్నితంగా వ్యవహరిస్తుంది. అందువల్ల, రైతులకు న్యాయమైన ధర ఉండేటట్లు చేయడానికి వ్యవసాయ మరియు ఉద్యానవన పంటలలో మార్కెట్ ప్రమేయానికి వీలుకల్పించేందుకు రూ.3,000/- కోట్ల కార్పస్‌తో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసేందుకుగాను ప్రతిపాదిస్తున్నాను. ఇది మునుపటి బడ్జెటు రూ.1,000/- కోట్ల మొత్తానికి మూడు రెట్లు. ఇది కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పి)ను ప్రకటించిన పంటలకు మాత్రమే కాకుండా, రాష్ట్రంలో కనీస మద్దతు ధర ప్రకటించని ఇతర పంటలకు కూడా వర్తిస్తుంది. రైతులకు ఇటువంటి మద్ధతును ప్రతిపాదించిన రాష్ట్రాలలో మన రాష్ట్రమే మొదటిదని తెలియజేయడానికి గర్వపడుతున్నాను. అదేవిధంగా, రూ.2000/కోట్లతో ప్రకృతి వైపరీత్యాల విధిని నెలకొల్పాలని ప్రతిపాదిస్తున్నాను. ఇది వాతావరణ మార్పుల వల్ల నష్టాలు ఏర్పడిన సందర్భంలో రైతులకు సహాయపడుతుంది. ఇందులో, తిత్లీ తుఫాను బాధితుల కోసం రూ.150 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.

33. కౌలు రైతుల సంక్షేమం : అధికారిక గుర్తింపు లేకపోవడం కౌలు రైతుల సంక్షేమ అవరోధానికి ప్రధాన అంశం. సాగు భూమి యజమానులు కౌలు రైతులను అధికారికంగా గుర్తించడానికి ముందుకు రావడం లేదు. చట్టబద్ధ సదస్సులలో వారు తమ భూమిని కోల్పోతామని భయపడుతున్నారు. సాగుభూమి యజమానుల భయాలను పోగొట్టడానికి, అలాగే కౌలు రైతులు సాగు మద్ధతుని అందుకొనేలా చేయడానికి, ఈ ప్రభుత్వం అవసరమైన శాసన సవరణలను తీసుకురానుంది. పంట బీమా, వడ్డీలేని రుణాలు, ఉచిత విద్యుత్, గిట్టుబాటు ధర పూచీ, ఆత్మహత్య మరియు ప్రమాద మరణ సందర్భాలలో సహాయం వంటి వివిధ కార్యక్రమాల నుండి చేకూరే మద్ధతు, సబ్సిడీలు మరియు ప్రయోజనాలతో కౌలు రైతులు 11 నెలల కాలానికి పంట సంబంధ హక్కులను కలిగి ఉండేందుకు, వీలుకల్పించే చట్టబద్ద యంత్రాంగాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

34. పాడి రైతుల ఆదాయాన్ని పెంచడానికి, రూ.100 కోట్ల బడ్జెటుతో ఈ సంవత్సరం నుండి పాడి, సహకార సంఘాలను పునరుద్ధరించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. పునరుద్ధరణ తరువాత, వచ్చే ఏడాది నుండి, ఈ సహకార సంఘాలు రైతుల నుండి పాలను నేరుగా కొనుగోలు చేసి, వారికి లీటరుకు రూ.4/-ల బోనస్ ఇస్తారు. తద్వారా, పాడి రైతుల ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయి. అంతేగాక, సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా ప్రతిపాదిస్తూ, ఇందుకోసం బడ్జెటులో రూ.100 కోట్ల కేటాయింపును చేస్తున్నాము.

35. ప్రభుత్వం విధించిన చేపల వేట నిషేధ కాలం కారణంగా మత్స్యకారులు తమ ఆదాయాలను కోల్పోతున్నారు. వారి నష్టాలను నివారించడానికి, ఈ ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చే సహాయాన్ని రూ.4,000/-ల నుండి రూ.10,000/-లకు పెంచుతుంది. సంతృప్తతను నిర్ధారించేందుకు తగిన మదింపు చేసిన తరువాత ఈ మొత్తాన్ని 2020 జనవరిలో ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఇందునిమిత్తం మరియు మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కోసం 1,17,053 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు రూ.200 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. అంతేగాక, ఈ ప్రభుత్వం ఆక్వా రైతులకు ఒక్కో యూనిటుకు రూ.2/-లకు బదులుగా రూ.1.50/-లకే విద్యుత్తును అందిస్తుంది. ఇందుకోసం రూ.475 కోట్లను ప్రతిపాదిస్తున్నాను.

36. అదేవిధంగా, మన మత్స్యకారులకు అవసరమైన మౌలిక సదుపాయాల మద్దతును అందించేందుకు తూర్పుగోదావరిలోని ఉప్పాడలో, నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో, ప్రకాశం జిల్లా వాడరేవులో మరియు గుంటూరు జిల్లా నిజాంపట్నంలో మేము ఫిషింగ్ జెట్టీలను అభివృద్ధి చేయాలని ఉద్దేశించాం. ఇందునిమిత్తం రూ.100 కోట్లు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను. 37. ఆత్మహత్య మరియు ప్రమాద మరణాలు : మన రైతులు కష్టపడి పనిచేసినప్పటికీ వివిధ కార్యక్రమాల ద్వారా అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందించినప్పటికీ, కొన్ని రైతు ఆత్మహత్య సంఘటనలు ఉంటున్నాయన్న వాస్తవాన్ని ఈ ప్రభుత్వం సున్నితమైన అంశంగా పరిగణిస్తుంది. 1,513 రైతుల ఆత్మహత్య సంఘటనలలో కేవలం 391 కేసులను వ్యవసాయ సంబంధ దుస్థితికి సంబంధించినవిగా ప్రకటించడం దురదృష్టకరం. క్లెయింల కచ్చితత్వాన్ని నిరూపించిన తరువాత మిగిలిన 1,122 కేసులకు ఈ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా చెల్లింపును పరిశీలిస్తుంది. ఇకమీదట రైతుల ఆత్మహత్యలు లేకుండా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయినప్పటికీ, ఇటువంటి సందర్భాలలో రక్త సంబంధీకులకు కలిగే ఆర్ధిక దుస్థితిని తొలగించడానికి ప్రభుత్వం రూ.7 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అదేవిధంగా, మత్స్యకారుల కుటుంబాలకు చెందిన రక్త సంబంధీకులకు కూడా రూ.10 లక్షలను అందించడమవుతుంది. అదే సమయంలో, ఈ సహాయాన్ని వడ్డీ వ్యాపారులకు కాకుండా కుటుంబానికి మాత్రమే అందించేటట్లు చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విషయాన్ని కట్టుదిట్టం చేయడానికి మేము అవసరమైన శాసనపరమైన /విధానపరమైన చర్యలు తీసుకుంటాం.

అమ్మ ఒడి మరియు విద్య

శ్రీ సరస్వతి నమస్తుభ్యం! వరదే కామరూపిణీ !
విద్యారంభం కరిష్యామి ! సిద్ధిర్భవతుమే సదా !!

తినడానికి మూడు రొట్టెలు ఉన్నప్పుడు...
తినవలసిన వాళ్ళు నలుగురు అయినప్పుడు
నాకు ఆకలి లేదు అనే వ్యక్తి అమ్మ !

అమ్మకు స్థానంలేని విద్యా వ్యవస్థ
విగ్రహంలేని ఆలయం లాంటిదే !

కంటిని కాపాడు కోవాలని రెప్పకు తెలుసు,
గుడ్డును రక్షించుకోవాలని పక్షికి తెలుసు.
బిడ్డల్ని బాగా చదివించుకోవాలని తల్లికే తెలుసు.

పక్షిగాం బలమాకాశం
మత్యానాం ఉదకం బలం

అంటే,

పక్షులకు ఆకాశమే బలం, చేపలకు వీళ్ళే బలం, మరి పిల్లలకు ....?
అమ్మ ఒడే బలం.

38. ఎన్ని కష్టాలొచ్చినా, వాటిని ఎదుర్కొని తమ బిడ్డలను బాగా చదివించుకోవాలని, వారి జీవితాలను కొత్తగా నిర్మించాలన్న సంకల్పం ఉన్న అమ్మలకు మన రాష్ట్రంలో కొదవ లేదు. ఆ తల్లుల ప్రేరణే ఈ ప్రభుత్వానికి బలం. తమ పిల్లలను చదువుల బాట పట్టించి వారి రాతను తిరిగి రాయాలనుకునే ప్రతి తల్లికీ ఈ ప్రభుత్వం నిండు హృదయంతో నమస్కరిస్తోంది. వారి సంకల్ప బలానికి అవసరమైన వనరులు, తోడ్పాటును అందించడం మా బాధ్యత అని చాటుతోంది.

చదువు అనేది ..

మాతేవ రక్షితి
పితవే హితే నియుంక్తే

అంటే,

తల్లిలా రక్షిస్తుందట
తండ్రిలా మంచి చేస్తుందట.

39. 2011 జనాభా లెక్కల ప్రకారం, జాతీయ నిరక్షరాస్యత రేటు 27 శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్లో 33 శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలలో నిరక్షరాస్యత చాలా ఎక్కువగా అంటే 40 శాతం ఉంది. కాగా జాతీయరేటు 35 శాతంగా ఉంది. పిల్లలకు సమకూర్చగల ఉత్తమ ఆస్తి నాణ్యమైన విద్యే అని మన గౌరవ ముఖ్యమంత్రిగారు నిరంతరం మనకు గుర్తు చేస్తున్నారు. విద్యపై ఖర్చు చేసే ప్రతి రూపాయి మానవ మూలధన అభివృద్ధికి తోడ్పడుతుంది. అందువల్ల, నిరుపేద కుటుంబానికి చెందిన ఏ తల్లీ తన పిల్లల చదువు గురించి బాధపడకుండా చూసేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తన పిల్లలను విద్యావంతులను చేసేందుకు తల్లికి ప్రోత్సాహకాలను అందిస్తున్న ఈ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిగా ఉంది. అధ్యక్షా, వనరుల లేమి కారణంగా ఏ బిడ్డా పరిజ్ఞానం అనే దాహార్తిని తీర్చుకోవడంలో వెనుకబడిపోకూడదనే ఉద్దేశాన్ని దృష్టిలో వుంచుకొని ఈ దిశగా నిబద్ధతను కనబరచడానికి 'జగనన్న అమ్మఒడి' అనే పథకాన్ని ప్రకటించడాన్ని నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. పాఠశాలకు తన పిల్లలను పంపే ప్రతి తల్లికి ప్రభుత్వం రూ.15,000/- లు అందిస్తుంది. మొదటిగా, ఈ పథకాన్ని 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తింప చేయాలని ఉద్దేశించడమయింది. ప్రస్తుతం, ఇంటర్మీడియట్ వరకు గల విద్యార్ధులను చేర్చుతూ ఈ పథకం వర్తింపును విస్తరించడమయింది. గత ప్రభుత్వం, ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు ఇంటర్మీడియేట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుండే ఈ ప్రభుత్వం 'జగనన్న అమ్మ ఒడి' క్రింద రూ.15,000/-లు అందిస్తున్నది. రూ. 6,455 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో దాదాపు 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరుస్తున్నది. ఈ పథకం రాష్ట్రంలో విద్యకు సంబంధించిన అన్ని ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది.

40. మౌలిక సదుపాయాలు మరియు నేర్పుతున్న విద్య నాణ్యతను గణనీయంగా పెంచుతూ, ప్రభుత్వ పాఠశాలల గతులను మెరుగుపరచేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పాఠశాలలన్నీ వాటి మౌలిక సదుపాయాల ప్రమాణాలను మెరుగుపరచుకునేటట్లు చూడాలని గౌరవ ముఖ్యమంత్రిగారు మాకు ఆదేశించారు. ప్రస్తుత మరియు 2 సంవత్సరాల తరువాత పాఠశాల ఫోటోలను ప్రజలకు చూపడం ద్వారా మేము జవాబుదారీగా ఉంటాము. మంచి కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు వాటిని పూర్తిగా పునరుద్ధరించడమవుతుంది. ఆ ప్రకారంగా, ప్రభుత్వం పాఠశాల మౌలిక సదుపాయాల ఆధునీకీకరణ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నది. ఈ సంవత్సరం, రూ.1,500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను. ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెడతుంది. మన పిల్లలు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా కూడా ఉద్యోగాల కోసం వెళ్లవలసినప్పుడు వారికి నమ్మకం మరియు సమర్థతను కలిగించడమే ఈ చర్య ఉద్దేశ్యం. తెలుగు భాష ప్రాముఖ్యతను కాపాడాలనే ఉద్దేశంతో తెలుగును తప్పనిసరి చేస్తాం. ఈ ప్రభుత్వం ఫీజులను నియంత్రించి, క్రమబద్ధం చేయడానికి, విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి మరియు ప్రైవేటు విద్యా సంస్థలలోని టీచర్ల బాగోగులను సంరక్షించడానికి క్రమబద్ధీకరణ మరియు పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమీషన్ గౌరవ ముఖ్యమంత్రికి నేరుగా నివేదిస్తుంది.

41. ప్రస్తుతం, దేశంలో విద్యాపరంగా, పౌష్టికాహార ఫలితాలపరంగా తోడ్పాటునందించే అత్యంత సమర్ధవంతమయిన అభివృద్ధి కార్యక్రమాలలో ఒకటిగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తృతంగా గుర్తించడం జరిగింది. ఈ పథకం క్రింద అందించే ఆహార నాణ్యతను మెరుగుపరచడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కుక్-కం-హెల్పర్ గౌరవ వేతనాన్ని నెలకు రూ.1000/-ల నుండి రూ.3000/-లకు పెంచడమయింది. ఇందునిమిత్తం రూ. 1,077 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను.

42. విద్యార్థులు వారి ఉన్నత విద్యకు సంబంధించిన నిధుల సమీకరణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఈ ప్రభుత్వం గమనించింది. మెట్రిక్ అనంతర కోర్సులలో తల్లిదండ్రులు, విద్యార్థుల భారాన్ని తగ్గించడానికి ఈ ప్రభుత్వం 'జగనన్న విద్యా దీవెన పథకాన్ని' అమలు చేయడం ద్వారా అన్ని కమ్యూనిటీల వారికి చెందిన విద్యార్థులకు నూటికి నూరు శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ను సమకూరుస్తుంది. కుటుంబాలపై అధిక భారం మోపే ఆహారం, ప్రయాణం, హాస్టలు, పుస్తకాలు మొదలైన ఇతర ఖర్చులను భరించేందుకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క విద్యార్ధికి రూ.20,000/-ల చొప్పున నిర్వహణ మద్ధతును కూడా ఈ ప్రభుత్వం అందిస్తుంది. ఇందునిమిత్తం రూ. 4,962.3 కోట్ల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను. ఇది 15.5 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చుతుంది.

43. అఖిల భారత సాంకేతిక విద్యామండలిచే సూచించబడిన ఉన్నతాధికార నిపుణుల సంఘం సిఫారసుల ప్రకారం, ఇంజనీరింగ్ పాఠ్యప్రణాళికను ప్రభుత్వం రీడిజైన్ చేసింది. ఫలితంగా ఇంజనీరింగ్ మరియు డిగ్రీ కళాశాలల్లో అందించే కోర్సులు పరిశ్రమల నైపుణ్య ప్రమాణాలకు తగ్గట్టుగా క్రమబద్ధం చేయబడ్డాయి. ఉద్యోగాలను పొందడానికి విద్యార్థులు సన్నద్ధమై ఉండటానికి ఇది దోహదపడుతుంది. ఉన్నతీకరించిన పాఠ్యప్రణాళికను 2019-20 విద్యా సంవత్సరం నుండి రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, అనుబంధ గుర్తింపు కళాశాలల్లో అమలు చేయడమవుతుంది. అదేమాదిరిగా, ఈ ప్రభుత్వం, కోర్సులను ఉన్నతీకరించడానికి, విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి సాంకేతిక కళాశాలలకు కూడా పూర్తి మద్ధతును అందిస్తుంది. ఈ ప్రభుత్వం పరిశ్రమ అవసరాలను తీర్చడానికి పాలిటెక్నిక్ విద్య ద్వారా కూడా నైపుణ్యం గల సాంకేతిక సిబ్బంది లభ్యతను పెంచుతుంది.

ఆరోగ్యశ్రీ

4. ఈ సందర్భంగా, మన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వైఎస్. రాజశేఖర రెడ్డి గారి చిరస్మరణీయమైన సేవలను మననం చేసుకోవాలి. 108, 104 సేవలు, ఆరోగ్యశ్రీ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఆయన అందించిన బహుమానాలు. ఆంధ్రప్రదేశ్‌లో వాటిని ప్రారంభించిన తరువాత అనేక రాష్ట్రాలు ఈ కార్యక్రమాలను అనుసరించడం ప్రారంభించాయి. వారి యొక్క వాస్తవ లక్ష్యాలను నెరవేర్చడానికి ఈ కార్యక్రమాలకు పునఃప్రాణం పోయవలసిన అవసరమున్నది.

45. ప్రతి పేద కుటుంబం ప్రభుత్వ మరియు కార్పొరేటు ఆసుపత్రులలో నాణ్యమైన చికిత్సను పొందగలిగే లక్ష్యంతో స్వర్గీయ డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రారంభించారు. ప్రజలు, పేదరికంలో పడిపోవడానికి ఆరోగ్య ఖర్చులు ప్రాధమిక కారణంగా ఉన్నాయని సూచించడానికి ప్రపంచవ్యాప్తంగా తగినంత సాక్ష్యం ఉన్నది. అందువలన, పేదరికంలో పడిపోకుండా అనేక కుటుంబాలను డా.వైఎస్ఆర్ గారు కాపాడారని తెలపడం సముచితంగా ఉంటుంది.

46. ఈ కార్యక్రమాలు వాటి యొక్క మునుపటి వెలుగును తిరిగి పొందుతాయని ఈ ప్రభుత్వం హామీ ఇస్తున్నది. తదనుసారంగా, ఆరోగ్యశ్రీ వర్తింపును ఈ క్రింది విధంగా విస్తరించాలని యోచిస్తున్నది. (i) వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్న అన్ని కుటుంబాలకు అంటే నెలకు రూ.40,000/ఆదాయం కలిగిన మధ్యతరగతి కుటుంబాలకు గణనీయంగా వర్తిస్తుంది. (ii) వైద్య ఖర్చులు రూ.1,000/లు మించిన అన్ని కేసులు. (iii) చికిత్స వ్యయంపై ఏ విధమైన పరిమితి లేకుండా అన్ని కేసులకు చికిత్సను అందించడం. సరిహద్దు జిల్లాలలో ప్రజల ప్రయోజనం కోసం రాష్ట్రానికి వెలుపల బెంగుళూరు, హైదరాబాదు, చెన్నై వంటి తదితర నగరాలలోని మంచి ఆసుపత్రులను ప్రభుత్వ జాబితాలో చేరుస్తుంది. అన్ని రకాల రోగాలు, సర్జరీలను ఆరోగ్యశ్రీ క్రింద వర్తింపు చేయడమవుతుంది. ఇది మరో 5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ వర్తింపును కల్పిస్తుంది. ఈ కార్యక్రమానికి రూ. 1,740 కోట్లు కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.

47. అత్యవసర పరిస్థితిలో తొలి కీలక గంటలు రోగి యొక్క విధిని నిర్ణయిస్తాయని మనకు తెలుసు. వారు అసుపత్రికి చేరే సమయాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా కచ్చితంగా రోగులను కాపాడటానికి 108 కార్యక్రమాన్ని ప్రారంభించడమయింది. రాష్ట్రంలోని ప్రతి ప్రదేశానికి వర్తింపచేయడానికి ప్రతి మండలంలో ఒక 108 ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రిగారు ఆదేశించారు. అంబులెన్సు 20 నిమిషాల లోపల రోగిని చేరుకోగలగాలి. ఆ ప్రకారంగా, మొత్తం రూ. 143.38 కోట్ల కార్యక్రమ సంబంధ వ్యయంతో 432 అదనపు అంబులెన్సులను సేకరించాలని మేము ప్రతిపాదిస్తున్నాం.

48. గ్రామ స్థాయిలో వైద్య అధికారుల ద్వారా నాణ్యమైన ప్రాధమిక ఆరోగ్య రక్షణ సేవలను అందించే ఉద్దేశంతో, 104 కార్యక్రమాన్ని ప్రారంభించడమయింది. ఈ కార్యక్రమ వర్తింపును సంతృప్త స్థాయికి తేవాలని ఈ ప్రభుత్వం భావిస్తున్నది. తదనుసారంగా, మొత్తం రూ. 179.76 కోట్ల కార్యక్రమ సంబంధ వ్యయంతో 676 అదనపు వాహనాలను సేకరించి, సర్వీసు నాణ్యతను మెరుగుపరచాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది.

49. 2 సంవత్సరాల వ్యవధిలో ఉత్తమ కార్పొరేటు ఆసుపత్రులతో సమానంగా మన ప్రభుత్వ ఆసుత్రుల స్థితిని మార్పు చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకొరకు, ఒక పరివర్తనా ప్రణాళికను రూపొందించాము. ఇందునిమిత్తం రూ.1,500 కోట్లను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను.

50. ఈ ప్రభుత్వం గిరిజన జనాభా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వీరికి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రాధమిక ఆరోగ్య సర్వీసులుగా ఉంటాయి. అందువల్ల, ఈ సంవత్సరం రూ.66 కోట్ల ప్రాధమిక వ్యయంతో పాడేరు /అరకు ప్రాంతాలలో గిరిజన వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. అదనంగా, ఒక్కొక్క దానికి రూ.66 కోట్ల ప్రాధమిక బడ్జెటుతో పల్నాడుకు సేవ చేయడానికి గురజాల వద్ద మరియు ఉత్తరాంధ్రకు సేవలందించడానికి విజయనగరంలో రెండు వైద్య కళాశాలలను నెలకొల్పాలని, రూ.50 కోట్ల వ్యయంతో శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం.

51. ఈ ప్రభుత్వం ప్రత్యేకించి మాతా, శిశు ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్) 74. 2019-20 చివరి నాటికి దీనిని 55 కు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అదేవిధంగా, శిశు మరణాల రేటును 32 నుండి 22 కు తగ్గించాలని ఉద్దేశిస్తున్నాము. ఈ సంవత్సరం చివరి నాటికి మాటికి నూరు శాతం ప్రసవాలు సంస్థాగతపరంగా జరిగేలా చూడాలని భావిస్తున్నాము.


వైఎస్ఆర్ గృహనిర్మాణ పథకం

పక్షికి గూడు ఉంటుంది.
మృగాలకు గుహలు ఉంటాయి.
చిన్న చీమ కూడా పుట్ట ఏర్పాటు చేసుకుంటుంది.
ఓ నీడంటూ లేని దురదృష్టకరమైన పరిస్థితి మనిషిదే.
అందులోనూ పేదలూ, నిరుపేదలూ జానెడు జాగా కోసం జీవితమంతా కష్టపడుతున్నారు.

52. వచ్చే సంవత్సరం నుండి ప్రారంభిస్తూ, రాబోయే 5 సంవత్సరాలలో, 25 లక్షల గృహాలను నిర్మించాలని ఈ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ సంవత్సరం, ఇంటి స్థలాలను పంపిణీ చేయడమవుతుంది. తగిన భూమిని గుర్తించేందుకు పనిని ప్రారంభించాము. అవసరమైతే, ప్రైవేటు భూములను తీసుకుంటాము. మునుపటి ప్రభుత్వం, గత 5 సంవత్సరాలుగా, పట్టణ ప్రాంతాలలో 91,119 గృహాలను మరియు గ్రామీణ ప్రాంతాలలో 7,04,916 గృహాలను మాత్రమే నిర్మించగలిగింది. గృహ నిర్మాణ కార్యక్రమం పట్ల మా నిబద్ధతను చూపేందుకు, 2020, మార్చి 25 తేదీన ఉగాది పండుగ సందర్భంగా ఇల్లు లేని వారికి 25 లక్షల ఇంటి పట్టాలను పంపిణీ చేసేలా చూడాలని గౌరవ ముఖ్యమంత్రిగారు ఇప్పటికే మమ్మల్ని ఆదేశించారు. హక్కుపత్రాన్ని కుటుంబంలోని మహిళ పేరుతో ఇవ్వడమవుతుంది. అంతేగాక, ఈ స్థలాలలో నిర్మించిన ఇళ్లను పేదలు తమ భవిష్యత్తు అవసరాల కోసం తనఖా పెట్టుకోవచ్చు. ఈ కార్యక్రమానికి రూ. 8,615 కోట్లు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను.

53. మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా, ప్రభుత్వం 300 చదరపు అడుగుల వరకు గల గృహాలకు సంబంధించి పట్టణ గృహనిర్మాణ లబ్ధిదారుల రుణ భారాన్ని మాఫీ చేస్తుంది.

యువత మరియు ఉపాధి ద్వారా ఇంటి వద్దకు పరిపాలన

క్షీరార్థినాం కిం కరిణ్యా?
పాలు కావలసిన వాడికి పాలే ఇవ్వాలి.
ఏనుగునిస్తే ఉపయోగం ఏమిటి ?
నిరుద్యోగులకు కంటితుడుపు భృతులకన్నా
పని కల్పించడం అవసరం.

54. 2022 నాటికి, భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటుంది. ప్రజలు వివిధ కార్యక్రమాలను వినియోగించుకోవడం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు తరచుగా వెళ్ళాల్సిన స్థితిలో మనం ఉండకూడదు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు తమ ఇంటి ముంగిటికే వస్తున్నాయని, సమస్యలను పరిష్కరించుకోవడం తమ హక్కు అని ప్రజలు భావించే పరిపాలనకు స్వాగతం పలకాలని మన ముఖ్యమంత్రిగారు భావిస్తున్నారు. ఈ లక్ష్య సాధన కోసం గ్రామ / వార్డు వాలంటీర్ల కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇందులో గ్రామీణ ప్రాంతాలలో దాదాపు 2,00,000 మరియు పట్టణ ప్రాంతాలలో 81,000 ప్రజాస్ఫూర్తి కలిగిన యువ వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటాము. ప్రతి 50-100 గృహాల సముదాయానికి ఈ సేవలను అందించడానికి, వాటిని ఒకే చోటకు సమీకరిస్తూ ఈ కార్యక్రమాన్ని 2019, ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభిస్తాము.

55. అదే స్పూర్తితో, సంబంధిత యంత్రాంగాన్నంతటినీ గృహ పరివారాలకు దగ్గరగా తీసుకురావాలని ఈ ప్రభుత్వం భావిస్తున్నది. 10 మంది ఉద్యోగులతో సుమారు 2,000 మంది జనాభాకు గ్రామ సచివాలయాన్ని మరియు 5 మంది ఉద్యోగులతో సుమారు 5,000 మంది జనాభాకు వార్డు సచివాలయాన్ని నెలకొల్పడం ఈ దిశగా తీసుకున్న ఒక చర్య. దీనివల్ల గ్రామ సచివాలయంలో సుమారు 1,00,000 కొత్త ఉద్యోగాలు మరియు వార్డు సచివాలయంలో సుమారు 15,000 కొత్త ఉద్యోగాలు కల్పించవచ్చునని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవం అయిన అక్టోబరు 2, 2019 తేదీన ప్రారంభిస్తాము. గాంధీజీ ప్రభావం మన దేశం, అలాగే ప్రపంచంపై శాశ్వతంగా కొనసాగేందుకు ఇది ఒక నివాళి.

పౌర సరఫరాలు

56. తక్కువ బరువు, తక్కువ నాణ్యత, తినడానికి వీలులేని సరుకులు, లీకేజీలు, సరుకులను బహిరంగ మార్కెట్లోకి రీసైకిల్ చేయడం వంటి అంశాలతో వ్యవస్థ ఇబ్బంది పడుతున్నదన్న విషయం ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద సరకులను కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సమస్యలను ఒక్క సారిగా పరిష్కరించేటట్లు చూడటానికి, మన ప్రభుత్వం డోర్ డెలివరీ వ్యవస్థను ప్రవేశపెడుతున్నది. అన్ని సరుకులు మంచి నాణ్యమైనవిగా ఉంటాయి. నూకలను వేరు చేసి, తొలగించి, మంచి నాణ్యమైన బియ్యాన్ని ప్యాకింగ్ చేసి గ్రామ / వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి సరఫరా చేయడమవుతుంది. ఇందువల్ల హామీతో కూడిన నాణ్యమైన సరకులను అందించడమే కాకుండా 'సార్టెక్స్' మరియు ఇతర గ్రేడింగ్ యంత్రాంగాల ద్వారా ప్యాకింగ్ దశలోనే నాణ్యతను తనిఖీ చేయడానికి వీలవుతుంది. ఈ కార్యక్రమం కోసం రూ. 3,750 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.

మహిళా సంక్షేమం

“మహిళల పురోభివృద్ధిని కొలబద్దగా చేసుకొని మాత్రమే నేను ఏ సమాజ పురోగతినైనా అంచనా వేస్తాను”

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్.

57. మహిళల ఔన్నత్యమంతా వారి సంకల్పబలంలోనే ఉంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, బాధలతో కుంగి కృశించి పోయే వారు కొందరైతే - ఆ సమస్యలు రాజేసిన అగ్నినే ఇంధనంగా మార్చుకొని రివ్వున ఆకాశంలోకి ఎగిరేవారు మరికొందరు. మహిళాభివృద్ధి ద్వారానే సుస్థిర మరియు సమ్మిళిత పరిపాలనను సాధించగలమని ఈ ప్రభుత్వం విశ్వసిస్తున్నది. ఈ దిశగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాల కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ఈ ప్రభుత్వం అమలుచేస్తున్నది. ఈ ఆర్థిక సహాయం పరపతి ఖర్చును గణనీయంగా తగ్గించి, తిరిగి చెల్లింపును ప్రోత్సహిస్తుంది. తద్వారా ఆదాయకల్పన కార్యకలాపాలను చేపట్టడంతో లక్షలాది మంది మహిళలకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఇందుకొరకు రూ. 1,140 కోట్ల బడ్జెటు వ్యయంతో 6,32,254 గ్రామీణ స్వయం సహాయక బృందాలకు, 1,66,727 పట్టణ స్వయం సహాయక బృందాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆశించడమయింది.

షెడ్యూల్డు కులాలు మరియు షెడ్యూల్డు తెగల ఉప-ప్రణాళిక

58. షెడ్యూల్డు కులాలు మరియు షెడ్యూల్డు తెగల వారు ప్రభుత్వం పట్ల వారి పూర్తి నమ్మకం మరియు విశ్వాసాన్ని ఉంచారు. వారి స్థిరమైన మద్ధతుకు మా ధన్యవాదాలు తెలుపుతూ వారి ఉన్నత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని వాగ్దానం చేస్తున్నాం.

59. పారదర్శక విధానంలో ఎస్‌సి మరియు ఎస్‌టి ఉప-ప్రణాళికలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ప్రభుత్వం షెడ్యూల్డు కులాలు అంటే మాల, మాదిగ, రెల్లి మరియు ఇతర కమ్యూనిటీల కోసం కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తుంది. షెడ్యూల్డు కులాల ఉప-ప్రణాళిక క్రింద, షెడ్యూల్డు కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.15,000.86 కోట్ల మొత్తాన్ని ఈ ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా, షెడ్యూల్డు తెగల ఉప-ప్రణాళిక క్రింద రూ.4,988.53 కోట్ల మొత్తాన్ని కేటాయించింది. ఈ ప్రభుత్వం ఎస్.సి, ఎస్‌టీ సహోదరుల ఆకాంక్షలను నెరవేర్చి, అభివృద్ధిలో అంతరాలను సమర్ధవంతంగా పూరించేటట్లు చూస్తుంది.

60. పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రిగారికి అందిన విజ్ఞాపననుసరించి 15.62 లక్షల ఎస్.సి కుటుంబాలకు రూ.348.65 కోట్లు, 4.78 లక్షల షెడ్యూల్డు తెగల కుటుంబాలకు రూ.81.70 కోట్లు తగువిధంగా కేటాయిస్తూ షెడ్యూల్డు కులాలు మరియు షెడ్యూల్డు తెగలకు ఉచిత విద్యుత్తు యూనిట్ల సంఖ్యను బడ్జెటులో 100 నుండి 200కు పెంచాలని ప్రతిపాదించడమయింది.

61. షెడ్యూల్డు తెగల వారిలో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి డా. వైఎస్ ఆర్ గిరిజన విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం రూ.50 కోట్లు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను.

వెనుకబడిన తరగతుల సంక్షేమం

62. ఈ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు కట్టుబడి ఉంది. ఇందుకొరకు, మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా ప్రభుత్వం బిసిల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాల నిమిత్తం రూ.15,061 కోట్ల మొత్తాన్ని కేటాయించింది. బిసి కమీషన్ ను మరింత సమర్థవంతంగా రూపొందించేందుకు పునర్ నిర్మించాలని కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

63. ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.10,000 మేరకు నాయీ బ్రాహ్మణులు మరియు రజకులకు ఆదాయ మద్దతును ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నది. ఇది వారి యంత్రాలను ఆధునీకరించుకుని, అధిక ఆదాయాలను ఆర్జించేందుకు దోహదపడుతుంది. ఈ చర్య రూ.200 కోట్ల వ్యయంతో సుమారు 23,000 మంది నాయీ బ్రాహ్మణులు మరియు సుమారు 1,92,000 మంది రజకులకు ప్రయోజనం చేకూర్చుతుందని ఆశించడమయింది. ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.100 కోట్ల కేటాయింపుతో దర్జీలకు రూ.10,000/-ల ఆదాయ మద్దతును ప్రవేశపెట్టాలని కూడా ప్రతిపాదిస్తున్నది.

64. అదేవిధంగా, ప్రతి చేనేతకారుని కుటుంబానికి రూ. 24,000/-ల ను సమకూర్చేందుకు కూడా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది, వారి పరికరాలను ఆధునీకరించుకొని మర మగ్గాల ఉత్పత్తులతో పోటీపడేందుకు ఉపకరిస్తుంది. చేనేతకారులు గౌరవప్రదమైన ఆదాయాలను ఆర్జించడానికి అవసరమైన మార్కెటింగ్ సహాయాన్ని మరియు ఇతర సబ్సిడీలను కూడా మేము అందించడం జరుగుతుంది.

65. మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా, వెనుకబడిన తరగతుల కోసం ప్రభుత్వం 139 ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తుంది. ఈ కార్పొరేషన్లు వివిధ బిసి ఉప-సామాజిక వర్గాలకు చెందిన ప్రజల అభివృద్ధికి సహాయం అందిస్తాయి. పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లను పునరుద్ధరిస్తాము. సవివరంగా లెక్కించిన తరువాత, వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఈ కార్పొరేషన్ల ద్వారా వచ్చే సంవత్సరం నుండి ప్రారంభిస్తాం.

మైనారిటీ సంక్షేమం

66. ఈ ప్రభుత్వం వక్స్ బోర్డుకు చెందిన స్థిర, చరాస్తుల సర్వే నిర్వహించి, అట్టి ఆస్తులను మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ప్రజల అభ్యున్నతికి ఉపయోగించేలా చూడటానికి స్థిరాస్తుల రికార్డులను డిజిటలైజ్ చేస్తుంది.

67. ఇమామ్ల గౌరవ వేతనాన్ని నెలకు రూ. 10,000/-లకు మరియు మౌజామ్ల గౌరవ వేతనాన్ని నెలకు రూ.5,000/-లకు పెంచాలని ప్రతిపాదించడమయింది. అదే విధంగా పాస్టర్లకు నెలకు రూ.5,000/-ల గౌరవ వేతనాన్ని కల్పించాలని కూడా ప్రతిపాదించడమయింది.

68. బడ్జెట్లో చేర్చిన వివిధ పథకాల క్రింద మైనారిటీల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం రూ.2,106 కోట్ల మొత్తాన్ని సమకూర్చాలని ప్రతిపాదించడమయింది.

69. బిసి, ఎస్‌సి, ఎస్‌టి మరియు మైనారిటీ సామాజిక వర్గాల రాజకీయ అభ్యున్నతి కోసం దేవాలయాల ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ యార్డ్ కమిటీలు, కార్పొరేషన్లు మున్నగువంటి నామినేటెడ్ పోస్టుల విషయంలో 50 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఒక బిల్లు తీసుకురావాలని ఈ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. వారి ఆర్థిక ఔన్నత్యం కోసం అన్ని నామినేటెడ్ మరియు కాంట్రాక్టు పనులలో 50 శాతం రిజర్వేషను ఉంటుంది.

కాపు సంక్షేమం

70. మేనిఫెస్టో వాగ్దానం ప్రకారం, కాపు సామాజికవర్గ సంక్షేమం మరియు అభివృద్ధి కోసం నేను రూ.2,000 కోట్ల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

బ్రాహ్మణ సంక్షేమం

71. బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణుల కార్పొరేషనుకు నేను రూ.100 కోట్ల మొత్తం కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అంతేగాక, దేవాలయాల నిర్వహణకు తగినన్ని నిధులు లేని అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. 2000 వరకు జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి రూ.30,000లతోనూ, 5000 వరకు జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి రూ.60,000లతోనూ, 10,000 వరకు జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి రూ.90,000 లతో నూ, 10,000 లకు మించి జనాభా ఉన్న ప్రతి పంచాయతీకి రూ.1,20,000 లతోనూ దూప, దీప, నైవేధ్యం కల్పించేందుకు రూ.234 కోట్లు కేటాయింపుకు నేను ప్రతిపాదిస్తున్నాను.

వైఎస్ఆర్ బీమా

72. వైఎస్ఆర్ బీమా పథకం క్రింద 18 నుండి 60 సంవత్సరాల మధ్య గల ఎవరేని వ్యక్తి సహజంగా మరణించినట్లయితే, ఆ కుటుంబానికి రూ.1 లక్ష సహాయం అందించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. బిసి, ముస్లి, క్రిస్టియన్ సామాజిక వర్గాలకు చెందిన వారితో సహా ఎవరైనా వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి రూ.5,00,000ల సహాయాన్ని అందిస్తాము. వైఎస్ఆర్ బీమా పథకం కోసం రూ.404.02 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.

వైఎస్ఆర్ పింఛను కానుక

73. పాదయాత్ర సమయంలో, మన గౌరవ మఖ్యమంత్రిగారు పెన్షనర్లు ఎదుర్కొంటున్న దురవస్థను చూశారు. వారు రూ.1,000/-ల స్వల్ప పింఛనను పొందుతున్నారు. ఈ మొత్తం గౌరవప్రద జీవనాన్ని సాగించడానికి సరిపోదు. అవ్వ తాతల మనవడిగా మన ముఖ్యమంత్రిగారు పింఛను మొత్తాన్ని రూ.2,250/-లకు పెంచుతూ, దానిని నాల్గవ సంవత్సరం నాటికి రూ.3,000/-లకు పెంచేలా రోడ్ మ్యాప్ ను పొందుపరుస్తూ తన మొదటి ఫైలుపై సంతకం చేశారు. అంతేగాక, ఈ ప్రభుత్వం వయో పరిమితిని 65 నుండి 60 సంవత్సరాలకు తగ్గించింది. సంతృప్తి స్థాయి ప్రాతిపదికన పింఛన్లను అందించాలని నిర్ణయించింది. ఈ పెంపుదల వల్ల అన్ని కేటగిరీలలో సుమారు 65 లక్షల మంది పింఛనుదారులు - అనగా 24 లక్షల మంది వయోవృద్ధులు, సుమారు 20 లక్షల మంది వితంతువులు, 6.3 లక్షల మంది దివ్యాంగులు, 1 లక్షమంది నేతకారులు, 27,000 మంది కల్లుగీత కార్మికులు లబ్ది పొందుతారు. డయాలసిస్ రోగుల కోసం పింఛనును నెల ఒక్కింటికి రూ.10,000లకు పెంచడమయింది. ఈ కార్యక్రమం కోసం రూ. 15,746.58 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను.

వైఎస్ఆర్ ఆసరా

74. నవరత్నాలు అమలులో భాగంగా వైఎస్ఆర్ ఆసరా ద్వారా 2019, ఏప్రిల్ 11 వరకు రూ.27,168 కోట్లు మిగిలిన బ్యాంకు రుణ మొత్తాన్ని వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించి నాలుగు వాయిదాలలో రీయింబర్స్ చేయాలని నిర్ణయించడం జరిగింది.

వైఎస్ఆర్ చేయూత

75. ఎస్‌సి, ఎస్‌టీ, బిసి, అల్పసంఖ్యాక వర్గాలు మరియు ఇతర సంక్షేమ ఆర్థిక సంస్థలను సమీక్షించి ఈ సంవత్సరం పునరుద్ధరించాలని ప్రతిపాదించడమయింది. పునరుద్ధరించిన తరువాత ఈ సంస్థలు లబ్దిదారుల గుర్తింపును ఈ సంవత్సరంలోనే చేపట్టడం జరుగుతుంది. సంతృప్తి స్థాయిని చేరుకోవడానికి గ్రామ / వార్డు వాలంటీర్ల సహాయంతో సంబంధిత కార్పొరేషన్ల ద్వారా దీనిని అమలు చేయడమవుతుంది. ఎస్‌సి /ఎస్‌టి /బిసి మరియు అల్పసంఖ్యాక సోదరీమణులు వచ్చే సంవత్సరం నుండి ప్రయోజనాలను పొందుతారు.

వైఎస్ఆర్ కళ్యాణ కామక

76. వైఎస్ఆర్ కళ్యాణ కానుక ద్వారా బిసి కులాలకు చెందిన వధువులకు సహాయం అందించడం కోసం వారికి రూ.50,000/-లు వివాహ కానుక ఇవ్వాలని ప్రభుత్వం ఉద్దేశించింది. తద్వారా, 2019-20 సంవత్సర కాలంలో 75,000 మంది బిసి వధువులు ప్రయోజనం పొందుతారు. అదేవిధంగా ఎస్‌సి, ఎస్‌టీ కులాలకు చెందిన వధువుల కోసం 2019-20లో 28,568 మంది ఎస్‌సి వధువులు మరియు 4,290 మంది ఎస్‌టి వధువులు, 20,000 మంది అల్పసంఖ్యాక వర్గాల వధువులకు ప్రయోజనం కల్పిస్తూ రూ.1,00,000/-ల కళ్యాణ కానుక ఇవ్వడం జరుగుతుంది.

ఇతర సంక్షేమ పథకాలు

77. టెక్నాలజీ ఆధారిత అంతరాలు, సాంప్రదాయ వృత్తులకు ప్రమాదకరం. ఆటో రిక్షాలు, ట్యాక్సీలను స్వంతంగా కలిగి ఉన్న డ్రైవర్లు 'ఓలా' మరియు 'ఉబర్' వంటి యాప్ ఆధారిత మోబిలిటి అగ్రిగేటర్ నిర్వాహకులతో పోటీపడలేకపోతున్నారు. బీమా, ఫిటినెస్, మరమ్మతులు మరియు ఇతర అవసరాల నిమిత్తం అయ్యే వ్యయాన్ని భరించడానికి ఏడాదికి రూ.10,000/-లను సహాయం చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకువస్తుంది. సొంత ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల ప్రయోజనం కోసం బడ్జెటులో రూ.400 కోట్లు కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.

78. ఈ ప్రభుత్వం న్యాయవాదులకు ప్రాక్టీసు మొదటి మూడు సంవత్సరాల కాలంలో రూ.5000ల నెలవారీ స్టయిఫండును సమకూర్చడానికి ప్రతిపాదిస్తున్నది. దీనికోసం, 2019-20లో 10 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అంతేగాక, 100 కోట్ల రూపాయలతో న్యాయవాదుల సంక్షేమం కోసం ట్రస్టును ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదిస్తున్నాను.

అగ్రిగోల్డ్

79. అగ్రిగోల్డు కంపెనీలు ప్రజల నుండి అధిక వడ్డీ రేటును లేదా దానికి బదులుగా భూమిని రిజిస్టరు చేస్తామనే వాగ్దానంతో డిపాజిట్లను సేకరించాయి. అయితే, కంపెనీలు డిపాజిట్లను చెల్లించడం గానీ లేదా ఏదేని భూమిని డిపాజిటర్ల పేరిట రిజిస్టరు చేయడం గానీ జరగలేదు. ఇది తమ జీవనకాల పొదుపులను కోల్పోయిన లక్షలాది మంది డిపాజిటర్లలో తీవ్రమైన దుఃఖాన్ని, భయాన్ని కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అగ్రిగోల్డు స్కామ్‌లో దాదాపు 11.5 లక్షల మంది బాధితులు ఉన్నారు. వారికి మద్ధతునివ్వవలసిన సమయం మించిపోయింది. ప్రభుత్వం అగ్రిగోల్డుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. అందువల్ల, దీని కోసం రూ. 1,150 కోట్ల మొత్తాన్ని కేటాయించడానికి ప్రతిపాదిస్తున్నాను.

జలయజ్ఞం

80. కృష్ణా, గోదావరి ఆయకట్టులను స్థిరీకరించడం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను ‘హరితాంధ్రప్రదేశ్' గా తీర్చిదిద్దడం స్వర్గీయ డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దార్శనికత. ఆయన కలను సాకారం చేయడానికి వీలుగా పోలవరం ప్రాజెక్టును జూన్ 2021 నాటికి అత్యధిక ప్రాధాన్యతతో పూర్తి చేయడానికి మరియు తగిన బడ్జెట్ ను అందించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మానవతా దృక్పథంతో ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు పునఃపరిష్కారం మరియు పునరావాసాన్ని పూర్తి చేయడానికి అన్ని చర్యలను తీసుకోవడం జరుగుతుంది.

81. ఒక సంవత్సర కాలంలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు సొరంగం - 1 ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనివల్ల 1.19 లక్షల ఎకరాలకు నీటిని అందించవచ్చు. మిగిలిన ఆయకట్టు ఏర్పాటు చేయడానికి 2 సంవత్సరాల కాలం లోపుగా సొరంగం-2 మరియు 2వ దశను పూర్తి చేయడం జరుగుతుంది.

82. అవుకు సొరంగాన్ని పూర్తి చేస్తూ ఒక సంవత్సరంలో గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు 1వ దశను పూర్తి చేసేందుకు, గండికోట రిజర్వాయరులో వీటి నిల్వ మరియు కడప జిల్లాలోని ఆయకట్టుదారులకు నీటి సరఫరాకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. అదేవిధంగా, కర్నూలు మరియు అనంతపురము జిల్లాలలోని 1.98 లక్షల ఎకరాలకు సాగునీటిని కల్పించేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి 1వ దశను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుంది. తదుపరి, అనంతపురము మరియు చిత్తూరు జిల్లాలలోని ప్రస్తుతమున్న చెరువులను నింపేందుకు ఒక నిర్ణీత కాలావధి విధానంలో 2వ దశను పూర్తి చేయడవువుతుంది.

83. వెనుకబడిన జిల్లాలయిన శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాలలో సత్వర సాగునీటి సౌకర్యాలను కల్పించడానికి వంశధార ప్రాజెక్టు మరియు సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

84. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటుగా రాష్ట్రంలోని సరస్సులు మరియు చెరువులను పునరుద్ధరించడానికి ఈ ప్రభుత్వం చర్యలను తీసుకుంటుంది.

85. 2019-20 సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల కొరకు రూ.13,139.13 కోట్ల బడ్జెటును ప్రతిపాదిస్తున్నాను.

పరిశ్రమ, మౌలిక సదుపాయాలు మరియు ఉద్యోగాలు

86. ముఖ్యంగా, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల ద్వారా ఉద్యోగ కల్పనే ముఖ్యోద్దేశ్యంగా ప్రత్యేక హోదా సాధించాలనే కృత నిశ్చయంతో మా ప్రభుత్వం ఉంది. ప్రత్యేక హోదా లేకుండా కూడా, పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఉద్యోగ కల్పనకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకునే పరిశ్రమలలో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్ సమకూర్చడానికి బిల్లును తీసుకువచ్చే ప్రక్రియలో ఉంది.

87. సులభతర వ్యాపార నిర్వహణలో మాత్రమే కాకుండా, వ్యయ ప్రభావక వ్యాపార నిర్వహణకు కూడా మేము ఉత్తమ రాష్ట్రంగా ఉండేందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎంఎస్ఎంఇలపై ప్రత్యేక శ్రద్ధతో, పరిశ్రమలన్నింటి కొరకు ప్రభుత్వం అనవసరమైన నిబంధనలను మరియు ప్రక్రియలను సరళీకృతం చేస్తుంది. క్రొత్త యూనిట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన సదుపాయాల కల్పననూ అలాగే ప్రస్తుతం ఉన్న యూనిట్లను పునరుద్ధరించడానికి సహాయాన్ని అందించాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది.

88. మన రాష్ట్రం ఒక కొత్త రాష్ట్రం, అభివృద్ధి కొరకు విస్తృత మౌలిక సదుపాయాలు అవసరం. గత ప్రభుత్వం, ఎటువంటి అవసరమైన పునాదులు లేకుండానే గాలిలో అనేక కోటలను నిర్మించింది. మన ఇంధన ఉపయోగితాల పనితీరు దేశంలోనే అత్యుత్తమమైనదని మనకు చెప్పారు. ఆర్ధిక స్థితిగతుల కారణంగా ఎన్టీపిసి నుండి విద్యుత్ సరఫరాను కోల్పోయే ప్రమాదం ఉన్న రెండు రాష్ట్రాలలో ఒకటిగా మనము ఉన్నామని, మన ఇంధన సంస్థలు ఇంతటి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని మేము ఇటీవలే తెలుసుకొని దిగ్ర్భాంతి చెందాం. ఇంధన రంగం ఒక్కదానిలోనే మేము గత ప్రభుత్వం నుండి రూ. 20,000 కోట్ల రుణాన్ని వారసత్వంగా పొందాం.

89. లోపభూయిష్ట పాలన వల్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో గత ప్రభుత్వం రూ.2,000 కోట్లకుపైగా అధికంగా చెల్లించింది. యూనిట్ ఒక్కింటికి సాధారణ థర్మల్ విద్యుత్ ఒక్కో యూనిట్ కొనుగోలు రేటు రూ.4.2 యూనిట్ ఒక్కింటికి అస్థిర రూ.3.1 లు మరియు నిర్ణీత రూ.1.1లుగా నిర్ణయించడమయింది) పవన విద్యుత్తు యూనిట్ ఒక్కింటికి రూ.5.9 (యూనిట్ ఒక్కింటికి అస్థిర రూ.4.8 లు మరియు నిర్ణీత రూ.1.1లుగా నిర్ణయించడమయింది) సౌర విద్యుత్ కు యూనిట్ ఒక్కింటికి అత్యధిక రేటు రూ.7.1గా (యూనిట్ ఒక్కింటికి అస్థిర రూ.6 లు మరియు నిర్ణీత రూ.1.1లుగా నిర్ణయించడమయింది) ఉంది. పునర్ వినియోగ వనరుల నుండి ఇంధన ఆవశ్యకతను పొందవలసిన ప్రమాణం 5 శాతంగా ఉండగా, అధిక వ్యయ పునర్ వినియోగ వనరుల నుండి గత ప్రభుత్వం సుమారు 20 శాతాన్ని తీసుకుంది. ఇది మొత్తంగా 8,000 మెగావాట్స్ కు చేరింది. ఈ ప్రభుత్వం పునర్ వినియోగ వనరుల నుండి విద్యుత్తును పొందడాన్ని వ్యతిరేకించడం లేదు. దీనిని వివేకవంతమైన మరియు అర్థవంతమైన విధానంలో చేపట్టాలని చెబుతున్నాం.

90. అయితే, మన మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రభుత్వం దృష్టి పెడుతున్నది. కాబట్టి విద్యుత్ అంతరాయాలు ఉండవు మరియు రహదారులు గుంతలు లేకుండా ఉంటాయి. వ్యక్తిగత మరియు వాణిజ్య ప్రయోజనాల కోసం రవాణా వ్యయాన్ని తగ్గించడం మరియు రోడ్డు, రైలు, వాయు మరియు నీటి మార్గాల ద్వారా అన్ని మండలాలు మరియు జిల్లాలలోని అన్ని ప్రధాన గమ్యస్థానాల మధ్య నిరంతర అనుసంధానాన్ని కల్పించడం మా ప్రయత్నంగా ఉంది.

91. అమరావతి రాజధాని నగరం కోసం బడ్జెటులో రూ.500 కోట్లను కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది.

92. 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో మరియు ఎన్నికల వాగ్దానంలో కడపలో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని రాష్ట్రానికి హామీ ఇవ్వడమయింది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం శంకుస్థాపన చేసింది. అయితే, ఈ ప్రాజెక్టు విషయంలో ఎటువంటి పురోగతి లేదు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న రాయలసీమ ప్రాంత డిమాండును నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రిగారు ఈ సంవత్సరం కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఈ బడ్జెటులో మొదట రూ.250 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను.

ఉద్యోగుల సంక్షేమం

93. మన గౌరవ ముఖ్యమంత్రిగారు మన ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు. 2019, జూలై నుండి ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిని ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ విషయాన్ని మరియు అనుబంధ విషయాలను అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయడమయింది. CPS నుండి పాత పింఛను పథకానికి మారేందుకు విధివిధానాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఏపీఎస్ ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయడం గురించి వివిధ అంశాలను వివరంగా అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయడమయింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ చర్యలను యోచిస్తున్నది.

94. రెగ్యులరు ఉద్యోగులుగా నియమించబడనప్పటికీ, దిగువ స్థాయిలలో సేవలను అందించే అనేకమంది ఇతర ఉద్యోగులు కూడా ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రిగారు వారి సంక్షేమాన్ని చూసేందుకు కట్టుబడి ఉన్నారు. ఆ ప్రకారంగా,

ఎ. ఆశా వర్కర్లకు నెలకు రూ.3,000/-ల నుండి రూ.10,000/-లకు.
బి. గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు నెలకు రూ.400/-ల నుండి రూ.4,000/-లకు.
సి. మునిసిపల్ అవుట్ సోర్సింగ్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు నెలకు రూ.12,000/-ల నుండి
రూ.18,000/-లకు.

డి. సెర్ప్ గ్రామ వ్యవస్థ సహాయకుడు మరియు మెప్మా రీసోర్స్ పర్సన్ కు నెలకు రూ.5,000/-ల నుండి
రూ.10,000/-లకు.
ఇ. హోం గార్డులకు నెలకు రూ.18,000/-ల నుండి రూ.21,300/-లకు
ఎఫ్. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రూ.1,000/-ల నుండి రూ.3,000/-లకు
జి. అంగనవాడీ వర్కర్లకు నెలకు రూ.10,500/-ల నుండి రూ.11,500/-లకు
హెచ్. అంగన్ వాడీ హెల్పర్లకు నెలకు రూ.6,000/- ల నుండి రూ.7,000/-లకు
పారితోషికాలను పెంచడం జరిగింది.

95. పెంచిన పారితోషికం సుమారు 3.17 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చుతుంది. వారి జీవన ప్రమాణాన్ని పెంచుకుని, వారి మనోబలాన్ని పటిష్టపరచుకోవడానికి వీలుకలుగుతుంది. ఇది ఉత్తమ సేవల నిర్వహణకు దారితీస్తుంది. దీనికి అదనంగా, వారి ఇబ్బందులను పరిష్కరించడానికి, పారితోషికం చెల్లింపులో జాప్యం కావడానికి సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు, నెలలో ఒక రోజు కేటాయించాలని మన గౌరవ ముఖ్యమంత్రిగారు జిల్లా కలెక్టర్లందరినీ ఆదేశించారు.

మధ్యపాన నిషేధము

96. మధ్యపాన వినియోగం అనేది సామాజిక బెడదగాను, సమాజాన్ని దెబ్బతీసే విధంగాను ఉన్నందున దశలవారీగా మధ్యపాన నిషేదాన్ని చేపడతామని మేము వాగ్దానం చేశాం. మధ్యపానం వలన మహిళలు మరియు చిన్న పిల్లలు బాగా ప్రభావితమవుతున్నారు. ఈ ప్రభుత్వం మొదటి చర్యగా, బెల్టు షాపులపై కఠినమైన చర్యలు తీసుకోవడాన్ని ప్రారంభించింది. తరువాతి చర్యగా డీలర్ యాజమాన్యంలోని దుకాణాలను ప్రభుత్వ యాజమాన్య దుకాణాలుగా మార్పు చేయుచున్నాము. తద్వారా అమ్మకం మరియు వినియోగంపై పూర్తి నియంత్రణను కలిగివుంటాయి. ఈ విధానం మద్యపాన నిషేధానికి మార్గాన్ని ఏర్పరస్తుంది మరియు ఉన్నత స్థాయి పరిమిత ప్రదేశాలకు మాత్రమే మద్యాన్ని పరిమితం చేయాలనే మా అంతిమ లక్ష్యాన్ని సాధించేందుకు దోహదపడుతుంది.

పరిపాలన

ప్రియః ప్రజానాం దాతైవ,
న పునః ద్రవిణేశ్వరః

అంటే,

ఎన్ని నీళ్లున్నా ఏం లాభం? ఎవరూ సముద్రాన్ని ఇష్టపడరు.
కాసిన్ని చినుకులు చిలకరించినా సరే, మేఘాన్నే కోరుకుంటారు.

97. ప్రస్తుతం రాష్ట్రంమంతటా బాధితులు చెప్పుకోలేని ఇబ్బందికి దారితీసే ఎన్ని భూ వివాదాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. ప్రస్తుతం వున్న సర్వే రికార్డులు చాలా పాతవి. 1880 నుండి 1910 మరియు 1960 నుండి 1980ల మధ్యకాలంలో నిర్వహించిన సర్వేల సమయంలో తయారు చేసినవి. రికార్డుల కంప్యూటరీకరణతోపాటుగా తీసుకున్న అనేక చర్యలు, కృషి ఫలితంగా స్పష్టమయిన, ఖచ్చితమయిన భూ హక్కు పత్రాలు సృష్టించబడుతున్నాయి. రికార్డులను ఇంకా తాజాపరచలేదు. వాస్తవికతను ప్రతిబింబించడం లేదు. తగురీతిలో విషయపరంగా మరియు రేఖాత్మకంగా అనుసంధానించబడిన రికార్డు లేదు. ఇబ్బందులు లేని భూ రికార్డులను అందించే ఏకగవాక్ష వ్యవస్థ లేదు.

98. రాష్ట్రంలోని ప్రతి భూభాగం యొక్క అన్ని అంశాలను సమగ్రపరచడం ద్వారా భూమి రికార్డులను తాజాపరచడం మరియు నవీకరించడం, రియల్ టైం సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ను నిర్వహించడం అవసరంగా ఉంది. సవివర భూ సర్వేను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. అన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు వినియోగిస్తున్నట్టి, నిరంతరంగా నిర్వహించు సూచిక కేంద్రం (సీఓఆర్ఎస్), సాంకేతికతను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించడమైనది. ఈ సాంకేతికతను వినియోగిస్తూ, భూమి భాగాల జియో-కో-ఆర్డినేట్లు ఏ సమయంలోనైననూ నమోదు చేయబడవచ్చు. భవిష్యత్తులో ప్రతి వ్యక్తిగత భూ యజమాని జియో-కోడ్స్ ఉపయోగిస్తూ అతని / ఆమె భూమిని సొంతంగా గుర్తించగలుగుతారు. తిరిగి సర్వే చేస్తూ భూమి రికార్డులు నూటికి నూరు శాతం సరిగా ఉంచడానికి గ్రామ సచివాలయంలో గ్రామ సర్వేయరును నియమించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది మరియు ఆ తరువాత, గ్రామ స్థాయిలో మాత్రమే భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడమవుతుంది.

99. మన రాష్ట్రంలో ఇల్లు లేదా ఒక భవనం నిర్మించాలని ప్రయత్నించే ప్రతి పౌరుడు ఇసుక త్రవ్వకంలో తీవ్ర అవినీతి తాకిడిని ఎదుర్కోవడం జరిగింది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మేము ఒక కొత్త విధానాన్ని అమలు చేస్తాం. ఇందులో ఒక బటన్ నొక్కగానే ఆన్లైన్లో అవసరార్ధులైన పౌరులందరికీ ఇసుక లభ్యంగా ఉంటుంది. ప్రభుత్వ ఏజన్సీలు మాత్రమే ఇసుకను విక్రయించడం జరుగుతుంది. అవినీతి లేకుండా చూస్తూనే పర్యావరణ పరిరక్షణతో పాటు పౌరుల అవసరాలను తీరడానికి ఈ విధానం ఉపకరిస్తుంది.

100. మన ప్రభుత్వంలో జవాబుదారీతనం మరియు పారదర్శకతలో సమూల మార్పును తీసుకురావాలని మేము భావిస్తున్నాం. అందుచేత, ఒక హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో మేము జ్యుడీషియల్ కమీషన్ ఏర్పాటు చేస్తాం. మేము మునుపటి భారీ కాంట్రాక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపట్టడం కూడా జరుగుతుంది. అందువల్ల వాటి యధార్థ విలువను పొందడం జరుగుతుంది. అన్ని ప్రాజెక్టుల అమలు కోసం కాంట్రాక్టులను, టెండర్లను కమీషన్ ఆమోదించిన తరువాతే ఇవ్వడం జరుగుతుంది. కమీషన్ ప్రస్తుతం వున్న టెండరింగ్ ప్రక్రియను కూడా సమీక్షించి, అవినీతిని నిర్మూలించి, ప్రక్రియలో పారదర్శకత వుండేలా చూడటానికి సంస్కరణలను సిఫారసు చేస్తుంది. మునుపటి ప్రభుత్వ ఉల్లంఘనల వల్ల అననుకూల ఆర్ధిక స్థితికి చేరుకున్న మన రాష్ట్రానికి ఈ చర్యలన్నీ చాలా అవసరం. పొదుపులను, అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టడం కోసం ఉపయోగించుకోవచ్చు.

ఆర్థిక ఖాతాలు మరియు అంచనాలు

101. 2017-18 ఖాతాలు : ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఖరారు చేసిన ఆర్థిక ఖాతాలు 2017-18 సంవత్సరానికి రూ.16,151.68 కోట్ల రెవెన్యూ లోటును, రూ.32,372.57 కోట్ల ద్రవ్య లోటును చూపుతున్నాయి. 2017-18 సంవత్సరానికి రెవెన్యూ లోటు మరియు ద్రవ్య లోటు వరుసగా జిఎస్‌డిపిలో 2.01 శాతం మరియు 4.03 శాతంగా ఉన్నాయి.

102. 2018-19 సవరించిన అంచనాలు : రెవెన్యూ వ్యయానికి సంబంధించి సవరించిన అంచనా రూ.1,26,339.05 కోట్లు. మూలధన వ్యయం రూ.20,398.15 కోట్లు. 2018-19 సంవత్సరానికి రెవెన్యూ లోటును రూ.11,654.91 కోట్లుగా అంచనా వేయడమయింది. ఇదే కాలానికి ద్రవ్య లోటును రూ.33,619.00 కోట్లుగా అంచనా వేయడమయింది. ఇవి జీఎస్‌డిపిలో వరుసగా 1.25 శాతం మరియు 3.62 శాతంగా ఉన్నాయి.

103. 2019-20 బడ్జెట్ అంచనాలు : 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.2,27,974.99 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. అంచనా వేసిన రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94 కోట్లు. అంచనా వేసిన మూలధన వ్యయం రూ.32,293.39 కోట్లు. ఇందులో పబ్లిక్ రుణం అసలు తిరిగి చెల్లింపు నిమిత్తం రూ.8,994 కోట్లు చేరివున్నాయి. 2018-19 బడ్జెట్ అంచనాల కంటే 2019-20 బడ్జెట్ అంచనాలలో సుమారు 19.32 శాతం పెరుగుదల ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వ్యయం సుమారు 20.10 శాతం పెరుగుతుందని, మూలధన వ్యయం సుమారు 12.60 శాతం పెరుగుతుందని అంచనా వేయడమయింది. అంచనా వేసిన రెవెన్యూ లోటు సుమారు రూ.1,778.52 కోట్లు. ద్రవ్య లోటు సుమారు రూ.35,260.58 కోట్లుగా అంచనా వేయడమయింది. ద్రవ్య లోటు జిఎస్‌డిపిలో సుమారు 3.30 శాతం. రెవెన్యూ లోటు జిఎస్‌డిపిలో సుమారు 0.17 శాతంగా ఉంటుంది.

తుది పలుకులు

104. ఈ ప్రభుత్వ లక్ష్యం చాణుక్యుని 'చతుర్విధ వికాసాల' మాదిరిగా ఉంటుంది. అవేవంటే..

‘అనుకున్న లక్ష్యాన్ని సాధించడం.
సాధించినదాన్ని సుస్థిర పర్చుకోవడం.
సుస్థిర పరచినదాన్ని విస్తరించడం.
విస్తరించిన దాన్ని నలుగురికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడం.

105. అదేవిధంగా, భారత స్వాతంత్ర స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా అప్పటి రాష్ట్రపతి శ్రీ కె.ఆర్. నారాయణన్ పలికిన మాటలను గుర్తు చేస్తున్నాను.

“యాభై సంవత్సరాల గణతంత్ర కాలంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ-న్యాయం మనతోటి లక్షలాది ప్రజలకు నెరవేరని కలగానే మిగిలిపోయింది. ఆర్థికాభివృద్ధి ప్రయోజనాలు ఇంకా వారికి అందాల్సివుంది. ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యంగల వ్యక్తులు ఎక్కువగా ఉన్న దేశాలలో మన దేశం ఒకటి. అయినప్పటికీ, ప్రపంచంలోనే అత్యధిక నిరక్షరాస్యులు మన దేశంలోనే ఉన్నారు. అంతేకాకుండా, మధ్యతరగతి వారు మరియు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు కూడా ఎక్కువే. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నారు. మన భారీ కర్మాగారాలు మురికివాడల నుండే ఉద్భవిస్తాయి. పేదవారి పూరి గుడిసెల మధ్య నుండే ఉపగ్రహాలు నింగికెగుతాయి.”

106. అధ్యక్షా, మన ముఖ్యమంత్రిగారు “నేను విన్నాను, నేను ఉన్నాను” అనే మాటల ద్వారా తొలి కొన్ని వారాలలోనే మన రాష్ట్రం మార్గదర్శినిగా ఎదిగేందుకు బీజం వేశారు. మొదటి సంవత్సరంలోనే మేనిఫెస్టోను అమలుపర్చడానికి మన ముఖ్యమంత్రిగారు ఆసక్తిగా ఉన్నారు. అయితే, ఈ లక్ష్య సాధనలో మన చేతులను కట్టివేస్తున్న పరిమిత వనరుల పరిధి లోపలే సంక్షేమం మరియు సంపద కల్పన మధ్య సమతుల్యం పాటించే ప్రయత్నం చేస్తున్నాము.

107. ఈ సందర్భంగా శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ పలికిన మాటలు మనకు మార్గదర్శకంగా ఉంటాయి.

“ఏదైనా పొందేందుకు మనం సామర్థ్యాన్ని కల్పించినట్లయితే మనకు చెందిన ప్రతీది మన వద్దకు వస్తుంది.”

- రవీంద్రనాథ్ ఠాగూర్

108. ఉత్సాహవంతులైన, కష్టపడి పనిచేసే స్వభావంగల ప్రజలున్న మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండే సామర్థ్యాన్ని కలిగివుంది. మనకు సంక్రమించిన ఆర్థిక అవరోధాలతో నిమిత్తం లేకుండా మన రాష్ట్రం తన నిజమైన సామర్థ్యం మేరకు ఎదిగేందుకు ఈ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది.

ఈ ప్రభుత్వానికి,
కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీలు అసలే లేవు,
అందరికీ విద్య,
అందరికీ ఆరోగ్యం,
అందరికీ సంక్షేమం,
అందరికీ అభ్యున్నతి.

మనం కార్యోన్ముఖులమై స్వర్గీయ డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చేందుకు ముందుకుసాగుదాం. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆశిద్దాం.

అధ్యక్షా ! ఈ మాటలను ప్రస్తావిస్తూ సభ పరిశీలన, ఆమోదం కోసం బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నాను.

జై హింద్... జై ఆంధ్రప్రదేశ్......

This work is available under the Creative Commons CC0 1.0 Universal Public Domain Dedication.

The person or the organisation responsible for this work, associated with this deed has dedicated the work to the public domain by waiving all of his or her rights to the work worldwide under copyright law, including all related and neighboring rights, to the extent allowed by law. You can copy, modify, distribute and perform the work, even for commercial purposes, all without asking permission.