Jump to content

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగం 2014-15

వికీసోర్స్ నుండి


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము


బడ్జెటు ప్రసంగము

2014-15

యనమల రామకృష్ణుడు

ఆర్థిక మంత్రి


ఆగష్టు, 2014

2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి
బడ్జెట్ సమర్పిస్తున్న సందర్భంగా 20 ఆగష్టు, 2014 న గౌరవనీయ ఆర్థికశాఖామాత్యులు
శ్రీ యనమల రామకృష్ణుడుగారి ప్రసంగ పాఠం

గౌరవనీయులైన అధ్యక్షా! మరియు సభ్యులారా !

తమ అనుమతితో 2014-15 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పించనున్నాను.

నా బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించేముందు మహాత్మాగాంధీ కలలు గన్న ఆదర్శసమాజాన్ని ఒక్కసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆయన దృష్టిలో ఆదర్శసమాజమనేది కులరహిత, వర్గరహిత సమాజం. అక్కడ సమాంతర విభేదాలే తప్ప నిచ్చెన మెట్ల విభేదాలుండవు. ఎక్కువ తక్కువ వ్యత్యాసాలుండవు. 2014-15 సంవత్సరానికి నేను సమర్పిస్తున్న బడ్జెట్ అటువంటి న్యాయబద్ధ మానవీయ గతిశీల సమాజాన్ని సాధించే దిశగా వేస్తున్న ముందడుగుగా విన్నవించుకుంటున్నాను.

2. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది తొలి బడ్జెట్. దాదాపు పదేళ్ల కాల వ్యవధి తర్వాత మరలా బడ్జెట్ ను సమర్పించే అవకాశం నాకు లభించింది. ఈ మధ్యకాలమంతా పాలనావ్యవస్థ కుంటుబడడం, స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడం, అభివృద్ధి గురించిన ప్రణాళికలు లేకపోవడం, అవినీతి ప్రబలడం గౌరవ సభ్యులకు తెలిసిన విషయమే. గత కొన్నేళ్లుగా నిరంతర ఆందోళనతో, సమ్మెలతో పౌరజీవనం అతలాకుతలమైనది. తర్వాత రాష్ట్రం విభజించబడ్డ తీరుతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా తయారయ్యింది.

3. ఈ దురదృష్టకరపరిస్థితిలో మాప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలనూ, సంక్లిష్టతలను సరిదిద్దవలసిన కర్తవ్యం మా మీద పడింది. గతంలో చేసినట్లే ఇప్పుడు కూడా మనం మరొకసారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునాదుల నుంచి పునర్నిర్మించవలసిన పరిస్థితి ఏర్పడింది.

4. ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం 2014 లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పొందుపరచబడ్డ అవకాశాలు మొక్కుబడిగా చూపించినవే తప్ప రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోల్పోతున్న అవకాశాలను ఏ విధంగానూ పూరించగలిగినవి కావు. కొత్త రాష్ట్రానికి అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు, ఆదాయకల్పన, వైద్యవిద్యా సంస్థలు, పరిశోధన మరియు శిక్షణ సదుపాయాలు, మౌలిక సామాజిక సదుపాయాలు కొత్త రాష్ట్రం మనుగడకు ఏమాత్రం సరిపోగలిగినవి కావు. కొత్త రాష్ట్రం యొక్క రాజధానిని కూడా నిర్ణయించకుండా రాష్ట్రాన్ని విభజించాలని తీసుకున్న నిర్ణయం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠగా చెప్పవచ్చు.

5. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి నాయకత్వం క్రింద 1995-96 లో చేపట్టిన రెండవదశ సంస్కరణలు దాదాపు ఒక దశాబ్ద కాలంపాటు దారిద్ర్యనిర్మూలనకు, ఆర్థికాభివృద్ధి ద్వారా ఆర్థిక సంస్కరణలకు తోడ్పడ్డాయి. 90ల మధ్యకాలంలో సమాచారవిప్లవం పర్యవసానంగా భూమి, జలసంపద, అటవీ సంపదల భాగస్వామ్య నిర్వహణలో గొప్ప పురోగతి సాధ్యమయింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా స్వయంసహాయక బృందాలు, డ్వాక్రా సంఘాలు చేపట్టిన కృషి ప్రపంచవ్యాప్త విజయగాథగా మార్మోగింది. మహిళా సంఘాల ద్వారా సాధించిన సామాజిక గతిశీలత, సాధికారికత, సామర్థ్యకల్పన దారిద్ర్య నిర్వహణ వ్యూహంలో ప్రధానపాత్ర పోషించాయి. ఈ వ్యూహాలు ఆర్థికసంస్కరణల రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప పేరును తీసుకురావడమే కాక, దేశంలోనూ, బయటకూడా ఎన్నో ఆశలు రేకెత్తించాయి. కానీ 2004 తరువాత ప్రభుత్వం ఉదాసీనతతో ఈ బృహత్తర ఉద్యమం నెమ్మదిగా వన్నె తగ్గడం మొదలయింది.

6. ప్రణాళికేతర ఆదాయానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగులు ఆదాయరాష్ట్రంగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తూ రాష్ట్ర విభజన వల్ల శేషాంధ్రప్రదేశ్ కు ప్రణాళికేతర రంగంలో రెవిన్యూ లోటు గుదిబండ గా మారింది. రాష్ట్ర ఆర్థికపరిస్థితి మీద రాష్ట్ర విభజన తీవ్ర ప్రభావాన్ని చూపించింది. రాష్ట్ర ఋణాలు, ఉద్యోగులు, పింఛనుదారులు జనాభా ప్రాతిపదికన కేటాయించబడినందువల్ల రాష్ట్ర వ్యయం కూడా ఉమ్మడి రాష్ట్రవ్యయం లోని 58 శాతం కన్నా ఎక్కువగానే ఉండే పరిస్థితి ఏర్పడింది. కానీ రాష్ట్రానికి ప్రధాన ఆదాయపు వనరు అయిన అమ్మకపు పన్ను ద్వారా వచ్చే రాబడి ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో దాదాపు 47 శాతం మాత్రమే ఉండే పరిస్థితి ఏర్పడింది. అలాగే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషను ఫీజు, మోటారువాహనాల పన్ను మొదలయినవన్నీ 50 శాతం కన్నా తక్కువగా ఉండే పరిస్థితి ఏర్పడింది. శేషాంధ్రప్రదేశ్ వాటాలో ఒక్క ఎక్సెజ్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే దాదాపుగా 55 శాతం ఉండగలదు. మైనింగ్ ద్వారా వచ్చే నాన్ స్టాక్స్ ఆదాయం ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో 30 శాతం కన్నా తక్కువగానే ఉంటుంది. శేషాంధ్రప్రదేశ్లో మొత్తం మీద పన్నులద్వారానూ, ఇతరత్రా రూపేణా రాగల ఆదాయం ఉమ్మడిరాష్ట్ర ఆదాయంలో 47 శాతానికి దగ్గరగా ఉండగలదని అంచనా వేయడమైంది. కాబట్టి ఒక సక్రమమైన అంచనాతో ప్రణాళికను రూపొందించుకోవడానికి అవసరమైన వనరులు రాష్ట్రానికి లేకుండా పోయాయని చెప్పక తప్పదు.

7. ఆదాయంలోని ఈ అసమానపంపిణీతోపాటు, సామాజిక ఆర్థికరంగాలకు సంబంధించిన కీలక మౌలికసదుపాయాలు కూడా తెలంగాణ రాష్ట్ర పరం కానున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9వ 10వ షెడ్యూళ్లలో పొందుపరచబడిన ఎన్నో సంస్థలు హైదరాబాదులోనూ, హైదరాబాదు చుట్టుపక్కలా నెలకొని ఉన్నాయి. 9వ, 10వ షెడ్యూళ్ళలో చేర్చని ఇతర సంస్థలు గాలికి వదలి వేయబడ్డాయి. శేషాంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయక రాష్ట్రం. అందువల్ల ఇక్కడ స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో పన్నుల వాటా 6.8 శాతం కాగా, తెలంగాణ రాష్ట్రం పట్టణీకరణ చెందినందువల్ల అక్కడ ఆ వాటా 9.7 శాతం దాకా ఉంది. పరిమితమైన వనరులు మాత్రమే అందు బాటులో ఉన్నందువల్ల నవ్యాంధ్రప్రదేశ్ కు సంబంధించిన సామాజిక, ఆర్థిక రంగాల్లో అన్ని మౌలికసదుపాయాలు కల్పించడం కష్టసాధ్యమైన విషయం. ఇంత పెద్దఎత్తున పెట్టుబడి పెట్టడానికి అవసరమైన పరిహారమేదీ అప్పటి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉండలేదు. అప్పటి కేంద్రప్రభుత్వం అనుసరించిన అహేతుక, అసంబద్ధ రాష్ట్ర విభజన ప్రక్రియ వల్ల శేషాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిగిన నష్టం ఎటువంటిదో ఈ నిర్లక్ష్యం ద్వారా మనం గమనించవచ్చు. నేడు మన ముందున్న సవాళ్లు ఎంత తీవ్రమైనవో దీన్నిబట్టి మనం గ్రహించవచ్చు.

8. ఇంతదాకా వివరించిన విషయాలే కాక, మరెన్నో సమస్యలూ, సవాళ్లూ నవ్యాంధ్రప్రదేశ్ ఎదుట మొహరించి ఉన్నాయి.

దిశానిర్దేశం:

9. ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక కోసం నిర్దేశించుకున్న ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం చేపడుతున్న కొన్ని ముఖ్య అభివృద్ధి వ్యూహాలను తమ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాను.

శ్వేతపత్రాల విడుదల:

10. గత దశాబ్ద కాలంగా ఆర్థికపరంగానూ, అవకాశాల్లోనూ రాష్ట్రానికి సంభవించిన నష్టాన్ని ప్రజలు అవగాహన చేసుకోవడానికి వీలుగా ముఖ్య రంగాలకు సంబంధించి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది. మానవ వనరుల అభివృద్ధి, పరిశ్రమలు, మౌలికసదుపాయాలు, సాగునీరు, వ్యవసాయం, విద్యుచ్ఛక్తి, ఆర్థిక వనరుల సమీకరణ మరియు నిర్వహణ, నైపుణ్యాభివృద్ధులకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని, రాష్ట్ర విభజన ప్రభావాన్ని సామాజిక, ఆర్థిక సూచికల ప్రకారం ఈ శ్వేతపత్రాలు నిశితంగా పరిశీలించి వివరించాయి.

ప్రాధాన్యతల నిర్ధారణ:

11. ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నందున ప్రధానంగా ఐదు అంశాలకు సంబంధించి ప్రభుత్వం ముఖ్య ప్రకటనలు చేసింది. అవి రైతులకు ఋణభారం నుండి ఉపశమనం, డ్వాక్రా మహిళాసంఘాలను బలోపేతం చేయడం, పింఛను మొత్తాల పెంపుదల, ప్రయివేటు రంగం నెరవేర్చవలసిన కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా 2 రూపాయలకు 20 లీటర్ల మినరల్ వాటర్ సరఫరా, గ్రామాలలో బెల్టుషాపుల మూసివేత మరియు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంపుదల. ఒక సమగ్ర అభివృద్ధి వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయాలు కూడా అమలు జరుపబడుతున్నాయి.

12. అర్హతగల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్‌మెంటు సదుపాయాలు కల్పించడానికి మేము కట్టుబడి ఉన్నాము.

ఇంతేకాక, కాపులు మరియు బ్రాహ్మణుల సంక్షేమానికి పథకాలు చేపట్టడం కోసం కూడా బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగింది. ప్రస్తుత బి.సి. వర్గాల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా కాపులను బి.సి.ల జాబితాలో చేర్చేందుకు గాను ఒక కమీషన్ ను నియమించనున్నాము.


విజన్ 2029

13. 2022 నాటికి స్వతంత్ర భారతదేశానికి 75 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా దేశంలో అత్యున్నత పురోగతిని సాధించబోయే మొదటి మూడు రాష్ట్రాల్లో మన రాష్ట్రాన్ని కూడా నిలపడం కోసం మారిన పరిస్థితుల్లో ఒక నూతన అభివృద్ధి వ్యూహాన్ని అమలు చేయడానికి తగిన ప్రమాణాలు నిర్దేశించడం కోసం విజన్-2020 షత్రాన్ని పునర్లిఖించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సవాళ్లు అనేకం. అయినప్పటికీ దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను ఒక అత్యున్నత స్థానంలో నిలపాలనే చెక్కుచెదరని సంకల్పంతో, దీక్షతో ముందుకు పోగలమని ఆశిస్తున్నాను.

14. ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా, 2029 నాటికి పౌరజీవన సంతృప్తి మరియు సంతోష సూచికల ప్రకారంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రూపుదిద్దాలనీ, అందుకుగాను రాబోయే 3 ఆర్థికసంఘాల కాలవ్యవధిని కూడా ఉపయోగించుకోవాలనీ ఈ ప్రభుత్వ ప్రధానలక్ష్యం.

100 రోజుల కార్యాచరణ ప్రణాళిక:

15. అభివృద్ది గమనాన్ని శీఘ్రతరం చేయడానికీ, ఫలితాలను ఉద్యమస్థాయిలో రాబట్టడానికి ఈ ధ్యేయాన్ని నెరవేర్చుకునే దిశగా పాలనాయంత్రాంగాన్ని పునరుత్తేజితం చేయడానికీ ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను చేపట్టింది.

మిషన్ ఆధారిత అభివృద్ధి వ్యూహం

16. ప్రజల యొక్క సంక్షేమాన్నీ, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కోసం ఎన్నో పథకాల్నీ, కార్యక్రమాల్నీ అమలు చేయడం రాష్ట్ర అభివృద్ధి ప్రక్రియలో భాగంగా ఉంది. చెప్పుకోదగ్గ ప్రయత్నాలు చేసినప్పటికీ మనం సాధించగలిగి ఉండి కూడా సాధించలేకపోయిన ఫలితాలకూ మరియు వాస్తవంగా సాధించిన ఫలితాలకూ మధ్య వ్యత్యాసాలు ఉంటూనే ఉన్నాయి. సంస్థాగత సామర్థ్యాలు చాలినంత లేకపోవడం, వివిధ శాఖలమధ్య సమన్వయం కొరవడడం, లక్ష్యాలకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేయకపోవడం ఇందుకు ప్రధానకారణాలుగా చెప్పవచ్చు. ఇన్నేళ్లుగా నెలకొల్పుతూ వచ్చిన ఎన్నో సంక్షేమ అభివృద్ధి నిర్మాణాలు మన అవసరాలను తీర్చలేకపోతున్నాయని తెలిసి వచ్చింది. ఇందువల్ల మనం మన విధానాలను మార్చుకోవలసిన అవసరం ఏర్పడింది. అభివృద్ది కార్యక్రమాలను మిషన్ స్థాయిలో అంటే- ఉద్యమస్థాయి లో చేపట్టవలసిన అవసరం కలిగింది. అభివృద్ధికీ, ప్రగతికీ అంకితమైన పరిపాలన దిశగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా యథాతథంగా కార్యక్రమాలను అమలుచేసుకుంటూ పోయినందువల్ల సంక్షేమ సమాజపు అంతిమ లక్ష్యాలను సాధించడంలో యంత్రాంగం విఫలమయింది.

17. కాబట్టి ముమ్మరంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవలసిన అవసరాన్ని గుర్తించి, వివిధ స్థాయిల్లో కూలంకషంగా చర్చించిన అనంతరం ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాలకు చెందిన ముఖ్య రంగాల్లో 7 మిషన్‌లను నెలకొల్పాలని నిర్ణయించింది. ఆ మిషన్లు వార్షిక ప్రణాళికల్లో స్వల్పకాలిక, మధ్యకాలిక దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను మేళవించి, ఒక నవీన అభివృద్ధిశకానికి దారితీయనున్నాయి. ప్రతి ఒక్క మిషన్ కూ స్పష్టమైన తార్కికనిర్మాణం, నిర్దిష్ట ఫలితాల నిర్వచనం ఉంటాయి. ప్రతి మిషన్ కీ లక్ష్యాలు, కార్యక్రమాలు, కాలవ్యవధి, మైలు రాళ్లు, ఆశించిన ఫలితాలు స్పష్టంగా నిర్వచించబడ్డాయి. ఆ మిషన్లకు కొన్ని నిర్దిష్ట కార్యక్రమాల అమలుకోసం మరికొన్ని సబ్-మిషన్లు కూడా ఏర్పడనున్నాయి. అవి: 1) ప్రాథమిక రంగమిషన్, 2) సామాజిక సాధికారికతా మిషన్, 3)విజ్ఞానం-నైపుణ్యాల అభివృద్ధి మిషన్, 4) పట్టణాభివృద్ధి మిషన్, 5) పరిశ్రమలు/ వస్తూత్పత్తి మిషన్, 6) మౌలికసదుపాయాల మిషన్, 7) సేవారంగ మిషన్.


18. ప్రతిమిషన్ కూ గౌరవముఖ్యమంత్రి ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు. ప్రతి మిషన్ కూ స్పష్టంగా నిర్వచించబడ్డ లక్ష్యాలు, నిర్వహణ విధానం, వనరుల సమీకరణ, శాఖాపరమైన సహకారం అమలు చేసే పద్దతి, జిల్లాస్థాయి విస్తరణ యంత్రాంగం, ప్రగతి నివేదికలు, సమీక్ష మరియు మూల్యాంకన విధానాలు, పనితీరును ప్రోత్సహించే అవార్డులుఉంటాయి.

జిల్లా అభివృద్ధి ప్రణాళిక

19. జిల్లాస్థాయిలోనూ, జిల్లాకన్నా దిగువస్థాయిలోనూ కార్యక్రమాల అమలును వికేంద్రీకరించడం ద్వారా వికేంద్రీకృతసంస్థలు మరింత శక్తివంతంగా తమ పాత్రను ఏ విధంగా నిర్వహించగలవన్న విషయాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నది. వికేంద్రీకరణ అంటే మరింత మెరుగైన పద్దతిలో సేవలను అందించడంగానే నేడు మనం అర్థం చేసుకుంటున్నాం. ఆ దిశగా జిల్లాస్థాయిలో సేవలను మరింత మెరుగ్గా అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మరింత మెరుగైన ప్రణాళిక, పాలన, ఆర్థికసేవా వ్యవస్థలను రూపొందించడానికి యోచిస్తున్నది.

20. ప్రణాళికా ప్రక్రియను కార్యక్రమ నిర్వాహకులు అవగాహన చేసుకోవడానికి వీలుగా ప్రణాళికల రూపకల్పనలోనూ, ప్రణాళికల వికేంద్రీకరణ లోనూ అత్యున్నత విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం ఈ దిశగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

21. కాగా ప్రస్తుత సంవత్సరానికి నేను పరిమితమైన అంచనాలు గల ప్రణాళికతో కూడుకున్న బడ్జెట్ ను మాత్రమే సమర్పించగలగుతున్నాను. గతం నుంచి మనకు లభించిన అనేక సమస్యలే ఇందుకు కారణం. అంతేకాక ఖచ్చితంగా ఆదాయపు వసూళ్లను లెక్కకట్టడంలో కొన్ని సాంకేతికమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విషయాన్ని కూడా నేను తమద్వారా సభ దృష్టికి తీసుకువస్తున్నాను. ప్రస్తుత బడ్జెటు మొదటి రెండు నెలలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ, తక్కిన పది నెలలకూ శేషాంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితిని వివరించనున్నది. ఇందువల్ల వసూళ్లు మరియు వ్యయానికి సంబంధించిన అంచనాలు, ఆదాయం మరియు ఆర్థికలోటుకు సంబంధించిన అంచనాలు తీవ్రంగా ప్రభావితమవడం వల్ల ఎ.పి.ఎఫ్. ఆర్.బి.ఎమ్ చట్టంలో నిర్దేశించిన నిబంధనలను అనుసరించడం రాష్ట్రానికి కష్టసాధ్యమౌతున్నది. ఈ విషయాన్ని ఇప్పటికే భారతప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. మనం దాదాపుగా ఆర్థికసంవత్సరం మధ్యలో ఉన్నందున ఈ మిగిలిన ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం యొక్క అత్యవసర కనీస అవసరాలను తీర్చడం మీదనే ఈ బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెడుతున్నది. అయితే మిగిలిన ఆర్థికసంవత్సర కాలంలో మేము ఆర్థిక ఆదాయాన్ని వీలైనంత పెంచడానికీ, రాష్ట్ర ప్రజలు తాము ఖర్చు పెట్టిన సొమ్ముకు మరింత విలువ పొందేవిధంగా వ్యయనిర్వహణ చేయడానికి మేము శాయశక్తులా కృషిచేయనున్నాము. ప్రభుత్వ పథకాలు ఉద్దేశించిన లబ్దిదారులకే చెందడానికీ, ఎటువంటి దుర్వినియోగం కాకుండా చూడడానికీ ఆధార్ నంబరును తప్పనిసరిగా అన్ని పథకాలకూ అనుసంధానం చేయాలని నిర్ణయించడం జరిగింది. భారతప్రభుత్వ బడ్జెట్లో మన రాష్ట్రం కోసం ఉద్దేశించిన కొన్ని కేటాయింపులు ఉన్నాయి. కాని ఇవి చాలినంతగా లేవు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలకు భారతప్రభుత్వం కట్టుబడి ఉందని భారతప్రభుత్వ ఆర్థికశాఖామాత్యులు తమ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కాబట్టి బడ్జెట్లో చూపించిన కేటాయింపులకు మాత్రమే పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి మరింత అదనపు వనరులను రాబట్టే దిశగా మేం మరింత కృషి చేస్తామని విన్నవించుకుంటున్నాను.

22. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబునాయుడు గారు దాదాపు 3,000 కి.మీ ల తమ పాదయాత్రలో భాగంగా ప్రజాబాహుళ్యాన్ని ప్రత్యక్షంగా సందర్శించి, వారితో మమేకమై వారి సమస్యలను లోతుగా అర్థం చేసుకున్నారు. ఆ అవగాహనపైనే మా పార్టీ మానిఫెస్టో రూపొందింది. ఆ అవగాహన తోనే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు రూపుదిద్దుకుంటున్నాయి. పౌరులందరూ సమానావకాశాలు పొందగలిగే పేదరిక రహిత సమాజస్థాపనే మా ధ్యేయం. ఈ సందర్భంగా 'కీర్ హార్డీ' గారి పలుకులను గుర్తుచేస్తున్నాను. "ప్రగతికి సిసలైన గీటురాయి ఏమిటంటే, సంపద కొద్దిమందిచేతుల్లో పోగవడాన్ని సూచించేది కాక, ప్రజలందరి ఉన్నతిని సూచించేది". మేము అవినీతి రహిత పారదర్శక పాలనను అందించడానికి కట్టుబడి ఉన్నాము. భూమి, అటవీ సంపద, గనులు, ఖనిజాలు మొదలగు సహజ వనరుల పరాధీనత, అక్రమమద్యం అమ్మకాలు, అటవీసంపద దోపిడీ, ప్రజాపనులలో ముఖ్యంగా నీటిపారుదల రంగంలో ప్రజాధనం దుర్వినియోగం వంటి అంశాలను సమీక్షించి అవినీతిని ఎదుర్కొని, ప్రభుత్వ ఆస్తులు ఆదాయాలను సంరక్షించాలనే నిర్దిష్ట సంకల్పంతో, ప్రభుత్వం మంత్రివర్గ సంఘాన్ని నియమించింది. ఈ సంఘము ఆర్థిక నిర్వహణ లో పారదర్శకత, నిజాయితీ, సమర్థతను పెంపొందించడానికి తగిన సూచనలు చేస్తుంది.

23. తక్కిన దేశంలోలాగానే మన రాష్ట్రంలో కూడా జనాభాలో యువత శాతం గణనీయంగా ఉంది. మధ్యతరగతి త్వరితంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ రెండు వర్గాలకు చెందినవారికి చాలా ఉన్నతమైన ఆకాంక్షలున్నాయి. ఆ ఆకాంక్షలను నెరవేర్చడం కోసం మా ప్రభుత్వం శాయశక్తులా కృషి చేయటానికి సిద్దంగా ఉంది. యువతకు తగిన నైపుణ్యాల కల్పన, సమర్థవంతంగానూ సకాలంలోనూ సేవలు అందించడం, అన్ని గ్రామాలనూ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా అనుసంధానించడం, రక్షిత మంచినీటి సరఫరా కోసం వాటర్ గ్రిడ్ ఏర్పాటు, ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒకరికి ఉపాధి కల్పించేలా ఉద్యోగ అవకాశాల కల్పన, జీవన ప్రమాణాల మెరుగుదల మీదే మా దృష్టి నిరుద్యోగులకు ఉపాధి కలిగే వరకు నిరుద్యోగ భృతిని అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. స్థూల రాష్ట్ర సంతోషసూచిక, స్థూలరాష్ట్ర వస్తూత్పత్తి సూచిక కన్నా ముఖ్యమని మేం ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం.

24. బడ్జెట్ రూపకల్పన, వ్యయనిర్వహణలను మెరుగుపరచడంలో భాగంగా రాబోయే సంవత్సరం నుంచి బడ్జెట్లో యథాతథంగా కేటాయింపుల పెరుగుదల ఉండబోదని తెలియజేస్తున్నాను. అందుకు బదులు ఆయా ప్రభుత్వ శాఖలు తాము కేటాయింపు చేయనున్న ప్రతి అంశంలోనూ తాము ప్రతిపాదిస్తున్న వ్యయాన్ని ఎందుకు ప్రతిపాదిస్తున్నారో జీరోస్థాయి నుంచి వివరించి సమర్థించుకోవలసి ఉంటుంది.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2013-14

25. రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు సంబంధించిన ముఖ్య అంశాలను క్లుప్తంగా వివరిస్తాను. ప్రస్తుత ధరల ప్రకారం 2012-13 సంవత్సరానికి ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రస్థూల ఉత్పత్తి రూ. 4,19,391 కోట్లు కాగా, 2013-14 సంవత్సరానికి రాష్ట్రస్థూల ఉత్పత్తి రూ.4,75,859 కోట్లుగా అంచనా వేయబడింది. అంటే 13.46 శాతం వృద్ధి నమోదయింది. స్థిర (2004-05) ధరల ప్రకారం 2012-13 సంవత్సరానికి రాష్ట్రస్థూల ఉత్పత్తి 2,35,930 కోట్లు కాగా 2013-14 కు 2,50,282 కోట్లుగా అంచనా వేయబడింది. అంటే 6.08 శాతం వృద్ధి నమోదయింది. స్థిర ధరల ప్రకారం వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాలు 2013-14 సంవత్సరంలో 6.94 శాతం 2.16 శాతం 7.25 శాతం వృద్ధిరేటును సాధించాయి.

26. ప్రస్తుత ధరల ప్రకారం 2012-13 సంవత్సరానికి తలసరి ఆదా యం ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 76,041 కాగా 2013-14 కు రూ. 85,797 గా నమోదయింది. అంటే 12.8 శాతం పెరుగుదల సంభవించింది. స్థిర (200405) ధరల ప్రకారం తలసరి ఆదాయం 2012-13 కు రూ. 42,186 కాగా 2013-14 కు రూ.44,481 కి పెరిగింది. అంటే 5.4 శాతం వృద్ధి రేటు నమోదయింది.

వ్యవసాయం

27. మన రాష్ట్ర జనాభాలో అధికశాతం ఇప్పటికి జీవనోపాధి కోసం వ్యవసాయం మీదనే ఆధారపడినందువల్ల రాష్ట్రస్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం 17 శాతం దాకా ఉంది. పెరుగుతున్న జనాభాకు ఆహారధాన్యాలు అందించగలగడం ద్వారా మన దేశాన్ని స్వయంసమృద్ధదేశంగా రూపొందించడంలో మన వ్యవసాయ సమాజం గొప్పపాత్ర పోషించింది. అయితే దురదృష్టవశాత్తు వరుసగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు, ఖర్చుల పెరుగుదల, గిట్టుబాటుధర రాకపోవడం వంటి కారణాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయక్షేత్రంలో తీవ్రసంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభం ఏస్థాయికి చేరుతుందంటే పరిస్థితుల ప్రభావానికి తట్టుకోలేక ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ విధంగా గూడుకట్టుకున్న నైరాశ్యాన్నీ, సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం రైతు జనావళికి చేయూతనందించడం కోసం చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా రైతు రుణాలను మాఫీ చేయడం కోసం మేము ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. రైతులు వ్యవసాయం కొరకు బ్యాంకుల నుండీ, సహకార సంఘాలనుండీ తీసుకున్న పంట ఋణాలను, బంగారుపై తీసుకున్న ఋణాలతో సహా కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు ఋణభారం నుండి ఉపశమనం కలిగించడానికి నిర్ణయించాము. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ నిర్ణయం రాష్ట్రం మీద మరింత పెనుభారం మోపనున్నదని మాకు తెలుసు. కానీ రైతులకు ఈ సదుపాయం కలిగించకపోతే భవిష్యత్తులో వ్యవసాయరంగం నిలదొక్కుకోవడం దుస్సాధ్యం. అయితే ఈ పథకం అమలుచేయటంలో రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా, మరియు బ్యాంకులు లేవనెత్తిన ఎన్నో సాంకేతిక అవరోధాలను మేం అధిగమించవలసి ఉంది. అయితే రైతులను ఋణభారం నుంచి విముక్తులను చేయటానికి వనరులు సమకూర్చే దిశగా మే శాయశక్తులా కృషిచేయనున్నాము. వ్యవసాయరంగాన్ని నిలదొక్కుకునే విధంగా, గిట్టుబాటు కలిగించే రంగంగా చేయటంకోసం వివిధ చర్యలు చేపట్టవలసింది. తన పాదయాత్రలో రైతులను కలుసుకున్నప్పుడు వారి కడగండ్లను స్వయంగా చూసిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబునాయుడుగారు చలించిపోయారు. పలువిధాలైన రైతుసమస్యలను ఎదుర్కోవటానికి బహుముఖమైన వ్యూహమొకటి రూపొందించాలనే భావనకి అప్పుడే అంకురార్పణ జరిగింది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల అభివృద్ధి కోసం చేపడుతున్న వివిధ పథకాలనూ, కార్యక్రమాలనూ సమన్వయపర్చడం ఇందుకొక ముఖ్యమైన మార్గం. అటువంటి సమన్వయాన్ని సాధించే దిశగా సాధారణ బడ్జెట్లో భాగంగా వ్యవసాయరంగానికి ప్రత్యేకంగా బడ్జెట్ రూపొందించి సమర్పించనున్నాము. వ్యవసాయం, వ్యవసాయప్రాసెసింగ్, మార్కెటింగ్, గిడ్డంగుల నిర్వహణ, పశుసంవర్థక శాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖల గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావుగారు వ్యవసాయానికీ, వ్యవసాయసంబంధిత రంగాలనూ అభివృద్ధి చేయటంకోసం ఒక సమగ్ర వ్యవసాయబడ్జెట్ ను సమర్పించనున్నారు.

సంక్షేమశాఖలు
సాంఘికసంక్షేమం

28. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జనాభా 84.45 లక్షలు. రాష్ట్రం మొత్తం జనాభాలో వారిది 17.1 శాతం. ఒక బహుముఖీన అభివృద్ధి వ్యూహం ద్వారా షెడ్యూల్డ్ కులాల జనాభాకు సాధికారికత సమకూర్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

29. ఈ వ్యూహంలో షెడ్యూల్డ్ కులాల బాలబాలికల విద్యాభివృద్ధికి చేయూతనందించడం ప్రధాన కార్యక్రమం. 1445 వసతిగృహాలలో నివసిస్తున్న 1,44,500 విద్యార్థులకు నివాస, భోజన, విద్యా సదుపాయాలకు ప్రభుత్వం పూర్తి తోడ్పాటును అందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 177 గురుకుల పాఠశాలల ద్వారా 1,24,000 మంది విద్యార్థులకు గుణాత్మకవిద్యను అందిస్తున్నది. ఈ సంస్థ పాఠశాలలు రాష్ట్రస్థాయి సగటుకన్నా మిన్నగా వరుసగా ఉన్నత ఫలితాలను సాధిస్తున్నది.ఎస్.సి./ఎస్. టి.బి.సి./మైనారిటీల ప్రయోజనార్థం -ప్రభుత్వం నడుపుతున్న రెసిడెన్షియల్ స్కూల్స్ సాధించిన ఉత్తమ ఫలితాలను దృష్టిలో ఉంచుకొని దశలవారీగా అన్ని సంక్షేమ హాస్టళ్ళను రెసిడెన్షియల్ స్కూళ్ళుగా అభివృద్ధిచేయడానికి మేము కట్టుబడి వున్నాము. విద్యాభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ ఉపకారవేతనాల మంజూరు మరియు పేద షెడ్యూల్డ్ కులాలకు చెందిన పేద విద్యార్థులకు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా అంబేద్కర్ ఓవరీసీస్ విద్యానిధి ఏర్పాటు చేయడం మరొక ముఖ్యమైన కార్యక్రమం.

30. షెడ్యూల్డ్ కులాల సాధికారికత దిశగా మరొక ముఖ్యమైన చర్య షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయంఉపాధి కార్యక్రమాలు చేపట్టడానికి వీలుగా ఆర్థికసహాయం అందించడం. ఈ ఆర్థికసహాయం ఏ.పి. షెడ్యూల్డ్ కులాల సహకార ఆర్థిక సొసైటీ లిమిటెడ్ ద్వారా సబ్సిడీ రూపంలో అందించడం జరుగుతుంది.

31. షెడ్యూల్డ్ కులాల సాధికారికతకు చేపట్టిన మూడో ముఖ్యమైన చర్య షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళికను అమలు పరచడం. సాధారణ ప్రజానీకానికీ, షెడ్యూల్డ్ కులాలకూ మధ్య అభివృద్ధిలో ఉన్న వ్యత్యాసాలను పూరించే దిశగా వ్యక్తులకూ, కుటుంబాలకూ, జనావాసాలకూ ప్రత్యక్షంగానూ, నిర్దిష్టంగానూ లాభించే వివిధ కార్యక్రమాలను సంబంధిత శాఖలు రూపొందించి అమలుచేసే విధంగా షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళికను అమలుచేయడం జరుగుతున్నది. 2014-15 లో రాష్ట్ర జనాభాలో 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల జనాభా నిష్పత్తి మేరకు ఉపప్రణాళిక కేటాయింపులను 17.1 శాతానికి పెంచడం జరిగింది.

32. ఇందుకు గాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.2657 కోట్లు ప్రతిపాదించడమైనది.

గిరిజన సంక్షేమం

33. రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల జనాభా 26.31 లక్షలు. వీరు రాష్ట్రజనాభాలో 5.33 శాతం ఉన్నారు. మొత్తం 35 గిరిజన తెగలు ఉండగా వారిలో 6 తెగలను ప్రత్యేకంగా బలహీన గిరిజనతెగలు (పిటిజిలు) గా గుర్తించడం జరిగింది.

34. షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి ఆర్థికపరమైన, విద్యాపరమైన సమానతతో పాటు మానవ వనరుల అభివృద్ధి మీద దృష్టి పెట్టి వారి సత్వర అభివృద్ధి సాధించడం కోసం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక, గిరిజన ఉపప్రణాళిక చట్టాన్ని పటిష్ఠంగా అమలుచేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

35. గిరిజనప్రాంతాల్లో షెడ్యూల్డ్ తెగల విద్యాభివృద్ధి ప్రభుత్వం నిర్దేశించుకున్న ముఖ్యలక్ష్యాల్లో ఒకటి. గిరిజన సంక్షేమశాఖ బడ్జెట్లో దాదాపు 70 శాతం విద్యాకార్యక్రమాల అమలుకే కేటాయించడం జరిగింది.

36. 13వ ఆర్థికసంఘ వారి సహకారంతో మారుమూల గిరిజనప్రాంతాల్లో వివిధ గ్రామాలకు రక్షిత మంచినీరు అందించడం, నాబార్డ్ సహాయంతో రహదారుల నిర్మాణం కూడా శాఖ చేపడుతున్నది.

37. ఈశాఖకు 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.1150 కోట్లు ప్రతి పాదించడమైనది.

వెనుకబడిన తరగతుల సంక్షేమం

38. వెనుకబడిన తరగతులకుచెందిన విద్యార్థుల కోసం రాష్ట్రంలో 692 బాలుర వసతిగృహాలు, 201 బాలికల వసతిగృహాలు పనిచేస్తున్నాయి. వీటిలో 12,743 మంది బాలురు, 23,296 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షఫలితాలు 90.87 శాతం కాగా, ఈ వసతిగృహాల విద్యార్థులు 93.78 శాతం ఫలితం సాధించారు. వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఉన్నతవిద్యను అభ్యసించడానికి వీలుగా ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలోనూ బాలురకోసం, బాలికల కోసం ఒక్కొక్క హాస్టల్ చొప్పున నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.

39. పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాల పథకంలో భాగంలో అర్హులైన బి.సి. విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు, ట్యూషన్ ఫీజు చెల్లించబడుతున్నాయి. అర్హులైన ఇబిసి విద్యార్థులకు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించబడుతున్నది.

40. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యావంతులయిన నిరుద్యోగ యువత వివిధ పోటీపరీక్షల్లో తక్కిన వారితో దీటుగా పోటీ పడడానికి రాష్ట్రం లో 13 బిసి స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచితశిక్షణ అందజేయబడుతున్నది.

41. బిసి విద్యార్థుల కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే బిసి గురుకుల పాఠశాలలు 31 నడుస్తున్నాయి. వాటిలో 17 బాలుర కోసం, 14 బాలికల కోసం నడుస్తున్నాయి. 2013-14 విద్యాసంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ఈ పాఠశాలల విద్యార్థులు 98.99 శాతం ఉత్తీర్ణత సాధించారు.

42. అంతేకాక వెనుకబడిన తరగతుల కోసం ఒక సమగ్ర ఉపప్రణాళిక రూపకల్పన కోసం కూడా చర్యలు చేపట్టనున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాను.

43. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ. 3130 కోట్లు ప్రతిపాదించడమైనది.

మైనారిటీల సంక్షేమం

44. ఆర్థికాభివృద్ధిలో మైనారిటీ వర్గాలకు సముచిత వాటా కల్పించడం, ప్రస్తుతం నడుస్తున్న పథకాల ద్వారా, కొత్త పథకాల ద్వారా ఉద్యోగఅవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధి పథకాలకూ, ఆర్థికాభివృద్ధి పథకాలకూ మెరుగైన ఋణసదుపాయం కల్పించడం, కేంద్ర-రాష్ట్ర సంస్థల్లో ఉద్యోగాలు పొందడంకోసం అవసరమైన నైపుణ్యాలు కల్పించడం, సాంకేతిక శిక్షణ కల్పించడం ఈ శాఖ ముఖ్యోద్దేశాలు. ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ ఉపకారవేతనాల మంజూరు, బ్యాంక్ల ద్వారా అందజేసే ఋణాలకు సబ్సిడీ మంజూరు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలల నిర్వహణ, పోటీపరీక్షలకు శిక్షణ ఈ శాఖ చేపడుతున్న ముఖ్య కార్యక్రమాలు. మైనారిటీల సంక్షేమం కోసం దుకాన్-ఓ-మకాన్, రోష్నీ అనే కొత్త పథకాలు కూడా అమలు జరుగుతున్నాయి.

45. ఈశాఖకు 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ. 371 కోట్లు ప్రతిపాదించడ మైనది.

స్త్రీ, శిశు సంక్షేమం

46. ఒక జాతి సాధించిన ప్రగతిని ఆ జాతికి చెందిన స్త్రీల ప్రగతిని బట్టి అంచనా వేయవచ్చునని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారని గుర్తు చేసుకుంటున్నాను. ఆదిశగా మా ప్రభుత్వం మహిళా సాధికారికతకు కట్టుబడి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో గ్రామీణప్రాంతాల్లో 41,982 అంగన్ వాడీ కేంద్రాలు, పట్టణప్రాంతాల్లో 4,248 కేంద్రాలు, గిరిజనప్రాంతాల్లో 2,169 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇవికాక 6,625 మినీ అంగనవాడీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. 254 ప్రాజెక్టుల ద్వారా ఐసిడిఎస్ పథకం సార్వత్రీకరించబడింది. పౌష్టికాహార పథకం కింద దాదాపు 27 లక్షల మంది శిశువులు, 8 లక్షలమంది గర్భిణీస్త్రీలు, బాలింతలు లబ్ది పొందుతున్నారు. ఇవికాక మరెన్నో పథకాలు అమలవుతున్నాయి.

47. స్త్రీ శిశు సంక్షేమానికి 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ. 1,049 కోట్లు ప్రతిపాదించడమైనది.

వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమం

48. వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ విభిన్న సామర్థ్యాలు కలిగిన బాలబాలికల కోసం 20 హాస్టళ్లు, 2 నిలయాలు, 6 గురుకుల పాఠశాలలు మరియు ఒక గురుకుల జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్నది. అటువంటి బాలబాలికలకు ప్రీ-మెట్రిక్ మరియు పోస్ట్-మెట్రిక్ ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నది. దృష్టి సమస్య కలిగిన బాలబాలికలు కంప్యూటర్ శిక్షణ, ఆర్థిక పునరావాసం, వివాహాలకు ప్రత్యేక అవార్డులతో పాటు, విద్యార్థులకు ప్రత్యేక బోధనసామగ్రి పంపిణీ కూడా ఈశాఖ చేపడుతున్నది.

49. వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమానికి 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.65 కోట్లు ప్రతిపాదించడమైనది.

యువజన సేవలు

50. యువజనసేవా శాఖ యువత అసాంఘిక కార్యక్రమాల బారిన పడకుండా వారి శక్తిసామర్థ్యాలను నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు మళ్లించడానికి కృషి చేస్తున్నది. యువత అవసరాలనూ, మారుతున్న ఆకాంక్షలనూ దృష్టిలో పెట్టుకుని తగిన రీతిలో యువజనసంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నది.

51. ఈ శాఖకు 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ. 126 కోట్లు ప్రతిపాదించడమైనది.

పర్యాటక మరియు సాంస్కృతిక రంగము

52. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచి ఉద్యోగఅవకాశాలు కల్పించే శక్తి పర్యాటకరంగానికి ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రాకృతికసంపద, చారిత్రిక, సాంస్కృతిక వారసత్వ సంపద వల్ల ఇప్పటికే భారతదేశంలో దేశీయస్థాయి పర్యాటకులను ఆకర్షిస్తూ ఉన్నది. ఈ పరిస్థితిని మరింత మెరుగుపర్చుకోవడంతో పాటు, మరెంతోమంది పర్యాటకులను ఆకర్షించేదిశగా రాష్ట్రంలోని అన్ని పర్యాటకకేంద్రాల్లోనూ మౌలికసదుపాయాలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

53. 2014-15 లో రూ. 100 కోట్ల మేరకు కేంద్రప్రభుత్వ సహాయం తో కృష్ణా, అనంతపురం జిల్లాలలో మెగా టూరిజం సర్క్యూట్‌లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. వీటితోపాటు శ్రీకాకుళం, గుంటూరులలో కొత్త టూరిజం సర్యూట్లు, శ్రీకాళహస్తిలో సౌండ్ అండ్ లైట్ షో, పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెంలో బీచ్ రీసార్ట్ అభివృద్ధికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

54. కళలు, హస్తకళలు మరియు ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని పునరుద్ధరించి, ప్రోత్సహించడం కోసం కాకినాడ, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో శిల్పారామాలు నెలకొల్పాలని ప్రతిపాదించడమైనది.

55. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తిరుపతిలో రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో ఇండియన్ కులినరి ఇనిస్టిట్యూట్, రూ. 117 కోట్ల అంచనా వ్యయంతో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లను నెలకొల్పడానికి ప్రతిపాదించడం జరిగింది. ఆ సంస్థల ద్వారా పర్యాటకరంగానికి సుశిక్షితులైన మానవ వనరులను అందించడం సాధ్యమవుతుంది. అంతేకాక ఒక్కొక్కటీ రూ. 12 కోట్ల అంచనా వ్యయంతో తిరుపతిలో, కాకినాడలో స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్లు నెలకొల్పబడుతున్నాయి. అంతేకాక మరికొన్ని ముఖ్య పర్యాటక ఉత్పత్తులకు సంబంధించి పిపిపి పద్ధతి ద్వారా ప్రైవేటు రంగం పెట్టుబడులను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.

56. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.113 కోట్లు ప్రతిపాదించడమైనది.

గృహనిర్మాణం

57. ఆంధ్రప్రదేశ్ ను గుడిసెలుగానీ, మురికివాడలుకానీ లేని రాష్ట్రంగా రూపొందించడానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని పేదలకు పక్కాఇళ్ల నిర్మాణం చేపట్టడం గృహనిర్మాణ లక్ష్యం. ఇంతవరకు 65.35 లక్షల గృహాలు పూర్తికాబడ్డాయి. 4.93 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ స్థాయిల్లో ఉంది. 6.98 లక్షల ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కావలసి ఉంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో భారతప్రభుత్వం వారి ఆర్ ఎవై పథకం ద్వారా ప్రస్తుత సంవత్సరంలో 25,000 ఇళ్లు నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

58. ప్రస్తుత ప్రభుత్వం ఎస్.సి./ఎస్.టి. నిరుపేదలకు ఇంటికి రూ.1.50 లక్షల వ్యయంతోనూ, ఇతర బలహీన వర్గాలవారికి లక్ష రూపాయలతోనూ ఇళ్లు నిర్మించాలని సంకల్పించింది. ఇందుకుగాను నిర్మాణ వ్యయం వృథా కాకుండా ప్రస్తుతం నడుస్తున్న పథకాన్ని సవరించనున్నాము.

59. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ. 808 కోట్లు ప్రతిపాదించడమైనది.

పౌర సరఫరాలు

60. దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాలకు పౌష్టికాహారం అందుబాటులోకి తీసుకురావడం కోసం గతంలో మా ప్రభుత్వం రూపకల్పన చేసి అమలులోకి తీసుకొచ్చిన సబ్సిడీ బియ్యం పథకాన్ని కొనసాగించడంతో పాటు, తగిన ధరలకు వివిధ ఆహారవస్తువుల్ని అందించే కార్యక్రమం కూడా చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అల్పాదాయ వర్గాల వారికి తక్కువ ధర లో ఆహారాన్ని అందించేందుకు 'అన్న క్యాంటీన్స్' ఏర్పాటుకు కృషి చేయనున్నాము.

61. ధరల్ని నియంత్రించడంకోసం, ఎసెన్షియల్ కమాడిటీల సరఫరాను సమర్థవంతంగా అమలు చేయటానికి చర్యలు చేపట్టడంతోపాటు, వివిధ రకాల మార్కెట్ ఇంటర్వెన్షన్ చర్యలను ప్రభుత్వం చేపట్టనుంది. రైతుబజారు ద్వారా కూరగాయలు మొదలైనవి సముచితమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతున్నది.

62. రేషన్ కార్డులను ఆధార్ నంబర్ కు అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. తూర్పుగోదావరి జిల్లాలో ఈపీఓఎస్ మిషన్ల ద్వారా చేపట్టిన బయోమెట్రిక్ నిర్ధారణ వల్ల 15 శాతం మిగులు కనబడింది. ఈనిర్ధారణను తక్కిన రాష్ట్రం మొత్తానికి విస్తరించే విషయాన్ని పరిశీలించడం జరుగుతున్నది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అర్హులైన అందరు మహిళలకు కొత్తగా దీపం కనెక్షన్లను అందించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. వరి పంటకు రైతుకు కనీస మద్దతు ధర పొందడానికి వీలుగా స్వయంసహాయక బృందాల ద్వారా ఎన్నో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటిదాకా 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది.

63. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.2318 కోట్లు ప్రతిపాదించడమైనది.

గ్రామీణాభివృద్ధి శాఖ

64. దారిద్ర్య నిర్మూలన కోసం గ్రామీణాభివృద్ధి శాఖ ఎన్నో పథకాలు అమలుచేస్తున్నది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద ఇచ్చే వేతనాలను ప్రభుత్వం ఇటీవలనే రోజుకు రూ. 149 నుంచి రోజుకు రూ. 169 కి పెంచడం జరిగింది. 2013-14 లో 34.3 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించబడింది. మొత్తం పథకం కింద రూ. 3,038 కోట్లు ఖర్చు కాగా అందులో రూ. 1970 కోట్లు నేరుగా వేతనరూపంలో చెల్లించబడింది. వ్యవసాయరంగంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో భాగం గా ప్రభుత్వం జాతీయగ్రామీణ ఉపాధిహామీ పథకం కింద రైతులకు, వ్యవసాయ కూలీలకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవసాయకార్యక్రమాలను అమలు చేస్తున్నది.

65. భూసారం, పచ్చదనం, జలసంపద వంటి ప్రాకృతిక వనరులు అంతరించిపోకుండా పరిరక్షించడానికీ, అభివృద్ధి పరచడానికీ, తద్వారా నిరుపేద కుటుంబాలకు నికర జీవనోపాధి కల్పిస్తూ, వాతావరణ సమతౌల్యం కాపాడడం కోసం ఉద్దేశించబడ్డ సమగ్ర వాటర్ షెడ్ నిర్వహణ కార్యక్రమం (ఐడబ్ల్యుఎంపి) 11 డిపిఎపి/డిడిపి జిల్లాల్లో అమలుజరుగుతున్నది.

66. ఋణాలను సకాలంలో చెల్లిస్తున్న స్వయం సహాయకబృందాలకు వడ్డీలేని ఋణాల పేరిట గ్రామీణదారిద్ర్య నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రోత్సాహకాలను అందిస్తున్నది. కేవలం మహిళలే సభ్యులుగా గల 6.56 లక్షల స్వయం సహాయకబృందాల్లో సుమారు 70 లక్షల మంది సభ్యులున్నారు. ఈ మొత్తం సభ్యులు పొదుపు చేసుకున్నది రూ.3,064 కోట్లు కాగా, కార్పస్గా జమ చేసుకున్నది రూ. 4,025 కోట్లు. ఒక్కొక్క బృందానికీ లక్ష రూపాయలు మించకుండా సరికొత్త పెట్టుబడి సమకూర్చడం ద్వారా స్వయం సహాయకబృందాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

67. సామాజిక భద్రత పింఛన్ల కింద 75 లక్షల మంది పింఛనుదారులకు రూ. 2,505 కోట్ల మేరకు పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. వృద్దులకూ, వితంతువులకూ, నేతపనివారికీ, కల్లుగీత కార్మికులకూ ఎఆర్‌టి కేసులకూ, 40-79 శాతం మేరకు వైకల్యం కలిగిన వికలాంగులకూ ప్రస్తుతం ఇస్తున్న నెలకు రూ.200 పింఛనును నెలకు రూ.1,000 రూపాయలకి ప్రభుత్వం పెంపుదల చేసింది. 80 శాతం కన్నా ఎక్కువ వైకల్యం కల్గిన వికలాంగులకు జీవనభద్రత కోసం పింఛనును నెలకు రూ.1,500 కు పెంచింది. ఈ పెంచిన రేట్లు సెప్టెంబరు 2014 నుండి అమలులోకి రానున్నాయి. అక్టోబరు 2,2014 నుండి చెల్లింపు కానున్నాయి.

68. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ. 6,094 కోట్లు ప్రతిపాదించడమైనది.

పంచాయితీరాజ్

69. నాప్రసంగంలో ఇంతకు ముందే చెప్పిన విధంగా ఈ ప్రభుత్వం వికేంద్రీకరణను విశ్వసిస్తూ 73 వ రాజ్యాంగ సవరణలో పేర్కొనట్లు గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి కట్టుబడి వుంది. పంచాయితీరాజ్ శాఖ బిఆర్‌జిఎఫ్, ఆర్‌జిపిఎస్, 13వ ఆర్థికసంఘం నిధులు మరియు రాష్ట్ర ఆర్థికసంఘం నిధులు వంటి ముఖ్య కార్యక్రమాలను అమలుచేస్తున్నది.

70. ప్రాదేశిక అసమానతలను సరిదిద్దడం, మౌలిక సదుపాయాల కల్పనలోనెలకొన్న వ్యత్యాసాలను ప్రస్తుతం అమలుజరుగుతున్న పథకాల ద్వారా పూర్చలేని కీలక ప్రాంతాల్లో పూర్చడానికి ప్రయత్నించడం కోసం నాలుగు జిల్లాల్లో బిఆర్‌జిఎఫ్ కార్యక్రమం అమలుజరుగుతున్నది.

71. దిగువస్థాయిలో ప్రజాస్వామిక పాలనలో ప్రజలభాగస్వామ్యాన్ని పెంపొందించడం కోసం గ్రామీణప్రాంతాల్లో సేవల నిర్వహణను మెరుగుపర్చడం కోసం గ్రామసభలను, ఇతర పంచాయితీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం కోసం ఆర్‌జిపిఎస్ కార్యక్రమం ఉద్దేశించబడింది.

12. 2013-14 లో వివిధ సమగ్ర తాగునీటి సరఫరా పథకాలను నిర్వహించడం కోసం, పారిశుధ్య నిర్వహణకోసం 13వ ఆర్థికసంఘం అందిస్తున్న నిధులు రూ. 562 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది.

13. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కార్యక్రమంతో పాటు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన రహదారులను బిటి ప్రమాణాల స్థాయికి అభివృద్ధి చేయడం కోసం రాష్ట్రప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. 2013-14 లో 635.95 కిలోమీటర్ల మేరకు రూ.204.39 కోట్ల వ్యయంతో 346 పనులు చేపట్ట బడ్డాయి.

74. ఎమ్ఆర్ఆర్, 13వ ఆర్థికసంఘం నిధులు, సిఆర్ఆర్ మరియు ఆర్‌డిఎఫ్ కార్యక్రమాల కింద సమకూరుతున్న నిధులతో రహదారుల మరమ్మతులు చేపట్టడం జరుగుతున్నది.

75. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.4,260 కోట్లు ప్రతిపాదించడమైనది

గ్రామీణ నీటి సరఫరా

76. నాణ్యత లోపించిన ప్రాంతాల్లోనూ, పాక్షికంగా నీటిసరఫరా అందుతున్న ప్రాంతాల్లోనూ, షెడ్యూల్ కులాల, షెడ్యూల్డ్ తెగల జనావాసాల్లోనూ రక్షిత మంచినీటి సరఫరా చేయడం, గ్రామీణ నీటిసరఫరా మరియు పారిశుధ్యశాఖ యొక్క ముఖ్య కార్యక్రమం. చేతిపంపులు బిగించిన బోరుబావుల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా పథకాల ద్వారా, సమగ్ర మంచినీటి సరఫరా పథకాల ద్వారా మంచినీటి సరఫరా చేపట్టబడుతున్నది. ఇందుకు అవసరమైన నిధులు ఎన్ఆర్‌డిడబ్ల్యుపి, రాష్ట్ర ప్రణాళికా నిధులు, ఆర్థికసంఘం నిధులు మరియు నాబార్డు, ప్రపంచబ్యాంకు వంటి ఆర్థిక సంస్థలు అందిస్తున్న ఋణసదుపాయం ద్వారా చేకూరుతున్నవి.

77. ఇంతవరకు నెలకొల్పిన సదుపాయాల్లో 1,83,533 చేతి పంపులు, 28,173 రక్షిత మంచినీటి సరఫరా పథకాలు, 463 సమగ్ర మంచినీటి సరఫరా పథకాలు, 105 నీటి పరీక్షప్రయోగశాలలు ఉన్నాయి. 1-4-2014 నాటికి రోజుకు కుటుంబానికి 55 లీటర్ల కన్నా అధికంగా నీటి సరఫరా అందుబాటులోకి వచ్చిన జనావాసాలు 16,742 ఉండగా, అంతకన్నా తక్కువ సదుపాయంతో పాక్షికంగా లబ్ధి పొందుతున్న జనావాసాలు 29,304 ఉన్నాయి. నీటి నాణ్యత సమస్యగా మారిన జనావాసాలు 1144 ఉన్నాయి.

78. ఎన్ఆర్‌డబ్ల్యుపి కింద 8901 జనావాసాలకు లబ్ధి చేకూర్చే 4071 ఎస్ఐఎస్/ ఎమ్ఐఎస్ పనులు పురోగతిలో ఉన్నాయి. 9 తీరాంధ్ర జిల్లాల్లో సెలినిటీ సమస్యను ఎదుర్కోవడం కోసం 13వ ఆర్థికసంఘం నిధులతో 47 బహుళగ్రామ పథకాలు పురోగతిలో ఉన్నాయి. ప్రపంచబ్యాంకు సహాయంతో 159 ఏకగ్రామ/బహుళగ్రామ పథకాలు పురోగతిలో ఉన్నాయి.

79 ప్రజలకు అందుబాటులోకి తెస్తున్న మంచినీటి నాణ్యతను మెరుగుపర్చే దిశగా రాష్ట్రప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకాన్ని అమలు చేయాలనే ఒక బృహత్తర విధాన నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికీ రెండు రూపాయలకు 20 లీటర్ల సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయనుంది. నీటి సరఫరాతో, నీటి సరఫరాకై ఏర్పాటుచేసిన పంపిణీ వ్యవస్థలతో, ఇళ్లల్లో నీటిని భద్రపరిచి, వినియోగించే అలవాట్లతో మంచినీటి నాణ్యతా సమస్యలు ముడిపడి ఉన్నాయి. 2 అక్టోబరు 2014 నుండి మొదటిదశలో భాగంగా 5000 జనావాసాల్లో ఈ కార్యక్రమాన్ని అమలుచేయడానికి ప్రతిపాదించడం జరిగింది.

80. ఇంతేకాక, ఒక వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ ను నెలకొల్పి ఇంతవరకూ నెలకొల్పిన మంచినీటి సరఫరా సదుపాయాలన్నిటినీ ఈ కార్పొరేషనకు బదలాయించాలని కూడా నిర్ణయించనైనది. ఈ కార్పొరేషన్ అవసరమైన నిధులను సేకరించి రాష్ట్రమంతటా ఒక వాటర్ గ్రిడ్లు ఏర్పాటుచేయనున్నది.

81. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో నూటికి నూరుశాతం పారిశుధ్యం సాధించడం కోసం ప్రభుత్వం వ్యక్తిగత కుటుంబాల గృహాలకు, పాఠశాలలకు, అంగనవాడీ కేంద్రాలకూ మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నది. 82. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ. 1152 కోట్లు ప్రతిపాదించడమైనది.

పట్టణాభివృద్ధి


83. రాష్ట్రంలో 111 పట్టణ స్థానిక సంస్థలున్నాయి. 2013-14 లో 28 మేజర్ గ్రామీణ పంచాయితీలు నగర పంచాయితీలుగా, గ్రేడ్-3 మునిసిపాలిటీలుగా ఉన్నతీకరించబడ్డాయి. కొన్ని ఆవాసాలను 6 మునిసిపల్ కార్పొరేషన్లలో చేర్చడం జరిగింది. పట్టణ స్థానికసంస్థలకు ఈ మధ్యనే ఎన్నికలు జరిగినప్పటికీ, కోర్టుకేసుల కారణంగా 6 మునిసిపల్ కార్పొరేషన్లు, 6 మునిసిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించబడలేదు. ఈ పట్టణ స్థానిక సంస్థలలో ఎన్నికలు నిర్వహించమని ప్రభుత్వం త్వరలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను కోరనున్నది.

84. గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో పట్టణీకరణ శరవేగంతో జరుగుతున్నది. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కనీసమౌలిక సదుపాయాలు కల్పించడం ఒక సవాలుగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్‌సిటీల నిర్మాణ పథకం నుండి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక లబ్దిని పొందనుంది. ఈ పథకం క్రింద నిర్మించబడే స్మార్ట్ సిటీలు మౌలిక సదుపాయాలు, కనీస అవసరాలతో పాటూ సాంకేతికతతో కూడిన జీవనోపాధి అవకాశాలను పెంపొందించే విధంగా అభివృద్ది చెందుతాయి. రాష్ట్ర ప్రభుత్వం 10 నుండి 12 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. పట్టణ ప్రాంతాలను సమగ్రంగానూ, సమూలంగానూ అభివృద్ది చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాన నిర్ణయాలను తీసుకుని ఎన్నో చర్యలు చేపట్టింది. భారతప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం జేఎన్ఎన్‌యుఆర్ఎస్ కింద రాష్ట్రప్రభుత్వం నిధులను సమకూర్చుకుంటున్నది. ఇందులో భాగంగా నీటి సరఫరా, మురుగునీటి పారుదల, రవాణా, మురికివాడల సమగ్ర అభివృద్ధి, గృహనిర్మాణం, మౌలికసదుపాయాల కల్పన, వ్యర్థ పదార్థాల నిర్వహణ చేపట్టబడుతున్నాయి. ఈ పథకం కింద ఇంతదాకా రూ. 6620 కోట్ల అంచనా వ్యయంతో 152 ప్రాజెక్టులు చేపట్టబడగా అందులో 94 పూర్తి చేయబడ్డాయి.

85. మునిసిపల్ ప్రాంతాల్లో దారిద్ర్య నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన మిషన్ (మెప్మా) ద్వారా 19 లక్షలమంది మహిళలకు 1.82 లక్షల స్వయం సహాయకబృందాలుగా ఏర్పడడానికి తగిన సహాయం అందించబడింది. వారిలో 1.50 లక్షల స్వయం సహాయకబృందాలు రూ. 7727 కోట్ల మేరకు బ్యాంకు ఋణాలు పొందగలిగాయి.

86. ప్రస్తుతమున్న నీటిసరఫరా వ్యవస్థనూ, మురుగునీటి వ్యవస్థను మెరుగుపర్చడం ద్వారా పట్టణ స్థానిక సంస్థల కింద ఉన్న ప్రజలకు రక్షిత మంచినీరు అందించడం, ఆరోగ్యకరమైన పరిశుద్ధ వాతావరణం కల్పించడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.

87. నేషనల్ అర్బన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎన్‌యుఐఎస్) ఒక కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకం. ఇ-గవర్నెన్స్ లో భాగంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచార వ్యవస్థను నిర్మించడం ఈ పథకం ఉద్దేశం. దీని ద్వారా ఒక సమగ్ర సమాచారవ్యవస్థను నెలకొల్పడం జరుగుతుంది. దీనిలో భాగంగా జిఐఎస్ పటాలు రూపకల్పనలో ఉన్నాయి.

88. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.3,134 కోట్లు ప్రతిపాదించడమైనది.

కార్మిక మరియు ఉపాధిశాఖ

89. శ్రామికుల సంక్షేమం కోసం పథకాలు అమలుచేయడం, కార్మిక చట్టాలను అమలుచేయటం కార్మికశాఖ బాధ్యత. 2013-14 లో 4,124 నిర్మాణ కార్మికుల సంక్షేమకోసం రూ.8.89 కోట్లు 6,227 మంది ఇతర రంగాలకు చెందిన కార్మికుల సంక్షేమం కోసం రూ.2.25 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. పారిశ్రామిక శిక్షణ సంస్థల ద్వారా విద్యాభివృద్ధి కోసం నిరుద్యోగయువత శిక్షణ కోసం రూ. 23.41 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.

90. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.276 కోట్లు ప్రతిపాదించడమైనది.

ఆరోగ్యం, వైద్యం, కుటుంబసంక్షేమం

91. నాణ్యమైన, సత్వర వైద్యసేవలను, వైద్యవిద్యను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఆరోగ్య, వైద్య, కుటుంబసంక్షేమశాఖ ప్రధాన బాధ్యత.

92 . ఈ దిశగా ప్రాథమిక, ద్వితీయ ఆరోగ్య రంగాలను బలోపేతం చేయడం జరుగుతుంది. ఆరోగ్య కేంద్రాల పనితీరును మెరుగుపరచడం కోసం అవసరమైన మౌలికసదుపాయాలనూ, ఆరోగ్యపరీక్ష సదుపాయాలను సమకూర్చడం, తగినన్ని ఔషధాలనూ, మందులనూ సరఫరా చేయడం, రోగులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను నిరంతరాయంగా అందించడానికి అవసరమైన అన్నిరకాల సదుపాయాలనూ సమకూర్చడం శాఖ ముందున్న బాధ్యత.

93. నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ సేవలను అందించే విధంగా తృతీయస్థాయి సదుపాయాల కల్పన మీద, విద్యార్థులకు గుణాత్మక వైద్యవిద్యను అందించడం మీద కూడా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది.

94. ఇవి కాక, విశాఖపట్నంలో విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను నిర్వహణలోకి తీసుకురావటం, ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షయోజన పథకం క్రింద లభించే ఆర్థిక సహాయంతో తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని సదుపాయాలను మెరుగుపర్చడం కూడా జరుగుతుంది. ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరహా లో ఒక సూపర్ స్పెషాలిటీ మరియు శిక్షణ సంస్థను భారతప్రభుత్వ సహాయంతో రాష్ట్రంలో నెలకొల్పాలని కూడా ప్రయత్నాలు ప్రారంభించబడ్డాయి.

95. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.4,388 కోట్లు ప్రతిపాదించడమైనది.

పాఠశాల విద్య

96. అందరికీ విద్యనందించడం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ దిశగా ఎన్నో ముఖ్యమైన పథకాలనూ, కార్యక్రమాలను అమలుచేస్తున్నది.

97. భారతప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో ఒకటైన సర్వశిక్షా అభియాన్ ను రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యతతో అమలుచేయడం జరుగుతున్నది. 6-14 సంవత్సరాల మధ్య గల పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం, వారు కనీసం 8 సంవత్సరాల ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసుకునేలా సహకరించడం, లింగపరంగానూ, సామాజికవర్గపరంగానూ ఉన్న వ్యత్యాసాలను తగ్గించడం, నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను అందించడం ఆ పథకం ముఖ్య లక్షణాలు.

98. 2014-15 లో కొత్తగా 48 ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించబడ్డాయి. 11 పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ కాబడ్డాయి. 2,441 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి ప్రారంభించబడింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులందరికీ ఇన్ సర్వీస్ శిక్షణ ఇవ్వబడింది. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 8 వ తరగతి దాకా చదువుతున్న 35 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ 2 జతల చొప్పున యూనిఫాం అందించబడింది. విద్యాపరంగా వెనుకబడ్డ మండలాల్లో సామాజికంగా వెనుకబడ్డ బాలికలకు గుణాత్మకంగా విద్యను అందుబాటులోకి తీసుకురావడం కోసం 345 కస్తూర్బా గాంధీ బాలికావిద్యాలయాలు నెలకొల్పబడ్డాయి. అవి ఎలిమెంటరీ స్థాయి దాకా విద్యనందిస్తున్నాయి.

99. 14 నుంచి 18 మధ్య వయసు గల పిల్లలకు విద్యనందిస్తూ మాధ్యమికవిద్య ఎలిమెంటరీ మరియు ఉన్నతవిద్యారంగాల మధ్య ఒక సేతువుగా పనిచేస్తుంది. కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకమైన రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ఎమ్ఎస్ఎ) నాణ్యమైన మాధ్యమిక విద్యను అందుబాటులోకి తీసుకురావడం కోసం కృషి చేస్తున్నది. గుణాత్మక విద్యనందించడం, మౌలికసదుపాయాల కల్పన, సమత్వసాధన ఈ పథకం ముఖ్య ఉద్దేశాలు.

100. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, విద్యార్థుల హాజరు పెంపొందించడం, డ్రాప్ఔట్ రేట్లను తగ్గించడం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో 'బడి పిలుస్తోంది' అనే కార్యక్రమాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రివర్యులు 25.7.2014 న అనంతపురం జిల్లాలో ప్రారంభించారు.

101. పాఠశాల విద్యకు 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.12,595 కోట్లు ప్రతిపాదించడమైనది.

ఇంటర్మీడియట్ విద్య

102. రాష్ట్రంలో ప్రభుత్వరంగంలో 431 జూనియర్ కళాశాలలు, 8 వొకేషనల్ జూనియర్ కళాశాలలు పనిచేస్తున్నాయి. 181 ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలు కూడా ఇంటర్మీడియట్ విద్య సంచాలకుల పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. ఇవికాక ప్రైవేటు రంగంలో చాలా కళాశాలలు పనిచేస్తున్నాయి.

103. 2013-14 లో మొత్తం 4.83 లక్షల విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తుండగా అందులో ప్రభుత్వ కళాశాలల్లో 1.23 లక్షలు, ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలల్లో 0.36 లక్షలు మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్రస్థాయి ఉత్తీర్ణత 65.58 శాతం.

104. ఈ శాఖకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.812 కోట్లు ప్రతిపాదించడమైనది.

ఉన్నత విద్య

105. అన్ని వర్గాలకూ ఉపకరిస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా ఉన్నతవిద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావటానికీ, ఉన్నతవిద్యాసంస్థల్లో బోధించే బోధనను మెరుగుపర్చడానికీ, బోధనాంశాలను ప్రయోజనకరంగా ఉండేటట్లు చూడటానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది.

106. 18.8 శాతం మాత్రమే గల జాతీయ సగటు గ్రాస్ ఎన్‌రోలమెంట్ నిష్పత్తి కన్నా రాష్ట్రం ఎక్కువ నిష్పత్తిని అనగా 21.6 శాతం నిష్పత్తిని నమోదుచేసింది. 13వ పంచవర్ష ప్రణాళిక అంతానికి దీనిని 32శాతానికి పెంచాలని భారతప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్చతర శిక్షాఅభియాన్ (రూసా) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 12వ పంచవర్ష ప్రణాళిక మొదలుకొని రూ. 22,855 కోట్ల ప్రణాళికా కేటాయింపులున్నాయి. ఇందులో భాగంగా 12వ పంచవర్ష ప్రణాళికా కాలానికి రూ.1600 కోట్ల మేరకు ఆర్థికసహాయానికి రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తున్నది.

107. కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చడం కోసం ప్రభుత్వం అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఇంగ్లీషు బోధనలో భాగంగా సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యునికేషన్ స్కిల్స్ ను బోధించడం కూడా మొదలుపెట్టింది. రూసా పథకంలో భాగంగా రాష్ట్రంలో 2014-15 లో రూ. 12 కోట్ల అంచనా వ్యయంతో 4 మోడల్ డిగ్రీ కళాశాలలను ప్రభుత్వం నెలకొల్పనుంది. రూ. 88.80 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రంలో 11 విద్యా సంస్థల్లో గుణాత్మక సాంకేతిక విద్యాభివృద్ధి కార్యక్రమాన్ని (టిఇక్యూఐపి-II) ప్రభుత్వం అమలుచేస్తున్నది. చిత్తూరు జిల్లాలో ఐఐఐటి ని మంజూరు చేయటమే కాక, పిపిపి పద్ధతి ద్వారా కాకినాడలో మరొక ఐఐఐటి ని నెలకొల్పడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.

108. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం 2014 లో 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా భారతప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో ఎన్నో జాతీయస్థాయి సంస్థలు నెలకొల్పబడనున్నాయి.

109. ఈ శాఖకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.2,275 కోట్లు ప్రతిపాదించడమైనది.

పర్యావరణం, అడవులు, సైన్స్ మరియు టెక్నాలజీ

110. రాష్ట్రంలో అడవులు 36,917 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నాయి. ఇందులో దట్టమైన అడవులు కేవలం 9,764 చదరపు కిలోమీటర్ల మేరకు మాత్రమే అనగా మొత్తం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 22.61 శాతం మేరకు మాత్రమే విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలో 18 వన్యప్రాణి అభయారణ్యాలు, 8 నేషనల్ పార్కులు, 2 జూ పార్కులు ఉన్నాయి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఏర్పరచిన 4,320 వనసంరక్షణ సమితుల (విఎస్ఎస్) ద్వారా మరియు ఎకో డెవలపమెంట్ కమిటీల ద్వారా ప్రస్తుతమున్న అడవులను సంరక్షించడానికీ, అభివృద్ధి చేయటానికీ వివిధ రకాల అటవీ కార్యక్రమాలు అమలుజరుగుతున్నాయి.

111. అడవులలోని వృక్షాల విస్తీర్ణం, సాంద్రత, అడవులలో అగ్నిప్రమాదానికి గురయ్యే ప్రాంతాల అంచనా మరియు అటవీ సరిహద్దుల సవరణ, నిర్ధారణ వంటి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, రిమోట్ సెన్సింగ్, గ్లోబల్ పొల్యూషనింగ్ సిస్టమ్ వంటి ఆధునిక సమాచార సాంకేతిక సాధనాలను అటవీ శాఖ వినియోగి స్తున్నది.

112. అడవులను రక్షించడం, అన్యాక్రాంతం కాకుండా కాపాడడం, ఎర్రచందనం వంటి విలువైన కలప స్మగ్లింగకు లోనుకోకుండా కాపాడడం నేడు రాష్ట్రం ముందున్న ముఖ్యమైన సవాళ్లు. అటవీ వనరులను సంరక్షించుకోవడం కోసం ప్రభుత్వం ఎన్నో ముఖ్య చర్యలను చేపట్టింది.

113. జాతీయ అటవీ విధానం మొత్తం భౌగోళిక ప్రదేశంలో 33 శాతం అటవీ విస్తీర్ణం ఉండాలని నిర్దేశించింది. కాగా రాష్ట్రంలో వృక్ష విస్తీర్ణం సుమారు 25.64 శాతం మాత్రమే. ఈ రెండిటి మధ్యా వ్యత్యాసం 7.36 శాతం ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం పెద్ద ఎత్తున చెట్లు నాటి పెంచవలసి ఉంది.

114. రాష్ట్రంలో అంతరించి పోతున్న అటవీ ప్రాంతానికి సంబంధించిన 48,637.61 హెక్టార్ల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అటవీఅభివృద్ధి కార్పొరేషన్ వివిధ పథకాలను చేపడుతున్నది. అందులో 26,932 హెక్టార్లలో అధిక దిగుబడిని ఇవ్వగల యూకలిప్టస్ క్లోనల్ ప్లాంటేషన్స్ చేపట్టబడ్డాయి. ఇదికాక, విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో 4010 హెక్టార్లలో కాఫీ తోటలు, 8950 హెక్టార్లలో జీడిమామిడి, 2380 హెక్టార్లలో వెదురు పెంపకం చేపట్టబడింది.

115. ఈ శాఖకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.418 కోట్లు ప్రతిపాదించడమైనది.

మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులు

116. రాష్ట్రంలో మౌలికసదుపాయాల కల్పన మరియు పెట్టుబడుల శాఖ ఓడరేవులు, విమానాశ్రయాలు మరియు సహజవాయువుకు సంబంధించిన విషయాలను పరిశీలిస్తుంది. ఈ రంగంలో పబ్లిక్ ప్రైవేట్ రంగ భాగస్వా మ్యపద్ధతిలో ప్రభుత్వం ఎన్నో మౌలికసదుపాయాల ప్రాజెక్టులను చేపట్టింది.

117. ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 975 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ ఉంది. ఈ తీరంలో విశాఖపట్నంలో గల ఒక మేజర్ నౌకాశ్రయంతో పాటు 14 నాన్ మేజర్ నౌకాశ్రయాలు కూడా ఉన్నాయి. వీటిలో కాకినాడ యాంకరేజ్ పోర్ట్, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్ మరియు 'రవ్వ' లోగల ఒక కేప్టివ్ పోర్టుల్లో వాణిజ్య కార్యక్రమాలు నడుస్తున్నాయి.

118. 2013-14 సంవత్సరంలో ఈ నౌకాశ్రయాలన్నిటిలోనూ ఇంతవరకూ ఎన్నడూ లేని విధంగా 58 మిలియన్ టన్నుల వస్తు రవాణా జరిగింది. తద్వారా రూ.144 కోట్ల ఆదాయం సమకూరింది. 2014-15 సంవత్సరంలో 65 మిలియన్ టన్నుల వస్తు రవాణా చేపట్టడం ద్వారా రూ. 153 కోట్ల మేరకు ఆదాయం ఆశించడం జరుగుతున్నది.

119. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వం మచిలీపట్నం నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నది. ప్రస్తుతమున్న నాన్ మేజర్ నౌకాశ్రయాలతోపాటు, ప్రభుత్వం 14 మైనర్ పోర్ట్‌లను కూడా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భావనపాడు, కళింగపట్నం రేవు పట్టణాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో రెండవ పెద్ద నౌకాశ్రయాన్ని నెలకొల్పాలనే ప్రతిపాదనతో పాటు, ప్రైవేటు రంగంలో కాకినాడలో మరొక వాణిజ్య పోర్ట్ నెలకొల్పాలనే ప్రతి పాదనలు భారతప్రభుత్వం నుంచి అందినవి.

120. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడపలలో గల విమానశ్రయాలను విస్తరించడానికీ/ఆధునీకరించడానికీ రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారికి సహకరిస్తున్నది. విజయవాడ విమానాశ్రయంలో ఒక కొత్త టెర్మినల్ భవనాన్నీ మరియు ఒక కంట్రోల్ టవర్లు నిర్మించడానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్

ఇండియా ప్రతిపాదిస్తున్నది. పొడిగించబడ్డ రన్ వే ప్రస్తుతం వాడుకలో ఉంది. విజయవాడ మరియు కాకినాడల మధ్య ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిరిపోర్ట్ ను కూడా ప్రతిపాదిస్తున్నది.

121. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక కేటగిరి రాష్ట్రంగా ప్రకటించవలసి ఉన్నందున రాష్ట్రంలో చిత్తూరుజిల్లాలోని కుప్పం, కర్నూలు పట్టణం, నెల్లూరు మరియు శ్రీకాకుళంలో గల నో-ఫ్రిల్స్ ఎయిర్ పోర్ట్‌లు ప్రతిపాదిస్తూ వాటికి సహాయం అందించవలసిందిగా భారతప్రభుత్వాన్ని కోరడం జరిగింది.

122. భారతప్రభుత్వం నిర్వహించిన వేలంలో రాష్ట్రప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఎపిజిఐసి) కేజీ బేసిన్లో 4 బ్లాకులకు అనుమతి సాధించింది.

123. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపిటిడిసి), ఎపిజిఐసి మరియు గెయిల్ ఇండియా లిమిటెడ్ వారి అనుబంధ సంస్థ అయిన గెయిలగ్యాస్ లిమిటెడ్లచే సంయుక్తంగా ఏర్పరచబడిన సంస్థ ట్రంక్ పైప్‌లైన్లు సిజిడి నెట్వర్క్లు, రీజనల్ గ్రిడ్లు, సిఎన్‌జి, ఎల్ఎన్‌జి దిగుమతి మరియు దాని రీగాసిఫికేషన్ వంటి కార్యక్రమాలకు సంబంధించిన వ్యాపారంలో పాలుపంచుకోవడానికి ఎపిజిడిసి ఆసక్తి కనబరస్తున్నది.

124. సహజవాయువుకు సంబంధించిన గిరాకీ మరియు సరఫరాలో నానాటికీ పెరుగుతున్న వ్యత్యాసాన్ని దృష్టిలో ఉంచుకుని తీరాంధ్రంలో ఒక ఎల్ఎన్‌జి ఇంపోర్టేషన్ టెర్మినల్ను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహపడుతున్నది. ఇందుకు సంబంధించిన గిరాకీ రాష్ట్రంలోనే ముఖ్యంగా ఇంధనశాఖ, ఎరువులు, రిఫైనరీ,

గ్లాసు, పింగాణీ మరియు సీజిడి రంగాల్లో అధికంగా ఉంది. ఈ టెర్మినల్ను నెలకొల్పడానికి కాకినాడలోని కాకినాడ డీప్ వాటర్ పోర్టును అత్యంత అనుకూల స్థలంగా ఎపిజిడిసి గుర్తించింది.

125. కాకినాడ డీప్‌వాటర్ పోర్టు దగ్గర ఎఫ్ఎస్ఆర్‌యు ఆధారిత ఎల్ఎన్‌జి టెర్మినలను నెలకొల్పడానికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. పెట్రోనెట్ ఎల్ఎన్‌జి టెర్మినల్‌తో కూడిన ఒక జె.వి. కంపెనీ ద్వారా విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్టు దగ్గర కూడా మరొక ఎల్ఎన్‌జి టెర్మినల్‌ను నెలకొల్పడానికి కూడా అనుమతినివ్వడం కూడా జరిగింది. 126. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.73 కోట్లు ప్రతిపాదించడమైనది.

రోడ్లు మరియు భవనాలు

127. రాష్ట్రంలోని 46,440 కిలోమీటర్ల మేజర్ రోడ్ రవాణాకు అనుకూలంగా నిర్వహించడంతో పాటు సుదృఢమైన రహదారి వ్యవస్థను నిర్మించడం రోడ్లు, భవనాల శాఖ ముఖ్య బాధ్యత. జాతీయ రహదారులు 4302 కిలోమీటర్లు, రాష్ట్ర రహదారులు 7,255 కిలోమీటర్లు, మేజర్ జిల్లా రహదారులు 19,783 కిలోమీటర్లు కాగా, జిల్లాపరిషత్తులు నిర్వహిస్తున్న రోడ్లు 15,100 కిలోమీటర్లు కోర్‌నెట్ రోడ్లు 6,800 కిలోమీటర్లు ఈ కోర్‌నెట్లో చేరని 35,338 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను రాష్ట్ర రహదారుల విభాగం నిర్వహిస్తున్నది.

128. రాష్ట్రంలో రహదారుల మీద సంభవిస్తున్న ప్రమాదాలను ప్రభుత్వం తీవ్రపరిగణనలోకి తీసుకుని, రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో అన్ని రహదారుల మీద రహదారి భద్రతా చర్యలను అమలు చేయటానికి సమగ్ర ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు రహదారి భద్రతకు సంబంధించిన రాష్ట్రస్థాయి సాంకేతిక సంఘంవారి సిఫారసులకు అనుగుణంగా జారీచేయబడ్డాయి.

129. రైల్వేశాఖ వారి నియమనిబంధనలకు అనుగుణంగా ఎక్కువ జనసమ్మర్థం కలిగిన లెవెల్ క్రాసింగ్లకు బదులుగా రైల్ ఓవర్‌బ్రిడ్జిలురైల్ అండర్ బ్రిడ్జిలు నిర్మించబడ్డాయి. కొన్ని ఆర్‌వోబీలు/ఆర్‌యుబి లు నూటికి నూరుశాతం రాష్ట్రప్రభుత్వ నిధులతో కూడా చేపట్టబడుతున్నాయి.

130. నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టు (ఎనీసిఆర్ఎమ్‌పి) 9 తీరాంధ్ర జిల్లాల్లో ప్రపంచబ్యాంకు సహాయంతో అమలుజరుగుతున్న పథకం. తుఫాను విపత్తు వాటిల్లిన సందర్భంలో పునరావాస సామగ్రిని త్వరితంగా చేర్చటానికీ, లేదా ప్రజలను సత్వరమే సురక్షితప్రాంతాలకు తరలించడానికీ జనావాసాల అనుసంధానం, మరియు సైక్లోన్ షెల్టర్ల నిర్మాణం ఈ పథకం కింద చేపట్టబడుతున్నాయి.

131. ఈపిసి పద్దతిలో రూ.130 కోట్ల అంచనా వ్యయంతో 4 బ్రిడ్జిల నిర్మాణాలూ మరియు రూ.165 కోట్ల అంచనా వ్యయంతో మరి 4 మేజర్ బ్రిడ్జిల నిర్మాణాలు రాష్ట్రంలో పురోగతిలో ఉన్నాయి.

132. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.2,612 కోట్లు ప్రతిపాదించడమైనది.

ఇంధనం

133. భారతప్రభుత్వ కార్యక్రమం 'అందరికీ విద్యుచ్ఛక్తి' అమలుకు గాను ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఎంపిటకైంది. గృహోపయోగానికీ, వ్యాపారపారిశ్రామిక సంస్థలకు ఒక నిర్ణీత కాలవ్యవధిలో విశ్వసనీయమైన, న్యాయమైన మరియు సముచితమైన ధరకు 24x7 పాటు విద్యుచ్ఛక్తి సరఫరా చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

134. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎపిజెన్‌కో, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్లు మరియు స్వతంత్ర విద్యుచ్ఛక్తి ఉత్పత్తిదారుల ద్వారా అదనంగా మరొక 2925 మెగా వాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కానుంది. దీర్ఘకాలిక ప్రాతిపదికన 2000 మెగావాట్ల విద్యుచ్ఛక్తిని కొనుగోలు చేయటానికి ఆంధ్రప్రదేశ్ డిస్కమ్‌లకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి మంజూరు చేసింది. అలాగే సౌర, పవన వనరుల ద్వారా విద్యుచ్ఛక్తి ఉత్పాదన చేసి, తద్వారా పెరుగుతున్న గిరాకీని తట్టుకోవాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నది. రాష్ట్రంలో సౌర, పవన విద్యుచ్ఛక్తి సామర్థ్యాలను ప్రోత్సహించడం కోసం ఒక సమగ్ర సౌర,పవన విద్యుత్ విధానాన్ని తీసుకురావాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

135. పారదర్శకంగానూ, పోటీపడగల వేలం ప్రక్రియద్వారానూ 1000 మెగావాట్ల సౌరవిద్యుత్తు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం డిస్కమ్‌లకు అనుమతి నిచ్చింది. 1000 మెగావాట్ల సామర్థ్యం కల్గిన 2 సౌరవిద్యుత్ పార్క్‌లను గుంటూరులోనూ, అనంతపురంలోనూ నెలకొల్పడానికి ప్రతిపాదించడం జరిగింది. రైతులకు సోలార్ పంపుసెట్లను ఇవ్వడం, ఇళ్ల పైకప్పుల మీద సోలార్ విద్యుత్ వ్యవస్థలను నెలకొల్పడం మీద ప్రభుత్వం దృష్టిపెట్టనున్నది.

136. దశల వారీగా సుమారు 3,000 మెగావాట్ల పవన విద్యుత్ మరియు 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ సమకూర్చుకోవాలని ప్రతిపాదించడం జరుగుతున్నది. పవన మరియు సోలార్ విద్యుత్‌ల గ్రీన్ కారిడార్ ఎవాక్యువేషన్‌కి గాను రూ. 5,000 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించడం జరిగింది.

137. రాష్ట్రంలో వ్యవసాయదారులకు 7 గంటల ఉచితవిద్యుత్ సరఫరా చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. రానున్న కాలంలో రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయబడుతుంది. గ్రామీణ ప్రాంతాలలో నాణ్యమైన, విశ్వసనీయమైన త్రీ-ఫేస్ విద్యుత్ సరఫరాకు గాను వ్యవసాయ ఫీడర్లు దశలవారీగా ఏర్పాటు చేయబడతాయి.

138. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.7,164 కోట్లు ప్రతిపాదించడమైనది.

నీటిపారుదల రంగం

139. రాష్ట్రానికి గోదావరి, కృష్ణా, పెన్నా అనే మూడునదులు వరదానంగా లభించాయి. ఈ మూడింటి కింద భారీ, మధ్య, చిన్నతరహా సాగునీటి పారుదల కింద 101.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. 2004 నుండి రూ. 80,620 కోట్ల అంచనా వ్యయంతో 54 భారీ, మధ్య తరహా సాగునీటి పథకాలు చేపట్టబడ్డాయి. ఈ 54 పథకాల్లో 13 పథకాలు పూర్తిచేయబడ్డాయి. 14 పథకాలు పాక్షికంగా నీరు సమకూరుస్తున్నాయి. ఈ పథకాల ద్వారా రూ. 19,378 కోట్ల వ్యయంతో 11.878 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. 8 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది.

140. పోలవరం, ఉత్తరాంధ్ర సుజలస్రవంతి పథకాలు కాకుండా 39 పథకాలు పూర్తికావలసి ఉన్నాయి. ఇందులో 11 పథకాలు నిర్మాణ చివరిదశలో ఉన్నాయి. ఇవి 2014-15 లో పూర్తికానున్నాయి. వీటి ద్వారా 2,03,628 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రానున్నది. మరియు 35,990 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది.

141. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకతను గుర్తించి భారతప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఒక జాతీయస్థాయి ప్రాజెక్టుగా ప్రకటించింది. అంతేకాక, సాగునీటిప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టు అభివృద్ధి, నియంత్రణ మొత్తం కేంద్రప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంటుందని ప్రకటించింది.

142. భారీ, మధ్యతరహా నీటిపారుదల రంగాలకు ఆవల ముఖ్యంగా దుర్భిక్షపీడిత ప్రాంతాల్లో వ్యవసాయాభివృద్ధిలోనూ, జీవనోపాధులకల్పనలోనూ చిన్నతరహా నీటిపారుదల ప్రధానపాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద కొత్త నీటివనరులు కల్పించడం, మరియు చెఱువులు, కుంటల పునరుద్ధరణ చేపట్టడం జరుగుతున్నది. మైక్రో ఇరిగేషన్ ద్వారా అవసరమైన చోట పొలాలకు నీరందించడం మాలక్ష్యం.

143. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలపమెంట్ కార్పొరేషన్ 1,151 పథకాల కింద 7 లక్షల ఎకరాల ఆయకట్టును పరిరక్షిస్తున్నది. నాబార్డ్, ఎ.ఐ.బి.పి.మరియు రాష్ట్ర ప్రణాళికా నిధుల కింద రూ. 581 కోట్ల అంచనా వ్యయంతో 1.45 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కల్పన కోసం 89 పథకాలు నిర్మాణంలో ఉన్నాయి. 14,800 ఎకరాల ఆయకట్టు కోసం 16 కొత్త పథకాలు మంజూరు కాబడ్డాయి.

144. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.8,465 కోట్లు ప్రతిపాదించడమైనది.

పరిశ్రమలు, వాణిజ్యం

145. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ పారిశ్రామికరంగాన్ని పూర్తి నిరుత్సాహ పరిస్థితిలోకి నెట్టివేసిందని చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను. పారిశ్రామికీకరణ జరగాలంటే సాధారణంగా పెద్ద ప్రభుత్వరంగ సంస్థలు, పరిశోధనా సంస్థలు, పారిశ్రామిక ప్రయోగశాలలు, పేరెన్నికగన్న శిక్షణా సంస్థలు, వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఉండాలి. కానీ రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఈ సదుపాయాలన్నీ మృగ్యమయ్యాయి.

146. యువతకు ఉద్యోగవకాశ కల్పనకూ, ప్రభుత్వానికి ఆదాయసమీకరణకూ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం శీఘ్రగతిన పారిశ్రామికీకరణ జరగడం కోసం మిషన్ తరహాలో ఒక వ్యూహాన్ని రూపొందిస్తున్నది.

147. రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించడానికి వనరులు అపారంగా ఉన్నాయన్నది ఊరటనిచ్చే అంశం. ముఖ్యంగా సముద్రతీర ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే విధంగా అంతర్జాతీయస్థాయి లాజిస్టిక్ హబ్‌లనూ, కొత్త నౌకాశ్రయాలనూ నిర్మించడానికి అనువుగా రాష్ట్రానికి ఒక సుదీర్ఘ తీరరేఖ అందుబాటులో ఉంది. రాష్ట్రంలో ఉన్న విస్తారమైన వ్యవసాయ ఉద్యానవన విస్తీర్ణాన్ని ఉపయోగించి రాష్ట్రం ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించనుంది. అదేవిధంగా రాష్ట్రంలో అపారంగా ఉన్న ఖనిజ సంపదను ఉపయోగించి సిమెంటు, అల్యూమినియం, గ్రానైట్, ఉక్కు ఫెర్రోఎల్లాయిస్, పింగాణీ,

గ్లాసు, కాగితం, ఎరువులు, రసాయనాలు మరియు పెట్రోరసాయనాల పరిశ్రమలను ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ పరిశ్రమలన్నిటికీ 24x7 విద్యుత్ సరఫరా అందించబడుతుంది.

148. రాయలసీమలోనూ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వటానికి ముఖ్యంగా పరిశ్రమలు నెలకొల్పటానికి ప్రత్యేక డెవలప్ మెంట్ ప్యాకేజీను అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అవకాశం కలిగిస్తున్నది. ఇందుకుగాను సముచితమైన ఆర్థికచర్యలు చేపట్టవలసిన బాధ్యత భారతప్రభుత్వం మీద ఉన్నది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థికాభివృద్ధికీ, పారిశ్రామికీకరణకూ పన్నురాయితీలు కల్పించడం, అన్నిటికన్నా ముందుగా వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి పరచడం ఉన్నాయి.

149. అంతేకాక, రాష్ట్రంలో పెట్టే పెట్టుబడులను కొన్ని కేంద్రప్రభుత్వ పన్నులనుండి మినహాయించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ ప్రతిపత్తి ఇచ్చే విషయం మీద కూడా భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. పైగా ఇటీవల తమ బడ్జెట్ ప్రసంగంలో కేంద్రప్రభుత్వ ఆర్థికశాఖామాత్యులు నెల్లూరుజిల్లాలో ఒక స్మార్ట్‌సిటీని నెలకొల్పడంతోపాటు, కాకినాడలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ కాంప్లెక్స్ ను నెలకొల్పుతామని కూడా ప్రకటించారు.

150. పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. కొత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే పారిశ్రామిక విధానం, ప్రస్తుతం అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ సింగిల్ విండో చట్టాన్ని బలోపేతం చేయడం, ఆన్లైన్ ద్వారా ప్రాజెక్టుల పురోగతి పరిశీలన, పెద్దపెద్ద పారిశ్రామిక పథకాలకు ఎస్కార్ట్ ఆఫీసర్ల నియామకం, ఏపీఐఐసీ ద్వారా భూమి కేటాయింపు విధానంలో 

సంస్కరణలు, భారీపారిశ్రామిక పార్కులకు అవసరమైన స్థలాలను గుర్తించడం, సేకరించడం, ఎన్ఐఎమ్‌జెడ్స్, సెజ్లు, పిసిసిఐర్ మరియు మెగా పారిశ్రామిక పార్కుల్ని నెలకొల్పడం మీద ప్రత్యేక దృష్టి ప్రస్తుతమున్న పారిశ్రామిక పార్కులకు, పారిశ్రామిక ఎస్టేట్ల కూ పూర్తి స్థాయి సదుపాయాలను కల్పించడం ద్వారా బలోపేతం చేయడం, తద్వారా ఎటువంటి అవరోధాలు లేకుండా పథకాలను అమలు పరచడం ప్రభుత్వం చేపడుతున్న కొన్ని ముఖ్యమైన చర్యలు.

151. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ. 615 కోట్లు ప్రతిపాదించడమైనది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్లు

152. ఈగవర్నెన్స్ మరియు ఐటి రంగాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నాయకత్వ స్థితిని సాధించగలిగింది. కానీ కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటి ఉత్పత్తుల ఎగుమతుల టర్నోవర్లో కేవలం 2 శాతం ఉద్యోగకల్పనలో కేవలం 1.8 శాతం మాత్రమే లభ్యమయింది. కాబట్టి రాష్ట్ర ఆర్థికవ్యవస్థ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత, భవిష్య అవసరాలకు తగ్గట్లుగా ఉద్యోగకల్పనను ప్రేరేపించేవిధంగా కొత్త రాష్ట్రం ఎన్నో చర్యలను చేపట్టక తప్పదని రూఢి అయింది. అంతేకాక ఐటి రంగంలో ప్రత్యక్షంగా కల్పించబడే ప్రతి ఉద్యోగ అవకాశానికీ పరోక్షంగా నాలుగురెట్లు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయన్నది అందరికీ తెలిసిన సంగతే.

153. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2020 నాటికి సాధించవలసిన నిర్దిష్ట లక్ష్యాలతో ఇ-గవర్నన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి రంగాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిపథంలోకి తీసుకువెళ్లే విధంగా అందుకు అనుసరించవలసిన విధానాలను సూచిస్తూ, ప్రభుత్వం ఒక బ్లూప్రింట్ రూపొందించింది.

154. శాఖ ముందున్న ప్రధాన లక్ష్యాలు : ప్రస్తుతం ఐటి రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందినవారు 21,795 మాత్రమే కాగా, అదనంగా ఐటి రంగంలో ప్రత్యక్షంగా 5 లక్షల అదనపు ఉద్యోగాల కల్పన, సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల జాతీయ ఎగుమతిలో 5 శాతం వాటా సాధించడం, అంటే ప్రస్తుత రూ.1,622.20 కోట్ల విలువగల ఉత్పత్తుల ఎగుమతుల స్థానంలో రూ.43,000 వేల కోట్ల విలువ గల ఉత్పత్తుల ఎగుమతిని సాధించడం, ఐటి రంగంలో 2 బిలియన్ యుఎస్ డాలర్ల విలువగల పెట్టుబడులను ఆకర్షించడం, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో 5 బిలియన్ యుఎస్ డాలర్ల విలువగల పెట్టుబడులను ఆకర్షించడం, వస్తూత్పత్తి కేంద్రాలను అనుసంధాన పరిచే సిలికాన్ కారిడార్ ను ఏర్పరచడం, అన్ని గ్రామాలను గిగాబిట్‌తో అనుసంధాన పరచి, ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒక్క వ్యక్తినైనా డిజిటల్ అక్షరాస్యుడిగా రూపొందించి, రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా రూపొందించడం.

155. ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో సమన్వయ పద్దతిలో ఆశించిన ఫలితాలను రాబట్టడం కోసం 18 విధాన పత్రాలు/ఫ్రేమ్ వర్క్లు, మరియు ఇ-గవర్నమెంట్ మిషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి ప్రమోషన్ మిషన్ మరియు ఇన్నోవేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ మిషన్ అనే మూడు మిషన్లను కూడా నెలకొల్పడం జరుగుతున్నది.

156. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ను ఐటి/ఐటిఇఎస్/ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ రంగాలకు సంబంధించిన గమ్యస్థలంగా నలుగురూ కోరుకునే విధంగా రూపొందించడం కోసం ప్రభుత్వం వివిధ చర్యలను చేపట్టనున్నది. వాక్‌టు వర్క్ మరియు సైకిల్ టు వర్క్ పద్ధతిన మెగా ఐటి హబ్లను అభివృద్ధి పర్చడం ద్వారా అంతర్జాతీయ స్థాయి మౌలికసదుపాయాల కల్పన, ఐటి ఇన్వెస్టిమెంట్ రీజియన్ల ఏర్పాటు, ఎలక్ట్రానిక్ మానుఫాక్చరింగ్ క్లస్టర్లు, ఐటి టవర్లు, ఐటి పార్కులు, ఐటి లేఅవుట్లు మొదలైనవి నెలకొల్పడం అటువంటి చర్యల్లో భాగం. వ్యాపారాన్ని నెలకొల్పటానికి అవసరమైన కాలవ్యవధిని తగ్గించడం కోసం సమర్థవంతమైన సింగిల్ విండో వ్యవస్థ నెలకొల్పబడుతుంది. నిర్ణీత కాలవ్యవధిలో పారదర్శకంగా ఈ-బిజ్ ద్వారా వ్యాపార నిర్వహణ వ్యయం తగ్గించబడుతుంది. పారిశ్రామికరంగం తాలుకు భాగస్వామ్యంతో మానవవనరుల సామర్థ్యాన్ని పెంపొందించడం మీద, ఇన్నోవేషన్ మీద, స్టార్ట్ అప్‌ల మీద ప్రత్యేకశ్రద్ధ పెట్టబడుతుంది. ప్రస్తుతమున్న 'సమాచార సమాజాన్ని' 'విజ్ఞానసమాజం'గా మార్చడమే ఈ చర్యలన్నిటి తాలూకు అంతిమ ధ్యేయం. ఈ సందర్భంగా మన పూర్వ రాష్ట్రపతి డా. ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ గారి మాటలను గుర్తు చేస్తున్నాను.' మన ప్రగతి కోసం సామాజిక పరివర్తన, సుస్థిర అభివృద్ధి అత్యావశ్యకం. ఇవి రెండూ నిర్దిష్ట కాలపరిమితిలో సాధ్యం కావాలంటే విజ్ఞానసమాజాన్ని నిర్మించడం ఒక్కటే మార్గం. అదొక్కటే జాతిని సాధికారికం చేయగలుగుతుంది. '

157. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.111 కోట్లు ప్రతిపాదించడమైనది.

విపత్తుల నిర్వహణ

158. ఇటీవల ఆంధ్రప్రదేశ్ 5 ప్రకృతి వైపరీత్యాలను చవిచూసింది. అవి, ఫైలీన్ తుఫాను, భారీ వర్షాలు, వరదలు, 'హెలెన్', 'లెహెర్' తుఫానులు మరియు 2013-14 లో సంభవించిన అకాల భారీవర్షాలు. ఈ విపత్తుల ద్వారా వాటిల్లిన నష్టాన్ని పూరించడానికి గాను రూ.2,969 కోట్ల ఆర్థిక సహాయాన్ని కోరుతూ

భారతప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞాపనలు సమర్పించడం జరిగింది. ఇందుకుగాను భారతప్రభుత్వం రూ. 700 కోట్లు తక్షణ సహాయాన్ని అందిస్తూ, తక్కిన సహాయాన్ని విపత్తు వల్ల కల్గిన నష్టాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత అందిస్తామని తెలియజేసింది.

159. 2012 లో సంభవించిన దుర్భిక్షపరిస్థితులకు గాను, నీలం సైక్లోన్ వల్ల సంభవించిన విపత్తుకు గాను రూ. 1,464 కోట్ల మేరకు వ్యవసాయ, ఉద్యానవన పంటలకు ఇన్ పుట్ సబ్సిడీ 2013-14 లో విడుదల చేయడం జరిగింది. విపత్తుల వల్ల నష్టపడ్డ రైతులకు ఈ సబ్సిడీ నేరుగా అందడం కోసం ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేపట్టబడ్డాయి.

160. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.403 కోట్లు ప్రతిపాదించడమైనది.

శాంతిభద్రతలు

161. 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతోపాటు వివిధ సంస్థలకు నిర్వహించవలసి వచ్చిన ఎన్నికలను శాంతిభద్రతలకు విఘాతం లేకుండా నిర్వహించడం, ఫైలిన్, హెలెన్, లెహెర్ సైక్లోన్ల సందర్భంగా రెస్క్యూ కార్యక్రమాలు నిర్వహించడం, తమిళనాడు పోలీస్ వారి సహకారంతో చిత్తూరు జిల్లాలో అల్ఉమా సంస్థకు చెందిన ఉగ్రవాదులను అక్టోపస్ కమాండోలు అరెస్టు చేయడం, దేశంలోనే మొదటిసారిగా 21 కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన ఘనత సాధించడం మన శాంతిభద్రతల యంత్రాంగం ఇటీవల కాలంలో సాధించిన కొన్ని ముఖ్య విజయాలు.

162. ప్రజాసమస్యలకు సత్వరమే ప్రతిస్పందించి సమర్థవంతంగా పరిష్కరించడం కోసం డయల్ 100 కమాండ్ కంట్రోల్ సెంటర్ నెలకొల్పడం జరిగింది. కేంద్రం ప్రారంభించి ఇప్పటిదాకా 2.14 మిలియన్ కాల్స్‌ను స్వీకరించడం జరిగింది. వాటి పరిష్కారానికి సంబంధించిన సంతృప్తి 95 శాతం నమోదయ్యింది. ప్రజా సమస్యలను సన్నిహితంగా వినడం కోసం పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ సెంటర్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది.

163. విభజన తర్వాత రాష్ట్రంలో రూ. 683 కోట్ల అంచనా వ్యయంతో అత్యున్నత స్థాయి గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోసం, రూ. 412 కోట్ల అంచనా వ్యయంతో కర్నూలులో గ్రేహౌండ్స్ హబ్ ఏర్పాటు కోసం మరియు 6 ఏపిఎస్పి బెటాలియన్ల కోసం కేంద్రప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపడం జరిగింది.

164. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.3,739 కోట్లు ప్రతిపాదించడమైనది.

రెవిన్యూ

165. భూములకు సంబంధించిన రికార్డులను నిర్దిష్టంగానూ, సక్రమంగానూ నిర్వహించడం ద్వారా రెవిన్యూ శాఖ ప్రజలకూ, ముఖ్యంగా రైతులకు అమూల్యమైన సేవలు అందిస్తున్నది. ఇటీవలనే ఈ శాఖ భూమి రికార్డుల ను కంప్యూటరీకరించి 'మీ-సేవ' కేంద్రాల ద్వారా 68 రకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. రెవిన్యూ మరియు రిజిస్ట్రేషన్ రికార్డుల ను కూడా అనుసంధానపరచడానికి చర్యలు మొదలుపెట్టింది. అంతేకాక ఈ-పట్టాదార్ పాస్ పుస్తకాలను కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రభుత్వ భూములను గుర్తించి వాటి సవివరమైన జాబితాలు తయారుచేయడం కోసం సర్కార్ భూమి పేరిట ఒక కొత్త సాఫ్ట్ వేర్ ను ఉపయోగించడం మొదలుపెట్టింది. ఇప్పటిదాకా 17 లక్షల రికార్డులు నమోదు చేయబడ్డాయి. ప్రహరీ గోడలు మరియు ఇనుపకంచెలు ఏర్పాటుచేయడం ద్వారా ప్రభుత్వ భూముల్ని రక్షించడం కోసం 2013-14 లో రూ. 30 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.

166. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.1,177 కోట్లు ప్రతిపాదించడమైనది.

ఆర్థిక శాఖ

167. ప్రజాధన నిర్వహణలో సమర్థత, పారదర్శకత, జవాబుదారీ తనాలను నెలకొల్పడం కోసం, ఆర్థికశాఖ, కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సిఎఫ్ఎమ్ఎస్) ను రూపొందిస్తున్నది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సత్యమంతా ఒక్క చోటనే చూడగలగడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందులో అంతర్గతంగా సంబంధించిన వారందరికీ ఒకరితో ఒకరికి పూర్తిగా అనుసంధానం కలిగించడం, ఆర్థిక విషయాలతో సంబంధించిన బయటివారికి ఎలక్ట్రానిక్ సమాచారం అందించడం ఇందులో ముఖ్య అంశాలు. ఈ అప్లికేషన్ రూపకల్పన తుదిదశలోనూ, మరియు ప్రయోగదశలోనూ ఉన్నది.

168. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ-పేమెంట్ పద్దతి ద్వారా భూసేకరణ పరిహారాల చెల్లింపు, వనసంరక్షణ సమితులకు ఆన్లైన్ చెల్లింపు, పర్సనల్ డిపాజిట్ ఎకౌంట్ల నిర్వహణకు సాఫ్ట్ వేర్ రూపకల్పన, మరియు రాష్ట్రంలోని ట్రెజరీలలోనూ, పే అండ్ ఎకౌంట్ ఆఫీసుల్లోనూ బిల్ మానిటరింగ్ సిస్టమ్ మరియు ఈ-పేమెంట్ల వ్యవస్థాపన ప్రధానంగా చేపట్టబడుతున్నాయి.

169. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వబడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి అనువైన విధాన నిర్ణయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనున్నదని నేనీ సందర్భంగా తమ ద్వారా సభకు హామీ ఇస్తున్నాను.

2012-13 లెక్కలు 170. 2012-13 సంవత్సరానికి చెందిన తుది లెక్కల ప్రకారం రూ. 1,128 కోట్ల రెవిన్యూ మిగులు ఉండగా, రూ.17,508 కోట్లు ఆర్థికలోటు నమోదయింది. మొత్తం రాష్ట్ర స్థూలఉత్పత్తిలో 2.32 శాతం అయిన ఈ లోటు ఎఫ్ఆర్టిఎమ్ చట్ట పరిధి దాటలేదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.

2013-14 సంవత్సరానికి సవరించిన అంచనాలు

171. 2013-14 సంవత్సరపు సవరించిన అంచనాల లావాదేవీలనుబట్టి రూ.1023 కోట్ల రెవిన్యూ మిగులు సూచిస్తున్నది. ద్రవ్యలోటు రూ.24,487 కోట్లుగా అంచనా వేయడమయింది. ఇది జి.ఎస్. డి.పి.లో 2.87 శాతం.

2014-15 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు

172. 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం రూ.1,11,824 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నది. అందులో రూ.85,151 కోట్లు ప్రణాళికేతర వ్యయంగా, రూ.26,673 కోట్లు ప్రణాళికావ్యయంగా అంచనా వేయబడింది. రెవిన్యూ లోటు రూ.6,064 కోట్లుగా మరియు ఆర్థికలోటు రూ.12,064 కోట్లుగానూ అంచనా వేయబడింది. స్థూల జాతీయ ఉత్పత్తిలో ఆర్థిక లోటు 2.30 శాతం కాగా రెవెన్యూ లోటు 1.16 శాతం. ఈ అంచనాలలో అవిభక్త రాష్ట్రానికి సంబంధించిన 2 నెలల ఆదాయ వ్యయాలు, రాష్ట్ర విభజనను పునస్కరించుకొని కేంద్రప్రభుత్వం నుండి అదనంగా వస్తాయని భావిస్తున్న 14,500 కోట్ల రూపాయలు ఇమిడివున్నాయి. వీటిని మినహాయిస్తే ఆర్థిక అంశాలపై ప్రకటించిన శ్వేతపత్రంలో పేర్కొన్న విధంగా, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం శేష రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.25,574 కోట్లు, ద్రవ్య లోటు రూ.37,910 కోట్లుగా ఉంటాయి. ఇవి జి.ఎస్.డి.పి.లో వరుసగా 4. 84 మరియు 7.18 శాతం.

173. ఈ రానున్న సంవత్సర కాలంలో ముందంజ వేయడానికి వీలుగా కొత్త రాష్ట్రాన్ని సువ్యవస్థితంగా నిర్మించే ప్రక్రియకు 2014-15 బడ్జెట్ శ్రీకారం చుట్టనున్నదని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. ఆర్థిక వృద్ధి సాధనలో భాగస్వాము లందరికీసమానావకాశాలు కల్పించే మరియు సమాజం లోని అన్ని వర్గాల వారికీ ముఖ్యంగా బలహీన వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందించే సమ్మిళిత వృద్ధి సాధనే మాధ్యేయం. ఈ సందర్భంగా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పలుకులను ప్రస్తావిస్తున్నాను. "ఒకానొక రోజు ప్రతిలోయ పైకెత్తబడుతుంది, ప్రతి పర్వతం క్రిందకు దిగుతుంది, ఎగుడుదిగుళ్ళు చదునవుతాయి, వంకర నేలలు తిన్నగా మారుతాయి - అన్నది నాస్వప్నం." పైలక్ష్యాలను చేరుకోవడానికీ, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడానికీ మా ప్రభుత్వం నిరంతరాయంగా, అవిశ్రాంతంగా శ్రమించడానికి కృత నిశ్చయంతో ఉంది చివరగా రాబర్ట్ ఫ్రాస్ట్ యొక్క ఈ పద్య పాదంతో ముగిస్తున్నాను.

విశ్రమించడానికి ముందు పయనించాల్సిన దూరం ఎన్నో మైళ్ళు

విశ్రమించడానికి ముందు పయనించాల్సిన దూరం ఎన్నో మైళ్ళు

174. ఈ బడ్జెట్‌ను సభవారి ఆమోదం కోసం సమర్పిస్తున్నాను.


జై హింద్ !

This work is available under the Creative Commons CC0 1.0 Universal Public Domain Dedication.

The person or the organisation responsible for this work, associated with this deed has dedicated the work to the public domain by waiving all of his or her rights to the work worldwide under copyright law, including all related and neighboring rights, to the extent allowed by law. You can copy, modify, distribute and perform the work, even for commercial purposes, all without asking permission.