ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25

వికీసోర్స్ నుండి

2024-25 ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్

శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్

గౌరవనీయ ఆర్థిక శాఖామాత్యుల వారి ప్రసంగం

ఫిబ్రవరి 07, 2024


గౌరవనీయ అధ్యక్షా!

మీ అనుమతితో, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ను ఈ గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను.


2. గత ఐదేళ్లుగా మన రాష్ట్ర బడ్జెట్ లను సమర్పించే అవకాశం నాకు దక్కిన అపూర్వ గౌరవంగా భావిస్తున్నాను.

3. ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు మేము పొందుతున్న సంతోషకరమైన అనుభూతిని మహాత్మా గాంధీ గారి ఈ క్రింది మాటల ద్వారా తెలియజేస్తున్నాను.

"మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గం,
ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం."

4. ఐదేళ్ల క్రితం, నా మొదటి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నప్పుడు, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు, మా మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారని చెప్పాను. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు తన 3,648 కి.మీ పాదయాత్ర సమయంలో సమాజంలోని అన్ని వర్గాల నుండి, ముఖ్యంగా పేద, బడుగు మరియు బలహీన వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకున్న సందర్భంలో గమనించిన అంశాల యొక్క ఫలితం. మా మ్యానిఫెస్టోలోని హామీలన్నింటినీ రాజకీయాలకు అతీతంగా, ప్రజలందరికీ నూటికి నూరు శాతం అందించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పట్టుదల మమ్మల్ని ఉత్తేజ పరిచింది.

సమాజంలో ఎవ్వరినీ వదలివేయకుండా
అత్యంత బలహీనమైన వారికి ప్రాధాన్యతను ఇచ్చుటలో
స్వర్గీయ డా॥ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి నిబద్ధత మా పాలనను ప్రతిబింబిస్తుంది.

5. అబ్రహం లింకన్ మాటలలో ప్రజాస్వామ్యం అంటే...

“ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు”

6. మన దేశ ప్రజాస్వామ్యంలో ఈ సూక్తి పొందుపరచబడినది. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, ప్రజాస్వామ్యానికి మరియు న్యాయానికి మూలస్తంభాలుగా భావించిన మన భారత రాజ్యాంగ పితామహుడు డా॥ బి.ఆర్. అంబేద్కర్ గారికి భారత ప్రజాస్వామ్యం చాలా రుణపడి ఉంది. మన రాజ్యాంగ నిర్మాత మరియు దార్శనికులైన వీరికి నివాళులు అర్పిస్తూ, మా ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహం - 'స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్' ను ఏర్పాటు చేసింది. ఆయన ఆశయాలు మా ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

మా ప్రభుత్వం ఈ ఇద్దరి దార్శనికుల ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువచ్చింది. మా ప్రభుత్వం ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వమని నిరూపించింది. అసమానతలను రూపుమాపడం, వెనుకబడిన వర్గాల వారికి రక్షణ మరియు సాధికారతను ఇవ్వడం; నాణ్యమైన విద్య, పోషణ, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టడానికి ఆర్థిక సహాయం చేయడం లాంటివి మా ప్రభుత్వ నైతిక బాధ్యతగా భావిస్తోంది. సుస్థిరమైన అభివృద్ధికి ఇవన్నీ అత్యంత ముఖ్యమైన సూచికలు అని మా ప్రభుత్వం నమ్ముతుంది.

7. మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం, సేవా స్ఫూర్తి మరియు మార్గదర్శకత్వంతో మా ప్రభుత్వం అడుగడుగునా ప్రేరణ పొంది, వాగ్ధానాల అమలులో మరియు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సఫలీకృతం అయ్యింది. గౌరవ ముఖ్యమంత్రిగారు ప్రజల సంక్షేమం పట్ల

ప్రదర్శించిన అంకితభావం మరియు బాధ్యత, 2000 సంవత్సరాల క్రితం అర్థశాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు చెప్పిన సూత్రాలను ప్రతిబింబింపచేస్తున్నాయి.

“యః ప్రజాః సుఖే సుఖినోస్తరా రామాః, తదర్థ స్వార్థేషు పరేషు నియంతారః”
అంటే పాలకుడు అనే వాడు తన ప్రజల ఆనందాన్ని మరియు శ్రేయస్సును తన సొంత
ఆనందం మరియు శ్రేయస్సుగా భావించేవాడు.


8. విభజన అనంతరం ఏర్పడిన ప్రతికూల పరిస్థితులలో కూడా అత్యంత ప్రగతిశీల రాష్ట్రాలలో మన రాష్ట్రం తన స్థానాన్ని తిరిగి సాధించడానికి ఎంత కష్టమైనా సరే, ఏ సవాలునైనా అధిగమిస్తూ అవకాశాలను అందిపుచ్చుకోగలదని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృఢ విశ్వాసం.

వినూత్న పరిపాలనా ఆవిష్కరణలు:

9. రాష్ట్ర విభజన తరువాత, జటిలమైన విభజన సమస్యలతో మరియు నష్టాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ, ఉన్నత ఆశయాలతో మరియు నూతన శక్తితో రాష్ట్రాన్ని పునర్ నిర్మించు కోవడానికి మా ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది.

10. మన రాష్ట్ర సమస్యలను అధిగమించాలంటే పాత మరియు మూస పద్ధతులలో కాకుండా, ఒక సరికొత్త విధానంతో మాత్రమే అభివృద్ధిని సాధించగలమని గౌరవ ముఖ్యమంత్రిగారు తాను చేసిన సుదీర్ఘ పాదయాత్ర అనుభవంతో తెలుసుకొన్నారు.

11. దీనికి అనుగుణంగా, అనేక మార్గ నిర్దేశక కార్యక్రమాలతో మా ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా, ప్రజల జీవితాలలో వెలుగు నింపుతోంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు, మ్యానిఫెస్టోలోని ఇతర పథకాలు మరియు అమలు చేస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన ఫలితాలను అందించటం వలన, ప్రపంచ వ్యాప్త మేధావులచే కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి. కొత్త ఆలోచనలను, ఆవిష్కరణలను మరియు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధానాలను కనీ వినీ ఎరుగని రీతిలో అమలు పరచడం వలన తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాలలో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది. ప్రముఖ ఆర్థిక వేత్త జె.యమ్. కీన్స్ మాటలలో…

"ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే,
ఇతరులు ఇప్పటికే చేస్తున్న పనులు చెయ్యడం, లేదా
అవే పనులు కొంచం మెరుగ్గా లేదా అధ్వాన్నంగా చెయ్యడం కాదు,
కానీ ఇప్పటి వరకు అసలు ఎవ్వరు చేయని పనులు చెయ్యడం.”

12. మా ప్రభుత్వం యొక్క కొన్ని ముఖ్యమైన వినూత్న కార్యక్రమాల ప్రభావము మరియు వాటి సత్ఫలితాలను గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

I. సుపరిపాలిత ఆంధ్ర

పాలనా వికేంద్రీకరణ - గడప వద్దకే ప్రభుత్వం

13. ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. వీటిని ప్రజల చెంతకు తీసుకు వెళ్ళే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచీ ప్రభుత్వాన్ని పటిష్టపరచడం, విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం మరియు సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారితను అందించడం జరిగింది.

14. పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు మరియు పోలీస్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా, స్థానిక సంస్థలను బలోపేతం చేయడమైనది. కమ్యూనిటీ కాంట్రాక్టుల విధానము, స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని మరియు యాజమాన్య భావాన్ని ప్రోత్సహించి, చిట్ట చివరి స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచింది.

15. దాదాపు 1 లక్ష 35 వేల మంది ఉద్యోగులతో 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం, 2 లక్షల 66 వేల మంది వాలంటీర్ల నియామకం చేయడం ద్వారా సకాలంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు మరియు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందించగలుగుతున్నాము.

16. అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుండి 26 కు, రెవెన్యూ డివిజన్లను 52 నుండి 77 కి పెంచడం ద్వారా మా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్ నిర్మాణాన్ని చేపట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన 25 రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటి. ఇది ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడంతోపాటు, ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా మరియు సమర్థవంతంగా చేసింది. నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేస్తాయి.

17. పౌరుల రక్షణ మరియు భద్రతను పెంపొందించడానికి, మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణలో భాగంగా అవసరమైన చోట కొత్త పోలీసు సబ్ డివిజన్లను మరియు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఉదాహరణకు, కుప్పం పోలీస్ సబ్-డివిజన్ ను ఆరు పోలీసు స్టేషన్ల పరిధితో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయటమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన 20 ముఖ్య ప్రాంతాలలో పర్యాటక పోలీసు స్టేషన్లు ప్రారంభించబడ్డాయి. భద్రతా మౌలిక సదుపాయాలు పెంచటం ద్వారా ప్రజా భద్రత మరింత మెరుగుపడింది.

18. గడప గడపకు మన ప్రభుత్వము అనే కార్యక్రమం ద్వారా ప్రజా ప్రతినిధులు పౌరుల నుండి నేరుగా ప్రాథమిక సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల అవసరాలను తెలుసుకొని వాటిని సమకూర్చడం ద్వారా, బాధ్యతాయుతమైన పాలనను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన 58,288 పనులను 2,356 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంజూరు చేయగా, ఇప్పటివరకు 729 కోట్ల రూపాయలతో 17,239 పనులు పూర్తయ్యాయి.

19. రాష్ట్రంలో భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా, స్థానిక సంస్థలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం నాల్గవ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించి, ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది.

II. సామర్థ్య ఆంధ్ర

పరిపూర్ణ మానవ అభివృద్ధి - పౌరులపై పెట్టుబడి

ఐక్య రాజ్య సమితి మాజీ అధ్యక్షులు - కోఫీ అన్నన్ గారి మాటలలో...

“జ్ఞానం అనేది శక్తి. సమాచారం అనేది స్వేచ్ఛ.
విద్య అనేది ప్రతి సమాజంలో, ప్రతి కుటుంబంలో పురోగతికి పునాది.”

20. ఏ దేశానికైనా పౌరులే ఎనలేని సంపద. రాష్ట్ర వృద్ధికి, ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా పౌరుల సామర్థ్యాలను అభివృద్ధి చేయటం ప్రభుత్వాల యొక్క ముఖ్యమైన కర్తవ్యం. ఈ దృష్టితో, మా ప్రభుత్వం గత ఐదేళ్లలో మానవ మూలధన అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.

21. మానవ వనరుల అభివృద్ధిపై పెట్టే పెట్టుబడి మారుతున్న కాలానికి అనుగుణంగా కలిగే ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడగలిగే శక్తి సామర్థ్యాలను పెంపొందించి, సమ్మిళిత వృద్ధిని సాధించటానికి దోహదపడుతుంది. అందరికీ సమాన అవకాశాలను అందించే సమాజ నిర్మాణం అసాధ్యం కాదని, నిజానికి సుసాధ్యమేనని నిరూపించడానికి మా ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, నైపుణ్యాల సమ్మేళనం ద్వారా నిరంతరం కృషి చేస్తున్నది.

22. మన పిల్లలను ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేయడానికి, మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమ విద్యను ప్రవేశపెట్టింది. మన రాష్ట్రంలో ఉన్న 1000 పాఠశాలలలో చదువుకునే 4,39,595 మంది విద్యార్థులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సి.బి.ఎస్.ఈ.) పరిధిలోనికి తీసుకువచ్చాము. అంతేగాక అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో ఇంటర్నేషనల్ బాకలారియాట్ (IB) పాఠ్య ప్రణాళిక క్రిందకు ప్రవేశ పెట్టాలని, ప్రతి ఒక్క విద్యార్థికీ TOEFL ధృవీకరణ పత్రాన్ని అందించాలని మా ప్రభుత్వం చిత్త శుద్దితో కృషి చేస్తోంది.

23. వినూత్న పద్ధతుల ద్వారా విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడానికి, అన్ని పాఠశాలలలో 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ లను మా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకువచ్చింది. స్వీయ అభ్యాసనను ప్రోత్సహించడానికి పాఠ్య అంశాలతో కూడిన 9,52,925 ట్యాబ్ లను ఉచితంగా విద్యార్థులకు అందించాము. దీని వలన తరగతి గదిలో బోధన మరియు అభ్యాసన ఫలితాలు అద్భుతంగా మెరుగవ్వడం ద్వారా, 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు 34 లక్షల 30 వేల మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు.

24. నూతన విద్యా విధానం 2020 కి అనుగుణంగా 14,255 అంగన్వాడీ కేంద్రాలు సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి, మరియు 4,470 ప్రాధమిక పాఠశాలలు సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి. ఈ విధానం ద్వారా బోధనా నాణ్యత మెరుగుపడి పిల్లలకు అర్హత కలిగిన సబ్జెక్ట్ ఉపాధ్యాయులను చేరువ చేయగలిగాము.

25. మా ప్రభుత్వం జగనన్న విద్యా కానుక ద్వారా ఏటా దాదాపు 47 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే విధంగా 3,367 కోట్ల రూపాయల ఖర్చుతో యూనిఫామ్లు, బ్యాగ్లు, బూట్లు, పాఠ్యపుస్తకాలు మొదలైన వాటితో కూడిన పాఠశాల-కిట్లను అందించింది. 55,607 అంగన్వాడీ కేంద్రాలకు యాక్టివిటీ ఆధారిత అభ్యాసానికి సంబంధించిన 26 అంశాలతో కూడిన ప్రీ-స్కూల్ కిట్లు పంపిణీ చేయబడ్డాయి.

26. మన బడి-నాడు నేడు పథకం 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు మరియు జూనియర్ కళాశాలలలో అభ్యసించే వాతావరణాన్ని మెరుగుపరిచింది. ఫర్నీచర్, త్రాగునీరు, మెరుగైన పారిశుధ్యం వంటి చక్కటి సౌకర్యాలతో కూడిన తరగతి గదులతో 15,715 పాఠశాలలు ఈ పథకం మొదటి దశ క్రింద పూర్తయ్యాయి. రెండవ దశ క్రింద 22,344 పాఠశాలలలో ఇప్పటి వరకు 7,163 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఈ పథకం వలన 99.81 శాతం పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలను అందించగలిగాము.

27. 43 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులకు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మధ్యాహ్న భోజనం పునరుద్ధరించబడింది. ఈ పథకం క్రింద ఏడాదికి 1,910 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్లు ఎక్కువ. పోషకాహార లోపం మరియు రక్తహీనతను పరిష్కరించేందుకు 77 గిరిజన మండలాలలో వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని, ఇతర ప్రాంతాలలో వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ పథకాన్ని, అమలు చేసాము. ఈ పథకం ద్వారా 35 లక్షల 71 వేల మంది మహిళలు మరియు పిల్లలు ప్రయోజనం పొందుతున్నారు. 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసులో ఉండి రక్త హీనతతో బాధపడుతున్న గర్భిణుల శాతం 2019 నాటికి 53.71 శాతం కాగా, 2023 నాటికి అది 24.66 శాతానికి తగ్గింది. అలాగే, ఎదుగుదల లోపాన్ని ఎదుర్కొంటున్న పిల్లల శాతం 2019 నాటికి 31.2 శాతం కాగా, 2023 నాటికి అది 6.84 శాతానికి తగ్గింది.

ఉన్నత విద్య

ప్రముఖ ఆర్థిక వేత్త శ్రీ అమర్త్య సేన్ మాటలలో...

"విద్య మనల్ని మనుషులుగా చేస్తుంది. మన ఆర్థిక అభివృద్ధిని, సామాజిక సమానత్వాన్ని,
లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. మన జీవితాలను అన్ని రకాలుగా మార్చే సామర్థ్యం
విద్య మరియు భద్రతలకు వున్నాయి”

28. మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే పరిగణిస్తారు. అర్హులైన విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందించే పూర్తి బాధ్యతను వహిస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే.

29. జగనన్న విద్యా దీవెన ద్వారా 11,901 కోట్ల రూపాయలు మరియు జగనన్న వసతి దీవెన ద్వారా 4,276 కోట్ల రూపాయలు ఖర్చు చేయటం వలన, ఇప్పటి వరకు 52 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఉన్నత విద్యలో డ్రాప్ అవుట్ శాతం 2018-19 సంవత్సరంలో 20.37 శాతం కాగా, 2022-23 సంవత్సరంలో 6.62 శాతం కి గణనీయంగా తగ్గింది. మధ్యలోనే చదువు ఆపేస్తున్న విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గటానికి పై రెండు పథకాలు సమర్థవంతంగా అమలు చేయడమే కారణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

30. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన 50 విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించటం కోసం, ఎంపిక కాబడిన ప్రతీ పేద విద్యార్థికి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం క్రింద 1 కోటి 25 లక్షల రూపాయల ఖర్చు వరకు ప్రభుత్వమే బాధ్యతను తీసుకుంటుంది. ఇప్పటి వరకు షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతుల మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 1,858 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు.

31. రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షా 95 వేల కంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు స్వల్పకాలిక ఇంటర్న్ షిప్ ను పూర్తి చేయగా, వీరిలో చాలా మంది మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, AWS, పాలో ఆల్టో, బ్లూ ప్రిజం మొదలగు బహుళ జాతి కంపెనీలలో ప్రస్తుతం పని చేస్తున్నారు.

32. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో వైద్య మరియు దంత వైద్య కోర్సులలో 50 శాతం కోటాను, మిగతా అన్ని కోర్సులలో 35 శాతం కోటాను ప్రభుత్వ కోటాగా మా ప్రభుత్వం కేటాయించింది. దీని ఫలితంగా, 2,118 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో చేరగలుగుతున్నారు.

ఆరోగ్య సంరక్షణ

పురాతన రోమన్ సామెత ప్రకారం...

"సాలస్ పాపులి సుప్రీమ లెక్స్ ఎస్టో" అంటే,
"ప్రజల ఆరోగ్యమే అత్యున్నత చట్టం"

33. రాష్ట్ర ప్రజలందరికి ఆరోగ్య సంరక్షణా సేవలను సమర్ధవంతంగా అందించటంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు కీలక పాత్రను పోషిస్తాయి. ఆరోగ్య రంగంలో నాడు-నేడు పథకాన్ని అమలు చేయటం ద్వారా మా ప్రభుత్వం ఉప ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకుని భోధనా ఆసుపత్రులు వరకు 16,852 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాము. అంతే కాక 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్విరామంగా రోజుకు రెండు షిఫ్ట్ లతో పనిచేసేలా పునరుద్ధరించబడ్డాయి.

34. ప్రజలకు వారి ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ డాక్టరు అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2,284 మంది వైద్యులతో, 14 రకాల వైద్య పరీక్షలను, 105 రకాల మందులను ప్రజలకు అందుబాటులోనికి తీసుకుని రావటం జరిగింది.

35. ఫ్యామిలీ డాక్టరు సేవలతో పాటు, మండలానికి కనీసం ఒక యూనిట్ చొప్పున 108–అంబులెన్స్ సర్వీసులను మరియు 104-సంచార ఆరోగ్య వాహన బృందాలను ఏర్పాటు చేయటం జరిగింది.

36. డా॥ వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఆలోచనతో కుటుంబ ఆదాయ అర్హత పరిమితి 2 లక్షల 50 వేల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు పెంచడం, సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు నగదు రహిత వైద్య సేవలను అందించడం జరుగుతుంది. క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధులకు ఎటువంటి పరిమితి లేకుండా ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నాం. అలాగే ఆరోగ్యశ్రీ పరిధిని 1,059 వ్యాధుల సంఖ్య నుండి 3,257 వ్యాధులకు పెంచుతూ, హైదరాబాదు, చెన్నై మరియు బెంగళూరు వంటి నగరాలకు కూడా విస్తరించడం జరిగింది. ఈ విస్తరణ వలన 2014-19 మధ్యకాలంలో 13 లక్షల 82 వేల మంది ఈ పథకం క్రింద లబ్ధిపొందగా, 2019-23 మధ్య కాలానికి వారి సంఖ్య 35 లక్షల 91 వేలకు పెరిగింది. అంతేకాకుండా కిడ్నీ రోగులకు కార్పోరేట్ స్థాయి చికిత్సను ఉచితంగా అందించడానికి 200 పడకల డా॥ వై.ఎస్.ఆర్. కిడ్నీ రీసర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, పలాసలో స్థాపించబడింది.

37. డాక్టర్ వై.ఎస్.ఆర్. ఆరోగ్య ఆసరా పథకం క్రింద శస్త్రచికిత్స అనంతర జీవనోపాధి భత్యంగా రోజుకు 225 రూపాయలు అందించబడుతుంది. డిసెంబర్ 2019 నుండి ఈ పథకం క్రింద 25 లక్షల మంది రోగులకుగాను 1,366 కోట్ల రూపాయలు అందించాము.

38. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా 10,574 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించి రాష్ట్రంలోని 1 కోటి 67 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు మరియు మందులు అందించడం జరిగింది.

39. నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులలో స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల ఖాళీలు సగటు 61 శాతం ఉండగా, మా ప్రభుత్వం దానిని 4 శాతం కంటే తక్కువకు తగ్గించి, దేశంలోనే గుర్తించ దగిన ఘనతను సాధించింది.

నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ

19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఆంగ్ల రచయిత మరియు తత్వవేత్త అయిన జాన్ రస్కిన్ మాటలలో...

"నైపుణ్యం అనేది ఏకీకృత శక్తితో కూడిన
అనుభవం, బుద్ధి మరియు ఆసక్తిల సమ్మేళనం”

40. పరిశ్రమల అవసరాలకు సరిపోయే విధంగా స్థిరమైన వృద్ధిని సాధించేందుకు మన రాష్ట్ర యువతను సంబంధిత నైపుణ్యాలతో శక్తివంతం చేయడానికి మా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కట్టుబడి ఉంది. పటిష్టమైన పరిశ్రమ భాగస్వామ్యాలు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు మా ప్రభుత్వం కల్పించగలిగింది. విభిన్న నైపుణ్య అవసరాలను తీర్చడం కోసం నైపుణ్య విశ్వ విద్యాలయము, కళాశాలలు మరియు హబ్ లతో కూడిన క్యాస్కేడింగ్ స్కిల్ ఎకో సిస్టమ్ ద్వారా అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది. ఇప్పటివరకు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హబ్ లు మరియు పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 27 స్కిల్ కాలేజీలు స్థాపించటం ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరము లో 21 రంగాలలో లక్షా 6 వేల మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా వీరిలో 95 శాతం మంది ఉద్యోగ అవకాశాలు పొందారు. 41. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలలో వర్చువల్ ల్యాబ్ లు మరియు క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేయడంతో పాటు, 14 పారిశ్రామిక శిక్షణా కేంద్రాలలో కియా మోటార్స్, మారుతీ, టయోటా, ఇసుజు, హిటాచీ, సామ్సంగ్ మొదలైన సంస్థల సహాయంతో అధునాతన యంత్రాలు మరియు యంత్ర పరికరాలతో ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నాము.

III. మన మహిళా మహారాణుల ఆంధ్ర

మహిళా సాధికారత - నారీ శక్తి


డా॥ బి.ఆర్. అంబేద్కర్ గారి మాటలలో...

“ఒక సమాజం యొక్క పురోగతిని,
ఆ సమాజం యొక్క మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను”

42. జనాభాలో సగం మంది సంక్షేమం మరియు సాధికారితకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీనిని గుర్తించి మా ప్రభుత్వం మహిళల సాధికారతపై దృష్టిసారించి భారీ స్థాయిలో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వాములుగా చేయడం ద్వారా వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. దీనిద్వారా ఆర్థిక అడ్డంకులను తొలగించుకొని విస్తృత ప్రయోజనాలు పొంది సాధికారత సాధిస్తున్నారు.

43. మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం, రక్షణ మరియు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించేందుకు, 2021-22 ఆర్థిక సంవత్సరము నుండి జెండర్ మరియు చైల్డ్ బడ్జెట్ లను ప్రవేశపెట్టడం జరిగింది.

44. సమాజములో సమానత్వం సాధించడానికి అవరోధంగా ఉన్న పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో, జగనన్న అమ్మ ఒడి పథకమును ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను కల్పించాము. దీని క్రింద 43 లక్షల 61 వేల మంది మహిళా మహారాణులకు 26,067 కోట్ల రూపాయలు అందించాము. ఈ పథకం వలన 1 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. దీని ఫలితంగా, ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్ధుల నికర నమోదు నిష్పత్తి 2019 సంవత్సరములో 87.80 శాతము ఉండగా, 2023 వ సంవత్సరము నాటికి 98.73 శాతమునకు పెరిగింది. ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019 సంవత్సరములో 46.88 శాతము ఉండగా 2023 సంవత్సరము నాటికి 79.69 కి పెరిగింది.

45. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సరైన మద్దతు ఇవ్వడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందడం వలన వీరు అప్పుల ఊబిలో కూరుకొని ఆర్థిక పతనావస్థకు చేరుకున్నారు. మా ప్రభుత్వం మానిఫెస్టోలోని వాగ్దానానికి కట్టుబడి ఏప్రిల్ 11, 2019 సంవత్సరము నాటికి ఉన్న స్వయం సహాయక బృందాల యొక్క బకాయిలను తిరిగి చెల్లించడానికి వై.ఎస్.ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేసింది. 2019 సంవత్సరము నుండి, 7 లక్షల 98 వేల స్వయం సహాయక సంఘాలలోని 78 లక్షల 94 వేల మంది మహిళా మహారాణులకు ఉపశమనం కల్పిస్తూ వై.ఎస్.ఆర్. ఆసరా క్రింద 25,571 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది.

46. మా ప్రభుత్వం వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పథకము క్రింద గత ప్రభుత్వ హయాంలో మనుగడ కోల్పోయిన స్వయం సహాయక బృందాలను క్రియా శీలం చేయటానికి మహిళా మహారాణులకు 4,969 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. ఫలితంగా, 18.36 శాతముగా ఉన్న మొండి బకాయిలు గణనీయముగా తగ్గి దేశంలోనే అతి తక్కువ స్థాయి అయిన 0.17 శాతానికి చేరాయి.

47. వై.ఎస్.ఆర్. చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళా మహారాణులకు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు మరియు వారి జీవనోపాధికి భద్రత కల్పించటానికి 14,129 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది.

48. జగనన్న పాల వెల్లువ పథకం క్రింద, 3 లక్షల 60 వేల మంది మహిళా మహారాణులకు డెయిరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు వీలుగా 2,697 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది.

49. స్త్రీల మరియు పిల్లల భద్రతను పెంపొందించడం కోసం, దిశా మొబైల్ యాప్ ను, దిశా పెట్రోల్ వాహనాలను మరియు 26 దిశా పోలీస్ స్టేషన్ లను ప్రారంభించాము. కోటికి పైగా వినియోగదారులు దిశా మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొన్నారు.

IV. అన్నపూర్ణ ఆంధ్ర

ప్రతిఫల మరియు సుస్థిర వ్యవసాయం - రైతే రాజు

డి.డి. ఐజన్ హోవర్ మాటలలో...

"మీరు మొక్క జొన్న చేనుకు వేల మైళ్ళ దూరంలో ఉండి
మీ చేతిలో ఉన్న పెన్సిల్ను నాగలిగా భావిస్తే
వ్యవసాయం చాలా సులభంగా కనిపిస్తుంది.”

రైతన్నకు జేజేలు!

50. రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి, వ్యవసాయ రంగములో గణనీయమైన ఉత్పత్తిని సాధించి, రైతుల ఆదాయాన్ని పెంచి వారి జీవనప్రమాణ స్థాయిలను మెరుగుపరచడానికి మా ప్రభుత్వము ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది. దీనిలో భాగముగా ధరల స్థిరీకరణ నిధి, పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ మొదలైన చర్యల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించి, వ్యవసాయానికి స్థిరమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం జరిగింది.

51. మా ప్రభుత్వము 2019 సంవత్సరము నుండి, డా॥ వై.ఎస్.ఆర్. రైతు భరోసా - పి.ఎం. కిసాన్ పథకము క్రింద ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా 1 లక్ష 60 వేల కౌలుదారులు మరియు 93 వేల అటవీ భూముల సాగు రైతులతో సహా మొత్తం 53 లక్షల 53 వేల మంది రైతుల ఖాతాలకు 33,300 కోట్ల రూపాయలను జమ చేసింది. కౌలు రైతులు మరియు అటవీ భూముల సాగుదారులకు 13,500 రూపాయల ఆర్థిక సహాయన్ని పూర్తిగా మా ప్రభుత్వమే అందిస్తోంది.

52. డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉచిత పంటల బీమా క్రింద, మా ప్రభుత్వం 54 లక్షల 55 వేల మంది రైతుల ఖాతాలకు 7,802 కోట్ల రూపాయల బీమా మొత్తాన్ని అందించగా, గత ప్రభుత్వం కేవలం 30 లక్షల 85 వేల మంది రైతులకు 3,411 కోట్ల రూపాయలను మాత్రమే అందించింది.

53. మా ప్రభుత్వము డాక్టర్ వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల క్రింద, 2019 సంవత్సరము ఖరీఫ్ కాలము నుండి, గత ప్రభుత్వ బకాయిలతో సహా 73 లక్షల 88 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు 1,835 కోట్ల రూపాయలను జమ చేసింది.

54. రైతులకు వారి ఇంటి వద్దకే సేవలను అందించడానికి 10,778 డా॥ వై.ఎస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్లుగా స్థాపించబడ్డాయి. ఇవి ఆదర్శవంతముగా పని చేస్తూ ఇతరులు కూడా అనుసరించడానికి మార్గదర్శకముగా ఉన్నాయని నీతి ఆయోగ్ చే ప్రశంసించబడ్డాయి.

55. మా ప్రభుత్వము 19 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కోతలు లేని రోజువారీ 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్ సదుపాయము కల్పించింది. 2019 సంవత్సరము నుండి ఇప్పటివరకు ఉచిత వ్యవసాయ విద్యుత్ పై 37,374 కోట్ల రూపాయల సబ్సిడీని అందించింది. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించే రైతుల కోసము 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాము. మా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ క్రింద పంట నష్టపోయిన 22 లక్షల 85 వేల మంది రైతులకు తక్షణ సాయంగా 1,977 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అందించింది. మరో 1200 కోట్ల రూపాయలను ఈ నెలలో అందించబోతున్నాము.

56. మా ప్రభుత్వము,127 కొత్త డాక్టర్ వై.ఎస్.ఆర్. వ్యవసాయ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా పంటకోత అనంతర మౌలిక సదుపాయాలను కల్పించారు. వై.ఎస్.ఆర్. యంత్ర సేవా పథకం క్రింద వ్యవసాయ యంత్రాలను అందజేయటమే కాకుండా రైతులు మరియు గ్రామ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణను అందించారు. వ్యవసాయ సమగ్ర వ్యూహంలో భాగముగా రైతులకు వ్యవసాయ రుణ సదుపాయము, పంటల బీమా, పంటసాగు నిర్వహణ, మార్కెటింగ్ మరియు సరసమైన ధరలను కల్పించడము వంటి సమగ్ర కార్యక్రమాల ద్వారా మా ప్రభుత్వం వ్యవసాయాన్ని మునుపెన్నడూ లేని విధంగా లాభసాటిగా మారుస్తోంది.

ఉద్యాన వన రంగము

57. మా ప్రభుత్వం ఉద్యానవన రంగంలోని 17 లక్షల 27 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధముగా వివిధ పథకాల ద్వారా 4,363 కోట్ల రూపాయలను అందించింది. ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేయడానికి, 2,356 మంది గ్రామస్థాయి ఉద్యానవన సహాయకులను రైతు భరోసా కేంద్రాలలో నియమించాము. రైతులు తాము పండించిన పంటలను గిట్టుబాటు ధరకు అమ్ముకొనేదాకా పంటను నిల్వ చేసుకోవటానికి తద్వారా, పంట అనంతర నష్టాలను నివారించడానికి 2 లక్షల 44 వేల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యంతో 462 వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, 84 సౌర శీతల గిడ్డంగులు, 2,905 ప్యాక్ హౌస్ లను ఏర్పాటు చేయటమైనది.

పశుసంవర్ధక, పాడి మరియు మత్స్య పరిశ్రమ అభివృద్ధి

58. జగనన్న పాల వెల్లువ పథకము పాడి రైతులకు లీటరుకు 5 రూపాయల నుండి 20 రూపాయల వరకు అధిక ధరలను పొందేందుకు సహాయపడింది. అమూల్ సంస్థ సహకారంతో 385 కోట్ల రూపాయల పెట్టుబడితో చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ చర్యలు వలన 5,000 మందికి ప్రత్యక్షంగా, 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది.

59. వై.ఎస్.ఆర్. పశు భీమా పథకం ద్వారా పశువులకు బీమా సౌకర్యము కల్పించబడింది. డాక్టర్ వై.ఎస్.ఆర్. సంచార పశు ఆరోగ్య సేవ ద్వారా 340 సంచార పశు వైద్యశాలల సేవలను రైతులకు వారి ఇంటి వద్దనే అందజేయడం జరుగుతుంది.

మత్స్య సంపద

60. వై.ఎస్.ఆర్. మత్స్యకార భరోసా క్రింద, 2 లక్షల 43 వేల మంది మత్స్యకార కుటుంబాలు చేపల వేట నిషేధ కాలములో అందించే ఆర్థిక సహాయాన్ని 4 వేల రూపాయాల నుండి 10 వేల రూపాయలకు పెంచడం ద్వారా లబ్ధి పొందాయి. 20,034 మత్స్యకారుల పడవలకు వాడే డీజిల్ ఆయిల్ పై లీటరుకు 6 రూపాయల 3 పైసల నుంచి 9 రూపాయాలకు సబ్సిడీని పెంచడం జరిగింది. చేపల వేటలో అకాల మరణాలకు గురైన మత్స్యకారులకు నష్ట పరిహారాన్ని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది.

61. మత్స్యకారులకు సముద్రం మీద చేపల వేటను సులభతరం చేయడానికి మా ప్రభుత్వము అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణము చేపట్టింది. గ్రామ స్థాయిలో ఆక్వా రైతులు ఉపయోగించే పనిముట్లను పరీక్షించే సౌకర్యాలను అందించడానికి మా ప్రభుత్వం 35 సమీకృత మత్స్య సంపద ప్రయోగ శాలలు ఏర్పాటు చేసింది. చేపలు, రొయ్యలను సమర్ధవంతముగా మార్కెటింగ్ చేయడం కోసం, 2,000 ‘ఫిష్ ఆంధ్రా’ రిటైల్ దుకాణాలు స్థాపించబడ్డాయి. ఇవి 26 ఆక్వా హబ్లకు అనుసంధానించబడ్డాయి.

62. మత్స్య సంపద ఉత్పత్తిని ప్రోత్సహించి దాని నియంత్రణ మరియు పర్యవేక్షణ కొరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మత్స్య సంపద అభివృద్ధి సంస్థ స్థాపించబడింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఫిషరీ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏప్రిల్ 1, 2022 నుండి పని చేస్తోంది. 63. మా ప్రభుత్వం 2 లక్షల 12 వేల హెక్టార్ల విస్తీర్ణాన్ని ఆక్వాకల్చర్ క్రిందకు తీసుకురావడం ద్వారా 16 లక్షల 5 వేల మందికి కొత్తగా జీవనోపాధి అవకాశాలు కల్పించి, మన రాష్ట్రాన్ని దేశము యొక్క ‘ఆక్వా హబ్ గా తీర్చిదిద్దింది.

V. సంక్షేమ ఆంధ్ర

దృఢమైన సామాజిక భద్రతా వలయం - పేదరికంపై యుద్ధం

ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్ మాటలలో...

“మన పురోగతికి పరీక్ష, వున్న వాళ్ళ సంపదను మరింత పెంచామా అని కాదు,
లేని వాళ్ళకి తగినంత అందించామా” అని

64. ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన వారి అవసరాలను తీర్చడానికి మా ప్రభుత్వం ఒక బలమైన సామాజిక భద్రతా వలయాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా ఇంటి స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణము, సంక్షేమ పింఛన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా రేషనన్ను ఇంటింటికీ పంపిణీ చేయడం వంటి వివిధ పథకాల ద్వారా ఆర్ధిక మద్దతును అందిస్తుంది. ఈ కృషి పేదరికాన్ని దాని మూలాల నుండి నిర్మూలించాలనే నిబద్ధతను నొక్కి చెబుతుంది. ప్రతి వ్యక్తి, వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా, గౌరవప్రదమైన మరియు సురక్షితమైన జీవితానికి గడపటానికి మా ప్రభుత్వము సహకారం అందచేస్తుంది .

గృహ రంగము

65. గత ప్రభుత్వం తన ఐదేళ్ల కాలములో 4,63,697 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా మా ప్రభుత్వం 2019 వ సంవత్సరము నుండి 1 లక్ష 53 వేల కోట్ల రూపాయల విలువగల 30,65,315 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది.

66. పేదలందరికి ఇల్లు పథకము క్రింద మా ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి ఇంటి ఖర్చుకు లక్షా 80 వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కొ ఇంటికి 6 లక్షల 90 వేల రూపాయలు కేటాయించిన ఫలితంగా గృహ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. ఈ పథకము క్రింద 22 లక్షల ఇళ్లు కేటాయించగా దాదాపు 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లను 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.

67. మా ప్రభుత్వము 32 వేల 909 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వై.ఎస్.ఆర్. జగనన్న కాలనీలలో త్రాగునీటి సరఫరా, విద్యుత్, రోడ్లు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తుంది. వై.ఎస్.ఆర్. జగనన్న కాలనీల్లో ఇప్పటి వరకు 1,62,538 మంది లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు.

సంక్షేమం

ప్రత్యక్ష నగదు బదిలీ (డి.బి.టి)

68. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని సంక్షేమ పథకాల అర్హులందరికీ అందాలనే ప్రభుత్వ నినాదానికి అనుగుణంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రయోజనాలు అందేలా చూడాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకము విధానంలో అమలు చేస్తోంది. కులం, మతం మరియు ఇతర అంశాలతో సంబంధం లేకుండా ప్రయోజనాలు అందరికీ చేరేలా చేస్తుంది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకము మరియు సంక్షేమ కార్యక్రమాల వలన కోవిడ్- 19 మహమ్మారి సమయంలో కలిగిన ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రజలకు భరోసానిచ్చి రక్షణను కల్పించాము. ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసి దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు నిస్వార్థంగా, అవిశ్రాంతంగా పనిచేసిన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

69. పైన చెప్పిన అంశాలకు సంబంధించి 2019-20 ఆర్థిక సంవత్సరము నుండి 2023- 24 ఆర్ధిక సంవత్సరము వరకు మా ప్రభుత్వము, ప్రత్యక్ష నగదు బదిలీ పధకము ద్వారా 2 లక్షల 53 వేల కోట్ల రూపాయలను, ఇతర పథకముల ద్వారా ఒక లక్ష 68 వేల కోట్ల రూపాయలను బదిలీ చేశాము. ఈ విధంగా గత ఐదేళ్లలో 4 లక్షల 21 వేల కోట్ల రూపాయలను ప్రజలకు బదిలీ చేశాము.

70. విజయవంతమైన, సమగ్రమైన ఈ ప్రత్యక్ష మరియు ఇతర పథకాల అమలు కారణంగా, లక్షలాది కుటుంబాలను పేదరికం నుండి తప్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచి కొత్త అవకాశాలను కల్పిస్తూ వారి అభివృద్ధి మరియు అభ్యున్నతికి తొడ్పడుతుంది. 2019 సంవత్సరములో స్థిర ధరల సూచి ప్రకారం మన రాష్ట్ర తలసరి ఆదాయం 1,54,031 రూపాయలతో దేశంలో 18వ స్థానములో ఉండగా, నేడు మన రాష్ట్ర తలసరి ఆదాయం 2,19,518 రూపాయలతో 9వ ర్యాంకు సాధించింది.

వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక

71. మా ప్రభుత్వము వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక పథకం లబ్దిదారుల అర్హత వయస్సును 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించి సంతృప్త స్థాయిలో అమలు చేస్తుంది. ఈ పధకము క్రింద పెన్షన్ మొత్తంను జనవరి 1, 2024 నుండి నెలకు 3 వేల రూపాయలకు మరియు ఆరోగ్య పింఛన్లను నెలకు 10 వేల రూపాయలకు పెంచబడ్డాయి. 2019 సంవత్సరములో ఈ పింఛన్ల పంపిణీ మొత్తము నెలకు 1,385 కోట్ల రూపాయలు ఉండగా 2024 సంవత్సరము జనవరి నెల నాటికి 1,968 కోట్ల రూపాయలకు పెంచి పంపిణీ చేయబడింది. 2019 సంవత్సరము నుండి మా ప్రభుత్వం 66 లక్షల 35 వేల మంది లబ్ధిదారులకు వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుక ద్వారా 84,731 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది.

ప్రజా పంపిణీ వ్యవస్థ

72. మా ప్రభుత్వము ప్రజా పంపిణీ వస్తువులను ప్రజల ఇంటి ముంగిటికే సరఫరా చేయాలనే ఉద్దేశ్యముతో 9,260 సంచార పంపిణీ వాహనాలను ప్రవేశపెట్టింది. ఇది వృద్ధులు, వికలాంగులు మరియు వేతన కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించింది. సంచార పంపిణీ వాహనాల యజమానులైన షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల, బలహీన వర్గాల, మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వారికి ఇది లాభదాయకమైన ఉపాధిని కూడా అందించింది.

73. మా ప్రభుత్వము 2019-2023 సంవత్సరాల మధ్య కాలములో చేసిన వ్యయమును 29,628 కోట్ల రూపాయలు కాగా, 2014-2019 సంవత్సరాల మధ్య కాలములో బియ్యం సబ్సిడీ క్రింద చేసే వ్యయము కేవలం 14,256 కోట్ల రూపాయలు మాత్రమే.

74. కుటుంబంలో సంపాదించే కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే, ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశ్యముతో గౌరవ ముఖ్యమంత్రి గారు వై.ఎస్.ఆర్. బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకము క్రింద 2022-23 ఆర్థిక సంవత్సరము నుండి ఇప్పటి వరకు సహజ మరణం పొందిన 45,000 కుటుంబాలు, ప్రమాదవశాత్తు మరణించిన 4,000 కంటే ఎక్కువ కుటుంబాలకు 650 కోట్ల రూపాయల సహకారం అందింది.

75. కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, ఆర్య వైశ్య, క్షత్రియ కులాలలో ఆర్థికముగా వెనుకబడిన వారి సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించేందుకు, మా ప్రభుత్వం ఈ వర్గాల వారి సంక్షేమానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ శాఖ క్రింద 2019-2024 సంవత్సరాల మధ్య కాలములో 1 కోటి 15 లక్షల మంది లబ్ధిదారులకు 36,321 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది.

76. వై.ఎస్.ఆర్. కళ్యాణమస్తు మరియు వై.ఎస్.ఆర్. షాదీ తోఫా పథకాల క్రింద షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతుల, వికలాంగులు మరియు ముస్లింలకు చెందిన 46,329 మంది లబ్ధిదారులకు 350 కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేశాము.

77. వై.ఎస్.ఆర్. ఇ.బి.సీ. నేస్తం పథకం క్రింద అగ్ర కులాలలో ఆర్థికముగా వెనుకబడిన రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలము మొదలైన ఓసీ వర్గాలలోని ఆర్థికంగా వెనుకబడిన 4 లక్షల 39 వేల మంది మహిళలకు 1,257 కోట్ల రూపాయలను పంపిణీ చేయటం జరిగింది.

78. వై.ఎస్.ఆర్. కాపు నేస్తం క్రింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాలకు చెందిన 3 లక్షల 57 వేల మంది మహిళలకు 2,029 కోట్ల రూపాయలను పంపిణీ చేశాము. కాపు సామాజిక వర్గ సంక్షేమానికి, మా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల ద్వారా 77 లక్షల మందికి 39,247 కోట్ల రూపాయలను బదిలీ చేసింది.

79. వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం పథకం క్రింద 81,783 మంది లబ్ధిదారులకు 983 కోట్ల రూపాయలను పంపిణీ చేశాము.

80. జగనన్న తోడు పథకం క్రింద 16 లక్షల 73 వేల మంది వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు మరియు చేతివృత్తుల వారికి 3,374 కోట్ల రూపాయలను పంపిణీ చేయటం జరిగింది.

81. జగనన్న చేదోడు పథకం క్రింద రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీ పని వార్లకు చెందిన 3లక్షల 40 వేల మంది లబ్ధిదారులకు 1,268 కోట్ల రూపాయలను అందించడం జరిగింది.

82. వై.ఎస్.ఆర్. వాహన మిత్ర పథకం క్రింద 2 లక్షల 78 వేల మందికి పైగా టాక్సీ, క్యాబ్ మరియు ఆటో డ్రైవర్లకు 1,305 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాము.

83. వై.ఎస్.ఆర్. లా నేస్తం క్రింద 6,069 మంది జూనియర్ న్యాయవాదులకు 3 సంవత్సరాల నుండి నెలకు 5 వేల రూపాయల చొప్పున భృతిని అందిస్తున్నాము.

84. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGA) క్రింద 2023 సంవత్సరము డిసెంబర్ నెల చివర వరకు 2,141 లక్షల పని దినాలు కల్పించాము. దీని క్రింద 45 లక్షల కుటుంబాలలోని 72 లక్షల మందికి వేతన ఉపాధి అవకాశాలు కల్పించబడి 15 రోజులలో చెల్లింపులు చేయబడ్డాయి.

85. గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను 883.5 కోట్ల రూపాయల సాయం అందజేసి వారిని ఆదుకున్నారు.

సామాజిక సంక్షేమం

86. షెడ్యూల్ కులాలకు చెందిన యువత సమగ్ర అభివృద్ధికి నేరుగా నగదు బదిలీ మరియు ప్రధానమైన సంక్షేమ పథకాల అమలుతో పాటు, మా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందుకు నిదర్శనంగా JEE మరియు NEET వంటి పోటీ పరీక్షలలో మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ వసతి గృహ పాఠశాలల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. 2019 నుండి 2023 సంవత్సరాల మధ్య, ఈ వర్గానికి చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు IIT లు, NIT లు మరియు ఇతర ప్రీమియర్ కళాశాలలలో ప్రవేశం పొందారు. ఇంతేకాక, పూర్తి ఆర్థిక సహాయంతో, కెన్నెడీ లుగర్-యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం మరియు విద్యా కార్యక్రమాల క్రింద ఎనిమిది మంది విద్యార్థులు అవకాశాన్ని పొందారు. 2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనపై న్యూయార్క్ జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఈ వర్గానికి చెందిన ఒక విద్యార్థి ప్రాతినిధ్యం వహించాడు.

గిరిజన సంక్షేమం

87. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, 2019 సంవత్సరము జూన్ నెల నుండి ఇప్పటి వరకు, 2,19,763 ఎకరాలకు గాను 1,29,842 మందికి వ్యక్తిగత పట్టాలు, 67,946 ఎకరాలకు గాను 526 కమ్యూనిటీ పట్టాలు ఇవ్వబడ్డాయి. అంతేగాక, గిరిజన సంఘాలను బలోపేతం చేయడానికి మరియు వారికి భూమిపై ఉన్న హక్కులను నిర్ధారించడానికి 39,272 ఎకరాలకు 26,287 డీ.కే.టి. పట్టాలు పంపిణీ చేయబడ్డాయి.

88. షెడ్యూల్ తెగల వ్యక్తులు నివసించే గృహాలకు వినియోగించే ఉచిత విద్యుత్ ను నెలకు 100 యూనిట్ల నుండి 200 యూనిట్లకు మా ప్రభుత్వం పెంచింది. కాఫీ పంట పండించే గిరిజన రైతులకు ఆదాయ భద్రత కల్పించడానికి, మా ప్రభుత్వం ఇప్పటికే ఉన్న కాఫీ తోటల పరిధిని విస్తరింపచేసి, పల్పర్లు అందించడం ద్వారా కాఫీ నాణ్యతను మెరుగుపరచే చర్యలు తీసుకొని గిరిజన సహకార సంఘం ద్వారా మార్కెటింగ్ చేసే అవకాశాన్ని సులభతరం చేసింది.

బీసీ సంక్షేమం

89. మా ప్రభుత్వం వెనుకబడిన కులాల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వెనుకబడిన కులాల సంక్షేమం కోసం, మా ప్రభుత్వం గత ఐదేళ్లలో వివిధ కార్యక్రమాలు, పథకాల క్రింద 1 కోటి 2 లక్షల మంది లబ్ధిదారులకు 71,740 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.

అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం

90. అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థుల సామాజిక ఆర్థిక మరియు విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని తగ్గించడానికి పాఠశాల స్థాయి పరీక్షలు, పోటీ పరీక్షలు మరియు ఉద్యోగ ఆధారిత పరీక్షల శిక్షణను కల్పించడానికి మా ప్రభుత్వం సహాయం చేసింది. దీని ద్వారా 2023-24 సంవత్సరములో దాదాపు 5 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.

91. ఇమామ్లకు అందించే సహాయం 5 వేల రూపాయల నుండి 10 వేల రూపాయలకు పెంచడం ద్వారా 4,983 మందికి ప్రయోజనాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా మోజన్లకు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాన్ని నెలకు 3 వేల రూపాయల నుండి 5 వేల రూపాయలకు పెంచి 4,983 మంది కి మేలు చేయటం జరిగింది. 8427 మంది పాస్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి నుండి నెలకు 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాము. 2023 సంవత్సరం నుండి విజయవాడ లోని ఎంబార్కేషన్ పాయింట్ నుండి హజ్ యాత్ర చేసే ప్రతి యాత్రికునికి 80 వేల రూపాయలు అందజేయడం ద్వారా 1,756 మంది యాత్రికులను ప్రోత్సహించటం జరుగుతోంది. అదేవిధంగా 2019 నుండి 1,178 మంది యాత్రికులకు జెరూసలేం వెళ్ళడానికి 60 వేల చొప్పున ఆర్థిక ప్రయోజనాన్ని అందించటం జరిగింది.

VI. సంపన్న ఆంధ్ర

మౌలిక సదుపాయాలు మరియు ఉత్పాదకత - అభ్యున్నతి సంకల్పం

92. ఆర్థికాభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన పునాది లాంటిది. పారిశ్రామికీకరణను వేగవంతం చేయడానికి మరియు పోటీతత్వాన్ని పెంపొందించడానికి, మా ప్రభుత్వం అనేక మార్గనిర్దేశక కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాల అమలులో భాగముగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానము 2023-27 ను మా ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ విధానం విభిన్న రంగాలలో శక్తివంతమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో పని చేస్తోంది.

93. సామాజిక ఆస్తులైన గ్రామీణ సచివాలయాలు వై.ఎస్.ఆర్. క్లినిక్ లతోపాటు ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు మరియు 17 కొత్త వైద్య కళాశాలలలో కీలక మౌలిక సదుపాయలను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం వ్యూహాత్మక పెట్టుబడులను పెట్టడం జరుగుతోంది. తద్వారా రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి.

94. ఆరోగ్యం, విద్య మరియు గృహ రంగము వంటి సామాజిక మౌలిక సదుపాయాలను, నైపుణ్యం కలిగిన మానవశక్తిని, డిజిటల్ పరిజ్ఞానంతో మేళవించటము వలన గరిష్ట స్థాయిలో పెట్టుబడులు మరియు ఉద్యోగ కల్పనను సాధించవచ్చు. ఇది మన రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి వైపు నడిపిస్తుంది.

ఓడరేవులు మరియు విమానాశ్రయాలు

సింగపూర్ జాతిపితగా ప్రసిద్ధిగాంచిన లీ క్వాన్ యూ గారి మాటలలో...

“ఒక దేశం యొక్క గొప్పదనం దాని పరిమాణంతో మాత్రమే కాదు.
ఆ దేశ ప్రజల సంకల్పం, ఐక్యత, సత్తువ, క్రమశిక్షణ మరియు
పటిష్టమైన నాయకత్వం ఆ దేశాన్ని చరిత్రలో
గౌరవనీయమైన స్థానంలో నిలుపుతుంది.”

95. మా ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు పర్యావరణహిత ఓడరేవులను, రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలలో నిర్మించటం జరిగింది. వీటి ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 110 MTPA అదనపు సామర్థ్యం సృష్టించటం ద్వారా, దాదాపు 75 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

96. మా ప్రభుత్వం 3,800 కోట్ల రూపాయల వ్యయంతో పది ఫిషింగ్ హార్బర్లను జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప మరియు మచిలీపట్నంలలో నిర్మిస్తోంది. వీటి ద్వారా 9 వేల కోట్ల రూపాయల స్థూల విలువ గల 4 లక్షల 50 వేల టన్నుల చేపలు మరియు రొయ్యల వేట ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి.

97. అదనంగా, 127 కోట్ల రూపాయల పెట్టుబడితో 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక మరియు రాయదరువులలో అభివృద్ధి చేయడం జరిగింది.

98. అంతర్గత జల రవాణా అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీని 2023 జూన్ లో స్థాపించడం జరిగింది. మన రాష్ట్రములో కృష్ణానదిపై ముక్త్యాల-మద్దిపాడు మధ్య తొలి నదీప్రవాహ ప్రాజెక్టు ఐదు నెలల రికార్డు స్థాయిలో రూపొందించబడింది.

99. మా ప్రభుత్వం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి పనులను చేపట్టింది. గన్నవరం, కడప, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు మరియు విశాఖపట్నం విమానాశ్రయాల అభివృద్ధి పనులను పునరుద్ధరించింది. ఇప్పటికే కర్నూల్లో విమాన సర్వీసులు ప్రారంబించ బడ్డాయి.

రహదారులు

100. మా ప్రభుత్వం గత 5 సంవత్సరాలలో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి 2,626 కోట్ల రూపాయలు ప్రధాన జిల్లా రహదారులకు 1,955 కోట్ల రూపాయలు మరియు LWE ప్రభావిత ప్రాంతాలకు రహదారుల అనుసంధాన పథకం క్రింద 272 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. NDB ప్రాజెక్ట్ మొదటి దశ క్రింద 3,014 కోట్ల రూపాయలతో 1,243 కి.మీ రోడ్లు అభివృద్ధి చేయబడుతున్నాయి. NIDA-మొదటి దశ క్రింద 1,158 కోట్ల రూపాయల వ్యయంతో 98 రాష్ట్ర రహదారుల పనులు, 132 MDR లు పూర్తయ్యాయి. APRDC ద్వారా 2,205 రూపాయల ఖర్చుతో 8,286 కిలోమీటర్ల రహదారుల నాణ్యత మెరుగుపడింది. సేతు బంధన్ మరియు ఇతర గ్రాంట్ల కింద 992 కోట్ల రూపాయలతో 19 ROB లను అభివృద్ధి చేస్తున్నారు. 7,182 కోట్ల రూపాయలతో సుమారు 350 కి.మీ జాతీయ రహదారులు రెండు/నాలుగు వరుసలలో అభివృద్ధి చేస్తున్నారు. MORTH ద్వారా 872.52 కి.మీ పొడవున్న 10 రహదారులను నూతన జాతీయ రహదారులుగా ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ - ప్రతి గ్రామం అనుసంధానం

101. నవంబర్ 2023 సంవత్సరంలో 'భారత్ నెట్' రెండవ దశ ప్రాజెక్ట్ అమలును మా ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. 613 మండలాలలోని 11,254 గ్రామ పంచాయతీలను కలుపుతూ మొత్తం 55,000 కి.మీ. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేయబడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయితీకి కనీసం 1 Gbps ను కల్పించాలనే లక్ష్యంతో ఉండగా, మా ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయితీకి 30 Gbps ను అందిస్తోంది. అన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించబడ్డాయి.

నూతన వైద్య సంస్థలు

102. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే స్థాపించబడగా, మా ప్రభుత్వం 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను మంజూరు చేసింది. వీటితో పాటు ఇప్పటివరకు 10 కొత్త వైద్య కళాశాలు, 10 బోధనా ఆసుపత్రులు, 4 ఇతర ఆసుపత్రులు మరియు 3 నర్సింగ్ కళాశాలలు స్థాపించబడ్డాయి. పలాసలో మూత్ర పిండాల వ్యాధుల పరిశోధనా కేంద్రాలు, తిరుపతిలో చిన్నపిల్లల గుండె జబ్బుల నివారణా కేంద్రం వంటి విభిన్న ప్రత్యేకతలు కలిగిన మూడు అత్యున్నత ఆసుపత్రులు మరియు 6 క్యాన్సర్ సెంటర్లు స్థాపించబడ్డాయి.

103. గిరిజనులు అధికంగా ఉండే సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం మరియు డోర్నాలలలో ఆరోగ్య సేవలను పొందడంలో వున్న అంతరాన్ని తగ్గించడానికి బహుళ సదుపాయాలు గల ఆసుపత్రులను స్థాపించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపటం జరిగింది.

నూతన విజ్ఞాన కేంద్రాలు

104. మా ప్రభుత్వం కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, విజయనగరంలో సెంట్రల్ గిరిజనుల విశ్వవిద్యాలయం, గురజాడ, విజయనగరంలో జవహర్లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం, ఒంగోలులో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం, వై.ఎస్.ఆర్ కడపలో డా॥ వై.ఎస్.ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, మహిళల కోసం న్యూ మోడల్ డిగ్రీ కళాశాలను కూడా స్థాపించింది. సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఉన్నత విద్యను అందించడానికి కర్నూల్లో క్లస్టర్ యూనివర్సిటీ స్థాపించటం జరిగింది. అంతే కాకుండా రెండవ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయుటకు మా ప్రభుత్వం మంజూరు చేసింది.

నీటి వనరులు

105. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిర్మాణ కార్యకలాపాలను వేగవంతం చేయటం తో పాటు ప్రాజెక్ట్ యొక్క సవరించిన వ్యయ అంచనాలను కేంద్ర ప్రభత్వం ఆమోదించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ పనులన్నీ చాలా చురుకుగా సాగుతున్నాయి. మే 2019లో 42 శాతంగా ఉన్న హెడ్ వర్క్స్ పురోగతి ఇప్పుడు 70 శాతంగా ఉంది. గోదావరి నది చరిత్రలో తొలిసారిగా రేడియల్ గేట్లను సక్రమంగా ఏర్పాటు చేసి స్పిల్వే ద్వారా వరద నీటిని మళ్లించటం జరిగింది.

106. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నవంబర్ 30, 2023న, రెండవ అవుకు టన్నెల్ ప్రారంభించబడింది. దీని ద్వారా అదనంగా 10,000 క్యూసెక్కుల నీటిని గండికోట రిజర్వాయర్ కు తీసుకు వెళతారు. అవుకు మొదటి టన్నెల్ మరియు రెండవ టన్నెల్లు పూర్తి చేయటం జరిగింది. అయితే మూడవ టన్నెల్ నిర్మాణం పూర్తి కానుంది. 1,079 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబడుతున్న ఈ టన్నెల్ ద్వారా కడప, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాలలోని 2.06 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల పరిధిలోని 20 లక్షల మందికి త్రాగునీరు అందుతుంది.

107. గౌరవ ముఖ్యమంత్రి గారు 77 చెరువుల అనుసంధాన ప్రాజెక్టును సెప్టెంబర్ 19, 2023న ప్రారంభించారు. అప్పటి నుంచి పత్తికొండ, డోన్, ఆలూరు మరియు పాణ్యం నియోజకవర్గాలలో 1.24 టీ.ఎం.సీ.ల నీటిని ఎత్తిపోయడం ద్వారా సుమారు 10 వేల ఎకరాల సాగు నీరు అందించటంతో పాటు, ఆ చుట్టు ప్రక్కల గ్రామాలలో భూగర్భ జలాలు పెరిగి త్రాగునీటి స్థిరీకరణ జరిగింది. దీని ఫలితంగా స్థానిక కరువు పీడిత ప్రాంతాలలో కేవలం వర్షాలపైనే ఆధారపడిన రైతులకు ఎంతో మేలు జరిగింది.

108. శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ మరియు నెల్లూరు బ్యారేజీని గౌరవ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 6, 2022న ప్రారంభించారు. వీటివలన కావలి కాలువ మరియు కనుపూరు కాలువ క్రింద 2.85 లక్షల ఎకరాలు, మరియు పెన్నార్ డెల్టా వ్యవస్థ క్రింద 99,525 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతోంది.

109. ప్రకాశం, నెల్లూరు మరియు కడప జిల్లాలలోని 30 కరువు పీడిత మరియు ఫ్లోరైడ్ ప్రభావిత మండలాలలోని 15.25 లక్షల మందికి త్రాగునీటి సౌకర్యాన్ని అందించడానికి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ అమలు చేయబడుతోంది.

110. హెచ్.ఎన్.ఎస్.ఎస్ రెండవ దశలో భాగంగా ఉన్న కుప్పం బ్రాంచ్ కాలువ నిర్మాణం పూర్తయింది. దీనిని ఈ నెలలో ప్రారంభోత్సం చేయాలి అని మా అలోచన. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు దీనివలన నీరు లభ్యమవుతుంది. పోషించనుంది.

111. ప్రాధాన్య ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ప్రాజెక్టు, తారక రామతీర్థసాగర్, వంశధార నాగావళి లింక్, హీరమండలం రిజర్వాయర్, గొట్టా ఎల్.ఐ.ఎస్, తోటపల్లి రిజర్వాయర్, మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్, తాండవ ఎల్.ఐ.ఎస్., రాయలసీమ కరువు నివారణ పథకంలకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి.

త్రాగు నీరు

112. తొమ్మిది జిల్లాలలో త్రాగు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాలలో 10,137 కోట్ల రూపాయల వ్యయంతో 9 త్రాగునీటి పథకాలు మంజూరు చెయ్యబడ్డాయి. దశాబ్దాల తరబడి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్న ఉద్దానం ప్రాంతంలోని 7 మండలాలలోని 807 గ్రామాల సమస్యను పరిష్కరిస్తూ 1.12 టీ.ఎం.సీ.ల శుద్ధి చేసిన సురక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు వై.ఎస్.ఆర్. సుజలధార ప్రాజెక్టును డిసెంబరు 14, 2023 న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించి అక్కడి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారు.

ఇంధన శక్తి

113. ఆర్థికాభివృద్ధికి కీలక సూచిక అయిన విద్యుత్ తలసరి వినియోగం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1,203 యూనిట్లుగా ఉండగా, డిసెంబర్ 2023 నాటికి 1,400కు పెరిగింది. విద్యుత్ ప్రసార మరియు పంపిణీ నష్టాలు 13 శాతం నుండి 9.27 శాతానికి తగ్గాయి. మన రాష్ట్రంలో విద్యుత్ గ్రిడ్ ను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు మా ప్రభుత్వం వినియోగదారులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది.

114. యూనిట్ కు కేవలం 2 రూపాయల 49 పైసల ఆకర్షణీయమైన రేటుతో సంవత్సరానికి 7 వేల మెగావాట్ల విద్యుత్ తయారీ కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అఫ్ ఇండియాతో మన రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, కృష్ణపట్నం లోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ లోని 800 మెగావాట్ల 2వ దశ యూనిట్ ని, అదే విధంగా, ఇబ్రహీంపట్నం లోని నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ లోని 800 మెగావాట్ల 5వ దశ యూనిట్ ని రాష్ట్రానికి అంకితం చేయటం జరిగింది.

115. సుస్థిర భవిష్యత్తు కోసం హరిత శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం-2020, ఆంధ్రప్రదేశ్ పంప్డ్ స్టోరేజీ ప్రమోషన్ పాలసీ-2022 మరియు ఆంధ్ర ప్రదేశ్ హరిత శక్తి మరియు హరిత అమ్మోనియా ప్రమోషన్ పాలసీ-2023 లను ప్రకటించింది. పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం అనుకూల ప్రదేశాలను గుర్తించడంలో, మన రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది.

నూతన పరిశ్రమలు

116. 2019 నుండి నేటికి 311కి పైగా భారీ మరియు మెగా పరిశ్రమలు స్థాపించబడగా, 1 లక్ష 30 వేల మందికి పైగా ఇవి ఉపాధిని కల్పిస్తున్నాయి. వీటితో పాటు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 5,995 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉత్పత్తులను మొదలుపెట్టడం ద్వారా 13,67,618 మందికి ఉపాధి లభించింది.

117. మార్చి 2023లో జరిగిన ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సు ఫలితంగా 13 లక్షల 11 వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదిరాయి. తద్వారా 6 లక్షల 7 వేల మందికి అదనపు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

118. 2019 నుండి 2023 వరకు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఏక గవాక్ష విధానం ద్వారా 56,645 దరఖాస్తులు స్వీకరించబడగా, వాటిలో 54,292 దరఖాస్తులు అంటే 98.83% నిర్ణీత సమయంలో ఆమోదించబడ్డాయి.

MSME లకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు

119. పారిశ్రామిక అభివృద్ధి విధానం 2023-27 ప్రకారం వై.ఎస్.ఆర్. జగనన్న బడుగు వికాసం క్రింద మహిళలతో సహా షెడ్యూలు కులాలు మరియు తెగల పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల ప్యాకేజీని పొడిగించటం జరిగింది.

120. సూక్ష్మ, చిన్న పారిశ్రామిక వేత్తల క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమం క్రింద 55 కొత్త క్లస్టర్లు గుర్తించబడ్డాయి. ఈ పథకం ద్వారా 37,400 మందికి ఉపాధి అవకాశాలతో పాటు, 6 సాధారణ సౌకర్య కేంద్రాలకు (కామన్ ఫెసిలిటీస్ సెంటర్) కేంద్ర ప్రభుత్వం యొక్క తుది ఆమోదం లభించింది. మూడు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 15,144 మందికి ఉపాధి కల్పనా సామర్థ్యాన్ని కలిగిన మరో 18 ప్రాజెక్టులు ప్రస్తుతం అమలుదశలో ఉన్నాయి.

121. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలతో సహా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం కోసం విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ మరియు హైదరాబాద్ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల వంటి ప్రధాన పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను త్వరితగతిన అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం పని చేస్తోంది.

122. పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతికత పాలసీ 2021-2024 మరియు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2021-2024 అమలు చేయబడుతున్నాయి. 2019 నుండి, 65 కొత్త ఐ.టి. కంపెనీలు స్థాపించబడగా, ఇవి 47,908 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అదానీ డేటా సెంటర్ పార్క్, WNS, Pulses, Ranstad మరియు ఇన్ఫోసిస్ వంటి ఐ.టి. దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ అభివృద్ధి కేంద్రాన్ని అక్టోబర్ 16, 2023 న ప్రారంభించడంతో, మన రాష్ట్రము ఒక సుస్థిర ఐటి హబ్ గా అభివృద్ధి చెందుతోంది.

123. 2023 లో జరిగిన ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సులో ఎలక్ట్రానిక్స్ రంగంలోని పెట్టుబడిదారుల నుండి అధిక స్పందన లభించింది. ఈ సదస్సులో 15,711 కోట్ల రూపాయల పెట్టుబడులతో 55,140 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 23 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 2019 నుండి గమనిస్తే, మన రాష్ట్రంలో అదనంగా 17 ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీల స్థాపన ద్వారా 7,832 కోట్ల పెట్టుబడితో 34,750 మందికి ఉపాధి అవకాశాలను కల్పించటం జరుగుతోంది.

124. గౌరవ ముఖ్యమంత్రి గారు AIL Dixon టెక్నాలజీన్ ప్రైవేట్ లిమిటెడ్ని ప్రారంభించటంతో పాటు మరో రెండు కంపెనీలకు శంకుస్థాపనలు చేశారు. అదే విధంగా కడపలోని వై.ఎస్.ఆర్. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (YSR-EMC) లో జూలై 2023 లో 450 కోట్ల రూపాయల పెట్టుబడితో మొత్తం 6,350 మందికి పైగా ఉద్యోగాలు సృష్టించబడతాయనే అంచనాతో మరో రెండు అవగాహన ఒప్పందాలను చేసుకోవటం జరిగింది.

125. సుస్థిర పర్యావరణ ప్రమాణాలను పాటిస్తూ, ప్రజల రవాణా అవసరాలను తీర్చడానికి, తిరుపతిలో మా ప్రభుత్వం వంద ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టటం జరిగింది. వీటితోపాటు 1,500 కొత్త డీజిల్ బి. ఎస్. - VI బస్సులకు మా ప్రభుత్వం అనుమతులను ఇవ్వటం జరిగింది.

126. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టటంలో భాగంగా, మా ప్రభుత్వం 32 న్యాయ భవనాలను పూర్తిచేయగా, మరో 13 న్యాయ భవనాల నిర్మాణం పురోగతిలో ఉన్నాయి.

పట్టణ అభివృద్ధి

127. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల కింద 1,426 ఎకరాలలో 12,042 ప్లాట్లతో ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేస్తున్నాము. అమృత్ 2.0 క్రింద, 5,000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న 101 పట్టణ నీటి వనరుల పునరుజ్జీవనం ప్రాజెక్టు వ్యయం 189 కోట్ల రూపాయలు అలాగే 481 నగర ఆరోగ్య కేంద్రాలు కొత్తగా ఏర్పాటు చేశారు.

128. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద, ఇంటింటికీ చెత్త సేకరణ మరియు వేరుచేయడం కోసం ULB లకు 3000 వాహనాలు అందించబడ్డాయి. గుంటూరు మరియు విశాఖపట్నంలో రెండు వేస్ట్-టు ఎనర్జీ ప్లాంట్లు ప్రారంభించబడ్డాయి. మొత్తం 123 ULB లలో లెగసీ వ్యర్థాల శుద్ధి ప్రారంభమైంది. జాతీయ స్వచ్ అవార్డులలో మూడు ULBలు టాప్ 10లో ఉన్నాయి.

ఇతర గ్రామీణ మౌలిక సదుపాయాలు

129. గ్రామీణ మౌలిక సదుపాయాల కింద, 10,893 గ్రామ పంచాయతీ భవనాలు, 10,216 వ్యవసాయ ఉత్పత్తుల గోదాముల నిర్మాణాలు, 8,299 భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలు మరియు 3,734 భారీ పాల శీతలీకరణ కేంద్రాలు నిర్మించబడ్డాయి.

యువజనాభివృద్ధి, పర్యాటకం మరియు సంస్కృతి

దివ్యాంగ ఒలింపిక్ క్రీడాకారిణి దీపామాలిక్ మాటలలో...

"మహిళా సాధికారతకు క్రీడలు అత్యున్నత మాధ్యమం,
ఎందుకంటే ఇవి మిమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా ధృఢంగా చేస్తాయి.
అది సవాళ్లను ఎదుర్కొని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యాన్ని ఇస్తుంది.”

130. యువత అభివృద్ధిలో శారీరక విద్య మరియు క్రీడలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే మన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 119 కోట్ల రూపాయల వ్యయంతో, 38 లక్షల మంది క్రీడాకారులతో సహా 90 లక్షల మంది ప్రేక్షకుల భాగస్వామ్యంతో, 5 అంచెలలో ఆడుదాం ఆంధ్రా అనే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది. ఈ మెగా ఈవెంట్లో విజేతలకు 12 కోట్ల 21 లక్షల రూపాయల విలువైన బహుమతులను అందించడం జరిగింది.

131. జాతీయ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వై.ఎస్.ఆర్. క్రీడా ప్రోత్సాహకాల కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తున్నాము. క్రీడా మౌలిక సదుపాయాలను అందించడానికి, 41 క్రీడా వికాస కేంద్రాలు ఇప్పటివరకు స్థాపించబడగా, మరొక 65 క్రీడా వికాస కేంద్రాలు పురోగతిలో ఉన్నాయి.

పర్యాటక రంగం

132. మన రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాలు మరియు పురాతన చారిత్రక ప్రదేశాలతో అపారమైన పర్యాటక సామర్థ్యాన్ని కలిగి ఉంది. విశాఖపట్నంలోని ప్రశాంతమైన బీచ్ ల నుండి తిరుపతిలోని పవిత్ర దేవాలయాల వరకు మరియు తూర్పు కనుమలలోని జీవవైవిధ్య ప్రకృతి దృశ్యాలు, ప్రతి పర్యాటకుడికి అద్భుత అనుభవాలను అందించే గమ్యస్థానం.

133. ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సు-2023 లో ఒబెరాయ్ గ్రూప్, నోవోటెల్, మేఫెయిర్ హెూటల్స్ మరియు రిసార్ట్స్, హయత్ రిసార్ట్స్ వంటి బృహత్తర పెట్టుబడిదారులను ఆకర్షించి, 19,345 కోట్ల రూపాయల పెట్టుబడులకు, 117 అవగాహన ఒప్పందాలను మా ప్రభుత్వం కుదుర్చుకోవడం జరిగింది. వీటి ద్వారా 51,083 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ప్రస్తుతం 3,685 కోట్ల రూపాయల పెట్టుబడితో, 17 ప్రాజెక్టులు అమలవుతూ, 7,290 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయి.

పర్యావరణం మరియు అడవులు

134. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ వర్గాల భాగస్వామ్యంతో కలిసి 5 కోట్ల 11 లక్షల మొక్కలను నాటడం ద్వారా జగనన్న పచ్చతోరణం క్రింద భారీ మొక్కల పెంపకం అనే ప్రచారం చేపట్టటం జరిగింది. అదనంగా, నగరవనం పథకం క్రింద, పట్టణ మరియు పట్టణ శివార్లలో పచ్చదనాన్ని పెంపొందిచటం మరియు పార్కులను నిర్వహించడం మరియు విస్తరించడం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే పచ్చని నగరాలను అభివృద్ధి చేయటం జరుగుతోంది.

VII. భూ భధ్ర ఆంధ్ర

పరివర్తనాత్మక భూ పరిపాలన మీ ఆస్తికి ప్రభుత్వ భరోసా

భూ సంస్కరణల ప్రాముఖ్యత గురించి నెల్సన్ మండేలా మాటలలో...

"మా భూ సంస్కరణ కార్యక్రమం వర్ణ వివక్ష యొక్క అన్యాయాలను పరిష్కరించడానికి
సహాయపడుతుంది. ఇది జాతీయ సయోధ్య మరియు స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది.
ఇది కుటుంబ సంక్షేమం మరియు ఆహార భద్రతను మెరుగుపరిచి,
ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడుతుంది”

135. భూమిపై ఆధారపడి జీవిస్తున్న వారికి భూమి ఒక అత్యంత ముఖ్యమైన ఆస్తి. అయితే, గత ఎన్నో సంవత్సరాలుగా భూమి మరియు సర్వే రికార్డుల అస్పష్టత వంటి సమస్యలతో పాటు వివాదాలు మరియు వ్యాజ్యాల కారణంగా ఈ భూముల యొక్క నిజమైన ఆర్థిక విలువను నిర్ధారించటంలో పెద్ద అడ్డంకులుగా ఉన్నాయి.

136. సంవత్సరాలుగా పాతుకుపోయిన ఈ సమస్యలను పరిష్కరించటానికి మా ప్రభుత్వం అనేక మార్గదర్శకాలను విడుదల చేయటమే కాకుండా అనేక పరివర్తనాత్మక చర్యలను చేపట్టింది. ఈ ఐదేళ్లలో, అనేక మార్గనిర్దేశక కార్యక్రమాలతో మన రాష్ట్రము అనేక భూ సంబంధిత సమస్యలను పరిష్కరించటంలో భూ పరిపాలనలో అగ్రగామిగా నిలిచింది. దీనివలన ఈ రంగంలో ఉన్న అనేక మంది ఇప్పుడు ఊపిరి పీల్చుకో గలుగుతున్నారు.

137. 100 సంవత్సరాల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములను పునఃపరిశీలించడం కోసం వై.ఎస్.ఆర్. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకాలను డిసెంబర్ 21, 2020న మా ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పునఃపరిశీలనలో కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్లను నియమించడం వలన మరియు నిరంతరాయంగా పనిచేసే సరికొత్త రిఫరెన్స్ స్టేషన్ల (CORS) సాంకేతికతను ప్రవేశపెట్టటం వలన ఈ సర్వే ఎంతో శాస్త్రీయంగా జరుగుతున్నది.

138. ఆస్తి యొక్క నిజమైన హక్కుదారులకు భద్రతను కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం-2022 రూపొందించబడింది. ఇప్పటివరకు 17 లక్షల 53 వేల మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలు ఇవ్వడం జరిగింది. మరియు 4 లక్షల 80 వేల మ్యుటేషన్లను పరిష్కరించటం జరిగింది. అంతే కాకుండా 45 వేల భూ సరిహద్దు వివాదాలు పరిష్కరించ బడ్డాయి. స్పష్టమైన భూ హక్కులను నిర్ధారించటం వలన భూముల యొక్క మార్కెట్ ధరలు నిర్ణయించబడ్డాయి. మరియు భూమి తగాదాలను తగ్గించబడ్డాయి. దీనివలన ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయగలుగు తున్నాము. ఇవన్నీ ఈ చట్టం చేయడంవలనే సాధ్యం అయినది.

139. మా ప్రభుత్వం 1 లక్ష 37 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అన్ని విలేజ్ సర్వీస్ ఇనామ్ భూములు, 1 లక్ష 13 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చడంతోపాటు, రిజిస్ట్రేషన్ చట్టం- 1908 లోని నిషేధిత ఆస్తులు u/s 22(A) నుండి భూములను తొలగించింది. షరతుగల పట్టా భూములు 33,428.64 సెంట్లు, 2 లక్షల 6 వేల ఎకరాల చుక్కల భూములు, 1 లక్ష 7 వేల మంది రైతులకు శాశ్వత హక్కులు కల్పించడం, 1982 నుంచి 2014 వరకు భూమి కొనుగోలు పథకం క్రింద 22,837 సెంట్లు, 22,346 మంది భూమిలేని పేద షెడ్యూలు కులాలకు చెందిన లబ్ధిదారులకు లబ్ధి చేకూరింది. దీనితోపాటు భూమిలేని నిరుపేద లబ్ధిదారులకు 46,463 ఎకరాల డీకేటీ పట్టాలను, 17,768 మంది భూమిలేని పేద లబ్ధిదారులకు 9,064 ఎకరాల లంక భూములను మా ప్రభుత్వం అసైన్ చేసింది.

140. పైన పేర్కొన్న వివిధ భూ సంబంధిత కార్యక్రమాలను గమనిస్తే, భూ యాజమాన్యాన్ని విస్తరించడం, సురక్షితమైన మరియు సమర్థవంతమైన భూ నిర్వహణను చేపట్టటం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచడం వంటి దూరదృష్టితో కూడిన లక్ష్యాలు, మా ప్రభుత్వం యొక్క ఎజెండాను ప్రతిబింబిస్తున్నాయి.

ఉద్యోగుల సంక్షేమం

141. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ విధానాల అమలులో, ప్రజా సేవల అందజేతలో మరియు రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించడంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. పనిలో వీరి నిబద్ధత, మరియు నైపుణ్యం, ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా మరియు సుస్థిరంగా అమలుచేయడానికి ఎంతో అవసరమని గుర్తించింది.

142. మా ప్రభుత్వం గత ఐదేళ్ళలో 4 లక్షల 93 వేల కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 2,13,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. ఇవి 2014-19 మధ్య కాలంలో కల్పించిన 34,108 ఉద్యోగాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. సుమారు 10 వేల మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నాము. 51,387 మంది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేసాము. 6,100 ఉపాధ్యాయ ఖాళీలను డి.ఎస్.సి. (DSC) ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాము. ఒప్పంద ఉద్యోగులకు కనీస వేతన స్కేళ్ళు-2022 క్రింద కనీస వేతన స్కేళ్ళను ఇచ్చాము. పొరుగు సేవల ఉద్యోగులకై APCOS (ఆప్కాస్) సంస్థను ఏర్పాటు చేశాం. 27 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగుల సంక్షేమం కోసం మంజూరు చేసాము. 11వ వేతన సవరణ సంఘ సిఫారసులను అమలు చేసాము. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరముల నుండి 62 సంవత్సరాలకు పెంచాము.

143. ఆశా వర్కర్లకు, గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు, పురపాలక పొరుగు సేవల, ప్రజారోగ్య కార్మికులకు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కు చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు, పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం (మెప్మా) కు చెందిన రిసోర్స్ పర్సన్లకు, హోమర్డకు మధ్యాహ్న భోజన పథకం క్రింద పనిచేస్తున్న వంట సహాయకులకు, అంగన్వాడీ వర్కర్లు మరియు సహాయకులకు మా ప్రభుత్వం వేతనం పెంచింది.

144. పోలీస్ వ్యవస్థలో 3,920 పోస్టులతో నాలుగు బెటాలియన్లు మంజూరు చేయబడగా, వారి నియామక ప్రక్రియ కొనసాగుతుంది. మన రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు మరియు ఇతర ఉద్యోగులందరికీ మెరుగైన ప్రమాద భీమాతో కూడిన కాంపోజిట్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అమలు చేయబడుతోంది.

145. నూతన పింఛను పథకం క్రింద ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి, మా ప్రభుత్వం మరింత లాభదాయకమైన, స్థిరమైన ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ హామీ పింఛను పథకం(జి.పీ.ఎస్) ను అమలు చేయడానికి ముందడుగు వేసింది. దీని ద్వారా, మన రాష్ట్రము కేంద్ర ప్రభుత్వంతో సహా ఇతర రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించగలిగింది.

గత 5 సంవత్సరాలలో మా ప్రభుత్వం సాధించిన విజయాలు

 • 2018-19 సంవత్సరంలో 11% రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటుతో 14వ స్థానంలో ఉండగా, 2023 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 16.2% నికి పెరగటం వలన 4వ స్థానానికి పురోగమించాం.
 • 2020-21 ఆర్థిక సంవత్సరంలో జరిపిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, సులభతర వాణిజ్యంలో మన రాష్ట్రం 'అగ్రస్థానం' కైవసం చేసుకున్నది.
 • 2018-19 సంవత్సరంలో మన రాష్ట్ర వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3 శాతంతో 12వ స్థానంలో ఉండగా, ఈ రోజు, మన రాష్ట్రం 13% వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 6వ స్థానంలో ఉంది.
 • డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉచిత పంటల బీమా పథకాన్ని రైతులందరికీ వర్తింపచేసిన మొదటి మరియు ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే.
 • 13 లక్షల 5 వేల మంది రైతులకు సేవలను అందిస్తూ, మన రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ బ్యాంకుచే ప్రశంసలు అందుకున్నాయి. ఇథియోపియా, బంగ్లాదేశ్ మరియు వియత్నాం దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు మన రాష్ట్రంలో రైతులకు 'విత్తనం నుండి అమ్మకం వరకు' అందిస్తున్న భరోసాను చూసి తమ తమ దేశాలలో అనుకరించాలనుకుంటున్నారు.
 • సూక్ష్మ నీటిపారుదల పధ్ధతి అమలులో మన రాష్ట్రము రెండవ స్థానంలో ఉంది. అంతే కాకుండా, దేశంలోని మొదటి 15 జిల్లాలలో, 6 జిల్లాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయి.
 • భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.సి.ఏ.ఆర్.) - జాతీయ అరటి పరిశోధన సంస్థల నుండి ఎగుమతి కార్యకలాపాలకు గాను ఉత్తమ రాష్ట్ర అవార్డును మన రాష్ట్రము గెలుచుకుంది. 2019 సంవత్సరానికి ముందు 387 మెట్రిక్ టన్నుల అరటిని మాత్రమే ఎగుమతి చేయగా, నేడు ఒక లక్ష 67 వేల మెట్రిక్ టన్నుల అరటిని ఎగుమతిని చేస్తున్నాం.
 • మన రాష్ట్రము మొత్తం చేపల ఉత్పత్తిలో 30% వాటాతో మరియు మొత్తం సముద్ర ఆహార ఎగుమతులలో 31% తో దేశంలోనే ముందంజలో ఉంది. అందుకు ఫలితంగా 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా అవార్డు పొందటం జరిగింది.
 • పుంగనూరు పశువులను సంరక్షిస్తున్నందుకుగాను, శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం, తిరుపతి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.సి.ఏ.ఆర్.) నుండి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డును అందుకుంది.
 • వ్యవసాయ మార్కెట్ కమిటీలలో షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే.
 • జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది.
 • మన రాష్ట్రం నేడు అంకుర సంస్థల అభివృద్ధికి దోహదపడే వాతావరణాన్ని కలిగి ఉంది. కొత్త సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల రిజిస్ట్రేషన్లు 2020 సంవత్సరంలో 65,174 నమోదు కాగా నేడు 2023 సంవత్సరంలో ఈ రిజిస్ట్రేషన్లు 7 లక్షల 20 వేలకు పెరిగాయి.
 • దేశంలో 5% వాటాతో మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల అభివృద్ధి పరంగా మన రాష్ట్రం 7వ స్థానంలో ఉంది.
 • 2017 సంవత్సరానికి ఒక లక్ష 17 వేల మంది సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలలో ఉపాధి పొందుతుండగా, ఉద్యమ్ పోర్టల్ క్రింద ఈ ఉపాధి కల్పన 2023 సంవత్సరం నాటికి గణనీయంగా పెరిగి, ఈ తరహా సంస్థలలో 27 లక్షల 45 వేల మంది ఉద్యోగులు ఉపాధిని పొందుతున్నారు.
 • మన రాష్ట్రము 'ఒక జిల్లా-ఒక ఉత్పత్తి' క్రింద ఉప్పాడ జన్దనీ చీరలకు బంగారు బహుమతిని పొందటమే కాకుండా, చేనేత ఉత్పత్తుల క్రింద మరో నాలుగు అవార్డులను అందుకుంది.
 • ప్రధాన మంత్రి పట్టణ ఆవాస యోజన క్రింద ఉత్తమ పనితీరు అవార్డును మన రాష్ట్రము అందుకుంది. అదే విధంగా, మన రాష్ట్రానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి నుండి ఉత్తమ గృహ నిర్మాణ అవార్డును అందుకున్నారు.

 • మైక్రోసాఫ్ట్, జిందాల్, రిలయన్స్, అదానీ, లారస్ సింథసిస్, TCS, Infosys, Hero Motocorp, Yokohama, Grasim Industries, Greenko Energy వంటి అనేక దిగ్గజ పరిశ్రమలు గత 4 సంవత్సరాలలో మన రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయి.
 • మన రాష్ట్రము 2022 సంవత్సరానికి గాను, అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల జాబితాలో 3వ స్థానాన్ని పొందింది.
 • విశాఖ పట్టణంలోని రుషికొండ బీచ్ అత్యంత పర్యావరణ అనుకూలమైన బీచ్ ‘బ్లూ ఫ్లాగ్' లేబుల్ను పొందింది.
 • 2023 సంవత్సరానికిగాను ఉత్తమ పర్యాటక గ్రామంగా లేపాక్షి గ్రామం కేంద్ర ప్రభుత్వ అవార్డు పొందింది.
 • మన రాష్ట్రము క్లీన్ మరియు గ్రీన్ పునరుత్పాదక ఇంధనం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడం, పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యతలను నెరవేర్చటం, ఇంధనం మరియు మౌలిక సదుపాయాల వినియోగం అనే మూడు అంశాలకుగాను, మన రాష్ట్రం 15వ ఎనర్షియా అవార్డు-2023 క్రింద మూడు అవార్డులను అందుకుంది.
 • పాలసముద్రంలో అత్యాధునిక వసతులతో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) కి ప్రాంగణాన్ని స్థాపించడంలో మా ప్రభుత్వం మద్దతును ఇచ్చింది. 500 ఎకరాల విస్తీర్ణంలో, ఈ ప్రధాన కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర మరియు భాగస్వామ్య దేశాలలోని రెవిన్యూ సర్వీస్ ఆఫీసర్ల సామర్థ్య పెంపుకై శిక్షణను అందించటం జరుగుతుంది.
 • గ్రామ పంచాయతీలలో థీమాటిక్ అప్రోచ్స్ - హెల్తీ విలేజ్ ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ కోసం పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2024 జనవరిలో 3 రోజుల జాతీయ శిక్షణా శిబిరాలను తిరుపతిలో నిర్వహించింది.
 • 2023 ఫిబ్రవరిలో తిరుపతిలో ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ భాగస్వామ్యంతో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ ఇన్నోవేషన్ సమావేశాలను నిర్వహించటం జరిగింది.

కేంద్ర రాష్ట్ర సంబంధాలు విభజన సమస్యల పరిష్కారం

146. 2014 సంవత్సరంలో మన రాష్ట్రం విపత్కర పరిస్థితులను చవిచూసింది. అయితే, గత ప్రభుత్వం అవసరమైన సమయంలో సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి, అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన హక్కులు పొందేందుకు ఎటువంటి ముఖ్యమైన చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర విభజన తరువాత అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలు వారసత్వంగా రావడం మరియు పొరుగు రాష్ట్రంతో ఉన్న విభేదాల వలన మేము మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడవలసి వచ్చింది. 2014-15 రెవిన్యూ లోటు గ్రాంటు క్రింద 10,460 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేయించడంలో విజయం సాధించాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రము నుండి మన రాష్ట్రానికి 6,756 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యేలా కృషి చేసాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు సంబంధించి మన రాష్ట్రం మరియు తెలంగాణా రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన 1050 కోట్ల రూపాయల గ్రాంటును రాబట్టగలిగాము. 15వ ఆర్థిక సంఘంను ఒప్పించడం ద్వారా, 30,497 కోట్ల రూపాయల గరిష్ట రెవెన్యూ లోటు గ్రాంటును సాధించుకోగలిగాము. అంతేకాకుండా, మా అలుపెరగని పోరాటం ద్వారా, పోలవరం ప్రాజెక్టు నవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. మన కృషి మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిగిలిన ఇతర సమస్యలకు కూడా త్వరలో పరిష్కారం లభించబోతోంది. 2024-25 కి కేటాయింపులు

ఖాతాలు 2022-23

147. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఖరారు చేసిన ఫైనాన్స్ ఖాతాలు రెవెన్యూ లోటు రూ. 44,487.49 కోట్లు, మరియు ద్రవ్య లోటు రూ.52,508.34 కోట్లు, ఇది ఆర్థిక సంవత్సరానికి 2022-23కి GSDPలో వరుసగా 3.30% మరియు 3.98%.

సవరించిన అంచనాలు 2023-24

148. 2023-24 ఆర్థిక సంవత్సరం కోసం రెవెన్యూ వ్యయం కోసం సవరించిన అంచనా రూ.2,28,237.77 కోట్లు, అయితే మూలధన వ్యయం కోసం ఇది రూ.27,308.12 కోట్లు. 2023-24లో రెవెన్యూ లోటు దాదాపు రూ.31,534.94 కోట్లు, అదే కాలానికి ద్రవ్య లోటు దాదాపు రూ.60,153.59 కోట్లు, ఇది GSDPలో వరుసగా 2.19% మరియు 4.18%.

2024-25 బడ్జెట్ అంచనాలు

149. 2024-25 ఆర్థిక సంవత్సరానికి, నేను రూ. 2,86,389.27 కోట్లు, ఆదాయ వ్యయం అంచనా రూ.2,30,110.41 కోట్లు, మరియు మూలధన వ్యయం రూ.30,530.18 కోట్లు. అంచనా రెవెన్యూ లోటు దాదాపు రూ.24,758.22 కోట్లు మరియు ద్రవ్య లోటు సుమారు రూ.55,817.50 కోట్లు. ద్రవ్య లోటు GSDPలో దాదాపు 3.51% ఉంటుంది, అయితే రెవెన్యూ లోటు GSDPలో దాదాపు 1.56% ఉంటుంది.

ముగింపు

అబ్రహం లింకన్ గారి మాటలలో...

"భవిష్యత్తును అంచనా వెయ్యడానికి అత్యంత నమ్మదగిన మార్గం,
ఆ భవిష్యత్తుని సృష్టించడం”

150. మన గౌరవ ముఖ్యమంత్రి గారి తిరుగులేని నాయకత్వంలో, ఈ ఐదేళ్ళలో మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ-ఆధారిత పాలన వలన మన రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, శ్రేయో రాజ్య స్థాపన జరిగింది. విభిన్న కార్యక్రమాలు, స్ఫూర్తిదాయక పథకాలు మరియు విస్తృత విధి విధానాలు సమ్మిళితమై మన రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తును స్వయంగా ఎవరికి వారే లిఖించుకునే విధంగా స్వయం సాధికారత పొందే దిశలో వారిని నడిపిస్తున్నాయి. మన ముందున్నది మన రాష్ట్రం యొక్క ధృడమైన, ఉజ్వల భవిష్యత్తు.

ఈ సందర్భంగా స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకమైన మాటలను గుర్తు చేస్తున్నాను...

“మనం ప్రస్తుతం వున్న స్థితికి మనమే బాధ్యులం.
మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకుంటున్నామో,
అది నిర్ణయించే శక్తి మన చేతుల్లోనే వుంది.
మనం ఇప్పుడు వున్న స్థితి గత చర్యల ఫలితం అయితే,
భవిష్యత్తులో మనం ఉండబోయేది
మన ప్రస్తుత చర్యల మీద ఆధారపడి ఉంటుంది.
కాబట్టి మనం ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి”

ఈ మాటలతో, బడ్జెట్ ను గౌరవ సభ ఆమోదం కోసం నేను సమర్పిస్తున్నాను.

జై ఆంధ్ర ప్రదేశ్
జై హింద్

*****

This work is available under the Creative Commons CC0 1.0 Universal Public Domain Dedication.

The person or the organisation responsible for this work, associated with this deed has dedicated the work to the public domain by waiving all of his or her rights to the work worldwide under copyright law, including all related and neighboring rights, to the extent allowed by law. You can copy, modify, distribute and perform the work, even for commercial purposes, all without asking permission.