ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1920/గుంటుపల్లి గోపాల కృష్ణకవి

వికీసోర్స్ నుండి


గుంటుపల్లి గోపాలకృష్ణ కవి

కొణిదెన బాలకృష్ణయ్య గారు

గోపాలకృష్ణకవి వర్తమాన శతాబ్దపు ప్రబంధకవులలో నొక్కఁడు. ఈయన నందవరీక బ్రాహ్మణుడు. ఇంటిపేరు గుంటుపల్లి వారు. నివాసస్థలము గుంటూరు మండలమునందలి నర్సారావుపేట తాలూకాలోని చెన్నుపల్లి గ్రామము.వసిష్ఠ గోత్రము. తండ్రి కోటిలింగము. తల్లి అనంతలక్ష్మమ్మ. సోమ మంత్రికిని వేంకమాంబకును పౌత్రుడు. సుప్రసిద్ధుడును, విద్యలభాస్కరుని తండ్రియు, నగు గుంటుపల్లి ముత్తనామాత్యుని వంశమునకుఁ జేరినవాడు. ఈ ముత్తనామాత్యుని శౌర్యాదుల నీ క్రిందిపద్యములు తెలుపుచున్నవి.

క. నాలుగు దుర్గంబులు పదునా
    లుగు దేశములప్రజల నయమార్గగమునన్
    లాలింపుచుఁ జిరకాలము
    పాలించెను ముత్తమంత్రి ప్రభుమాత్రుండే !

సీ. దుమ్ము ధూళిగఁ జేసి తూర్పారఁ బట్టఁడే
                     కోపాగ్నిచే బొమ్మలాపురంబు
   నుగ్గునూచంబుగా నూర్పిడిఁ జేయఁడే
                     ధాటి మీరఁగ నెఱ్ఱిపాటికోట
   ఖండతుండములుగాఁ జెండి......డఁ డే
                     దండిబోయలకోట చుండికోట
   కుటిలవైరులద్రుంచి కొల్ల బెట్టించఁడే
                      శ్రీలు మీరఁగఁ దోరణాలకోట

గీ. ఫాదుషాదత్త ఘనరాజ్య పదనిరూఢిఁ
    జెంది శ్రీ గుంటుపలికులశేఖరుం డ
    టంచు నీవైరిమంత్రు లి ట్లండ్రు భువిని
    మంత్రికులహేళి ముత్తనామాత్యమౌళి.

మఱియు నీ ముత్తనామాత్య వంశజులు,

" ఉ. రాజితకీర్తిశాలి యగు రాయనిబాచ! భవద్యశంబు ది
       క్పూజిత మౌచు మించె సురభూధరభూధరభూధరేంద్రకాం
       తాజసుగోత్రరుగ్విధురధాంగరథాంగరథాంగశేషభా
       షాజలజాహితా౽హితతుషారతుషారతుషారధాములన్"

అని నుతింపబడిన రాయనమంత్రిభాస్కరునికి వంశమువారికి సమీప బంధువులును, భాస్కరసముపార్జిత భూమ్యాది వసతులందు వంశముఁ గొన్నవారును నై యున్నారు.[కీ.శే. గుంటుపల్లి సోమయ రచితంబగు భాస్కర చరిత్రము చూడుము]. అహోబలపతి కడచన్న యనంతరము వినికొండసీమయందు గోపాలకృష్ణకవి తప్ప ఉభయభాషా భూషణుఁ డగు పండితకవి యొక్కఁడును జనించి యుండలేదు. ఈతఁడు దాదాపుగ నఱువదేండ్లకాలము జీవించి క్రీ. శ.1917 సంవత్సర ప్రారంభమునఁ బరలోకమున కరిగెను. ఈకవి నిరతాన్న ప్రదాత యని పేరెన్నికఁ గన్నవాడు. అసాధారణ లౌకిక వ్యవహారదక్షుడు. సంస్కృతాంధ్ర సాహితీ దురంధరుడు.

రంగావజ్ఝల రామకృష్ణయ్య కడ నితఁడు కావ్యపాఠ మొనర్చినట్లు తన బుధజనహృదయాహ్లాదమున నిట్లు వ్రాసియున్నాఁడు.

క. "శృంగార కావ్యపాఠం
     బంగీకృతిఁ బరచినట్లు యమలు... మహాత్మున్
     రంగావజ్ఝలకులజుఁ బొ
     సంగ న్శ్రీరామకృష్ణుసభ్యు నుతింతున్

గురుభక్తిపరాయణుండగు నీయన తనకుఁ దత్వోపదేశ మొనర్చిన గురుల నిట్లు పొగడియున్నాఁడు.

సీ. " ఏసామి తారకాహిత వర్ధనక్రియా
                  శక్తి లీలాశయవ్యక్తిఁ దనరె
       ఏమేటి షణ్ముఖశ్రీ మహిమాధార
                   పరశివాకృతి సమాదరతఁ బొనరె
       ఏకృతి స్వకుమారతా కేళికాకృత
                   బ్రహ్మబద్ధప్రభావమున నెసఁగె
       ఏగుణి నిజధర్మ యోగకదంబ వి
                   దారితరిపుధరాధరతిఁ బొసఁగె
       
      నట్టి పిశుపాటి వంశదుగ్ధాంబురాశి
      చంద్రుఁడై మజ్జనుఃపుణ్య సఫల దివ్య
      తత్వ మిడి ముక్తిపథకారణత్వ గరిమ
      బరఁగుచుండు సుబ్రహ్మణ్య గురునిఁ దలఁతు
                                                          - బుధజనహృదయాహ్లాదము

క. " మీకున్ శిష్యుఁడ నజ్ఞుఁడ
      వ్యాకరణాదుల నెరుంగ వరకృపశతమున్
      జేకోను సుమమాలికఁ గా
      శ్రీకృతిజనవినుతకామ శ్రీశివరామ." - శివరామ శతకము

చ. " సిరియును బిడ్డలు న్గలిగి శ్రేయము జెందుటెకాక, సభ్యు లం
        దఱుఁ గొనియాడ న్యాయసభఁ దాను వకీలుగ నుండి సత్యమే
        శరణ మటంచు నీతులను చాటుచు లోకుల బోధసేయు మ*
        ద్గురు నిధనంబు నేటివఱకు న్దెలుప న్వలసె న్గదా ! కటా
                                                 *వీరి గురువు వెలగపూడి దక్షిణామూర్తి గారు

గోపాలకృష్ణకవికి శ్రీగిరిమల్లికార్జనుడిష్ట దైవము. ఈతఁడు సకల వేదాంత రహస్యము లెఱింగిన ప్రోడ.తన గ్రంథములలో శివరామశతకము,జమత్కారనిదానము తప్ప తక్కిన వాటినన్నింటిని భగవత్పరముగ నంకిత మిచ్చియున్నాడు. పూర్వకవులు కొందఱవలె నీయనయు దనకు భగవత్సాన్నిధ్య మొదవి నట్లును తదనుజ్ఞచేఁ జీర కావ్యరచనాక్రమం నంబునకు నుపక్రమించినట్లును చెప్పియున్నాడు. వీరింట బురాతనమునుండి ప్రతితరము వారిచేతను పూజింపబడుచున్న "శ్ర్రీమన్మరకతేశ్వర దివ్య జ్యోతిర్లింగము" కలదు. గోపాలకృష్ణకవి. "మరకత లింగా” యను మకుటముతో నీ లింగమున కొక శతకము నంకిత మిచ్చి యున్నాడు.

గోపాలకృష్ణ కవికి పూర్వకవుల కవిత్వము పై నభిమానము మెండు. ఈయన చతుర్విధ కవిత్వ రచనా వివక్షుణుఁడు, తన గ్రంథములందందు బంధ, గర్భ, కవిత్వము సుపయోగించి యున్నాడు. ఆధునికులలోఁ గూచిమంతి తిమ్మన - ఏనుఁగు లక్ష్మణకని - వీరి కవిత్వముపై నీతనికిఁ బక్షపాత మతిశయము.

పూర్వకవికృతాంధ్రకావ్యంబుల గొన్నిఁటిఁ బ్రకటించుటకును నేటికిని భాషాంతరీకరింపఁబడ కున్న సంస్కృతమునందలి కొన్ని యుత్తమ గ్రంథములఁ దెలిగించుటకును, నీతఁడు సంకల్పించె. కాని యవిలంఘ్య మగు విధివిధాన మట్లు సాగనిచ్చినది కాదు.

ఈకవి రచించిన గ్రంథములు (1) బుధజనహృదయాహ్లాదము.(ప్రబంధము) (2) చమత్కార నిదానము. (ఏకాశ్వాసము) (3)పార్వతీ పరిణయము. (నాటకమ) (4) వై శాఖమహాత్మ్యము, ( భాషాంతరీకరణము) (5) శివరామశతకము. (6) మరకతలింగశతకము. శైలిని పరిశీలించుటకు ఈతని గ్రంథములలోని కొన్ని పద్యముల నిచ్చుచున్నాను.

మ. కరిణీ రాజము పద్మరేణుపటలీ గంధాఢ్య గండూష పు
     ష్కర మాత్మాధిప దంతినాధునకు వేడ్కం ద్రావఁగా నిచ్చె, నం
     తరధాంగంబు సమార్థజగ్థబిసఖండశ్రీ స్వజాయ న్సమా
     దరత న్మన్ననఁ జేసె నప్పుడు మధూద్యత్ప్రాభవం బెట్టిదో!

ఉ. "ఓసఖ! వింటె, వర్ష సమయోదిత నీరద దర్శనా సమో
      ల్లాస విలాస లాలస కలాప నటత్పటు కేకిలోకకే
      కాసమనాయమిశ్రమృదు కాకలికాకుల కోకిలారవ
      శ్రీసుఖకృత్సుధామధుర శీతలగాననినాద వైఖరుల్." .
                                                                              బుధజనహృదయాహ్లాదము

ఉ. "దీప్ర చతుశ్శిఖాగ్ర, సమధిష్టిత వీరభటాగ్రగణ్య హ
     స్తప్రకటాంగుళీనఖవిదారిత నందవకల్పసూనదా
     మప్రియ ధారణాగతసమంచితయోషిదుపేత తత్పురీ
     వప్రము,రాజహంసబహుపారగమా గమపై రహిం దగున్ "
                                                                                     చమత్కారనిదానము.
మ. “నముచి న్వృ త్రు బలు న్హరించి యవల న్నా నాకులక్ష్మాధరో
      త్తమపక్షంబులం ద్రుంచి ధర్మనిరతిన్ ద్రైలోక్యరక్షా సము
      ద్యమదక్షుం డగు నాకు తారకునియం దబ్జాతసూతి ప్రసా
      దము విఘ్నంబనియెంచెదొక్కొ? కనుమింతన్నా భుజాటోపమున్"
                                                                                    పార్వతీ పరిణయము.
ఉ. “పోకయు మంచిగందమును పొందుగ నారికెడంబు నెవ్వఁడే
     వీఁక ద్వితీయమాసమున విప్రున కిచ్చిన, వాడు సప్తజ
    న్మాకలితద్విజుండును ధనాఢ్యుఁడు నై శ్రుతి పారగుండు నై
    యాకడ సప్తగోత్రముల నందఱతోఁ గనుఁ దా వికుంఠమున్ "
                                                                                     వైశాఖమాహాత్మ్యము.

ఈకవివంశమువారు, దాతలు మాత్రమే గాక, కవులును కవిగణపోషకులును నై గణుతికెక్కి, యున్నారు. వీరి పూర్వుఁడు కాటేపల్లి తిప్పమంత్రికి కొటికెలపూడి సోమనాథుని విష్ణుమిత్రోపాఖ్యాన మంకితము చేయఁబడినది. గుంటుపల్లి ముత్తమంత్రి సౌగంధికాపహరణ మను పద్య కావ్యమును కృతిగఁ గైకొనెను. గుంటుపల్లి ఎల్లప్ప నిగమార్థ మననము, అద్వైతమకరందము నను గ్రంధములను, పెదరామన్న దాశార్హచరిత్రమును, గుంటుపల్లి సోమయ్య రాయన భాస్కర చరిత్రము ముత్త నామాత్య చరిత్రము విశ్వకర్మాన్వయ ప్రదీపికా విమర్శనము కథా సారము నను వాక్యగ్రంథములను, గోపాలకృష్ణకవి రెండవకుమారుఁడు శివానందము శశికళా సుదర్శనీయ మను గ్రంథమును రచించిరి.