Jump to content

ఆంధ్రకామందకము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ఆంధ్రకామందకము

ద్వితీయాశ్వాసము

క.

శ్రీరామచంద్రచరణాం
భోరుహసేవాధురీణ బుధవినుతసుధా
ధారామరాళకీర్తివి
హారా కొండ్రాజువేంకటాద్రినరేంద్రా.

1


వ.

అవధరింపుము.

2

విద్యావిభాగము

గీ.

నృపతి దెలియంగవలయు నాన్వీక్షకియును
ద్రయియు వార్తయు మఱియును దండనీతి
వీని జదివినవారిచే వీనిక్రియల
నలరువారలచే వినయంబుఁ జెంది.

3


వ.

అది యెట్లన్నను నీనాల్గువిద్యలే సకలమగు జగంబు నిలుపు
టకుం గారణం బగుచు నుండు వెండియు నాన్వీక్షకి త్రయీవిద్య
యందలిభేదం బగుటచేసి త్రయీవార్తాదండనీతు లివి మూఁడు
విద్యలే యని మనుమతంబువారు పల్కుచుండుదురు. లోకం
బర్థప్రధానంబు గావున వార్తయు దండనీతి యను నివి రెండు
విద్యలే యని గురుమతంబువారలు పల్కుచుండుదురు. సర్వ
విద్యారంభంబులు దండనీతియందు నుండుం గనుక దండనీతి
యొకటియ యని శుక్రమతంబువారు పల్కుదురు. వేఱువేఱ

వీనికిఁ బ్రయోజనంబులు గలుగుటంజేసి యాన్వీక్షకీత్రయీవార్తా
దండనీతు లనం గలుగు నాలుగువిద్యలు ననునది యీ కామందుక
మతంబునకు సమ్మతంబు.

4


సీ.

అన్వీక్షకీవిద్యయం దెఱుంగగఁ దగు
           నాత్మస్వరూప మాద్యంతముగను
ధర్మస్వరూపం బధర్మస్వరూపంబు
           నల త్రయీవిద్యయం దమరుచుండు
నర్థంబుతెఱఁగు దురర్థంబుతెఱఁగును
          వార్తచేఁ దెలియంగవలయు నెపుడు
మఱి దండనీతియం దెఱుఁగంగవలయును
          నీతివిద్యలును దుర్నీతివిధము


గీ.

దండనీతిని బాయుచోఁ దక్కినట్టి
విద్య లవి మూఁడు మంచివై వెలసియుండి
యైన విఫలంబులగు లేనియటుల దండ
నీతి నొందిన విభున కిన్నియు ఫలించు.

5


క.

జనవిభుఁడు దండనీతిన్
దనరినఁ బద నెఱుఁగువారు దక్కినవా రె
ల్లను జదువుచుండ్రు విద్యల
ననిశం బాసక్తి మించ నంచితమతులై.

6

వర్ణాశ్రమ వ్యవస్థ

గీ.

ధరణి వర్ణాశ్రమముల కాధారమైన
యట్టివిద్యల రక్షించునట్టి యధిపుఁ
డఖిలవర్ణాశ్రమములవా రాచరించు
పుణ్య మాఱవపాలు దాఁ బొరయు నండ్రు.

7

సీ.

ఇల సుఖదుఃఖంబు లెఱిఁగించుకతమున
          నాన్వీక్షకీవిద్య యాత్మవిద్య
యగు దానిచేఁ దత్త్వ మరసినవాఁ డెందు
          దుఃఖంబు సుఖమును దొలఁగఁ ద్రోయు
నల ఋగ్యజుస్సామములు త్రయీవిద్యయౌ
          ననువుగా నెఱుకతో నందు మెలఁగు
నతఁ డిహపరములనందును మఱియును
          న్యాయమీమాంసలు నంగములును


గీ.

ధర్మశాస్త్రపురాణవేదములు నెపుడు
ధరణిలోపలఁ ద్రయి యనఁ బరగు వార్త
([1]నాఁ దనరుచుండుఁ బశుపాలనంబు గృషియుఁ
బణ్యమును వీనిచే లోకపాలనమగు.)

8


సీ.

([2]ఈవృత్తులను లోక మెల్ల వర్తించుట
            వార్త జీవన మన వరలుచుండు)
ఆశిక్షణముఁ జేయ నధిపతి దండనా
            మము నొందు నతనిసన్మార్గమునను
బోధించునది నీతి పొందుగా నిందుచే
           నీతిశాస్త్రము దండనీతి యయ్యె
నాదండనీతిచే నఖిలలోకోపకా
          రములైన విద్యలరక్షణంబు


గీ.

నాత్మరక్షణమును జేయనగును విభున
కటులఁ బరిపాలనము సేయునట్టిరాజు
రా జనఁగ మించి సకలధరాతలంబు
నేలుఁ బ్రజ మెచ్చ విఖ్యాతలీలతోడ.

9

గీ.

ఎందుచేతను బురుషార్థ మెఱుఁగఁబడు వి
వేకులకు నందు కలరును విద్యపేరు
విద్య యను శబ్దమును బ్రభవింపఁజేసి
యమరు విద ధాతు వదియు జ్ఞానార్థకంబు.

10


సీ.

యజనంబు దాన మధ్యయనంబు నివి విప్రు
           లకు రాజులకు వైశ్యులకు సమములు
సత్ప్రతిగ్రహము యాజనము నద్యాపనం
          బును విప్రులకె ధర్మములు దలంప
శస్త్రజీవనముఁ బ్రజారక్షణంబును
         క్షత్రియధర్మముల్ ధాత్రిలోనఁ
బణ్యంబుఁ గృషియును బశుపాలనంబు ని
         మ్మహిని వైశ్యులకు ధర్మం బటండ్రు


గీ.

క్రమముతోడుత నిట్టి వర్ణముల సేవ
సేయుటయు శూద్రధర్మ మీ సేవ కారు
చారణుల్ సేయు పనులును జగతిలోన
ననిశమున్ వీరి కెల్ల జీవనము లండ్రు.

11


సీ.

గురునింట నుండుట గురుఁ గొల్చుటయు హోమ
           ములు సేయుటయు వ్రతములు సలుపుట
చదువుట ముప్ప్రొద్దుఁ జన్నీళ్ళ మునుఁగుట
           భిక్ష యెత్తుట ప్రాణభీతియందు
గురుఁ బాయకుండుట గురువు లేకుండిన
          గురుసుతుం దనతోడఁ గూడిచదువు
వాని నల్లనఁ గూడి వర్తించుటయు బ్రహ్మ
         చారిధర్మంబులు చదువవచ్చు

గీ.

దనుక దండంబు ముంజియుఁ దాల్చి జడల
నంటి యైనను మఱి ముండుఁ డగుచు నుండి
యైనఁ దగి బ్రహ్మచారి దా నాశ్రమాంత
రంబు దనయిచ్చఁ జెందు టర్హం బటండ్రు.

12


సీ.

అగ్నులఁ బూజించి యతిథుల నర్చించి
           దేవతలకుఁ బితృదేవతలకుఁ
గ్రమమున నారాధనములఁ జాల నొనర్చి
           యిరుప్రొద్దు దానమ్ము లెపుడు చేసి
ధర్మశాస్త్రముల వేదముల యర్థంబుల
           సంతతంబును వేడ్కఁ జదివి తెలిసి
తమతమయర్థముల్ తప్పక జీవనం
           బులు చేసికొనుచు దీనులను బ్రోచి


గీ.

సత్యమున మించి నిజకులసతులఁ బర్వ
వర్జమైయుండఁ గూడి సద్వర్తనమున
మెలఁగనేర్చుట యాదిగాఁ గలుగునిదియ
మహి గృహస్థుల కెల్ల ధర్మం బటండ్రు.

13


సీ.

జడలు దాల్చుటయును బుడమిఁ బరుండుట
             మూఁడువేళల నీళ్ళ మునుఁగు టెప్పు
డజినముల్ గట్టుట యగ్నులఁ గొల్చుట
             యతిథిజనంబుల నరయు టెందు
నడవుల నుండుట యలకందమూలముల్
            నివ్వరికూళ్ళును నీళ్ళుఁ బండ్లు
జీవనంబులు గాఁగఁ జేసి వర్తించుట
            జేజేలపూజలు సేయుటయును

గీ.

బ్రహ్మచర్యంబు విడువక పరగు టెంచి
యొరులు దానంబు లిచ్చిన నొల్లకుంట
మదిని బ్రహ్మానుసంధాన మహిమఁ గనుట
ధరణి వనవాసులకు నెల్ల ధర్మ మండ్రు॥.

14


సీ.

అనిశంబు సకలమైనట్టి యుద్యోగముల్
          విడుచుట భిక్షంబుఁ గుడుచుటయును
చెట్లక్రిందట నున్కిచేయుట ద్రోహంబుఁ
          దొడరక సకలజంతువుల సమత
గనుట యెద్దియుఁ బుచ్చుకొనకయుండుట ప్రియం
          బును నప్రియంబుఁ గైకొనకుడుగుట
పలుకుల నియమంబుఁ గలుగుట సుఖదుఃఖ
         ముల వికారములేక మెలఁగుటయును


గీ.

ధారణాధ్యానములు బ్రహ్మచారి యగుట
యెందు బాహ్యాంతరశుచిత్వ మందుటయును
భావశుద్ధియు నింద్రియప్రకరజయము
నాది యైనవి ధర్మముల్ యతుల కెందు.

15


గీ.

హింస మానుటయును నిర్జితేంద్రియత్వ
మోర్పుఁ గరుణయు నిజమాడునేర్పు శుచిత
సకలవర్ణాశ్రమములవారికిని గల్గి
యుండఁగాఁదగు ధారుణీమండలమున.

16


సీ.

వర్ణాశ్రమంబులవారికి ధర్మముల్
          స్వర్గంబు మోక్షంబు సమకొనంగఁ
జేయు నీధర్మంబు లేయెడ లేకున్న
         సంకరంబందు నీజగతియందు

ధారుణీవిభుఁ డిట్టిధర్మంబు లెల్లను
           నడపింపగాఁ గర్త న్యాయలీల
నతఁడు లేకుండిన నడఁగును ధర్మంబు
           ధర్మంబు లేకున్న ధరణి చెడును


గీ.

సకలవర్ణాశ్రమంబులజాడ లెఱిఁగి
వానిధర్మంబు లెల్లను వరుస నాచ
రించఁగాఁ జేసి వాని రక్షించునట్టి
ఘనున కిహమును బరమును గలుగు నెందు.

17


క.

ఈలీలను ధర్మంబులు
పాలించినయట్టిరాజు ప్రబలుచు నుండున్
మేలుగ నటుగావున భూ
పాలుఁడు దగునాజ్ఞచేతఁ బ్రజ నేలఁదగున్.

18

దండమాహాత్మ్యము

ఆ.

అధికదండనమున నళికిపోదురు ప్రజ
లల్పదండనమున నళుక రెందు
నిటులుగాకయుండ నిలనేలుపతి యుక్త
దండనంబె కలిగియుండవలయు.

19


క.

జనపతి తగుదండనమున
ననిశము ధర్మంబు కామ మర్థము చెందున్
ఘనమైన దండనముచే
మునుగోపము రాదె యడవిమునులకునైనన్.

20


చ.

కడు భయ మందఁజేయక జగంబును శాస్త్రము మెచ్చ నాజ్ఞ యె
క్కుడు సిరిఁ గోరి సేయఁదగు క్రూరతమై భయ మిచ్చు నాజ్ఞచేఁ
దొడరుచునుండు దోషములు దోషమె కల్గినయేని యెయ్యెడన్
బొడమును హాని యట్లగుట బ్రోవఁదగుం దగునాజ్ఞచేఁ బ్రజన్.

ఉ.

ఒక్కధనమ్ముకై దొడరి యొక్కరుఁ డొక్కరి నాక్రమించుటన్
మిక్కిలి భిన్నమార్గమున మించిన యీ జగమందు నాజ్ఞయే
చక్కిని లేక యుండునెడఁ జాలగ హింసలు పుట్టి పెద్దమీ
లొక్కటఁ జిన్నమీలఁ దినునోజలు రాజిలుచుండు మెండుగన్.

22


గీ.

కామలోభాదికంబుచేఁ గైకొనంగఁ
బడుచు నరకంబులోపలఁ బడి ముణుఁగుచు
నుండు లోకంబులను నీతియుక్తివిభుఁడు
నిలుపు దండంబుచేతనే నేర్పు మెఱసి.

23


చ.

అరయ స్వభావలీల విషయంబుల కెందు నధీనమై పర
స్పరవనితాధనంబులకు బారలు సాఁపుచు నుండునట్టి యీ
ధరణి జనంబు మట్టుపడి దండభయంబున మంచివారిచే
నిరతము సన్నుతిం గనుచు నిర్మలమార్గముఁ జెందుఁ బొందుగన్.

24


ఉ.

జంటల యాసలం బరవశంబగు లోకమునందు మంచివాఁ
డుంట విచిత్ర మాజ్ఞఁ దగియుండు కతంబున యుక్తవర్తనన్
గెంటదు లోక మాజ్ఞలనె నిక్కమెకాఁ గులకాంతయుం బతిం
గుంటిని గొంటునుం దెవులుకొంటును బేదను బాయకుండుటల్.

25


శా.

ఈచందంబు లెఱింగి శాస్త్రగతి మున్నెంతే విచారింపుచున్
నీచత్వంబులు మానుచున్ నియతుఁడై నిల్పొంది దండంబుచే
నేచక్రేశుఁడు భూప్రజ న్మెలఁపుఁ దా నెవ్వేళ నాభూపతిన్
వే చెందున్ సిరు లబ్ధిలోమగుడ కందే నిల్చునేర్లుంబలెన్.

26

దీనజనరక్షణము - సజ్జనలక్షణము

క.

అల సమవర్తి యనగ నా
జ్ఞలు సేయుచు ధర్మమార్గచతురుం డగుచున్
నలువవిధంబున భూజన
ముల రక్షింపంగవలయు భూపతి యెందున్.

27

క.

దీనజనరక్షణంబును
దానగుణంబును శమంబు దయయును సత్యం
బూనిన ప్రియవాక్యంబుల్
మానితమైనట్టి సజ్జనవ్రత మెందున్.

28


క.

ఘనమగు దయతోడుత నా
తని యలమటఁ దనదిగాగఁ దలఁపుచుఁ గడుదీ
నుని రక్షింపఁగవలయున్
జనపతి దను మెచ్చి యఖిలజనము నుతింపన్.

29


క.

అనిశము దుఃఖసముద్రం
బున మునిఁగెడు దీనజనుని బ్రోతురు దయ నే
జనములు వారలకంటెను
ఘనులగు సజ్జనులు లేరుగా భువనమునన్.

30


క.

మిగుల ననాథులు నార్తులు
నగుపేదల నూఱడించి యాదుకొనంగాఁ
దగు వారిమీఁద దయనిడి
జగతీపతి ధర్మమార్గసంస్థాపకుఁడై.

31


గీ.

సకలజంతువులను జంపకుండుట యెద్ది
యదియ పరమధర్మ మండ్రు ప్రాజ్ఞు
లిటులగానఁ బతి యహింసకుఁడై దీన
జనులఁ బ్రోవవలయు ననుదినంబు.

32


క.

తనసుఖమునకై యెవ్వం
డనదలఁ బీడించు నాతఁ డాతనికోపం
బనుపేరిటి యనలముచేఁ
గనుగొనఁగాఁ గమలకున్నె కట్టియ పోలెన్.

33

క.

కించిత్సుఖమునకై లో
భించి దయంగుంచి మించి పెద్దలఁగడు మె
ప్పించునె మంచికులస్థుం
డెంచక యిది పాప మనక యిమ్మహిలోనన్.

34


క.

పూనినయట్టి మనోవ్యధ
చే నలఁగుచుఁ గడుఁదెవుళ్ళచేఁ దలఁకుచు రే
పో నేఁడో చెడు మెయికిం
గా నెవ్వఁడు దీనుఁ జెఱుపఁ గడఁగును ధాత్రిన్.

35


క.

ఆయాసార్జితధనముల
నాయెడ నొకక్షణము రమ్యమై యెవ్వేళన్
ఛాయామాత్రంబై తగు
కాయంబుల నీరుబుగ్గగతిఁ జూడఁదగున్.

36


క.

బలుగాలి దూలి వ్రీలెడు
నలమేఘసమూహమట్టు లలరెడు విషయా
రులచేతఁ జిక్కుపడుదురె
వలనెఱుఁగు మహాత్ములైనవారలు ధరలోన్.

37


క.

తొలఁకెడి జలములలోపలి
కలువలచెలికానినీడగతి సకలప్రా
ణులబ్రతుకు చంచలం బని
తలఁచి విభుఁడు మంచిపనులె తాఁ జేయఁదగున్.

38


క.

జగ మెండమావులకు సమ
మగు క్షణికంబగు నపారమగు నంచును రా
జగువాఁడు ధర్మసుఖములఁ
దగులుటకై సుజనుపొందె తాఁ జేయఁదగున్.

39

క.

ఎన్నఁగ సుజనులు గొల్వఁగ
నున్నమహీపతులు మిగుల నొప్పుదు రిలలో
సున్నము చేసినమేడలు
పున్నమవెన్నెలలచేతఁ బొలుపగు మాడ్కిన్.

40


గీ.

సుజనజనులచేష్టితము భూప్రజకు మోద
మొసవు లీలను గలువల పొసగఁ బొదలు
సరసులును జంద్రకళలు వసంతవనము
సంతస మొనర్పలేవుగా సంతతంబు.

41

దుర్జనసంగతి

క.

దోసం బనక తపింపం
గా సుజనులఁ జేయునట్టి ఖలసంగతి రా
జేసరణి నైనఁ గానీ
వేనసవి మరుభూమివోలె విడువన్ వలయున్.

42


క.

కులమును శీలము చదువును
గల సుజనులలోనఁ జొచ్చి ఖలుఁ డేఁచును ని
చ్చలు హేతువు గలుగకె యిం
గల మెండినచెట్ల నేర్చుగతి నెచ్చోటన్.

43


ఉ.

సారెకు వాగ్విషంబు వెదఁజల్లుచు వక్రగతిన్ మెలంగుచున్
గ్రూరత సాధుమంత్రములకున్ భయ మందక యెట్టివేళయం
దూరక చిఱ్ఱుబుస్సుమనుచుండెడు దుర్జనపన్నగంబు ని
ద్ధారుణి రెండునాలుకలు దార్కొను నెమ్మొగముల్ ధరింపుచున్.

44


క.

బుసకొట్టుటచే నెగసిన
విసపుపొగ న్నల్లనైన వెడమోములచే
గసరెడి పాముల పొందులె
పొసఁగున్ దుర్జనులతోడి పొందులకంటెన్॥.

45

క.

పిల్లికిఁ గూ డందిచ్చిన
గోళ్ళం జేఁజివ్వుకొనుచుఁ గూడుం దిను దు
ష్టెల్లవిధంబుల సుజనుని
వల్లనె పోషణము గాంచి వానినె చెఱచున్.

46


క.

ఇలలో ధూర్తజనంబుల
పలుకులు ములుకులటు నొంచుఁ బరజనమర్మ
స్థలములఁ గడుఁదీవ్రములై
బలుపగలం జూపఁ జాలి భయదము లగుచున్.

47


క.

మనమున నెంతయుం గినుక మందటిలన్ సిరిఁ గోరిరేని తా
రనిశము సజ్జనావళుల కంజలి పూనుదు రట్టు లంతకం
టెను గనుపట్ట నంజలి ఘటింపఁదగున్ ధర దుర్జనాళికిన్
వినయగుణంబు మించగ వివేకులు లోకమునందుఁ బొందుగన్.

48

మధురవచోవిచక్షణత్వము

క.

లోకమున కెల్ల మోదము
జోక యొనర్పంగ నోపు చుట్టఱికంబున్
లౌకికమై తగుమాటయుఁ
గైకొనఁగా వలయు జగముఁ గడు గెల్చుటకై.

49


క.

తేనెలు చిలికెడి పలుకులు
మానవపతి పలుకవలయు మహిజనమునెడన్
దా నెంత యీవి గలదొర
యైనన్ నిష్ఠురముఁ బల్క నది భయ మందున్.

50


గీ.

రొమ్ము మొత్తినపగిది జనమ్ము మిగుల
నెట్టిపలుకుల వెతపడు నట్టిపలుకు
పలుకఁగా రాదు కడుబుద్ధిఁ గలుగు నృపతి
యధికమగు వెత చెందినయప్పుడైన.

51

క.

చుట్టలయెడఁ బగతులయెడ
గట్టిగఁ బ్రియ మాడవలయుఁ గడుఁ బ్రియములఁ గ
న్పట్టినదొర కేకలఁ దగి
నట్టి నెమలిలీల నేరి కాప్తుఁడు గాఁడే.

52


క.

కేకుల కేకలు కోకిల
కాకలి రాచిలుక కులుకు కలికి పలుకులున్
జేకుఱఁ జేయవు ముద మీ
లోకమునకు సుజనుపల్కులుం బలె నెపుడున్.

53


క.

దయ విశ్వాసము మర్యా
దయు సుగుణాసక్తిఁ గలిగి ధన మీయఁదగున్
నయగతి ధర్మముకొఱకై
ప్రియభాషల నమృతరసము పెరుగుచు నుండున్.

54


గీ.

ప్రజఁ దను నుతింప నధికసంపదల మించి
పలుకుఁ దేనియ వెల్వారఁ జిలుకుచుండ్రు
చెలఁగి సత్కార మెవ్వరు చేయుచుండ్రు
వారె నరులై చరించు దేవతలు భువిని.

55


క.

పావనుఁడై యాస్తికుఁడై
దేవతలం గొలువవలయ దేవతలబలెన్
భూవిభుఁడు గురులఁ గొలువం
గావలెఁ దనవలెనె మిత్రుఁ గనుగొనవలయున్.

56


క.

సురలను సత్కర్మముచే
గురులను మ్రొక్కుటలచేతఁ గువలయపతి స
త్పురుషుల సుచరిత్రముచేఁ
బరితుష్టులఁ జేయఁదగు శుభం బొదవుటకై.

57

క.

మానినుల భటులఁ బ్రేమను
దానముచే బంధుమిత్రతతి బహుమానం
బూనుటచే దాక్షిణ్యము
చే నితరులఁ గైవసంబు సేయఁగ వలయున్.

58

మహాత్ముల వర్తనము

సీ.

ఒకరికాంతల నింద నొనరింపకుండుట
          పెద్దలయెడ దయఁ బెట్టుటయును
నిజధర్మముల నెల్ల నిచ్చఁ బాలించుట
          యందఱియెడఁ బ్రియ మాడుటయును
కలిమి యెంతగఁ గల్గి గర్వించకుండుట
         యొరుల సంపదలకు నుడుకమియును
బంధుజనంబులఁ బాయక యుండుట
         తనవారితోడుత నెనసియుండు


గీ.

టెనసి వారల మనసురా మనుచుటయును
బరులఁ బరితాపములు బుట్టఁ బలుకకుండు
టఖిలజనములు వినుతింప నలరుటయును
వసుధ నివియె మహాత్ముల వర్తనములు.

59


చ.

చెలిమి దలిర్ప నింటి కెడసేయని చుట్టము వచ్చెనన్న ద
వ్వుల కెదురేఁగి వేడుకఁ గవుంగిటఁ జేరిచి యాదరించి తాఁ
గలిగినకొద్ది నిచ్చి యధికంబగు ప్రాణమునందు వంచనల్
గలుగక యోర్పు గల్గి యుపకారమె చూపుట సాధుకృత్యమౌ.

60


ఉ.

ఎల్లెడ ధర్మయుక్తులయి హెచ్చరికం దగ సంచరించు నా
తొల్లిటివారిమార్గములు ద్రోయని మంచిగృహస్థులెల్ల వ
ర్తిల్లెడు నట్టి మార్గమిది దీన మెలంగెడు నట్టివారికిన్
మొల్లము గాఁగఁ గల్గు నిహముం బరముం బరిపూర్ణకీర్తులున్.

61

ఉ.

నిచ్చలు నిట్టిమార్గమున నిల్పినబుద్ధి దలిర్చు వానికిన్
నిచ్చలమైన శత్రువును నెయ్యపుఁ జుట్టము గాఁగఁ బొందుఁ దా
నెచ్చట నిట్లుగావున మహీపతి మచ్చర మూడ్చి యీజగం
బిచ్చ వశీకరింపఁదగు నింపగు సద్వినయంబు పెంపునన్.

62


ఉ.

ఎక్కుడు గర్వమొందుపతి యెక్కడ భూప్రజ నెల్లఁ గూర్చు బా
గెక్కడ యైన నింపు లెనయించెడి పల్కులఁ బల్కి త్రాళ్ళచే
మిక్కిలి చుట్టి పట్టినను మీరక నిల్కడఁజెంది వారుఁ దా
నొక్కెదనైననుం గడవకుండుచుఁ గైవసమౌదు రెంతయున్.

631


వ.

ఇది మధురవచనప్రకారం బింక సప్తాంగంబు లెఱుంగించెద.

64

సప్తాంగ పరిరక్షణము

గీ.

రాజు మంత్రియు రాష్ట్రదుర్గములు కోశ
మును బలంబును జుట్టము లనఁగఁ దనరి
యొకటి కొక్కటి కుపకార మొనరఁ జేయు
నట్టి సప్తాంగమును రాజ్య మనఁగఁ దగును.

65


క.

ఒక యంగము లేకుండిన
వికలంబై రాజ్యమెందు వెలయదు గానన్
సకలాంగంబులు గలుగన్
బ్రకటింపుచుఁ బతి పరీక్షఁ బరికింపఁ దగున్.

66


క.

మును దా గుణసంగతుఁడై
జనపతి దరువాతఁ బూని సకలాంగములున్
ఘనముగఁ బరీక్ష సేయన్
జను ఘనమనుజేశులెల్ల సన్నుతిసేయన్.

67

క.

ఓజఁ జెలంగని వానికి
రాజత్వము బూని నిలుపరా దట్లగుటన్
రాజిత గుణగణములచే
రాజిలు నరవరుఁడు నొందు రాజత్వంబున్.

68


ఉ.

చెందక చెంది నిల్కడలఁ జెందక యుండెడు రాజనంనదల్
నెందును సద్గుణావళులఁ జెందిన యట్టి మహీతలేరులన్
సిందిసుమంతలేక తగి సన్నపు సున్నపు గారకట్టుచే
నందములౌ తటాకములయందు జలంబులు నిల్చుకైవడిన్.

69


వ.

అందు రాజ గుణలక్షణము.

70


సీ.

మేలెఱుంగుట గులశీలముల్ సత్యంబు
          సత్త్వంబు ప్రాయ ముత్సాహగుణము
మొగమోటమును వేగమునఁ బనుల్ సేయుట
          బుద్ధియుఁ దృఢభక్తి వృద్ధసేవ
మఱి లోకువైన సామంతులు గల్గుట
         ఘనులైన భటులచేఁ దనరుటయును
ధర్మంబు దానంబు ధర్మసహాయంబు
         గలిగి ముందరి కార్యములు నెఱుఁగుట


ఆ.

దనకుఁ దగిన కార్యమునఁ బ్రవర్తించుట
మోసపోవురీతి మొనయ కుండు
టాదియైన సద్గుణావళి గలరాజు
మిగులఁ బ్రజకుఁ జేరఁ దగినవాఁడు.

71


సీ.

బలిమి ప్రౌఢిమయును దలపును వాక్చాతు
          రియు నాయకత్వ మింద్రియజయంబు
నాజ్ఞాధరుండయ్యు నలరుటయును వైరి
          దగిలివచ్చిన నిల్వఁగలుగు టెందు

నలశిల్పమార్గముల్ దెలియుట దుష్టశి
            క్షణము శత్రునివేళఁ గనెడి శక్తి
సంధివిగ్రహముల చందంబు లెఱుఁగుట
           దేశకాలంబుల తెఱఁగు గనుట


గీ.

గుప్తమంత్రుఁడగుట గూడఁబెట్టెడి నేర్పు
గలిగి వెచ్చపెట్టఁ గలుగుటయును
మఱియుఁ గ్రోధలోభమదములు చపలత
విడుచుట ధర భూమివిభుగుణములు.

72


సీ.

విన నిచ్చగించుట వినుట యర్థమును గ్ర
          హించుటయు మఱి ధరించుటయును
నూహలచేత నపోహంబుచే నిశ్చ
         యించుటయును దత్త్వ మెఱుఁగుటయును
బుద్ధిగుణంబులే పొలుపొందు మఱియును
         దక్షతయును శీఘ్రతయును గినుక
శౌర్యము ననఁగ నుత్సాహలక్షణములే
         నివి గల్గువాఁడె మహీవిభుండు


గీ.

త్యాగమును సత్యమును శుచిత్వంబుననఁగ
నమరుచుండును మూఁడు మహాగుణంబు
లిట్టి మూఁడు గుణంబుల నెసఁగు నట్టి
జనపతిని దానె చెందును షడ్గుణములు.

73


సీ.

మఱియును మ్రాన్పాటు మచ్చరంబును దుర్జ
          నత్వంబుఁ బరపీడనంబు నీర్ష్య
కల్లలాడుటయును గరువంబు మానుట
          బ్రియదర్శనంబు శక్తియుఁ గలుగుట

వినుతగాంభీర్యుఁడై వృద్ధోపసేవియై
            యలరుట మంచిమాటలఁ బలుకుట
సరసత సద్గుణజాలంబుపై నను
            రాగంబు గలుగుట రాజగుణము


గీ.

లిట్లు తగు నాత్మసంపద నెసఁగి నీతి
సరణి నిసుమంతయును మీఱి చనక లోక
చర్య లెల్లను గనుఁగొంచు జనులఁ దండ్రి
చాడ్పునను బ్రోచువాఁడెపో జనవిభుండు.

74


ఆ.

ఎట్టి గుణము లంది యేనీతి నడచినఁ
బ్రజలు దన్ను జేరి భక్తిఁగొల్తు
రట్టి గుణము లంది యారీతి నడువఁగా
వలయు రాజు భూమివలయమందు.

75


ఉ.

ఎందును దుర్గుణుండగు మహీపతియైనను మంచిబంట్లఁ దా
జెందిన సద్గుణుండగుచు శ్రీల వహించును గాక దుష్టులం
జెందిన రాజు పాములను జెందిన గందపు మ్రానువోలెఁ దా
నిందితుఁడై జనంబులకు నిచ్చలుఁచేరగరాక యుండఁడే॥

76


క.

పరమపవిత్రులఁ గులజుల
సరసులఁ బ్రజ నెల్లఁగైవసముగా నిచ్చల్
ధర మెలఁగు క్రోధరహితులఁ
బరిజనములఁ జేయవలయుఁ బార్థివుఁడెందున్.

77


వ.

అందు.


క.

చెడుగులగు గడుసుమంత్రులు
కడు సన్మార్గంబు లుడుగఁగాఁ జేసి పతిం
దొడిఁబడఁ జెఱుతురు గనుకె
య్యెడ మంచిప్రధానుతోడ నెనయఁగ వలయున్.

78

క.

నిజముగ సిరిఁ జెందినచో
సుజనుల భుజియింపఁజేయఁ జొప్పడు పతికిన్
నిజముగ నటువలె సుజనులు
భుజియింపని సిరులు వ్యర్థములు ధరలోనన్.

79


క.

కులమును బావనతయు వడి
గలతనమును దండనీతి గడుఁ బనిఁగొను నె
ప్పులు ననురాగముఁ జదువును
గలవార లమాత్యజనులు గావలెఁ బతికిన్.

80


క.

తరుణులయెడ ధర్మమునెడ
నిరవగు నర్థమ్మునెడఁ బరీక్షితుఁడు సదా
పరిశుద్ధుఁ డనగఁ బరగున్
ధరణీపతి యిట్టి మంత్రిఁ దానేలఁ దగున్.

81


సీ.

కడు మహోత్సవవేళఁ బొడగను వేళలఁ
          గనుపట్ట నిచ్చిన కాన్కయండ్రు
భూజనంబులచెంతఁ బొరసిన యదియెల్ల
         పొరబడి యనుపేరఁ బరగుచుండు
పగిది రొక్కములోనఁ బట్టి భక్షించిన
        [3]యరి పట్టుబడియనఁ బరగుచుండు
నితరుల కార్యంబు లీడేర్చుటకు లోన
         లాఁతుగాఁ బట్టిన లంచ మండ్రు


గీ.

వీనిఁ బొరయని మంత్రిగా విభుఁడు లెస్స
యెఱిఁగి యుపథా విశారదు నరయవలయు
నట్టి మంత్రియుఁ బ్రజలకుఁ గొట్టుగాక
పతిహిత మొనర్చి యతనిచే బ్రతుకవలయు.

82

సీ.

మఱియుఁ జెప్పినవెల్ల మఱవక చతురుఁడై
            పనులయం దాసక్తిఁ బరగు, టెందు
నౌఁగాము లెల్ల నూహాపోహ లొనరించి
           యిది తప్పదని నిశ్చయించి కొనుట,
నిశ్చయించినవెల్ల నెమ్మది మఱవక
           చెలఁగి మంత్రంబు రక్షించి కొనుట,
దేశకాలజ్ఞుఁడై తెలివితోడుతఁ గార్య
          సిద్ధులఁ గ్రమ మొప్పఁ జెందుటయును


గీ.

నృపతి మఱచినపని దానె యెచ్చరించి
మంచి మార్గంబుచేతఁ గావించనేర్చు
టాదిగాఁగల్గి యుండెడు నట్టి వెల్ల
ప్రాజ్ఞులగువారు మంత్రి సంపద యటండ్రు॥

83


సీ.

కులశీలబలములు గలిగి స్వదేశస్థుఁ
           డై నృపతికి వశుఁడైన వాఁడు
కనుగల్గి కడుమాటకారియై ప్రోఢయై
          యుత్సాహియై యుక్తి నొనరువాఁడు
చపలత మ్రాన్పాటు జాఱఁజేసినవాఁడు
         బడలికలకు నోర్చి పరగువాఁడు
పావనత్వంబుఁ బ్రభావంబు శౌచంబు
        నిలుకడ సత్యంబు గలుగువాఁడు


గీ.

సత్త్వమును మైత్రి ధారణాశక్తిఁ గలిగి
ప్రజ్ఞ యారోగ్యమును దృఢభక్తిఁగలిగి
శిల్పము లెఱింగి వైరముల్ సేసికొనని
వాఁ డమాత్యవరుండు గావలయుఁ బతికి.

84


వ.

మఱియును.

85

పురోహిత గుణకథనము

ఆ.

దండనీతియందుఁ ద్రయియందు మిగులంగ
నూహ గలుగ వలెఁ బురోహితునకు
నతఁ డథర్వవేదగతిచేత నెప్పుడు
శాంతి పౌష్టికములు సలుపవలయు.

86


గీ.

మఱి పురోహితులందును మంత్రులందు
శాస్త్రదృష్టియుఁ బనుల యెచ్చరికె లనఁగ
గలుగు నీరెండు గుణములు దెలియవలయు
నది యెఱుఁగువారితోఁగూడి యధిపవరుఁడు.

87


సీ.

స్వజనంబుచేఁ గులస్థానముల్ పనులందు
          దృఢచిత్తుఁ డౌటయుఁ దెలియవలయు
జ్ఞానసంపదయు దక్షతయును బ్రతిభయు
          నల యలంకృతులందుఁ దెలియవలయు
ధారణాశక్తి సత్యముఁ బ్రగల్భత కథా
          యోగంబులను గనుఁగోఁగవలయు
మైత్రి శౌచముభక్తి యీత్రితయము వ్యవ
         హారంబులంబట్టి యరయవలయు


గీ.

ధైర్య మనురాగయుక్తి కృత్యములయందు
నిలుకడయుఁ గ్లేశముల కోర్వఁ గలుగుటయును
గడు ప్రభావంబు నుత్సాహ గౌరవంబు
నాపదలవేళ మంత్రియం దరయవలయు.

88


సీ.

సత్యంబు బలమును సద్వర్తనంబును
          దెవులు లేకుండుట దెలియవలయు
సహవాసులై నట్టి జనులచే మఱియును
          శుభరూపుఁడగుటయ క్షుద్రుఁడగుట

వైరంబు లేకుండ వర్తింప నేర్చుట
           వెఱపును జపలత విడుచుటయును
బ్రత్యక్షగతిచేత భావించవలయును
           గానుపించని గుణగణము లెల్ల


గీ.

కార్యములచేత నెప్పుడుఁ గనఁగవలయు
నట్టి క్రియలకు ఫలముచే నరయవలయు
నిన్నిరీతుల లెస్స పరీక్ష చేసి
మనుపవలయును మంత్రుల మనుజవిభుఁడు.

89

మంత్రి పురోహితుల కార్యప్రయోజనము

క.

నరపతి దుర్వర్తనమునఁ
జరియించిన మాన్పవలయు సచివజనంబుల్
నరపతియు సచివవాక్యము
గురువాక్యముపోలె నెన్నికొని నడవఁదగున్.

90


క.

జనపతి యెచ్చరి కెడలిన
మనుజులు గడుఁ జెడుదు రితఁడు మది నెచ్చరికన్
దనరిన మనుజులు బ్రతుకుదు
రినుచేఁ దామరలగుంపు లింపొందుగతిన్.

91


క.

అలరెడుమతి నుద్యోగము
గలిగిన యాయాయి కార్యకర్తలచే ని
చ్చలు రాజు దెలియునట్లుగఁ
దెలిపించుచు మంత్రి దాను దెలియఁగవలయున్.

92


క.

జనపతి యనీతి నడచిన
ననిశము వారించువారె యతనికి హితులౌ
జనులును గూరిమి బంధువు
లనుంగుఁజెలికాండ్రు గురువులై తగువారున్.

93

క.

తా మఱి చదివిన రాజును
గామాంధుండగుచు నుండుఁ గడు నృపమహిమన్
గామాంధుఁడైన జనపతి
యేమిటఁ జెడుపనులు బూనఁ డీమహిలోనన్?

94


గీ.

కామమున మదంబున నహంకారమహిమ
నంధుఁడై జాఱి పడఁబోవునట్టి పతికి
చుట్టములు మంత్రులును జెప్పినట్టి నీతి
దండయై యుండు నెపుడుఁ గైదండ యగుచు.

95


క.

జనపతి కామాతురుఁడై
గనుచుండియుఁ గానలేఁడు గావున నతనిన్
నెనరగు చుట్టపు వెజ్జులు
వినయాంజన మిడుచు మాన్పి వెలయింపఁ దగున్.

96


క.

మదయుతుఁడు దుర్నయుండై
పొదలెడు నృపుఁ గొలుచు మంత్రి పొం దపకీర్తుల్
చెదరని మదమునఁ బొదలెడి
మదమేనుఁగు దిద్దలేని మావంతుగతిన్.

97

రాష్ట్ర సంపత్స్వరూపము

క.

భూమిగుణంబున రాష్ట్రము
దా మించును రాష్ట్ర మెంత దనరినయేనిన్
భూమిపతికి మంచిది యెం
తే మహి యటుగాన మంచిదియె కావలయున్.

98


సీ.

కరపట్టణములపై గనులు ద్రవ్యంబులు
           జలములు ధాన్యముల్ చాలఁ గలిగి
యావులకును మంచివై మనోహరములై
          మేలైన యూళ్ళచే మించఁ గలిగి

వారణంబులఁ బొల్చు వనదేశములు గల్గి
            నీళ్ళ త్రోవలచేత నేల త్రోవ
చే నేటికాల్వలచే నొప్పు భూములు
           నరనాయకులకును సిరు లొసంగు


గీ.

మొరములును జౌడు [4]కొడపలు ముచ్చుబంట్లు
చెట్టుమిట్టలుఁ బుట్టలు వెట్టఁదనము
గుండ్లు ముండ్లును బాములదండ్లు గల్గు
వసుధ యెవ్వేళ సంపద లొసఁగ లేదు.

99

గ్రామ లక్షణము

సీ.

తనకును జీవనం బొనఁగూర్చి శత్రు బా
           ధల కోర్చి భూగుణంబులఁ దనర్చి
జలము లూరెడిచోట్లు గలిగి గట్లకు నున్కి
           పట్టులై కోమట్లు బనులవారు
గాఁపు లుద్యోగముల్ గాంచి దున్నెడువారు
          గడుఁ గల్గి యనురాగగరిమఁ జెలఁగి
పశుసంతతులు గల్గి బహుదేశజనులచే
          నాకీర్ణ మగుచు ధనాఢ్య మగుచు


గీ.

అరయ ధార్మికోపేతమై వ్యసని మూర్ఖు
నాయకుఁడు గల్గు దేశంబు నరవరుండు
బహుళయత్నంబునను వృద్ధిపఱచి ప్రోవ
వలయుఁ బతియందు సంపదల్ వెలయుఁగాన.

100

కోట లక్షణము

సీ.

చెలువమై విరివియౌ సీమ చాలఁగఁ గల్గి
            చెఱకు రాజనములచేలు గల్గి
కలువలు దామరల్ గల యగడ్తలు గల్గి
            వనములు గొండలు గనులు గల్గి

కోటలు నున్నతగోపురంబులు గల్గి
           మేడల వాడల మించు గల్గి
కపురంబు గస్తూరి గల్గు పేటలు గల్గి
           కరితురగాదు లగ్గలము గల్గి


గీ.

యేర్ల మిట్టల గట్టుల నెన్నఁగల్గి
ధీరులును శూరులును గలవారు గల్గి
కవులు జాణలు గాంతలు ఘనులు గల్గి
సిరులు గల రాజధాని వసించవలయు.

101


క.

జలమును ధనమును ధాన్యము
గలుఁగును మందడుల కోర్వఁగల దుర్గము గా
వలయుఁ బతికి లేకుండిన
నల గాలిం దూలు మేఘ మనఁగాఁ దూలున్.

102


క.

జలదుర్గము గిరిదుర్గము
స్థలదుర్గము వనముచేతఁ దగు దుర్గము ను
మ్మలి గల దుర్గము దుర్గం
బులుగాఁ బాటింపవలయు భూపతి యెందున్.

103


క.

జలములు ధాన్యము లాయుధ
ములు రసవర్గములు యోధముఖ్యులు యంత్రం
బులు గల్గి రక్షణముచే
నలరెడు దుర్గంబు దుర్గమనఁ జెలువొందున్.

104


గీ.

తొలఁగిపోఁ జోట్లు గల్గిన దుర్గములును
మడుఁగులును గల్గి తుప్పరేగడలు గల్గి
యలరు భూములు సిరులు గావలసినట్టి
నృపతి కుండుటఁ దగునండ్రు నీతివిదులు.

105

భండారము

సీ.

ఆదాయ మధికమై యల్పవ్యయముఁ గల్గి
           సారె వెచ్చించినఁ దీఱిపోక
ముత్తెముల్ రత్నముల్ మొదలుగాఁ గల్గిన
           సకలవస్తువుల కాశ్రయము నగుచు
నాప్తులై యుండెడి నధికారులును గల్గి
          ధర్మంబుచే నూర్జితంబు నగుచు
తరతరంబులనుండి తగ నూర్జితంబునై
          పొగడొంది దేవతాపూజఁ జెంది


గీ.

పరగు భండార మెందును బలముఁ బ్రోచు
కొఱకు ధర్మార్థములను జేకూర్చుకొఱకుఁ
గడవగారాని యాపదల్ గడచుకొఱకు
రక్షణము సేయవలయును రాజవరుఁడు.

106

బలము

సీ.

మేటియై పెద్దలనాటి మూఁకలు గల్గి
           బహువిధయోధులఁ బలసి వివిధ
యుద్ధంబులకు నోర్చి యొనఁగూడి వశ్యమై
           తనచేత నెపుడు జీతములు గాంచి
వడిగల తనమునఁ గడుఁ బ్రసిద్ధి వహించి
           యన్ని కైదువుల నే ర్పగ్గలించి
పూజ గాంచిన గుఱ్ఱములు నేనుఁగులు గల్గి
           బలమైన రాచవారలఁ జెలంగి


గీ.

నేర్పరులు గల్గి పోటజ్జ నేర్చి యెట్టి
పనులయందును మొనలందు బడలికలను
జెంద కెయ్యడ భేదంబుఁ జెందకుండు
బలము గలుగంగవలయు భూపతికి నెందు.

107

మిత్రలక్షణము

సీ.

కులవంతుఁడై సత్త్వగుణము గల్గినవాని
           బహుసహాయజ్ఞుఁడై పరగువాని
శూరుఁడై ఘనదానశూరుఁడై తగువాని
           మంచిమాటలచేత మించువాని
సిరి గల్గి ఖేదంబుఁ జెందకుండెడివాని
          ననురక్తుఁడై దక్షుఁ డైనవాని
సౌమ్యుఁడై శుచియునై జ్ఞానియై తగువానిఁ
         దరతరంబునఁ జెల్మిఁ దగినవాని


గీ.

నిచ్చమైఁ గూడి వేగంబె వచ్చువాని
నెందు సమసుఖదుఃఖుఁడై యెనయువాని
నాపదలయందు వదలని యట్టివానిఁ
దనకు మిత్రునిగాఁ జేయఁ దగును బతికి.

108


క.

తనయందు నెట్టివేళల
ననురాగము గల్గియుండు టదె సంక్షేపం
బున మిత్రలక్షణం బగు
మనుజేంద్రుం డిట్టివిధము మదిఁ దెలియఁ దగున్.

109

మిత్రుల భేదములు

గీ.

ఔరసులు నందు సంబంధులైనవారు
కడఁగి దేశక్రమాగతుల్ క్రమముతోడ
రక్షణముఁ జెందువారును రాజునకును
బలుదెఱంగుల మిత్రులు దెలియవలయు.

110


వ.

అది యెట్లన్నను.

111

సీ.

మేనమామలసుతుల్ మేనత్తసుతులును
          మేనయల్లుండ్రును మేనమామ
లును దల్లిచెల్లెలి తనయులు నాదిగా
          నౌరసమిత్రులై యలరి మింతు
రల్లుండ్రు బావలు నాలితోఁబుట్టువుల్
          సంబంధమిత్రులు జగతి నెన్న
గడిరాజు నవ్వలికడనుండఁ దగువారు
          దేశక్రమాగతుల్ దెలిసి చూడ


గీ.

నాపదలయందుఁ దనచేతఁ బ్రోపుఁ గనుచు
మెలఁగువారలు రక్షితమిత్రు లగుదు
రిట్టి నలువురు మిత్రుల నెఱిఁగి చాల
మైత్రి గావింపఁ గాఁదగు మనుజవిభుఁడు.

112


క.

దూరమున నెదురుకొనుటయు
సారెకు సమయమున నీయఁజాలుట మనసుల్
చేరికగా మాటాడుట
కూరిమితో మిత్రుఁ గూర్చికొను చందంబుల్.

113


క.

ఇలఁ దనకు మంచిమిత్రుఁడు
గలుగుటకున్ ఫలము ధర్మకామార్థంబుల్
గలుగఁదగు నీతివర్గము
గలిగించని మిత్రు విడువఁగాఁ దగుఁ బతికిన్.

114


క.

మునుమునుపు గొంచెమై నడు
మను బ్రబలుచుఁ బోవఁబోవ మఱిమఱి ఘనమై
యొనరుచు నెడనెడఁ గూడక
యెనసి లసిన్మైత్రి వెలయు నేఱుంబోలెన్.

115

క.

దొర యాప్రకృతిగుణంబుల
బరగిన నుతికెక్కి నిక్కి బవరమ్ములలో
నరివరులఁ గూల్చి పొల్చుం
గరువలి మేఘములఁ గూల్చు కరణిన్ ధరణిన్.

116


క.

జనపతి యీరాజ్యాంగము
లనువొందఁగఁ గూడి నిచ్చ లాదర మెచ్చన్
జనపదము లేలఁగాఁ దగు
ఘనమగు తత్పాలనమునఁ గడుసిరిఁ జెందున్.

117


చ.

అమరెడు లీల నీప్రకృతులందు వసింపుచు నంతరాత్మ ని
క్కము సచరాచరంబగు జగంబున నిండినరీతి భూవిభుం
డమరుచు నున్నయీప్రకృతులందు వసింపుచు నేర్పుమీఱ ని
క్కము సచరాచరంబగు జగంబును నేలు మహాప్రభావుఁడై.

118


చం.

క్రమమున నిట్టిరీతిఁ బలుకం దగి యొప్పెడు రాజ్యమెంచఁగా
నమరును నిల్కడై ధనమునై ధరణీపతి కట్టి రాజ్య ము
త్తముఁడగు మంత్రి గల్గినను ధర్మముఁ గామము నర్థసంపదిన్
సమధికలీలచే నొసఁగి సంతతకీర్తులు నిల్పుఁ దొల్పుగన్.

119


శా.

శ్రీవాణీజయసారధీరసుకవిశ్రేణీనుతాచార వి
ద్యావర్ణాశ్రమపాలనోర్జితనయవ్యాపార దీనావస
ప్రావీణ్యాంచితసద్విచార వినయప్రారంభణాధార వీ
క్షావిభ్రాజిదయాప్రసార విలసత్సప్తాంగరాజ్యస్థిరా.

120


క.

శంకరసుత రఘువరపద
పంకజ భృంగాయమాణ పావనహృదయా
కొంకణ కోలాహల బిరు
దాంక మహాసమరవిలస దయనిశ్శంకా.

121

మాలిని.

చతురగుణవిశేషా సత్యభాషావిభూషా
యతులితగుణదానా యాశ్రితాంచన్నిధానా
శ్రుతిపథయుతచర్యా శూరసంస్తుత్యశౌర్యా
సతతజయవిహారా సంగమాంబాకుమారా.

122


గద్యము :-

ఇది శ్రీమన్మదనగోపాలవరప్రసాదలబ్ధసారసారస్వత
భారద్వాజసగోత్ర జక్కరాజ యెఱ్ఱానామాత్యపుత్ర సుకవిజన
విధేయ శ్రీరామకృష్ణభక్తివైభవభాగధేయ వేంకటనామధేయ
ప్రణీతంబైన [5]కామందుక నీతిశాస్త్రంబున విద్యావర్ణాశ్రమ
పాలనప్రభావంబును దీనజనరక్షణంబును సజ్జనలక్షణంబును
మధురవచోవివక్షణత్వంబును సప్తాంగపరీక్షణంబును నన్నది
ద్వితీయాశ్వాసము.


  1. (..............)
  2. (.............)
  3. యది
  4. కడపులు
  5. కామందక