ఆండ్రూ కార్నెగీ (జీవితచరిత్ర)/అస్తమయం
అస్తమయం
14
యుద్ధాన్ని క్రమక్రమంగా రద్దు చేయగలుగుతుందనే ఉద్దేశంలో న్యూయార్క్ శాంతి సమాజం నిర్మితమైంది. ఈ ఆశయం విషయంలో కార్నెగీకి అత్యంత శ్రద్ధ ఉన్నట్లుగా అతడు తెలియజేయటంవల్ల ఆ సమాజంవారు అతణ్ని అధ్యక్ష పదవిని స్వీకరింపవలసిందని కోరారు.
"వద్దు, నాకు వ"ద్దన్నాడతడు "హృదయపూర్వకంగా నేను మీతో వుంటాను. ఇది మీకు తెలుసును. నాకు శక్తి వున్నంతవరకూ మీకు తోడ్పడతాను. అయితే, నా కున్న యితర వ్యవహారాలవల్ల ఈ శాంతి సమాజాధ్యక్ష పదవిని స్వీకరించ లేను. తీరుబడి వుండదు. నేను నాకున్న కాలంలో ఎక్కువ భాగం ఇందుకు వినియోగించాలని వుంది. అయితే ఆ పని చేయలేకపోతున్నాను."
తన్ను అభ్యర్ధించ వచ్చిన శాంతి సమాజ సభ్యులు వెళ్ళిపోయిన తరువాత కార్నెగీని అంతరాత్మ బాధ పెట్టటం మొదలెట్టింది. ఎంత తీరుబడి లేదనుకుంటున్నానో అలాగే తీరుబడి లేకుండా ఉన్నావా? అది ఎలావున్నా, మరి శాంతికి కాకపోతే నే నెందు కుపయోగపడేటట్లు?
కొన్నాళ్లు గడచిన తరువాత డాక్టర్ లైమన్ బీచర్ ను వెంట పెట్టుకొని ముందు వచ్చిన వున్న వారిని కూడా కలుపుకొని కార్నెగీని చూడటానికి వెళ్ళారు. కార్నెగీ వా రే పనిమీద వచ్చారో ముందే ఊహించాడు.
"మీరు ఒక మాటైనా చెప్ప వలసిన పని లేదు" అంటూ వారిని లోపలికి రమ్మని ఆహ్వానించాడు. "మీ రిక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మొన్న నేను మీరు ఇస్తామన్న అధ్యక్ష పదవిని కాదని త్రోసిపుచ్చినప్పటినుంచీ నా అంతరాత్మ నన్ను బాధిస్తున్నది. ఇప్పుడు నేను మనస్సు మార్చు కొన్నాను. ఆ అధ్యక్ష పదవిని స్వీకరిస్తాను. నాకర్తవ్యాన్ని నిర్వహిస్తాను.
ఆ తరువాత వచ్చిన వసంతంలో ఆ సమాజం న్యూయార్క్‌లో శాంతిమహాసభ జరిపించింది. సమాఖ్యలోని రాష్ట్రా లన్నింటిలోనుంచి ప్రతినిధులు, విదేశాలనుంచి అనేక మంది ప్రఖ్యాత పురుషులు సభకు విచ్చేశారు. మానవజాతి మధ్య శాంతిని నెలకొల్పా లంటే సభలు జరపటం, వుపన్యాసాలివ్వటం, తీర్మానాలు చెయ్యటం కంటే ఇంకా మించిన పని ఏదయినా చెయ్యాలన్న విషయం స్పష్టపడింది. ఇందుకు మరొక మార్గ మేదీ గోచరింపక పోవటంవల్ల తన చేతిలోవున్న శక్తిమంతమయిన సాధనాన్ని ధనాన్ని ప్రయోగించటానికి నిశ్చయించాడు కార్నెగీ. అది ఆయన యిత రాశ యాలను సాధించడానికి అతిశక్తిమంతమయినదని రూఢిగా నిరూపితమయింది. ధనాన్ని వెచ్చించటం వల్లశాంతి లభించేటట్లయితే అతడు దాన్ని నీరులా ప్రవహింప చేసేటందుకు నిశ్చయించుకున్నాడు.
అందువల్ల డిసెంబరు 14, 1910 నాడు అతడు అంతర్జాతీయ శాంతికోసం కార్నెగీ ఎండోమెంటు అన్న ఒక నిధిని ఏర్పాటు చేశాడు. అతడు తలపెట్టిన వాటిలోకల్లా ఒక్క ఈ విషయంలోనే అతనికి కొంత అపజయం కలిగింది. ధర్మకర్త సంఘానికి అధ్యక్షుడుగా అతడు ఎల హూట్‌న్ ఎన్నుకొన్నాడు. ఇత డంటే అతని కెక్కువ మక్కువ. ఇతణ్ని ఎక్కువగా మెచ్చుకుంటుండే వాడు. కార్యక్రమాన్ని నిర్ణయించే పని నంతటీనీ ధర్మకర్తల వివేకానికే విడిచి పెట్టేశాడు.
ధర్మకర్తలు తమకు చేతనయినంత చేశారు. వారు కార్యకలాపా న్నంతటినీ మూడు శాఖలుగా విభజించారు. ఇందులో ఒక శాఖ "ది డివిజన్ ఆఫ్ ఇంటర్‌కోర్స్ అండ్ ఎడ్యుకేషన్! ఇది అంతర్జాతీయ విధానాలను గురించిన భోగట్టాను సంపాదిస్తుంది. అంతర్జాతీయ సుహృద్భావాన్ని వృద్ధి పెంపొందించటం కోసం తగినన్ని ఏజన్సీలను స్థాపించి వాటిని నడిపిస్తున్నది. ఇది వివిధ దేశాలల్లో శాస్త్రనిష్ణాతులయిన విద్వాంసులను రచయితలను పరస్పరం వినిమయం చేసుకొనే ఏర్పాట్టు చేస్తుంది. ఏవైనా శాంతి సంస్థలు పూర్వమే ఏర్పడి వున్నట్లయితే వాటికి తగిన సహాయ మిచ్చి తోడ్పడుతుంది. దీని ఆర్థిక-చరిత్రశాఖ, "ది డివిజన్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ హిస్టరీ, శాంతి-సమరం అన్న రెండు విషయాలమీద తమ ప్రభావాన్ని నెరపుతున్న రాజకీయ, సాంఘిక, ఆర్థిక కారణాల స్థితిగతులను గురించిన పరిశోధనలను చేస్తుంది. ఆ యా రంగాలలో శాంతిదృష్ట్యా అనుసరించవలసిన మార్గాలను, కార్యక్రమాలను సూచిస్తుంది. అంతర్జాతీయ న్యాయశాఖ "ది డివిజన్ ఆఫ్ ఇంటర్ నేషనల్" లా, వివిధ దేశాల న్యాయశాస్త్రాలను పరిశీలించి అంతర్జాతీయ న్యాయసూత్రాలను నిర్మించి వివిధ జాతులమధ్య ఏర్పడే తగాదాల విషయంలో వాటిని అమలుపరచేటందుకు యత్నిస్తుంది. ఈ అంతర్జాతీయ న్యాయశాస్త్ర మనేది కొన్ని నిబంధనలు ఒడంబడికలు అన్న వాటి సముదాయం తప్ప మరేమీ కాదు.
అంతర్జాతీయ శాంతికోసం తన మిత్రుడు నిలిపిన నిధి విషయంలో అడ్డు లేని ఆశావాదికి కూడా విశ్వాసం కలగటానికి కొంత కాలం పడుతుందనీ, కార్నెగీ చర్చా ప్రచారములొక్కటే అంతర్జాతీయ యుద్ధాలను నిషేధించటాన్ని సాథించలేవనీ క్రొత్తమార్గాన్ని స్వీకరించిన కార్నెగీ దు:ఖాత్మకమయిన ప్రత్యక్ష గుణపాఠాన్ని నేర్చుకోటం విథి నియమితమని లార్డు మోర్లే భావించాడు.
మోర్లే వెల్లడించిన భావాన్ని గురించీ కార్నెగి ఇలా వ్యాఖ్యానించాడు. "వ్యతిరేకాభిప్రాయాలు గల వాళ్లు పరస్పరం స్నేహం చేస్తే అది అన్యోన్య ప్రయోజన కారిగా వుంటుందని మేము ఒకరి కొకరము సాన్నిహిత్యాన్ని పెంచు కున్నాము. అతడు నిరాశా వాది. రానున్న ఆపదల విషయంలో అతడు చింతాత్మకంగా, కొన్ని మారులు అంధకార ప్రాయంగా చూస్తుంటాడు. కొన్ని సందర్భాలలో లేనిపోని వేవో అర్ధరహితమయిన వాటిని ఊహిస్తూ వుంటాడు. నా పిల్లలన్ని అంచబిడ్డలైనా యికనొక నేను ఆశావాదిని. నాకు లోకం తేజో వంతంగా కనిపిస్తుంది. పలుమారులు ఈ అవనియే సత్యమయిన అమలిన స్వర్గంగా నాకు గోచరిస్తూంది. నేను యింత సంతోషంతో వుంటాను. దయామయు లయిన 'విథి దేవతలకు కృతజ్ఞుణ్నీ. ఎన్నడూ మోర్లీ దాన్ని గురించి కూడ వుద్రేకి కాలేదు. అతని నిర్నయా లెప్పూడూ ఆలోచనా పూర్వకములయినవి. అతని కన్ను లెప్పుడు ఆదిత్యునిలోని మచ్చల మీదనే దృష్టి నిలిపి చూస్తూంటాయి.
అయినా మోర్లీ తనమిత్రుని ఆశాభావం, వుత్సాహం అన్న వాటికీ చూచి ఎంతో యిష్టపడుతుండేవాడు. ఆ ఆశాభావంతో ఎల్ల వేళలా ఆతడు ఏకీభవించ లేకపోతుండేవాడు. అతడు అన్నాడు "విజ్ఞానం విజ్ఞానతృప్తి, నూతన వస్తువులలో కనుగోటం, భావజ్యోతిని ప్రసాదించటం, సాంఘిక సంబంధాలను వృద్ధి పొందించటం తుల్య ప్రజ్ఞకు తుల్య మయిన అవకాశాలు కలిగించటం, శాంతిప్రియత్వం అన్న ప్రపంచమందలి ఉత్తమాశయాలకోసం అతడు పొందిన విస్తారమైన అనుభూతికి తగిన న్యాయాన్ని జరిపించటం వివేకం ఇవన్నీ మహోన్నత విషయాలు. వాటిని గురించి ప్రకటించేటప్పుడు అత్యుక్తి లేశం వుంటె వుండవచ్చును. దాన్ని సర్దుకోటం చాలా సులభం." ఈ ఆదర్శాల విష యంలో కార్నెగికి గల దృష్టి మహోదాత్తమైందని మోర్లీ అంగీకరించాడన్న మాట!
శాంతిని నెలకొల్పడానికి యత్నిస్తూన్నందుకు ప్రపంచంలోని వివిధ దేశాలూ కార్నెగీని గౌరవించాయి. ఫ్రెంచి ప్రభుత్వం అతణ్ని నైట్ కమాండ్ ఆఫ్ దిలీజియస్ ఆఫ్ ఆనర్ అన్న స్థాన మిచ్చి గౌరవించింది. హాలండ్ దేశం అతనికి "గ్రాండ్ క్రాస్ ఆర్‌డర్ ఆఫ్ ఆరంజ్-నాసౌ" బిరుదంతో సత్కరించింది. డెన్మార్క్ దేశం "గ్రాండ్ క్రాసు ఆర్డర్ ఆఫ్ డెన్నిబ్రాగ్ ఇచ్చి అతన్ని గౌరవించింది. ఇరవై ఒక్క అమెరికన్ రిపబ్లిక్కులు స్వర్ణపతాకాలను బహూకరించినవి. అసంఖ్యాకములయిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, అతనికి 'డాగ్ట రేట్' పట్టమిచ్చి గౌరవించాయి. నూట తొంబదికి పైగా సంస్థల్లోను, వైజ్ఞానిక సమాజాలల్లోను క్లబ్బులలోను, అతడు సభ్యుడుగా వ్యవహరించాడు.
తన మరణశాసనాన్ని (Will) వ్రాస్తూ అందులో అమెరికా ప్రజల ప్రయోజనంకోసం ఒక మహా పథకాన్ని అమలులో పెట్టేటందుకుగాను. బృహన్నిధి నొక దానిని ఏర్పాటుచేస్తున్నట్లు అందులో వ్రాస్తున్నాడు.
ఈ విధంగా అమెరికావాసుల కిస్తున్న అవకాశాన్ని గురించి అతడు ఎలిహూరూట్ తో చెప్పటం తటస్థించినప్పుడు అతడు తల పంకించి యిలా అన్నాడు.
"కొన్ని సంవత్సరాల క్రితం మీ రన్నది మీరే మరచిపోయినారా? అది కార్యాచరణలోగాని, న్యాయ స్థానాలల్లోగాని తరుచుగా అపమార్గాన్ని పడుతుంది. ఎప్పుడో భవిష్యత్తులో ఆచరణలోకి రాబొయ్యేదాన్ని ఇప్పుడు మీరు మీ మరణశాసనంలో ఏర్పాటుచేసి వుంచటం యెంతో ప్రమాదకారి అయిన విషయం. శామ్యూయల్ జె. టిల్డన్ చేసిన పొరబాటు తిరిగి చెయ్యవద్దు యిప్పుడు మీ సంపత్తితో మీ రెలా చెయ్యాలని భావిస్తున్నారో అప్పుడు అతడలా చేశాడు. అది న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు వ్యతి రేకమైంది.
"మరణశాసనాలు అందమైనవేగాని అల్లట తల్లట కలిగించే వాహనాలు" అని, రూట్ ఇంకా ఇలా అన్నాడు. "జీవితకాలంలోనే ఈ నిధిని ఏర్పాటుచేసి, అందుకుగాను మీరు ఏర్పాటుచేసి వుంచిన సంపత్తిలో అధికాంశాన్ని దాని పరంచేసి ఆ వ్యవహారం మీరు సజీవులై వున్నప్పుడు కొంత నడుస్తుండటాన్ని ఎందుకు కల్పించగూడదు? అప్పుడు అది సక్రమంగా తరువాతి కాలంలో నడిచిపోతుందనే నిశ్చయం మీకు కలుగుతుంది. అంతేకాదు. మీరు ఉద్దేశించిన పనులను ఆచరలో ఆచరణలో పెట్టించిన ఆనందాన్ని మీరు పొందటం కూడా జరుగుతుంది"
అతడు రూట్ ఇచ్చిన సలహాను పాటించాడు. 1911 లో యునైటెడ్ స్టేట్సు స్టీల్ కార్పొరేషన్‌లోని 5% మొదటి రాబడినిచ్చే 2,50,00,000 (రెండు కోట్ల ఎభై లక్షల) డాలర్ల మూలధనంతో అతడు న్యూయార్క్ కార్నెగీ కార్పొరేషనును న్యూయార్క్‌లోని శాసన సభ చేత చట్టబద్దంచేయించి స్థాపించాడు. ఇందుకు థర్మకర్తలుగా వ్యవహరించవలసిందని అతడు కోరిన ప్రముఖ వ్యక్తుల సంఘం నవంబరు 11 న కార్నెగీ గృహంలో సమావేశమైంది. అతడు వారికి తాను ఈ థర్మనిథిని స్థాపించటంలో ఉద్దేశమేమో తెలియ జేసే పత్రాన్ని యిలా చదివి వినిపించాడు. సాంకేతిక పాఠశాలలకు, ఉన్నత విద్యాసంస్థలకు, గ్రంథాలయాలకు, శాస్త్రీయ పరిశోధనకు, వీరనిథులకు, ప్రయోజనకరములైన ప్రచురణలకు వీటికిగాను కాలక్రమేణ ఏర్పడే ఇతర సంస్థలకు సాధనాలకు తోడ్పాటు నిచ్చి "విజ్ఞానాభివృద్ధి వ్యాప్తులను పెంపొందించటం, ప్రజలమధ్య సుహృద్భావాన్ని పోషించటం" ఈ నిధి లక్ష్యం.
ఈ నిధి అమెరికాలోని వైజ్ఞానిక సాంఘికాభి వృద్ధికి సంబంధించిన ఉద్యమాలకు తోడ్పడటమే కాకుండా అతడు నెలకొల్పిన ఇతర సంస్థలకు సహాయ మవసరమైనప్పుడు ధనసహాయం చేయటానికి కూడా ఉద్దేశింపబడ్డది. అతడు ఈ కార్పొరేషనును ఏర్పాటుచేసిన అనతి కాలంలో నే తొలుతటి మూలధనం చాలదని గుర్తించాడు. తా నుద్దేశించిన సర్వం ఆ చరణలోకి వస్తే చూడవలెనంటే ఇంకా ఎంతో అదనపు ధనం అవసరమని తోచింది. అయితే యిప్పుడు భార్యకు, కుమార్తెకు విడిచిపెట్టవలెనని ఉద్దేశించినది బాండ్ల రూపంలో గాని, ధనరూపంలోగాని వున్నది 12,50,00,000 (పన్నెండుకోట్ల యాభై లక్షల) డాలర్లు మాత్రమే. మరొక ఐదుకోట్లు లేదా పదికోట్లు డాలర్లు యివ్వటానికి వారు అంగీకరిస్తారా? క్షణమైనా వెనుదీయకుండా మిసెస్ కార్నెగీ అందుకు అంగీకరిం చింది. యిక కుమార్తె యింకా పదిహేను పదహారు సంవత్సరాల వయసు కన్యక మాత్రమే. ప్రియమైన తన తండ్రి ఏదిచేసినా ఆమె కిష్టమే. అందుకే తృప్తిపడుతుంది. అందువల్ల 1912 లో కార్నెగీ కార్పొరేషన్ నిధి 12,50,00,000 డాలర్లు వరకూ వృద్ధిచేయబడింది. ఆ లోకోపకార పరాయణుడు ఒక సంవత్సరములోనే 13,00,00,000 (పదమూడు కోట్ల) పై చిలుకు డాలర్ల దానం చేశాడు.
కాంగ్రెసు మాజీ అధ్యక్షులకు వారి భార్యలకు తగిన ఏర్పాట్లను చేయలేకపోయినందుకు కొన్ని సంవత్సరాలనుంచి అతడు వ్యాకులపడుతున్నాడు. అమెరికాలోకల్లా అత్యున్నతమైన గౌరవ స్థానానికి, గణతంత్రప్రజా రాజ్యంలో అతినిష్టా యుతములు, బాధ్యతా యుతములు అయిన ఉన్నత పదవులకు వారిని నియోగించి వారి విరమణ కాలంలో గౌరవయుతంగాను క్లేశరహితంగాను జీవించే విరామభృతుల నివ్వకపోవటం కృతఘ్నత అనీ, అనాగరికమనీ అతడికితోచింది. ప్రభుత్వంవారికి తగ్గ ఏర్పాటు చేసేటంతవరకూ కార్పొరేషన్ ప్రతి సంవత్సరము ఇందుకుగాను 25,000 డాలర్లు యివ్వవలసిందని కార్నెగీ సూచన చేశాడు.
ఈ అభిప్రాయం ప్రకటితము కాగానే ప్రజల్లోనుంచి వ్యతిరేక భావం వెలివడ్డది. ప్రభుత్వం స్వీకరింపదగ్గ బాధ్యతను ఒక ప్రత్యేక వ్యక్తి గ్రహించటం అనుచితమని వారన్నారు. యిలా వారికి సిగ్గును కల్గించి విషయబోధ చెయ్యటమే ఈ పథకంలోని రహస్యం. ఈ చర్యవల్ల ప్రపంచ దృష్టిలో దేశం అవమానిత మౌతుందని వారు భయపడ్డారు. అందువల్ల కార్నెగీ మనసులో యిష్టం లేకపోయినప్పటికి ఈ ఉద్దేశాన్ని కొంత విరమించుకోవలసి వచ్చింది. దీన్ని పూర్తిగా విడిచిపుచ్చక పోవటం మనం మున్ముందు గమని స్తాము.
1911-12 ల శీతకాలం అతడికి ఆ బాల్యమిత్రుడైన టామ్ మిల్లర్ మృతివల్ల అతి వేదనతో గడిచిపోయింది. యింతకు కొద్ది నెలలకు పూర్వమే అతడు ఆత్మకథ వ్రాస్తూ అందులో యిలా అన్నాడు: "అతడు యింకా సజీవుడై వుంటే మిక్కిలి ప్రేమపూర్వకమైన వెలుగును, మాథుర్యాన్ని క్రుమ్మరిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు గడచినా అతడు ఇంకా యింకా విలువైన మిత్రుడ నని అనిపిస్తున్నాడు" అని వ్రాశాడు. యిప్పుడు టామ్ వెళ్ళిపోయినాడు. అందువల్ల మరో వాక్యం చేర్చాడు. "ఇకనుంచీ జీవితానికి ఏదో లోటు తీరని లోటు - అతడు నా బాల్య జీవితంలోని సహచరుడు. వృద్ధాప్యంలో అతి ప్రియుడైన మిత్రుడు. అది ఎలాటిదైనా యిపు డత డెక్కడున్నా నేను అక్కడికి వెళ్ళవచ్చునా!"
అతడు తా నేర్పాటుచేసిన అన్ని నిధులను గురించి సంస్థలను గురించి యెంత గర్వించినా తన దానాలపట్టికలలో కల్లా అతడి కతి ప్రియమైంది అతని విరమణ భృత్యపట్టిక (Pensoin List) ఆర్థిక సహాయార్థం ప్రతి సంవత్సరం అతనికి వేలకొలది లేఖలు వస్తుంటాయి. ఈ ఉత్తరాలు వ్రాసిన వారిలో ఎందరు వంచకులో, వారు చెప్పే స్థితిగతు లెన్ని కల్పనలో తెలుసుకునే అవకాశం అతడికి సహజంగా లేదు. అయితే ఈ వుత్తరాల నన్నిటినీ అతడు జాగ్రత్తగా పరిశీలించి, సత్యాలని తోచిన కొన్నిటిని ఎంచి వాటిమీద "ఇతణ్ని నెలకు ముప్పదిడాలర్లమీద వుంచండి," "ఈవృద్ధురాలు సుఖంగా జీవించటానికి యే లోపం కలుగకుండా చూడండి" ఈ రీతిగా కార్యదర్శి పొయిస్టన్ వుపయోగార్ధం సూచనలు వ్రాస్తుండేవాడు. వృద్ధాప్య జీవన భృతిపట్టికలో చేర్చేవారిలో ఎందరో పూర్వం అతడెరిగినవాళ్లు. యౌవనంలోనో, బాల్యంలోనో అతనితో ఏదో విధమైనసంబంధం కలవాళ్ళను చేర్చటం తప్పక జరిగేది. అట్టివారిలో కొందరు మాత్రమే అతడికి వ్రాసుకొనేవాళ్లు. ఇందులో ఎక్కువమందిని గురించి ఇతరులు వ్రాయటమో, అతడే ఎన్నటమో జరిగేది. వీరిలో కార్నెగీకి ప్రధమంగా ఉద్యోగమిచ్చిన వ్యక్తి కుమార్తెకూడా వుంది. అతడు ఒకప్పుడు పిట్స్‌బర్గులో మంచి ఉచ్చదశను అనుభవించిన వ్యాపారస్థుని కుమారుడు, అతనికి బాల్యంలో కార్నెగీ ఆండీగా తంతివార్తలను అందజేస్తుండేవాడు. కాని ఇప్పుడతడు ఆశక్తుడు, పేదవాడు. పూర్వం అలీఘనీలో స్వీడన్బొర్జియన్ సంగీత సమ్మేళనంలో సహ సభ్యులుగా వుండేవాళ్లు. ఇరువురు వృద్ధ కన్యలు 'నేను యౌవనోల్లాసంతో వారితో కలిసి నృత్యం చేస్తుండేవాణ్ని' అని కార్నెగీ వ్రాశాడు.
ఆయన మృతినొందే వేళకు పూర్వమే ఆ పట్టిక ఐదువందల పేర్లకు మించి వుండేది. కాలం గడిచిన కొద్దీ ఇందుకు ఎక్కువ ధనం అవసరమని గ్రహించి ఈ భృతిని స్వీకరించే వారు తమ కాభృతి జీవించినంత కాలం భృతిముడుతుందనే నమ్మకాన్ని కల్పించటం కోసం కార్నెగీ యాబై లక్షల డాలర్లతో మరొక ధర్మనిధి నేర్పాటు చేశాడు. దీని కితోడు స్కాట్లండులో మరొక పట్టిక-దీనికి ధర్మకర్త డన్ఫ్‌ర్మ్‌లైను ఏర్పాటయింది. లోని డాక్టర్ రాస్. ఈ పట్టికలోనే రాబర్టు బరన్స్ మునిమనుమరాలి పేర, బాల్యంలో కార్నెగీకి అతి ప్రియమిత్రుడైన డన్ఫ్‌ర్మ్‌లైన్ పోష్టుమేన్ కుమార్తె పేరు వున్నవి.
ఒక రోజున న్యూయార్క్ కార్నెగీ కార్పొరేషన్ అధిపతి అయిన కార్పొరేషన్ డాక్టే హెన్రీ యన్. ప్రిట్చెట్‌ను యింటికి రమ్మని పిలిపించటం జరిగింది. అతడు వచ్చేటప్పటికల్లా కార్నెగీ తన డ్రాయింగ్ రూములో అటు యిటూ తిరుగుతున్నాడు.
"డాక్టర్ ప్రిట్చెట్, అమెరికలోని అధ్యక్షత క్రింద నడుస్తున్న సంస్థవంటి నొక దానిని కొద్దియెత్తులో నేను గ్రేట్ బ్రిటన్‌కోసం ఏర్పాటుచేయదలిచాను. నిశ్చయంగా దాని కెక్కువ డబ్బు అవసరం లేక పోయినప్పటికీ అది ఇవ్వటానికికూడా నా దగ్గర డబ్బు లేదు. నా భార్య , కుమార్తెల కోసం విడిచిపెట్టిన డబ్బులోనుంచి నేను మళ్లా ఒక పది మిలియన్లు తీయదలచ లేదు. అందువల్ల మీ కార్పొరేషన్ ధనంలోనుంచి పది మిలియన్లు తీయదలిచాను" అన్నాడు.
డాక్టర్ ప్రిట్చెట్ కొంత సంకట పడ్డట్లు కనిపించి అన్నాడు: "మిష్టర్ కార్నెగి మీ రా పని చేయటాని వీలు లేదనుకుంటాను."
"వీల్లేదా"
"లేదు. 'కార్నెగీ కార్పొరేషన్ ఆఫ్ న్యూయార్క్' అన్నది స్థిరమైపొయింది. దాన్ని మార్చటానికి వీలుండదు."
కార్నెగీ ఆ చెప్పినది నమ్మలేకపోయినాడు. "మీరు మిస్టర్ రూట్ ను విచారించవచ్చు. నేను చెప్పింది నిజమని నా నిశ్చయం. అయినా ఆయన్ను అడగండి తెలుస్తుంది.
కార్నెగీ మిస్టర్ రూట్‌ను పిలిపించాడు. అప్పుడు అతడు శాసనసభా సభ్యుడు. 'నిశ్చయంగా వీల్లేదు' అని ఆప్రముఖ న్యాయశాస్త్రవేత్త అన్నాడు. 'మీరు ఇప్పుడు కార్పొరేషన్ నుంచి థనాన్ని తీయటానికి వీల్లేదు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. మార్పుకు వీలుండదు."
ఇందుకు అతడు వెల వెల పోయాడు. ఏమయినా ఆతని బుద్ధి బ్రిటిష్ నిధిమీద లగ్నమై వుంది. తనకు మిగిలిన రెండుకోట్ల యాబైలక్షల డాలర్లు భార్యకు, కుమార్తెకు యిచ్చాడు.
మరి నిజానికి వాళ్ళకు అంత డబ్బుతో అవసరముందా? ఎంతో సేపు మదనపడి ఏర్పడ్డ పరిస్థితిని మిసెస్ కార్నెగీకి ఎరుకపరిచాడు."మీ బాండ్లలో నుంచి ఈ నిధి కోసం పదిమిలియన్లు నేను తీసుకోటం మీ కిష్టమేనా ?" అన్నాడు. క్షణమాత్రమైనా ఆమె వెనకాడలేదు. ఆమెతో సమానురాలు వెనుక పుట్ట లేదు, ఇక ముందు పుట్టబోదు అన్న అభిప్రాయాన్ని వెయ్యోమారు నిరూపిస్తూ ఆమె చిరునవ్వుతో "ఆండ్రీ! ఏమీ అనుకోము" అన్నది చిరునవ్వుతో.
బ్రిటిష కార్నెగీ ఫండు ఏర్పడ్డది.
కొన్ని సమయాలల్లో అతడు తన కార్యదర్శిని "పొయిస్టన్, ఇప్పటికి నే నెంత దానం చేసివుంటాను" అనేవాడు. అతడికి ఎప్పుడూ అంకెలు నాలుకచివరన సిద్ధంగా వుండేవి. అతడు సమాధానం చెప్పాడు: "ముప్ఫయి నాలుగు కోట్ల డెబ్బయి రెండు లక్షల ఎనబైఐదు వేల ఐదువందల డాలర్లు" (లేదా అప్పటికి ఎంత అయితే అంత)
"ఒహో!" అని సంతోషించేవాడు కార్నెగీ. "యీ డబ్బంతా నే నెలా సంపాదించాను" అనేవాడు.
ఆగష్టు 29, 1913 న హేగ్‌లోని శాంతి సౌధంలో నిలిచి అతడు తన అభిప్రాయాన్ని యిలా వెల్లడించాడు.
"ప్రపంచ శాంతిని నిలువబెట్టటానికి కావలసింది ప్రముఖమైన మూడు నాలుగు నాగరిక ప్రభుత్వాల మధ్య యింకా చేరదలచుకున్న వెన్ని వుంటే అన్నిటి మధ్య ఒక ఒడంబడిక - ప్రపంచ శాంతికి భంగాన్ని కల్పించేవారికి, లేదా వానికి యెదురు నిల్వటం విషయంలో ఒక సహాకారాన్ని గురించిన ఒడంబడిక ఏర్పడటమే. అటువంటిది జరుగుతుందా?"
పదకొండు నెలల తరువాత జులై 28, 1914 న ఆస్ట్రియా సెర్పియా యుద్ధాన్ని ప్రకటించింది. ఈ సంఘటనను గ్రహించటానికి కార్నెగీ మనస్సు ఎంతో కష్టపడింది. అతడు 1907 లో జర్మనీ అథినేత కైజరువిల్హెలమ్ II ను కలుసుకున్నాడు. అతని చిన్న ఓడలో ఆత డిచ్చిన విందు నారగించి నపు టతడు చేసిన ప్రసంగాన్ని బట్టి అతడు ప్రపంచశాంతికి, పురోభివృద్ధికి నిజంగా ఆతురత వహిస్తున్నాడని నమ్మి, అత డంటే మంచి గౌరవభావాన్ని కుదుర్చుకున్నాడు. ఇప్పుడు ప్రధమ సంగ్రామ సమయంలో ఉక్కిరి బిక్కిరి అయినాడు. ధృడమైన నమ్మకం కలవాడు కాలేక పోయాడు. క్రమంగా మానవస్థితిని జూచి హృదయాంతరాళంలో దు:ఖాకులితు డౌతున్నాడు. భయానకత తీవ్రమై స్పష్టమైన రూపు రేకలతో సందర్శన మిచ్చినప్పుడు తాను శాంతి కోసం చేసిన కృషి, వెచ్చించిన ధనం వ్యర్ధమైపోయాయని గ్రహించాడు. శాంతియుతము, ఆనందమయము అయిన ప్రపంచాన్ని గురించి అతడు కన్న కలలన్ని భగ్నమైనాయి.
యుద్ధం ప్రారంభం కావటంవల్ల కార్నెగీ కుటుంబం వేసగికాలంలో స్కాట్లండులో ఎక్కువకాల ముండటం తగ్గించుకోవలసివచ్చింది. ఇంటికి తిరిగి వెళ్ళటంకోసం స్టీమరెక్కడానికి వారు వేగంగా లివర్ పూల్ చేరుకున్నారు. మోర్లే వాళ్ళను పంపించడానికి వెంట వచ్చాడు. అన్యోన్య శ్రద్ధగల ఆ మిత్రు లిద్దరూ కరచాలనం చేసి సెలవు చెప్పుకొన్నారు. అదే వారి తుదిసారి కరచాలనం.
తరువాత కార్నెగి బలం, తేజం, నెమ్మది నెమ్మదిగా తరిగిపోవటం ప్రారంభించాయి. 1915 లో మెయిన్ లోని బార్ హార్బర్‌లోను, తరువాతి వేసగిని కెనక్టికట్ లోనీ నోరోటన్‌లోను గడిపారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు యుద్ధంలో ప్రవేశించిన తరువాత కార్నెగీ ముప్పదిరెండు సైనిక శిబిరాలకు గ్రంథాలయాలను ఏర్పాటు చేశాడు. 1917 ప్రారంభంలో అతడు లెనాక్స్ దగ్గర వున్న బెర్క్‌షైర్ కొండల్లోని 'షాడోబ్రూకె' అన్న మీరాసీ (Estate) ని కొన్నాడు. చివరి మూడు వేసగి కాలాలను అతడు అక్కడే గడిపాడు. చార్లీస్క్వాబ్, టామ్ మిల్లర్, మార్క్‌ట్వైస్, రిచ్చర్డ్ వాట్సన్ గిల్డర్, జాన్ బిగలౌ, జీసస్ బొయట్ లు మరణించారు. చార్లే యింకా సజీవుడు. ఈ మిత్రు లిరువురూ ప్రతి ఆదివారం ఒకరి కొకరు వుత్తరాలు వ్రాసుకుంటుండేవారు.
ఏప్రియల్ 22, 1919 మార్గరేట్ ను - నిన్న మొన్నటివరకూ స్కిబో పర్వతప్రదేశపు కోనల్లో తండ్రి చేయి పట్టుకొని మెల్లగా వెంట వచ్చిన చిన్న పిల్ల - రోజ్ వెల్ మిల్లర్ అనే మంచి న్యూయార్క యువకుడి కిచ్చి వివాహం చేశారు. ఇదే ఆమె తండ్రి యింట జరిగిన చివరి శుభకార్యం. ఆ వేసగిలో జార్జి లాడర్, జూనియర్ షాడోబ్రూక్‌ను చూడటానికి వచ్చాడు. ఇరువురూ కలిసి తీరుబడిగా షికారుకు వెళ్ళారు. చేపలు పట్టారు.చెక్కర్స్ ఆట లెన్నొ ఆడారు. చివరకు కజిన్ డాడ్ కూడా తుది "గుడ్‌బై" చెప్పి వెళ్ళాడు.
ఆగష్టు మొదట్లో కార్నెగీ నెమోనియా వల్ల బాధపడుతున్నాడు. మిసెస్ కార్నెగీ ఒక విశ్వాసపాత్రుడయిన సేవకుడు, ఒక మారిసన్ వంశీయుడు, మూడువేళలా అతడికి అప్పు డప్పుడు సేవ చేస్తున్నాడు. వ్యాధిఆరంభమైన రెండవ రోజు, ఆదివారం, కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం మోర్లేకు వ్రాసే వుత్తరం వ్రాయ లేదు. ఆనాటి సాయంత్రం అతడు చాలా నిస్సత్తువగా వున్నా అతని స్థితి సంతృప్తికరంగానే వున్నట్లు కనిపించింది. రాత్రి సెలవు తీసుకొంటూ "ఆండ్రీ నీవు సుఖంగా నిద్రిస్తున్నావని భావిస్తున్నానని ఆశిస్తున్నా" నన్నది భార్యా.
"లౌ, నేను అలాగే ఆశిస్తున్నాను." అని అతడు సమాధానం చెప్పాడు.
అనతి కాలంలోనే గాఢము, ప్రశాంతము అయిన నిద్ర అతణ్ని ఆవరించింది. దాని నుంచి తిరిగి మేల్కో లేదు.
న్యూయార్క్ టారీటౌనుకు కొంతవుత్తరంగావున్న 'స్లీపీ హాల్ సెమెట్రీలో వాషింగ్టన్ ఇర్వింగు విశ్రాంతి ప్రదేశా నికి అనతిదూరంలో అతణ్ని జననం చేశారు. అతని సమాథిమీద స్కాచ్ దేశపు నీలశిల (Granite) తో చేసిన ఒక కెల్టిక్ క్రాస్ నిలచివుంది. స్కిబో ఎస్టేటులో సహచరులుగా వుంటున్న కార్మికులు ఆ గనుల్లో దానిని మలచి త్రోసికొని తెచ్చి పట్టామీదుగా రైలుమార్గం దగ్గరకి చేర్చారు. ఒక గ్లాస్గీ కళాకారుడు ఆ క్రాస్‌ను రూపొందించాడు. మిసెస్ కార్నెగీ దానిమీద చెక్కవలసిన మాటలను నిర్ణయించింది. అది అతి సర్వ సాధారణమైన వాఖ్యం. ఆడంబరం అణుమాత్రం లేనిది. అంతకంటే ఔచిత్యశోభితమైనది మరొకటి వుండే అవకాశం లేనిది.
ఆండ్రూ కార్నెగీ
జన్మ, డన్ఫ్‌ర్మ్‌లైన్, స్కాట్లండ్
25 నవంబరు 1835
మృతి, లెన్నాక్స్, మసాచ్యు సెట్సు
అంతే!
అతడు తన మరణ శాసనాన్ని స్వయంగా వ్రాసుకున్నాడు. భార్యకు కుమార్తెకు తగిన ఏర్పాట్లు చేశాడు. న్యూయార్క గృహంలోని సేవకులను, స్కిబో మిరాసిలోని సేవకులను, శ్రామికులను జ్ఞప్తి యుంచుకొని కొన్ని సంస్థలకు అథిపతులను చేశాడు. చివరకు మాజీ అధ్యక్షులను గురించి తా ననుకొనినట్లుగానే జరిపించాడు. తన మరణకాలంలో సజీవుడుగా వున్న వాడు ఒకే మాజీ అధ్యక్షుడు, విలియం హెచ్. ట్రాప్టుకు జీవితపర్యంతరం ప్రతిసంవత్సరం 10,000 డాలర్లు వార్షికం లభించింది. మిసెస్ గ్రోవర్ క్లివ్ లాండ్, మిసెస్ థియొడోర్ రూజ్వెల్టు ఒక్కొక్కరికి సంవత్సరానికి 5,000 డాలర్లు చొప్పున ఏర్పాటు చేశాడు. వైకౌంట్ మోర్లే, డేవిడ్ లాయడ్ చార్జి సంవత్సరానికి 10,000 డాలర్లు చొప్పున స్వీకరించారు. పార్లమెంటులో లేబర్ సభ్యుడైన జాన్ బరన్స్ సంవత్సరానికి 5,000 డాలర్లు చొప్పున తీసుకున్నాడు. ఇతడు హోమ్‌స్టెడ్ సమ్మె సమయంలో కార్నెగీని గట్టిగా ఎదిరించి నప్పటికీ ఇంగ్లండుకు ఇతడు గొప్ప సేవచేశాడని కార్నెగీ భావించాడు. కార్నెగీని బరన్స్ విమర్శనుంచి రక్షించిన థామస్ బర్టు అన్న మరొక సభ్యుడికి కూడా సంవత్సరానికి 5,000 డాలర్లు ఇవ్వటం జరిగింది.
కార్నెగీ తమకిచ్చిన భవనంలో న్యూయార్క ఇంజనీరింగ్ సంఘాలు అతని జ్ఞాపక చిహ్నంగా ఏర్పాటు చేసిన సభలో ఎలహూరూట్ మాట్లాడుతూ ఇలా అన్నాడు: "అమెరికా దేశాభివృద్ధిని ప్రపంచాని కొక అద్భుత విజయముగా చేసిన జాతినిర్మాతల కోవకు చెందినవాడు కార్నెగీ. నే నెరిగినంతలో అంతటీ దయాళువు లేడు. ధనం అతని హృదయాన్ని గడ్డకట్టించ లేదు. యౌవనకాలంనాటి స్వప్నాలను మరచిపోయేటట్లు చేయ లేదు. కరుణాన్వితుడు. ప్రేమ హృదయుడు, నిర్ణయాల విషయంలో ఈవిగలశాడు. అతడిని గురించి తనకు అవసరంలేని డబ్బును దానంచేసిన ఒక మహా వంతుడు. అన్న భావంగల వారందరూ కరుణాన్వితుడై ప్రపంచం కనివిని ఎరుగని ఎన్నెన్ని ఘనకార్యాలు చేశాడో తెలుసుకోటం ఎంతో అవసరం."