అవధరింతువు ప్రతి దివ సాంతమందు

వికీసోర్స్ నుండి

అవధరింతువు ప్రతి దివ సాంతమందు

నిత్యనూతన తాండవనృత్య కేళి,

ఓయి నటరాజ, తల లైన నూప లేక

భువనములు దుర్భ రానందమున నడంగ.


అప్పు డూహాంచలమ్ముల నతిశయించి

పొరలు నమృతరసంపు మాదురులలోన

కొట్టుకొని పోవు, స్వామి, నా క్షుద్రజీవి

తమ్ముగూడ దారియె లేక తనివి వోక!


అంత నే వెర్రి నైపోదు నయ్య; నిన్ను

బోలి పాడబోవుదు; నిన్ను బోలి నాట్య

మాడబోవుదు, లజ్జ బోనాడి; కాక

యింత దాహమ్ము దహియింప నెటులు మనుదు?


ఏ విధాన సౌందర్యరసైకజీవి

నిలువ నేరుతు నిట నొక్క నిముసమేని

మామకీన జీవిత శుష్కమార్గముల త్వ

దీయ పాదమంజీరముల్ మ్రోయకున్న!


ఆటతో పాటతో నేర్చినట్లు దేవ,

ఏనుకూడ నీ వలె నటియింప నిమ్ము

ఎడతెగనియాత్ర నెట్లో సాగించువరకు!

ఎట్లో నీ దర్శనమ్ము సాధించువరకు!