Jump to content

అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/వెన్నెలకంటి వ్యాకరణం

వికీసోర్స్ నుండి

పరిచయం

అచార్య గారపాటి ఉమామహేశ్వరరావు 98661 28846

ఆధునిక తెలుగు వెన్నెలకంటి వ్యాకరణం

రచయిత:
వెన్నెలకంటి ప్రకాశం
వెల: రూ. 150/-లు
ప్రతుల కోసం:
9849805675
ఈ-మెయిల్‌: sujatha@nirrvitha.in


వెన్నెలకంటి ప్రకాశంగారు రచించిన “వెన్నెలకంటి వ్యాకరణం” అనే ఆధునిక తెలుగు వ్యాకరణాన్ని 2018 జులై నెలలో నిర్విత ప్రకాశకులు ప్రకటించారు. ఇది 176 పుటలతో 13 అధ్యాయాలతో రచయిత చేతులమీదుగా రాసిన తొలిపలుకూ మలిపలుకులతో ప్రకటించిన ఈ వ్యాకరణం ఇప్పటికి తెలుగులో వచ్చిన వ్యాకరణాల్లా కాక మరో కోణంలో తెలుగు నుడిని పరిశీలించి కూర్చినదిగా కనిపిస్తోంది. ఈ పదమూడు అధ్యాయాలలో ఎనిమిది, అంటే. 3-10. అధ్యాయాలు, 3. వాక్యం - వాక్య బంధం-వాక్య సముదాయం, 4 నాదోత్పత్తి; 5. ఉచ్చారణ: వర్ణ వర్గీకరణ; 6. సంధి-అచ్చుల మమత 7. కారక బంధాలు -విభక్తి వాదుకలు & క్రియా పదబంధాలు; 9. నామ్నీకరణాల గురించి. 10. భావ పరిశీలన; వ్యాకరణానికి సంబంధించినవి కాగా మిగిలిన ఐదు, 1. భాష-భావం-సమాచార వ్యక్తీకరణ, 2. భాష -సమాజం-వ్యాకరణం 11. కావ్య భాష్య 12. లేఖన సమస్యలు 13 భాషా బొధన మొదలైనవి భాషను గురించిన పరిచయమూ, సామాజిక నేపథ్యమూ, దాని అనువర్తనం గురించిన చర్చలతో పూర్తవుతుంది. చివరిగా రచయిత మలిపలుకు ఆపైన ఉపయుక్త రచనావళితో ముగుస్తుంది.

ఒక భాషకు వ్యాకరణాన్ని కూర్చేటప్పుడు ఎవరి భాషకు అనే ప్రశ్న తలెత్తుతుంది. రచయిత తను వాడే భాషక్కా తన ప్రాంతంలోని భాషకా, లేక అధికసంఖ్యాకులు వాడుతున్న భాషకా లేక ఇంకేదైనానా అనే సందేహం రాక మానదు. ముందు దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి. భాష ఇట్లా ఉందాలి అనే వ్యాకరణ రచనకంటే భాషఇట్లా ఉంది అంటూ చేసిన వ్యాకరణ రచనే ఉత్తమం. దానివలన భాష ఎట్లా ఉంది, సమాజంలో ఆ భాషాస్ట్థితి ఏమిటో తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాకరణ రచయిత, మన ప్రాచీన సాహిత్యం నుండి “అట జని కాంచె.....”, “వచ్చినవాడు ఫల్టుణుండు....” “ఎవ్వనిచే జనించు......” అనే మూడు పద్యాలను తీసుకొని ఏది ఎవరికి (సగటు తెలుగువాడికి) ఎంత అర్ధమౌతోందో అంటూ బేరీజు వేసుకొంటారు. మొదటిది సంస్కృత భూయిష్టం కాగా రెండవది అచ్చతెనుగు కట్టడితో ఉన్నదీ, ఇక చివరిది మధ్యస్థంగా ఉన్నదీ. అయితే ఈ మూడింటిలోకీ చివరిదే ఎక్కువమందికి అర్థమయ్యే భాషలో ఉన్నది కనుక అట్లాంటి భాషనే వాడాలి, అదే వ్యావహారిక భాషోద్యమానికి ప్రేరణ అంటూ, ఆ ఉద్యమానికి తోడైన కొన్ని మౌలీకాంశాలను ప్రస్తావించారు.

వాటిలో కొన్ని ఇవి: భాష మారుతుంటుంద్వి మాటకూ రాతకూ సామరస్యం ఉండాలి; వ్యాకరణం ప్రయోగమూలం; వాడుక భాష కాని దాన్ని పుస్తకాలలో వాడటం ప్రయోజనకారి కాదు దురభిమానం కూడదు. ఈ పైన రచయిత పిల్లల పాఠ్య పుస్తకాలలో కొంత వరకూ మాండలికతను ప్రవేశపెట్టితే నష్టమేమిటని ప్రశ్నిస్తున్నారు కూడా. గిరిగిసుకొనీ మనం వాడే తెలుగు ఇట్లాగే ఉండాలి అనే దురభిమానం తగదని రచయిత స్పష్టం చేస్తున్నారు.

మొదటి అధ్యాయంలో, భాషలో భావానికీ దాని వ్యక్తీకరణకూ సంబంధాన్ని ప్రతిపాదించటానీకి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలోని సారాంశం ఇదిగో చదవండి. భాషకు మూలమూ ఫలమూ రెండూ భావమే. ఇంకా, మూలం, ఫలం ఈ రెంటి మధ్యా ఎలాంటి తేడా లేనప్పుడే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అర్ధవంతం. తేడా ఉంటే. అపార్ణం. అంటే అర్భవంతమైన మాటలు మాట్లాడేందుకూ, రచనలు రాసేందుకూ వ్యాకరణ వాడుక చక్కగా ఉండాలి అంటారు. అలాగే భావ వ్యక్తీకరణ -ప్రక్రియ వక్తకూ శ్రొతకూ మధ్య జరిగే అనేకానేక ప్రక్రియలద్వారా సాధ్యమౌతోందని కొంత విపులంగానే చర్చిస్తారు.

ఇక రెండవ అధ్యాయంలో, వ్యాకరణాన్ని నిర్వచించే ప్రయత్నం చేశారు. వ్యాకరణం, *....పదాల, పదబంధాల, వాక్యాల, వాక్య బంధాల, వాక్య సముదాయాలలో కనిపించే నియమావళి ..... " అలాగే, భాష వాడుకలో “సామాజిక ఔచిత్యాన్ని” సూచించే నియమాలనుకూడా వ్యాకరణంలో భాగమంటారు. ఉదాహరణకు అది, ఆమె, ఆవిడ, వారు లాంటి సర్వనామాల వాడుకలోని నియమాలు సామాజిక ఔచిత్యానికి సంబంధించినవి. ఇవి మౌలిక(0గా) రూప వ్యాకరణంలో భాగం కానివి అంటారు. ఈ అధ్యాయం చివరలో, తెలుగు భాష స్వరూప స్వభావాలగురించిన కొన్ని లక్షణాలను పేర్కొంటారు: ఉదాహరణకు, క్రియ లేని వాక్యాలూ, పదాలలో 'ఊనిక* ప్రాముఖ్యత, క్రియాన్వయం ఉన్నవోట కర్తను వాడకుండటం మొదలైనవి. తర్వాత ఈ చర్చ, తెలుగులో భాషావైవిధ్యం అంటూ మాండలికత తీరు, శైలి, రీతి అనే తేడాలతో మొత్తం నాలుగు రకాలని చెబుతూ సోదాహరణంగా వివరిస్తారు.

మూడవ అధ్యాయంలో వాక్యం - వాక్య బంధం - వాక్య సముదాయం గురించి చర్చించారు. వాక్యాన్ని నిర్వచిస్తూ వాక్యం పలుకు రూపంలో దిగుడు స్వరంతో కూడి ఉంటుంది. రచనలో అయితే చుక్కతోకూడి ఉంటుంది. వాక్యానికి ముగింపు ఉండాలి అంటారు. ఇక్కడ భావం గురించి చెప్పకపోయినా ముందు చెప్పినట్లు భావ సమగ్రత కూడా చెప్పారనుకోవాలి. వాక్య సముదాయాల నిర్మాణంలో సంయోజకత్వాన్ని సూచించే పదాలు ఉంటాయి. నాల్గవ అధ్యాయంలో నాదోత్పత్తిని గురించీ ఆ తరువాత వచ్చే ఐదూ ఆరూ అధ్యాయాలలో వర్దాల వర్గీకరణ, సంధి అచ్చుల సమీకరణాలకు అవసరమైన వివరణ ఉంది.

ఐదో అధ్యాయంలో తెలుగు ధ్వనుల ఉత్పత్తినీ, స్థాన, కరణ, ఉచ్చారణా విధానంగురించీ విపులంగా చర్చించారు. ప్రకాశంగారు ఇంతకుముందు ఇతరులు గమనించని ఒక అంశాన్ని ప్రస్తావిస్తారు. అదేమిటంటే, తెలుగులో సందులు సాధారణంగా స్థానాశ్రిత వర్గీకరణపై ఆధారపడి జరుగుతాయని ఇప్పటివరకూ నమ్ముతున్నాం. ఆయితే త్‌-ల్‌ మధ్య త్‌-న్‌ మధ్య సంధి జరగక పోవడం, భిన్న వర్ణాలకు చెందిన టొ-ల్ డ్-ల్ ట్‌-న్‌, డ్-న్‌ మధ్య జరగడం, అలాగే టొ-చ్‌, ట్‌-జ్‌, డ్‌-చ్‌, డ్-జ్‌ల మధ్య జరగడం, ఇంకా స్‌-త్‌ ల మధ్య సంధి జరగడాన్ని నిశితంగా పరిశీలించి వర్ణాల వర్గీకరణ స్థానాలపై ఆధారపడినాగానీ దానికీ వర్షప్రవర్తనకూ ఎలాంటి సంబంధం లేదంటారు. అందుకని ప్రకాశంగారు కరణాశ్రిత వర్గీకరణపై ఆధారపడి సంధి సూత్రాలను ప్రతిపాదిస్తారు. ఉదాహరణకు, ప, బ, మ, (వ) ఓష్టాలుగానూ, త ద,స, చ, జ(య) లను జిహ్వోపాగ్రాలుగానూ, ట, డ, న, ణ, ల, ళ,ర లను జిహ్వాగ్రాలుగానూ, క, గ లను జహ్వమూలీయాలుగానూ వర్గీకరించి సంధి కార్యాలను సూత్రీకరించటం తేలిక అని సోదాహరణంగా నిరూపిస్తారు. వారు ఇచ్చిన వివరణ ఇప్పటికి ఇదే మొదటిసారి. వారు చెప్పిన సూత్రం: “జివ్వోగ్రాలు సంధికి పూర్వంలో ఉన్నప్పుడు వరంలో ఉన్న జిహ్వోపాగ్రాలతో కరణం విషయంలో సమీకృతమౌతాయి”. ఉదా. చూ.: పాల్‌[+జిహ్వాగ్ర] అ+త్‌[+జిహ్వోపాగ్ర) ఓ= పాల్ష్‌[+జిహ్వోపాగ్ర] అ+త్‌[+జిహ్వోపాగ]) ఓ= ప్లాల్లో

అలాంటిదే, జిహ్వాగ్రాలు పరంలో ఉన్న పరివేష్టిత జిహ్వాగ్రాల కారణంగా పరివేష్టితాలు అవుతాయి. ఉదా. పాలు+డబ్బా = పాళ్దబ్బా.

పై సూత్రం ప్రవర్తిల్లి పరంలో ఉన్న స్పర్శేతర హల్లు ముందుగా పరివేష్టితంగా మారుతుంది. ఆ పైన పూర్వ స్పర్భం వర హల్లు నుండి అనునాసికతనూ పార్చికతనూ పొందుతుంది.

అంటే బడి+ని > బడ్+ణి -> బణ+ణీ అవుతుంది.

తెలుగు సంధి నియమాలకు వర్ణాల స్థానాశ్రిత వర్గీకరణ కంటే కరణాశ్రిత వర్గీకరణ ముఖ్యమా ఉపయోగకరమూ అని మొట్టమొదటిసారి ప్రతిపాదించి సోదాహరణంగా నిరూపిస్తారు.

అలాంటిదే ఏరు, నూరు, మోకాలు లాంటివి ఏటి, నూటి, మోకాటి కావడం కరణాశ్రిత వర్గం కావడమే నంటారు. అలాంటివే నూయి-టనూతి, చేయి-టచేతి కావడంకూడా అంటారు. కారణం, య, త లు జిహ్వోపాగ్రానికి చెందటం అంటారు. కానీ ఈ వివరణ ఇట్లా సంధి జరిగినవాటి గురించి చెబుతుంది సరేగానీ సంధి జరగని వాటిగురించి ఏం చెబుతుంది. నేటి తెలుగులో పదాంతాలలో ను, లు, రు, యి ఉండి సంధిలో ఎలాంటి మార్పు పొందనివే కోకొల్లలు. అంటే చారిత్రికంగా ధ్వనులలో వచ్చిన మార్పులవలనే నేడు సంధి కార్వాలలో విరళంగా కనబడుతున్నవీ సామాన్య సూత్రాలకు లొంగనివీను.

అచ్చులమధ్య జరిగే మార్పులను స్వరమైత్రి అనీ, స్వర సమీకరణం అనీ అనడం ఆనవాయితీ. ఈ రచయిత వీటిని అచ్చుల మమత అంటున్నారు (ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్న పారిభాషిక పదాలను వాడక కొత్తపదాల వాడుక ఎందుకో). రెండూ అంతకంటే ఎక్కువ వర్ణాలమధ్య జరిగే సంధి కార్యాలలో “తొడి వర్ణాలను తాకే ధ్వన్యంశాలను” అలా కాని వాటినుంచి వేరుచేసి వర్గీకరిస్తారు. వాటినే చరాంశాలూ స్థిరాంశాలుగా పేర్కొంటారు. అంటే ఒక వర్డానికి సంబంధించిన ధ్వన్యంశాలు మరో వర్షానికి గనక పాకితే వాటిని చరాంశాలు గానూ అట్లా పాకలేని ధ్వన్యంశాలను స్థిరాంశాలుగానూ చూడాలి అంటారు. ఇప్పటివరకూ తెలుగులో జరుగుతున్న స్వరసమీకరణంపై చే. రామారావుగారూ, క.వెం. సుబ్బారావు గారూ, కే నాగమ్మారెడ్డి, జె.వి. శాస్రిగారూ, గా. ఉమామహేశ్వరరావు మొదలైనవారు ఎందరో విపులంగా చర్చించినా చరాంశాల ప్రతిపాదన ఇదే ప్రథమం.

కారక బంధాలు -విభక్తి వాడుకలు అనే ఏడవ అధ్యాయంలో ఇప్పటివరకూ ఎవరూ వాడని పారిభాషిక పదజాలం వాడుతూ తెలుగులో ఐదు రకాల వాక్యాలు ఉన్నాయన్నారు. వాటికి వరుసగా, గుర్తింపు వాక్యాలు (అతను కోపిష్టి, చెందుడు వాక్యాలు (నాకు రెండు కార్లు ఉన్నై, మనోప్రవృత్తి వాక్యాలు (అతనికి ఇడ్లీలంటే ఇష్టం), అస్తిత్వ వాక్యాలు (డాక్టరుగారు ఉన్నారా?) కార్య వాక్యాలు (అతను పరిగెత్తాడు, తలుపు తెరుచుకుంది) అని పేర్లు పెట్టారు. ఇవి పూర్తిగా వక్త అనుభవ పూర్వకమైన వ్యక్తీకరణపై ఆధారపడి చేసిన విభజన. భద్రిరాజు కృష్ణమూర్తి, చేకూరి రామారావు, మొదలైన వ్యాకర్తలు నిర్మితిని ప్రధానంగా తీసుకొని వాక్య విభజన చేశారని చెప్పాలి. అట్లాగే, రచయిత తెలుగు వాక్యాలలో ఉక్తం, ఆభ్యాతాల తేడాను గుర్తించడం ముఖ్యమైనదని చెబుతూ, వివిధ వాక్యాల్లోని తేడాలను ఉద్దేశ్య విధేయాల సంయోజనంగానే గుర్తిస్తారు. అయితే ఇదంతా వాక్యాలలో వివిధ రకాలను గుర్తించడం వరకే. అసలు, వాక్యాల అర్ధావగాహన వాక్యాలలో వాడిన నామబంధాల విభక్తి రూపాలవలన ఏర్పడుతుందని చెబుతూ ఎనభైదాకా ఉన్న విభక్తి ప్రత్యయాలనూ ఉప పదాలనూ మొత్తం 37 రకాల అర్ధపరకమైన నామసంబంధాలు గానూ మళ్లీ వాటిని 14 రకాల కారక సంబంధాలుగానూ విశ్లేషిస్తారు.

ప్రాణం తీయు లేక చంపు అనే క్రియలు సమానార్థకాలు అని మన సాధారణ నమ్మకం. అయితే అవి కావనీ వాటి వాడుక రుజువుపరుస్తోంది అని ఉదాహరణలతో చూపిస్తారు.

{(18) ఆ విషం అతని ప్రాణం తీసింది.

(20) ఆ విషం అతనిని చంపింది.

20 వ వాక్యం బాగుండకపోవటానీకి కారణం చంపు అనే సకర్మక (క్రియా వ్యాపారానికి కర్తృత్వం వహించలేకపోవటంగా కనబడుతోంది. మరి అదే విషం 18 వ వాక్యంలో ఎలా సాధ్యమైంది. ప్రాణం తీయడం, చంపడం రెండూ స్తూలంగా ఒకే అర్ధాన్ని స్ఫురిస్తున్నా వాటి అర్జకాలమధ్య తేడా కనబడుతోంది. ప్రాణంతీయడానికి కర్తృ పదాలు ప్రాణులు కాకపోవచ్చు గానీ చంపడానికి కర్తృ పదాలు 'ప్రాణులైవుండాలనీ నియమం తెలుగులో ఉందనిపిస్తోంది.

క్రియా పదబంధాల గురించి 8 వ అధ్యాయం లో చర్చించారు. దీన్లో, కార్యస్తితీ (aspect) కాలసూచనా (lense) రెండూ ప్రత్యయాలతోనే తెలుస్తాయని చెబుతూ, “తెలుగులో ఉండు అనే క్రియ మాత్రమే కాలాన్ని సూచిస్తుంది” అనీ, ... “మిగతావన్నీ కార్యస్థితిని సూచిస్తాయి” అంటారు. ఇట్లా వీరిదే మొదటి ప్రయత్నం అనుకుంటాను. 97 వ పుటలో ఇచ్చిన పటానికి వివరణ ఇంకా ఉంటే బావుండేది.

ఇక 9వ అధ్యాయంలో నామ్బీకరణాలగురించి చేసిన చర్చ చేకూరి రామారావు (బేరా) గారి వ్రతిపాదనలపై సమీక్షా వ్యాసంలాంటిది. చేరాగారి ప్రతిపాదనలలో ఉన్న కొన్ని సమస్యలను పట్టుకొని చర్చించటం జరిగింది. భావ పరిశీలన అనే పేరుతో 10వ అధ్యాయంకింద తెలుగు వాక్యాల అర్థ స్ఫోటన ఎలా జరుగుతుందో వివరించబూనటం ఒక విధంగా ఈ వ్యాకరణంలో ఉన్న కొత్తదనమే. పదం, వ్యాకరణం, స్వరం ఇంకా సందర్భం అనే నాల్షింటిని తీసుకొని అర్థ స్ఫూర్తిని వివరిస్తారు.

11 వ అధ్యాయంలో కావ్యాలలో వాడే భాషను గురించి చర్చిస్తారు. ఒకరకంగా ఇది వ్యాకరణంలో భాగం కాకపోయినా ముందు చర్చించిన వ్యాకరణ ప్రతిపాదనలకు ఇక్కడ ప్రయోగాత్మక పరిశీలన జరిగినట్లుగా చెప్పుకోవాలి. ప్రాచీన రస సిద్ధాంత కర్తలైన భామకుడు, విశ్వనాథుడు, జగన్నాథుడు, వామనుడు, ఆనందవర్దనుడు వెొుదలైనవారి సిద్దాంతాలన్నీ చదివేవారికీ వినేవారికీ కలిగే ప్రత్యేకానుభూతికి మూలం వ్యంజన, ధ్వని, రీతి, వక్రోక్తి మొదలైనవే అని అంటారు. అంటే సాధారణ వ్యాకరణానికి అనుగుణంగా ఉందని రచనా సాంప్రదాయం అనుకోవాలి. అయితే ఇవేమీ వ్యాకరణ విరుద్దాలు కావుగానీ అసాధారణ వ్యాకరణ ప్రయోగాలుగా చూడాలి. చేరాగారు అప్పుడప్పుడు అంటుండేవారు అందరూ చెప్పినట్లు చెబితే కవి ఎందుకవుతాడు అని. ఇందులో అసలు విషయం ఏమిటంటే వ్యాకరణం నడ్డి వంచుతాదే తప్ప వ్యాకరణ భంగం కానివ్వరు. ఇట్లాంటి వంగిన వ్యాకరణం కావ్యానికి రసపోషణకు తోడ్పడుతుంది. దీనినే వ్యాకరణ సమత (సమ్మతి) అంటూ దానితోపాటు వర్ణ సమత, పదసమత, స్వరసమత మొదలైనవన్నీ కలిసే సంపూర్ణ సమత చేకూరి వాక్యభావానికి దారితీస్తుందంటారు.

లేఖన సమస్యలనే మరో అధ్యాయంలో తెలుగు లేఖనంలో సమస్యలుగా గుర్తించిన కొన్ని వ్యాకరణ అంశాలను గురించి చర్చిస్తారు. వీటిలో కొన్ని అర్థసందిగ్ధతకు అస్పష్టతకూ దారితీసినామిగిలినవన్నీ కలన శైలిలో భాగమే. ఆధునిక యుగంలో ఎంతో కొంత సొంత మాండలికం రాతలో మాటలో కనబడకపోదు. వాటిని తగ్గించుకోవాలసిన అవనరం నందర్భాన్నిబట్టి ఉండొచ్చు. ఈ అధ్యాయంలో చివరిగా గతి తప్పిన విరామ చిహ్నాల వాడుకను ఉదాహరణలతో ప్రదర్శిస్తారు. ఈ వ్యాకరణంలో చివరి అధ్యాయంలో తెలుగు భాషా బోధన గురించిన చర్చలో భాషాబోధనలో నేర్చుకొనే వ్యక్తికి అవసరమైన భాషాంశం గురించీ, క్షేత పరిథి గురించీ వాటిలో ఉండే ప్రత్యేకతలూ వాటివలన వచ్చే సమస్యలను అధిగమించడంగురించి స్థూలంగా చర్చిస్తారు. చివరికి కొసరుగా విశిష్టభాషగా తెలుగు కావడానికి తెలుగుకు ఉన్న విశిష్టతలను కొన్నింటిని చర్చిస్తారు.

వెన్నెలకంటి వ్యాకరణం పేరుతో ఆధునిక తెలుగు వ్యాకరణ వర్ణనలో చాలా వరకూ కొత్త వరవడిలో రాసినవే. వ్యాకరణం లో ఏమాత్రం ఇష్టం ఉన్నవారైనా దీన్ని తప్పక చదివే ప్రయత్నం చేయాలి. భాషాశాస్త్రంలో ప్రవేశం ఉన్నవారికి ఈ శైలి సహజంగా అనిపించినా సాంప్రదాయక వ్యాకరణంతో పరిచయం ఉన్నవారికి ఎంతో కొంత కొత్తగానే ఉంటుంది. ఆధునిక భాషాశాస్త్ర వరవడిలో సమగ్ర తెలుగు వ్యాకరణం ఇంకా రాలేదనే చెప్పాలి. అయితే ఇలాంటివి భవిష్యత్తులో సమగ్ర తెలుగు వ్యాకరణ రచనకు ఆధారాలు అవుతాయి. రచయిత యార్ము విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రంలో పిహెచ్‌.డీ. పొంది వివిధ విశ్వవిద్యాలయాలలోనూ ప్రత్యేకంగా ఇంగ్లీషూ తదితర విదేశీభాషల విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా భాషాశాస్త్ర బొధకుడిగానూ గడిచిన ఐదు దశాబ్దాలుగా చేసిన పరిశోధనలలో గడించిన అనుభవంతో కూర్చినది కావడం ఈ వ్యాకరణం ప్రత్యేకత.

కవిత

తెలుగు నుడి

గుండెల్లో ఒదిగిపోయే కమ్మదనం
తెలివిని పెంచుటే తెలుగుకున్న గొప్పగుణం
అమ్మపాలలా ఫౌష్టికం జుంటితేనెలోని తీపిదనం
లే ఎండల్లోని చురుకుదనం పున్నమి వెన్నెలలోని చల్లదనం ...
తపనపెంచే లోచనం తాజా పూల పరిమళం ....
మనశ్వాసలొ నిలిపి మానవతై
మెరిసేది మన తెలుగు...!
దశదిశలా మల్లెల పరిమళమై. ఎదలో చిలిపితనాన్ని కురిపించేది
జాను తెలుగు!

నన్నయకవి ప్రసన్నత పాల్కురికి ప్రావీణ్యత...
శివకవుల జానుతెనుగు శివమెత్తిన దేశీయత...
తిక్కన రసనైపుణ్యం ఎర్రన నాచన వర్ణన
శ్రీనాథునిపాండిత్వం పోతనకవి సహజత్వం..
తేటతేట హృదయాలకు వెలుగునింపు
దివ్యగుణమే తెలుగు

శతక కవుల చమత్కృతులు పదకీర్తన జావళీలు
కృష్ణరాయ స్వరయుగం కావ్వరసం కమనీయం
అచ్చతెనుగు జిగిబగీలు అతులిత మాధురీ మహిమలు...
ముద్దుపలుకు గుంఫనాలు శ్లేష ద్వ్యర్థి చేమ కృతులు...
వలపుల వయ్యారి కులుకు నవరస నాట్యపు నడకల నవ్యతెలుగు

ముత్వాలసరులతోగురజాడ
అమలిన శృంగార శోభగా రాయప్రోలు
కందుకూరి సంస్కారం గిడుగుమూర్తి వ్యవహారం...
కృష్ణశాస్త్రి విశ్వనాథ శ్రీశ్రీల భావుకతా...
జాషువా దాశరథీ సినారె కాళోజిల మానవతా
సూరి బ్రౌను ప్రతాపరెడ్డి వట్టికోట ఆధునికత దివ్యతెలుగు

వచనకవిత నవల కథల కాల్చనికత వాస్తవికత....
అతస విరస దిగంబర నయాగరా చేతనత్వ...
హేతువాదమనుభూతి స్రీవాదపు దళిత గీతి..
మణిపూసలు నానీలు పలుకుబళ్ళు హైకూలు...
నిఖార్భైన జానపదం నిత్వనూత్న సుకుమారమే తేటతెలుగు!!
ఎదసవ్వడి గుసగుస గుణగణాల మాధుర్యం మాతృభాష.

డా.పాండాల మహేశ్వర్‌ 9912180054


జిల్లాస్థాయి వరకు కోర్టుల్లో తీర్పులు తెలుగులో తేవాలి (జి.ఒ.నెం. 485/29.3. 1974)