అమ్మనుడి/సంపుటి 6/జనవరి 2021/మాఊరు

వికీసోర్స్ నుండి


హోసూరు తావు నవల

అగరం వసంత్‌ 094883 30209

వాన బాగా పడింది.

ముంగారువాన బాగా పడింది.

పెద్దేరులా, చిన్నేరులా, చెరువుల్లా, వంకల్లా కుంటల్లా వాననీరు బాగా చేరింది. చేన్లంతా బాగా నాని ముద్దయిండాయి.

ఆవులపల్లి, అలసనత్తం, అగ్గురారం, అత్తిముగం, చిన్న ఎళసగేరి పెద్ద ఎళసగేరి, చిన్నకూళ్లు, పెద్దకూళ్లు, ఏటిగడ్డ, సౌళుబీడు ఇట్లా వూర్లంతా వన్నేరు కట్టేకి సురువు చేస్తా వుండారు.

నేలని నమ్ముకాని వుండే రైతులపండగ, నేలమ్మకి రైతులు మాత్రమే చేసే పండగ ఈ వన్నేరు పండగ.

మావూర్లా మేము పెద్ద రైతులం కాదు కాని మాకూ చేను, చెట్టు వుంది. నవదాన్యాల ఎడలు(ప్రసాదాలు) ఎత్తుకొని మేము గుడితావుకి పోతిమి. అబిటికే గుడి ముందర మడకలతో వచ్చి రైతులంతా నిలిచిండారు.

ఊరిగౌడు గొరైపొట్లి తలమింద నీళ్లు పోసి పసుపు, కుంకుమ పెట్టి, సామ్రాణి కడ్ల పొగ చూపిచ్చె. గొర్రి గట్టిగా తల అల్లాడిచ్చె.

“పిల్ల (గొర్రెపొట్లి) ఒప్పుకొనేసె.. అలెలో బాలో” అందురూ గట్టిగా కిర్లిరి. ఒగే వేటుకి క్రిష్టన్న గొర్రెపొట్లి తల నరికె. అబిటికే మడకలకీ, ఎద్దులకీ పసుపు, కుంకుమ పెట్టి తయారుగా వుండారు.

గౌడు వచ్చి పూజ చేసి, "ఈ కిత ఎవరప్పా వన్నేరు” అంటానే “నేనే గౌడు” అంటా రామన్న ముందరికి వచ్చె.

నవదాన్వాల ఎడ, టెంకాయ చిప్ప, పూలు, ఫలములు రామన్న చేతికిచ్చి, “పంటలు బాగా పందాలని నేలమ్మకి మొక్కుకొని మడక కట్టప్పా” అని చెప్పి గుడిలోకి పోయె.

“మా జాంబవంతుడు పుట్టిన ఆర్నెల్లకి బూమమ్మ పుట్టె" తోటి (ఊరి పనులు చేసే వ్యక్తి) అంటా ముందర నడస్తా వుంటే ఆయప్ప వెనక రామన్న పోతా వుండాడు.

ఊరి ముందర మడకను దింపి, కాడిమానుని మడక్కి బిగించి, “అమ్మా నేలమ్మ తల్లీ ఈ కిత వానలు బాగా పడి నీ కడుపు పండాల, మా కడుపులు నిండాల” అని నేలతల్లికి మొక్కి వూరి చుట్టూ వన్నేరు కట్టేకి సురువు చేసిరి (నేలని దున్నడం).

తోటి మోటప్ప వెనక రామన్న నడస్తా, మడక దున్నతా, దున్నతా వూరి చుట్టూ దున్నేసి వచ్చిరి.

“ఊరి చుట్టా దున్నీంది ఆయె వన్నేరు కట్టింది ఆయె” తోటి మోటప్ప మాట విని అందరూ వాళ్ల వాళ్ల చేనులు దున్నేకి పోయిరి.

నేను అబ్బ కూడా మా చేనుతావుకి పోతిని. అబ్బ దున్నతా వుంటే నేను మడక వెనక నడచి పోతా వుండా. దుక్కిలానింకా లేసే పచ్చిమన్ను వాసన నా ముక్కులా దూరి నాకు బాగా అచ్చివచ్చె. దున్నేటపుడు మన్నులానింకా లేసే ఎర్ర పులుగులు, గాలం పులుగులు, గొణ్ని పులుగుల్ని కాకులు గద్దలు తిని పోతా వుండాయి.

“తుంగ, ఉట్ల కసువు, ఊగ కసువు, గరిగె బజ్జర వుండేతావ బాగా గాతముగా మడక పోయేనట్ల చూడు తాత చెప్పతా వుంటే, అబ్బ తల గుంకాయిస్తా ఎద్దుల్ని అదలిస్తా ఫోతా వుండాడు.

మాకుందేది ఒగే చేను. పొద్దప్పుడు నెత్తిపొద్దు ఎక్కి పోతావున్నట్లే, మా చేను దున్నింది ఆయె.

“గౌనోళ్ల చేను దున్నేకి పోతా” అంటా మా అబ్బ పయనమాయె. నేను అబ్బ పయనములా పాలు పంచుకొంటిని.

అది చేనా చెరువా అనే సందేహము వచ్చే నాకు, అంత పెద్దగా వుంది. అబిటికే ఏడుజతల మడకలు చేను దున్నతా పారాడతా వుండాయి. మా అబ్బ కూడా వాళ్ల జత చేరిపోయి.

“పోయిన ఏడాది రాగులు చల్లింటిమి కదా, ఈకిత సెనక్కాయలు (వేరుసెనగ) వేయాల ” గౌడు వాళ్ల సేద్దెగాని తావ అంటావుండాడు.

“మూడు విత్తనాల తీగకాయ వేస్తామా? రెండు విత్తనాల గుత్తికాయి వేస్తామా గౌడూ” సేద్యెగాడు అంటానే “గుత్తికాయి వేస్తామురా అట్లే ఓణి (డొంక) చేనుకి నూగులు, కానుగమాను చేనుకి కొర్రలు, కల్లము చేనుకి ఉలవలు, ఆ పక్క చేనుకి సాములు, ఈ పక్క చేనుకి సజ్జలు వేయాల. రాగిచేను విత్తేతబుడు చేనుకి కల్ల(కంచె) గా ఎర్నూగు పూలు, సాళ్లలా జొన్నకడ్లు ఆనప, అలసంది విత్తనాలు, చేనంతా ఆడాడ సాసువులు(ఆవాలు) చల్లాల. నువ్వే దగ్గరుండి ఈ పనులంతా చూసుకోవాల” గౌడు చెప్పతా వుంటే సేద్దెగాడు “అట్లే” అంటా తల గుంకాయిస్తా వుండాడు.

గౌడుసానమ్మ సంగటి మక్కిరిన్ని (గంప) ఎత్తుకొని వచ్చి కానుగమాను నీడలా దింపె. మడకలు విప్పి, ఆవుల్ని పచ్చి కసువు

మేతలకి విడిచి అందరూ కానుగమాను తావుకి వచ్చిరి. కత్తాళి


(నారకలబంద) పట్టులా సంగటి పెట్లుకాని, ఉలవల పులుసు పోసుకొని తింటా వుండారు. నేను అన్నానికి మామిడికాయ ఊరగాయ కలుపుకాని తింటా వుండా.

“పాకముపప్పో.. పాకముపప్పు” అంటా అరస్తా సాయిబుల లబాబన్న కావలిలా (బీడుభూమి) దూరి వూరిపక్క పోతావుండాడు.

“పాకముపప్పు తినాలప్పా” అంటా అడిగింది తడువు, మా అబ్బ నోట్లా రెండు వేళ్లు పెట్టుకొని జోరుగా సీలేసె (విజిల్‌) అది విని నేరుగా మాతావుకి వచ్చె లబాబన్న గౌడు పదిరూపాయల నోటు తీసి లబాబన్నకి ఇచ్చె.

“మీవూర్లా మీరు తప్పితే నా పాకముపప్పుకి కాసులు ఇచ్చే నాతుడే లేడు గౌడు” అంటా మా అందరికి పాకము పప్పు ఇచ్చె.

పాకముపప్పు తింటా మాతావు పంటల గురించి రవంత సేపు మాట్లాడి ఎవరి పనులకు వాళ్లు పోయిరి.

“నువ్వు లబాబన్న కూడా వూరికి పోరా” మా అబ్బ అనె.

నేను లబాబన్న సైకిలు వెనక వూరిదోవన నడస్తా వుండా.

“అనా... నా... పాకము పప్పు చేసేది ఎట్లనా” అంటా అడిగితిని. “అదేమి పెద్ద యిద్ది కాదబ్బయ్య, సెనగిత్తనాలని వేపి, పొట్టును వుజ్జి ఒగ తట్టలా పెట్టుకానాల. బెల్లము నజగొట్టి సట్టిలా వేసి నీళ్లు పోసి బాగా ఉడకబెట్టాల. ఆ పాకము బాగా మరిలినంక సన్నమంట మీద తట్టలా పెట్టిందే సెనగ యిత్తల్ని వేసి కలుపుకొనాల. రవంత సేపు ఉడకనిచ్చి ఆమీట పెద్ద తట్టలా ఆ పాకాన్ని పోసుకొని ఆరబెట్టి చిన్ననీన్న బీళ్లలుగా కోసుకోవాల... అంతే” అని చెప్పె.

“అవునునా నువ్వు పాత సామాన్లు, చిలుము పట్టిందే ఇనుము సామాన్లు తీసుకొంటావు కదా వాటినీ ఏమి చేస్తావునా” తిరగా అడిగితిని.

“పేటలా పెద్ద పెద్ద యాపారగాళ్లు వుండారప్పా, నేను వాళ్లకి అమ్మతాను. వాళ్లు అవిటిల్ని కరిగిచ్చి తిరగా కొత్తగా తయారు చేస్తారు” అనె.

“అంటే పాతది ఫోయి కొత్తది వస్తుంది కదనా” అంటిని.

“అవును, కొత్తనీరు వచ్చి పాతనీరు పోయినట్ల, కొత్త మనుషులు వచ్చి పాతవాళ్లు పోయినట్ల కాలచక్రంలా మనిషైనా మానైనా విరగాల్సిందే కరగాల్సిందే మన్నులా కలవాల్సిందే” అనీ వూరి ముందర రచ్చతావ సైకిలు నిలిపి “పాకము పప్పో.. పాకము పప్పు” అని గట్టిగా అనె. చిన్నోళ్లంతా వచ్చి చుట్టూ చేరేసిరి.

విత్తనాల ఏకాసి పండగనాడు చేను చేనులంతా విత్తనాలు చల్లిరి. వాన ఎనక వాన పడతా వుంది. మొలకలు పెరిగి పెద్దవవుతా వుండాయి. చేనులకంతా గుంటువ వేసి చెత్తా, చెదారా లేకుండా చేసిరి. వయిర్లు గుమ్ములు కట్టి గుంపులు గుంపులుగా చేన్లంతా నిలిచిండాయి. అత్తాన పొంగలి నాపొద్దు (నాడు) కూలోళ్ల కష్టానికి పందినంజర వంటావార్పు. చేనుపంటలే కాదు కానపంటలకీ మా తావు పెట్టింది పేరు. మావూరి చెరువుకట్ట నాలుగు పర్నాంగుల విస్తీర్ణం వుంటే కట్టకింద కాన 40 పర్నాంగుల దూరం వుంటుంది.

కాన కానంతా కిచిడి వడ్లు, బెద్ద బేరొడ్లు జయా వడ్లు నల్ల వడ్లుర్ల, బవానీ వడ్లు, గిడ్డ బయ్యర్డు మూన్నైెల్ల వడ్లు, ఆర్నెల్ల వడ్లు, గమ్ముల వడ్లు, రకరకాల వడ్లపయిర్లు పచ్చగా పెరిగిండాయి.

కాన చుట్టూరా టెంకాయ, చింత, సీమచింత సేపు(జామ), పరంగి(బొప్పాయి), బంకశలి, కలవరేణి, బిక్కి సీతాపలము, పనస, నేరడి, జంబు నేరడి, కరప, అత్తి(మేడి) మాన్లు అంతెత్తరము పెరిగి నిలిచిండాయి.

మానుపనికి అయ్యే జాలిమాను, బాగిమాను, పువ్వరిసి మాను, ఫొగుడుతండి మాను, వెర్రియాప మానులు ఏ. కాలానివో అవెన్ని కాలాలని చూసిండాయో.

మరాలు, మక్కిర్లు, బుట్టలు అల్లేకి పనికి వచ్చే వెదురు గుమ్ములు, సంగటికట్టె, మెట్టుకట్టెకి పనికి వచ్చె సిగరమాన్ల సొగసు చూడాల.

విస్తరాకులకి అయ్యే మోతుకు మాను, మేకలకి మేపులకి అయ్యే పందివేప మాను, పందెమేసుకొని పెరిగినట్లుండాయి.

కట్టకి కావలి కాస్తా కట్ట పొడవునా పెరిగిండే పిల్లగోవి చెట్లు, తెల్లనల్ల జిల్లెడి చెట్టు, వార్డీపు మాన్సు, తాటి మాన్లు ఈత మాన్లు ఆడాడ మాన్లకింద అలుమాకు, ఆనబరుగు కసువు, పాలాకు, బొద్దాకు, కాశాకు, గరిగకసువు, సొంటికసువు, ఏటిజంబు సొగసుగా 'పెరిగిందాయి.

కాన పక్కలానే కావలి (భీడుభూమి). కావలికి కల్లగా సన్న కల్లి, పెద్దకల్లి పొదలు, కొటము పొడవు పెరిగిందే మంచి కత్తాళి, వెర్రి కత్తాళి, జాలి, ముగళి, మర్రి, గొడ్డలిమిట్ట మాన్లు.

కావలంతా పచ్చి కసువు, ఆ కసువు మద్దెలా అడవి టెంకాయలు (ఏలకుల సైజులో పచ్చగా వుంటాయి. కాయలోపల నల్లని విత్తనాలు వుంటాయి. వాటిని తింటారు). కారి, మిండ, కుడితి పంట్ల కత చెప్పే పనిలేదు.

ఎర్రని పండ్లతో నాగదళ్లకాయ (నాగజెముడు) చెట్టు. ఈ పండు తినాలంటే పండు కొననీ రవంత కోసి పక్కన పెట్టి మిగిలిన పండు

తినాల. ఆ కొన పండులా చక్రము మాదిరిగా వుండే ముల్లు వుంటుంది. దాన్ని తీసి తినాలా, లేదంటే ముల్లు గొంతులా


తగులుకాంటే తీసేకి చానా కష్టము.

ఈ పండు ఒంటికి పుష్టికే కాదు, పెండ్లయి బిడ్డలు కాకుండా వుండే జంటలు దీన్ని తింటే బిడ్డలు పుడతారంట, అంత శక్తి ఈ పండుకి వుందంట. మా తాత ఎబుడూ చెప్పతా వుంటాడు.

కాన వబ్బలా కెంబారుకాకి పాట పాడతా వుంటే కల్లి వబ్బలా గుడ్లగూబ ఊ కొడతా వుంది. “అక్కా అక్కా” అని కూస్తా వానకోయిల చేన్ల పక్కసోతే “కుపేంద్ర... కుపేంద్ర” అని కూస్తా కుపేంద్రుని గువ్వ వచ్చి గుట్ట మీద కూకొనె.

“ఉత్తుత్తి... ఉత్తుత్తి దణి చేస్తా ఉత్తుత్తి గువ్వ గూ... గూ... గువ్వల మాటలు మా కాన పక్క బాగా వినబడతాయి.

“బుస్‌... బుస్‌...” అనే నాగపాములే కాదు తోకలా మనుషుల్ని కొట్టే జేరుపోతులు, (అది జోరగా కొడితే కాడిమాను కూడా యిరిగి పోతుందంట. ఇంగ మనిషి కాలు నిలుస్తుందా) కట్టె కంపల్లా వుండే కట్ల పాములు, దుక్కి నేలలా వుండే దుమ్ము మండ్లాయి, పూడ మండ్లాయి, మనుషుల్ని కొరకని (కరవని) వసురు పాములు, కొరికినా విషం లేని నీళ్లేరి పాములకి, పుట్టలకి, పులుగలకి, చీమలకి పుట్టినిల్లు.

ఇంగ చెరువునీళ్లలా జెల్లులు, ఉణుసులు, మారువులు, దూబాని చేపలు, కుచ్చులు, కొారదలు, కోలససులు, కేట్లాగులు, గెండ్లు, పక్కిలు, పాము చేపలు, నెత్తిమీద కండ్ల చేపలు మెదలాడతా వుంటే, నీళ్ల కోళ్లు చేపగువ్వలు, శెనిగువ్వలు, తెల్ల కొక్కర్లు, కొంగలు, గద్దలు ఆ చేపల్ని ఎత్తుకొచ్చి మాన్ల పైన తింటా వుండాయి.

ఇంగ నల్ల ఎండ్రికాయలు, రాజ ఎండ్రికాయలు, రాతెండ్రి కాయలు, పాల ఎండ్రికాయలు, గుల్లెండ్రికాయలు బండ్ల సందుల్లా ఇండ్లు కట్టిండాయి.

పూరిడు గువ్వా, పిచ్చిగ్గువ్వా, గీజన గువ్వా, గోరటి గువ్వా, చిలకా-గోరింకా, పండు కాయి తింటా, చెరువులా నీళ్లు తాగతా పైపైన పారాడతా వుండాయి.

ఉడుము, నలికిరి, జెర్రి, మండ్రకప్పా, గండ్ర కోతి, చిట్టెలుకా, పందికొక్కు కోతుల మండ, మిడతల దండు, తేనీగలు, కర్నీగలకు కాదవ లేదు.

ఇట్లా చానా రకాల చెట్లు, నానా రకాల ఆకులు, అలుములు, గువ్వలు, జీవాలని తన గుండెల్ల పెట్టుకొని సాకే మా చెరువంటే నాకు చానా ఇష్టము.

“నీ ఇష్టము మా ఇష్టము కాదా, రారా కొక్కరిబండ తావుకి పోదాము” అనిరి నా సొవాసగాళ్లు.

చెరువు కొనలా వుండేదే కొక్కరి బండ. మోకాళ్ళు మునిగేఅంత నీళ్లు ఈ బండ చుట్టూ చేరి వుంటాయి. బండ చుట్టూరా ఆడాడ చిన్న చిన్న గుంతలు. గుంతలా నీళ్లు ఎబుడూ తేటగా తాగేకి బలే తీపుగా వుంటాయి. నేనూ, నా సావాసగాళ్లు బండపైనకి ఎక్కి ఆడనింకా జారతా నీళ్లలా పడతా వుండాము.

గొడ్డూ, గోదా మాన్ల కింద చేరి నెమరేస్తా వుండాయి.

“పొతా పోతా పోలూరు, పోలూరు పక్మ మాలూరు, మాలూరు పక్కల మర్రిమాను, మర్రిమానులా కోతి, కోతి చేతిలా గజ్జె - గజ్జె గలుక్కుమనే నీ నోట్ల పురుక్కుమనే” కెంచన్న వాళ్ల మునిగాడు కానుగ మాను కవలకొమ్మలా కూకోని పాడతా వుండాడు.

“గాజులూ తొడుగారమ్మ, గౌరి తొడిగే నల్లా గాజులు, కైవార మఠము గాజులు, తాతగారు తొడిగిన గాజులు" కూనిరాగము తీస్తా కుటాణిలా వక్కాకు దంచతా వుంది లచ్చుమవ్వ

“కత్తి పట్టరా, సిపాయి బిడ్డ నేనే వస్తాను” అని అరిగాడు ఆవుల మంద బెదిరిపోయే మాదిరిగా కూతేస్తా వుండాడు.

చింత మానెక్కి నలుగురు చిన్నోళ్లు కోతికొమ్మాట ఆడతా వుంటే, ఇసక దిబ్బలా ఇద్దరు ఆడబిడ్లు చెలిమి కొలిమి ఆట సురువు చేసిండారు.

బండిపైన ఏతం దూతం ఆట, బండ పక్మలా బంగరాల ఆట, కనులు పువ్వుల ఆటలా నీలీ శీలి, కన్ను ఆటలా రామీ బీరి. ఏటుపండు ఆట ఆడతా ఆరుగురు. చేతులు జోడి ఆటలా నలుగురు. ఈడ్పులాటలా పడిరి కొందరు. తువ్వాలు ఆటలా పెట్లు తినిరి ఇంకొందరు. అప్పుదడ ఆటలా అలిసిన మారి. గాజు వొప్పులు ఆటలా గెలిచిన నంజి. చౌకా... బారా ఆటలా గెలిచి, సరి-బేసిలా సోలిన గౌరి. బొమ్మబొరుసు ఆటలా కాసులు గెలిసి, వానగుంతల ఆటలా మెరసి, గిరిగిరి ఆటల కండ్లు తిరిగి కించపడిన ముని. మలగంబము ఆట ఆడాలని తైలము మాను (నీలగిరి మాను) ఎక్కి దిగతా వుండే రాజుగాడు. రాజట్ల రాళ్లాటని చిన్నోళ్లకి నేర్చతా ఈరన్న మూడిండ్ల గట్టా (అష్టా చమ్మ) లా మునిగి తేలతా అనుమక్క ఆంజమ్మ. ఏడిండ్ల గట్టా ఇట్ల ఆడాలని చెప్పతా వుండే చిన్నముని. పులి గట్ట ఆడతా కాకన్నతాత, గూపల్లి తాత.

కుంటే బిళ్ల జారాట, కిష్టకాలాటా, గుర్రం కాలు ఆట, అరికాలు ఆట, అమిటి ఆటల్లా శైలమ్మని సోలిపించింది ఎవురూ లేరు. కుంటేబిళ్ల ఎనీమిది ఇండ్లు, తెల్లనల్ల ఆట, తలకాయి ఆట, పువ్వు మొగ్గ ఆట అమిటి ఆట, కొండాటలా, శిల్చక్కకి సరిలేరు ఎవ్వరూ. గోలీలు, వేటుజాండు, పొడువు గీతాట, చెక్కబొమ్మ ఆట, మూడు బొద్దిలాట, గుండాట, సోణికి, సయ్యి గుయ్యి ఆటల్లా గోవిందునికి ఎవ్వరూ సరిసమానము కాదు. అచ్చన రాళ్లు, జల్లడి ఆట, పొయ్యి ఆట, పాడాల ఆట, ఎండ్రకాయి, తక్కడి, తొట్టండ్లు, శిలాపలుకులు, మూత, గుండాట, పేరు ఆట, ఆశ-దోశ-అప్పలం ఆటల్లా మునిరాజమ్మని, నాగరాజమ్మని, సాకమ్మని, మించినోళ్లు ఎవరూ లేరంటాను.

సల్లని గాలి, పచ్చని చెట్లు చంద్రోదయము కాని సాయంకాలము చెరువు కట్టపై నడస్తా నేనూ నా సావాసగాళ్లు పోతావుండాము.

పిడికెడు వడ్ల గుత్తిని ఇంటి ముందర వేలాడదీసి కట్టే తాత. పిచ్చిగ్గువ్వలు వచ్చి ఆ వడ్లగుత్తి చుట్టూ చేరి తిని ఫోతావుండాయి.

ఆవులకి కసువు, కుక్కలకు సంగటి, పిల్లులకి పాలు, గువ్వలకి గింజలు పెట్టే కళాచారం మాది. జీవరాసులు మా బతుకులా బాగం.

రాగెన్నులు తెచ్చి కాల్చుకొని లేదా ఉడకేసి ఉట్టి, దాంట్లో బెల్లము కలుపుకొని తింటే ఆ రుచే వేరే. నేనూ నా సావాసగాళ్లు ఇబుడు తానే ఆ రుచి చూసి వస్తిమి. మీకు తినాలనిపిస్తే రాండా, మా రాగెన్నుల రాజ్ఞానికి రాండా.

మడులు కోసి, వడ్లు తొక్కిచ్చి, రాసులు పోసి, మూటలకి నింపి, ఇంటికి కావలసిన్నని మూటలు పెట్టుకొని మిగిలిన మూటలని బండ మీదే వ్యాపారాలు జరిపిరి.

“లేపు కల్లము అలకాలనా, పొద్దుననే వచ్చీడి" అబ్బతావ గౌనోళ్ల సేద్దెగాడు అని పోయె. నేను ఇందాకంట కల్లము అలికేది సూడలే. రేపు చూడాల అనుకొని కండ్లు మూస్తిని. బాగా నిద్దర వచ్చీసె....

అబ్బ పాలు పిండతా వుండాడు. అబుడు గేణం వచ్చె నాకు, లేసి పండ్లు ఉజ్జి, పాలు తాగి, అబ్బ వెనక కల్లము అలికే తావుకి పోతిని.

గౌనోళ్ల రాగికుప్ప చానా పెద్దగా పొడవుగా వుంది. వూరి వాళ్లవి, మావి చిన్న చిన్న కుప్పలు చేనుకి చుట్టూరా వుండాలి. కుప్పల మద్దిలా వుండే జాగాలానే కల్లము అలికేది.

అబిటికే పదిమంది మగోళ్లు చెనకల్లా (పారలతో) నేలనంతా చదును చేస్తావుండారు.

మా అబ్బ బండినిండా నీళ్ల బిందిగలు నింపుకుని వచ్చె. అందరూ ఆ నీళ్ల బిందిగల్ని తలా ఒగొగటి ఎత్తుకొని చదును చేసిన నేల పైన చల్లిరి.

గువ్వలు గూటికి చేకే పొద్దులా మోటప్ప ఆ నేలనంతా పొలికి తోలె.

రెండోనాడు ఐదుజతల ఆవుల్ని జతకట్టి ఆ నేలనంతా బాగా తొక్కిపిచ్చిరి. కడగా గుండు కట్టి తోలిరి. అబిటికే నేల బాగా గట్టిపడె.

ఆమీట ఆ నేలపైన పేదనీళ్లు చల్లి బాగా అలికిరి. ఇట్ల రెండు దినాల కష్టము పడినంక కల్లము తయారాయె.

మొదలు దినము గౌనోళ్ల కుప్పలోని కట్టలు తీసి కల్లములా సాళ్లు పరిసి గుండుతోలేకి సురువు చేసిరి. మోటప్ప, మా అబ్బ, మార్చి మార్చి గుండు తోలతా వుండారు. అబిటికే మద్దేనము సంగటి తినే పొద్దు ఆయె. అబుడు నిలిపి తాళునంతా తిప్పేసి సంగటి తినిరి.

ఆమీట ముద్దలగంగడు గుండు తోలతా పడుగు తొక్కిస్తా వుండాడు.

“రేయ్‌! వాక్కు వైనము (విద్యాబుద్ది) లేనోడా అట్లేనా గుండు తోలేది, ఎవురురా నీకు వజాయము (నడవడిక) నేర్చింది” అంటా మయేరమ్మ గద్దిచ్చి మాట్లాడె.

తనపాటికి తాను పడుగు తొక్కిస్తా వుండిన ముద్దల గంగనికి రేగినట్లుంది. కోపముగా ఆయమ్మని చూస్తా “నీ మొగుడేనమ్మా” అనె.

“నువ్వు ఎపుడు నా మొగునికి దిగితివిరా, నీకు వజాయము నేర్చేకి" అట్లే తగులుకొనె.

ఆ మాట వింటానే గంగనికి ఉన్నింది రేగిపోయి వూగిపోయె. అట్లే గుండు; నిలిపి “ఏయ్! గుగ్గు (మూర్ఖ) ముండా నీకు ఒళ్లు ఎట్లుంది. అయినా నువ్వు ఎవతివే నన్ను తిట్టేకి, నువ్వు నా మాదిరి గానే కూలికి వచ్చిండే కుటాణి. నోరు మూసుకొని నీ పని నువ్వ చూడు” అనె.

“రేయ్‌! ముట్టాల్‌ నా బట్ట. అడేల అట్ల రేగుతావు. కూలి కూడు కడుపుకి పట్టాలంటే న్యాయము నీతిగా పనిచేయాలరా!”

“న్యాయము నీతి చెప్పేకి నువ్వు అరిచంద్రుని పక్కలా పుట్టి వచ్చిండావు”

“న్యాయము నీతి చెప్పేకి అరిచంద్రుని పక్కలా పుట్టి రావాలేంరా, కడుపుకు అంత అన్నము తినే ఎవరైనా చెప్పొచ్చు.”

“నువ్వు ఒగతివే కడుపుకి అన్నము తినేది. మిగతావాళ్లంతా సున్నము తింటారు.”

అందాతలికే ఆడికి గౌడుసానమ్మ వచ్చె. ,

“చూడు గౌడుసానమ్మా వాని మాటలు... కన్ను మిన్నూ లేకుండా పడుగు తొకిస్తావుండావు, బాగా తోలరా అనిండానికి నన్ను అనరాని మాటలు అంటా వుండాడు” అంటూ దూరు చెప్పె మయేరమ్మ,

“దాని మాటులు కట్టుకొాండమ్మ, నాకు ఈ పని కొత్తనా? పడుగు మింద ఎట్ల తోలాలని తెలీదా? నాకే గుండు తోలే దానిగురించి చెప్పుతుంది దానికెంత సాకు” అనె గంగడు.

“ఎవరికి రా సొక్కు నాకా, రారా” అంటా పరకను చేతిలాకి ఎత్తుకొనె మయేరమ్మ,

“ఏయ్‌! మయేరి, ఇంగ చాలు నిలుపే నీ రంగాటము. ఇంతకీ, అంతకీ జగడాలేనా? నీ పని నువ్వు చేయకుండా వాన్ని పనిచేయనీకుండా ఏమి నువ్వు చేస్తా వుండేది, ఎట్లా వజాయము నేర్చిండావే” అని తిట్టె గౌడుసానమ్మ.

“అట్ల ఉమియమ్మా.. దానికే వగలేదు, ఇంగ నాకి వజాయము నేర్పేకి వస్తా వుంది. గబ్బుముండ” అంటా గుండు తోలేకి సురువు చేసె ముద్దల గంగడు.

గుండు తోలేది, గుంగు వింగడిచ్చేది, రాగులు తూరి రాసి పోసేది. ఆ రాసుల్ని ఇండ్లలోని కణజాలకి, గాడులకి నింపే పనుల్లా అందరూ మునిగి తేలిరి.

ఆమీట వారానికి కందులు, ఉలవలు, సాములు, సజ్జలు, అనప, అలసంది, ఉద్దులు, ఎర్నూగులు కల్లము నింకా ఇండ్లల్లాకి చేరె.

(తరువాయి వచ్చే సంచికలో...)