అమ్మనుడి/సంపుటి 6/జనవరి 2021/ఒక కథ - యెన్నో ప్రశ్నలు

వికీసోర్స్ నుండి

సాహిత్యరంగం

డా! మధురాంతకం నరేంద్ర 98662 43659

ఒక కథ - యొన్నో ప్రశ్నలు

అనగనగా వొక ద్వీపకల్పముండేది. దానికి మూడువైపులా సముద్రమూ, వోవైపు మాత్రమే నేలా యెల్లలూ వుండేవి. ఆ నేలవున్న వైపున పెద్ద పర్వతాల వరస సరిహద్దులా వుండడంతో అది మిగిలిన భూఖండంతో పెద్ద సంబంధమేమీ లేకుండా దాదాపుగా ద్వీపంలాగే వుండేది. దానికి కొన్నివేల సంవత్సరాల సంస్కృతీ, నాగరికతా, చరిత్రా వుండేవి. రెండు మూడు శతాబ్దాలక్రితం ఆ ద్వీపకల్పంలో అరవైకిపైగా చిన్న చిన్న రాజ్యాలుండేవి. అవి యెప్పుడూ వొకటితోనొకటి కొట్టుకుంటూ వుండేవి. చాలా దూరం నుంచీ వ్యాపారం కోసమని ఆ ద్వీపకల్పానికొచ్చిన విదేశీరాజ్యం వాళ్లు ఆ రాజ్యాల మథ్యవుండే వైరాలను ఆసరాచేసుకొని, ఆరాజ్యాధిపతులనంతా వోడించి, క్రమంగా ఆ ద్వీపకల్పానికంతా వాళ్లే రాజులైపోయారు. వొక విదేశీ ప్రభువు వచ్చి తమను పీడించడం మొదలు పెట్టాకగానీ ఆ ద్వీపకల్పంలోని ప్రజలంతా నొకటిగా కలవలేకపోయారు. కలిశాక ఆ దేశ ప్రభువుపైన తిరుగుబాటుచేసి, హింసామార్గంలో కొందరూ, అహింసామార్గంలో యింకొందరూ పోరాటం చేశారు. విదేశీగడ్డపైన అధికారాన్ని చెలాయించడం చాలా కష్టమని తెలుసుకున్న ఆ విదేశీ ప్రభువులు, యీ యాతననుంచీ తప్పించుకోవడం కోసమని, ఆ ద్వీపకల్పానికి స్వాతంత్ర్యాన్ని వుదారంగా యిస్తున్నట్లుగా వేషం వేసుకొని పారిపోయారు. పోతూపోతూ మతమనే గొడవల్ని సాకుగా చూపెట్టి ఆ ద్వీపకల్పాన్ని రెండు రాజ్యాలుగా తునాతునకలు చేసిపోయారు.

విదేశీ ప్రభువులు వెళ్లిపోయాక ఆ ద్వీపకల్పంలోని పెద్దరాజ్యమూ, చిన్నరాజ్యమూ తమతమ ప్రభుత్వాల్ని తయారు చేసుకున్నాయి. రెండు రాజ్యాలుగా మారినా తమకున్న సాంస్కృతిక వారసత్వమొకటేనని గుర్తించాక అవిరెండూ యిచ్చిపుచ్చుకునే మంచి సంప్రదాయాన్ని పాటిస్తూ యెవరికివాళ్లు పక్కవాళ్లను యిబ్బంది పెట్టకుండా, తమతమ బాగోగుల్ని మాత్రం పట్టించుకుంటూ బతకడం మొదలుపెట్టాయి. ఆ పెద్ద రాజ్యానికి పర్వతాలకవతలున్న మరో పెద్దరాజ్యం గూడా స్నేహాంగావుంటూ, యివతలి వాళ్ల పనుల్లోకి అనవసరమైన చొరబాలును రానివ్వకుండా తమవైన పనుల్లోనే నిమగ్నమై పోయింది.

ద్వీపకల్పంలోని పెద్ద రాజ్యం స్వాతంత్ర్యం తర్వాత పరిపాలనా సౌకర్యం కోసం దేశాన్ని మొత్తం యిరవై రాష్ట్రాలుగా విభజించుకుంది. అయినా యే రాష్ట్రంలోని ప్రజలైనా తమదైన భాషలనూ, తమదైన సంస్కృతినీ, తమదైన మతాన్నీ అవలంభీంచుకునే స్వేచ్చ నిచ్చింది. జనసంఖ్య మేరకు యెవరికి కావల్సిన నిధుల్ని వారికి చేరేలా నిర్ణయాన్ని తీసుకుంది. ప్రతి రాష్ట్రానికీ తమదైన కార్యనిర్వాహక యంత్రాంగాన్ని తయారు చేసింది. మొత్తం దేశానికంతా వొక కేంద్ర ప్రభుత్వాన్ని తయారుచేసింది. ప్రతీ రాష్టమూ పరిపాలనకనుగుణంగా చిన్న జిల్లాలుగా, ప్రతిజిల్లా తాలూకాలుగా విభజించబడింది. ప్రతీ వూరికీ వొక కార్యనిర్వాహక వర్గం యేర్పడింది. మొత్తం దేశంలో రెండు రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఆ రెండు పార్టీలకూ దేశాభివృద్ధి తప్ప,


మరే యితరమైన స్వార్ధపూరితమైన కోరికలు లేవు. నైపుణ్యం, వివేకం, ఆచరణశీలత అనే విషయాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ అయిదేళ్లకొాకసారి యెన్నికలు జరిగేవి. యెన్నికలు పారదర్శకంగా వుంటూ, ప్రశాంతంగా జరిగేవి. ప్రచారాలూ, వుపన్యాసాలు, మంత్రాంగాలూ వుండేవిగావు. యెప్పుడూ అప్రమత్తంగా వుందే ఆ దేశప్రజలు గడచిన అయిదు సంవత్సరాల్లో ఆయా పార్టీల నాయకులు చేసిన పనితీరు ఆధారంగా యెన్నికల్లో వోట్లు వేసేవాళ్లు. గెలిచిన పార్టీ మరింత నీతీ నిజాయితీలతో పనిచేసి దేశాభివృద్ధికి చిత్తశుద్దితో పనిచేసేది. వోడిపోయిన పార్టీ తమ తప్పుల్ని దిద్దుకుంటూ అధికారంలోవున్న పార్టీ చేస్తున్న పనులకు చేదోడువాదోడుగా వుండేది. గ్రామ సభలనుంచీ, దేశపు పార్లమెంటు దాకా, అన్నిచోట్లా దేశాభివృద్ధికి దోహదపడే చర్చలు మాత్రమే జరిగేవి. అన్ని పార్టీల రాజకీయ నాయకులూ, తాము ఖర్చుచేస్తున్న ప్రతిపైసా దేశానిదని గుర్తించి, అనవసరపు ఖర్చు కించిత్తయినా లేకుండా జాగ్రత్తపడేవాళ్లు. మిగిలిన సామాన్య ప్రజల జీవన ప్రమాణంకంటే తమ జీవితప్రమాణాలు తక్కువగా వుండి తీరాలని పట్టుబట్టేవాళ్లు. అవినీతి, బంధుప్రీతి లాంటి లక్షణాలసలు లేకుండా వుండాలని అప్రమత్తంగా వుండేవాళ్లు. స్వార్ధ రహితంగా పనిచేసేవాళ్లూ చేయవలసిన పనుల్లో నైపుణ్యంవున్న వాళ్లూ దేశంకోసం తమజీవితాల్ని త్యాగం చేయడానికి కించిత్తయినా సందేహించనివాళ్లూ మాత్రమే రాజకీయాల్లోకి వెళ్లేవాళ్లు. రాజకీయమన్నద్రి వృత్తిగా మారే ప్రమాదం లేకుండా, వారసత్వాలూ, కులాలూ మోతాదునుమించనివ్వకుండా కావల్సిన జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు.

యే భౌగోళిక ప్రాంతానికి కావల్సిన నిర్ణయాన్ని ఆయా ప్రాంతాల ప్రాంతీయ ప్రభుత్వాలు తీసుకునేవి. నీళ్లు వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్తు, మొదలైన అనేకానేక వుమ్మడి అంశాలు కేంద్ర ప్రభుత్వ అధీనంలో వుండేవి. క్షేత్రంలోవున్న ప్రభుత్వాధినేత మొత్తం దేశపు బాగోగులనంతా వొకే దృష్టితో పట్టించుకునేవారు. వొక వొంటరి వెంట్రుకకు వేలాడుతున్న సింహాసనంపై కూర్చుని, న్యాయం తప్పితే వెంట్రుక తెగిపోతుందని భయపడుతూ నిర్ణయాలు తీసుకునే యమథర్మరాజుకూ ఆదేశాధినేతకూ వున్న తేడా వొక్కటే! ఆ సింహాసనంపైన ఆ దేశాధినేతకంత మక్కువేమీలేదు. న్యాయబద్దంగా తప్ప మరోలా నిర్ణయం తీసుకోవడం ఆయనకు చేతగాదు. ఆ దేశంలోని మిగిలిన అందరు రాజకీయనాయకులూ ఆదర్శాల్లో ఆయనకు తక్కువేమీకారు.

రాజకీయాధీకారమన్నది కేవలం బాధ్యతాయుతంగా చేయవలసిన పనిగావడంతో రాజకీయాల్లోకి అవనరమైనంతమంది మాత్రమే వెళ్లేవాళ్ళు. మిగిలిన వాళ్ళంతా తమతమ స్వథర్మాల్ని చిత్తశుద్ధితో ఆచరించేవాళ్ళు.

ప్రజల జీవన గమనానికి ముఖ్యంగా కావల్సిన వ్యవసాయమంటే అందరికీ గౌరవముండేది. ఆహారాన్నీ పండించే రైతులంటే అందరికీ భక్తి శ్రద్ధలుండేవి. పనిచేసే రైతులకు తెలియకుండా వుండాలని, వాళ్లకు కావల్సిన సేవలు చేయడానికి మిగినవాళ్లంతా పోటీపడేవాళ్లు.

పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకూ, వైద్య సదుపాయాలందించే వైద్యులకూ, విద్యాలయాల్లో పనిచేసే వుపాధ్యాయులకూ, వివిధశాఖల్లో పనిచేసే వుద్యోగులకూ, తృప్తినిచ్చేటంత జీతభత్యాలుండితీరాలని ప్రభుత్వాలు పట్టుబట్టేవి.

అప్పుడాదేశంలో ప్రముఖంగావున్న మూడు నాలుగు మతాలవాళ్లూ, మతమంటే జీవన విధానం మాత్రమేననీ, అన్ని మతాల సారమూ మానవత్వమేననీ గుర్తించి, పరస్పరం గౌరవించుకునే వాళ్లు. అందరి మధ్యా స్నేహాలు పెరగడంతో, వివిధ కులాలవాళ్లూ, దగ్గరై, వివాహాలు చేసుకొని, క్రమంగా అన్ని మతాల సారమైన మానవత్వపు మతాన్నొకదాన్ని రూపొందించుకున్నారు.

మనిషి జీవితాన్ని రసవంతంగా మాచ్చే లలితకళలంటే అందరికీ గొప్ప ప్రేమా, గౌరవమూ వుండేవి. కళాకారులందరూ సౌకర్యవంతంగా జీవించేలా ప్రణాళికలు తయారుచేసుకునేవాళ్లు. యేదోవొక 'ప్రాచుర్యమున్న కళను ఆసరా చేసుకుని అర్హతకుమించిన సంపదలను కొల్లగొట్టాలనుకునే కళాకారులు లేకపోవడంతో అన్ని కళలకూ సమాన గౌరవముండేది. విద్యలోనూ, కళల్లోనూ వుండే స్పర్ణ ఆరోగ్యవంతంగానే వుండేది. ఆటల్లో గూడా 'ప్రాచుర్యమున్న ఆటల్ని ఆదే ఆటగాళ్లు, యితర ఆటలు ఆడే ఆటగాళ్లతో సమానంగా మాత్రమే కీర్తి ఆర్జనలుండాలని కోరుకునేవాళ్లు. ప్రజలూ ప్రభుత్వమూ దానికనుగుణంగానే ప్రవర్తించేవి.

మెట్ట ప్రాంతాలూ, నదీనదాలూ, యెడారులూ, కొండలూ, మైదానాలూ, అడవులూ, యిలా అనేక రకాలుగావుండే ఆదేశపు నైసర్గిక ప్రదేశాల్లోనివాళ్లు ఆయా ప్రాంతాల్లోవుండే పరిమితుల్లోనే జీవిస్తూ, తమకు కావల్సిన అదనపు సౌకర్యాల్ని మిగిలిన ప్రాంతాలనుంచీ అవసరమైనంతగా ఫొందగలిగేవాళ్లు. ఆయా భౌగోళిక పరిస్థిలులకనుగుణంగా రూపొందిన వాళ్లు చాలా మంది ఆయా ప్రాంతాల్లోనే వుండగలిగేవాళ్లు. భిన్నరుచుల్తో, వేరేచోటికి వెళ్లాలనుకునేవాళ్లకు సులభంగా అది చేకూరుతూవుండేది.

ఆ ద్వీపకల్పానికి సాహిత్య, సాంస్కృతిక, వారసత్వంలాగే, దానికున్న సహజవనరులూ, భౌతిక సంపదా అంతులేనిది. అది అందరిదీ అన్న ప్రగాఢ విశ్వాసముండడంతో, ఆదేశంలో కరువులు లేవు. వరదలు, తుఫానులు, అంటువ్యాధులు, భూకంపాలవంటి ప్రకృతి వైపరీత్యాల్ని ముందుగా తెలుసుకునే విజ్ఞానం అందుబాటులో వుండేది. తామంతా ప్రకృతి సంతానమని గుర్తించిన ఆ దేశపు ప్రజలు, ప్రకృతి నియమాలకనుగుణంగా తమ జీవితాల్ని రూపొందించుకునేవాళ్లు.

యెన్ని జాగత్తలు తీసుకున్నా మానవ పరిమితులవల్ల అనుకోని ప్రమాదాలు అవాంతరాలూ యెదురైనప్పుడు దేశ ప్రజలంతా కలిసికట్టుగా యెదుర్మొనేవాళ్లు. మానవజీవన పరిమితులవల్ల జరిగే యిక్కట్లకు తట్టుకుంటూ, సానుభూతితో ప్రేమతో జీవించడం వాళ్ల సహజ జీవన విధానమైపోయింది.

ఆ దేశాన్నీ ఆదేశ ప్రజలనూ చూసిన యితర దేశాలూ, ప్రజలూ క్రమంగా తామూ అలాగే పురోభివృద్ధిని సాధించితీరాలని కష్టపడి పనిచేయసాగారు.

          *      *      *

యీ కథలో నిజమెంతో కల్పన యెంతో విజ్ఞులైన మీకు


చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఇంత కథా పుట్టడానికి వెనక కొన్ని ప్రశ్నలు మాత్రం నిలువెత్తు నిజాల్లా నిలబడివున్నాయి. :-

వ్యవసాయదారులకోసమనే చట్టాలు చేస్తున్నామని అంటూ ప్రభుత్వమొకవైపూ, తమను కాపాడండి మహాప్రఖో అంటూ రైతులు మరోవైపూ ఆక్రోశిస్తున్నారెందుకు?

కాశ్మీరులో పాక్‌ ఆక్రమిత కాళ్ళీరు, ఆజాద్‌ కాళ్ళీరు చైనా ఆక్రమిత కాశ్మీరు, యిలా యిన్ని విఖేదాలెందుకు?

యే రాష్ట్రంలోనయినా అరాచకం పెరిగితే “యిది బీహార్‌ అనుకుంటున్నావా?” అనీ అనడం రివాజెందుకయ్యింది?

కొన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలెందుకయ్యాయి? కొన్ని రాష్ట్రాలవాళ్లకు ప్రత్వేక పన్నులు, సదుపాయాలూ యెందుకున్నాయి?

విద్య, వైద్యంవంటి ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాధికారమెవరిది? కేంద్రం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రాలు పాటించకపోయినా తప్పులేదా?

కేంద్రం కొన్ని రాష్ట్రాలను స్వంతమైనవిగానూ, కొన్నింటిపైన సవతి తల్లి ప్రేమనూ చూపిస్తున్నవనడంలో నిజమెంత?

మతాతీత, కులాతీత లౌకిక రాజ్యమని పేర్కొనబడిన రాజ్యాంగపు సిద్ధాంతానికి కట్టుబడే వున్నామా? మున్సీపల్‌ కౌన్సీలర్‌ నుంచీ దేశాధినేత యొన్నిక వరకూ కులమూ, మతమూ యెందుకు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి?

కొందరు తమనెందుకు మైనారిటీలమని ఘోపిస్తున్నారు?

కొన్ని కులాలవాళ్లు తమను బీసీలుగా, యెస్సీలుగా గుర్తించమని యెందుకు ప్రాధేయపడుతున్నారు?

కులాలకూ మతాలకూ ప్రత్యేక బోర్టులూ, ఛెర్మనులూ యివ్వడం రాజ్యాంగబద్దమేనా?

మూడు రాజధానులని వొకరూ, వొకే రాజధాని అని మరొకరూ యెందుకిలా పట్టుబడుతున్నారు?

స్వతంత్ర ప్రతిపత్తి వుందనుకునే న్యాయవ్యవస్థలో యిన్ని లుకలుకలెందుకు? యీ బదిలీలెందుకు?

చాలా పెద్దదని 'పేరుమోన్తున్న భారత రాజ్యాంగానికిన్ని సవరణలెందుకు?

మాతృభాషలో విద్య అనే అంశంపైన కేంద్రమూ, రాష్ట్రమూ వేర్వేరు నిర్ణయాలు తీసుకోవచ్చా?

హోసూరులో, బళ్లారిలో, తెలుగువాళ్లు మాతృభాషకోసమని అంత పోరాటం చేయాల్సిన అవసరమేమిటి?

యిటీవల వాడిస్సా రాష్ట్రం, కొన్ని తీరప్రాంతపు ఆంధ్రప్రదేశ్‌ గ్రామాల్ని ఆక్రమించుకుంటోందని పత్రికలెందుకు ఫిర్యాదు చేస్తున్నాయి?

మనమంతా భారతీయులమనే మౌలికమైన భావనను యెందుకు మరచిపోతున్నారు?

రాజకీయాలే వృత్తిగా యెందుకు మారిపోయాయి?

కొందరు కాసింత శ్రమకూడా చేయకుండా కోట్లకుకోట్లు గడిస్తోంటే, చాలామంది కనీసావసరాలు కూడా లేకుండా యెందుకున్నారు?

యీ ప్రశ్నల జాబితా చాలా పెద్దది.

సమాధానాలే కరువు.