Jump to content

అమ్మనుడి/సంపుటి 5/ఫిబ్రవరి 2020/తెలుగు మాధ్యమ విద్య నాశనానికి కారణం ఎవరు?

వికీసోర్స్ నుండి

ఉద్యమం

డా॥ దాసరి రామకృష్ణ ప్రసాదు9885051179

తెలుగు మాధ్యమ విద్య నాశనానికి కారణం ఎవరు?

ఎంతోమందిమి భయపడుతున్నట్లుగానే తెలుగు మాధ్యమానికి అంత్యక్రియలు జరగబోతున్నాయి. “తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి " అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చెప్పేశారు.

అట్లూరి పురుషోత్తంగారి పుస్తకం:

నా పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌ తెలుగు మీడియంలోనే చదివాను. 1974 లో ఎం.బి.బి.ఎస్‌. లో చేరాను.

అక్కడ నా తరగతి సహచరులు 150 మందిలో ఇంగ్లీష్‌ మీడియం నుండి వచ్చినవారు 20 మంది లోపే. ఇంగ్లీష్‌ లో మాట్లాడటంలో మాత్రం ఇంగ్లీషు మీడియం నుండి వచ్చిన వారు మెరుగ్గా ఉండేవారు. తెలుగు మీడియం వారు ఆంగ్ల మాధ్యమంలో వైద్యవిద్యను అభ్యసించడంలో మొదటి మూడు నాలుగు నెలలు తప్పితే ఆ తరువాత ప్రత్యేకమైన ఇబ్బందులేమీ పడలేదు.

1978 లో అట్లూరి పురుషోత్తం గారు రాసిన 'మాతృభాషలోనే ప్రాథమిక విద్య ఎందుకు '- అనే శీర్షిక క్రింద విశాలాంధ్ర ఆదివారపు సంచికలో వచ్చిన వ్యాసాల పరంపరను చదివాను. ఈ వ్యాసాలన్నింటినీ కలిపి ఆ తరువాత “మాతృభాషలో ప్రాథమిక విద్య" అనే పేరుతో పుస్తకంగా ప్రచురించారు. పిల్లలు తమకు తెలిసిన భాషలో('మాత్చభాష ' లేదా 'సొంత భాష ') తెలియని విషయాలైన సైన్స్‌, సోషల్‌, లెక్కలను తెలుసుకోవడం తేలిక గానీ, తెలియని ఇంగ్లీషులో తెలియని సైన్స్‌, సోషల్‌, లెక్కలను ఎలా తెలుసుకుంటారు? అనేది పురుషోత్తం గారి ప్రశ్న ఇంగ్లీష్‌ మీడియం విద్య వలన బట్టీపట్టి అప్పచెప్పడ, రాయడం అలవాటవుతుంది. పోషణ లేని పసిబిడ్డ వలె ప్రశ్న చచ్చిపోతుంది. దాంతో ప్రతిభ కుంటుతూ ఉంటుంది. ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో చదివే తెలుగు పిల్లలు, అంతే వనతులుండి సమర్ధవంతంగా నిర్వహింవబడే తెలుగు మీడియం పాఠశాలల విద్యార్థుల కంటే మేధాశక్తి లోనూ, విజ్ఞానం లోనూ వెనుకబడే ఉంటారు. సృజనాత్మకత తగ్గిపోయి మన సమాజానికి చాలా నష్టం జరుగుతుందని ఆ పుస్తకం ద్వారా నిరూపించారు. ఇంగ్లీష్‌ మీడియంలో చదివి ఉన్నత స్థితిలో ఉన్న వారిని ఉదాహరణగా చూపించి అందరూ అలానే చదవాలనే మొండి వాదన కొంతమంది చేస్తుంటారు. విద్య, వైజ్ఞానికపరమైన ఆసక్తి గ్రహణ శక్తి (Academic interest) గల మేధావులైన పిల్లలు కొద్ది శాతమే ఉంటారు. వీరు బలమైన గిత్తల్లాంటివారు. ఏటికెదురీద గలవారు. చక్రాలు లేని బండిని కూడా బలమైన గిత్తలు ఎలా లాగ గలవో అలానే వీరు ఏ మీడియంలో బోధించినా తమ ప్రతిభను చూపగలరు. ఆంగ్ల మాధ్యమంతో ఇబ్బంది పడని ఈ కొద్ది మంది. ఐదారు శాతం పిల్లల కోసం మిగిలిన పిల్లలందరినీ హింసించడం సరికాదు.

మాతృభాష ద్వారా విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకుంటారు. పరభాషా మాధ్యమ పాఠశాలల్లో విషయం ద్వారా పరభాషను నేర్చుకుంటారు. ఇంగ్లీష్‌ మీడియం ద్వారా పిల్లలకు ఎంత హాని జరుగుతుందో లోతుగా ఆలోచిస్తే మాత్రమే బోధపడుతుంది. సామాన్యంగా ప్రతి వ్యక్తి తము మాతృభాష లోనే ఆలోచిస్తాడు. ఇంగ్లీష్‌ మీడియం ద్వారా విద్య గరపినప్పుడు ఇంగ్లీష్‌ లో బోధించిన దానిని విద్యార్థి ముందుగా మనసులో తెలుగులోకి తర్జూమా చేసుకుని ఆలోచిస్తాడు. తరువాత ఆలోచించిన దానికి తిరిగి ఇంగ్లీష్‌ లోనికి తర్జూమా చేసుకుని సమాధానం చెప్తాడు. ఈ క్రమంలో ఎంతో శ్రమ, కాలం వృధా కావటంతో పాటు విజ్ఞాన సముపార్దన కూడా కుంటు పడుతుంది. ఆంగ్ల మాధ్యమం బడులలో చదివే విద్యార్థులకు వారికి తెలియకుండానే మాతృభాష మీద, మాతృదేశం మీద న్యూనత కలుగుతుంది. అమెరికా, ఇంగ్లాండ్‌ వంటివి మాత్రమే గొప్పవని, ఇంగ్లీష్‌ భాషే గొప్పదని మన భాష, మన దేశం ఎందుకూ పనికిరావనే చిన్న చూపు ఏర్పడుతుంది. మన భాష, మన దేశం మీద అభిమానం లేని బానిస మనస్తత్త్వం దేశాభ్యుదయానికి, స్వాతంత్య్రానికి పెద్ద ఆటంకంగా తయారవుతుంది.

నా అనుభవం:

ఆడుతూ పాడుతూ కొత్త విషయాలను నేర్చుకోవలసిన బాల్యాన్ని బట్టీయం చదువులతో హింసించి నాశనం చేయడం బాధగా ఉండేది. అప్పటినుండి తెలుగు పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని ప్రచారం చేస్తూ వచ్చాను.

1978 నుండీ ఈ రోజు వరకు ప్రతిరోజూ కనీసం ఒక్కరితో నన్నా ఈ విషయం మాట్లాడడం నియమంగా పెట్టుకుని పాటిస్తున్నాను. చల్లపల్లి లోని ప్రతి స్కూలుకూ ఇంగ్లీష్ , తెలుగు రెండు మాధ్యమాలూ ఉండేవి. మా ఊర్లోనే కాకుండా చాలాచోట్ల ఉన్న స్మూలు యాజమాన్యాలను “పిల్లలు ఏ మీడియంలో బాగా చదువుతున్నారు” అని తరచుగా అడుగుతుండేవాణ్ణి. “తెలుగు మీడియం పిల్లలకే సబ్జెక్టు లపై అవగాహన పట్టు బాగా ఉంటుంది కానీఎక్కువమంది తల్లితండ్రులు ఇంగ్లీష్‌ మీడియమే కోరుకుంటు న్నారు కాబట్టి మేము ఇంగ్లీష్‌ మీడియం కూడా నడుపుతున్నాము” అని చెబుతుండేవారు. “మరి ఇంగ్లీష్‌ మీడియం పిల్లలకు వారికి అర్ధమయ్యేటట్లు ఎలా నేర్పుతున్నారు?” అని అడిగితే - పాఠాన్ని తెలుగులోనే చెప్పి, ఇంగ్లీష్‌ లో నోట్స్‌ చెబుతాము అని చెప్పేవారు. ఏ మీడియంలో చేరడం అనేది తల్లితంద్రుల ఎంపిక తప్పితే పిల్లల ఎంపిక కాదు. కానీ పల్లెటూరు పిల్లలు తల్లితండ్రుల మెప్పు కోసం, టీచర్ల మెప్పు కోసం ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతూ ఎంతో కష్టపడి బట్టీబట్టి పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవలసి రావడం చాలా బాధాకరమైన విషయం.

అందుకే తల్లితండ్రులకు అవగాహన కల్పించడానికి 1990 లో అట్లూరి పురుషోత్తం గారితోనూ, 2001 లో విఠపు బాల సుబ్రహ్మణ్యం గారితోనూ బహిరంగ సమావేశాలను నిర్వహించాం.

బాల సుబ్రహ్మణ్యం గారి సభ తరువాత కొంతమంది తల్లితండ్రులు తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియం నుండి తెలుగు మీడియంలోనికి మార్చారు కూడా. కానీ ఆ తరువాత వచ్చిన ఐ.టి.బూమ్‌, తద్ద్వారా వచ్చే కొద్దిపాటి అమెరికా ఉద్యోగాలు తల్లితండ్రులు, తమ విల్లలను ఇంగ్లీష్‌ మీడియంలో మాత్రమే చదివించే పరిస్థితికి బలంగా నెట్టాయి. అమెరికాలో ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్‌ బాగా రావాలని, ఇంగ్లీష్‌ బాగా రావాలంటే ఇంగ్లీష్‌ మీడియంలోనే చదవాలని తల్లితండ్రుల అపోహ! మీడియం ద్వారా కొత్త భాషను నేర్పించడం అనే ప్రక్రియ ప్రపంచంలో ఎక్కడా లేదని, భాషను భాష గానే నేర్పించాలని ఇంగ్లీష్‌ భాషను 3 వ తరగతిలో ప్రవేశపెట్టి పరభాష నేర్పే పద్దతిలో నేర్పిస్తే 10 వ తరగతి సమయానికి మంచి ఇంగ్లీష్‌ నేర్పించవచ్చని చెబుతుండేవాళ్ళం. నేను, దా. పద్మావతి, వేంకటేశ్వరరావు, రామారావు, నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, వాసుదేవరావు మాస్టార్లు మరి కొంత మందితో కలిసి ప్రతి పల్లెలో తల్లితండ్రులతో సమావేశాలు నిర్వహించాం. అమెరికాలో ఉద్యోగాలు అతి తక్కువని ఆ ఉద్యోగాల కోసం వెళ్ళే వారి కోసం ఇంగ్లీష్‌ నేర్పడం పెద్ద కష్టమైన పని కాదని చెప్పుండేవాళ్ళం.

మా పిల్లలు 10 వ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదివారు. మా అబ్బాయికి ఎంసెట్‌ లో తొలిసారే 2001లో ౩వ ర్యాంకుతో MBBS సీటు వచ్చినప్పుడు కొంతమంది ప్రత్యేకంగా నన్ను కలసి “మీరు నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించి చూపించారు, మీ అభిప్రాయం సరైనదేనని బుజువైంది " అని చెప్పారు. కానీ మా అబ్బాయికి సీటు రాకపోయినా నా అభిప్రాయం సరైనదే. మా ఆమ్మాయి కూడా సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ గా దుబాయి లో పనిచేస్తోంది.

ఆమె తన వృత్తిలో పూర్తిగా ఆంగ్ల భాషలోనే వ్యవహరించాలి వస్తుంది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడడానికి, తోటివారితో వ్యవహరించడానికి, రాత పూర్వకమైన వృత్తి పనులకు ఎప్పుడూ తను తెలుగు మీడియంలో చదవడం వలన ఇబ్బంది పడలేదు. ఇప్పుడు మా మనవళ్లు కూడా తెలుగు మీడియంలోనే చదువుతున్నారు.

మిత్రుల అనుభవాలు :

మా మిత్రులలో చాలామంది తమ పిల్లలను తెలుగు మీడియం లోనే చదివించారు. నా మిత్రుడు డాక్టర్‌ సాంబిరెడ్డి తెనాలిలో వాళ్ల పిల్లలను చేర్పించడానికి ఒక తెలుగు మీడియం స్ఫూల్‌కి వెళితే “ఈ స్కూల్‌ మీలాంటి పెద్ద వాళ్ల కోసం కాదు. మాది కేవలం తెలుగు మీడియం స్మూలు” అని ఆ హెడ్‌ మాష్టారు చెప్పారు. “నేను కావాలనే తెలుగు మీడియం స్కూల్‌ లో చేర్చించడం కోసం వచ్చాను” అని వాళ్ళను ఒప్పించి ఆ స్కూల్‌ లోనే చేర్చారు. ఆ పిల్లలిద్దరకు జీవితంలో స్థిర పడటానికి తెలుగు మీడియం వలన ఎప్పుడూ ఇబ్బంది కలగలేదు సరికదా వాళ్ళు తమ బాల్యాన్ని ఆనందిస్తూ చదువుకున్నారు. ఇంగ్లీషులో మాట్లాడగలగడం, వ్యవహరించగలగడంలో వారికి ఏ సమస్య లేదు. ఆ పిల్లలిద్దరూ ఇప్పుడు చక్కగా వారి వృత్తులలో స్థిరపడ్డారు.

చల్లపల్లిలోని నాగేశ్వరరావు మాష్టారి పిల్లలిద్దరూ 10 వ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదువుకుని మొదటిసారే MBBS సీటు తెచ్చుకుని ఇప్పుడు ఒకరు కార్జియాలజిస్ట్‌గానూ,

| ఇంకొకరు ఎండోకైనాలజిస్ట్‌ గానూ పనిచేస్తున్నారు. కోటేశ్వరరావు మాష్టారి పిల్లలిద్దరూ కూడా 10 వ తరగతి వరకు తెలుగు మీడియం లోనే చదువుకుని సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. వేంకటేశ్వరరావు మాష్టారి కుమారుడు కూడా ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. తమ పిలల్లను తెలుగు మీడియంలో చదివించిన మా మిత్రులు, వారి పిల్లలు ఉన్నత స్థితికి చేరి, సంతోషంగానే ఉన్నారు. ఇంగ్లీష్‌ భాషలో సాధికారత సంపాదించుకోవడంలో వారికి తెలుగు మీడియం ఏమీ అడ్డంరాలేదు. పైగా ఉపాధికోసం కావలసిన సబ్జెక్టు అలో అవగాహన మెరుగ్గా ఉండడం వారికి మరింత ఉపయోగపడింది.

ప్రఖ్యాత ఆంగ్ల రచయిత - లంకా శివరామప్రసాదు నేటి ప్రఖ్యాత ఆంగ్ల రచయిత అయిన లంకా శివరామప్రసాదు వైద్యవిద్యలో నా సహచరుడు. అనేక ఇంగ్లీష్‌ క్లాసిక్‌ పుస్తకాలను తెలుగులోనికి అనువదించాడు. భగవద్గీత ను పద్యాలుగా ఇంగ్లీష్‌లో రాయడమే కాకుండా అనేక తెలుగు పుస్తకాలను ఇంగ్లీష్‌ లోకి అనువదించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇంత గొప్ప అంగ్ల కవి హైస్కూల్‌ విద్య వరకు తెలుగు మీడియంలోనే చదివాడు.

మరికొన్ని అనుభవాలు :

కొద్ది సంవత్సరాల క్రితం డా. రజనీకాంత్‌ అరోలీ అనే “రామన్‌ మెగసెసే” అవార్డు గ్రహీత (మహార్యాష్టలోనీ లాతూర్‌ ప్రాంతంలోని 300 గ్రామాల ప్రజలలో కల్గించిన ఆరోగ్య అవగాహనకై యీాయనకా బహుమతి వచ్చింది) పాల్టొన్నారు. ఆయనతో బాటు అదే సంస్థలో "కృత్రిమ అవయవాల తయారీ " విభాగంలో పనిచేసే ఒక వ్యక్తి కూడ వస్తే నేనాతనని కలిశాను. ఆయన తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందినవాడు. తెలుగు మీడియంలో నాలుగో తరగతి చదువుతూ, ఇంటి నుండి పారిపోయి, బొంబాయి చేరి, కొన్నాళ్ళ తరువాత డాక్టరు అరోలి దగ్గర పనికి చేరాడు. తక్కువ ఖర్చుతో కృత్రిమ అవయవాలు తయారు చేయాలనుకున్న ఆ సంస్థ అతణ్జి జైపూర్‌ పంపి శిక్షణ ఇప్పించింది. ఈయన కెన్యా, టాంజానియా వంటి విదేశాలలో కృత్రిమ అవయవాల తయారీ పాఠాలు బోధించేవారు.

“మీరు వాళ్ళకి పాఠాలు ఏ భాషలో బోధిస్తున్నారు?” అని ప్రశ్నించాను.

“ఇంగ్లీష్‌ లో” అని ఆయన సమాధానం.

“మీరు చదివిందేమో 4 వ తరగతి. అదీ ఒక మారుమూల పల్లెలో, తెలుగు మీడియం స్కూల్లో గదా! విదేశాల వారి కర్దమయ్యేలా ఆంగ్లంలో ఉవన్వాసాలెలా ఇవ్వగలుగుతున్నారు? ఇంగ్లీష్‌ను ప్రత్యేకంగా ఎన్నేళ్లు కష్టపడి నేర్చుకున్నారు?” అని మళ్ళీ అడిగాను.

“లేదు - నేను ప్రత్వేకంగా ఆ భాషను నేర్చుకోనేలేదు. మా సంస్థను చూడటానికి, శిక్షణ పొందటానికీ చాల మంది విదేశీయులు జొంబాయి వస్తుంటారు. వారి ఆంగ్ల సంభాషణలు వింటూ, తోటివారితో ఆంగ్లంలో సంభాషిస్తూ క్రమక్రమంగా ఆంగ్లం మాట్లాడటం

నేర్చుకొన్నాను. విదేశీయులిక్కడికి వచ్చినా, నేను విదేశాలకు పోయినా ఆ భాషలోనే మాట్లాడి తీరవలసి అవసరం వచ్చింది కనుక నానాటికీ


నా ఆంగ్లభాషా పరిజ్ఞానం పెరిగింది” అని ఆయన బదులిచ్చారు.

తెలుగు మీడియంలో నాల్గవ తరగతి కూడ పూర్తిగా చదవని ఒక పల్లెటూరి వ్యవసాయ కూలీ కుటుంబంలోని వ్యక్తి దేశ విదేశాలాలోని అపరిచితులకు ఇంగ్లీష్‌లో సాంకేతిక విషయాల మీద ఉపన్యాసా లివ్వడానికి భాషా పరమైన ప్రత్యేక శిక్షణే అవసరం లేకపోయింది! అతని చుట్టూ ఉన్న “ఆంగ్ల భాషావాతావరణము, నేర్చుకోవలసిన అవసరమే” అతనికాభాషను నేర్చింది!

ప్రేమాయణం -ఆంగ్ల పారాయణం :

కొన్నాళ్ళ క్రిందట నాదగ్గరకు వైద్యం కోసం వచ్చిన ఒక గృహిణి చక్కటి ఇంగ్లీష్‌ మాట్లాడటం గమనించాను.

“మీకింత మంచి ఇంగ్లీష్‌ ఎలా అబ్బింది? ఏం చదువు కున్నారు? ఏ మీడియంలో చదివారు? * అని అడిగాను.

“డిగ్రీ వరకు నేను తెలుగు మీడియంలోనే చదివాను” అన్నది.

“అయితే ఇంత మంచి ఆంగ్లం ఎలా మాట్లాడగలుగు తున్నారు?”

ఈ ప్రశ్నకామె కొంచెం సిగ్గుపడుతూ ఇలా చెప్పింది. “డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్నప్పుడు నేనొక తమిళ యువకుణ్ణి ప్రేమించాను. ఆయనకు ఇంగ్లీష్‌ బాగా వచ్చు గాని, తెలుగురాదు. నాకు తమిళం బొత్తిగా తెలియదు. ఏదో కొద్దిగా ఇంగ్లీష్‌ వచ్చు. మరి నా భావాలతనికి ఇంగ్లీష్‌ లోనే వ్యక్తీకరించవలసిన అవసరమేర్పడింది. తప్పని పరిస్థితి కనుక వెంటనే ఆంగ్లం నేర్చుకొన్నాను”.

“ఇంత బాగా ఇంగ్లీష్‌ మాట్లాడటం నేర్చుకొనడానికి ఎంత కాలం పట్టింది?” అని మళ్ళీ అడిగాను.

“మూడు నెలలు” అని ఆమె సమాధానం. అంతేగాదు, మరో మూడు నెలలు తిరగకముందే తనకి తమిళం కూడా వచ్చిందని ఉత్సాహంగా చెప్పింది.

చల్లపల్లిలో ఒక సాధారణ ఆర్థికస్థాయిగల కుటుంబం నుండి వచ్చిన డా. నళినీ కుమార్‌, అమెరికాలోని “యేల్‌” యూనివర్శిటీలో సైంటిస్ట్‌ గా ఎదగడానికి కారణం - అతనికి జీవశాస్త్రం పట్ల ఉన్న అనురక్తి. ఇంటర్‌ వరకు తెలుగులోనే చదివిన ఆయన స్వీడన్‌ లో పరిశోధన చేయాల్సి వచ్చినవ్వుడు అతి తక్కువ కాలంలోనే ఆంగ్లభాషలో ప్రావీణ్యం సంపాదించారు. ఏ కొత్త భాషనైనా అవసరం అయితే నేర్చుకోవడానికి 3 నుండి 6 నెలలు చాలు అని భాషా శాస్త్రవేత్తలు చెప్తున్నారు గదా!

10 భాషలలో మాట్లాడగలిగిన తెలుగు మాధ్యమ విద్యార్ధి మాతంగి కోటేశ్వరరావు చల్లపల్లి మండలం, బొబ్బర్లంక దళితవాడకు చెందినవాడు. ఈయన 10 భాషలలో అనర్గళంగా సంభాషించ గలడు. అతడు స్టానిక జిల్లా పరిషత్‌ పాఠశాలలో తెలుగు మాధ్యమం లోనే 9 వరకే చదువుకున్నాడు. అతను మంచి ఎలక్రీషియన్‌. అతన్ని ఉద్యోగంలో పెట్టుకున్న కాంట్రాక్టరు ఏ ప్రదేశానికి వెళ్ళమంటే ఆ ప్రదేశానికి వెళ్ళేవాడు.

ఇంగ్లీషు కంటే ముందు అతనికి తన మాతృభాష తెలుగు కాక తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాలి, నైజీరియాలోని రెండు భాషలు వచ్చు. మేం అతన్ని ఇంటర్వ్యూ చేసే సమయానికి టాంజానియా వెళ్ళడానికి సిద్ధమౌతున్నాడు. అక్కడ భాష మీరు నేర్చుకొనే వెళ్తున్నారా అని అడిగితే, నవ్వి “అక్కడ ఏ భాషో నాకు తెలియదు, ఎక్కడకు వెళ్ళినా 8 నెలల్లో ఆ ప్రాంతపు భాష నేర్చుకోగలను” అని థైర్యంగా చెప్పాడు. అతడు తన జీవితాన్ని గెలుచుకోవడానికి అతనికి ఉన్న ఎలక్ట్రికల్‌ నైపుణ్యం ఉపయోగపడిందే కాని ఇంగ్లీషు కాదు.

తమిళనాడు కార్ల డ్రైవర్ల హిందీ నైపుణ్యం :

తమిళనాడులోనీ పర్యాటక ప్రదేశాలలో కిరాయి కార్ల డ్రైవర్లు హిందీలో చక్కగా మాట్లాడటం గమనించాను.

తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగి హిందీని భాషగా స్మూళ్ళలో నుండి తరిమేసి చాలా కాలం అయ్యింది.

అయినా వారికి ఎలా అ భాష వచ్చింది అని అడిగితే “ఉత్తర భారతదేశ యాత్రికులతో సంభాషించాలి కదా అందుకని మాకు హిందీ వచ్చేస్తుంది” అని వారి సమాధానం. అవసరమే వారికి కొత్త భాషను నేర్పింది.

గడ్డం అనిత, గడ్గం జాషువా సునీల్‌ :

అమెరికా అధ్యక్షుడు హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఆయనతో ఎంతో చక్కగా సంభాషించిన “గడ్డం అనిత” అవనిగడ్డ మండలంలో ఒక కుగ్రామంలో పుట్టి హైస్కూల్‌ స్థాయి వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నది.

ఐ.ఐ.టి. కాన్పూర్‌ లొ అద్భుతంగా రాణించిన “గడ్డం జాషువా సునీలొ” హైస్కూల్‌ చదువంతా తెలుగు మీడియంలోనే సాగింది. ఇటువంటి ఉదాహరణలు మనం వందలు - వేలు చెప్పుకోవచ్చు. పై యదార్ధ సంఘటనల వల్ల మన కర్ణమయ్యేదేమంటే? బలమైన అవసరం ఏర్పడితే, పట్టుదల, శ్రద్ద ఉంటే, ఎవరైనా, ఏ భాషనైనా మూడు నుండి ఆరు నెలల కాలంలో సునాయాసంగా నేర్చుకోగలరనే కదా! భాషను భాషగా నేర్చుకోవడమే సులభమని కూడ పై ఉదాహరణల వల్ల మనం గ్రహించవచ్చు.

మా ప్రచారంలో ఈ ఉదాహరణలన్నీ చెప్తూ తల్లిదండ్రులకు తమ పిల్లలను తెలుగు మీడియంలోనే చదివించమని ప్రచారం చేస్తూండే వాళ్ళం. “ఇంగ్లీష్‌ భాషకు మేము వ్యతిరేకం కాదు” అని కూడా స్పష్టం చేస్తుండేవాళ్లం.

మానసిక వైద్య నిపుణులైన డా. పమిడి శ్రీనివాస్‌ తేజ రాసిన “మాతృ భాష - ప్రాథమిక విద్య” పుస్తకంలో పిల్లలు ప్రాథమిక విద్యను తమ 'సొంత భాష” లోనే ఎందుకు చదువుకోవాలో శాస్త్రీయంగా నిరూపించారు. పిల్లలలో మెదడు, మానసిక ఎదుగుదల, భాషలను నేర్చుకునే విధానం మొదలుకొని ఎన్నో విషయాలను ఎంతో వివరంగా చర్చించారు. ప్రపంచంలో జరిగిన అనేక అధ్యయనాలను వాటి ఫలితాలను ఆ పుస్తకం లో వివరించారు.

చుక్కా రామయ్య గారు కొన్ని సంవత్సరాల పాటు దినపత్రికలలో విద్య పైన వ్యాసాలు రాస్తుండేవారు. వారు 'ఇంటి భాష సిద్దాంతాన్ని ప్రచారం చేశారు. ప్రాథమిక విద్యను ఇంటి భాషలోనూ, ఉన్నత పాఠశాల విద్యను ప్రామాణిక తెలుగు భాషలోనూ బోధించాలని వారి వాదన. మాతృభాషలోనే పాఠశాల విద్యను బోధించాలని బలంగా వాదించే రామయ్య గారు కె.సి.ఆర్‌. గారు తాము గెలిస్తే తెలంగాణాలో కె.జి నుండి పి.జి. దాక ఇంగ్లీష్‌ మాధ్యమంలోనే బోధిస్తామని ప్రకటించినప్పుడు మాత్రం ఆ వాదనను ఖండించలేదు. రామయ్య గారూ! మీరు ఇలా మౌనంగా ఎందుకు ఉంటున్నారు? రాబోయే ప్రమాదాన్ని ఆపదానికి మీలాంటి వారు మాట్లాడకుంటే ఎలా? అని వారి వ్యాసాలు ప్రచురించే దినపత్రిక అన్నింటికీ ఉత్తరాలు రాశాను. కానీ ఏ పత్రికలోనూ ఈ ఉత్తరం ప్రచురించబడలేదు.

ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యగారు ఆంగ్లంలో దిట్ట. ఆయన ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకోలేదు. ఆసక్తితో ఇంగ్లీష్‌ ను అధ్యయనం చేసి అనేక పత్రికలలో వ్యాసాలు రాస్తున్నారు. ఇంగ్లీష్‌ లో అనేక పుస్తకాలు రాశారు. కానీ ఇప్పుడు మాత్రం అందరూ ఇంగ్లీష్‌ మీడియంలోనే చదువుకోవాలని ఆయన తన వ్యాసాలలో రాస్తున్నారు. ముఖ్యంగా బహుజనులందరూ ఉన్నత స్థితికి చేరాలంటే ఇంగ్లీష్‌ మీడియంలోనే చదువుకోవాలని గట్టిగా ప్రచారం చేస్తున్నారు.

ఐలయ్యగారి లాంటి మరికొంతమంది మేధావుల ప్రచారం వలన ఇంగ్లీషు మాత్రమే తమను ఉన్నత స్టితికి చేర్చే భాష అనే అఖిప్రాయం శ్రామిక వర్గంలో బలపడింది. ఇంగ్రీషు భాషను నేర్చుకోవడానికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు. కానీ “మీడియం ద్వారా ఇంగ్లీషు నేర్చుకోవడం అశాస్త్రీయం”? అనే విషయం మరుగున పడిపోయింది.

70 వ దశకం నుండి ఉన్నత, మధ్య తరగతి వర్షాల ప్రజలు తమ పిల్లలను ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చదివించుకోవడం మొదలయింది. ఇంగ్లీషు పై ఉన్న వ్యామోహం, భాషను భాషగా నేర్చుకోవడానికీ - మీడియం ద్వారా భాష నేర్చుకోవడానికీ మధ్య ఉన్న వ్యత్యాసం తెలియకపోవడం, ప్రభుత్వ పాఠశాలల్లో దిగజారుతున్న ప్రమాణాలు - ఇవన్నీ ప్రైవేటు ఇంగ్లీషు మీడియం పాఠశాలల దినదినాఖివృద్ధికి తోడ్పడ్డాయి.

ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను పెంచడానికి ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ నిజాయితీ గా ప్రయత్నించలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్ళలో చదివించడం మొదలుపెట్టారు.

“జడి బాట " పేరుతో ప్రభుత్వ టీచర్లు వేసవి సెలవుల్లో ఇంటింటికి వెళ్ళి తల్లితండ్రులను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా ప్రచారం చేసేవారు. అతి తక్కువ మంది టీచర్లు మాత్రమే తమ పిల్లలను తాము పనిచేసే స్కూళ్లల్లో చదివిస్తున్నారు. మరి టీచర్ల పిల్లలు ప్రైవేట్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్ళలో చదువుతుంటే వీరి మాటలకు విలువేంఉంటుంది? చివరకు నాణ్యమైన విద్య అంటే ఇంగ్లీషు మీడియం విద్యే అనే అభిప్రాయం ప్రజలలోకి వచ్చింది. ప్రభుత్వాలు కూడా అవే మాటలు మాట్లాడుతున్నాయి. ఇక సినిమాల సంగతికొస్తే - తెలుగు మీడియంలో చదువుకున్న పాత్రలు ఆత్మన్యూనతతో ఉన్నట్లు, వాళ్లను హేళన చేస్తున్నట్లు చూపించడం జరుగుతోంది.

APTF మినహా మిగిలిన ఉపాధ్యాయ సంఘాలేవీ “మాతృభాష లోనే ప్రాథమిక విద్య” జరగాలనే ప్రచారం గట్టిగా చేయలేదు.

జనసాహితి సాంస్కృతిక సంస్థ పట్టుదలగా ఈ విషయం పై కృషి చేస్తోంది. పాలక రాజకీయ పార్టీలేవీ ఏనాడూ విద్యా వ్యవస్థ పై సరైన దృష్టి పెట్టనేలేదు. కమ్యూనిస్ట్‌ పార్టీలన్నీ సైద్ధాంతికంగా మాతృభాషలో విద్యను నమ్మినా CPIML (జనశక్తి) పార్టీ తప్పితే మిగిలిన ఏ వామపక్ష పార్టీ కూడ పూర్తి స్థాయిలో ఈ సమస్యను తీవ్రంగా పరిగణించలేదు. ఈరోజు కమ్యూనిస్ట్‌ పార్టీల కార్యకర్తలు, అనేక మంది వామపక్ష అభిమానులు కూడా ఈ విషయం పై భిన్నాభిప్రాయాన్ని కలిగి ఉండటం విషాదం. కమ్యూనిస్ట్‌ పార్టీలు బలంగా ఉన్న విజయవాడలోనైనా, వారిలో ఎంతమంది తమ పిల్లలను తెలుగు మీడియంలో చదివించారు? మరి ఇవన్నీ మిగతా సమాజంపై ప్రభావం చూపవా?

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కూదా తెలుగు మీడియమే శాస్త్రీయం కానీ తెలుగు మీడియంలో చదివినవారు ఇంగ్లీష్‌ లో సాధికారికంగా మాట్లాడలేక పోతున్నారు” అంటూ ఇటీవల తాను విడుదల చేసిన ఒక వీడియోలో ఇంగ్లీష్‌ మీడియంను సమర్ధించారు. తాను ఆదిలాబాద్‌ జిల్లాలో తెలుగు మీడియంలో చదువుకున్నానని అయినా ఆంగ్లంలో చక్కగా సంభాషించడమే కాక అనేక ఆంగ్ల పత్రికలలో వ్యాసాలు రాస్తుంటానని, ఇంగ్లీష్‌ టి.వి. ఛానల్స్‌ లో మాట్లాడుతుంటానని ఆ వీడియాలోనే చెప్పారు. తెలుగు మీడియంలో చదివినవారు ఆసక్తి పట్టుదల ఉంటే ఇంగ్లీష్‌ భాషలో దిట్ట కాగలరనదానికి ఆయనే ఒక ఉదాహరణ. కానీ అభ్యుదయ వాది, శ్రామిక వర్గ పక్షపాతి అయిన నాగేశ్వర్‌ గారు కూడా అసమంజసమైన వాదనను తీసుకురావడం దురదృష్టం. 'తిలాపావం తలో పిడికెడు ' అన్నట్లుగా తమ సొంత భాషలో తెలుగు పిల్లలు చదువుకోలేని దుస్థితికి ఎంతోమంది తలొక చెయ్యి వేశారు.

తెలుగు మీడియంలో తమ బిడ్దలను చదివించుకోవాలను కొన్న తల్లిదండ్రులకు చాలా కాలం నుండి ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. పట్టణాలలో మున్సిపల్‌ స్మూళ్లలో మినహా తెలుగు మీడియం లో చదివించుకొనే అవకాశం లేదు. కొద్దిగా ఆర్ధిక స్తోమత కలిగిన వారెవ్వరూ ఈ స్నూళ్లలో చదివించడానికి

పల్లెటూళ్లలో రెండు భాషా మాధ్యమాలలో పాఠశాలలు ఉండేవి. కార్పొరేట్‌ స్కూళ్లు పల్లెటూళ్లలోకి పాకిన ప్రస్తుత కాలంలో తెలుగు మీడియం బడులన్నీ కూడ దాదాపు అంతరించిపోయినాయి. మా ఊరిలో ఒకే ఒక ప్రైవేటు స్కూల్లో తెలుగు మీడియం ఇంకా మిగిలి ఉంది.

తెలుగు మీడియంను ఎవరు బలపరుస్తున్నారు?

ఆడుతూ పాడుతూ పిల్లలు విజ్ఞానాన్ని నేర్చుకోవాలని, శిక్షణ శిక్షగా ఉండకూడదని, పిల్లల సృజనాత్మకతను పెంచే విధంగా నాణ్యమైన విద్యను తెలుగు పిల్లలకు అందించాలని భావించే - బాల్యాన్ని ప్రేమించే వ్యక్తులు, తెలుగుభాష మీద అభిమానం ఉన్న వ్యక్తులు, తెలుగు భాషోద్యమ సమాఖ్యలాంటి సంఘాలు, మన సంస్కృతి నాశనమయిపోతుందని భావించే కాంతమంది గురువులు, బాబాలు! ఈ ఆధ్యాత్మిక గురువులు, బాబాలు మాట్లాడే మాటలు హిందూ మత ప్రచారం వలె ఉండి సాధారణ ప్రజానీకానికి ఇంకా విరక్తి కలుగుతుంది. శాస్త్రీయంగా ప్రచారం చేసే తెలుగు భాషోద్యమ నమాఖ్య లాంటి సంఘాలు, వ్యక్తులు ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చగలిగినంత బలంగా లేవు.

ప్రస్తుత పరిస్థితి :

జనంలో ఉన్న ఈ ఇంగ్లీష్‌ మీడియం కాంక్షను చూసి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వచ్చే సంవత్సరం నుండి దశల వారీగా తెలుగు మీడియంని తీసేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం శాస్త్రీయంగా జరిగే చర్చను ఎవ్వరూ పట్టించుకోకపోగా ఇది కాస్తా భావోద్వేగాల సమస్యగా మారింది. “డబ్బున్న వాళ్ళందరూ ఇంగ్లీష్‌ మీడియంలో తమ పిల్లలను చదివించుకుంటే మేము చదివించుకోవద్దా? మాకు వచ్చిన ఈ అవకాశాన్ని కాలదన్నుతారా?” అని శ్రామిక వర్గం ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలలో ఛాలా కాలం నుండి ఇంగ్లీష్‌ మీడియం ఉంది. ఇప్పుడు కొత్తగా జరిగింది - తెలుగు మీడియంను తీసివేయడం. తమ పిల్లలను తెలుగు మాధ్యమంలో చదివించాలను కొనే తల్లిదండ్రులకు ఈ తెలుగు రాష్ట్రంలో ఇంక అవకాశం లేదు.

ముగింప్తు:

ఇంగ్లీషు మీడియంలో ప్రాథమిక విద్యను బోధించడం వలన సైన్సు, లెక్కలు నేర్చుకోవడంలో తమ పిల్లలు వెనుక బడినట్లు కొన్ని ఆఫ్రికా దేశాలు గ్రహించాయి. అంతే కాకుండా వారి సాంస్కృతిక మూలాలకు కూడా దూరమైనట్లు వారి అధ్యయనంలో తేలింది. ఆ తరువాత మళ్ళీ పిల్లల సొంత భాషలో బోధించడం మొదలుపెట్టిన తరువాత అదే విద్యార్థులలో ఆత్మ విశ్వాసం, దృడ సంకల్పం, సామాజిక నైపుణ్యాలు పెరిగి వారు ఎక్కువ ప్రతిభను కనబరిచారు. ఇది ఐక్యరాజ్య సమితి వారి అధ్యయనం. శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్వితీయ ప్రగతిని సాధించిన అమెరికా, ఇంగ్లాండ్‌, జర్మనీ, ప్రాన్స్‌, స్వీడన్‌, రష్యా కొరియా, చైనా వంటి ఏ దేశంలోనైనా ప్రాథమిక విద్య మొదలుకొని, పరిశోధనా స్థాయి వరకు వారి మాతృభాషలోనే జరగడం నేడు కళ్ళకు కట్టుతున్న వాస్తవం. పరభాషా మాధ్యమంలో జోధన వలన సేవా రంగంలో కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి కానీ కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుకే పోయినట్లు విద్యార్థుల సృజనాత్మకత నశించి “ఉత్పత్తి రంగం” కుంటుపడుతుంది.

మన రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ స్మూళ్ళన్నింటిలో ప్రాథమిక విద్య మాతృభాష లోనే బోధించాలనే నిబంధన చేయాలి.ఉన్నత పాఠశాల విద్యలో రెండు మాధ్యమాలు ఉండాలి. అప్పుడు ఎవరి ఇష్టప్రకారం వారు తమకు కావలసిన మీడియంలో తమ పిల్లలను చేర్చడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్టేనని నమ్మకం కలుగుతుంది.

(వ్యాసరచయిత డా॥ రామకృష్ణప్రసాద్‌ కృష్ణాజిల్లా చల్లపల్లిలలో ప్రముఖ వైద్యులు. జనశ్రేయస్సు లక్ష్యంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల మెప్పు పొందిన వైద్యునిగా, ఆదర్శ జీవనాన్ని గడుపుతున్న డా॥ ప్రసాద్‌, డా॥ పద్మావతి దంపతులు అనేక ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. )