అమ్మనుడి/సంపుటి 5/ఫిబ్రవరి 2020/జోగిని మంజమ్మ ఆత్మకథ - 7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ధారావాహిక

జోగిని మంజమ్మ ఆత్మకథ 7

కన్నడ మూలం

డా. చంద్రప్ప సొబటి

అనువాదం

రంగనాథ రామచంద్రరావు

9059779289

(గత సంచిక తరువాయి...)

గురువు చేసిపెట్టిన వంటకాలు తినేదాన్ని !

ఇలాంటి కష్టాల్లో హగరిబొమ్మనహళ్ళి జోగవ్ములతో ఆరునెలలు కాలం గడిపాను.

బతుకుతెరువు కోసం, కడుపు నింపుకోవడం కోసం 'బిక్షమెత్తే" వృత్తిని వదల్లేదు.

ఆ కాలంలో చెరువుగట్టుకు 'అలసందుల' కోతలకు వెళ్ళడం, మా జోగమ్మలకు పెద్ద లాభదాయకమైన విషయం.

అలసందుల కోతల్లో రైతులు వేసిన రాశుల ముందు మా కొంగు చాపితే మాకు కావలసినన్ని అలసందులు తీసుకున్నా రైతులు ఏమీ అనేవాళ్ళు కాదు. అప్పటికాలంలో అలసందులు పన్నెండు రూపాయలకు కె.జి. వచ్చేవి. రైతుల్లో మా పట్ల అంతటి అభిమానం ఉండేది. నమ్మకమూ ఉండేది. అయితే ఇప్పుడు తగ్గింది.

ఒక రోజు మేము ముగ్గురం జోగమ్మలు అలసందుల కోసం తంటబ్రళ్ళికి వెళ్ళాం. కాళవ్వ జోగమ్మ బృందంవారు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళు నన్ను చూశారు. అప్పుడు నాతో ఉన్న జోగమ్మలకు ఏమైందో తెలియదు. నన్ను వదిలి వెళ్ళిపోయారు. దాంతో నేను ఒంటరినయ్యాను. ఆ రోజు చాలా దుఃఖం కలిగింది. నేను తండ్రి, తల్లి, ఇల్లు వదిలి వచ్చిన రోజున కూడా అంత సంకటపడలేదు. ఆ సంకటంతోనే భిక్షాటన చేశాను. తుంగభద్ర నది ఒద్దున తిరిగాను. ఎక్కడ కూర్చున్నా సమాధానం కాలేదు. అలాగని భిక్షం అడగకుండా. ఊరక ఉండటానికి లేదు. అప్పులు పెరిగాయి. భిక్షం ముగించుకుని ఊరికి వెళదామని సాయంకాలం త్రంబళ్ళి బస్ట్రాండుకు వచ్చాను. అక్కడ కాళవ్వ జోగమ్మ, వారి బృందంలోని వాళ్ళు ఉన్నారు.

నేను చాలా అలసిపోయాను.

నాలో దుఃఖం పొంగుకు వస్తోందని నాకు తెలుస్తోంది.

అయితే బలవంతంగా అదిమి పెట్టాను.

అయితే నా బాధ, నా దుఃఖం నా ముఖంలో కనిపిస్తోందని నాకు తెలుసు.

నేను దుఃఖంలో ఉంటే నా ముఖం ఎలా మారిపోతుందో వాళ్ళకూ తెలుసు. అయినా నన్ను పిలవలేదు. అప్పుడు సోమక్క జోగమ్మ, 'ఆ రోజు ఆ నీ మాటలు విని, మనల్ని నమ్మి చిలకనట్టి వదిలి వచ్చేసింది. మనమే ఇలా చేస్తే ఎక్కడికి పోవాలి? అది తెలుసో, తెలియకో తవ్చు చేసింది. ఇప్పుడు ఒంటరిదైంది. మన వెంట పిల్చుకునిపోదాం” అని అందట. అందుకు కాళవ్వ “లేదు, ఆమెకు దెబ్బ పడాలి. బాధలు అనుభవించాలి. కష్టపడితే జీవితం అంటే ఏమిటో తెలుస్తోంది. అప్పుడు పెద్దవాళ్ళు-చిన్నవాళ్ళు, తల్లి-తండ్రి, గురువు అందరు గుర్తువస్తారు. వాళ్ళ గొప్పదనం తెలిసొస్తుంది అని చెప్పి అందరిని పిల్చుకునిపోయిందట. అయితే ఆ రోజు రాత్రి 'సోమక్కా నువ్వు చెప్పిన మాట నేను వినలేదు. మంజమ్మ ఇల్లు చేరిందో లేదో?” అని కాళవ్వ బాధ పడిందట.

(నేను కాళవ్వ బృందంలో మళ్ళీ చేరిన తరువాత ఈ విషయం సోమక్క నాతో చెప్పింది)

ఇలా జరిగిన మరుసటి రోజు హరపనహళ్ళి సంతకు భిక్షానికి వెళ్ళాను. అక్కడ కాళవ్వ జోగమ్మల బృందం కనిపించింది. నన్ను చూసిన కాళవ్వ రమ్మని పిలిచి నాకు బుద్ధి చెప్పింది. అంతేకాకుండా సోమక్క జోగమ్మను నాకు జత చేసి గొల్లరహళ్ళిలో ఇల్లు తీసుకుని అక్కదే మమ్మల్ని ఉంచింది.

ఆ రోజు ఆమె ఆ ఊళ్ళో ఉంచినందుకే ఈ రోజు నాకు ఇల్లు దొరికింది. ఓటింగ్‌ కార్డు దొరికింది. అన్నిటిని మించి ఆమె నన్ను కళాకారిణిగా తీర్చిదిద్దింది. ఈ రోజు నేను ఏదైనా కళాసేవ చేసివుంటే లేదా కళారంగంలో ఏదైనా అభివృద్ధి సాధించివుంటే అదంతా ఆమె ఆశీర్వాదంతో మాత్రమే. ఆమె ఈ రంగంలో కళాసేవ చేసినందుకే నాకు గొప్పగొప్ప అవకాశాలు దొరికాయి. నిజానికి అవి గురువుకు దొరకాల్సిన అవకాశాలు. ఈ రోజు ఆమె ఉండివుంటే ఆమెకు ఎన్ని పురస్కారాలు దొరికేవో? ఆ యల్లమ్మకే తెలుసు. ఆమెది అద్భుతమైన కంఠ స్వరం. ఎన్ని వేల నాటకాలు వేసిందో ! ఒక్కొక్క ఊళ్ళో రోజుకు కనీసం నాలుగైదు సార్లు నాటకం వేసింది. పల్లెవాళ్ళు ఈ రోజు ఈ వీధిలో నాటకం ఆడిస్తే, మరుసటి రోజు మరో వీధిలో నాటకం వేయించేవాళ్ళు. ఆమె యల్లమ్మ పాత్ర చేసేది. ఆమెతో కనీసం 25 మంది పరశురాముడి పాత్రలు వేశారు.

ఆమె కంఠం ముందు వాయిద్యాలు ఓడిపోయేవి. అంటే ఆమె పాడుతున్నప్పుడు దూరంలోని జనాలకు వాయిద్యాల సద్దు వినిపించేది కాదట. వలకళ్ళి (ఇప్పుడు ఆ ఊరును కొండాపుర అంటారు) గ్రామంలో నాటకం వేస్తే మల్లాపుర గ్రామ ప్రజలకు వినిపించేదట. ఒకటిన్నర కిలోమీటరు దూరానికి కూడా వినిపించే కంఠం ఆమెది. పాటలను అవలీలగా పాడేది. ఇలా కథలు చెప్పి, నాటకాలు వేసి జోగమ్మలకు సమాజంలో ఒక స్టానాన్ని సృష్టించి పోయింది. ఈ నాటకానికి అభిమానులను తెచ్చిపెట్టింది. ఈ రోజు మేము కూర్చుని ఇలా భోజనం చేస్తున్నామంటే ఆమె చేసి పెట్టిన వంట అనుకోవాలి. మా కోసమే ఆమె కట్టిపెట్టిపోయిన బత్తి. దాన్ని మేము తింటున్నాం. నేనూ తింటున్నాను.

అయితే ఆమె కలను సాకారం చేస్తున్నాననే సంతృప్తి నాకు ఉంది.

ఈ విషయాన్ని నేను చెప్పడంకన్నా ఎక్కువగా జనం చెప్పాలి.

ఆమె స్థాపించిన బృందంలో (శమిస్తూ, జోగిని నృత్యాన్ని ప్రదర్శిస్తూ, మంచి కార్యక్రమాలు చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాను.

మాతో నాటకం వేస్తే అపశకునమట !

ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని 'మంగళ ముఖిలని పిలుస్తోంది.

మా దృష్టిలో అది మంచి పేరు.

ఆ పేరు వాడుకలోకి వచ్చిన తరువాత మా జీవితాలు కూడా మంగళకరమవుతూ పోయాయి.

సమాజంలో మమ్మల్ని చూసే దృష్టి కొద్దిస్థాయిలో మారింది.

కళా ప్రదర్శనకు అవకాశాలు పెరిగాయి.

మరియమ్మనహళ్ళి నాటకరంగ కళాకారులు “ప్రభుత్వమే వీళ్ళను (జోగమ్మలను, తృతీయలింగులను) మంగళముఖిలుగా గుర్తించింది. వీళ్ళను చేర్చుకుని మేమేందుకు నాటకం వేయకూడదు” అని మాతో కలిసి, మమ్మల్ని తమ బృందంలో చేర్చుకుని నాటకం వేశారు.

“మోహిని భస్మాసుర అనే నాటకంలో నేను భస్మాసురుడిగా, గౌరమ్మ జోగమ్మ దేవేంద్రుడిగా, రామవ్వ జోగమ్మ బ్రహ్మదేవుడిగా అభినయించాం. శ్రీమతి ఇళకల్లు ఉమారాణి, శ్రీమతి నాగరత్నమ్మ మాతో కలిసి నటించారు. ఇలాంటి మార్పులకు నాగరత్నమ్మే ప్రముఖ కారకురాలు.

ఆ రోజు మా అందరికి చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే గొల్లరహళ్ళిలో ప్రతి సంవత్సరం దేవీ జాతర జరుగుతుంది. ఆ జాతరలో నాటకం వేసే పరంపర కొనసాగుతూ వస్తోంది. ఆ నాటకంలో నాకు నటించాలన్న కోరిక కలిగింది. అందువల్ల ఒకసారి ఊరివాళ్ళను అడిగాను. ఊరివాళ్ళు కూడా అంగీకరించారు. నా దగ్గర నాటకానికి ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పాను. అప్పుడు ఊరిప్రజల్లో 'మంజమ్మ పాత్ర వేస్తుందంటే నేను దబ్బు ఇస్తాను, నేను డబ్బు ఇస్తాను అని నలుగురైదుగురు ముందుకు వచ్చారు. “'మంజమ్మకు కిరీటం పెట్టి పదిచేతులు పెడితే దేవతలా కనిపిస్తుంది. అలాంటి సన్నివేశాన్ని చూసి మనం సంతోషించాలి” అని అన్నారు. అప్పుడు నాకు కలిగిన సంతోషాన్ని వివరించడానికి నాకు మాటలు దొరకటం లేదు.

అ ఉత్సాహంతో డైలాగులను కంఠస్థం చేయడం ఆరంభించాను. ఖిక్షానికి వెళ్ళినా చౌడికెలో నాటకం పుస్తకం పెట్టుకుని వెళ్ళి సమయం దొరికినప్పుడల్లా కంఠోపాఠం చేశాను. సంతలలోనూ తిరుగుతూ డైలాగులను మననం చేసుకుంటున్నాను. అంత ఉత్సాహంతో నేర్చుకున్నాను.

జాతర దగ్గర పడుతుండగా నలుగురైదుగురు గ్రామపెద్దలు నా దగ్గరికి వచ్చిమగజోగమ్మలు మా నాటకంలో నటించకూడదు” అని అన్నారు. “ఎందుకు?” అని అడిగాను.

అప్పుడు, “మగజోగమ్మలతో నాటకం వేస్తే అపళకునం అంట. అంతేకాకుండా పక్మనున్నపల్లెలవాళ్ళు,'ఊళ్ళో మగవాళ్ళు లేరా? మగజోగమ్మల చేత పాత్ర వేయిస్తున్నారుకదా, మీరు మగవాళ్ళు కాదా?” అని అడుగుతున్నారట. అందువల్ల ఊరి కుర్రవాళ్ళు మీ చేత పాత్ర చేయించవద్దంటే వద్దని అంటున్నారు. కాబట్టి నువ్వు నాటకంలో నటించకు” అన్నారు.

ఆ రోజు నాకు చాలా అవమానంగా అనిపించింది. ఉన్న ఊరిలో ఇలాంటి అవమానాన్ని నేను ఎన్నడూ అనుభవించలేదు.


(..తరువాయి 48 వ పుటలో )