Jump to content

అమ్మనుడి/సంపుటి 5/జూన్ 2019/జాతి మనుగడకే సవాలుగా మారిన ప్రభుత్వాల భాషావిధానం

వికీసోర్స్ నుండి

సంపాదక హృదయం


సంపుటి: 5

సంచిక: 4

అమ్మనుడి

జూన్‌ 2019

జాతి మనుగడకే సవాలుగా మారిన ప్రభుత్వాల భాషావిధానం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. తెలుగుదేశం పార్టీని ఓడించి, వైఎస్‌ఆర్‌ సి.పి. అధికారంలోకొచ్చింది. తమ ఎన్నికల వాగ్దాన పత్రాల్లోనే ఈ పార్టీలు రెండూ, ఇకపై బోధనా భాషగా తెలుగు ఉండబోదని, ప్రాధమిక స్థాయినుండీ బోధనాభాషగా ఇంగ్లీష్‌ ఉంటుందని తెలియజేశాయి. చంద్రబాబుగారి ప్రభుత్వం ఈ విషయంలో కొంత దోబూచులాట ధోరణి వహించినా వైఎస్‌ఆర్‌ పార్టీ మాత్రం బోధనా భాషగా ప్రాధమిక స్థాయి నుండీ ఇంగ్లీషే ఉంటుందని స్పష్టమైన ప్రకటన చేసింది. తెలుగును ఒక భాషగా మాత్రం తప్పనిసరి చేస్తామని కూడా స్పష్టం చేసింది. ఈ అంశాన్ని కూడా తమ ఎన్నికల ప్రచారంలో ఒక అంశంగా చేసి వైఎస్‌ఆర్‌ పార్టీ వ్యూహాత్మక ప్రచారం చేసింది కూడా.

భాషోద్యమకారుల పట్టుదల వల్ల 1 నుండి 10వ తరగతి వరకూ తెలుగును ఒక భాషగా /సబ్జెక్టుగా తప్పనిసరి చేస్తూ 2003లో జి.ఒ.నెం:86/2.7. 2003 వచ్చింది. 1నుంచి 5 తరగతుల వరకు మాతృభాషలో విద్యాబొధనను తప్పనిసరి చెయ్యాలన్న డిమాండును త్రోసిపుచ్చి, అందుకు బదులుగా ఒక సబ్జెక్టుగా మాత్రం 10వ తరగతి వరకూ తప్పనిసరి చెయ్యడానికి ఒప్పుకొని ఆ ఉత్తర్వును జారీ చేసింది నాటి తెలుగుదేశం ప్రభుత్వం. వారి హయంలోనూ, తర్వాతి కాలంలో ఇప్పటివరకూ ఆ జి.ఒ. సరిగ్గా ఎన్నడూ అమలు కాలేదన్నది బహిరంగ రహస్యం. జి.ఒ లోనే ఉన్న కొన్ని లోటుపాట్లు కూడా అందుకు తోడ్పడ్డాయి. పాలకుల్లో రాజకీయ సంకల్పం లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. క్రమంగా ప్రభుత్వ విద్యావ్యవస్థ బలహీనపడుతూ, ప్రయివేటు బోధనా సంస్థలు అన్ని స్థాయిల్లోనూ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి, అదంతా ఒక ప్రత్యేక సామ్రాజ్యంగా మారిపోయింది. ఇందుకు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం ఉండడమే కారణమని, వాటిని కూడా ఇంగ్లీషులోకి మార్చడమే దీనికి సరైన పరిష్కారం అనే ప్రచారం సాగింది. ప్రజలపై ఇది తీవ్రంగా ప్రభావం చూపింది. ఇంగ్లీష్‌ మీడియంలో చదివితేనే అది చదువనిపించుకొంటుందనీ, తెలుగు మాధ్యమం వట్టి దండుగ వ్యవవారమనీ తల్లిదండ్రుల్లో అభిప్రాయం బలపడ్డది. మన సమాజంలో వ్రేళ్లూనుకుపోయిన అన్ని రకాల వెనుకబాటుతనానికి ఇంగ్లీషు మాధ్యమంలో బొధనే పరిష్మారమనీ, ఆర్థికంగా ఎదగడానికి ఇదే సరైనదారి అనే నమ్మకం పాదుకుంది.

2003 సంవత్సరం నుండి నేటి వరకూ భాషోద్యమంలో ఇది ప్రధానాంశం అయినా, పరిస్థితి మరింత కఠినం అయిందే తప్ప, ప్రభుత్వాలు మారినా ఈ పరిస్థితిలో మార్చు రాలేదు. 2006లో రాజశేఖరరెడ్దిగారి ప్రభుత్వం 6వ తరగతి నుండి 10 వరకు మునిసిపల్‌ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో చం(ద్రబాబుగారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న విద్యా వ్యాపారవేత్త నారాయణగారు అన్ని పురపాలక పాఠశాలల్లోనూ తెలుగు మాధ్యమాన్ని సమాధి చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్చడుతూనే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుగారు ఇంగ్రీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. 2017 లో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించి, తర్వాత కొద్ది నెలల్లో

తెలుగును ఒక భాషగా బోధించడాన్ని 10వ తరగతి వరకు తప్పనిసరి చేస్తూ, ఒక చట్టాన్ని (10/2008), తర్వాత ఒక సమగ్రమైన జి.ఒ. నెం : 15/1-6-2008 ను విడుదల చేశారు. తెలుగును రక్షించుకోవడానికి ఈ చర్య సరిపోతుందని ఆయన భావించినట్లున్నారు. ఇంటర్మీడియట్లో తెలుగు గురించీ, ఇంకా ఏవో చాలా చాలా చర్యల్ని తెలుగు కోసం చేస్తానని ప్రకటించి, ఆ తర్వాత దాన్నంతా పక్మన పెట్టేశారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్నోహనరెడ్డిగారు బోధనా మాధ్యమం విషయంలో చెయ్యబోయేది దాదాపుగా ఇదేనని మా అంచనా. ఇందువల్ల - పైకొకమాట, అమలులో వేరొక తీరు తొలగిపోయి, పాఠశాల చదువంతా ఇంగ్లీషు మాధ్యమంలోకే పూర్తిగా జారిపోయే విధంగా స్పష్టమైన ఆదేశాలు రానున్నాయని మనం నిస్సందేహంగా అనుకోవచ్చు. తెలుగును ఒక భాషగా మాత్రం 1 నుండి 10 వరకూ బోధించాలనే 2008 నాటి జి.ఒ. బదులుగా మరొక జి.ఒ.ను దానికి బలవర్ధకంగా ఒక చట్టాన్నీ తెచ్చి తమ తెలుగు భాషా పరిరక్షణ విధానం ఇదీ అని స్పష్టంగా కొత్త ముఖ్యమంత్రిగారు ప్రకటించే రోజు దగ్గరలోనే ఉంది.

తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలుగును ఒక సబ్జెక్టుగా బోధిస్తే చాలు అనీ, తెలుగు మీడియంకు కాలం చెల్లిపోయిందనీ భావించే వారెందరో ఉన్నారు. వీరిలో చాలామందికి ఈ అంశంపై మౌలిక అవగాహన లేదనే చెప్పుకోవాలి. దురదృష్టకరమైన సంగతి ఏమిటంటే తెలుగు సాహిత్యాన్ని వృద్ధి చేసుకొంటే తెలుగును కాపాడుకొంటున్నట్లేననీ, అందుకు 10వ తరగతి వరకూ తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేస్తే చాలదా అని ప్రశ్నించే సామాన్యులే కాదు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారు!

ఇప్పటికే పాలనాభాషగా తెలుగు కనుమరుగవుతున్నది. తెలుగును రెండవ స్థాయికి దిగజార్భి, ఇంగ్లీషుకే అన్ని గౌరవాలూ అంటగట్టిన తర్వాత...మున్ముందు పరిపాలనలో కూడా తెలుగు కనిపించదు. “ఏం, ఇంగ్లీషు మీకు వచ్చు కదా, ఇక తెలుగుతో పనేమిటి?” అనే రోజులూ వస్తున్నాయి. ఇంగ్రీషుకు అంతర్జాతీయ భాష అనే ముద్రవేసి దాన్ని అందలానికెక్కిస్తున్న సమాజంలో, తరాలకు తరాలూ సొంత భాషకు దూరమవుతుంటే - ఇక ఇది తెలుగు రాష్ట్రంగా ఎలా పిలువబడుతుంది?

'భాషా ప్రేమ ప్రగతికి అడ్డు రాకూడదు, 'బ్రతుకుకూ భవిష్యత్తుకూ ఉపయోగించని భాషను చదువుకోవడం ఎందుకు? - ఇలాంటి ప్రశ్నలు అలవోకగా ప్రచారమవుతున్నాయి. సొంతభాష బ్రతుకుకూ, భవీతకూ, ప్రగతికి ఏ మాత్రం అడ్డు కాదు అనీ, సొంతభాషతోనే సరియైన క్రాంతి అనీ ప్రజలకు తెలియజెప్పేదెవరు? కంచే చేనును మేసిందన్నట్లు - ప్రభుత్వాల అకర్మణ్యత వల్ల స్వార్ధపూరిత విధానాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.

తెలుగుభాషా ప్రేమికులమని అందరూ చెప్పుకొంటుంటారు. అసలు - సొంతభాషను ప్రేమించడం ఏమిటి?! తెలుగు భాష మనది. అది మన ప్రాణం, దాన్ని కాపాడుకోవాలి. భాష నశిస్తే జాతి నశించదా!? జాతి నశించిన తర్వాత మనం ఎవరమని చెప్పుకొంటాం?

ఇప్పటిదాకా భాషోద్యమాలపేరిట జరిగినదంతా సరే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరమూ మరింత లోతుగా ఆలోచన చెయ్యాలి. ప్రభుత్వాలను ఒప్పించి, తెలుగు మాధ్యమంలో సమాంతర వ్యవస్థను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించేందుకు ఏర్పాటు జరగాలి. అన్ని ఆధునిక అవసరాలకూ వినియోగించే భాషగా తెలుగును పెంపొందించుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లొనూ ఆసక్తిగల వారందరినీ సమావేశపరచి, దీర్ణకాల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి. తెలుగు భాషోద్యమ సమాఖ్యతోపాటు తక్కిన అన్ని సంఘాలూ మేధావులూ కలసి ముందడుగు వెయ్యాలి.--సామల రమేష్ బాబు.


తేదీ : 28-5-2019